..
రాజు పెద్దకొడుకును అడవికి వెళ్లమన్నాడట ! చిన్న భార్యమీది మోజుతో ఈ దారుణానికి ఒడిగట్టాడట! ఎంత నిర్దయుడీ రాజు ! ఎంత తెలివిమాలినవాడీయన !.
.
రాముడిని అరణ్యాలకు పంపాలన్న కైక కుతంత్రము ,దశరధుని ఆజ్ఞ, దావానలంలా వ్యాపించింది నగరమంతా ! .
.
ఎవరికి వారు తమకే అన్యాయం జరుగుతున్నట్లుగా భావించారు ! .
.
కొడుకు గుణవంతుడు కాకపోయినా సరే!
వాడు కళ్ళెదురుగుండా ఉంటే చాలని సర్దుకుపోతారే లోకంలోని తల్లితండ్రులు !
.
మరి దశరథుడికి ఏమయ్యింది ! సకలగుణాభిరాముడు,మర్యాదా పురుషోత్తముడు,సాక్షాత్తూ ధర్మస్వరూపుడు ,దయార్ద్రహృదయుడయిన రాముని అడవులకు పంపటమా?.....పురప్రజలు అందరూ ఇలా మాట్లాడుకుంటూనే ఉన్నారు......
.
కదిలాడు కోదండపాణి భార్యాసమేతుడై ,తమ్ముడు ముందు నడుస్తుండగా తండ్రికి మరొక్కమారు చెప్పి వెడదామని పాదచారియై తన భవనం నుండి బయల్వెడలాడు.
.
అయోధ్యా నగరమంతా సౌధాగ్రాలమీదనే ఉన్నది !
.
ప్రజలందరూ వీధులలోకి చేరారు !
ఇసుకవేస్తే రాలటంలేదు ! అందరి కన్నులు ధారాపాతంగా వర్షిస్తున్నాయి.
.
జనం జనం జనం ఎటు చూసినా జనమే వారి రోదనమే! అందరి చూపులూ
సీతారామలక్ష్మణులున్నవైపే.
.
కదిలితే సేవకులు,మెదిలితే పరిచారకులు ,నగరంలో నడవటమంటే ఏమో వారికి తెలియదు !
సకలరాజలాంఛనాలతో వెడలే రాజకుమారుడు ,సుకుమారుడు నేడు ఒంటరియై కాలినడకన తండ్రిగృహానికి బయలుదేరాడు ! .
.
సీతమ్మ అంటే అలా ఉంటుంది ! ఇలా ఉంటుంది అని కధలుకధలుగా చెప్పుకోవటమే కానీ ఎవరూ ఎన్నడూ చూడలేదు.
.
అదిగదిగో సీతమ్మ్ ! అబ్బబ్బ బంగారుతల్లి ! ఎంత చక్కనిది ! ఏడుమల్లెలెత్తు ! ఎండకన్నెరుగని ఇల్లాలు నేడిలా భర్తతో కలిసి అడుగులో అడుగులు వేస్తూ అడవికి బయలుదేరింది ! .
.
రాముడు లేని ఈ అయోధ్య మనకెందుకు ! రాముడెక్కడుంటే అదే మన నివాసం!
అది కొండయినా ! పెనుబండయినా !
కడలైనా కారడవైనా! ..
.
ఈ కొంపలు పాడుబెట్టేద్దాం ! ఎలుకలు పందికొక్కులు తిరుగాడుతూ భూతాలకు నిలయమైపాడుబడ్డ అయోధ్యనే ఏలుకొంటాడు భరతుడు ,మనమెందుకుండాలిక్కడ?
.
అందరిమనసులో ఒకటే నిశ్చయం ! రాముడే మనకేడుగడ!రామునితోటే జీవనం ! రాముడెక్కడుంటే మనమక్కడే !
.
మానవీయజీవనానికి రాముడే మూలం ! మనమంత కొమ్మలం రెమ్మలం !.
.
మూలం హ్యేషమనుష్యాణాం ధర్మసారో మహాద్యుతిః
పుష్పం ఫలం చ పత్రంచ శాఖాశ్చాస్యేతరే జనాః
.
రాముడు ధర్మమే సారముగాగలవాడు ! గొప్పకాంతికలవాడు .ఈతడే మనుష్యులకు "మొదలు".ఇతర జనులందరూ ఈ చెట్టు మొదలుతో సంబంధముగల పుష్పములు ,ఫలములు,పత్రములు ,శాఖలు..
.
నడచి నడచి తండ్రిసౌధానికి చేరుకొని ద్వారపాలకుని పిలిచి తమ ఆగమన వార్త రాజుకు తెలుపమన్నాడు రాఘవుడు .
.
జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....
*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి