30, అక్టోబర్ 2024, బుధవారం

*శ్రీ కాళహస్తీశ్వర శతకము* 🙏

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔


  🙏  *శ్రీ కాళహస్తీశ్వర శతకము* 🙏


*చదువుల్ నేర్చిన పండితాధములు స్వేచ్చాభాషణ క్రీడలన్*

*వదరన్ సంశయ భీకరాటవులఁ ద్రోవల్దప్పి వర్తింపఁగాఁ*

*మదనక్రోధకిరాతు లందుఁగని భీమప్రౌఢిచేఁ దాఁకినం*

*బెదరుం జిత్తము చిత్తగింపగఁదవే శ్రీకాళహస్తీశ్వరా!!!*


            *శ్రీ కాళహస్తీశ్వర శతకము - 70*


*తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! వేదములు చదివితిమని చెప్పుకొనుచున్న ధూర్త పండితులు కొందఱు మాటల గారడీతో మాకు భోదలు చేయబోగా వాటిని విన్న మేము... అర్ధం కాక సంశయమను అరణ్యములను పట్టి దోవతప్పి తిరగాడుతున్నాము.  అటువంటి మాపై కామక్రోధములనే మృగములు దాడిచేస్తున్నాయి ....  మేము ఈ విధముగా మతి తప్పి తిరుగాడుతూ ఉంటే మమ్ము ఆదుకొనక ఉపేక్ష వహించెదవేమయ్యా ప్రభో?*


✍️🌷🌺🌹🙏

శ్రీ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం... (కరీంనగర్ జిల్లా )

 🎻🌹🙏శ్రీ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం... (కరీంనగర్ జిల్లా )


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


🌿తెలంగాణలో పేరెన్నికగన్న పుణ్యక్షేత్రాల్లో కొండగట్టు కూడా ఒకటి. ఇది కరీంనగర్ జిల్లాలో ముత్యంపేట గ్రామానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది జిల్లాలోని జగిత్యాల నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 


🌸 తెలంగాణా ప్రాంతంలో 

ప్రసిద్ధి చెందిన 

శ్రీ  ఆంజనేయ స్వామి దేవాలయాలలో శ్రీ కొండ గట్టు ఆంజనేయస్వామి దేవాలయం అత్యంత విశిష్ట మైనది .

ఈ ఆలయం అత్యధిక భక్త జన సందోహాన్ని ఆకర్షించి ,ప్రతి వారికి ఆ స్వామి గుండెల్లో కొలువై ఉండేట్లు చేసింది .


🌿ఈ దేవాలయము అనేక కొండలు, గుట్టలు, దట్టమైన అరణ్యములతో వెలసియున్నది.

ఈ గట్టు మీదనే శ్రీ ఆంజనేయ స్వామి వారు వెలిసినందున దీనికి 'కొండగట్టు' అను పేరు వచ్చింది. 


🌸 పూర్వం రామ రావణ యుద్ధం జరిగే సమయంలో లక్ష్మణుడు కొద్ది సేపు మూర్చపోతాడు.

ఆ సమయంలో సంజీవని తేవడానికి హనుమంతుడు వెలుతారు. సంజీవని మూలికలు దొరక్కపోవడంతో ఆ మూలికలు ఉన్న పర్వతం మొత్తాన్ని పెకిలించుకొని లంకకు తిరుగు ప్రయాణమవుతాడు.


🌿మార్గమధ్యంలో ఆ పర్వతం లోని కొంత భాగం కిందికి పడుతుంది. అలా పడిన క్షేత్రమే కొండగట్టుగా రూపాంతరం చెందిందని చెబుతారు.

 సుమారు 400 సంవత్సరాల క్రితం సింగం సంజీవుడు అనే యాదవుడు ఆవులు మేపుతూ, ఈ కొండ ప్రాంతమునకు రాగా, ఒక ఆవు తప్పిపోయింది. 


🌸సంజీవుడు వెతుకుతూ ఒక పెద్ద చింతచెట్టు క్రింద నిద్రపోయాడు. స్వప్నంలో స్వామి వారు కనిపించి, “నేనిచ్చట కోరంద పొదలో ఉన్నాను. నాకు కాస్త ఎండ ముండ్ల నుండి రక్షణ కల్పించు, నీ ఆవు జాడ ఇదిగో” అంటూ చెప్పి అదృశ్యమయ్యాడు.


🌿 సంజీవుడు ఉలిక్కిపడి లేచి, ఆవును వెతకనారంభించగా, వేయి సూర్యుల కాంతి విరజిమ్మే ఆ పవిత్ర పవనసుతుడు కంటపడ్డాడు. సార్థక నాముడు సంజీవునికి మనస్సులో నిర్మల భక్తిభావం పొంగి పొరలింది. ఆనంద బాష్ప జలాలు రాలీ, స్వామివారి పాదాలను తడిపాయి. దూరం నుండి ఆవు ‘అంబా’ అంటూ పరిగెత్తుకు వచ్చింది. 


🌸 సంజీవుడు గొడ్డలితో కోరంద పొదను తొలగించగా, శంఖు చక్ర గదాలంకరణతో, విశ్వరూపమైన పంచముఖాలలో ఒకటైనా నారసింహ వక్త్రముతో ఉత్తరాభిముఖంగా ఉన్న శ్రీ ఆంజనేయస్వామి వారి రూపమును చూసి ముగ్ధుడయ్యాడు. 


🌿ఓ వైపు నృసింహస్వామి మరో వైపున ఆంజనేయస్వామి ముఖాలు కలిగిన ఆ విగ్రహాన్ని గ్రామస్తులంతా కలిసి ప్రతిష్ఠించారు. 

తన సహచరులతో కలిసి స్వామివారికి చిన్న ఆలయం నిర్మించాడు. 

అక్కడే తనకు తోచిన రీతిలో ధూప ధీప నైవేద్యాలను స్వామివారికి సమర్పించేవారు.


🌸స్వామివారి విభిన్న రూపంతో పాటు కోరిన కోర్కెలు తీరుస్తూ ఉండటం వల్ల ఈ దేవాలయానికి వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. 

ప్రస్తుత దేవాలయాన్ని 160 ఏళ్ల క్రితం కృష్ణారావు దేశ్‌ముఖ్‌ కట్టించాడు.


🌿 ఈ క్షేత్రంలో నారసింహస్వామి ముఖము (వక్త్రము) ఆంజనేయ స్వామి ముఖము, రెండు ముఖములతో వేంచేసి యుండడం 

ఈ క్షేత్ర ప్రత్యేకత. ఇలా ద్విముఖాలతో  ఆంజనేయస్వామివారు కనిపించడం భారత దేశంలోనేకాదు, ప్రపంచంలోనే ఎక్కడా లేదని చెబుతారు.


🌸 నరసింహస్వామి అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపం కాబట్టి కొండగట్టు ఆంజనేయస్వామి వారికి శంఖము, చక్రము, వక్ష స్థలములో రాముడు, సీత కలిగియుండటం ప్రత్యేక విశేషంగా ఇక్కడి గ్రామస్థులు చెబుతారు. 

అందువల్లే ఈ రూపాన్ని దర్శించుకోవడానికి దేశ విదేశాల నుంచి ఎక్కువ సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు.


🌿 దేవాలయమునకు దక్షిణ దిశలో  ఒక బావి ఉన్నది . దానిలోని నీటినే స్వామి వారికి  అభిషేక ,ఆరాధనా కార్యక్రమాలకు ఉపయోగిస్తుంటారు . 

ఆలయ ఆవరణలో  శ్రీ వెంకటేశ్వర స్వామి ,ఆళ్వారులు ,శ్రీ లక్ష్మి దేవి అమ్మ వారి విగ్రహాలు కూడా ఉన్నాయి . 


🌸 దీర్ఘకాల రోగాలతో బాదపడుతున్న వారు ,గ్రహ దోషాలతో సతమతమవుతున్న వారు స్వామివారిని దర్శించుకుంటే  తమ కోరికలు తొందరగా నెరవేరుతాయని  భక్తుల విశ్వాసం .


🌿 ముఖ్యంగా సంతానం లేనివారు ఇక్కడ పూజలు చేస్తే ఫలితం ఉంటుందని చెబుతారు. 

స్థానికుల కథనం ప్రకారం ఈ గుడిలో 40 రోజుల పాటు పూజలు చేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తులు నమ్ముకం 

అందువల్లే మంగళ, శనివారాల్లో ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి భక్తులు వస్తుంటారు. 


🌸 ఈ దేవాలయం దగ్గర్లో మునుల గుహ, తిమ్మయ్యపల్లె శివారులోని బొజ్జ పోతన గుహలు ,భేతాలుడి ఆలయం, పులిగడ్డ బావి, కొండలరాయుని గట్టు ,

ఆలయానికి వెళ్లే దారి పక్కన సీతాదేవి రోధించినట్టు చెప్పే కన్నీటిగుంతలు భక్తులకు దర్శనమిస్తాయి.

ఇటువంటి దర్శనీయ స్థలాలు ఎన్నో ఉన్నాయి.


🌿కొండగట్టుపై నిద్ర చేస్తే మంచి జరుగుతుందని అని భక్తుల నమ్మకం. 

నిత్యం వేలాది మంది భక్తుల దర్శిస్తుంటారు.


🌸ఏటా చైత్ర పౌర్ణమిరోజు హనుమంతుని చిన్నజయంతి, వైశాఖ బహుళదశమినాడు వచ్చే పెద్ద హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా లక్షలాది దీక్షాపరులు అంజన్నను దర్శించుకొని ముడుపులు కడతారు... స్వస్తి..🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

జగముల వెలిగించు జగదేక శక్తివై

 *సీసపద్యము*

జగముల వెలిగించు జగదేక శక్తివై

   జనముల నుతులొందు జనని వీవు

ఎల్లజీవులనెల్ల చల్లంగ కాచేటి

   ఆదిశక్తిగ నీవు అవని వెలుగ

రాక్షస గణముల శిక్షించి వధియించి

   సజ్జనంబులనెల్ల సాకు తల్లి

నీదు రక్షణ మందు నెగడేటి జనికెల్ల

   నిత్యకల్యాణంబు సత్య మిదియె.

*తే.గీ.*

సింహమైన ను తలవంచి సేవలొనరు

త్రిభువనంబుల యందున విభవమొందు

ఆది శక్తిమాయమ్మగ నలరు తల్లి

జనుల గాచెడి యమ్మకు జయము జయము.

*అందరికీ దుర్గాష్టమి,మహానవమి,విజయదశమి శుభాకాంక్షలు.*

విలంబితమైననూ విశేష నుతులివియె.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

61. " మహాదర్శనము

 61. " మహాదర్శనము "-- అరవై ఒకటవ భాగము-- దేవతానుగ్రహము


 61.  అరవై ఒకటవ భాగము--  దేవతానుగ్రహము 


  

          మహారాజు, మంత్రి మొదలగు రాజ పురుషులను పిలిపించుకొని జ్ఞాన సత్రము జ్యేష్ఠ  శుద్ధ సప్తమి నుండీ పౌర్ణమి వరకూ జరగవచ్చునని నిర్ధారించినాడు. దూరపు  మిశ్ర , ఫణి , హిమాలయములకు అవతల అక్షమాల , చీనా దేశముల నుండీ , దక్షిణ దేశపు ప్రసిద్ధ గురుకులములనుండీ, బ్రహ్మ , శ్యామ , మలయ దేశముల నుండీ విద్వాంసులు రావలెను అని అతని ఇచ్ఛ. " మా ఆహ్వానము వెళ్ళి చేరుటకు ఒక నెల. అక్కడినుండీ దూతలు తిరిగి వచ్చుటకు ఒక నెల , దూర దేశముల నుండీ విద్వాంసులు వచ్చుటకు ఒకటిన్నర నెల , మొత్తానికి ఎలాగైననూ మూడు నెలలు కావలెను. కాబట్టి జ్యేష్ఠ శుద్ధమే సరియైనది. " అని అందరూ చేరి సిద్ధాంతము చేసినారు. ఆ దినపు విశేషమేమంటే రాజు మంత్రాలోచనా మండలములో రాజపురోహితుడు భార్గవుడు లేడు. 


          రాజాజ్ఞ ప్రకారము ఆ నాటి నుండే యజ్ఞ మంటపము , విద్వద్వసతి , జలాశయముల నిర్మాణము ఆరంభమైనది. మరుసటి దినము శుభ ముహూర్తములో రాజు అమృత హస్తములతో జ్ఞాననగరపు శంఖు స్థాపన , శిలాన్యాస ప్రతిష్ఠ అయినది. నగరోద్యానములో వసతులు , అక్కడక్కడ కృత్రిమ జలాశయములు , దానికి దక్షిణాన విశాలమైన బయలులో యజ్ఞమంటప ఏర్పాట్లయినాయి. 


          యజ్ఞ మంటపము విద్వాంసులు , మహారాజులు , ప్రేక్షకులూ మొదలైనవారు కూర్చొనుటకు అనుకూలముగా విశాలముగా రచింపవలెను అని రూఢి అయినది. 


          గంగా యమునా తీరములలో, సింధూ సరస్వతుల సమీపములో , దక్షిణాన నర్మదా , తపతీ , కృష్ణా , గోదావరీ , కావేరీ , తామ్రపర్ణీ తీరములలోను , సముద్ర తీరములలోనూ గురుకులములనూ , ఆశ్రమములనూ కట్టుకొని ఉన్న విద్వద్వరేణ్యుల కందరికీ ఆహ్వానములు వెళ్ళినాయి. అట్లే, దూర దేశపు రాజులకు , తమ వద్దనున్న మహా విద్వాంసులను పిలుచుకొని జ్ఞాన సత్రమునకు రావలెనని పిలుపు వెళ్ళింది. అలాగే హిమాచలము నుండీ దక్షిణపు సముద్రము వరకూ ఉన్న నానా దేశముల అధిపతులందరూ విద్వాంసులతో పాటు రావలెనని ఆహ్వాన పత్రికలు వెళ్ళినవి. 


          జ్ఞాన నగరపు నిర్మాణము వేగముగా జరుగుతున్నది. చెరువులు , బావులు , తటాకములు రూపు దిద్దుకుంటున్నాయి. కృత్రిమ కొండలు , వనాలు , కట్టలతో కూడిన మహా వృక్షములూ రాజవీధులూ అన్నీ సృష్టియగుచున్నవి. విశాలమైన భవ్యమైన యజ్ఞ మంటపము పైకి లేస్తున్నది. నగరపు వర్తకులు రాబోవు జన సమూహములకని ధాన్యాదులను రాజ సహాయముతో సేకరిస్తున్నారు. రాజాజ్ఞగా రాజధాని అంతా సింగారిస్తున్నారు. రాజధాని చుట్టు పక్కల గోపాలులు ఏడు దినముల జ్ఞాన సత్రమునకు వచ్చువారికి కావలసిన పాలు , పెరుగు , నెయ్యి , మొదలగునవి సేకరించుటకు కావలసిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అంతా జాగృతమై నగర నిర్మాణము వైపుకు పరుగెడుతున్నది. రాజు ప్రతి దినమూ మిత్రులూ , పరివారముతో కూడి గుర్రములపై కూర్చొని వచ్చి అన్నీ వీక్షిస్తూ పర్యవేక్షిస్తూ వెళుతున్నారు. 


          ఒక దినము రాజుకు ఏదో ఆలోచన వచ్చి, " నేనెంతటి వాడను ? ఈ భారీ కార్యమునకు చెయ్యి వేసి నగుబాటయితే గతి యేమిటి ? భారత ఖండపు రాజులందరికీ , దేశపు రాజులందరికీ , మా రాజ్యపు చుట్టు పక్కల ఉన్న రాజ్యముల , మహానదీ తీరముల గురుకులాధ్యక్షులకందరికీ ఆహ్వానములను పంపించుట అయినది కదా ? వారంతా వస్తే గతి యేమి ? " అని కలవరమైనది. ఒకోసారి , " ఆలోచన ఎందుకు ? మా నగరములో కుబేరులనే కొనుక్కోగల వర్తకులున్నారు , రాజ దివాణము లోని ధనము చాలకపోతే వారితో తీసుకుంటే సరి. " అని ధైర్యము తెచ్చుకొనును. 


          ఇటునుండీ తరిమేస్తే మరలా అటునుండీ వచ్చు వేసవి ఈగల వలె మరుక్షణమే ఆలోచన వచ్చి కలచి వేయును. " వచ్చు విద్వాంసులకు వారికి దారి వెచ్చములకు కాక ఒక వెయ్యి సువర్ణములైనా సంభావనలు ఇవ్వక పోతే జ్ఞాన సత్రము అదెంతటిది ? వచ్చే విద్వాంసులు ఒక్కొక్కరే వస్తారా ? వారి ప్రధాన శిష్యులని నలుగురైదుగురునైనా వెంట  పిలుచుకొని వస్తారు. వారినందరినీ వట్టి చేతులతో పంపుటకగునా ? వారికి ఒక్కొక్క నూరైనా ఇచ్చుట వద్దా ? వారందరూ ఇక్కడున్నంత వరకూ వారికి భోజనాది ఉపచారములు కావద్దా ? ఎలాగెలాగ చూచిననూ ఒక కోటి  సువర్ణములైననూ లేకపోతే ఎలాగ ? ’ అని మరలా భీతి అయినది.   


          రాజుకు , ఆ రాత్రి భోజనము సహించలేదు. హంస తూలికా తల్పము పై పడుకున్ననూ కంటికి నిద్ర రాలేదు. తన రాజ్యపు ఉత్పత్తి యెంత ? వెనకటి వారు సేకరించి పెట్టిన ధనము ఎంత ఉంది ? తాను ప్రయత్నిస్తే ఇంకా ఎంత సమకూర్చవచ్చు ?  అని అంతా లెక్క వేసినాడు. ఎలాగెలాగ లెక్క వేసిననూ యాభై లక్షలకన్నా మించుట లేదు. తనకు ఈ జ్ఞాన సత్రమునకు కావలసినది ఒక కోటి. రాజుకు యోచన బలమై శిరోభారము మొదలైనది.  తీరని యోచన కొనసాగి జ్వరము కూడా వచ్చినది. ఇంకా ఒక్క క్షణము కూడా నిద్ర లేదు. రాజభవనపు బయటి ప్రాకారము నుండీ పిలచినా వినపడునంత నిశ్శబ్దముగా ఉన్న సమయములో , తన నిశ్వాసపు శబ్దము చెవికి ఉరుము వలె వినిపించునట్లై రాజు ఇక పండుకొనలేక  లేచి కూర్చున్నాడు.   


          అప్పుడు ఇంకొక యోచనా లహరి వచ్చినది., " ఔను , ఇదంతా నేను చేస్తున్నది దేనికోసము ? బ్రహ్మిష్ఠుడైన గురువును సంపాదించుటకు. ఇంతవరకూ నాకు తెలిసినవారిలో భగవానులు ఆ పట్టమునకు యోగ్యులు. సరే , విదేశములలో విద్వాంసులే లేరా ? వారెవరైనా వీరికన్నా ప్రబలులైతే ఏమి చేయవలెను ? నేనుగా ఇతడి అవమానమునకు కారణమవుతాను కదా ? మరి , నేను అంత అభిమానవశుడనై చేస్తున్నానా ?  లేదు , అలా అనుటకు లేదు. ఆనాడు ఆతని ఆశ్రమమునకు వెళ్ళి సంహితా బ్రాహ్మణోపనిషత్తులను విన్నపుడు మొదలై , దినదినమూ పల్లవించి పెరిగిన అభిమాన మహా వృక్షము ఇప్పుడు హృదయమంతా నిండిపోయినది. నేను కూడా ఆ అభిమానమునకు వశుడనై పోకూడనంత దూరము , తిరిగిరాలేనంత దూరము వెళ్ళినాను. ఇక వెనుతిరిగి వచ్చుట కానిపని. ఇప్పుడు నాకున్న సర్వస్వమునూ , దానితో పాటు భవిష్యత్తును కూడా చేర్చి వితరణ చేసి ఈ సత్రమును సాధించవలెను. సాధ్యమా ? సాధ్యమా ? "


          రాజుకు ఆందోళన , భయమూ దిగులూ పట్టుకున్నాయి. " అవివేకమైనది కదా , దీనిని సరిదిద్దుకొనుటకు సాధ్యమయ్యేటట్లు లేదు కదా ? " అని హృదయ భారము ఎక్కువైంది. వేలకొద్దీ , కాదు ..లక్షలకొద్దీ సైన్యము ఎదురైనా బెదరక ముందుకురికే వాడు ఇప్పుడు బెదిరిపోయినాడు. పిల్లవాడికి గొగ్గయ్యను చూపినట్లై , ఒణికి పోయేటట్లు బెదరినాడు. ఆ అర్ధరాత్రిలో ఒళ్ళంతా చెమట్లు పట్టి స్నానము చేసినట్లయినది. ఆ చింతా భీతి లో , కలవరపు భయము లో రాజుకు తానెక్కడున్నానన్నది మరపు వస్తున్నది. ఏమి చేయవలెనన్నదీ అర్థము అగుట లేదు. కమ్మిన చీకటిలో ఉన్న కనులు కూడా పోయినట్లైనది. చెవులతో నైనా ఏదైనా విని గుర్తు పట్టి వెళదామన్నా చెవులు కూడా మూసుకు పోయినట్లు అయింది. పైకి లేచుటకు ఊపిరి చాలదు , పండుకొని యుండుటకు   అగుట లేదు , కనులు తెరచుటకు కూడా భయమగుచున్నది. చివరికి తాను ఎవరు ? ఏమిటి ? అనునది మరచిపోయి, ఎందుకు భయపడుతున్నదీ మరచిపోయి , భయము మాత్రము మిగిలి శరీరమంతా గడ గడ   ఒణుకుతున్నది. 


          అట్లే కొంతసేపు అతడు నలుగుతుండగా , ఆయాసము మితిమీరినట్లై జీవుడు స్వస్థానమును వదలి గొంతుకు దిగినాడు. " ఛీ, ఇంత బెదరిన వాని దేహములో మేముండ కూడదు " అని కరణములన్నీ వదలివెళ్ళినాయా అన్నట్లు కరణములు నిశ్చేష్టమౌతున్నాయి. దేహము అలసిపోయి , ఊరికే పడిఉన్నది. జీవుడు కలగంటున్నాడు. 


          కలలో ఒక భారీగా ఉన్న పెద్ద తోపు. అక్కడ చీకటి చేతితో దేవుకొని నింపుకోగలిగినంత  దట్టముగా కమ్ముకొని ఉంది. ఎటు తిరిగిననూ ఒక భారీ వృక్షము అడ్డముగా ఉంది. చెట్లమధ్యలో సందు చూసుకొని వచ్చుటకు కనులున్ననూ వాటి సహాయము విఫలమైనట్లుంది. ఏదో భయమగుచున్నది. చీకటి జంతువులైన ద్విపాద , చతుష్పాదములన్నీ అక్కడ చేరి తనపై దాడి చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లున్నవి. తానొకడే , చేతిలో ఒక ఎండు పుల్ల కూడా లేదు. అవి వందలకొద్దీ ఉన్నట్టనిపిస్తున్నది , ఏమి చేయుటో పాలు పోవుటలేదు. 


          అప్పుడు ఎవరో ఒకరు , ’ జనకా ’ అని పిలుస్తూ వస్తున్నారు. " భయమెందుకు ? జనకా , ఈ చీకటి , ఈ చెట్లు , ఈ పైన పడుటకు కాచుకున్న జంతువులు అన్నీ నీ మనో సృష్టి. ’ మీరంతా నేనే ’ అను . దానికదే మందు. నువ్వు ప్రత్యేకుడివి కాదు అను. ఇదంతా చేరితే ఒకటి , ఆ ఒకటి నువ్వే అను. " అంటున్నారు. జనకుడు తనకు అది అర్థము కాకున్ననూ వారు చెప్పినట్లే అంటున్నాడు. దేహమే తాను అన్న భావము కరగిపోతున్నట్లనిపిస్తున్నది. చైతన్యుడైన తాను అంతటా ఉన్న సర్వ వ్యాప్తుడను అను అనుభవము కలుగు తున్నది. అప్పుడు వేటిని చూచి భయపడ వలెనో ,  వాటిలో ఉన్న వాడూ , అవి  అయి ఉన్నవాడూ తానే అని గోచరమగుచున్నది. పైన ఆకాశములోనూ , చుట్టుపక్కల ఉన్న జడ చేతనములన్నీ ప్రసన్నమగుచున్నవి. మనసూ శరీరము లలో నిండిపోయిన కలవరమూ , భయమూ , దిగులూ అన్నీ మాయమగుచున్నవి. ఎవరో , " అభయం వై ప్రాప్తోసి జనకా " అని తలపై చేయి పెడతారు. తాను సంతోషముతో వారికి పాదాభివందనము చేస్తాడు. లేచి చూస్తే వారు తనకు చిర పరిచితులే అనిపిస్తుంది. అయినా పరిచయము గుర్తు రాదు. అలాగే కళ్ళప్పగించి చూస్తూ ’ తమరు భగవానులు కాదా ?’ అంటాడు. వచ్చినవారు నవ్వుతారు. 


          నవ్వు గలగల శబ్దము తగ్గుతుండగా దృశ్యము మారిపోవు చున్నది. సువర్ణమయ కాంతి ఉన్న ఏదో దివ్య లోకము. అక్కడ ఒక కొండంత ఇల్లు. దాని ముందర తాను సర్వాభరణ భూషితుడై , దివ్య వస్త్రాలంకృతుడై నిలుచుకొని ఉన్నాడు. తన మెడలోనున్న హారముల ప్రసూనములు అప్పుడే వికసిస్తూ చుట్టుపక్కల వ్యాపించియున్న గంధమునకు గంధానులేపనము చేస్తున్నట్లున్నాయి.


          వాకిటనున్న వారు వచ్చి చేతులు జోడించి ," దయచేయవలెను ,  తమకోసమై దేవగురువులు వేచియున్నారు " అని లోపలికి పిలుచుకొని వెళతారు. లోపల ఒక మాళిగ దాటి ఇంకొక మాళిగకు వెళితే అక్కడ గోడకి ఆనుకొని కట్టినట్లున్న ఒక బంగారు మంటపము. అటు ఇటు బంగారు స్థంభములపై బంగారు కుంభములలో నేతి దీపాలు వెలుగుచున్నాయి. ఆ మంటపములో ఒక రత్న పీఠముపై ఒకరు విరాజిల్లుతున్నారు. పిలుచుకొని వచ్చినవాడు ద్వారములోనే నిలచి , జనకునితో , ’ అదిగో , వారే దైవగురువులు. దయ చేయండి ’ అని చేయి నోటికడ్డము పెట్టుకొని చెప్పి తాను వెనుతిరిగిపోతాడు. 


          జనకుడు భయభక్తులతో ఆ పురుష చిన్మయ విగ్రహము వద్దకు వెళ్ళి , నమస్కారము చేసి ప్రసాదాకాంక్షి వలె చేతులు జోడించి నిలుచున్నాడు. దేవగురువు తరుణ ప్రాయుడి వలె కనిపించు  వృద్ధుడని తోచును. అతడు నవ్వితే దిక్కు దిక్కులన్నీ వెలుగుచున్నట్లున్నాయి. చూడగా , ఆ కాంతివేరే అతడు వేరే అనుటకు లేదు. ఆతడు మాట్లాడిస్తాడు, " జనకా , నీ భయమంతా నివారణ అయినదా ? " 


          ఆ ప్రశ్నతోనే జాగృతిలో తనను ఆవరించిన భీతి మరలా వచ్చినట్లవుతుంది . ముఖము వివర్ణమవుతుంది . దేహము కాలినట్లవుతుంది. ఒంటిలో చెమటలు కనిపిస్తాయి, " దేవా , కాపాడవలెను. ఈ భీతి చెరగిపోవునట్లు అనుగ్రహించవలెను" అని రాజు మరలా నమస్కారము చేస్తాడు. 


          దేవగురువు నవ్వి అంటాడు, " భీతి పోయినది . కానీ దాని స్మరణము  నిన్నింకా వదలలేదు. విను, నువ్వు చేయుటకు పూనుకున్న కార్యము దేవతలది. కాబట్టి దీని వ్యయము నంతా  దేవతలే వహిస్తారు. నీ రాజ భవనపు దక్షిణములో అరటి తోట ఉంది కదా ! అక్కడున్న పనస చెట్టు పక్కనే ఒక మనిషిలోతు తవ్వించు. అక్కడ నాలుగు భోషాణములలో సువర్ణము దొరకును. దానిని తీసుకొని వినియోగించు. దానిని నీకు కావలసినట్లు వెచ్చము చేయి. నీ రెండవ భీతికి కారణము లేదు. సర్వజ్ఞుడు ఓడిపోవుట ఉంటుందా ?  ఇకమీద నీవెనుక మేమున్నామని నమ్మకముంచుకొని ధైర్యంగా వర్తించు. అంతా జయమవుతుంది" అని చేయెత్తి  ఆశీర్వాదము చేసినాడు, రాజు తేలికైన మనసుతో దేవగురువుకు నమస్కారము చేసినాడు. 


          అతడికి మెలకువ అయింది. ముఖము వాడిపోయి పానుపుపై పడిఉన్నవాడు పైకి లేచినాడు. నిన్నటి రాత్రి ఉన్న చెడ్డ గుర్తులేవీ లేవు. దేహము లఘువుగా ఉంది. చిత్తాదులన్నీ ప్రసన్నముగా ఉన్నాయి. సన్నగా వీస్తున్న చల్లగాలి ఉదయమవుతున్న సూచనను తెచ్చింది. తొలగుతున్న చీకటి అది నిజమేనని సాక్ష్యము చెపుతున్నది. అక్కడొకటి , ఇక్కడొకటిగా అరుస్తున్న  పక్షులు ఔను, ఔను అంటున్నట్లున్నాయి .


          రాజు కిందటి రాత్రి జరిగినదంతా జ్ఞాపకము తెచ్చుకున్నాడు. ఆశ్చర్యమైనది. అయినంతలో ఏ కొంచమూ మరచిపోలేదు. అలాగే , కల గుర్తొచ్చింది. అదికూడా ఏ మాత్రమూ మరపు రాకుండా అన్నీ గుర్తొచ్చినాయి. మొదటినుండీ చివరివరకూ వివరాలన్నీ గుర్తున్నాయి. 


          రాజుకు తాను కన్న కల తన కలవరము వల్ల కలిగినది అనిపించలేదు. భగవానులు వచ్చినారు , ’ అంతా నువ్వే ’ అన్నారు. ’ అభయం వై ప్రాప్తోసి జనకా ’ అన్నారు. ఆ తరువాత దేవ గురువుల దర్శనమై , వారు నిధి విషయము చెప్పినారు. ’ ఇకమీద నీవెనుక మేమున్నామన్న నమ్మకముతో వర్తించు. అంతా జయమవుతుంది ’ అన్నారు." సర్వజ్ఞుడే గెలుస్తాడు " అన్నారు.  ఇంకొంచము సేపటికి స్నానము చేసి , నిత్య కర్మలన్నీ ముగించి అరటితోటలో తవ్విస్తే అప్పుడు కల నిజమగునా కాదా అని తెలుస్తుంది ’ అని నిర్ణయించుకొన్నారు. అంతలో ప్రాతః కాలపు మంగళవాద్యములూ , దాని వెనకే వందిమాగధుల స్తుతీ వినిపించినాయి. ఆ సుశ్రావ్యమైన వాద్య గీతములు భవిష్యత్తు యొక్క దూతలవలె ఉండి అతనిని ఉత్తేజపరచినాయి. 


          " మంత్రి , కోశాధికారులకు అయినంత వేగముగా వచ్చుటకు వర్తమానము చేయి. తవ్వుటకు నలుగురైదుగురు మనుషులను సిద్ధముగా ఉండమని చెప్పు " అని సేవకుడికి చెప్పి రాజు స్నానమునకు వెళ్ళినాడు. 


          రాజు అన్నీ ముగించుకొని వచ్చు వేళకు మంత్రి , కోశాధికారి ఇద్దరూ వచ్చి కనిపించినారు. రాజు వారి మర్యాదను స్వీకరించి , తనకు ఆదినము పొద్దున్నే అయిన కల లోవి ఎంత చెప్పవలెనో అంత చెప్పి ,వారిని పిలుచుకొని అరటి తోటకు వచ్చినాడు. అరటితోటలో ఉన్న పనస చెట్టు పక్కన తవ్వుటకు అవకాశమున్నది పూర్వ దిక్కులో మాత్రమే. పడగ విప్పిన ఫణిరాజు అక్కడ వీరికోసమే కాచుకొనియున్నట్లు , వీరిని చూడగనే పడగ దింపి వెళ్ళిపోయినాడు. అక్కడే రాజు తవ్వించినాడు. మనిషి లోతు తవ్వగానే పారకు ఏదో లోహపాత్ర తగిలింది. ఖణేల్ మని శబ్దమయింది. అందరి కుతూహలమూ ఇనుమడించింది. 


          ఇంకొంచము తవ్వగనే ఒక లోహ భోషాణము దొరికింది. దానిని పైకి తీసినారు. దానిని ఎత్తుటకు లావుగా పుష్టిగా ఉన్న నలుగురు  కావలసినంత భారముగా ఉంది. దాని పైన ఒక రాతి ఫలకముతో మూసినారు. రెండువైపులా పట్టుకొనుటకు లోహపు చెవులవంటి కొండీలున్నాయి. భోషాణము ఇత్తడిది. అయినా కొంచము కూడా రంగు మాయలేదు. 


         మంత్రీ , కోశాధికారి చేరి భోషాణమును ఎత్తినారు. పైకి వస్తుండగా రాజుకూడా దానిని పట్టి పైకి లాగినాడు. మూతతీసి చూడగా దానిలో మూడు వేళ్ళ వెడల్పు ఉన్న సువర్ణపు నాణెములు. ఆ నాణేములపై , ఒకవైపు ఛత్రమున్న సింహాసనము పై ఆశీర్వాదము చేస్తున్న ముద్రయున్న రాజొకడు , ఇంకొకవైపు ఏదో అజ్ఞాత లిపిలో ఉన్న ఏదో ఒక శ్లోకము. మధ్యలో ఒక చెట్టూ,  దాని మొదట్లో ఒక ఆవు. 


         దానికింద ఇంకొక భోషాణము. దానిని పైకి తీస్తే , దానికింద ఇంకొక భోషాణము. దానినీ పైకి తీసి చూస్తే దానికింద కూడా ఇంకొక భోషాణము. మంత్రి , కోశాధికారులు తోటమనుషులను పిలచి వారి సహాయముతో ఆ భోషాణములను తీయించి అన్నీ రాజభవనమునకు పంపించినారు. కోశాధికారి , ఇతరుల సహాయముతో , ఒక భోషాణములోని నాణెములను లెక్కించినారు. ఒక్కొక్క భోషాణములోనూ ఒక్కొక్క లక్ష ప్రకారము మొత్తం నాలుగు లక్షల నాణెములున్నాయి. కోశాధికారి , " ఇవి ఒక్కొక్క దానికీ మన నాణెములు ఇరవై అయిదు , ఆ లెక్క ప్రకారము దీని వెల ఒక కోటి. " అన్నాడు. 


          రాజుకు వెనుకటి దినము తాను కోరినది ఒక కోటి అని గుర్తొచ్చింది. " ఇదంతా జ్ఞాన సత్రము కోసమే ప్రత్యేకంగా వినియోగించవలెను ’ అన్నాడు. 


కోశాధికారి, " అనుమతి అయితే దీనినంతా కరగించి మన నాణెములుగా అచ్చు వేయిస్తాను " అన్నాడు. 


రాజు , " పది వేల నాణెములు తీసి ఉంచండి , మిగిలినవి మన నాణెములు చేయండి " అన్నాడు. 


          ఆ దినము సంజ లోపల రాజధాని నిండా సమాచారము వ్యాపించింది. ఎక్కడ చూచినా జనాలు గుంపులు గుంపులుగా అదే వార్తను చిన్న గొంతులతో చర్చిస్తూ ఔనా ? అనేవారే ! వీధి జనాల నోటిలో పడిన వార్త క్రమేణా ఇళ్ళకు కుడా వ్యాపించింది. గృహిణులు చేస్తున్న పనిని వదలి , పక్క ఇంటికి వెళ్ళి, ’ ఏమండీ , అది నిజమేనా ? అంటారు. ఆమె, " ఏమోనమ్మా! వారు మాట్లాడుకుంటున్నారు, రాజభవనములో అది ఏదో తోటలో దొరికిందంట. లెక్క పొద్దుటినుంచీ చేస్తున్నా ఇంకా ముగియలేదంట" అంటుంది. 


          ఇంకో చోట ఒకడు అడిగినాడు , " మీరెన్నైనా చెప్పండి , నిక్షేపము దొరకవలెనంటే దేవాంశ ఉండవలెను. మన మహారాజులు దేవతలపై చాలా భక్తికలవారు. అదీకాక వారే దేవాంశ సంభూతులు. లేకపోతే ఇంత ధనము దొరుకుతుందా ? "


" అది ఎవరు దాచినదో ? అదేమైనా తెలిసిందా ? " 


          " ఇంకో విశేషమేమిటో తెలుసా ? దొరికినవన్నీ నాణెములు. ఒక్కొక్క నాణెమూ అరచేతి వెడల్పూ అరచేతి మందము. ఆ నాణెము చెడగొట్టి ఇప్పటి నాణెములు చేస్తే ఒక్కొక్కటీ నూరు అవుతాయంట ! "


" ఇదంతా అయినాక , మహారాజులు దొరికినదంతా జ్ఞాన సత్రానికే ఖర్చుపెడతారంట ! అది కాదా అసలు గొప్ప ? "


          " అదేమి గొప్ప లెండి , మీకు మనుష్య స్వభావము తెలియదు , అంతే. ఇప్పుడు జ్ఞాన సత్రము చేయవలెను అని పూనుకున్నారు. సమయానికి సరిగ్గా ఒక నిక్షేపము దొరికింది. దానిని, ఉద్దరగా దొరికినది ఊరి నిర్మాణానికి అని ఆ సత్రానికి కేటాయించినారు. ఏమి మహా ! " 


          " అదీ నిజమే అనండి , లేకపోతే ఈ కోట్లాది సువర్ణాలు ఎక్కడనుండీ తేవలెను ? మూడునాలుగు తరాలనుండీ రాజ భవనములో కూడబెట్టిన ధనమంతా తీయాల్సి వచ్చేది. "


" రాజ భవనములో నిజంగా ఎంత సేకరించి ఉంటారండీ ? " 


          " ఎంతేమిటి ? ఒక కోటి ఉంటే ఎక్కువ. మన విదేహరాజులు ఇతరులవలె కాదు. వీరు చేస్తున్నట్లు వెనుక జ్ఞాన సత్రములు జరిగి ఉండక పోవచ్చు . కానీ ప్రతి సంవత్సరమూ విద్వత్ సభలు జరిగి , విద్వాంసులకు కావలసినంత ఇచ్చేవారు. వీరు కూడా ఇతర రాజుల వలె భద్రముష్టి గల వారైతే ఎంతో కూడబెట్టి ఉండవచ్చును. "


          ఆ వేళకు ఇంకొకడు వచ్చి గుంపులో చేరినాడు. " ఇంకొక సంగతి తెలుసా ? ఆ నాణెములపైన ఏదో రాసి ఉందట. దానిని చదువుటకు మన ఈ నగరములోనే ఎవరూ లేరంట ! "


" అది మధ్యాహ్నపు వార్త. సంజ వార్త తెలుసా ? ఆ ముసలి శిల్పి చదివినాడంట ! వాడికి నూరు సువర్ణాలు ఇచ్చినారంట ! "


" ఏమి రాసి ఉందంట ? "


" అదేమో దేవేంద్రుడు , మనువు , మన మహారాజు పేరు చెప్పి ఇది జ్ఞాన సత్రమునకు అని రాసి ఉందంట. "


" హా! అలాగ చెప్పండి . లేకపోతే ఆ ధనమునంతా ఈ జ్ఞాన సత్రానికి కేటాయించేవారో కాదో ? "


          ఇలాగే రాత్రి ఒక జాము వరకూ వ్యర్థపు మాటలు నడచినాయి. జనాలకు వ్యర్థపు మాటలు మాట్లాడడమంటే అదేమి పిచ్చో ? అందులోనూ కాంత, కనకం అంటే ఒళ్ళంతా చెవులవుతాయి. మిథిలలోనూ అలాగే అయింది. 


Janardhana Sharma

శంకరుల స్తోత్రాలలోని

 *శంకరుల స్తోత్రాలలోని భగవత్ తత్వాన్ని తెలుసుకోండి* 


 *శంకరతవ హితమేగం పద్య వక్ష్యే,చృణు* 

                              

మీ ప్రయోజనార్థం ఒక శ్లోకం చెబుతాను’’ అంటారు శ్రీ శంకరులవారు. వారి ఆ బోధన ఎప్పుడు ఉపయోగపడుతుంది? 

 *శుకాగమో యాతి సతతం* 

"మీరు ఎల్లప్పుడూ ఆనందాన్ని కోరుకుంటారో, వారి ఈ బోధన మీకు ఉపయోగపడుతుంది." 

*ప్రబోధం* అంటే ఏమిటి? 

తను ఇతరులకోసం చెప్పే మంచి బోధనలు.

 *స్వబ్నే దృష్టం సకలం హి* *మృషా జాగ్రతీ స స్మర దత్వాతీతి॥* 

 “మీ కలలో కనిపించేదంతా అబద్ధమని మీకు తెలుసు. అలాగే జాగృత స్థితి మిథ్య అని తెలుసుకోవాలి” అనేది ఆయన బోధ. 

ఈ విధంగా భగవత్పాదులు వేదాంత తత్వశాస్త్రంతో పాటుగా తన స్తోత్రాలతోనూ మనకు అనుగ్రహించారు.కావున కేవలం శ్లోకాలను కంఠస్థం చేసి భగవంతుని సన్నిధిలో పఠించడంతో ఆగిపోకుండా భగవత్పాదులు చెప్పిన తత్వాన్ని వాటిలో కూడా ప్రయోగిస్తే ప్రతిఒక్కరికీ ఎంతో విశేషమైన ఫలితం లభిస్తుంది.

-- *జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్ధ మహాస్వామి వారు*

60. " మహాదర్శనము

 60. " మహాదర్శనము " --అరవైయవ భాగము --. పూర్వ సిద్ధత


60.  అరవైయవ భాగము --  పూర్వ సిద్ధత



          మాఘ శుద్ధ త్రయోదశి నాడు బయలుదేరుట అని నిర్ణయమైనది. ఇంకా పదునైదు దినములుంది. పుష్య బహుళ ద్వాదశి దినము ఆలంబిని కొడుకును చూచి వచ్చుటకు బయలుదేరింది. సంధ్య వేళకు బండి ఆశ్రమము చేరినది. సంధ్యాస్నానానికి వెళ్ళుటకు సిద్ధమైన భగవానులు తల్లివచ్చిందని ఆమెను తీసుకొని పోవుటకు వచ్చినారు. వెంట కాత్యాయని వచ్చినది. మైత్రేయికి తెలిసి , ఆమె కూడా అత్తను చూచుటకు పరుగెత్తి వచ్చింది. 


         ఆలంబినికి కొడుకునూ కోడళ్ళనూ చూసి సంతోషము ఉప్పొంగినది. కొడుకు తల్లిని చూసి అంతే సంతోషపడినాడు. ఇద్దరు కోడళ్ళూ అత్త వచ్చిందని తల్లిని చూచినదానికన్నా ఎక్కువ సంతోషపడి ఉబ్బిపోయినారు. కొంతసేపు కుశల ప్రశ్నలు అయినాయి. 


          భగవానులు , ’ అమ్మా , మిగిలిన మాటలు తరువాత మాట్లాడుదాము , ఇప్పుడు స్నానానికి వేళయింది ’ అని లేచినారు. కాత్యాయని కూడా లేచింది. భగవానులు , ’ ఇప్పుడు నువ్వు వద్దు. అమ్మ దగ్గర మాట్లాడుతూ ఉండు. మైత్రేయి స్నానానికి నీరు ఇస్తుందిలే , " అన్నారు. కాత్యాయని తల్లిదగ్గర గారాలుపోవు పిల్ల వలె గారాలుపోతూ అడిగింది : " అదంతా కాదు , చూడమ్మా , వీరు అక్కను చూడగానే అంతర్ముఖులై ఎక్కడంటే అక్కడ ధ్యానమునకు కూర్చుంటారు. ఈ పుణ్యాత్మురాలు కూడా వారిని చూడగానే కళ్ళు మూసుకుని కూర్చుంటుంది. ఇప్పుడు వీరిద్దరూ బచ్చలింట్లో కళ్ళు మూసుకుని కూర్చుంటే , తర్వాత నేనెక్కడికి వెళ్ళవలెను ? కాబట్టి స్నానము , భోజనము మొదలైన బాహ్య కర్మలన్నిటిలో నేను వెంట ఉండవలెను. ఔనా కాదా , మీరే చెప్పండమ్మా ! " 


         భగవానులు నవ్వుతూ అన్నారు: " చూచితివా అమ్మా ! ఈమె ఎంత మాటకారి అయినదో ! ఈమె అన్నది కాబట్టి చెపుతున్నాను. నీకు తెలుసు, మొదటినుండీ నేను అంతర్ముఖుడను. పెళ్ళినాడు ఉద్ధాలకులు " నువ్వు ఆమెతో ఉన్నపుడు బహిర్ముఖుడవై ఉండవలెను " అని అనుజ్ఞ ఇచ్చినారు. కాబట్టి మైత్రేయితో ఉన్నపుడు నాకు సహజమైన అంతర్ముఖత్వము , ఈమె తో ఉన్నపుడు ఉద్ధాలకుల అనుజ్ఞ ప్రకారము అభ్యాసమైన బహిర్ముఖత్వము. నాదేమైనా తప్పుందా ? " 


         ఆలంబినికి ఆ మొగుడూ పెళ్ళాల మాటలు బహు ముచ్చట అనిపించినది. ఇద్దరినీ దగ్గరికి తీసుకొని ఒక్కొక తొడపై ఇద్దరినీ కూర్చోబెట్టుకోవలెను అనిపించినది. కానీ , ఏమి చేయుట ? ఇద్దరూ పెద్దవారు. తన మనోభావమునూ , తనకైన మనోల్లాసమునూ కన్నులతోనే వ్యక్త పరస్తూ , " కాత్యాయని చెప్పినట్లే కానీ. నేను మైత్రేయితో మాట్లాడుతూ ఉంటాను , మీరు స్నానము చేసి రండి. " అన్నది. 


         కాత్యాయని , " అక్కా , నేను అగ్నిహోత్రమయ్యే వరకూ రాను. కాబట్టి మా స్నానము తరువాత నువ్వూ స్నానము చేసి , అమ్మకూ స్నానము చేయించి మడి బట్టలివ్వు. ఆమె సంధ్యా కర్మలకు నీరు మొదలైనవి ఇచ్చి , ఆమె అనుష్ఠానమునకు కూర్చున్న తరువాత నువ్వు నీ అనుష్ఠానమునకు కూర్చో. అమ్మా ! మీ అనుష్ఠానము ముగిసేలోగా నేను వచ్చేస్తాను" అని వెళ్ళిపోయింది. వడివడిగా వెళుతున్న ఆ భామినిని ఆలంబిని కళ్ళప్పగించి చూస్తూ , ’ ఇటువంటి ఈమె ఆశ్రమపు రాణియగుటలో అతిశయమేముంది ? ’ అనుకున్నది. 


         ఎంతైనా మైత్రేయి కూడా ఆడది కదా ? అత్త చూస్తున్న రీతిని చూడగనే ఆమె కాత్యాయని విషయములో ఏమేమి ఆలోచించినదో గ్రహించినది, " ఆమె అలాగే అత్తా ! జనుల స్వభావములను ఎంత సూక్ష్మముగా గ్రహిస్తుందనుకున్నారు ? అది చాలదన్నట్టు తాను ఆజ్ఞ ఇస్తున్నపుడు అదేమో విశ్వాసమూ , వినయమూ చూపించి , ఆజ్ఞలోని నిష్ఠురత్వాన్ని పోగొడుతుంది. అలాగ ఉన్నందువల్లనే ఆశ్రమములోని జనాలు , గోవులు కూడా ఆమె మాటను మీరలేరు. నాకైతే ఆమె మాటంటే గౌరవము ! అత్తా , నిజంగా చెపుతున్నాను, ఈమె నన్ను సొంత అక్కలాగా చూసుకుంటుంది. ఎక్కడ , ఏమి చేస్తే , ఏమి పలికితే అక్కడ నొచ్చుకుంటానో అని ఒళ్ళంతా కళ్ళతో  చూస్తూ ఉంటుంది. వరసకు నేను చెల్లెలు కదా ? అయినా నన్ను పెద్దదాని వలె చూస్తుంది. ఆమె గుణము ఎంత పొగడినా చాలదు. " అన్నది. 


ఆలంబినికి ఆ స్తుతి మనసుకు ఎంతో తృప్తినిచ్చింది. " అలాగైతే , నీ పని యేమిటి ? వంటా వార్పూ అంతా ఆమెదేనా ? "


         " నా పని ఏమిటి ? పొద్దున్నే లేచి స్నానము చేసి అనుష్ఠానమునకు కూర్చోవడము. మరలా భోజనము వేళకు వచ్చి ఆమెతో పాటు భోజనము చేయడము. ఎప్పుడైనా ఆమె బయట చేరితే ఆమె పనులన్నీ నేను చేయడము. ముఖ్యముగా వారికి కావలసినది స్నానము, వేళకు సరిగా భోజనము. వారు మాత్రం ఇంకేమి ఉపచారములు అడుగుతారు ? " 


" సరే , నీ భర్త నీతో సరిగ్గా ఉంటున్నారు కదా ? " 


" వారు దేవతా పురుషులు. ప్రియ శిష్యుడితో ఉండుటకన్నా ఎక్కువగా విశ్వాసముతో ఉంటారు. అయినా , నా మనసు, వారికన్నా కాత్యాయనికే నా మీద ప్రేమ ఎక్కువ అంటుంది. " 


         " నాకు ఈ మాట విని చాలా సంతోషమైనది. మీ సవతులు ఇలాగ అక్కచెళ్ళెళ్ళ వలె ఉండుట మా భాగ్యము. ఈ జన్మంతా ఇలాగే ఉండండి అని నా ఆశీర్వాదము. మంచిది , మైత్రేయీ , కాత్యాయని ఊరగాయలు ఏమేమి పెట్టింది ? ఇంకా వడియాలు , వడలు , ఉప్పుమిరపకాయలు చేయలేదా ? ముఖ్యంగా   మిడి మామిడికాయ పెట్టిందా లేదా ? " 


          మైత్రేయి నవ్వి అంది , " నేనింకా , కాత్యాయని భగవతియై ఆశ్రమములో ఎలాగ నడచుకొంటున్నది అని అడుగుతారనుకున్నాను. మీరు గృహిణి కార్య భారమును గురించి అడిగినారు. మిడి మామిడికాయ  అయినది. పనిభారము ఎక్కువైతే నన్ను పిలుస్తుంది. అలాకాక ఎప్పటి వలె అయితే , ఆమె చేసే పనిలో చేయి వేసేందుకు వెళితే , " ఈ చాకిరీ అంతా నాకు వదిలేయి. నువ్వు పుట్టింది కళ్ళు మూసుకుని కూర్చొనుటకు. నువ్వు వెళ్ళు. నువ్వు నీ పని చేయి , మీ సేవ నన్ను చేయనీ " అంటుంది. నేను ఏ జన్మలో ఈశ్వరాధనను ఎంతబాగా చేసినానో ? దాని ఫలముగా మీ ఇంట చేరినాను. " 


           ఆ వేళకు కాత్యాయని స్నానము చేసి వచ్చి , ’ అక్కా, లే , ఇక నువ్వు స్నానము చేసి అమ్మకు స్నానానికి నీరు ఇవ్వవలెను ’ అన్నది. మైత్రేయి స్నానానికి వెళ్ళినది. కాత్యాయని ఘడియ కొకసారి వచ్చి ఆలంబినిని మాట్లాడిస్తుంది. " ఎంత పని చేసినారమ్మా , మీరు వచ్చేది ముందే తెలిసి ఉంటే ఎంత బాగుండెడిది ? పైగా అక్కడినుండీ మాంచి ఎండలో బయలుదేరి వచ్చినారు. దారిలో ఎంత ఆయాసమైనదో, ఏమో ? " అని అనేక రకాలుగా ఉపచారము చేసినది. 


         రాత్రి మొదటి జాములో తల్లీ కొడుకులు ఇద్దరూ భోజనానికి కూర్చున్నారు. కాత్యాయని మంత్రదండము ఉన్నదాని వలె , పులుసు , కూర , పచ్చడి చేసింది. వాటితో పాటు వడియాలు , వడలు , సజ్జన హృదయము వలె సుఖమైన నెయ్యి , రాతి వలె గట్టిగా తోడుకున్న పెరుగులతో భోజనము తృప్తికరముగా ఉండినది. 


         మైత్రేయి , కాత్యాయినులు భోజనము చేసి వచ్చే వేళకు తల్లి తాంబూలము వేసుకుంటూ తాను వచ్చిన పని కొడుకుకు చెప్పింది. కొడుకు ఎవరెవరు వస్తారు అని విచారించినాడు. ఆమె , వచ్చువారందరినీ చెప్పింది. కొడుకు అడిగినాడు, "  దేవి గార్గి మనతో పాటు వచ్చేదేమిటి ? ఆమె విద్యా ప్రస్థానమే వేరు కదా ? " 


తల్లి , రాజ భవనము సమాచారము చెప్పి, జ్ఞాన సత్రపు సంగతి ఎత్తి , ఆమె వచ్చుటకు కారణమిదీ యని వివరంగా చెప్పింది. 


          కొడుకన్నాడు , : " మీరు అంత దూరము వెళ్ళనవసరము లేదు. జ్ఞాన సత్రము కావాలన్నా , వైశాఖ బహుళము వరకూ అగునట్లు లేదు. దేశ , విదేశములనుండీ విద్వాంసులనందరినీ పిలిపించవలెనంటే దానికి పూర్వ సిద్ధత ఎంత కావలెను ? ఏమి కథ ? ఒక వేళ మనము వచ్చులోపల అది జరిగిపోయిందనుకో , నష్టమేమిటి ? అదంతా అటుండనీ , నువ్వు బయలుదేరు అంటున్నావు. మాత్రాజ్ఞా పాలించుట మాత్రమే నాపని. వీరిని అడుగు , వీరేమంటారో ? "


కాత్యాయని " మేము కూడా తోక వెంబడి నారాయణా అంటాము , ఏమే అక్కా ? " అన్నది.


" మైత్రేయి, " అంతే కాక ? "  అన్నది .


Janardhana Sharma

భగవంతుని నిశ్చలమైన ఏకాగ్రతతో ధ్యానించండి

 *భగవంతుని నిశ్చలమైన ఏకాగ్రతతో ధ్యానించండి* 


మనం చేసే మంచి పని లేదా పూజ ప్రచారం కోసం కాదు, దేవుడు వాటిని ప్రసన్నం చేసుకోవాలి అని మన అభిప్రాయం ఉండాలి.   అందుకే భీష్ముడు..

 *యత్భక్త్యా పుండరీకాక్షం స్తవైరర్సేన్నరః సదా...* 

..అని చెప్పారు

 భక్తితో భగవంతుని నామాన్ని జపిస్తే అదే గొప్ప పుణ్యం అని సూచించారు. 

 కనీసం పది నిమిషాలైనా భగవంతుని నామాన్ని భక్తితో చెబితే అది మహా పుణ్యం.. కొందరు పూజా సంధ్యావందనం చేస్తున్నారు.. అప్పుడే అతని మదిలో వేయి ఆలోచనలు మెదులుతాయి.   కనీసం ఆ పది నిముషాలు ఇతర విషయాలను మరచిపోయి భగవత్ పూజపై మనసును నిలపండి.. అది మీకు పరమ దైవానుగ్రహాలను కలిగిస్తుంది.. భక్తిశ్రద్ధలతో కొద్దిసేపు పూజ చేసినా విశేష ఫలితాలను ఇస్తుంది.. కాబట్టి భక్తి ప్రేమికులందరూ విధేయులుగా భగవంతుని భక్తితో పూజించి ఆయన అనుగ్రహం పొందాలి...


-- *జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతితీర్ధ మహాస్వామి వారు*

పరివేదన

 ఇదం కాష్టం ఇదం కాష్టం

నద్యాం వహతి సంగతః౹          

సంయోగాశ్చ వియోగాశ్చ                 

కా తత్ర పరివేదనా॥*


తా - 

ప్రవహించే నదిలో రెండు కట్టెలు దగ్గరకు చేరతాయి. కొంతదూరం కలిసి పయనిస్తాయి తరువాత విడిపోతాయి. అదేవిధంగా మానవుడు ఈ ప్రపంచ ప్రవాహంలో కొంతకాలం సంయోగసుఖమును, మరికొంతకాలం వియోగదుఃఖమును అనుభవిస్తాడు. దానికి పరివేదన చెందనవసరం లేదు.

పంచాంగం 30.10.2024

 ఈ రోజు పంచాంగం 30.10.2024 Wednesday,


స్వస్తి శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: దక్షిణాయనం శరదృతు ఆశ్వీయుజ మాస కృష్ణ పక్ష త్రయోదశి తిథి సౌమ్య వాసర: హస్త నక్షత్రం వైదృతి యోగః: వణిజ తదుపరి భద్ర కరణం. ఇది ఈరోజు పంచాంగం.


 త్రయోదశి మధ్యాహ్నం 01:14 వరకు..

హస్త రాత్రి 09:42 వరకు.


సూర్యోదయం : 06:17

సూర్యాస్తమయం : 05:42


వర్జ్యం : ఈరోజు లేదు.


దుర్ముహూర్తం : పగలు 11:37 నుండి 12:22 వరకు.


అమృతఘడియలు : మధ్యాహ్నం 02:55 నుండి 04:43 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.


యమగండం: ఉదయం 07:30 నుండి 09:00 వరకు.


ఈరోజు మహాశివరాత్రి

.


శుభోదయ:, నమస్కార: