19, ఫిబ్రవరి 2023, ఆదివారం

జీవన్ముక్తుడు

 *శివం తు పూజయత్వా యో*

  *జాగర్తి చ చతుర్దశీం l*

*మాతుః పయోధర రసం*

  *న పిబేత్ స కదాచన ll*

 - స్కందపురాణం


భావం: మహిమాన్వితమైన మహాశివరాత్రి కృష్ణపక్ష చతుర్దశీ రోజున ఎవరు శివపూజ చేస్తారో, ఆ రాత్రి జాగరణ వహిస్తారో వారికి మళ్ళీ తల్లి పాలు తాగే అవసరం రాదు. అంటే ఆ భక్తుడు జీవన్ముక్తుడు అవుతాడని ఇక పునర్జన్మంటూ ఉండదని స్కందపురాణం చెబుతున్నది.🙏

శివాలయం - విష్ణ్వాలయం - బ్రహ్మస్థానం

 *ॐ                 శరీరంలో* 

*శివాలయం - విష్ణ్వాలయం - బ్రహ్మస్థానం* 


*1. మెదడు శివాలయం. అందులోని వెలుగు శివలింగం.*

    *మెదడు అనేది మనస్సు కాదు. మెదడు అనేది మనస్సుకు స్థానము.* 


విశేషం 


    బ్రహ్మరంధ్రమున అగ్ని ప్రతిష్ఠింపబడి యుంటుంది, 

    ఈ అగ్ని అనే వెలుగు, ఒక స్తంభంలాగా సూటిగా ఉంటుంది. 

    దీనినే "శివలింగం" అంటారు. 

    మన భ్రూమధ్యానికి ఎదురుగా వెనుకవైపున ఇది బ్రహ్మరంధ్రం నుండి వ్రేలాడుతుంటుంది. 

    భ్రూమధ్యాన్నే నందియొక్క రెండు కొమ్ముల మధ్య భాగంగా చెబుతారు. 

    దీని ద్వారా, శివాలయంలో గర్భగుడిలోని శివుణ్ణిదర్శించాలి. 

    కపాలమే శివాలయం. 

    పైన చెప్పిన అగ్ని అనే వెలుగే స్తంభరూపంలో ఉండగా! దానిని శివలింగమంటారు. 

    ఇది కైలాసంలో 

  - ధ్యానంలో ఉన్న శివదర్శనానికి 

    నమూనాగా శివాలయంలో, 

  - శివలింగ దర్శనాన్ని ఏర్పాటుచేసి. 

  - మనలోని  మెదడులోని జ్ణానమనే వెలుగును తెలుపుతుంది. 


    మనలోని ఈ శివలింగం యొక్క ఆద్యంతాలు విష్ణుబ్రహ్మలు ఎఱుగరైరి అని కథ చెబుతారు. 


*  *శివుడు జ్ఞానస్వరూపుడు.* 

    *మెదడులోని ఆ జ్ఞానమనే వెలుగు,* 

    *అజ్ఞానమనే అంధకారాన్ని తొలగిస్తుంది.*

    *అర్థరాత్రి లింగోద్భవం అంతరార్థం ఇదే!* 


*2. గుండెకాయ విష్ణ్వాలయము.* 

    *గుండెకాయ హృదయము కాదు. గుండెకాయ హృదయమునకు స్థానము.* 


విశేషం 


    విష్ణువు అంతటా వ్యాపించియున్నవాడు. గుండె ద్వారా భౌతికంగా రక్తం శరీరమంతా పంపిణీ చేయబడుతూ ప్రసరింపబడుతుంది. 

    దానికి సంబంధించిన చైతన్యమే విష్ణుశక్తి. 

    స్థితికి సంబంధించి విష్ణువు 

  - పరమపదంలో ఉంటూ, నియంత్రించేదానికి నమూనాగా, 

  - ఈ లోకంలో విష్ణ్వాలయాలని ప్రతిబింబిస్తూ, 

  - మానవులలో గుండె తెలుపుతుంది. 


* *విష్ణువు సర్వవ్యాపి.* 

    *రక్తం శరీరమంతా వ్యాపించియుంది.*

    *దానికి భౌతిక కేంద్రం గుండె.*  

    *దానికి సంబంధించి చైతన్యశక్తి కేంద్రమే గుండెలోని హృదయం.* 


*3. బ్రహ్మకు ఆలయం లేదు.* 

    *ఆయన ముఖం ద్వారా వ్యక్తమవుతాడు.* 

     *చతుర్ముఖుడుగా వేదాలు ఆయన నోటిద్వారా వినిపిస్తూంటాయి.* 

     *మనకి కూడా పరా - పశ్యంతీ - మధ్యమా - వైఖరీ అని వాక్కు.* 


    భగవత్స్వరూప నిరూపణకు శబ్దం ముఖ్యమైనది. దీనినే శబ్ద బ్రహ్మ అని వేదం తెల్పుతుంది.    

    ఈ శబ్ద బ్రహ్మకి. “పరా, పశ్యంతీ, మధ్యమ, వైఖరి" అని నాలుగు ముఖాలు. 

    ఈ శబ్దం 

  - నాభి వద్ద "పరా"గా ఆరంభమై,  

  - హృదయం వద్ద "పశ్యంతీ"గా చేరి,    

  - గొంతు లో ఉండే స్వర పేటిక వద్ద "మధ్యమా"గా, 

  - నాలుక ద్వారా అక్షరాల రూపంలో "వైఖరి"గా వ్యక్తమౌతుంది. 


* *ఆలయం లేని బ్రహ్మ తన ముఖాలద్వారా వాక్కు వ్యక్తం చేయడంలోని అంతరార్థం ఇదే!* 


                    =x=x=x= 


  — రామాయణం శర్మ 

           భద్రాచలం

చిరునవ్వును

 అలాంటి చిరునవ్వును నేనెన్నడూ చూడలేదు పార్ట్ 1


హిందూమతంలో అధికారపదవిలో వున్న ఒక మతాచార్యుణ్ణి కలుసుకోవాలన్న ఆరాటం నాకుంది. వారిని కలుసుకుని హిందువుల సనాతనదృష్టి యెలా వుంటుందో తెలుసుకోవాలి. కాని హిందూమతంలో లెక్కలేనన్ని శాఖలున్నాయి. క్రైస్తవ మతంలో వునటు దానికొక గురుపీఠమంటూ లేదు. కొంతవరకు క్రైస్తవుల గురుపీఠంలాంటివని చెప్పదగినవి అయిదు శంకరచార్య కేంద్రాలున్నాయని తెలిసింది. అవి ప్రముఖమైన ఒక హిందూ మత శాఖకు సంబంధించినవి. దాని అధిపతులు జగద్గురు శంకరాచార్యస్వామి నుండి పరంపరగా వస్తున్నవారు.


శంకరాచార్యులు ఎనిమిదో శతాబ్దంలో పుట్టిన ఒక గొప్ప మత సంస్కర్త వారు విగ్రహారాధానను ఖండించారు. సర్వదేవతల అభేదాన్ని చాటి చెప్పారు. సనాతనమైన హిందూ శాఖలకు ఒక ఐక్యరూపాన్నివ్వటం కోసం ప్రయత్నించార్. వారి తర్వాత వచ్చిన ఆచార్యులందరూ తమ వారసుల్ని తామే నియమించారు. ఈ తరంలో కంచికామకోటి పీఠాధిపతులకున్నంత ఆధ్యాత్మికమైన అధికారం మరే పీఠాధిపతికీ లేదు. వారు రెండు హిందూశాఖలను - అంతవరకూ ఒకదానితో విభేదించిన వాటిని - ఏకం చేయగలిగారు. ప్రస్తుతం దక్షిణభారతదేశంలో కనబడి ఆధ్యాత్మిక పునరుజ్జీవనం కేవలం వారి వల్లనే కలిగింది. వారెంతో పవిత్రులనీ జ్ఞానమార్గంలో చాలా దూరం పయనించారని విన్నాను. నేను దర్శించినప్పుడు వారి మద్రాసుకు సమీపంలోనే వున్నారు.


మా సమావేశాన్ని ఏర్పాటు చేసినవారు ప్రొఫెసర్ రాఘవన్. వారు మద్రాసు విశ్వవిద్యాలయంలో సంస్కృతశాఖాధ్యక్షులు. వారు రచించిన 'భారతీయ వారసత్వం’ అనే గ్రంథాన్ని భారతదేశాధ్యక్షుల పీఠికతో ఐక్యరాజ్యసమితికి చెందిన విద్యాసాంస్కృతిక శాఖవారు ప్రచురించారు. ఆ గ్రంథం సంస్కృత వాజ్మయానికి సంబంధించిన పరమ ప్రామాణికమైన ఆధారగ్రంథం. ఆ గ్రంథంలోని వాక్యాలను తరువాతి అధ్యాయాల్లో చాలా పర్యాయాలు ప్రమాణాలుగా ఉగ్గడించాను


రాఘవన్ ను విశ్వవిద్యాలయంలోనే మొదటిసారి కలిశాను. అప్పుడు వారు పాశ్చాత్యవేషంలో వున్నారు. తీరికలేని ఓ పెద్దమనిషి అతిథికి మర్యాద చేయటం కోసం ఎంత ఇబ్బంది పడతారో అంత ఇబ్బందీ నాకోసం పడ్డారు. రెండోసారి వారిని కలుసుకోవటం శంకరాచార్యులవారి దర్శనానికి వెళ్లేటప్పుడే. అప్పుడు వారు ధోవతిమాత్రం కట్టుకుని వున్నారు. చొక్కా వేసుకోలేదు. మద్రాసు వీధుల్లో ఎందరెందరో యాత్రికులూ, బిచ్చగాళ్లూ ధోవతి చుట్టుకునే కనబడతారు, కాని ఒక మధ్య వయస్కుడైన ప్రొఫెసర్ నడుందాకా దిగంబరంగా వుండి ఓ ఖరీదైన కార్లో మెత్తటి సౌకర్యాలమీద వాలి కూర్చున్న దృశ్యం నా కెందుకో అసాధారణమనిపించింది. “ఇలాటి వారే మా యిద్దరికి ఒక మిత్రులున్నారు. వారిమీదా మీ మీదా శంకరాచార్యులవారి ప్రభావం ఏమైనా పడిందా?” అని రాఘవన్ నడిగాను. “మాలో ఏదైనా గుణముంటే అది స్వామివారివల్ల సంక్రమించిందే. దోషాలన్నీ మావి” అన్నారు వారు. 


మద్రాసు పరిసరాల్లో ఓ వీథిమూల చీకట్లో కారాపి, చెప్పులు వదిలి క్రిందికి దిగాము. దిగంగానే ఓ మధ్య వయస్కుడైన పెద్దమనిషి మమ్మల్ని పలకరించారు. వారు మద్రాసులో ఓ ప్రచురణకర్తట, రాఘవన్ పరిచయం చేశారు. ఆ ప్రచురణకర్త "ప్రతిసాయంకాలం ఆరు నుండి పదకొండు గంటలదాకా స్వామివారిని కనుపెట్టుకుని వుంటున్నా”నని చెప్పారు.


ఆ వీథిలో దేవాలయం ప్రక్కనవున్న ఓ పాడుబడ్డ చిన్న యింట్లో అడుగుపెట్టగానే యెదురుగా మసక చీకట్లో ఓ యిరుకు వరండా కనిపించింది. దాని కడ్డంగా పురాతనమైన ఓ పల్లకీ వుంది. పల్లకీకి తెల్లరంగువేశారు. ముందూ వెనకా బోయీలు మోసేగట్టి గుంజలకు మాత్రం నల్లరంగు. ఆ వరండాలోంచి ఓ చిన్నగదిలోకి ద్వారముంది. అది జైలుగది లాంటిది. అందులో అంతకు ముందే కొందరొక చాపమీద కూర్చున్నారు. వారితో పాటు మేమూ కూర్చున్నాము.


గుసగుసలాడినట్లేదో మాట్లాడి, కొన్ని నిమిషాలయాక ఓ యువకుడు పల్లకీ దగ్గరకు వెళ్లి వంగి ఎవరితోనో ఏదో మాట్లాడాడు. ఏ ఆకారమూలేని మోపు మీద కప్పినట్లున్న యిటుక రంగు కంబళి పైకీ కిందకీ కదలి పల్లకీలోంచి స్వామివారు మెల్లగా లేచారు. లేస్తూనే కంబళి తలమీద, ఒంటినిండా కప్పుకున్నారు.


వారు పొడగరే. సన్నగా వున్నా చిక్కిపోయినట్లు లేరు. మత్తు వదలక తడబడుతూ పల్లకీ సందుగా లోపలికి వచ్చినా ముందు చాపమీద బాసికపట్టు వేసుకు కూర్చున్నారు. వెంటనే గదిలోవున్న వారందరూ బయటికి వెళ్లారు. వెళ్లినా ద్వారం పక్కనే నిలబడి అప్పుడప్పుడూ తొంగిచూస్తూ చెవులప్పగించి వింటున్నారు. మద్రాసులోని వివేకానంద కళాశాలలో పనిచేస్తున్న ప్రొఫెసరొకరు మామధ్య 'దుబాసి'గా వ్యవహరించారు. ఓ అరనిమిషం సేపు స్వామివారేం మాట్లాడలేదు. ఆ అరనిమిషమూ సాయం ముఖాన్ని పరిశీలనగా గమనించాను. కఠోరమైన ఆధ్యాత్మిక సాధనమూలంగా వారి ముఖకవళికలు చాలామట్టుకు పోయి అవసరమయినవే మిగిలాయి. ఉన్నవాటిలో ప్రముఖంగా కనబడేది తెల్లని కురుచ వెంట్రుకల క్రింద ఎత్తైన అర్ధగోళంలా వున్న వారి నుదురు. రెండోది వారి కళ్లు. అవి లోతుగా మెత్తటి చీకటి నీడలు పరుస్తూ కపాలం క్రింద నుంచి గ్రుచ్చి చూస్తున్నట్లున్నాయి. వారి పెదవులు తీర్చినట్లుండి పెరిగిన గడ్డం మధ్య ఆచితూచి మాట్లాడే ప్రతి మాటకూ దృఢంగా భావబంధురంగా కదలుతున్నాయి. వారు నిద్రావస్థలో నుండో సమాధిస్థితి నుండో మెల్లగా బయటకు వస్తున్నట్లనిపించింది. వారి చూపులు ఎదుటివారి మీద నిశ్చలంగా నిలిచివున్నాయి. వారు రోజుకు ఓ మూడుగంటలకన్నా ఎక్కువసేపు నిద్రపోరని విన్నాను. తన విధులకూ, కర్మకాండకూ పోను అప్పుడప్పుడూ మిగిలిన కొద్దిపాటి వేళల్లో పల్లకీలో ఓ మూల చుట్టచుట్టుకుని పడుకుంటారు. వారు నిద్రలో వున్నారో సమాధిలో వున్నారో తరచు భక్తులే చెప్పలేరు. మెల్లగా వారు నేను భారతదేశం రావటానికున్న కారణమడిగారు.


“ఈ దేశాన్ని ప్రజల్ని ఊరికే చూచి పోదామనా లేక యిక్కడి ప్రజల నేదైనా మంచిదారిలో పెడదామనా?”


అంతకుముందు వచ్చిన పుస్తకాలమీద పత్రికలవారు చేసిన వ్యాఖ్యానాలు దృష్టిలో పెట్టుకుని స్వామివారడిగిన ప్రశ్న అది. “చూడటానికీ, తెలుసుకోవటానికి మాత్రమే వచ్చాను. మరే ఉద్దేశమూ లేదు” అన్నాను. 


స్వామి : స్థిరమైన ఆసక్తికి కూడా కొంత ప్రభావం వుంటుంది. ఏమీ ప్రత్యేకంగా చెయ్యక్కర్లేదు. ఊరికే ఒక సమస్యపట్లగానీ, ఒక దేశంపట్లగానీ మన మేర్పరుచుకున్న దృక్పథానికి కూడా ఒక శక్తి, చైతన్యం వుండి తీరుతాయి. 


“అలా వుండటం నాకు బాధగా వుంది. అయినా ఏ నీడా పడకుండా మనిషి కదల్లేడుకదా” అన్నాను.


అప్పుడు స్వామివారు "సత్యమైన సానుభూతి ఒక విధమైన తేజస్సును విరజిమ్ము తుంది” అంటూ చిరునవ్వు నవ్వారు. ఆ చిరునవ్వు పసిబిడ్డ చిరునవ్వు. అలాటి నను నేనెన్నడూ చూడలేదు. ఆ చిరునవ్వులో అసామాన్యమైన మనోజ్ఞత వుంది. మాధుర్యముంది. వారితో మాట్లాడి తిరిగి వస్తూ దారిలో అనుకున్నాను. పాశ్చాత్య చిత్రకారులు చిత్రించిన సాధు పురుషుల ముఖాలమీద - వారు పారవశ్యంలో వున్నప్పుడుగాని, వారికి ధన్యత సిద్ధించినప్పుడుగానీ, మతంకోసం త్యాగం చేసినప్పుడుగానీ - ఆ చిరునవ్వును, ముగ్ధమోహనమైన ఆ ఎందుకు చిత్రించలేదా అని! యోగులందరూ తమ అనుభవాలు చెప్పినట్లు బహుశా ఆ చిరునవ్వుకూడా ఉలికీ, కుంచెకూ అందలేదేమో


(సశేషం)


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

శివుడు

 ॐ          మహా శివరాత్రి శుభాకాంక్షలు 


               ఓమ్ నమశ్శివాయ 


శివ శబ్దం - వ్యుత్తత్తి 


1. పరమానందస్వరూపుడై, ఏ విధమైన పరిణామాన్ని పొందక ఉండేవాడు కాబట్టి శివుడు. 

    "శామ్యతి పరమానందరూపత్వాత్ నిర్వికారో భవతి ఇతి శివః" 

2. ఇతనియందు సత్పురుషుల మనస్సులు ఉంటాయి కాబట్టి శివుడు అని అర్థం. 

    "శేరతే సజ్జనమనాంసి అస్మిన్ ఇతి శివః" 

3. సాధుపురుషుల మనస్సులందు శయనించి యుండేవాడు కాబట్టి శివుడు అని పేరు. 

    "శేతే సజ్జనమనస్సు ఇతి శివః" 

4. శివం అంటే శుభం. శుభంతో కూడినవాడు శివుడు. 

    "శివం కల్యాణం తద్యోగాత్ శివః" 

5. శుభాలు ఇచ్చేవాడు కాబట్టి శివుడు. 

    "శివప్రదత్వాత్ శివః" 


శంకరుని - పంచముఖాలూ - పంచాక్షరి - పంచభూతాలు 


1. పృథ్వి (భూమి): 

    భూమి ఉదకముల నుండి ఉత్పన్నమైంది. 

    కటకట శబ్దాన్ని, కఠిన స్పర్శనీ, లవణాది రసములనూ, గంధ గుణాన్నీ కలిగి, 

    ఇచ్ఛాశక్తిని, సృష్టికృత్యాన్నీ, 

  "సద్యోజాత" ముఖాన్నీ, నివృత్తి కళనూ, చతురస్రాకారాన్నీ, 

   "న" కారబీజమున నొప్పుచు, 

    బ్రహ్మమును అధిష్ఠానంగా కలిగియున్నది. 


ఓం   సద్యో జాతం ప్రపద్యామి

        సద్యో జాతాయ వై నమో     

        నమః 

        భవే భవే నాతి భవే

        భవస్వమాం భవోద్భవాయ

        నమః 


2. జలం (ఆపః) 

    జలావిర్భావం అగ్ని నుండి జరిగింది. 

    ఆది బుడబుడ అనే ధ్వనిని, శీతస్పర్శనీ, శ్వేతవర్ణాన్నీ, మధుర రసాన్నీ, జ్ఞానశక్తినీ, స్థితకృత్యాన్నీ, 

   "వామదేవ" ముఖాన్నీ, ప్రతిష్ఠాకళనూ, 

   "మ"కార బీజాన్ని, అర్థచంద్రాకృతిని కలిగి, 

    విష్ణువును అధిదేవతగా భాసిస్తుంది. 


ఓం  వామదేవాయ నమో

        జ్యేష్ఠాయ నమః 

        శ్రేష్ఠాయ నమో

        రుద్రాయ నమః

        కాలాయ నమః 

        కలవికరణాయ నమో

        బలవికరణాయ నమో 

        బలాయ నమో 

        బలప్రమధనాయ నమ

        స్సర్వ భూతదమనాయ నమో

        మనోన్మనాయ నమః 


3. అగ్ని: 

    అగ్ని వాయువు నుండి పుట్టింది. 

    బుగబుగమనే శబ్దాన్నీ, ఉష్ణగుణాన్నీ, క్రియాశక్తినీ, సంహారకృత్యాన్నీ, విద్యాకళనూ, 

   "అఘోర" ముఖాన్నీ కలిగి, 

   "శి"కార బీజాన్నీ, ఎరుపు రంగునీ, త్రికోణాన్నీ కలిగి. 

    రుద్రుని అధిష్ఠాతగానొంది ఒప్పారుతోంది. 


ఓం. అఘోరేభ్యోఽథఘోరేభ్యో

       ఘోర ఘోరతరేభ్యః 

       సర్వేభ్యః సర్వశర్వేభ్యో

       నమస్తే అస్తు రుద్రరూపేభ్యః 


4. వాయువు: 

    వాయువు ఆకాశంనుండి గలగల శబ్దాన్నీ అనుష్ణశీత స్పర్శలను రెండు గుణాలతో ఆవిర్భవించింది. 

    వాయువు (గాలి) ఆదిశక్తిని, తిరోధానకృత్యాన్నీ, 

   "తత్పురుష" ముఖాన్నీ, 

    షట్కోణాకృతినీ, రూపంలేని స్పర్శగుణాన్నీ, శాంతికళనీ, ఆకుపచ్చని రంగునీ, 

   "వ"కార బీజాన్ని కలిగి 

    ఈశ్వరుని అధిష్ఠాతగా ఒప్పుచున్నది. 


ఓం తత్పురుషాయ విద్మహే

       మహాదేవాయ ధీమహి 

       తన్నో రుద్రః ప్రచోదయాత్ 


5. ఆకాశం: 

    ఈ ఆకాశం పరాశక్తియును, అనుగ్రహకృత్యమును, 

   "ఈశాన" ముఖాన్నీ, శాంత్యతీత కళనూ, గుండ్రని రూపాన్నీ, పసుపు వర్ణాన్నీ కలిగి 

   "య"కార బీజముతో ఒప్పుచూ సదాశివుని అధిదేవతగా కలిగి ఉంటుంది. 


ఓం. ఈశాన స్సర్వ 

       విద్యానామీశ్వర

       సర్వభూతానాం

       బ్రహ్మాధిపతి 

       ర్బ్రహ్మణోధిపతిర్

       బ్రహ్మ శివోమే అస్తు

       సదాశివోం 


                          =x=x=x= 


  — రామాయణం శర్మ 

           భద్రాచలం

ఒక అనుమానం

 తాతా..తాతా...ఒక అనుమానం..అడగనా?


అడుగురా చంటీ... ఆడిగితేనే కదా అనుమానం తీరేది..


ఏం లేదు తాతా రోజూ నువ్వు కుళాయి నీళ్లతో స్నానం చేస్తున్నావ్ కదా! మరి ఆ చేస్తున్నప్పుడు నువ్వు ' ॥ ఓం గంగైచ యమునై చైవ - కృష్ణా గోదావరీ సరస్వతి నర్మదా సింధు కావేరీ - జలేస్మిన్ సన్నిధిం కురు॥ అని ఎందుకు చదువుతావు ? నువ్వేమి గంగ నీటి తోనో గోదావరి నీటి తోనో స్నానం చెయ్యడం లేదు కదా?


మంచి ప్రశ్న వేశావు. సరే జవాబు విను.


మన పూర్వీకులు ఏ పని చేసినా ఒక ఆశావహ దృక్పధం అంటే పాజిటివ్ ఆలోచనతో చేస్తే ఆ పని ఫలితం కూడా పాజిటివ్ గా వుండే అవకాశం మెరుగుపడుతుంది అని తెలుసుకొని మన రోజూ వారీ జీవనవిధానంలో కూడా అలా పాజిటివ్ గా ఆలోచించే విధంగా కార్యక్రమాలులో లేదా అలవాట్లులో చొప్పించారు. 

మీ మామ్మ చూడు..

బియ్యం అయిపోయాయి అని చెప్పదు. నిండుకున్నాయి అని అంటుంది.

అలాగే దీపం ఆరిపోయింది అనదు, ఘనం అయింది లేదా దీపం కొండెక్కింది అంటుంది

నల్ల పూసల గొలుసు లేదా మంగళ సూత్రం తెగితే.. గొలుసు పెరిగింది అంటుంది. కానీ తెగింది అని అనదు.

ఇలా ప్రతీదీ పాజిటివ్ గానే చెపుతుంది తప్ప నెగటివ్ గా చెప్పదు.


ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న తీసుకుంటే..

మనకి గంగ యమునా గోదావరి వంటి నదులను పవిత్రంగా భావిస్తాం వాటిని దైవాలుగా కూడా కొలుస్తాం వాటి నీరు వాడుక కూడా ఆరోగ్యంగా భావిస్తాం. కానీ అన్ని ప్రదేశాల్లో ఆ పవిత్ర నదులు ఉండవు కదా! అందుకే అసలు నీటికే గంగమ్మ అని పేరు పెట్టేసుకున్నాం. అలాగే నీటితో జీవితాలు పెనవేసుకున్న బెస్తవారిని గంగపుత్రులు అంటాం. అంటే గంగ వంటి పవిత్ర నదులు మన జీవితాల్లో ఎంతగా పెనవేసుకున్నాయో చూశావు కదా! 


నేను కుళాయి నీళ్ల తోనో, చేరువులోనో, యేటి నీళ్ల తోనో స్నానం చేస్తున్నప్పుడు కూడా ఈ శ్లోకం పఠించో లేక ఒక దండం పెట్టో ఆ నీటిని పవిత్ర గంగజాలంగా భావించి స్నానం చేస్తున్నాను అన్న మాట. అలా భావించడం వల్ల మనం మానసికంగా ఒక పాజిటివ్ థాట్ ని శరీరానికి ఇస్తున్నాం. అంటే ఈ నీరు పవిత్ర గంగాజలంతో సమానం. నా ఆరోగ్యానికి హాని కలుగకుండు గాక అని.


అంటే అలా అనేసుకుంటే అవి నిజంగా గంగ, గోదావరి నీళ్ళు అయిపోతాయా తాతా అని నువ్వు అడగవచ్చు.. దీనికి నేను ఉదాహరణ చెపుతాను.


మా చిన్నప్పుడు రైల్లో వెళుతున్నప్పుడు తాగడానికి నీరు ఇలా మినరల్ వాటర్ బాటిల్స్ లో దొరికేది కాదు..ప్లాట్ ఫామ్స్ మీద కుండలతో ఆ తరువాత కుళాయిలు ఆ తరువాత కూలర్స్ లో అందించేవారు. అదే నీరు భయపడకుండా తాగేవారం. ఇప్పుడు (చేతిలో కాస్త డబ్బు ఉంటే) ఆ నీరు తాగడానికి భయపడుతున్నాం. అందుకని ₹20 పెట్టి ఒక లీటర్ నీళ్లు కొనుక్కొని తాగుతున్నాం. మరి ఆ సీసాలో దొరికే నీళ్లు నువ్వు ప్రతీ సారీ టెస్ట్ చేసి తాగవు కదా! ఆ సీసా మూత సీల్ సరిగ్గా ఉంటే ఏ అనుమానం లేకుండా తాగేస్తున్నావ్. మరి ఆ కంపనీ వాడు ఆ సీసాల్లో ఏ బోర్ నీళ్ళో, చెరువు నీళ్ళో పోసి ఉండచ్చు కదా! అలాగే ఈ మధ్య వింటున్నాం ప్లేట్ ఫార్మ్ మీద దొరికే ఆ ఖాళీ బాటిల్స్ లో సాధారణ కుళాయి నీరు పోసి దొంగ సీల్ వేసి ట్రైన్స్ లో అమ్ముతున్నారు అని. అయినా మనం అనుమానం పడకుండా తగుతున్నాం. అంటే దానికి కారణం ఆ సీసా మీద ఉన్న బ్రాండ్ పేరు. అంటే ఆ నీటికి కంపనీ వాడు ఒక బ్రాండింగ్ చేసాడు. నిజంగా టెస్ట్ చేయకపోయినా ఆ పేరు చూసే మనం ఆ నీటి క్వాలిటీ నమ్ముతున్నాం. అంటే మనసుకి ఒక ధైర్య వచనం చెపుతున్నాం. నేను తాగుతున్న నీరు ఫలానా కంపెనీ స్వచ్ఛమైన నీరు. ఈ నీరు తాగినా నాకు అనారోగ్యం రాదు అని. ఒక వేళ ప్రయాణంలో కానీ ప్రయాణం అయ్యాక గాని సుస్తీ చేసినా ఈ నీటి వల్ల అని అనుమానించం.

అంటే అక్కడ నువ్వు ప్రతీసారీ టెస్ట్ చేయకపోయినా నమ్ముతున్నావ్. అంటే ఇక్కడ ఆ బ్రాండింగ్ నీకు ఒక పాజిటివ్ ఆలోచనని ఇస్తోంది అన్నమాట.


అంటే ఈ శ్లోకం చదవడం ద్వారా లేదా ఒక నమస్కారం పెట్టడం ద్వారా ఆ సాధారణ నీటికి మనం మానసికంగా బ్రాండింగ్ చేస్తున్నాం అన్న మాట

       *SO BE POSITIVE*. 

*


🙏🙏🙏