ద్రౌపది పుత్రశోకం
1-142-వ.వచనము
అని పలికి ”రాజర్షియైన పరీక్షిన్మహారాజు జన్మ కర్మ ముక్తులును బాండవుల మహాప్రస్థానంబును గృష్ణకథోదయంబును జెప్పెదం; గౌరవ దృష్టద్యుమ్నాదుల యుద్ధంబున వీరులైన వారలు స్వర్గంబునకుం జనిన వెనుక భీము గదాఘాతంబున దుర్యోధనుండు తొడలు విఱిగి కూలిన నశ్వత్థామ దుర్యోధనునకుం బ్రియంబు సేయు వాఁడై నిదురవోవు ద్రౌపదీపుత్త్రుల శిరంబులు ఖండించి తెచ్చి సమర్పించె; అది క్రూరకర్మంబని లోకులు నిందింతురు.
అని = అని; పలికి = పలికి; రాజర్షి = రాజర్షి {రాజర్షి - వైదిక సంప్రదాయ అనువర్తి యైన రాజు}; ఐన = అయిన; పరీక్షిత్ = పరీక్షిత్తు అను; మహా = గొప్ప; రాజు = రాజు; జన్మ = పుట్టుక; కర్మ = నడత; ముక్తులును = ముక్తిపొందిన విధములను; పాండవుల = పాండవులయొక్క; మహా = గొప్ప (తిరిగిరాని); ప్రస్థానంబును = ప్రయాణమును; కృష్ణ = కృష్ణుని; కథ = కథకు; ఉదయంబును = ప్రారంభమును; చెప్పెదన్ = చెప్పెదను; కౌరవ = కౌరవులు; దృష్టద్యుమ్న = దృష్టద్యుమ్నుడు; ఆదుల = మొదలగువారల; యుద్ధంబునన్ = యుద్ధములో; వీరులైన = వీరమరణము పొందిన; వారలు = వారు; స్వర్గంబు = స్వర్గము; కున్ = కు; చనిన = పోయిన; వెనుక = తరువాత; భీము = భీముని; గద = గదయొక్క; ఆఘాతంబున = దెబ్బలవలన; దుర్యోధనుండు = దుర్యోధనుడు; తొడలు = తొడలు / ఊరువులు; విఱిగి = విరిగి; కూలిన = పడిపోయిన; అశ్వత్థామ = అశ్వత్థామ; దుర్యోధను = దుర్యోధను; కున్ = కు; ప్రియంబు = సంతోషము; చేయువాఁడు = కలుగ చేయువాడు; ఐ = అయి; నిదురవోవు = నిద్రించుచున్న; ద్రౌపదీ = ద్రౌపదియొక్క; పుత్త్రుల = కొడుకుల; శిరంబులున్ = శిరస్సులు; ఖండించి = నరికి; తెచ్చి = తీసుకువచ్చి; సమర్పించెన్ = సమర్పించెను; అది = ఆపని; క్రూర = క్రూరమైన; కర్మంబు = పని; అని = అని; లోకులు = ప్రజలు; నిందింతురు = నిందిస్తారు.
రాజర్షి యైన పరీక్షిత్తు జన్మవృత్తాంతాన్ని, ధర్మకార్యాలను, మోక్షప్రాప్తిని, పాండవుల మహాప్రస్థానాన్ని కృష్ణ కథోదయాన్ని నీకు వివరిస్తాను. కౌరవ పాండవులకు జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో వీరు లైనవారు చాలామంది చనిపోయి స్వర్గానికి వెళ్లారు. అనంతరం భీమసేనుని గదాదండం దెబ్బకు దుర్యోధనుడు తొడలు విరిగి నేల కొరిగాడు. గురుపుత్రుడైన అశ్వత్థామ దుర్యోధనునికి సంతోషం కలిగించటం కోసం నిద్రాక్తులైన ద్రౌపది కుమారుల శిరస్సులు ఖండించాడు. అది చాలా దారుణమైన పని అని, లోకు లందరు ఈ క్రూరకృత్యానికి అశ్వత్థామను నిందించారు.
1-143-ఉ.ఉత్పలమాల
బాలుర చావు కర్ణములఁ బడ్డఁ గలంగి యలంగి, యోరువం
జాలక బాష్పతోయ కణజాలము చెక్కుల రాల నేడ్చి, పాం
చాలతనూజ నేలఁబడి జాలిఁ బడం గని యెత్తి, మంజువా
చాలతఁ జూపుచుం జికురజాలము దువ్వుచుఁ గ్రీడి యిట్లనున్.
బాలుర = కొడుకుల; చావు = మృతి; కర్ణములన్ = చెవులలో; పడ్డన్ = పడగా; కలంగి = కలతచెంది; అలంగి = శోకించి; ఓరువన్ = ఓర్చుకొన; చాలకన్ = లేక; బాష్ప = కన్నీటి; తోయ = నీటి; కణ = బిందువుల; జాలము = సమూహము; చెక్కుల = చెంపల వెంట; రాలన్ = రాలునట్లుగ; ఏడ్చి = దఃఖించి; పాంచాల = పాంచాల రాజు యొక్క; తనూజ = కూతురు; నేలన్ = నేలపై; పడి = పడినదై; జాలిన్ = బాధ; పడన్ = పడుతుండగ; కని = చూచి; ఎత్తి = పైకిలేపి; మంజు = మృదువైన; వాచాలతన్ = మాటల చాతుర్యము; చూపుచున్ = ప్రదర్శిస్తూ; చికురజాలమున్ = ముంగురుల సమూహము; దువ్వుచున్ = దువ్వుతూ; క్రీడి = అర్జునుడు; ఇట్లు = ఈ విధముగ; అనున్ = అన్నాడు.
కన్న కొడుకులంతా, అశ్వత్థామ ఖడ్గానికి బలైపోయారని విని ద్రౌపది దుఃఖాన్ని సహించలేకపోయింది. చెక్కిళ్లపై కన్నీళ్లు కాలువలు కట్టేలా ఏడ్చి జాలితో క్రింద పడి దొర్లుతున్న ద్రౌపదిని అర్జునుడు చూసాడు. ఆమెను ఓదార్చి, మధురమైన మాటలతో ధైర్యం చెప్పుతూ ఆమె ముంగురులు దువ్వుతూ ఇలా అన్నాడు-
1-144-మ.మత్తేభ విక్రీడితము
"ధరణీశాత్మజ వీవు నీకు వగవన్ ధర్మంబెయా ద్రౌణి ని
ష్కరుణుండై విదళించె బాలకుల మద్గాండీవ నిర్ముక్త భీ
కరబాణంబుల నేఁడు వానిశిరమున్ ఖండించి నేఁ దెత్తుఁ, ద
చ్ఛిరముం ద్రొక్కి జలంబు లాడు మిచటన్ శీతాంశుబింబాననా!"
ధరణీశ = రాజ; ఆత్మజవు = కుమారివి; ఈవు = నీవు; నీకు = నీకు; వగవన్ = దుఃఖించుట; ధర్మంబె = మంచిపనా; ఆ = ఆ; ద్రౌణి = ద్రోణుని కొడుకు (అశ్వత్థామ); నిష్కరుణుండు = కరుణలేనివాడు; ఐ = అయి; విదళించె = ఖండించెను; బాలకులన్ = బాలురను; మత్ = నాయొక్క; గాండీవ = గాండీవమునుండి; నిర్ముక్త = వదలబడు; భీకర = భీకరమైన; బాణంబులన్ = బాణములతో; నేఁడు = ఇవేళ; వాని = అతని; శిరమున్ = శిరస్సును; ఖండించి = నరికి; నేన్ = నేను; దెత్తున్ = తెస్తాను; తత్ = ఆయొక్క; శిరమున్ = తలను; త్రొక్కి = త్రొక్కి; జలంబులాడు = స్నానము చేయుము; ఇచటన్ = ఇక్కడ; శీతాంశు = చంద్రుని {శీతాంశుడు - చల్లని కిరణాలు కలవాడు, చంద్రుడు}; బింబ = బింబము వంటి; ఆననా = ముఖము గలదానా.
“చంద్రుని వంటి మోముగల ద్రౌపది! నీవు రాజకుమారివి. క్షత్రియకాంతవు అయి నీకు, చనిపోయిన వారికోసం విచారించటం ధర్మం కాదు. ఇదిగో విను, ఆ అశ్వత్థామ దయాదాక్షిణ్యాలు లేనివాడై నీ బిడ్డలను చంపాడు. అందుకు ప్రతీకారంగా నా గాండీవం నుండి మహోగ్రబాణాలను వేసి వాని శిరస్సు ఖండించి నీకు కానుకగా తీసుకొని వస్తాను. ఆ తలను ఇక్కడ కాలితో తన్ని స్నానం చేద్దువు గాని.”
1-145-వ.వచనము
అని యి ట్లొడంబఱచి, తనకు మిత్రుండును సారథియు నైన హరి మేలనుచుండం గవచంబు దొడిగి, గాండీవంబు ధరియించి, కపిధ్వజుండై, గురుసుతుని వెంట రథంబు దోలించిన.
అని = పలికి; ఇట్లు = ఈ విధముగ; ఒడన్ = ఒప్పునట్లు; పఱచి = చేసి; తన = తన; కున్ = కు; మిత్త్రుండును = స్నేహితిడును; సారథియును = సారథియు; ఐన = అయినట్టి; హరి = కృష్ణుడు; మేలు = మంచిది; అనుచున్ = అని పలుకుచూ; ఉండన్ = ఉండగ; కవచంబు = కవచమును; తొడిగి = ధరించి; గాండీవంబు = గాండీవమును; ధరియించి = తీసుకొని; కపి = ఆంజనేయుని గుర్తు; ధ్వజుండు = జండాపై ధరించినవాడు (అర్జునుడు); ఐ = అయి; గురుసుతుని = అశ్వత్థామ {గురుసుతుడు - ద్రోణుని పుత్రుడు, అశ్వత్థామ}; వెంట = వెనుక తరిమి; రథంబు = రథమును; తోలించినన్ = నడిపించగ.
ఇలా ద్రౌపదికి నచ్చజెప్పి ఆత్మీయుడైన శ్రీకృష్ణుడు మేలుమేలని ప్రశంసిస్తుంతుండగా, అర్జునుడు కవచాన్ని ధరించి గాండీవాన్ని చేతబట్టి, కపిధ్వజంతో కూడిన రథాన్ని సారథియై నారాయణడు ముందుకు నడుపుతూ ఉండగా అశ్వత్థామను వెంట తరిముతూ వెళ్ళాడు.
1-146-శా.శార్దూల విక్రీడితము
తన్నుం జంపెద నంచు వచ్చు విజయున్ దర్శించి తద్ద్రౌణి యా
పన్నుండై శిశుహంత గావున నిజప్రాణేచ్ఛఁ బాఱెన్ వడిన్
మున్నాబ్రహ్మ మృగాకృతిం దనయకున్ మోహించి క్రీడింప నా
సన్నుండౌ హరుఁ జూచి పాఱు పగిదిన్ సర్వేంద్రియభ్రాంతితోన్.
తన్నున్ = తనను; చంపెదన్ = సంహరించెదను; అంచు = అనుచు; వచ్చు = వస్తూ ఉన్న; విజయున్ = అర్జునుని; దర్శించి = చూసి; తత్ = ఆయొక్క; ద్రౌణి = ద్రోణుని పుత్రుడు అశ్వత్థామ; ఆపన్నుండు = ఆపదచెందినవాడు; ఐ = అయి; శిశు = పిల్లలను; హంత = సంహరించినవాడు; కావున = కనుక; నిజ = తన; ప్రాణ = ప్రాణములమీది; ఇచ్చన్ = మమకారముతో; పాఱెన్ = పారిపోయాడు; వడిన్ = వేగంగా; మున్న = పూర్వము; ఆ = ఆ; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; మృగ = లేడి; ఆకృతిన్ = రూపముతో; తనయ = పుత్రిక; కున్ = ను; మోహించి = మోహించి; క్రీడింపన్ = క్రీడించగా; ఆసన్నుండు = సమీపించుతున్న వాడు; ఔ = అగు; హరున్ = శివుని; చూచి = చూచి; పాఱు = పారిపోవు; పగిదిన్ = విధముగా; సర్వ = సమస్త; ఇంద్రియ = ఇంద్రియములు; భ్రాంతి = భయము; తోన్ = తో.
శిశుహంతకడు అయిన అశ్వత్థామ తనను సంహరించటం కోసం సన్నద్ధుడై వస్తున్న అర్జునుణ్ణి చూచి, విభ్రాంతుడై దిక్కు తోచక ప్రాణాలు కాపాడు కోవటం కోస అలోచించాడు. పూర్వం బ్రహ్మదేవుడు లేడి రూపం దాల్చి, కామాతురుడై కన్న కూతుర్ని మోహించి; పరమశివుణ్ణి చూసి పారియిన విదంగా, అశ్వత్థామ పారిపోసాగాడు.
1-147-వ.వచనము
ఇట్లోపినంతదూరంబు బరువిడి వెనుకఁ జూచి రథతురంగంబు లలయుటఁ దెలిసి నిలిచి ప్రాణరక్షంబునకు నొండుపాయంబు లేమి నిశ్చయించి, జలంబుల వార్చి, ద్రోణనందనుండు సమాహితచిత్తుండైప్రయోగంబ కాని యుపసంహారంబు నేరకయుఁ బ్రాణసంరక్షణార్థంబుపార్థునిమీదఁ బ్రహ్మశిరోనామకాస్త్రంబుం బ్రయోగించిన నది ప్రచండతేజంబున దిగంతరాళంబు నిండి ప్రాణి భయంకరంబై తోఁచినహరికి నర్జునుం డిట్లనియె.
ఇట్లు = ఈవిధముగా; ఓపిన = సాధ్యమైన; అంత = అంతట; దూరంబున్ = దూరము; పరువిడి = పరుగెత్తి; వెనుకన్ = వెనుకకు; చూచి = చూసి; రథతురంగంబులు = రథమునకు కట్టిన గుఱ్ఱములు; అలయుటన్ = అలసట పొందుట; తెలిసి = తెలుసుకొని; నిలిచి = ఆగి; ప్రాణ = ప్రాణములను; రక్షంబు = రక్షించుకొనుట; కున్ = కు; ఒండు = మరొక; ఉపాయంబు = ఉపాయము; లేమిన్ = లేకపోవుటను; నిశ్చయించి = నిర్ణయించుకొని; జలంబులవార్చి = ఆచమనం చేసి (సంకల్పించుకొని); ద్రోణనందనుండు = అశ్వత్థామ {ద్రోణనందనుడు – ద్రోణుని పుత్రుడు, అశ్వత్తామ}; సమాహిత = కూడతీసుకొన్న; చిత్తుండు = మనసుకలవాడు; ఐ = అయి; ప్రయోగంబ = ప్రయోగించుట; కాని = తప్ప; ఉపసంహారంబు = మరలించుట; నేరకయున్ = తెలియకపోయినను; ప్రాణ = ప్రాణములను; సంరక్షణార్థంబు = రక్షించుకొనుటకు; పార్థుని = అర్జునుని {పార్థుడు - పృథ పుత్రుడు, అర్జునుడు}; మీదన్ = పైన; బ్రహ్మశిరస్ = బ్రహ్మశిరస్సు అనే; నామక = పేరుగల; అస్త్రంబున్ = అస్త్రమును; ప్రయోగించినన్ = వేసిన; అది = ఆ బ్రహ్మాస్త్రము; ప్రచండ = భయంకరమైన; తేజంబునన్ = వెలుగుతో; దిక్ = దిక్కులయొక్క; అంతరాళంబున్ = మధ్యభాగమంతా; నిండి = నిండిపోయి; ప్రాణి = జీవులకు; భయంకరంబు = భయము కలిగించునది; ఐ = అయి; తోఁచినన్ = అనిపించగా; హరి = కృష్ణుని / హరి; కిన్ = కి; అర్జునుండు = అర్జునుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = అన్నాడు;
ఈ ప్రకారంగా ఓపికున్నంతవరకు పారిపోతున్న అశ్వత్థామ ఒక్కమాటు వెనక్కు తిరిగి చూశాడు; రథాశ్వాలు అలసిపోయినట్లుగా తెలిసికొన్నాడు; ఇక తన ప్రాణాల్ని రక్షించుకోవటానికి వేరే ఉపాయం లేదనే నిశ్చయంతో, అశ్వత్థామ ఆచమనం చేసి, ఏకాగ్ర చిత్తంతో ప్రయోగమే గాని ఉపసంహారం తెలియని బ్రహ్మశిరోనామకాస్ర్తాన్ని పార్థునిపై ప్రయోగించాడు. ఆ బ్రహ్మశిరోనామకాస్ర్తం ప్రచండ తేజంతో సకల దిక్కులూ వ్యాపించి, సర్వప్రాణులకూ భయం కలిగిస్తూ, విజృంభించటం చూసి అర్జునుడు, కృష్ణుని ఇలా అర్థించాడు.
1-148-సీ.సీస పద్యము
"పద్మలోచన! కృష్ణ! భక్తాభయప్రద! ;
వినుము, సంసారాగ్నివేఁగుచున్న
జనుల సంసారంబు సంహరింపఁగ నీవు;
దక్క నన్యులు లేరు దలఁచి చూడ
సాక్షాత్కరించిన సర్వేశ్వరుండవు;
ప్రకృతికి నవ్వలి ప్రభుఁడ వాద్య
పురుషుండవగు నీవు బోధముచే మాయ;
నడఁతువు నిశ్శ్రేయసాత్మ యందు
1-148.1-ఆ.
మాయచేత మునిఁగి మనువారలకుఁ గృప
సేసి ధర్మముఖ్యచిహ్నమయిన
శుభము సేయు దీవు సుజనుల నవనిలోఁ
గావఁ బుట్టుదువు, జగన్నివాస!
పద్మలోచన = హరీ {పద్మలోచనుడు - పద్మముల వంటి కన్నులు కలవాడు, కృష్ణుడు}; కృష్ణ = కృష్ణా / హరీ; భక్త = భక్తులకు; అభయ = అభయమును; ప్రద = ఇచ్చువాడా / హరీ; వినుము = విను; సంసార = సంసారమనే; అగ్నిన్ = అగ్నిలో; వేఁగుచున్న = వేగుచున్నట్టి; జనుల = మానవుల; సంసారంబున్ = సంసారము నందలి మాయను; సంహరింపఁగ = హరించి వేయుటకు; నీవున్ = నువ్వు; తక్కన్ = తప్ప; అన్యులు = ఇతరులు; లేరు = లేరు; తలఁచి = ఆలోచించుకొని; చూడన్ = చూడగా; సాక్షాత్కరించిన = సాక్షాత్తు; సర్వ = సమస్తమునకు; ఈశ్వరుండవు = భగవంతుడవు; ప్రకృతి = ప్రకృతి; కిన్ = కి; అవ్వలి = పరమైన; ప్రభుఁడవు = అధిపుడవు అయినవాడవు; ఆద్య = మూల కారణమైన; పురుషుండవు = పరమపురుషుడు; అగు = అయినట్టి; నీవు = నీవు; బోధము = జ్ఞానము; చేన్ = చేత; మాయన్ = మాయను; అడఁతువు = అణచి వేస్తావు; నిశ్శ్రేయస = ముక్తి పొందిన {నిశ్రేయస్సు - (ఇక పొందవలసిన) శ్రేయస్సులు లేనిది, ముక్తి}; ఆత్మ = ఆత్మ; అందున్ = లో;
మాయ = మాయా; చేతన్ = కి; మునిఁగి = చిక్కుకొని; మను = జీవించు; వారలు = వారు; కున్ = కి; కృప = దయ; చేసి = చేసి; ధర్మ = ధర్మమునకు; ముఖ్య = ముఖ్యమైన; చిహ్నము = గుర్తు; అయిన = అయినట్టి; శుభము = శుభములను; చేయుదు = చేకూరుస్తావు; ఈవు = నీవు; సుజనులన్ = మంచివారిని; అవని = భూలోకము; లోన్ = లో; కావన్ = కాపాడుటకు; పుట్టుదువు = అవతరిస్తావు; జగన్నివాస = హరీ జగన్నివాసుడు - లోకాలకి నివాసమైనవాడు, విష్ణువు;
“పద్మాక్షా! భక్తజనరక్షాపరాయణా! శ్రీకృష్ణా! సంసారాగ్నిలో తపించిపోతున్న జనుల కష్టాన్ని పోగొట్టటం నీకు తప్ప మరొకరికి శక్యం కాదు. నీవు సాక్షాత్తూ సర్వేశ్వరుడవు. ఈ ముల్లోకాలకు అవ్వలివాడవు. ఆదిపురుషుడవైన ప్రభుడవు నీవు ముముక్షువులకు జ్ఞానాన్ని ప్రసాదించి మాయను మటుమాయం చేస్తావు. నీవు మాయాజాలంలో మునిగిన వారికి ధర్మసమ్మతమైన తేజస్సును అనుగ్రహిస్తావు. ఓ జగన్నివాసా! శిష్టరక్షణ కోసమే నీవీ జగత్తులో అవతరిస్తావు.
1-149-క.కంద పద్యము
ఇది యొక తేజము భూమియుఁ
జదలును దిక్కులును నిండి సర్వంకషమై
యెదురై వచ్చుచు నున్నది
విదితముగా నెఱుగఁ జెప్పవే దేవేశా!"
ఇది = ఇదిగో; ఒక = ఒక; తేజము = తేజోమయమైనది; భూమియున్ = భూమిని; చదలును = ఆకాశమును; దిక్కులును = దిక్కులను; నిండి = నిండిపోయి; సర్వంకషమై = అన్నిటిని ఒరుసుకు పోతూ; ఎదురై = ఎదురుగా; వచ్చుచున్ = వస్తూ; ఉన్నది = ఉంది; విదితముగాన్ = వివరముగా; ఎఱుగన్ = తెలియునట్లు; చెప్పవే = చెప్పుము; దేవేశా = దేతలలో శ్రేష్ఠుడా.
దేవాదిదేవా! వాసుదేవా! ఇదేదో ఒక ప్రచండమైన తేజస్సు, భూమ్యాకాశాలు, దిక్కులు వ్యాపించి ఎదురుగా వస్తున్నది. దీని స్వరూప మేమిటో నాకు తెలియ జెప్పు”
1-150-వ.వచనము
అనిన హరి యిట్లనియె.
అనినన్ = అనగా; హరి = హరి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
అర్జునుని మాటలు విని శ్రీకృష్ణు ఇలా పలికాడు-
1-151-శా.శార్దూల విక్రీడితము
"జిహ్మత్వంబునఁ బాఱి ద్రోణజుఁడు దుశ్శీలుండు ప్రాణేచ్ఛమై
బ్రహ్మాస్త్రం బదె యేసె; వచ్చెనిదె తద్బాణాగ్ని బీభత్స!; నీ
బ్రహ్మాస్త్రంబునఁ గాని దీని మరలింపన్ రాదు, సంహార మీ
బ్రహ్మాపత్య మెఱుంగఁ, డేయుము వడిన్ బ్రహ్మాస్త్రమున్ దీనిపై."
జిహ్మత్వంబునన్ = వక్రబుద్ధితో; పాఱి = పారిపోవు; ద్రోణజుఁడు = అశ్వత్థామ {ద్రోణజుడు - ద్రోణునికొడుకు, అశ్వత్థామ}; దుశ్శీలుండు = చెడ్డ శీలముగలవాడు; ప్రాణ = ప్రాణములమీది; ఇచ్ఛము = కోరిక; ఐ = కొరకు; బ్రహ్మాస్త్రంబు = బ్రహ్మాస్త్రము; అదె = అదిగో; ఏసెన్ = వేసెను; వచ్చెన్ = వస్తున్నది; ఇదె = ఇదిగో; తత్ = దాని; బాణ = బాణము యొక్క; అగ్ని = అగ్ని యొక్క; బీభత్స = అర్జునా {భీభత్సుడు - బీభత్సము (అతి క్రూరత్త్వము)గా యుద్ధము చేయువాడు, అర్జునుడు}; నీ = నీ; బ్రహ్మాస్త్రంబున్ = బ్రహ్మాస్త్రమువలన; కాని = తప్పించి; దీనిన్ = దీనిని; మరలింపన్ = మరలించుటకు; రాదు = వీలుకాదు; సంహారము = మరలించుట; ఈ = ఈ; బ్రహ్మాపత్యము = బ్రాహ్మణ వంశీయుడు; ఎఱుంగఁడు = ఎరుగడు; ఏయుము = వేయుము; వడిన్ = తొందరగా; బ్రహ్మాస్త్రమున్ = బ్రహ్మాస్త్రమును; దీని = దీని; పైన్ = మీద.
“అర్జునా! నిప్పులు చెరుగుతూ ఆ వచ్చేది బ్రహ్మాస్త్రం. దీనిని పిక్కబలంతో పారిపోతున్న కుటిలాత్ముడు, ధూర్తుడు అయిన అశ్వత్థామ తన ప్రాణం రక్షించుకోడానికి ప్రయోగించాడు. దీన్ని త్రిప్పి కొట్టటానికి నీ బ్రహ్మాస్త్రం తప్ప మరొక్కటి సమర్థం కాదు. బ్రాహ్మణయువకుడైన ఈ అశ్వత్థామకు బ్రహ్మాస్త్ర ప్రయోగం తప్ప ఉపసంహారం తెలియదు. ఆలస్యం చేయకుండా దీనిపై నీ బ్రహ్మాస్త్రం ప్రయోగించు.”
1-152-వ.వచనము
అనిన నర్జునుండు జలంబుల వార్చి, హరికిం బ్రదక్షిణంబు వచ్చి, ద్రోణనందనుం డేసిన బ్రహ్మాస్త్రంబు మీదఁ దన బ్రహ్మాస్త్రంబుఁ బ్రయోగించిన.
అనినన్ = అని ఆదేశించిన; అర్జునుండు = అర్జునుడు; జలంబులవార్చి = సంకల్పించుకొని; హరి = కృష్ణుని; కిన్ = కి; ప్రదక్షిణంబు = ప్రదక్షిణ; వచ్చి = చేసి; ద్రోణనందనుండు = ద్రోణుని కుమారుడు అశ్వత్థామ; ఏసిన = వేసినట్టి; బ్రహ్మాస్త్రంబు = బ్రహ్మాస్త్రము; మీదన్ = పైన; తన = తన యొక్క; బ్రహ్మాస్త్రంబున్ = బ్రహ్మాస్త్రమును; ప్రయోగించిన = ప్రయోగించగా;
వాసుదేవుని వచనాలు వినగానే అర్జునుడు ఆచమనం చేసి, కృష్ణునికి ప్రదక్షిణం చేసి, అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్ర్తం మీద తన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు.
1-153-మ.మత్తేభ విక్రీడితము
అవనివ్యోమము లందు నిండి తమలో నా రెండు బ్రహ్మాస్త్రముల్
రవివహ్నిద్యుతిఁ బోరుచుం ద్రిభువనత్రాసంబుఁ గావింపగా
వివశభ్రాంతి యుగాంతమో యని ప్రజల్ వీక్షింప నా వేళ మా
ధవు నాజ్ఞన్ విజయుండు సేసె విశిఖద్వంద్వోపసంహారమున్.
అవని = భూమి; వ్యోమములు = ఆకాశముల; అందున్ = లో; నిండి = నిండిపోయి; తమలోన = తమలోతాము; ఆ = ఆ; రెండు = రెండు; బ్రహ్మాస్త్రముల్ = బ్రహ్మాస్త్రములు; రవి = సూర్యుని; వహ్ని = అగ్ని; ద్యుతిన్ = కాంతి కలిగి; పోరుచున్ = పోరాడుతూ; త్రి = మూడు; భువన = లోకములకు; త్రాసంబున్ = భయము కలుగునట్లు; కావింపగా = చేయగా; వివశ = ఒడలు తెలియని; భ్రాంతిన్ = భ్రమతో; యుగ = యుగమునకు; అంతమో = అంతమేమో; అని = అనుకొనుచూ; ప్రజల్ = ప్రజలు; వీక్షింపన్ = చూస్తుండగా; ఆ = ఆ; వేళ = సమయములో; మాధవున్ = కృష్ణుని {మాధవుడు - మాధవి భర్త, విష్ణువు}; ఆజ్ఞన్ = ఆదేశము ప్రకారము; విజయుండు = అర్జునుడు; చేసెన్ = చేసెను; విశిఖ = బాణముల; ద్వంద్వ = ద్వయమును; ఉపసంహారమున్ = మరలించుట.
మిన్నూ మన్నూ ఏకం చేస్తూ ఆ బ్రహ్మాస్త్రాలు రెండూ, ఇద్దరు సూర్యులు లాగా, అగ్నిహోత్రులు లాగ పరస్పరం ఘోరంగా పోరు సాగించాయి. అది చూసి భయంతో ముల్లోకాలూ కంపించాయి. ప్రళయకాలమేమోనని ప్రజలంతా భయభ్రాంతులతో పరికింపసాగారు. ఇదంతా శ్రీకృష్ణుడు చూచాడు. అర్జునునికి ఆజ్ఞ ఇచ్చాడు. బ్రహ్మాస్త్రాలు రెండింటినీ పార్థుడు ఉపసంహరించాడు.
1-154-వ.వచనము
ఇట్లస్త్రద్వయంబు నుపసంహరించి, ధనంజయుండు ద్రోణనందనుం గూడ నరిగి తఱిమి పట్టుకొని, రోషారుణితలోచనుండై యాజ్ఞికుండు రజ్జువునం బశువు గట్టినఁ చందంబున బంధించి శిబిరంబు కడకుం గొనిచని హింసింతు నని తిగిచినం జూచి హరి యిట్లనియె.
ఇట్లు = ఈ విధముగా; అస్త్ర = అస్త్రములు; ద్వయంబున్ = రెండింటిన; ఉపసంహరించి = మరల్చి; ధనంజయుండు = అర్జునుడు; ద్రోణనందనున్ = ద్రోణుని పుత్రుని / అశ్వత్థామ; కూడ = వెనుక; అరిగి = వెళ్లి; తఱిమి = తరిమి; పట్టుకొని = పట్టుకొని; రోష = రోషముచే; అరుణిత = ఎఱ్ఱబారిన; లోచనుండు = కళ్ళు కలిగిన వాడు; ఐ = అయి; యాజ్ఞికుండు = యజ్ఞము చేయు వాడు; రజ్జువునన్ = తాడుతో; పశువున్ = పశువును; కట్టిన = కట్టిన; చందంబునన్ = విధముగా; బంధించి = కట్టి; శిబిరంబు = గుడారము; కడ = దగ్గర; కున్ = కు; కొని = తీసుకొని; చని = వెళ్ళి; హింసింతును = సంహరించెదను; అని = అని; తిగిచినన్ = లాక్కొస్తుండగా; చూచి = చూసి; హరి = కృష్ణుడు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = అన్నాడు.
ఈ విధంగా అస్త్రాలు రెండింటిని ఉపసంహరించిన అనంతరం, పార్థుడు అశ్వత్థామను వెంటాడి పట్టుకొన్నాడు; యాజ్ఞికుడు యజ్ఞంలో పశువును బంధించినట్లు, కోపంతో ఎఱ్ఱబడ్డ కళ్ళతో అర్జునుడు, అతణ్ణి త్రాళ్లతో బంధించాడు; అలా అర్జునుడు “శిబిరానికి లాగికొని వెళ్ళి ఈ ధూర్తుణ్ణి చిత్రహింస పెడతా” నని, అశ్వత్తామను ఈడ్చుకుని రావడం చూసి, అధికమైన క్రోధంతో కృష్ణుడు ఇలా అన్నాడు-
1-155-ఉ.ఉత్పలమాల
"మాఱుపడంగలేని యసమర్థుల సుప్తుల నస్త్రవిద్యలం
దేఱని పిన్న పాఁపల వధించె నిశీథము నందుఁ గ్రూరుఁడై
పాఱుఁడె వీఁడు పాతకుఁడు, ప్రాణభయంబున వెచ్చనూర్చుచుం
బాఱెడి వీని గావుము కృపామతి నర్జున! పాపవర్జనా!
మాఱు = తిరుగ; పడంగ = పడుటకు శక్తి; లేని = లేనట్టి; అసమర్థుల = సమర్థత లేనివారిని; సుప్తుల = నిద్రంచినవారిని; అస్త్ర = అస్త్ర ప్రయోగ; విద్యలన్ = విద్యలందు; తేఱని = ఆరితేరని; పిన్న = చిన్న; పాఁపలన్ = పిల్లలను; వధించెన్ = చంపెను; నిశీథము = చీకటి రాత్రి; అందున్ = లో; క్రూరుఁడు = క్రూరమైన పనులు చేయువాడు; ఐ = అయి; పాఱుఁడె = బ్రాహ్మణుడా; వీఁడు = ఇతడు; పాతకుఁడు = మహాపాపము చేసినవాడు; ప్రాణ = ప్రాణములమీద; భయంబునన్ = భయముతో; వెచ్చన్ = వేడి యైన; ఊర్చుచున్ = నిట్టూర్పులు నిగిడ్చుచు; పాఱెడిన్ = పారిపోవుచున్నాడు; వీనిన్ = ఇతనిని; కావుము = కాపాడుము; కృపామతిన్ = దయాబుద్ధితో; అర్జున = అర్జునుడా; పాప = పాపములను; వర్జనా = విడిచినవాడా.
“పరమ దుర్మార్గుడిలా తనను ఎదిరించే శక్తి లేని వారు, గాఢనిద్రలో ఉన్నవారు, అస్త్రవిద్యలలో నేర్పులేనివారు, చిన్నపిల్లలు అని కూడా చూడకుండా రాత్రి చీకటిలో చంపేసాడు. వీడు బ్రాహ్మణుడా కాదు, పాపిష్ఠివాడు. కానీ పార్థా! నీవు పాపాలను వదలగొట్టే వీరుడవు, వీడేమో ప్రాణాల మీది భయంతో ఒగర్చుకుంటూ పారిపోతున్నాడు కనుక క్షమించి వదలిపెట్టు.
1-156-చ.చంపకమాల
వెఱచినవాని, దైన్యమున వేఁదుఱు నొందినవాని, నిద్ర మై
మఱచినవాని, సౌఖ్యమున మద్యము ద్రావినవాని, భగ్నుడై
పఱచినవాని, సాధు జడభావమువానిని, గావు మంచు వా
చఱచినవానిఁ, గామినులఁ జంపుట ధర్మము గాదు, ఫల్గునా!
వెఱచిన = భయపడిన; వానిన్ = వాడిని; దైన్యమున = దీనత్వముతో; వేఁదుఱున్ = గాబరా; ఒందిన = పొందినట్టి; వానిన్ = వాడిని; నిద్రన్ = నిద్రలో; మై = మేను / ఒళ్ళు; మఱచిన = తెలియకుండా ఉన్న; వానిన్ = వాడిని; సౌఖ్యమున = సుఖంగా; మద్యము = మత్తు పానీయము; త్రావిన = తాగినట్టి; వానిన్ = వాడిని; భగ్నుడు = భంగపడినవాడు; ఐ = అయి; పఱచిన = పారిపోయే; వానిన్ = వాడిని; సాధు = మంచివానిని; జడ = జడత్వ / మందబుద్ధి; భావము = భావముగల; వానిన్ = వాడిని; కావుము = కాపాడుము; అంచున్ = అనుచు; వాచఱచిన = మొరపెట్టుకొనే; వానిన్ = వాడిని; కామినులన్ = స్త్రీలను; చంపుట = సంహరించుట; ధర్మము = ధర్మము; కాదు = కాదు; ఫల్గునా = అర్జునా.
ఫల్గుణా! భయపడిన వాడిని, దిగులుతో మతిభ్రమించిన వాడిని, నిద్రపోయిన వాడిని, మద్యపానంచేసి మైమరచిన వాడిని, పరాజితుడై పారిపోయే వాడిని, కదలక మెదలక పడి ఉన్నవాడిని, రక్షించమని వేడినవాడిని, ఆడవారిని చంపటం ధర్మం కాదు గదా.
1-157-శా.శార్దూల విక్రీడితము
స్వప్రాణంబుల నెవ్వఁడేనిఁ, గరుణాసంగంబు సాలించి య
న్యప్రాణంబులచేత రక్షణము సేయన్ వాఁ, డధోలోక దుః
ఖప్రాప్తుండగురాజదండమున సత్కల్యాణుఁ డౌ, నైన నీ
విప్రున్ దండితుఁ జేయ నేటికి మహావిభ్రాంతిచే నుండఁగన్?"
స్వ = తనయొక్క; ప్రాణంబులన్ = ప్రాణములకొరకు; ఎవ్వఁడేనిన్ = ఎవడైనా; కరుణ = దయయొక్క; సంగంబు = స్పర్శ; చాలించి = విడిచిపెట్టి; అన్య = ఇతరులను; ప్రాణంబుల = ప్రాణముల; చేతన్ = వలన; రక్షణము = కాపాడుట; సేయన్ = చేయని; వాఁడు = వాడు; అధః = క్రింది / నరక; లోక = లోకములలోని; దుఃఖ = దుఃఖములను; ప్రాప్తుండు = పొందువాడు; అగున్ = అగును; రాజ = రాజుయొక్క; దండమున = శిక్షవలన; సత్ = మంచి; కల్యాణుఁడు = శుభమైన మార్గము పట్టినవాడు; ఔను = అగును; ఐనన్ = ఐన; ఈ = ఈ; విప్రున్ = బ్రాహ్మణుని; దండితున్ = దండింపబడినవానిని; చేయన్ = చేయుట; ఏటి = ఎందుల; కిన్ = కు; మహా = మిక్కిలి; విభ్రాంతి = విభ్రాంతి; చేన్ = లో; ఉండఁగన్ = ఉండగా.
ఎవడైతే కనికరం లేకుండా తన ప్రాణాలు కాపాడుకోవటం కోసం పరుల ప్రాణులు తీస్తాడో, అటువంటి దుర్మార్గుడు నరకలోకంలో నానా దుఃఖాలూ అనుభవిస్తాడు; అయితే రాజు వాణ్ణి శిక్షిస్తే వాడి పాపం నశించి, వాడికి శ్రేయస్సు లభిస్తుంది; కాని ఈ అశ్వత్థామ భయభ్రాంతుడై యున్నాడు గదా, కఠినంగా శిక్షించకు.”
1-158-వ.వచనము
అని యివ్విధంబునఁ గృష్ణుఁ డానతిచ్చిన బ్రాహ్మణుండు కృతాపరాధుండయ్యు వధ్యుండు గాఁడను ధర్మంబుఁ దలఁచి చంపక ద్రుపదరాజపుత్త్రికిం దన చేసిన ప్రతిజ్ఞం దలంచి బద్ధుండైన గురునందనుందోడ్కొని కృష్ణుండు సారథ్యంబు సేయ శిబిరంబుకడకు వచ్చి.
అని = అని; ఈ = ఈ; విధంబునన్ = విధముగా; కృష్ణుఁడు = కృష్ణుడు; ఆనతి = ఆజ్ఞ; ఇచ్చినన్ = ఇవ్వగా; బ్రాహ్మణుండు = బ్రాహ్మణుడు; కృత = చేసిన; అపరాధుండు = అపరాధము చేసినవాడు; అయ్యు = అయినప్పటికిని; వధ్యుండు = చంప దగినవాడు; కాఁడు = కాడు; అను = అను; ధర్మంబున్ = ధర్మమును; తలఁచి = తలచుకొని; చంపక = చంపకుండా; ద్రుపదరాజపుత్త్రిక = ద్రౌపది; కిన్ = కి; తన = తను; చేసిన = చేసినట్టి; ప్రతిజ్ఞన్ = వాగ్దానమును; తలంచి = జ్ఞాపకము చేసుకొని; బద్ధుండైన = బంధింపడిన; గురునందనున్ = అశ్వత్థామని {గురునందనుడు - గురువు (ద్రోణుని) కొడుకు, అశ్వత్థామ}; తోడున్ = తనతోకూడా; కొని = తీసుకొని వెళ్ళి; కృష్ణుండు = కృష్ణుడు; సారథ్యంబు = రథము నడపుట; సేయన్ = చేయగా; శిబిరంబు = గుడారము; కడ = దగ్గర; కున్ = కు; వచ్చి = వచ్చి.
ఈ విధంగా కృష్ణుడు వివరించగా”అపరాధం చేసినప్పటికిని బ్రాహ్మణుణ్ణి చంపకూడదు" అనే ధర్మాన్ని కూడా స్మరించి, అర్జునుడు అశ్వత్థామను సంహరించలేదు. పాంచాల రాజపుత్రి సమక్షంలో తాను పలికిన ప్రతిజ్ఞ పాటించడం కోసం కాళ్లూ చేతులూ కట్టేసి అశ్వత్థామను లాక్కునివచ్చి ఎత్తి రథం పైన పడవేశాడు. కృష్ణుడు అశ్వాలను అదలించాడు. రథం శిబిరం వద్దకు చేరింది.