దినరాజు కనరాక దిగులుతో దీనలై
దిక్కులే యెదలోన స్రుక్కుచుండ
భూజగణమ్ములే ఓజమ్ముగోల్పోయి
తలవంచి కదలకే కలతనంద
ద్విజబృందములె స్వీయవిభవమ్ముచాటించు
కూజితమ్ములు మాని గూళ్ళనుండ
సుమబాణతతియె విసుగుచెందుచును రాలి
భూమిపైబడి యేడ్చి పొర్లుచుండ
ప్రకృతి పలుకు ముత్యముల సంప్రీతిలేక
మౌనినా ధ్యానముద్రను మనుచునుండ
సుప్త చైతన్య సుస్థితి క్షోణిపొంద
వర్ష మధికమై పోద్రోచె హర్షమెల్ల.
ఉప్పొంగి ప్రవహించు నుత్సాహయుక్తలై
నదులె నీటికళను కదలుచుండ
తపియించి తపియించి ఉపనదీబృందముల్
జీవనదుల సాటి చేవనంద
తటములే తటులతో తటపటాయింపక
స్నేహానుబంధమ్ము నెరపుచుండ
తటములే దాటుచున్ తమగొప్పచాటింప
ఎదల తాపత్రయమ్మున నదులెవెలుగ
తీరవాసుల గుండెల వారిభీతి
రైళ్ళు పరుగెత్తి నిద్రలే రాకయుండ
నీరదమ్ముల వారిద నిరతిపెరిగి
వర్షహర్షమ్ము శూన్యమై వసుధమూల్గె.
రాయప్రోలు సీతారామశర్మ భీమవరం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి