*సహజ జ్ఞానం*
ఇతరులకు మంచి చెడుల గురించి ఎరుకన పరచాలంటే మనం ఆచరించి చూపాలి. అప్పుడు మాత్రమే ఎవరైనా మనం చెప్పేది శ్రద్ధగా వింటారు. రాసేది ఆసక్తిగా చదువుతారు. మంచి ప్రవర్తన కోసం అంతర దృష్టి ఎంతో అవసరం. ఈ సహజ జ్ఞానం కోసం నిరంతరం సాధన చేయాలని విజ్ఞులు చెబుతారు. దీనికోసం ఘనమైన కుటుంబ నేపథ్యం, అనేక పట్టాలు అవసరం లేదు. కొన్ని సార్లు అటువంటి అర్హతలే మనిషిని అహంకారిని చేస్తాయి.
ఈ విశ్వంలో రెండు శక్తులు సమాంతరంగా పని చేస్తున్నాయి. వాటినే సచేతనత్వం, నిశ్చలత్వంగా గుర్తిస్తారు. ఈ రెండూ రైలు పట్టాల్లా ఎప్పుడూ కలవవు. సచేతనత్వం నిశ్చలత్వానికి భిన్నమైంది. పరిస్థితుల ప్రాబల్యం వల్ల ఈ రెండు శక్తులూ పోటీపడుతూ మనిషిని కలవరానికి గురిచేసే ప్రయత్నం చేస్తాయి. ఈ రెంటి మధ్య ఒడుదొడుకులు లేకుండా మన సత్ప్రవర్తనను కాపాడుకోవాలి. అప్పుడే మనం గెలిచినట్లు... ఒకరికి మంచి చెప్పే అర్హత సాధించినట్లు!
సమాజంలో అసాంఘిక శక్తులు సమస్యలను సృష్టిస్తాయి. నైతిక విలువలు పాటించేవారు సైతం కొన్నిసార్లు అవినీతిపరుల వల్ల నైరాశ్యానికి గురి అవుతుంటారు. దీనితో మంచివారు సమాజంలో ఇమడలేక ఒంటరి పోరాటం చేస్తుంటారు. ధనం, భుజబలం కలిగినవాళ్లు దుష్టులై సమాజానికి ప్రశ్నార్థకంగా మారతారు. సహజం గానే మంచితనం తాత్కాలికంగా బలహీన పడుతుంది. మంచివారే దోషులనిపించుకుని కష్టాలపాలయ్యే పరిణామాలు ఏర్పడతాయి. శ్రీరాముడొక్కడై లంకలోని రాక్షసులను గెలిచేందుకు తగిన సమయం, బలం, బంటు కోసం వేచి చూడాల్సి వచ్చింది. ప్రహ్లాదుణ్ని రక్షించేందుకు శ్రీహరి సైతం నిరీక్షించాల్సి వచ్చింది. దుష్టులను దెబ్బకొట్టేందుకు శ్రేష్ఠులను సమీకరించుకోవాలి... లంకపై దాడికి వానరుల్ని కూడగట్టినట్లు!
ఆత్మజ్ఞానం కలిగినవాడు దేని గురించైనా చెప్పగలడు. శాస్త్రాలన్నీ అంతర్యామిలో అంతర్భాగాలే. ‘నాలోనే అన్నీ ఉన్నాయి’ అన్నాడు జగద్గురువు శ్రీకృష్ణుడు విశ్వరూప సందర్శన యోగంలో. మనిషి తానెవరో తెలుసుకోవాలి. అమెరికాలో స్వామి వివేకానంద ధార్మిక ప్రసంగం- ఇతర మతాల వారిని సైతం ప్రభావితం చేసింది. నవంబర్, 21, 1893 నాటి డైలీ కార్డినాల్ పత్రిక సంపాదకీయం వివేకానందుడి ప్రసంగాన్ని ప్రస్తుతించింది. ఆయన ప్రజ్ఞలో కౌశలంలో సహజ జ్ఞానం అద్భుతంగా వ్యక్తమైందని వ్యాఖ్యానించింది.
నీతి అనేది- గడ్డిపోచల కలయిక వల్ల ఏర్పడిన గట్టి మోకు లాంటిది. మదమెక్కిన ఏనుగును సైతం అది నియంత్రించగలదు. చెడుపై గెలుపు దక్కాలంటే నైతికత్వం, ధర్మం అవసరం. దైవ బలంతోపాటు అంతర దృష్టీ అవసరం. దీపం ఆరి పోయి తిమిరం అలముకొనకుండా చెయ్యి అడ్డు పెడితేనే ఆ వెలుగులో ఎంతైనా శోధించి సాధించవచ్చు. మనిషిలో నెలకొన్న నైరాశ్యం, వికల్పం తొలగినప్పుడు మానసం నిర్మలమవుతుంది. స్తుతులు, భజనలు మనల్ని మనం నిర్మలం చేసుకునేందుకే. అవేవీ దైవాన్ని బుజ్జగించి మంచి చేసుకునేందుకు కానే కాదు. మాలిన్యాలను మనసులోనుంచి తొలగిస్తూ, దుష్టత్వాన్ని చెరిపి నిర్మలమైన మనసుతో మనం ఏది చెప్పినా అది శ్రేష్ఠమవుతుంది. ఏది రాసినా అదే మధుర కావ్యమవుతుంది.
(ఈనాడు అంతర్యామి)
✍🏻అప్పరుసు రమాకాంతరావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి