25, ఏప్రిల్ 2023, మంగళవారం

శాఖ చంద్ర న్యాయం

 శాఖ చంద్ర న్యాయం - వేదాంతం 


పౌర్ణమి రోజున చంద్రుడు పూర్తి బింబముగా కనపడతాడు, వెన్నెల పిండి ఆరబోసినట్లు గా ఉంటుంది కాబట్టి పున్నమి చంద్రుడు ప్రతివారికి ఆకాశం వైపుచూస్తే చాలు కనపడతాడు. ఇంకొక విశేషము ఏమిటంటే పున్నమి చంద్రుడు రాత్రి పూర్తిగా అంటే సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 6 గంటలవరకు ఆకాశంలో ప్రకాశిస్తూవుంటాడు కాబట్టి ఆ రోజు రాత్రి చంద్రుని ఎవరు చూపించనవసరం లేకుండానే అందరు చూడగలరు. 


కానీ అమావాస్య మరుసటి రోజు చంద్రుడు రేఖామాత్రంగా ఉండి ఆకాశంలో కేవలం 48 నిమిషాలు మాత్రమే ఉంటాడు కాబట్టి ఆ రోజు అంటే అమావాస్య వెళ్లిన పాడ్యమి నాడు చంద్రుని చూడటం చాలా కష్టం. దానికి కారణం చంద్రుడు చిన్నగా ఉంటాడు మరియు కొద్ది సమయం మాత్రమే ఉంటాడు. 


ఒక గురువు గారు ఆకాశంలో వున్న చంద్రుని తన శిష్యునికి చూపించదలచారు. అప్పుడు ఆయన ముందుగా అక్కడ వున్న ఒక చెట్టు కొమ్మను శిష్యునికి చూపించారు అది కంటికి దగ్గరగా వుంది కాబట్టి దాన్ని శిష్యుడు గుర్తించగలిగాడు. ఇక ఇప్పుడు చంద్రుని చూపించాలి దానికోసం గురువుగారు ఆ వృక్ష శాఖ లోని ఒక పత్రాన్ని చూపి దాని సందులో చంద్రుడు ఉన్నాడని చెప్పారు. తెలివైన శిష్యుడు ఆ శాఖ మధ్యనుండి గురువుగారు చెప్పిన విధంగా నిశితంగా పరిశీలించి చూసి సూక్ష్మ మాత్రంగా ఉన్న చంద్రుడిని చూసాడు. ఒక్కసారి చంద్రుని చూస్తే తరువాత శిస్యునికి మరల వృక్షశాఖతో నిమిత్తం లేదు ఆకాశంలో ఎటువంటి ఉపాధి లేకుండా చంద్రుని మరల చూడగలడు. ఎందుకంటె ఇప్పుడు శిష్యునికి చంద్రుడు ఎక్కడ వున్నదో పూర్తిగా జ్ఞానం కలిగి వున్నాడు. ఆ జ్ఞానం కలిగేటంతవరకే శాఖ యొక్క ఉపయోగం. ఒక్కసారి శిష్యునికి చంద్రుని గూర్చిన జ్ఞానం కలిగిన తర్వాత శాఖ పూర్తిగా మరచిపోతారు. కేవలం మనస్సు చంద్రుని మీద లగ్నం చేయగలుగుతాడు.


నిజానికి చంద్రుని చూడడానికి వృక్షశాఖతో పనిలేదు. కానీ గురువుగారు వృక్షశాఖను తన పనికి వాడుకున్నారు. ఎందుకంటె శిష్యుని దృష్టిని కేంద్రీకరించడానికి శాఖ ఒక ఉపయుక్తంగా లేక ఉపకరణంగా పనికి వచ్చింది. అదే వృక్ష శాఖ లేదనుకోండి అప్పుడు గురువు గారు శిష్యునికి చంద్రుని చూపించడం కుదిరే పని కాదు. ఎందుకంటె పాడ్యమినాడు చంద్రుడు చాలా సూక్ష్మంగా ఉండటమే కాకుండా కేవలం ఆకాశంలో 48 నిమిషాలు మాత్రమే ఉంటాడు. కాబట్టి శాఖ చంద్రదర్శనానికి చాలా తోడ్పడ్డదని మనకు తెలుస్తున్నది.


ఇక విషయానికి వస్తే భగవంతుడు నిర్గుణుడు, నిరాకారుడు, నామ రహితుడు మరి అటువంటప్పుడు భగవంతుని దర్శించుకోవడం ఎలా ఎందుకంటే మన మనస్సు ఎల్లప్పుడూ ఏదో ఒక భౌతికమైన విషయం మీదనే లగ్నం అవుతుంది అది ప్రస్తుతం వున్నదో లేక గతంలో వున్న దాని భావనో ఏదో ఒకటి కావచ్చు. కాబట్టి మనస్సుకి ఒక చక్కటి శిక్షణ ఇవ్వాలి దానికోసం ముందుగా మనస్సుని ఏదో ఒక విషయం మీద స్థిరపరచాలి తరువాత నెమ్మదిగా శాఖమీది నుంచి దృష్టిని చంద్రుని వైపు మళ్లించినట్లు మనస్సుని భగవంతుని మీదకు మళ్లించవచ్చు.


కాబట్టి మన ఆరాధనా పద్దతులలో విగ్రహారాధన, యజ్ఞ యాగ, జపాది పద్ధతులు కేవలం సాధకుని మనస్సు స్థిరపరచటానికి ఏర్పాటు చేసిన విధానాలుగా మనం తెలుసుకోవాలి. ఒక విగ్రహారాధనను మనం చంద్రుని దర్శించుకోవడానికి ముందుగా శాఖను చూడటం లాగ తెలుసుకోవాలి. ఎలాగైతే చంద్రుని దర్శించుకున్న తర్వాత శాఖ ప్రయోజనం లేదో అలాగని నిరాకారుడైన భగవంతుని చేరుకొన్న సాధకునికి విగ్రహారాధనతో నిమిత్తం లేదు. ఇది తెలుసుకొని సాధనలో పట్టు సాధించాలి.


భార్గవ శర్మ చెప్పేది ఏమిటంటే విగ్రహారాధన నుంచి మనస్సు నిరాకారుని వైపు మళ్లించటం చెప్పినంత తేలిక కాదు నిరంతర అకుంఠిత సాధన చేస్తేనే కానీ అది సాధించగలడు. పట్టుదల, అవిరామ కృషి మాత్రమే సాధకుని దీక్షను ముందుకు సాగించగలవు. సాధనలో ఎన్నో అవాంతరాలు, ఇబ్బందులు, సాధకబాధకాలు వస్తూ వుంటాయి. కానీ నిజమైన సాధకుడు వాటినన్నిటిని అధిగమించి తన సాధనను ముందుకు కొనసాగించాలి. నిజానికి ఆధ్యాత్మిక జీవనం చాలా కష్టతరమైనది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇసుకను పిండి నూనెను పట్టినట్టు. ఎంతో దుర్లభమైన సాధన చేస్తేగాని మోక్షం సిద్దించదు. మనకు అనేకమంది వాచావేదాంతులు తారసపడి మనలను తప్పుడు త్రోవలో పంపడానికి ప్రయత్నిస్తుంటారు వాటిని చాలా జాగ్రత్తగా ఎదుర్కోవాలి. ముఖ్యంగా ఈ రోజుల్లో నిజమైన సాధకులు చాలా తక్కువగా వున్నారో లేక లేరో నాకు ఇంకా పూర్తిగా తెలియడం లేదు. ఒక్క మాట మాత్రం చెప్పగలను మన చుట్టూ ఉన్న సమాజంలో మాత్రం నిజమైన సాధకులు లేకపోవచ్చు. ఎక్కడో అరణ్యాలలోనో లేక హిమాలయాలలోనో ఉంటే ఉండవచ్చు. పై పై డాంబికాలు పోయి తామే సద్గురువులమనే కుహనా వేదాంతులు మనకు అడుగడుగునా కనిపిస్తారు. వారితో జాగ్రత్త. నీగమ్యం నిర్ధారించుకొని అడుగు ముందుకు వేయి.


ఓం తత్సత్


ఓం శాంతి శాంతి శాంతిః


ఇట్లు భార్గవ శర్మ


శంకరజయంతి

 🕉️ * శంకరజయంతి* 🕉️


🚩🚩🚩ఈ  రోజు జగద్గురువులు ఆదిశంకర భగవత్పాదుల యొక్క ఆవిర్భావ దినం. ఇది సనాతన ధర్మం అంతటికీ పండుగరోజు. 


 ఎంతవరకూ దేహమే నేను అనే భావం ఉంటుందో అంతవరకూ వైదికమైన సత్కర్మలు ఆచరించాలి. 

షణ్మతాలూ ఈ మూడు సిద్ధాంతాలతో ఉంటాయి. 

ద్వైత, విశిష్టాద్వైత, అద్వైతములు X  షణ్మతములు = హిందూ ధర్మం యొక్క స్వరూపం.


అద్వైతం అనే ఒకానొక జ్ఞానం భూమికగా కలిగి ఉన్నట్లయితే పరస్పర వైరములు లేకుండా ఉంటాయి. అందుకే ఆదిశంకర భగవత్పాదుల వారు అద్వైతం ప్రతిష్ఠాపన చేస్తూ “ఉన్నది ఒక్కటే పరమాత్మ తత్త్వము. జీవుడికి కూడా దేహాత్మ భ్రాంతి ఉన్నంతవరకే భేదం కానీ అది తొలగించి చూస్తే సత్య దృష్టితో అద్వైతమే” అని చెప్పారు. 


వ్యవహారంలో అద్వైతం కుదరదు, ద్వైతమే ఉంటుంది. పరమార్థంలోనే అద్వైతం. పారమార్థిక దృష్టి కలిగి వ్యవహార జీవనంలో ఉన్నప్పుడు అద్వైత స్పృహలోనే ద్వైత జగత్తులో ఉంటాం. దీనివల్ల సమాజంలో ఒక శాంతి ఏర్పడుతుంది. 


సిద్ధాంతాలు అర్థం అయినా అవకపోయినా శంకర సిద్ధాంతంలో ఉన్న వారికి ఎవరి ఇష్టదేవతలు వారికి ఉన్నా ఇతర దేవతలను ద్వేషించరు. అది ఒక్కటి చాలు ప్రపంచాన్ని ఆరోగ్యంగా ఉంచే పద్ధతి. 


శంకరాచార్య శైవులు కాదు. ఆయన శివాంశ సంభూతులు అని శంకర విజయాలు చెప్పాయే తప్ప ఆయన శైవుడు కాదు. 

వైదిక శైవం గురించి చెప్పాలంటే శ్రీకంఠాచార్యులు, వీరశైవం బసవేశ్వరులు మొదలైన వాళ్ళు ఇచ్చారు.

శైవం వేరు, వైష్ణవం వేరు, శాక్తేయులూ ఉన్నారు. వారందరూ ఆగమ మతాలు. కానీ శంకరాచార్యుల వారికి శివుడు, విష్ణువు, భేదం లేదు. ఉన్నది ఒక్కటే పరమాత్మ. ఆయన నిర్గుణుడు, నిరాకారుడు. కానీ భక్తులు ఉపాసనా సౌలభ్యం కోసం ఆయన అనేక రూపాలు స్వీకరిస్తాడు. విష్ణువు, శివుడు ఒకే పరమాత్మ నామములే.  ఆ పరమాత్మ ప్రతి జీవుడిలో అంతర్యామియే.  తత్త్వతః తెలుసుకోగలిగితే జీవుడికీ పరమాత్మకీ భేదం లేదు. ఇది శంకర సిద్ధాంతం.

శంకరులు ఎప్పుడూ శైవం కాదు, ఇది ముందు తెలుసుకోవాలి. 

 శంకరుల ధర్మంలో శైవం, వైష్ణవం అన్నీ కలిసి ఉంటాయి. షణ్మత ప్రతిష్ఠాపనాచార్య అనే పేరు కూడా ఉన్నది. 


ప్రస్తుతం సనాతనధర్మం కలిసికట్టుగా ఉండాలంటే ఎవరి సంప్రదాయం వారు పాటించాలి. ఇతర సంప్రదాయాలను గౌరవించాలి. ఇది సత్సంప్రదాయం. చాలా అవసరం. 




సనాతన ధర్మం వేదంలోనుంచి వచ్చిన ఆరుమతాలనూ చూపిస్తూ ఎవరి దేవతలను వారు ఆరాధించుకోండి, ఇతరులను గౌరవించండి.


హిందూధర్మం మొత్తానికి ఒక గురువును చెప్పుకోవాలంటే ఆ గురువు ఆదిశంకర భగవత్పాదులు మాత్రమే.  ఆయన వచ్చిన తరువాతనే అవైదిక మతాల ధాటికి చెదిరిపోయినటువంటి శైవవైష్ణవాదులు తిరిగి ఊపిరి పోసుకున్నాయి. అందుకే ఆయనని “షణ్మతప్రతిష్ఠాపనాచార్య’ అన్నారు. 


సనాతన హిందూ ధర్మానికి సమగ్రమైనటువంటి జగద్గురువులుగా ఆదిశంకరులను గౌరవిస్తూ వారి సంప్రదాయ గురువులను గౌరవించుకోవచ్చు. తప్పులేదు. 

 అన్ని రకాల సంప్రదాయాలు ఆ సంప్రదాయంలోని గురువుల వల్లనే పుష్టి పొందాయి. ఈ సంప్రదాయాలన్నింటినీ గౌరవించడం అనే సంప్రదాయం మాత్రం జగద్గురువులు ఆదిశంకర పరంపరలో ఉంది నేటికి కూడా. శంకర పీఠములన్నింటిలోని వారూ ఇటువంటి సామరస్య ధోరణితో ఉన్నటువంటి వారే. పీఠ పరిపాలిత దేవాలయాలలోనూ హైందవ దేవతలందరూ ఆరాధింపబడుతూ ఉన్నారు. నారాయణ స్మరణ, చంద్రమౌళీశ్వరారాధన, శ్రీచక్రార్చన చేస్తారు. సనాతనధర్మం యొక్క స్వరూపం ఇది. 


ప్రతి సంప్రదాయం వాళ్ళూ హిందూ ధర్మ పరిరక్షణ కోసం వారి సంప్రదాయం వదులుకోకుండా ఇతర సంప్రదాయాలను గౌరవించడం నేర్చుకోవాలి. విష్ణువే గొప్ప శివుడు కాదు అని వాళ్ళ గ్రంథాలను భుజాన మోసుకొని ఎలా తిరుగుతున్నారో, శివుడు తప్ప ఇంకెవరూ గొప్ప కాదు అని చెప్తూ గ్రంథములు మోసుకు తిరగడానికి వాళ్ళూ సిద్ధంగా ఉన్నారు. ఏ నూతిలో మండూకానికి ఆ నూతి లోతు తెలిసినట్లు ఏ సంప్రదాయజ్ఞుడికి ఆ సంప్రదాయపు లోతు తెలుస్తుంది.  తమకు తెలియని సంప్రదాయాల గురించి అవహేళనగా, కించపరచి మాట్లాడరాదు. సందర్భం వస్తే అది మా సబ్జెక్ట్ కాదు అని నమస్కారం చేయడం చాలా మంచిది.  


సనాతనధర్మం పరస్పర ద్వేషాలు, చీలికల జోలికి వెళ్ళకుండా సమన్వయ ధోరణిలో వెళ్ళాలి అని ఒక సంకల్పం తీసుకోవాలి.  సామాన్యులకి  ధర్మము, భక్తి – ఈ రెండూ చాలా ప్రధానం. 


మనది మనం పాటిద్దాం, ఇతరులను గౌరవిద్దాం. ఈ సంప్రదాయాన్నిమనకు బోధించిన జగద్గురువులు ఆదిశంకర భగవత్పాదుల పాదపద్మాలకు నమస్కరిద్దాం.🚩🚩🚩🚩