శు భో ద యం🙏
కందము సాహిత్య సరస రుచుల మాకందం !
వేసవికి చేరాం .ఈప్రచండ ప్రకృతిలో మనలను సేదదీర్చేది మాకందమే! మాకంద మంటే ,మామిడిపండు. దానిరుచేవేరు. తలనుండి కడవరకూ నోటిని రుచులతోనింపి మనసుకు మధుర మధురమైన యనుభూతిని నింపుతుంది. అటువంటిదే పద్యాలలో కందపద్యం!పరిమాణంలో చిన్నదైనా నడకలో సొగసులో భావప్రకటనలో విస్తారమై చదువరుల హృదయాలను సమాకర్షించుతూ
ఉంటుంది. అందుకేగాబోలు "కందంవ్రాసినవాఁడేకవి. పందినిబొడిచినవాఁడే శూరుఁడు". అనే సామెతలేర్పడినాయి.
క: ముందుగఁ జనుదినములలో
కందమునకు సోమయాజి ఘనుఁడందురు నేఁ
డందరు ననుఘనుఁడందురు
కందమునకు కుందవరపుఁ గవిచౌడప్పా!
అనినాడు చౌడప్ప. కొండంత భావాన్ని గురిగెలాంటి ఆచిన్నపద్యంలో యిమిడించటం సామాన్యంకాదు.
దానికెంతో నైపుణ్యంఉండాలి!
క: ఆపదఁ గడవం బెట్టఁగ
నోపి , శుభంబైన దాని నొడఁగూర్పను మా
క్ష్మాపాలుఁడు నిన్నుజూపిఁ జనియె మహాత్మా!
ఇది తిక్కనగారి పద్యం. కృష్ణుని తమరాయబారిగా కౌరవ సభకు పంపుచు ధర్మరాజు అతనితోపలికినమాట.
కృష్ణా! తండ్రి లేని పిల్లలం. నీవు దైవానివి .నిన్ను నమ్ముకున్నాం. దిక్కులేనివారికి దేవుడే దిక్కుగదా! ఇకమా బాగోగులన్నియు నీవే!
పాలముంచినను నీటముంచినను నీదేభారము. అన్నాడు. ధర్మజుడు చాల తెలివిగా భారమంతయు కృష్ణుపై నెట్టినాడు. ఆమాటలకు గట్టుబడియే పూసలలో దారమువలె కురుక్షేత్రయుధ్ధము ముగియువరకు వారివెంటనుండి వారిని కంటికి రెప్పలాఁ గాపాడినాడు.కృష్ణుడు.
ఇంత విపులమైన భావమునొక కందపద్యమున జెప్పిముగించినాడు సోమయాజి.
క : కల ధనములెల్ల యక్కర
గల నాఁటికి దాచ కమల గర్భుని వశమే!,
నెల నడిమి నాఁటి వెన్నెల
యలవడునే గాది వోయ ' నమవసనిశికిన్ !
ఇది పెద్దనగారి పద్యం. ధనంగానీ యవ్వనం గానీ దాచుకుంటే అక్కరదీర్చేవిగావు. ఆక్షణం దాటితే యేమవుతుందో చెప్పలేము. అందుచేత వయసులో ఉన్నావారు అది సార్ధమగురీతిలో భోగాలను అనుభవించాలి. " నెలమధ్యలో వచ్చిన పున్నమనాటి వెన్నెల గాదిలోపోసి అమావాస్య నాటికి నిలువచేద్దామంటే వీలవుతుందా? అలాగే యవ్వనంకూడాను. ఇలాయెన్నో విధాల జారనైతికోపదేశాలను వరూధిని ప్రవరునకు చెప్పింది అయినా ఆధీరుడు చలించలేదు. ఆవిషయం యిక వేరేసంగతి.
పాపం " అమవస నిశికిన్"- అనేప్రయోగం మాత్రం పెద్దగారికి గండంగా పరిణమించింది. తెనాలివారూరుకుంటారా?
క: ఏమి తిని సెపితివి కపితము
భ్రమపడి వెరిపుచ్చకాయ వడిఁదిని సెపితో
ఉమెతక్కయ ఁ దిని సెపితో
యమవస నిశి యన్నమాట యల్లసని పెద్దన!
అంటూ సుతిమెత్తగా హేళన గావించాడు. పాపం ఆయన మాత్రం యేంచేయగలడు?
"అమవాస్యా నిశా" యనే సమాసం ఆకందంలోపట్టదు. ఛందోభంగం. అటు వ్యాకరణదోషం. ఇటు ఛందోభంగం. రెంటిలోను వ్యాకరణదోషమైనా ఇదేబాగున్నదనుకొన్నారు. అమవసనశికిన్ ప్రయోగాన్ని అలాగే ఉంచేశారు. నిన్నమొన్న డా:నారాయణరెడ్డిగూడా
ఆప్రయోగాన్ని ఆదరించి " ఆనయనాలూ విరిసినచాలూ ,అమవసనిశిలో చంద్రోదయాలూ"- అంటూ శివరంజని సినీగీతంలో వ్రాయటంతో అది యికనుండి శిష్ఠప్రయోగమై శిరోధార్యమైనది.
కందమంత కమ్మని పద్యమూ లేదు. కందమంత కఠినమైన పద్యమూలేదు.
అదేమిటో అనుభవంలో తెలియాల్సిందే!
స్వస్తి!🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి