20, అక్టోబర్ 2020, మంగళవారం

మాతృమూర్తిగా

 స్త్రీని మాతృమూర్తిగా గౌరవించడం చాలా విశేషం. 


🕉🌹🕉🌹🕉🌹🕉🌹🕉🌹🕉


స్త్రీలయందు మాతృభావన చూపించడం అనేది పురుషుడు చిన్నతనం నుంచి అభ్యాసం చేసుకోవలసిన అంశం. స్త్రీయందు మాతృభావన అనేది కలిగినట్లయితే తప్పకుండా స్త్రీ పట్ల పురుషుడు గౌరవంగా ప్రవర్తిస్తాడు, అవమానించడు, అత్యాచారాలు చేయడు. 


తనయందు నఖిల భూతములందు నొక భంగి సమహితత్వంబున జరుగువాడు

పెద్దల బొడగన్న భృత్యునికైవడి  చేరి నమస్కృతుల్  సేయువాడు

కన్నుదోయికి నన్యకాంతలడ్డంబైన  మాతృభావన సేసి మరలువాడు – అని ప్రహ్లాదుని వర్ణిస్తారు పోతనగారు. 


మానవుడికి సహజంగా పశువు వలె కొన్ని పాశవిక ప్రవృత్తులు ఉంటూ ఉంటాయి. చదువు వల్ల, పెద్దల బోధల వల్ల, సంస్కారం ఏర్పరచుకొని నిగ్రహంతో గౌరవ భావాన్ని తెచ్చుకోవాలి. 

స్త్రీని తల్లిగా చూడడం, తల్లిని దేవతగా చూడడం – ఈ రెండు ప్రతి పురుషుడూ అలవరచుకోవలసినది. 


పతితా మపి మాతరం బుభ్రుయాత్ - తల్లిదండ్రులు దుర్మార్గులు అయితే తండ్రిని విడిచిపెట్టవచ్చేమో గానీ దుర్మార్గురాలు అయినప్పటికీ తల్లిని విడిచిపెట్టరాదు (బోధాయనుడు తన సూత్రాలలో)


 ‘సర్వేషామేవ శాపానాం ప్రతిఘాతో హి విద్యతే| 

న తు మాత్రాభిశప్తానాం మోక్షః క్వచనవిద్యతే!!(మహాభారతం – ఆదిపర్వం)

సృష్టిలో శాపాలను ఎవరైనా అనుభవించక తప్పదు. కానీ లోకంలో ఎవరి శాపం నుంచైనా పరిష్కారం, ప్రతిక్రియ చేసుకోవచ్చు. కానీ మాతృ శాపానికి మాత్రం ప్రతిక్రియ లేదు, పరిష్కారం లేదు. 


తల్లి గానీ తిట్టి బాధపడితే అది తప్పకుండా ఫలిస్తుంది. ఇది గ్రహించి మాతృమూర్తి మనస్సు క్షోభ పడకుండా చూడాలి. ఆవిడ క్షోభ పది ఒక్క మాట అన్నా అది ఫలించి తీరుతుంది. అదే ఆవిడ సంతోషించి దీవెన చేస్తే అది కూడా ఫలించి తీరుతుంది. కనుక దీవెనలు పొందే ప్రయత్నాలు చేయాలి ప్రతివాడూ. 


మాతృత్వం అనేది దైవత్వం. జగన్మాతయైన పరాశక్తి యొక్క విభూతిని కన్నతల్లిలో చూడగలగాలి. 


మాతృభక్తి, పితృభక్తి, గురుభక్తి – ఈ మూడూ మానవులను ధన్యులను చేస్తాయి.

కామెంట్‌లు లేవు: