మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..
*వివాహం..ఉద్యోగం..*
ఆవిడ పేరు వెంకట రమణమ్మ..శ్రీ స్వామివారు మాలకొండలో తపోసాధన చేసే రోజుల్లో..ఒకటి రెండు సార్లు పార్వతీదేవి మఠం వద్ద శ్రీ స్వామివారిని చూసారు..అప్పుడు శ్రీ స్వామివారు వెంకట రమణమ్మ గారిని పలకరించి..ఆశీర్వదించి పంపారు..శ్రీ స్వామివారు మొగలిచెర్ల కు వచ్చేసి, ఆశ్రమ నిర్మాణం చేయించుకొని..ఇక్కడే సాధన చేసుకొనే రోజుల్లో కూడా రమణమ్మ గారు శ్రీ స్వామివారిని కలిశారు..అలా శ్రీ స్వామివారికోసం ఆశ్రమం వద్దకు వచ్చినప్పుడే మా తల్లిదండ్రులతో పరిచయం ఏర్పడింది..ఆ తరువాత ఒకటి రెండుసార్లు రమణమ్మ గారు ఆశ్రమానికి వచ్చి శ్రీ స్వామివారిని చూసి వెళ్లారు.. శ్రీ స్వామివారిని దర్శించుకునే సమయంలో మా ఇంట్లో గడిపారు..ఈ విషయాలన్నీ ఆవిడే స్వయంగా చెప్పారు..శ్రీ స్వామివారు సిద్ధిపొందిన తరువాత..రమణమ్మ గారు మొగలిచెర్ల కు వచ్చారు..అప్పుడు శ్రీ స్వామివారి తల్లిగారైన వెంకట సుబ్బమ్మ గారు మందిరం వద్ద వున్నారు..సుబ్బమ్మ గారి వద్దే రెండురోజుల పాటు రమణమ్మ గారు వున్నారు..వాళ్ళిద్దరి మధ్యా కొద్దిగా సాన్నిహిత్యం కూడా ఏర్పడింది..తాను శ్రీ స్వామివారికి దగ్గర మనిషిని అని రమణమ్మ గారు భావించేవారు..
ఈసారి రమణమ్మ గారి రాకకు ఒక కారణం ఉన్నది..ఆవిడ కూతురు బిడ్డ (మనుమరాలు) యుక్త వయసుకు వచ్చింది..ఉద్యోగము చేస్తున్నది..సుమారు పాతిక సంవత్సరాల వయసు వచ్చింది.. కానీ..వివాహం చేసుకోనని ఖరాఖండిగా తేల్చి చెప్పింది..ఆ అమ్మాయికి పెళ్లి చేద్దామని తల్లిదండ్రులు ప్రయత్నం చేసి..విఫలమయ్యారు..ఎవరు చెప్పినా ఆ అమ్మాయి వివాహానికి ఒప్పుకోవడం లేదు..తాను ఇంకా కొన్నాళ్ల పాటు ఒంటరిగా వుంటూ ఉద్యోగం చేయదలచానని..తనను బలవంత పెట్టొద్దనీ గట్టిగా చెప్పింది..
మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరానికి అమ్మాయిని తీసుకెళ్లండి..మార్పు వస్తుంది..అని రమణమ్మ గారు తన కూతురికి సలహా ఇచ్చారు.."నువ్వు కూడా మాతో స్వామివారి వద్దకు వచ్చేయి..అందరం కలిసే వెళదాము.." అని ఆ కూతురు చెప్పి..రమణమ్మ గారిని వెంటబెట్టుకొని శ్రీ స్వామివారి మందిరానికి వచ్చింది..కాకుంటే మనుమరాలికి మాత్రం విషయం చెప్పకుండా..కేవలం దైవదర్శనం కోసం మొగలిచెర్ల లోని శ్రీ స్వామివారి మందిరం వద్దకు వెళుతున్నామని చెప్పారు..
రమణమ్మ గారు మందిర ప్రాంగణమంతా తిరిగి చూసారు..తాను మొదట్లో చూసిన మందిరానికి, ఇప్పటికీ చాలా తేడా వున్నదని అన్నారు..చాలా మార్పులు వచ్చాయి అని చెప్పారు..తాను, శ్రీ స్వామివారి తల్లి గారితో గడిపిన రోజులను గుర్తు చేసుకున్నారు..
(శ్రీ స్వామివారి తల్లిగారైన వెంకట సుబ్బమ్మ గారు..శ్రీ స్వామివారు సిద్ధిపొందిన తరువాత మందిరం వద్దకు వచ్చి..ఇక్కడే సుమారు పదిహేను సంవత్సరాల పాటు వున్నారు..ఆనాటి తరం వాళ్లందరికీ వెంకట సుబ్బమ్మ గారు బాగా గుర్తు వున్నారు..ఇప్పటికీ కొందరు మమ్మల్ని ఆవిడ గురించి అడుగుతూ వుంటారు..వెంకట సుబ్బమ్మ గారు సుమారు ఐదు సంవత్సరాల క్రితం, తన 101 వ ఏట మరణించారు..)
ఆరాత్రికి రమణమ్మ గారు, ఆమెతో వచ్చిన కూతురు, అల్లుడు, మనుమరాలు..అందరూ మందిరం వద్దే నిద్ర చేశారు..తెల్లవారింది..అందరూ తలారా స్నానం చేసి, శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకున్నారు..మనుమరాలి చేత కూడా శ్రీ స్వామివారి సమాధి వద్ద నమస్కారం చేయించారు..అందరూ ప్రధాన మందిరం వద్ద నుంచి బైటకు వచ్చి..మంటపం లో కూర్చున్నారు..రమణమ్మ గారు మాత్రం మళ్లీ లేచి ..శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్లి మరొక్కమారు నమస్కారం చేసుకొని ఇవతలకు వచ్చారు..మనమరాలిని తన దగ్గర కూర్చోబెట్టుకుని.."నీకు త్వరగా పెళ్లి కావాలని మొక్కు కోవడానికి మేమందరం నిన్ను వెంటబెట్టుకొని ఇక్కడకు వచ్చాము.." అని అసలు విషయం చెప్పేసారు..అప్పటిదాకా ఉత్సాహంతో ఉన్న ఆ అమ్మాయి, ఈ మాట వినగానే గంభీరంగా మారిపోయింది.."అమ్మమ్మా..పెళ్లి తరువాత కూడా నేను ఉద్యోగం చేయడానికి ఒప్పుకునే పక్షంలో..నేను వివాహం చేసుకుంటాను.." అని చెప్పింది..ఈ మాట వినగానే ఒక్కసారిగా అందరికీ ఆనందం వేసింది..సుమారు సంవత్సరం నుంచీ పెళ్లి ప్రసక్తి తెస్తేనే ససేమిరా అంటున్న అమ్మాయి..ఇప్పుడు వివాహానికి ఒప్పుకున్నది..శ్రీ స్వామివారి సమక్షం లోనే అమ్మాయి నోటి నుంచి సానుకూల వార్త వచ్చింది..ఇంతకంటే ఏమి కావాలి?
మరో మూడు నెలల కల్లా..ఆ అమ్మాయికి వివాహం జరిగిపోయింది..నూతన దంపతులను వెంటబెట్టుకొని రమణమ్మ గారు శ్రీ స్వామివారి మందిరానికి వచ్చారు..అందరూ మనసారా శ్రీ స్వామివారికి నమస్కారం చేసుకున్నారు..ఇంకొక విషయమేమిటంటే..పెళ్లి తరువాత కూడా ఉద్యోగం చేస్తాను అన్న అమ్మాయి..మరో నెలకల్లా ఉద్యోగం మానేసి..భర్త తో చక్కగా కాపురం చేసుకుంటున్నది..
"స్వామి తలచుకుంటే..అన్నీ చిటికెలో జరిగిపోతాయి..నా మొర వృధాగా పోదు..స్వామివారి పై పూర్తి విశ్వాసం ఉంది.." అంటుంటారు రమణమ్మ గారు..
సర్వం..
శ్రీ దత్తకృప!.
*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*
https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి