15, సెప్టెంబర్ 2020, మంగళవారం

*ధార్మికగీత - 21*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
                       
                                     *****
          *శ్లో:- మాతా శత్రు: పితా వైరీ ౹*
                 *యేన బాలో న పాఠితః ౹*
                 *న గర్భ చ్యుతి మాత్రేణ ౹*
                 *పుత్రో భవతి పండితః ౹౹*
                                       *****
*భా:- ప్రతి తల్లి ,తండ్రి తమను పున్నామ నరకము నుండి కాపాడగల వంశోద్ధారకుడు పుట్టాలని కలలు కంటారు. పుత్రుణ్ణి కంటారు. అతిగారాబము, నిరక్షరాస్యత, పేదరికము, నిరాశ్రయము, అండదండల లేమి, ఉదాసీనత ఇత్యాది కారణాలవల్ల ఆ బిడ్డకు చదువు సంధ్యలు చెప్పించకుండా, గాలికి వదిలేస్తే ఆ తల్లి, ఆ తండ్రి తమ కుమారునికి బద్ధ శత్రువులు అవుతారు. వాడు జీవితాంతం ప్రత్యక్ష నరకం ఇక్కడే చూపిస్తూ ఉంటాడు. సామ దాన భేద దండోపాయాలచే అతణ్ణి ప్రయోజకునిగా చేయడం తల్లిదండ్రుల విధి. వాడే తీర్చిదిద్దపడతాడనేది పెద్ద తప్పిదమే. ఎలాగంటే తల్లి గర్భం నుండి ఊడిపడినంత మాత్రాన ఏ పుత్రుడు పండితుడు కాడు. కాలేడు. ఆహారము, ఆహార్యము, క్రమశిక్షణ, దీక్ష, దక్షత, శ్రద్ధ, ఆసక్తి, నిరంతర కృషి, మార్గదర్శనము, గురుశుశ్రూష, దైవకృప ఇవన్నీ తోడైతేనే ఆ పుత్రుడు నిజంగా పండితుడై రాణించ గలడు. వంశాన్ని ఉద్ధరించగలడు. లోకాన్నితన సేవలతో అలరించగలడు. "పుత్రాత్ ఇచ్ఛేత్ పరాజయం" అనే న్యాయానికి పాత్రుడై పుత్రోత్సాహం కలిగిస్తాడు. ఉదాసీనంగా వదిలేస్తే, విద్యాగంధం లేక, సప్తవ్యసన బాధితుడై "పండితపుత్రుడు" అవడం ముమ్మాటికి ఖాయమని సారాంశము.*
                                    *****
                     *సమర్పణ : పీసపాటి*
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

కామెంట్‌లు లేవు: