కాశీ యాత్ర (రెండవ భాగము)
కాశీలో కాలుమోపటం: మా విమానం రాత్రి 10 గంటలకు కాశీ చేరుకుంది. హైదరాబాదు నుండి 1035 కిలోమీటరులు ప్రయాణించి మేము కాశీలో అడుగిడాము . మా వెంట తినుబండారాలు అంటే పులిహోర, ఇతరత్రా పదార్ధాలు ఏవి తీసుకొని వెళ్లనందున మాకు దిగగానే ఆకలి వేసింది. ఒక టాక్సీ మాట్లాడుకొని సైకిలు బాబా ఆశ్రమానికి తీసుకొని వెళ్ళమని అడిగాము. నిజానికి మేము బ్రాహ్మణ కరివేన సత్రంలో బస చేద్దామని అనుకున్నాము. కాగా ఆ సత్రం పేరు చెపితే టాక్సీవాళ్ళు తెలియదనటంతో దానికి సమీపంలోని సైకిలు బాబా ఆశ్రమం అని చెప్పాము. ఒక అర్ధగంటలో బెంగాలీ టోలి (బెంగాలు ప్రైమరీ స్కూల్ ) వద్ద రోడ్డు మీద మా కారు ఆపి ఈ సందులోంచి వెళ్ళండి సందులోకి కారు రాదనీ చెప్పాడు డ్రైవరు. టాక్సీ డ్రైవరుకు 750 రూపాయలు చెల్లించి తినటానికి ఏదైనా దొరుకుతుందా అని అక్కడ చుస్తే ఒక రోడ్డుప్రక్క దోశ బండి కనిపించింది. బ్రతుకు జీవుడా అని తలా ఒక దోశ తిన్నాము. దాని రుచి కూడా మాకు తెలియటెడు. బండివాడు దోశ లను తయారు చేస్తుంటే నేను ఆ సందులో కొంతదూరం నడచి విచారించ ప్రయత్నించాను. సందులో నాకు ఒక ముగ్గురు మనుషులు కనిపించారు అందులో ఇద్దరు పెద్దవారు ఒక బాలిక వున్నది. వాళ్ళు తెలుగులో మాట్లాడుకోవటం నాకు ఆశ్చర్యం కలుగచేసింది. నేను తెలుగులో ఇక్కడ కరువేనా సత్రం ఎక్కడో మీకు తేలుసా అని అడిగాను. ఈ సందులోంచి చివర వరకు వెళ్ళండి అని అన్నారు. ఆ సందు ఒక 5-6 అడుగుల వెడల్పు కన్నాలేదు. ఇంకా ముందుకు చాలా ఇరుకుగా వుంది. కాశీలో సందులు చిన్నగా ఉంటాయి అని అప్పుడు నాకు తెలిసింది. విద్యుత్ దీప కాంతితో సందు దేదీప్యమానంగా వుంది. నేను వచ్చి మా వాళ్లతో పాటు ఒక దోశ తిన్నాను. తరువాత ఎవరి బ్యాగు వాళ్ళం తగిలించుకొని సందులో ప్రయాణం అయ్యాము. నడచి, నడచి, నడచి చూసుకుంటూ వెళితే మాకు అఖిల భారతీయ బ్రాహ్మణ కరువేనా సత్రం కనిపించింది. అది చూడటానికి ఒక చిన్న ఇల్లుమాదిరిగా వుంది. మేము లోపలి వెళ్లగా అక్కడ ఒకరు వున్నారు. మాకు రూము కావలి అని అడిగితె రెండవ అంతస్తులో ఎసి రూము వుంది రోజుకు కిరాయి 1200 అని చెప్పి అతని హెల్పరుకు మాకు రూము చూపించమని చెప్పాడు.
మీరు డబ్బులు రేపు చెల్లించండి ముందు గదిలోకి వెళ్లి విశ్రాన్తి తీసుకోండని ఆయన అన్నారు. అయన పేరు సుధాకర్ అని చెప్పారు. మేము కాలాతీతం చేయకుండా రూముకు వెళ్ళాము. అక్కడి మెట్లు చాలా ఇరుకుగా ఎత్తుగా వున్నాయి. ఎలాగో ఆలా మెట్లు ఎక్కి రూములోకి వెళ్ళాము. మేము వెంట తెచ్చుకున్న నీళ్ల బాటిలులోని నీళ్లుతాగి బ్రతుకు జీవుడా అని ప్రక్కమీద మేను వాల్చాము. నేను ఉదయం 3 గంటలకు లేచి దంతధావన చేసి తరువాత స్నానం చేసే సరికి దాదాపు 4 గంటలు కావచ్చింది. నా శ్రీమతిని, కుమారుడిని లేపి వాళ్ళను కూడా త్వరగా కాలకృత్యాలు తీర్చుకోమని చెప్పాను . మేము ముగ్గురం ఉదయం 5 గంటలకు తయారు అయి రూము బయటకు వచ్చాము. మాకు దోవ క్రొత్త నా కుమారుడు గూగులు మ్యాప్స్ పెట్టి మమ్మలను రోడ్డు మీదకు మార్గదర్శనం చేసాడు. ఒక 15 నిముషాలు నడచి మేము రోడ్డు మీదకు చేరాము. అక్కడ ఒక ఆటో లో మాకు కాలబైరవ డైవ దర్శనం చేయించి తరువాత విశ్వనాధుని ఆలయ దర్శనం చేయించవలెనని అడుగగా అతను నేను కాలాభిరవ దేవాలయానికి తీసుకొని వెళ్లి మిమ్ములను నంది సర్కిల్ దగ్గర దింపుతాను నాకు 300 రూపాయలు ఇవ్వాలని అన్నాడు. సరేనాని ఆటోలో కూర్చున్నాము. దాదాపు ఒక 3 కిలోమీటర్లు తీసుకొని వెళ్లి ఒక సందులో ఆటో ఆపి మీరు ఇటునుంచి వెళ్లి దైవదర్శనం చేసుకొని రండి నేను ఇక్కడే ఉంటానని అన్నాడు. కాలభిరావుని దేవాలయంలో రద్దీ ఎక్కువగా లేదు మేము ఒక 10-15 నిముషాలలో స్వామి దర్శనం చేసుకొని ఆటో చేరుకున్నాము. ఆటో ఒక 3,4 నిముషాలలో నంది సర్కిల్ చేరింది. నంది సర్కిల్లో రెండు విపుల మాత్రమే వాహనాలను అనుమతిస్తారు రెండు రోడ్లలో అనుమతించరు. అందులో ఒక రోడ్డు మీద కొంత దూరం వెళ్లిన తరువాత మనం విశ్వనాధ ఆలయం వెళ్లే గేట్లు ఉంటాయి. గేటు నెం 4 క్రొత్తగా నిర్మించారని విన్నాము. మేము గేటు నెంబరు 2 నుండి లోపలి వెళ్ళాము. లోపలి మార్గం చాలా ఇరుకుగా ఉంటుంది. ఒక ముగ్గురు ప్రక్క ప్రక్కగా ఉంటే అటు గోడ ఇటు గోడ ఆనుతుంది కొన్ని చోట్ల ఇంకా ఇరుకుగా కూడా ఉంటుంది. అందులోంచి అక్కడి వారు మోటారు సైకిళ్ళు, స్కూటర్లు నడుపుతూ వెళతారంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇరువైపుల రకరకాల దుకాణాలు. కొన్నిచోట్ల సందులలో అరుగులు కూడా వున్నాయి. ఆ అరుగులమీద కూడా దుకాణాలు వున్నాయి. రాగి, ఇత్తడి సామానులు, రుద్రాక్షమాలలు, పూలు,మొదలైనవి షాపులలో ఎక్కువగా కనపడతాయి. మారేడు దళాలు, ఉమ్మెత్త కాయలు, జిల్లేడు మొగ్గల మాలలు ఇతర పూలు, స్వీట్లు ఎక్కువగా కనపడ్డాయి. ఆ సందులో చాలా దూరం మాకు ఎటువంటి రద్దీ కనపడలేదు. కొంత దూరం వెళ్లిన తరువాత షాపులలో మీరు ఇక్కడ లాఖరులో మీ ఫోన్లు పెట్టుకోండి ప్రీ మీరు పూలు మాదగ్గర కొంటె చాలు అని అన్నారు. నా కుమారుడు ఒక షాపులో పూలు, స్వీట్లు పెట్టిన బుట్టను అడుగగా అతను రూ. 250 అన్నాడు. నేను 200 బ్యారం చేస్తే అందులోంచి కొన్ని ధ్రవ్యాలను తీసి మాకు ఇచ్చాడు. మేము ఆ బుట్ట పట్టుకొని కొంత దూరం వెళ్లగా అక్కడ ఒక షెడ్డు కనిపించింది. అక్కడ దాకా జనాలు ఎక్కువ లేరు. అక్కడినుంచి లైను మొదలైయింది. ఆడవారికి వేరు మొగవారికి వేరుగా లైన్లు వున్నాయి. అక్కడ చెక్ చేసి లోపలి హాలులోకి మమ్మలను పంపారు. అక్కడ మన దేవాలయాల బారికేట్లు కనిపించాయి. వాటిలో దాదాపు ఒక గంట నడచి మేము విశ్వనాధుని చేరుకున్నాము. ఉదయం 8-30 కల్లా మాకు దర్శనం అయ్యింది. కాసేపు గుడి ప్రాంగణంలో కూర్చున్నాము. అక్కడ బోర్డులు తెలుగులో వ్రాసి ఉండటం ఆనందాన్ని కలుగచేసింది. కాశీలో తెలుగు వాళ్ళు చాలామంది వున్నారు. ఆలయానికి ఒక గోడకు ఆనుకొని ఒక పురాతన మసీదు ఉండటం నాకు బాధ కలిగించింది. 9గంటలకు ఆలయ ప్రాంగణాన్ని వదిలి 10 నిముషాలు నడచి మేము రోడ్డు మీదకు చేరుకున్నాము. అక్కడ ఒక హోటలులో టిఫినీ చేసాము. తరువాత కొంత దూరం నడచి ఆ ప్రక్కనే వున్నా గంగ ఘాటుకి వెళ్ళాము. పైన ఎండ బాగా ఎక్కువగా వుంది. మేము తిన్న టిఫిన్ ఎప్పుడో ఆవిరి అయ్యింది. ఇక ఎక్కువ సేపు ఎండలో ఉండలేక పోయాము. అక్కడి రోడ్డుకి ఇఱుపేపులా బట్టల దుకాణాలు రోడ్డుమీద వ్యాపారాలు నాకు హైదరాబాదులోని చార్మినార్ సెంటరు లాగ అనిపించింది. కొంత దూరం నడచి ఒక సైకిలు రిక్షా ఎక్కాము . సైకిలు బాబా ఆశ్రమం దాకా రావటానికి 70రూపాయలు అడిగాడు సరే అని అన్నము. . ఆ రిక్షా సీటు ఎత్తుగా వుంది ఇద్దరు కూర్చోవటానికి కూడా ఇరుకుగా వుంది. మరి నేను యెట్లా కూర్చోవాలని నా కుమురుడు అడుగగా నా సీటు మీద కూర్చో మని అన్నాడు అట్లానే తంటాలు పడుతూ ముగ్గురం కూర్చున్నాము. రిక్షావాలా కొంత దూరం తోసుకుంటూ నడిచి తరువాత తొక్కుకుంటూ చిన్నగా బెంగాలీ టోలి అంటే మా సందు కలిసే రోడ్డు వద్దకు వచ్చి ప్రక్కసందులో కొంత దూరం తీసుకొని వెళ్లి సైకిలు బాబా ఆశ్రమం దగ్గర రిక్షా ఆపాడు. అతను ఎక్కువగా కష్టపడ్డట్లు నేను భావించి వప్పుకున్న దానికన్నా ఎక్కువ అంటే 100 రూపాయలు ఇచ్చి అక్కడినుండి నడుచుకుంటూ సత్రానికి చేరుకున్నాము. సత్రం లో అడిగితె ఇప్పుడు వెళితే మీకు భోజనం పెడతారు అని ప్రక్కనుండి వెళ్ళమని మార్గదర్శనం చేస్తే మేము ప్రక్కవీధిలోని భోజనశాలకు వెళ్లి భోజనం చేసాము. అక్కడినుండి రూముకు చేరుకొని విశ్రాన్తి తీసుకొని మరల సాయంత్రం గంగా నదికి వెళ్ళటానికి ప్లాను చేసుకొన్నాము.