మహాభారతము ' ...55 .
నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /
దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//
సభా పర్వం..
కర్ణుడు పాండవులపట్ల, ద్రౌపదిపట్ల ఏహ్యభావం కలిగించుకుని, దుర్యోధనునికి దగ్గరై, ' దుష్ట చతుష్టయం ' లో ఒకడిగా చోటు సంపాదించుకున్నాడు. అందులో భాగంగానే, ద్రౌపదీ వస్త్రాపహరణంచేయ్యమని, దుశ్శాసనుని పురమాయించాడు. అసలేకోతి, మద్యం సేవించింది అన్న చందాన, అట్టి సలహావిన్న దుశ్శాసనుడు, వెంటనే ద్రౌపది వస్త్రాన్ని లాగడానికి కార్యోన్ముఖుడయ్యాడు.
ఈ హఠాత్పరిమాణానికి చిగురుటాకులా వణికిపోయింది ద్రౌపది. వెంటనే, భర్తలవైపు చూసింది. ఒక్కడూ తనను ఆదుకునే ప్రయత్నం చెయ్యలేదు, సరికదా, అట్టి జుగుప్సాకర సన్నివేశం చూడలేము అన్నట్లు తలలువంచి కూర్చున్నారు. వారే కాదు, సభలో అధికభాగం అందరిదీ అదేపరిస్థితి.
ఇక తనకు శ్రీహరే దిక్కని ద్రౌపది నిశ్చయించుకుంది. బాల్యంలో తనకు గురూపదేశం చేస్తూ వశిస్తులవారు, ఆపదకాలంలో హరిని స్మరించుకొమ్మని చెప్పిన గురువాక్యం గుర్తుకు తెచ్చుకున్నది. అంతే ! సంపూర్ణ శరణాగతితో, సర్వస్వమూ మరచి, చేతులు పైకెత్తి జోడించి, తన మానావమానాలు చూసుకునే బాధ్యత ఆ హరిదే అన్నట్లు, బిక్కచచ్చి ' హే కృష్ణా ! గోవిందా !! ' అని యెలుగెత్తి పిలుస్తూనే వున్నది.
ఆపత్స్యభయదం కృష్ణం లోకానాం ప్రపితామహం /
గోవిందా ద్వారకావాసిన్ కృష్ణ గోపీజనప్రియ //
కౌరవై : పరిభూతానాం మాం కిం న జానాసి కేశవ
హే నాథ హే రమానాధ వ్రజనాధ ఆర్తినాశనా
కౌరవార్ణవ మ గనాo మాముద్ధరస్య జనార్దన//
కృష్ణ కృష్ణ మహాయోగిన్ విశ్వాత్మన్ విశ్వభావన
ప్రసన్నాం పాహి గోవిందా కురుమధ్యే <వసీదతీమ్ //
'హే కృష్ణా ! గోవిందా !! క్లిష్ట పరిస్థితిలో వున్నాను. యెవరికీ రాకూడని ఆపదలో వున్నాను. కౌరవులు నన్ను అవమానిస్తున్నారు. నీకు కనబడడం లేదా కేశవా ! కౌరవసముద్రంలో పడి మునిగిపోతున్న నన్ను ఉద్ధరించవా యోగులకే యోగివైన మహాయోగీ ! నన్ను రక్షించు తండ్రీ ! నీవే తప్ప ఇత:పరంబెరుగ ' అని గజేంద్రమోక్షఘట్టంలో గజరాజు యెలుగెత్తి పిల్చినట్లుగా, ఆ అయోనిజ, యజ్ఞసంభూత, కృష్ణ నామధేయ, ద్రౌపది శ్రీకృష్ణుని పిలుస్తుంటే, దిక్కులు కంపించ సాగాయి. సప్తసముద్రాల ఘోష సభికుల గుండెల్లో హోరెత్తింది. అతిరధ మహారథులవంటి పెద్దలంతా కూర్చున్న సింహాసనాలు వూగుతున్న అనుభూతి కలిగింది.
ఆమె ఆర్తనాదం విన్న శ్రీకృష్ణుడు, తన సోదరి కృష్ణ, మానం కాపాడడానికి, యెవరికీ కనబడకుండా, ఊర్ధ్వ దిశనుండి, దక్షిణహస్తం పైకెత్తి అభయముద్రలో, వస్త్రదానం చేయసాగాడు. ఆమెకట్టుకున్న వస్త్రం ఆమె శరీరానికి అంటిపెట్టుకునే వున్నది. దుశ్శాసనుడు తనచేతిలో వుంచుకుని లాగుతున్న చీరఅంచును అనుకుని అసంఖ్యాకమైన చీరలు పుంఖానుపుంఖాలుగా వస్తూనే వున్నవి. చీరెలరాసులు అక్కడ పోగవుతున్నది. ద్రౌపదీమాత వంటినున్న వస్త్రం మాత్రం చెక్కు చెదరక అలానే వున్నది. దుశ్శాసనుడు యిక తన పైశాచికకృత్యం చెయ్యలేక,అలసిపోయి, చెమటలు గ్రక్కుతూ, అవమానభారంతో, సభామధ్యంలో చతికిలబడిపోయాడు.
ఆ నల్లనయ్య, గోపికామానసచోరుడు, గోపెమ్మల వస్త్రాలను దొంగిలించి ముక్తిమార్గం చూపిన ఆ శ్రీకృష్ణపరమాత్మ, తనకు చీరలు దొంగిలించడమేకాదు, ఆపదసమయంలో, స్త్రీల మానం కాపాడేవస్త్రాలు అశేషంగా యివ్వడమూ తెలుసు అన్నట్లు, చిరునవ్వుతో, దుశ్శాసనుని కుప్పిగంతులు చూస్తూ, ద్రౌపదికి అభయప్రదాత అయ్యాడు.
సభలో యిదంతా చూసి సభికులందరూ ఆశ్చర్యానందాలతో పులకించి పోయారు. ఆసమయంలో, భీమసేనుడు క్రోధంతో యెర్రబడిన నేత్రాలతో, ముక్కుపుటాలు అదురుతుండగా, లేచినిలబడ్డాడు. కుడిపిడికిలి బిగించి ' ఓ సభాసదులరా !పెద్దలారా ! నా ప్రతిజ్ఞ వినండి. ఈ విధంగా గతంలో ఎవరూ ప్రతిజ్ఞ చేసివుండరు. ఇక ముందు చెయ్యవలసిన అవసరం రాకుండుగాక! చతుస్సాగర పర్యంతమైన యీ భారతదేశంలో, భరతవంశంలో పుట్టి, కళంకమైన కృత్యం చేసిన యీ దుశ్శాసనుని, రాబోయే యుద్ధంలో, నా ముష్టిఘాతాలతో క్రింద పడవైచి, లోకభీకరంగా వధించి, వాడి వక్షస్తలం పగులగొట్టి, గుండెలు చీల్చి అందునుండివచ్చే వేడివేడి రక్తాన్ని చుక్క మిగలకుండా పీల్చేస్తాను. ఈ ప్రతిజ్ఞ నేను నెరవేర్చలేకపోతే, నా పితృదేవతల శాపానికి నేను గురి అగుదును గాక ! ' అని శపథం చేశాడు.
ఇంతజరిగినా కర్ణునికి బుద్ధిరాలేదు. అతను దుశ్శాసనుని వైపుచూసి, ' ఈమె నీదాసి, ద్రౌపదిని మీయింటికి తీసుకునిపో ! ' అన్నాడు. ఆమాట అనగానే, అప్పటిదాకా సిగ్గుతో కూలబడి వున్న దుశ్శాసనుడు మళ్ళీలేచి ఆమె దగ్గరకు రాబోయాడు. మళ్ళీ ద్రౌపది తనకు న్యాయం చెయ్యమని సభలో అందరినీ ప్రార్ధించింది.
అందరూ మౌనంగావుంటే దుర్యోధనుడు రెచ్చిపోయి ' ద్రౌపదీ ! యెందుకు మాటిమాటికీ ధర్మం చెప్పమని సభికులను అడుగుతావు. నీ అయిదుగురుభర్తలూ యిక్కడే వున్నారు కదా ! వారినే చెప్పమను. ఒకవేళ నీభర్త ధర్మరాజు, నీవు పందెంలో ఓడిపోలేదని చెబితే, నీకు యిప్పుడే స్వేచ్ఛ ప్రసాదిస్తాను. చెప్పమను ధర్మజుని. ' అని రెట్టించాడు.
అప్పుడు భీమసేనుడు, ' ఈ ధర్మజుడు, తాను ఓడిపోకముందే నన్ను ఓడాడు. అలాకాకున్న, యీపాటికి యీసభను స్మశానవాటికను చేసేవాడిని. ' అని లేవపోతుండగా, భీష్మ ద్రోణ విదురులు అతనిని అడ్డుకున్నారు.
మళ్ళీ వాతావరణం కౌరవులకు అనుకూలం కాగానే, ' ద్రౌపదీ ! యీ పాండవులకు నీపై యే అధికారం లేదు. కౌరవులు నీ ప్రభువులు. వారిలో, నిన్ను జూదంలో వొడ్దని వారిని యెవరినైనా, పతిగా యెంచుకో. సుఖపడు.' అని కర్ణుడు వికృతసంభాషణ మొదలుపెట్టాడు.
ఆ సమయంలో, దుర్యోధనుడు , కర్ణుని కనుసైగచూసి, ' ధర్మజా ! నీవే చెప్పు చివరిసారిగా అడుగుతున్నాను. ద్రౌపది జూదంలో ఓడబడినదా, లేదా ? ' అని ద్రౌపది వైపు కుటిలదృష్టితో చూస్తూ, చిరునవ్వుతో, తనతొడపై వున్నవస్త్రాన్ని, ప్రక్కకు తొలగించి, తన యెడమతొడను ద్రౌపదికి చూపించాడు.
అది గమనించిన భీమసేనుడు తిరిగి రోషభూయిష్ఠుడైనాడు . దుర్యోధనుని తీక్షణంగా చూస్తూ, సభికులందరకూ వినబడేటట్లుగా, ' దుర్యోధనా ! నీవు చేసిన ఈ పైశాచిక సైగకు ప్రతిగా, నిన్ను యుద్ధంలో ఓడించి, నా గదతో, నీ తొడను విరుగకొట్టక పోయినచో నేను భీమసేనుడనే కాదు. ' అని మరియొక శపథం చేశాడు.
ఇంత జరుగుతుండగా, ప్రకృతికూడా విలయతాండవం చేసింది. నక్కలు ఊళ వేశాయి. గాడిదలు భయంకరంగా ఓండ్ర పెట్టాయి. గ్రద్దలు సభామధ్యం లోనికి వచ్చి వికృత ధ్వనులు చేశాయి. విదురుని ద్వారా, ఈ అపశకునాలు తెలుసుకున్న ధృతరాష్ట్రుడు, మొదటిసారిగా నోరువిప్పాడు. ' ఓరీ దుష్టుడా !దుర్యోధనా ! నీవు గెలిచినా ఓడినవాడితో సమానము. మన యింటికోడలిని, కులస్తీని, ఇందరు ధర్మాత్ముల ముందు నిండు సభలో దుర్భాషలాడతావా ? ' అని దుర్యోధనుని అభిశంసించి, ద్రౌపదివైపు తిరిగి,
' అమ్మా ! ద్రౌపదీ ! నా కోడళ్లందరిలోకీ నీవు శ్రేష్ఠురాలవు. జరిగినదానికి మమ్ము మన్నించు. దీనికి ప్రాయశ్చిత్తంగా, నీకు వరం ప్రసాదిస్తాను. ఏమి కావాలో కోరుకో !' అన్నాడు, యింటిపెద్దగా.
వెంటనే ద్రౌపది, ' మహారాజా ! ధర్మమేసూత్రంగా జీవనయాత్ర సాగించే ధర్మరాజుకు బంధవిముక్తి కలిగించండి ' అని అడిగింది. అట్లే అని, ఆమె కోరికకు సంతోషించి, మరియొక వరం కోరు కొమ్మన్నాడు ధృతరాష్ట్రుడు. ' రెండోవరంగా భీమార్జున నకుల సహదేవులను వారివారి అస్త్ర శస్త్రాలతో రధాలతో కూడి, దాస్యవిముక్తి కలిగించండి. ' అని కోరుకున్నది.
రెండోవరం కూడా అనుగ్రహించి, ధృతరాష్ట్రుడు, ' ద్రౌపదీ ! నాకు యింకా సంతృప్తిగా లేదు. మూడవవరం యేదైనా కోరుకో ! నీ గురించి నువ్వేమీ కోరుకోలేదు. ' అన్నాడు. అయితే ద్రౌపది వినయంగా తిరస్కరించి, ' మహారాజా ! వైశ్యునకు ఒకకోరిక కోరే అర్హత మాత్రమే ఉంటుంది. క్షత్రియులు రెండుకోరికలు కోరవచ్చు. ఇక మూడువరాలు కోరుకునే అధికారం బ్రాహ్మణులకు మాత్రమే వున్నది. మీకు తెలియనిధర్మాలు కావు కదా !' అన్నది.
ద్రౌపది మాటలకూ యెంతో సంతోషించి, ధృతరాష్ట్రుడు, వారు జూదంలో ఓడిన రాజ్యంతోపాటు, వారిసంపదలు కూడా తిరిగి యిచ్చేయమని దుర్యోధనుని ఆదేశించాడు. ఆ తరువాత ధర్మరాజుతో , ' ధర్మజా ! నీవు యెంతో శాంతమూర్తివి. ధర్మమూర్తివి. వినయవిధేయతలు నీకు పెట్టని ఆభరణాలు. జరిగినదానిని మనసులో పెట్టుకోకు. నేను అంధుడిని. గాంధారి నీ పెదతల్లి. మమ్ములను దృష్టిలో పెట్టుకుని, నీ తమ్ములను దుర్యోధనాదులను క్షమింపు. ' అని ప్రాధేయపూర్వకంగా అన్నాడు.
పాండవులు ద్రౌపదితో సహా మళ్ళీ ఇంద్రప్రస్థం వెళ్లిపోయారు.
స్వ స్తి.
వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు తెలుసుకుందాం.
తీర్థాల రవి శర్మ
9989692844
విశ్వ వ్యాప్త పిరమిడ్ ధ్యాన మందిరం. హిందూపురం.