*23.09.2021 ప్రాతః కాల సందేశము*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*ఏకాదశస్కంధము - ఏడవ అధ్యాయము*
*అవధూతోపాఖ్యానము - పృథివి మొదలుకొని కపోతముల వరకు గల ఎనిమదిమంది గురువుల కథలు*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*7.49 (నలుబది తొమ్మిదవ శ్లోకము)*
*కాలేన హ్యోఘవేగేన భూతానాం ప్రభవాప్యయౌ|*
*నిత్యావపి న దృశ్యేతే ఆత్మనోఽగ్నేర్యథార్చిషామ్॥12474॥*
అగ్నియొక్క జ్వాలలు అగ్నినుండి ఉద్భవించును. తిరిగి అగ్నిలోనే సమసిపోవును. ఇట్లే కాలము యొక్క తీవ్రమగు ప్రవాహవేగమున నిత్యనిరంతరము ప్రాణులు పుట్టును, నశించును. కాలప్రవాహమున ప్రతిక్షణము ప్రాణులు మృత్యుముఖము నందు ప్రవేశించుచుండుట కన్పించకున్నది.
*అహన్యహని భూతాని, గచ్ఛంతీహ యమాలయమ్| శేషాః స్థిరత్వమిచ్ఛంతి, కిమాశ్చర్యమతః పరమ్॥* ప్రాణులు ప్రతిదినమూ మృత్యుముఖమున ప్రవేశించుచుండును. అనగా మరణము అనివార్యము. ఐనను మిగిలినవారు స్థిరముగా నుండవలెనని కోరుకొనుచుందురు. ఇది ఎంత విడ్డూరము? (ఎంత ఆశ్చర్యకరము?) = మహాభారతము =
*7.50 (ఏబదియవ శ్లోకము)*
*గుణైర్గుణానుపాదత్తే యథాకాలం విముంచతి|*
*న తేషు యుజ్యతే యోగీ గోభిర్గా ఇవ గోపతిః॥12475॥*
సూర్యుడు తన కిరణములద్వారా జలములను గ్రహించును. సమయానుకూలముగా లోకకల్యాణమునకై వర్షించును. గ్రహించుటయందును, వర్షించుటయందును ఆ లోకసాక్షికి ఎటువంటి ఆసక్తి యుండదు. అట్లే యోగి సమయానుసారముగ ఇంద్రియములద్వారా విషయములను గ్రహించును మరియు విడిచి పెట్టును. కాని, అతడు ఆసక్తితో వాటియందు తగుల్కొనడు.
*సక్తాః కర్మణ్యవిద్వాంసో యథా కుర్వంతి భారత| కుర్యాద్విద్వాంస్తథాఽసక్తః చికీర్షుర్లోకసంగ్రహమ్॥*
ఓ భారతా! (అర్జునా!) అజ్ఞానులు కర్మలయందు ఆసక్తులై వాటిని ఆచరించినట్లుగా, విద్వాంసుడు (జ్ఞాని) కూడా లోకహితార్థమై ఆసక్తిరహితుడై కర్మలను ఆచరింపవలెను. = గీత. 3-25.
*7.51 (ఏబది ఒకటవ శ్లోకము)*
*బుధ్యతే స్వే న భేదేన వ్యక్తిస్థ ఇవ తద్గతః|*
*లక్ష్యతే స్థూలమతిభిరాత్మా చావస్థితోఽర్కవత్॥12476॥*
సూర్యుడు ఒక్కడేయైనను వివిధ జలపాత్రలలో వేర్వేరుగా కనబడుచుండును. అట్లే ఆత్మ ఒకటేయైనను స్థూలబద్ధులకు ఉపాధి భేదములను అనుసరించి, ఆత్మలు వేర్వేరుగా తోచుచుండును. ఆత్మయొక్క వాస్తవస్థితి వారికి బోధపడదు. సూర్యునియొక్క దృష్టాంతము ద్వారా ఆత్మయొక్క అఖండత్వము బోధపడును.
*7.52 (ఏబది రెండవ శ్లోకము)*
*నాతిస్నేహః ప్రసంగో వా కర్తవ్యః క్వాపి కేనచిత్|*
*కుర్వన్ విందేత సంతాపం కపోత ఇవ దీనధీః॥12477॥*
ఇక్కడ పావురముయొక్క వృత్తాంతము ఉదాహరింపబడుచున్నది:- యదుమహారాజా! ఎవ్వరియెడలను అతిప్రేమ, ఆసక్తి కలిగియుండరాదు. ప్రేమాసక్తులవలన పురుషుడు (వ్యక్తి) కపోతమువలె దైన్యావస్థకు గుఱియై బాధలకు గుఱికావలసి వచ్చును.
*7.53 (ఏబది మూడవ శ్లోకము)*
*కపోతః కశ్చనారణ్యే కృతనీడో వనస్పతౌ|*
*కపోత్యా భార్యయా సార్ధమువాస కతిచిత్సమాః॥12478॥*
మహారాజా! ఒకానొక అరణ్యములో ఒకపావురము ఒకచెట్టుపై గూడుకట్టుకొని తన భార్యయైన (ఆడు) పావురముతో కొన్ని సంవత్సరములపాటు హాయిగా నివసించుచుండెను.
*7.54 (ఏబది నాలుగవ శ్లోకము)*
*కపోతౌ స్నేహగుణితహృదయౌ గృహధర్మిణౌ|*
*దృష్టిం దృష్ట్యాంగమంగేన బుద్ధిం బుద్ధ్యా బబంధతుః॥12479॥*
ఆ పావురముల జంట శరీరములు వేరుగానున్నను హృదయములు ఒక్కటిగా పరస్పర గాఢానురాగములతో సుఖముగా కాపురము చేయుచుండెను. వాటి మధ్యగల ప్రేమానురాగములు దినదినాభివృద్ధి చెందుచుండెను. వాటిచూపులు, అంగములు, బుద్ధులు ఆత్మీయతతో పెనవైచుకొనియుండెను.
*7.55 (ఏబది ఐదవ శ్లోకము)*
*శయ్యాసనాటనస్థానవార్తాక్రీడాశనాదికమ్|*
*మిథునీభూయ విశ్రబ్ధౌ చేరతుర్వనరాజిషు॥12480॥*
అవి ఆ వనమునందలి వృక్షములపై పరుండుట, కూర్చుండుట, ఇటునటు తిరుగుట, నిలుచుట, సల్లాపములు జరుపుట, క్రీడించుట, భుజించుట మొదలగు కార్యములను కలిసిమెలిసి కొనసాగించుచు నిర్భయముగా జీవించుచుండెను.
*7.56 (ఏబది ఆరవ శ్లోకము)*
*యం యం వాంఛతి సా రాజన్ తర్పయంత్యనుకంపితా|*
*తం తం సమనయత్కామం కృచ్ఛ్రేణాప్యజితేంద్రియః॥12481॥*
యదుమహారాజా! ఆ మగపావురము ఆడుపావురముపై గల అంతులేని ప్రేమతో అది కోరినదానినెల్ల ఎంత శ్రమపడియైనను తెచ్చి పెట్టి దానిని తృప్తిపఱచుచుండెడిది. ఆ పెంటి పావురముగూడ ఆ మగపావురముపై ప్రేమ గలిగి దానికి దాంపత్యసుఖములను గూర్చుచుండెడిది. వాటి అన్యోన్యప్రేమలు అట్టివి.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఏడవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319, 9505813235
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి