20, అక్టోబర్ 2020, మంగళవారం

పోత‌న త‌ల‌పులో....88

 పోత‌న త‌ల‌పులో....88


 సుయజ్ఞావతారం గురించి నార‌దుడికి చెప్పిన‌ బ్రహ్మదేవుడు, 

షడ్దర్శనాలలో ఒకటైన సాంఖ్య యోగం ప్రవర్తింపజేసిన 

కపిలమహర్షి అవతారగాథను ఆలకించ మంటూ ఇలా అన్నాడు.....

***

ధృతమతి దేవహూతికిని దివ్యవిభుండగు కర్దమప్రజా

పతికిఁ బ్రమోద మొప్ప నవభామలతోఁ గపిలాఖ్యఁ బుట్టి యే

గతి హరి పొందునట్టి సుభగంబగు సాంఖ్యము దల్లి కిచ్చి దు

ష్కృతములువాపి చూపె మునిసేవితమై తనరారు మోక్షమున్.

**

     దేవహూతి - కర్దమ ప్రజాపతి దంపతులకు  తొమ్మిదిమంది ఆడ‌పిల్ల‌ల‌తోపాటు , శ్రీహరి కపిలుడు అన్న పేరుతో ఆవిర్భవించాడు. ఏ యోగంతో నారాయణుని పొందటానికి వీలవుతుందో, ఆ మనోజ్ఞమైన సాంఖ్యయోగాన్ని ఆ మహనీయుడు తల్లికి బోధించాడు. ఆ విధంగా ఆమె పాపాలు రూపుమాపి, మునులు అపేక్షించే మోక్షాన్ని ఆమెకు ప్రసాదించాడు.

                       **


ఇక దత్తాత్రేయుని అవతారం ఎలా విలసిల్లిందో వివరిస్తాను విను నార‌దా....


                          **

తాపసోత్తముఁ డత్రి తనయునిఁ గోరి ర-

  మేశు వేఁడిన హరి యేను నీకు

ననఘ దత్తుడనైతి నని పల్కు కతమున-

  నతఁడు దత్తాత్రేయుఁడై జనించె

నమ్మహాత్ముని చరణాబ్జ పరాగ సం-

  దోహంబుచేఁ బూతదేహు లగుచు

హైహయ యదు వంశ్యు లైహికాముష్మిక-

  ఫలరూప మగు యోగబలము వడసి


సంచితజ్ఞానఫల సుఖైశ్వర్య శక్తి

శౌర్యములఁ బొంది తమ కీర్తి చదల వెలుఁగ

నిందు నందును వాసికి నెక్కి; రట్టి

దివ్యతర మూర్తి విష్ణు నుతింపఁ దరమె


         **

అత్రిమహర్షి మునులలో ముఖ్యుడు. ఆయన - తనకు పుత్రుణ్ణి ప్రసాదించమని లక్ష్మీనాథుణ్ణి ప్రార్థించాడు. అప్పుడు శ్రీహరి,  “ ఓ మునీంద్రా! నేను నీకు దత్తుడ నయ్యాను” అని అన్నాడు. అందువల్ల హరియే అత్రికి దత్తాత్రేయుడై జన్మించాడు. ఆ మహనీయుని పాదపద్మపరాగం సోకి హైహయవంశానికీ, యదువంశానికీ చెందిన వారందరూ పవిత్ర దేహు లయ్యారు. ఆయన అనుగ్రహంవల్లనే వాళ్లు ఇహపరలోకాలు ప్రసాదించే యోగబలం ఆర్జించుకొన్నారు. జ్ఞాన ఫలాన్ని, సుఖాన్ని, ఐశ్వర్యాన్ని, శక్తిని, శౌర్యాన్ని పొందారు. అలాంటి దివ్యరూపుడైన విష్ణుదేవుని వినుతించడం సాధ్యమా.

               **


ఇక సనకాదుల అవతార విశేషం ఆల‌కించు...

                    **

అనఘాత్మ! యేను గల్పాదిని విశ్వంబు-

  సృజియింపఁ దలఁచి యంచిత తపంబు

నర్థిఁ జేయుచు సన యని పల్కుటయు నది-

  కారణంబుగ సనాఖ్యలనుగల స

నందన సనక సనత్కుమార సనత్సు-

  జాతులు నల్వురు సంభవించి

మానసపుత్రులై మహి నుతికెక్కిరి-

  పోయిన కల్పాంతమున నశించి



నట్టి యాత్మీయతత్త్వంబు వుట్టఁ జేసి

సంప్రదాయక భంగిని జగతి నెల్ల

గలుగఁ జేసిరి యవ్విష్ణుకళలఁ దనరి

నలువు రయ్యును నొక్కఁడ నయచరిత్ర

                 **

నారద! నేను కల్పారంభంలో విశ్వాన్ని సృష్టింపదలచు కొన్నాను. అందుకోసం  తపస్సు చేస్తూ “సన” అని పలికాను . అందువల్ల సన పేరుతో “సనకుడు, సనందుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు” అనే నలుగురు పుట్టారు. వాళ్లు బ్రహ్మమానసపుత్రులుగా ప్రపంచంలో ప్రసిద్ధికెక్కారు. గతించిన కల్పం చివర అంతరించిపోయిన ఆత్మ తత్త్వాన్ని వాళ్లు మళ్లీ లోకంలో సంప్రదాయానుసారంగా ప్రవర్తింపజేశారు.  ఆ విష్ణుదేవుని కళలతో జన్మించిన వాళ్లు నలుగురైనా నిజానికి వారి అవతారం ఒక్కటే.

                            ***


🏵️పోత‌న ప‌దం🏵️

 🏵️దివ్య ‌ప‌థం🏵️

కామెంట్‌లు లేవు: