9/11 vన్యూయార్క్ లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై దాడి
ఒక అద్భుతమైన కథ...
(11th September 2001 నాడు అమెరికా లో world trade center పైన జరిగిన దాడి వివరాలు అందరికీ తెలుసు.ఆ వివరాలన్నీ TVలలో స్వయంగా చూసేము. కాని ఆ దుర్దినాన అమెరికాకు వస్తున్న విమానాలన్నీఅమెరికా చేరుకోలేక పడ్డ అవస్థలగురించి మనకెవ్వరికీ తెలియదు.అటువంటి విపత్కర సమయంలో దేశ దేశాలనుండి వస్తున్న 53 విమానాలలోని 10500 మంది ప్రయాణీకులను కెనడా ప్రభుత్వమూ అక్కడి చిన్న గ్రామాల ప్రజలూ ఆదుకున్నతీరు మనకి తెలియదు. ఆ ముచ్చటను ఆ రోజు Frankfurt నుండి బయలుదేరి Atlanta చేరుకోవలసిన Delt15 లోని flight attendant చెప్పిన విషయాల్ని ఆవిడ మాటల్లోనే తెలుగులో మీకు అందిస్తున్నాను. చదివి ఆనందిస్తారని ఆశిస్తున్నాను.మంచి ఎక్కడున్నా దానిని ఎక్కువ మందికి తెలియజేయాలన్నదే నా ఆశయం. అందుకే ఆంగ్లంలో మా వాట్సప్ గ్రూపులో వచ్చిన ఈ ముచ్చటను తెలుగులో మిత్రులకు అందిస్తున్నాను)
****
9/11 నాటి తమ అనుభవాల్ని Delta Flight 15 పేరుగల విమానంలో పని చేసేన ఒక ఎయిర్ హోస్టెస్ ఈ విధంగా తెలిపింది:
ఆ రోజు సెప్టెంబరు 11 వ తేదీ మంగళ వారం.మా విమానం ప్రాంక్ పర్ట్ నుంచి బయల్దేరి సుమారు 5 గంటలయంది.మేం అప్పటికి ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రం మీదుగా ప్రయాణిస్తున్నాం.అంతలోనాకు కాక్ పిట్ లోనికి వెళ్ళి విమానం కేప్టెన్ ని కలుసుకోవలసిందిగా పిలుపు వచ్చింది.నేను కాక్ పిట్లో ప్రవేశంచగానే అక్కడ అందరి ముఖాలూ గంభీరంగా ఉండడం గమనించాను.కేప్టెన్ అక్కడ నాకొక మెసేజ్ ఉన్న కాగితం అందించాడు.ఆ మెసేజ్ అట్లాంటాలో ఉన్న మా డెల్టా ఎయిర్ లైన్స్ ఆఫీసునుంచి వచ్చింది.అందులో ఇలా ఉంది: “అమెరికా లో ఉన్న విమానాశ్రయాలన్నీ ప్రస్తుతం మూసివేయబడ్డాయి.ఏ ప్రయాణీకుల విమానాలూ రావడానికి వీలు లేదు.అందువల్ల మీకు దగ్గరలో ఉన్న విమానాశ్రయాన్ని ఎంచుకుని అక్కడికి వెళ్ళండి.మీరు ఎక్కడ లేండ్ అయేదీ తెలుపగలరు”
కాక్ పిట్ లో ఉన్నఅందరికీ పరిస్థితి ఎంత గంభీరమైనదో అర్థమైంది.అప్పుడు మేం సముద్రం మీద ప్రయణిస్తున్నాం కనుక అతి తొందరలో భూభాగం మీద విమానాన్ని సురక్షితంగా దింపగల ప్రదేశాన్ని వెతుక్కోవాలి. అంతా పరిశీలించి మా కేప్టెన్ మాకు 400 మైళ్ళ దూరంలో న్యూ ఫౌండ్ లేండ్ లో ఉన్న గేండర్ విమానాశ్రయం లోనే విమానాన్ని దింపాలని నిశ్చయించాడు.వెంటనే కెనేడియన్ ట్రాఫిక్ కంట్రోలర్ని సంప్రదించగా వారు ఏ విధమైన ప్రశ్నలూ అడక్కుండానే అనుమతి ఇచ్చారు..అప్పుడు మాకు అది ఆశ్చర్యంగానే అనిపించినా తరువాత అలా ఎందుకు జరిగిందో అర్థమైంది.
మా విమానాన్ని గేండర్ విమానాశ్రయానికి చేర్చబోతుండగా మాకు అమెరికాలో విమానాల హైజాకింగ్ జరిగిందనీ టెర్రరిస్టులు విధ్వంసాన్ని సృష్టిస్తున్నారనీ తెలిసింది.అయితే ఆ విషయాలను మా ప్రయాణీకులకు తెలిపి వారిని భయభ్రాతులను చేయడం ఇష్టం లేక మా విమానంలో చిన్న సాంకేతిక లోపం తలెత్తిందనీ దగ్గర లోని గేండర్ విమానాశ్రయంలో ఆపి ఆ లోపాన్ని సరిజేసుకుని తిరిగి ప్రయాణాన్ని కొనసాగిస్తామనీ అబధ్ధం చెప్పాము.అక్కడ దిగాక పూర్తి వివరాలు వారికి తెలియ జేస్తామనీ నమ్మబలికాము.అది విన్న ప్రయాణీకులలో తాము గమ్య స్థానం చేరడంలో ఆలస్యమవుతుందని తెలిసి కొంత విసుగూ చిరాకూ కనిపించాయి.అది చాలా సహజమైన విషయమే కదా?మరో నలభై నిమిషాల తర్వాత మా విమానం గేండర్ లో దిగే సరికి అక్కడి స్థానికి సమయం12.30 A.M.అయింది(11A.M.E.S.T.) అక్కడ అప్పటికే వివిధ దేశాలనుండి అమెరికా వెళ్ళాల్సిఉండి దారి మార్చుకుని గేండర్ విమానాశ్రయంలో దిగిన సుమారు 20 విమానాలున్నాయి.
మా విమానం లేండ్ అయిన తర్వాత కేప్టెన్ మా ప్రయాణీకులనుద్దేశించి ఇలా చెప్పాడు. మన చుట్టూ ఉన్న ఇన్ని విమానాలను చూస్తే మీకు వాటన్నిటికీ కూడా మనలాటి సాంకేతిక సమస్యే వచ్చిందా అని ఆశ్చర్యం కలగొచ్చు.నిజానికి మనకి గాని ఇతర విమానాలకి గాని ఏ సాంకేతిక సమస్యా లేదు.ఇన్ని విమానాలూ ఇక్కడ అత్యవసరంగా దిగడానికి వేరే కారణం ఉంది అంటూ అమెరికాలో విమానాల హైజాకింగ్ టెర్రరిస్టుల దాడి గురించి మాకు తెలిసినంత మట్టుకు వారికి వివరించాడు.నమ్మ శక్యం గాని ఆ వార్త విని ప్రయాణీకులంతా భయవిహ్వలులై నిశ్చేష్టులయారు. ప్రయాణీకులెవరూ విమానం దిగడానికి వీలు లేదనీ విమానంలోనే ఉండాలనీ అక్కడి అధికారులు ఆదేశించారని చెప్పారు. అక్కడి ఎయిర్పోర్ట్ పోలీసులు తప్ప వేరెవ్వరూ విమానాల దగ్గరికి రావడానికి వీల్లేదని తెలియజేసారు.
మా విమానం అక్కడ దిగిన గంటసేపట్లో మరికొన్నివిమానాలు కూడా అక్కడ దిగాయి.మొత్తం 53 విమానాలు.అన్నీ అమెరికా వెళ్లాల్సినవే.మా లాగే అత్యవసరంగా ఇక్కడ దిగాయి.వాటిలో 27 విమానాలు అమెరికా దేశానికి చెందినవే.మెల్లగా మరికొంత సేపటికి మాకు మరికొంత సమాచారం తెలిసింది.అంతవరకూ అమెరికాలో టెర్రరిస్టుల దాడి జరిగిందని తప్ప ఏ వివరాలూ మాకు తెలియదు.ఇప్పుడు అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీదా పెంటగాన్ మీదా హైజాక్ చేసిన విమానాలతో దాడి జరిగిందని తెలిసింది.ఈ వివరాలు విన్న కొంత మంది ప్రయాణీకులు తమ సెల్ పోన్లలో వివరాలు కనుక్కుందికి ప్రయత్నించారు కానీ కెనడాలో వేరే సెల్ పోన్ సిస్టం ఉండడంతో అవి పని చేయ లేదు.పని చేసిన వాటికి అమెరికాలో లైన్లన్నీ జామ్ అయాయనో మూసివేయబడ్డాయనో సమాచారం వచ్చింది.
ఆ సాయంత్రానికి మాకు W.T.C. twin towers పూర్తిగా కూల్చి వేయబడ్డాయనీ హైజాక్ చేయబడిన నాలుగో విమానం కుప్పకూలిందనీ తెలిసింది. అప్పటికే మా ప్రయాణీకులందరూ శారీరకంగానూ మానసికంగానూ అలసిపోయి స్థబ్దుగా ఉండిపోయారు.మా విమానం కిటికీలలోంచి కనిపిస్తున్న ఆ 52 విమానాలనీ చూస్తే ఈ ఇబ్బందిలో ఇరుక్కున్నది మేం మాత్రమే కాదని ఈ సమస్య ఎంతో మందిదనీ తెలుస్తోంది.తరువాత తెలిసిందేమిటంటే విమాన ప్రయాణీకులందరినీ ఊళ్ళోకి తీసుకెళ్ళి వారికోసం ఏర్పాటు చేస్తున్న బసలలో ఉంచుతారనీ అయితే ఒక విమానం తర్వాత ఒకటిగా ఖాళీ చేయించి ఊళ్ళోకి తీసుకెళ్ళడానికి చాలా సమయం పడుతుందనీ మా విమానాన్ని ఖాళీ చేయించడం మరునాడు సుమారు 11గంటలకు జరగవచ్చనీ తెలిసింది .ఇది విన్న మా ప్రయాణీకులు చేసేదేమీ లేక తప్పదు కదా అని పరిస్థితులతో రాజీ పడిపోయి రాత్రి విమానం లోనే గడపడానికి సిధ్ధ పడిపోయారు.అక్కడి విమానాశ్రయాధికారులు మాకు కావలసిన మంచినీటి సదుపాయం లెవేటరీలను శుభ్రపరచడం అవసరమైతే వైద్యసహాయం అందించడం వండివి జరుగుతాయని హామీ ఇచ్చారు. మాకు వైద్యసహాయం కోరాల్సిన అవసరం పడలేదు. మా ప్రయాణీకులలో ఒక 8 నెలలు నిండిన గర్భవతి ఉన్నా ఆమెక ఏ చికాకూ పడలేదు. మేం ఆమెను జాగ్రత్తగానే చూసుకున్నాం. సీట్ల లోనే పడుక్కోవలసి రావడమనే అసౌకర్యాన్ని ప్రయణీకులందరూ మౌనం గానే భరించారు.
మరునాడు 12 వ తేదీ ఉదయం 10.30 ప్రాంతంలో మా విమానం దగ్గరకు ఎన్నో స్కూల్ బస్సులు వచ్చి క్యూకట్టి వరుసగా నిల్చున్నాయి. వాటిలోకి మేమూ మా ప్రయాణీకులందరం ఎక్కాక అవి మమ్మల్ని ఎయిర్పోర్టు టెర్మినల్ కి తీసుకెళ్ళాయి. అక్కడ అందరం ఇమ్మిగ్రేషన్ కష్టమ్స్ ఫార్మాలిటీస్ తో పాటు రెడ్ క్రాస్ లో మా వివరాలు నమోదు చేసుకోవడం జరిగింది. ఆ తరువాత మా విమాన సిబ్బందిని మాత్రం అక్కడికి దగ్గర్లోని చిన్న హోటల్ కి తీసుకెళ్ళారు.మా ప్రయాణీకులను ఎక్కడికి తీసుకెళ్లారో మాకు తెలీదు.అక్కడి రెడ్ క్రాస్ వారు చెప్పిన దానిని బట్టి అక్కడ గేండర్ ఊరి జనసంఖ్య 10,400 మాత్రమే ఉండగా ఇప్పుడు విమానాలలో అత్యవసరంగా దిగిన ప్రయాణీకుల సంఖ్య10,500 ఉందట.హోటల్ కి చేరాక తాము మళ్ళా వచ్చి పిలిచే దాకా మమ్మల్నిహాయిగా విశ్రాంతి తీసుకోమని చెప్పారు.అయితే ఆ పిలుపు అంత తొందరలో వస్తందని మాత్రం ఆశించవద్దన్నారు.
అలా హోటల్కి చేరాక T.V.ల ద్వారా మాకు అమెరికాలో జరిగిన దుర్ఘటన వివరాలు అవి జరిగిన 24 గంటల తర్వాత పూర్తిగా తెలిసాయి.అక్కడ ఆ గేండర్ వూరి ప్రజలు ఎంతటి స్నేహశీలురోమాకు అర్థమైంది.మమ్మల్ని విమానాల మనుషులంటూ పిలుస్తూ ఎంతో కలివిడిగా మాకు ఆతిథ్యం ఇచ్చి మమ్మల్ని ముగ్ధుల్ని చేసారు.మాకు వేరే పనేం లేదు కనుక వూరంతా తిరిగి ఎంజాయ్ చేసేము.అలా రెండు రోజులు గడిచాక మాకు పిలుపు వస్తే మేము విమానాశ్రయం చేరి మా విమానంలో ఎక్కాము.ఎక్కడెక్కడో ఉన్న మా ప్రయాణీకులంతా కూడా ఒక్కరు కూడా మిస్ అవకుండా అందరూ విమానంలోకి చేర్చబడ్డారు.అలా అంతా చేరుకున్నాక మా ప్రయాణీకులు ఆ రెండు రోజులలో వారి వారి అనుభవాలను మాతో పంచుకోవడం మొదలెట్టారు.
అనుకోకుండా ఇన్ని విమానాలలో వచ్చిన వేలాది మంది ప్రయాణీకులకు ఆతిథ్యమివ్వడానికి గెండర్ లాంటి చిన్నఊ రు సరిపోదు కనుక అక్కడి ప్రభుత్వాధికారులు గేండర్ కి చుట్టు పక్కల 75 కి.మీ. వ్యాసార్థంలో ఉన్న ఊళ్ళన్నిటిలోనూ స్కూళ్ళు మీటింగ్ హాళ్ళూ లాడ్జీలు మొదలైనవన్నీ ప్రయాణీకుల తాత్కాలిక వసతి కోసం ఏర్పాటు చేసేరుట.కొన్ని చోట్ల మంచాలూ పరుపులూ ఏర్పాటు చేయగా మరికొన్ని చోట్ల చాపలు పరచి స్లీపింగ్ బేగ్స్ తలగడలూ ఏర్పాటు చేసేరుట.ఆ వూళ్ళలోని హైస్కూలు విద్యార్థులందరూ విమానాలలో దిగిన ప్రయాణీకులందరికీ సహాయం చేయడానికి వలంటీర్లుగా ఏర్పాటు చేయబడ్డారుట.మా విమానంలో వచ్చిన 218 మంది ప్రయాణీకులకూ గేండర్ కి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న లూయీ పోర్ట్ అనే గ్రామంలోని ఒక హైస్కూల్లో బస ఏర్పాటు చేసేరుట.వేరుగా ఉండదలచుకున్న స్త్రీలకు ప్రత్యే ఏర్పాట్లు కుటుంబాలు కలసి ఉండడానికి వలసిన ఏర్పాట్లు చేసేరుట.బాగా వృధ్ధులైన వారికి అక్కడ కొందరి ఇళ్ళలో వసతి ఏర్పాటు చేసేరుట.మా ప్రయాణీకులలో ఉన్న గర్భవతికి దగ్గరలో వైద్య సదుపాయం అందుబాటులో ఉన్న ఒకరింట్లో బస ఏర్పాటు చేసేరుట.రోజులో ఒక్కసారి ప్రతివారు దేశ దేశాలలో ఉన్న తమవారితో ఫోన్లో మాట్లాడుకోగలిగే సదుపాయం ఏర్పాట చేసేరుట.ఆ రెండు రోజులూ పగటి పూట ఎక్స్ కర్షన్ లాగా బయటకు పోయి సరస్సులలో క్రూయిజ్లూ దగ్గర అడవుల్లో హైకింగూ వంటివి సరదా ఉన్న వాళ్ళు చేసుకోవడానికి ఏర్పాట్లు చేసేరుట . అతిథులకు తాజా బ్రెడ్ లు అందించడానికి ఆ వూళ్లోని బేకరీలన్నీరాత్రీ పగలూ పని చేసేయిట.ఆ గ్రామంలోని గృహస్తులందరూ ఇళ్ళల్లో వంటలు వండించి స్కూళ్ళకు తెచ్చి వడ్డించే వారట.హోటల్ తిళ్ళని ఇస్టపడే వారిని రెస్టారెంట్లకు తీసుకెళ్లి తినిపించే వారట. వాళ్ల సామాన్లన్నీ విమానం లో ఉండిపోయాయి కనుక అతిథులందరూ వారి బట్టలుతుకుకునేందుకు లాండ్రీలను ఏర్పాటు చేసేరుట.ఒక్క ముక్కలో చెప్పాలంటే అతిథులందరినీ ఆ రెండురోజులూ ఏ ఇబ్బందీ లేకుండా పెళ్ళి వారిలా చూసుకున్నారుట. వాళ్ళ వాళ్ల అనుభవాలను చెబుతున్నప్పుడు మా ప్రయాణీకులు ఆనందం పట్టలేక ఏడ్చేసేవారు.అక్కడి రెడ్ క్రాస్ వారికి ఏయే విమానాల్లో వచ్చిన వారు ఎక్కడున్నారో పూర్తి వివరాలు తెలుసు కనుక విమానం బయలు దేరే వేళకి ఒక్కరూ మిస్ కాకుండా అందరినీ వారి వారి విమానాలకు చేర్చారు.ఇంత మందికి ఇన్ని ఏర్పాట్లు ముందస్తుగా తెలియక పోయినా ఇంత చక్కగా ఏర్పాటు చేయగలగడం అబ్బురమే కదా?
తిరిగి విమానంలో చేరుకున్న మా ప్రయాణీకులందరికీ కలసి మెలసి క్రూయిజ్ లో వెళ్తున్న అనుభూతి కలిగి ఒకరికొకరు దగ్గరై పేర్లు పెట్టి పిలుచుకోవడం తమ తమ అనుభవాలను పక్కవారితో పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది.గేండర్ నుంచి తిరిగి అట్లాంటాకి మొదలైన ప్రయాణం ఒక గ్రూపు కలసి కట్టుగా ఏర్పాటు చేసుకన్న ప్రైవేటు ఛార్టర్డ్ ఫ్లైట్ ప్రయాణం లాగుంది. ప్రయాణీకుల హర్షాతిరేకాలకు అడ్డు తగలక పోవడమే మా క్రూ మెంబర్లం అందరం చేసిన పని.వారి ఆనందం చూస్తూ మేం నోట మాట రాకుండా నిల్చుండి పోయే వాళ్ళం.ఇలా ఉండగా ఓ అనుకోని సంఘటన జరిగింది.
మా ప్రయాణీకుల్లో ఒకరు నా దగ్గరకు వచ్చి మైకులో అందర్నీ ఉద్దేశించి తాను మాట్లాడవచ్చా అని అడిగాడు. మామూలు పరిస్థితుల్లో మేం అటువంటిది అంగీకరించం కాని ప్రస్తుత పరిస్థితులు వేరు. సరే నంటూ అతడికి మైక్ అందించాను.
ఆ రెండురోజుల్లోనూ తన అనుభవాలను కొద్దిగా వివరిస్తూ తామెవరో తమ ముక్కూ మొహం తెలియకపోయినా ఆ ఊరి ప్రజలు తమకు అందించిన ఆతిథ్యం జన్మలో మరువలేనిదని అన్నాడు.ఆ లూయీ పోర్ట్ ప్రజలకు తామెంతో రుణపడి ఉంటామని అందు చేత కొద్దిగా నైనా వారి రుణం తీర్చుకునేందుకు ఏదో ఒకటి చేయాలనుందని అంటూ తన ఆలోచనను బయట పెట్టాడు. ఆ ఊరి వారి కోసం ఒక సహాయ నిధి trust ని ఏర్పాటు చేద్దామనీ దానికి Delta 15(ఇది మా ఫ్లయిట్ పేరు)అని పేరు పెట్టాలన్నది తన అభిమతమనీ ఆ సహాయనిధి నుండి ఇక్కడి స్కూలు పిల్లలకు కాలేజీ చదువులకు అవసరమైన స్కాలర్ షిప్పులు ఇప్పించాలన్నది తన కోరిక అనీ చెప్పాడు.ఈ కార్యక్రమంలో పాలుపంచుకో దలచిన దాతలు తమ పేర్లను ఫోన్ నంబర్లను విరాళం సొమ్మునూ వ్రాయవలసిందిగా ఒక కాగితాన్ని అందరికీ పంచేడు. ఆ విధంగా అందరూ కలసి ప్రకటించిన విరాళం సొమ్ము 14000 డాలర్లయింది. ఈ మంచి ఆలోచనను ప్రయాణీకుల్లో ప్రవేశ పెట్టిన వ్యక్తి వర్జీనియాకు చెందిన డాక్టరు.అతడు తన వంతు చందాగా అంతే సొమ్మును ప్రకటిస్తున్నాననీ అతి త్వరలోనే ట్రస్టుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ వ్యవహరాలన్నీ పూర్తి చేస్తాననీ చెప్పాడు. అంతే కాకుండా డెల్టా విమానాధి పతుల్ని కూడా ఈ కార్యక్రమానికి చేయూతనందించాల్సిందిగా కోరుతాననీ చెప్పాడు.
***
నేను మీకీ వివరాలన్నీ అందజేయడానికి పూనుకున్నప్పటికి ట్రస్టుకి 15 లక్షల డాలర్ల విరాళాలు అందేయి.134 మంది స్కూలు విద్యార్థులకు కాలేజీ చదువులకోసం స్కాలర్ షిప్పులు అందజేయడం జరిగింది.
నేనీ విషయాలను మీతో పంచుకోవడానికి కారణం. అనుకోకుండా వచ్చి మీద పడ్డ వందల మంది అతిథులను ఆ చిన్నిగ్రామ ప్రజలు ప్రేమాభిమానాలతో ఆదుకున్నతీరు అబ్బురమనీ ప్రపంచంలో మంచి ఇంకా మిగిలే ఉందనీ తెలియజేయడానికే.
మంచి ఎక్కడున్నా నలుగురికీ తెలియజేయండి.మంచిని ప్రోత్సహించి పెంచండి.
********
Source FB
~~~~Forwarded~~~~
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి