..
భాస్కరోదయ కాలొయం గతా భగవతీ నిశా
అసౌ సుకృష్ణో విహగః కోకిలస్తాత కూజతి
.
నాయనా పూజ్యురాలైన రాత్రి గడిచినది సూర్యోదయ సమయము ఆసన్నమైనది చాలా నల్లనియైన పక్షి కోకిల కూయుచున్నది.(పూజనీయురాలైన రాత్రి అట ,వందే వాల్మీకి కోకిలం).
.
రామచంద్రుడు నిదుర లేచాడు ఆయనకు కోకిలకూతలు,నెమళ్లక్రేంకారాలు సుప్రభాతగీతికలయి మేల్కొలుపులు పాడినాయి.( ప్రకృతి ఏర్పాటు చేసిన వంది మాగధులు వీరు).
.
లేచిన వెంటనే ఆలస్యం చేయకుండా తాము చేయవలసిన పనిని లక్ష్మణునకు చెప్పాడు. వెంటనే గంగ దాటాలి .
.
లక్ష్మణుడు ఆ వార్త గుహుడికి చేరవేశాడు ! హుటాహుటిన గుహుడప్పుడు దృఢమైనది ,చక్కగా అలంకరింపబడినది,సమర్ధులైన నడుపువారు కలది,అయిన నావను రేవులో సిద్దం చేసి ,రాముని వద్ద వినమ్రుడై నిలుచున్నాడు.
.
అప్పుడు రాముడు ఆనందంగా మిత్రమా మమ్ము ఆవలి ఒడ్డుకు చేర్పించవయ్యా అని పలికాడు.
.
ఇంతలో సుమంత్రుడు వచ్చి రామా ఏమి ఆజ్ఞ అన్నట్లుగా చేతులు మోడ్చి నిలుచున్నాడు.
.
రాముడు తన కుడి చేతితో సుమంత్రుని స్పృశిస్తూ ఇక నీవు తిరిగి వెళ్ళి రాజును కనిపెట్టుకొని ఉండుము అని పలికాడు.
.
అప్పటిదాకా రాముడితో కలిసి వున్న సుమంత్రుడు తిరిగి వెళ్ళాల్సి వచ్చేటప్పటికి కరిగి నీరైనాడు ...రామా ! నీ కష్టాలు చూస్తుంటే ఋజుత్వానికి గానీ,బ్రహ్మచర్యానికి గానీ,వేదాధ్యయనమునకు గానీ, మృదుత్వానికిగానీ ఫలం లేదు అనిపిస్తున్నది !
.
నీ కష్టాలు భరించగలగటం నీవలననే సాధ్యం లోకంలో ఏ ఒక్క పురుషుడి వల్లకూడా కాదు సుమా ! ( ఈ మూడు రోజులకే ఇట్లా అంటున్నాడీయన ,ఇక ముందు ఏమి కానున్నదో ఈయనకు తెలియదు).
.
మేమెంత దురదృష్టవంతులము! ! నీకు దూరమై పాపాత్మురాలైన ఆ కైక వశులమై ఇక బ్రతుకీడ్చాలి.అని పరిపరివిధాలుగా దుఃఖిస్తున్న సుమంత్రుని చూసి రాముడు ,సుమంత్రా ఇన్ని వేల సంవత్సరాలనుండీ రాజులు పరిపాలిస్తున్నారు రాజాజ్ఞ అనుల్లంఘనీయము ,అప్రతిహతము కదా! అయినా అడవిలో జీవించవలసినందులకు నేనుగానీ సీతగానీ లక్ష్మణుడుగానీ ఏ మాత్రము బాధపడటంలేదు.పద్నాలుగేండ్లు ఎన్నాళ్ళలో తిరిగి వస్తాయి చెప్పు ,మేము ఇలా వెళ్లి అలా తిరిగి వస్తాము. అయోధ్యలో మరల మీ అందరితో కలిసి ఆనందంగా కాలం గడుపగలము. కావున నీవు విచారింపకుము అని పలికి అయోధ్యలో అందరికీ పేరుపేరునా తన నమస్కారములు తెలియచేయమన్నాడు.
.
రామా నిన్ను విడిచి నేను వెళ్ళలేను ,నిన్ను విడిచి ఉండలేనయ్యా! నీ భక్తుడను,నీ భృత్యుడను,మర్యాద కాపాడువాడను నన్ను విడువకయ్యా, నీ తోటే ఉంటాను నాకు అనుజ్ఞ ఇవ్వు అని సుమంత్రుడు రాముని వేడుకుంటున్నాడు.
.
సుమంత్రా నీవు తిరిగి వెళ్ళకపోతే మా అమ్మ కైకేయికి నేను అరణ్యానికి వెళ్ళాననే నమ్మకము కలిగేదెట్లా? అందుకోసమైనా నీవు తిరిగి వెళ్లాలి.అని సుమంత్రుని సమాధాన పరిచినాడు.
.
గుహుని వైపు తిరిగి మిత్రమా మర్రిపాలు తెప్పించయ్యా జటాధారిని కావాలి నేను ! అని పలికాడు.
.
రామాయణమ్..77
..
గుహుడు తెప్పించిన మర్రిపాలు జుట్టుకు తను రాసుకొని తమ్ముడు లక్ష్మణునికి తానే స్వయంగా రాశాడు రాముడు.
నార చీరలుకట్టి జటలు ధరించిన సోదరులిరువురూ ఋషులలాగా శోభిల్లారు.
.
మిత్రమా గుహా ! సైన్యమూ,ధనాగారము,దుర్గము.(.Armed forces,Treasury,Defence systems) ఈ మూడిటి విషయములో ఏ మాత్రము ఏమరుపాటు లేకుండా ఉండు .రాజ్యము పరిపాలించుట చాల కష్టమని పెద్దలు చెపుతున్నారు ,అని రాముడు పలికి అతనిని వీడుకొల్పి నావవద్దకు వెళ్లాడు.
.
లక్ష్మణుడు ముందుగా సీతమ్మను ఎక్కించి,తాను ఎక్కాడు ఆ తరువాత రాముడు నావ ఎక్కి కూర్చున్నపిదప గుహుడు నావను అవతలి ఒడ్డుకు చేర్చమని ఆజ్ఞాపించాడు.
.
రాముడు నావెక్కిన వెంటనే తన శ్రేయస్సును కోరుతూ నావెక్కేటప్పుడు జపించే మంత్రాన్ని జపించాడు .
.
నావ గంగానది మధ్యకు చేరింది!
.
అప్పుడు సీతమ్మ గంగమ్మను ప్రార్దించింది .ఆవిడకు మొక్కుకుంది.
అమ్మా ! వనవాసము నుండి మేము క్షేమముగా తిరిగి వచ్చిన పిదప నిన్నుకొలుస్తానమ్మా!
.
నీ సంతోషం కోసం బ్రాహ్మణులకు లక్షలగోవులు,అన్నవస్త్రాలు ఇస్తాను
నేను నియమముతో నీకు వేయి కుండ లతో కల్లు,మాంసాహారము, సమర్పించుకుంటానమ్మా!
నీ ఒడ్డున ఉన్న సమస్తదేవతలను పూజించుకుంటాను.
.
ఇలా ఆవిడ మొక్కులు మొక్కుకుంటూ ఉండగనే నావ దక్షిణపు ఒడ్డును చేరుకుంది.
.
రాముడు నావ దిగాడు మెల్లగా సీతమ్మకు చేయి అందించి సుతారంగా పట్టుకొని దింపాడు ,ఆతరువాత లక్ష్మణుడు కూడా దిగాడు.
.
అది నిర్జన ప్రదేశము ! లక్ష్మణుడితో కూడి సీతారాములు నడక మొదలు పెట్టారు. ముందు లక్ష్మణుడు ఆవెనుక సీత వారిరువురినీ కాచుకుంటూ వెనుక రామచంద్రుడు.సీతమ్మ భద్రంగా రామలక్ష్మణుల మధ్యలో నడువసాగింది.
.
నడుస్తూ మాట్లాడు కుంటున్నారు.వనవాసంలో కష్టాలేమిటో ఇకనుంచీ సీతకు బాగా అర్ధమవుతయిలే( రావద్దంటే పట్టుబట్టి భర్తమీద అలిగి మరీ వచ్చిందిగా సీతమ్మ,ఇహ రామయ్యమొదలుపెట్టాడు ఆవిడకు కష్టాలగురించి చెప్పటం ! ఇది దెప్పిపొడుపేనేమో)..ఏ పని అయినా మన చేయిదాటిపోతే దానిని సరి చేయటం చాలా కష్టం ! ( నిజమే కదా).
.
ఈ వనంలో జనులుగానీ ,పొలాలుగానీ,తోటలుగానీ ఉండవు !మిట్టపల్లాలు,లోతైన లోయలు ఉంటాయి అట్లాంటి వనంలోకి సీత ఈనాడు ప్రవేశిస్తున్నది.
.
నడిచీ,నడిచీ బాగా ఆకలి వేస్తున్నది మువ్వురికీ
అప్పుడు లక్ష్మణుడు సేకరించి తెచ్చిన ఆహారాన్ని భుజించి రాత్రి విశ్రమించటానికి ఒక చక్కటి చెట్టు మొదలు చూసుకొని దాని క్రిందకు చేరారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి