అలాంటి చిరునవ్వును నేనెన్నడూ చూడలేదు పార్ట్ 1
హిందూమతంలో అధికారపదవిలో వున్న ఒక మతాచార్యుణ్ణి కలుసుకోవాలన్న ఆరాటం నాకుంది. వారిని కలుసుకుని హిందువుల సనాతనదృష్టి యెలా వుంటుందో తెలుసుకోవాలి. కాని హిందూమతంలో లెక్కలేనన్ని శాఖలున్నాయి. క్రైస్తవ మతంలో వునటు దానికొక గురుపీఠమంటూ లేదు. కొంతవరకు క్రైస్తవుల గురుపీఠంలాంటివని చెప్పదగినవి అయిదు శంకరచార్య కేంద్రాలున్నాయని తెలిసింది. అవి ప్రముఖమైన ఒక హిందూ మత శాఖకు సంబంధించినవి. దాని అధిపతులు జగద్గురు శంకరాచార్యస్వామి నుండి పరంపరగా వస్తున్నవారు.
శంకరాచార్యులు ఎనిమిదో శతాబ్దంలో పుట్టిన ఒక గొప్ప మత సంస్కర్త వారు విగ్రహారాధానను ఖండించారు. సర్వదేవతల అభేదాన్ని చాటి చెప్పారు. సనాతనమైన హిందూ శాఖలకు ఒక ఐక్యరూపాన్నివ్వటం కోసం ప్రయత్నించార్. వారి తర్వాత వచ్చిన ఆచార్యులందరూ తమ వారసుల్ని తామే నియమించారు. ఈ తరంలో కంచికామకోటి పీఠాధిపతులకున్నంత ఆధ్యాత్మికమైన అధికారం మరే పీఠాధిపతికీ లేదు. వారు రెండు హిందూశాఖలను - అంతవరకూ ఒకదానితో విభేదించిన వాటిని - ఏకం చేయగలిగారు. ప్రస్తుతం దక్షిణభారతదేశంలో కనబడి ఆధ్యాత్మిక పునరుజ్జీవనం కేవలం వారి వల్లనే కలిగింది. వారెంతో పవిత్రులనీ జ్ఞానమార్గంలో చాలా దూరం పయనించారని విన్నాను. నేను దర్శించినప్పుడు వారి మద్రాసుకు సమీపంలోనే వున్నారు.
మా సమావేశాన్ని ఏర్పాటు చేసినవారు ప్రొఫెసర్ రాఘవన్. వారు మద్రాసు విశ్వవిద్యాలయంలో సంస్కృతశాఖాధ్యక్షులు. వారు రచించిన 'భారతీయ వారసత్వం’ అనే గ్రంథాన్ని భారతదేశాధ్యక్షుల పీఠికతో ఐక్యరాజ్యసమితికి చెందిన విద్యాసాంస్కృతిక శాఖవారు ప్రచురించారు. ఆ గ్రంథం సంస్కృత వాజ్మయానికి సంబంధించిన పరమ ప్రామాణికమైన ఆధారగ్రంథం. ఆ గ్రంథంలోని వాక్యాలను తరువాతి అధ్యాయాల్లో చాలా పర్యాయాలు ప్రమాణాలుగా ఉగ్గడించాను
రాఘవన్ ను విశ్వవిద్యాలయంలోనే మొదటిసారి కలిశాను. అప్పుడు వారు పాశ్చాత్యవేషంలో వున్నారు. తీరికలేని ఓ పెద్దమనిషి అతిథికి మర్యాద చేయటం కోసం ఎంత ఇబ్బంది పడతారో అంత ఇబ్బందీ నాకోసం పడ్డారు. రెండోసారి వారిని కలుసుకోవటం శంకరాచార్యులవారి దర్శనానికి వెళ్లేటప్పుడే. అప్పుడు వారు ధోవతిమాత్రం కట్టుకుని వున్నారు. చొక్కా వేసుకోలేదు. మద్రాసు వీధుల్లో ఎందరెందరో యాత్రికులూ, బిచ్చగాళ్లూ ధోవతి చుట్టుకునే కనబడతారు, కాని ఒక మధ్య వయస్కుడైన ప్రొఫెసర్ నడుందాకా దిగంబరంగా వుండి ఓ ఖరీదైన కార్లో మెత్తటి సౌకర్యాలమీద వాలి కూర్చున్న దృశ్యం నా కెందుకో అసాధారణమనిపించింది. “ఇలాటి వారే మా యిద్దరికి ఒక మిత్రులున్నారు. వారిమీదా మీ మీదా శంకరాచార్యులవారి ప్రభావం ఏమైనా పడిందా?” అని రాఘవన్ నడిగాను. “మాలో ఏదైనా గుణముంటే అది స్వామివారివల్ల సంక్రమించిందే. దోషాలన్నీ మావి” అన్నారు వారు.
మద్రాసు పరిసరాల్లో ఓ వీథిమూల చీకట్లో కారాపి, చెప్పులు వదిలి క్రిందికి దిగాము. దిగంగానే ఓ మధ్య వయస్కుడైన పెద్దమనిషి మమ్మల్ని పలకరించారు. వారు మద్రాసులో ఓ ప్రచురణకర్తట, రాఘవన్ పరిచయం చేశారు. ఆ ప్రచురణకర్త "ప్రతిసాయంకాలం ఆరు నుండి పదకొండు గంటలదాకా స్వామివారిని కనుపెట్టుకుని వుంటున్నా”నని చెప్పారు.
ఆ వీథిలో దేవాలయం ప్రక్కనవున్న ఓ పాడుబడ్డ చిన్న యింట్లో అడుగుపెట్టగానే యెదురుగా మసక చీకట్లో ఓ యిరుకు వరండా కనిపించింది. దాని కడ్డంగా పురాతనమైన ఓ పల్లకీ వుంది. పల్లకీకి తెల్లరంగువేశారు. ముందూ వెనకా బోయీలు మోసేగట్టి గుంజలకు మాత్రం నల్లరంగు. ఆ వరండాలోంచి ఓ చిన్నగదిలోకి ద్వారముంది. అది జైలుగది లాంటిది. అందులో అంతకు ముందే కొందరొక చాపమీద కూర్చున్నారు. వారితో పాటు మేమూ కూర్చున్నాము.
గుసగుసలాడినట్లేదో మాట్లాడి, కొన్ని నిమిషాలయాక ఓ యువకుడు పల్లకీ దగ్గరకు వెళ్లి వంగి ఎవరితోనో ఏదో మాట్లాడాడు. ఏ ఆకారమూలేని మోపు మీద కప్పినట్లున్న యిటుక రంగు కంబళి పైకీ కిందకీ కదలి పల్లకీలోంచి స్వామివారు మెల్లగా లేచారు. లేస్తూనే కంబళి తలమీద, ఒంటినిండా కప్పుకున్నారు.
వారు పొడగరే. సన్నగా వున్నా చిక్కిపోయినట్లు లేరు. మత్తు వదలక తడబడుతూ పల్లకీ సందుగా లోపలికి వచ్చినా ముందు చాపమీద బాసికపట్టు వేసుకు కూర్చున్నారు. వెంటనే గదిలోవున్న వారందరూ బయటికి వెళ్లారు. వెళ్లినా ద్వారం పక్కనే నిలబడి అప్పుడప్పుడూ తొంగిచూస్తూ చెవులప్పగించి వింటున్నారు. మద్రాసులోని వివేకానంద కళాశాలలో పనిచేస్తున్న ప్రొఫెసరొకరు మామధ్య 'దుబాసి'గా వ్యవహరించారు. ఓ అరనిమిషం సేపు స్వామివారేం మాట్లాడలేదు. ఆ అరనిమిషమూ సాయం ముఖాన్ని పరిశీలనగా గమనించాను. కఠోరమైన ఆధ్యాత్మిక సాధనమూలంగా వారి ముఖకవళికలు చాలామట్టుకు పోయి అవసరమయినవే మిగిలాయి. ఉన్నవాటిలో ప్రముఖంగా కనబడేది తెల్లని కురుచ వెంట్రుకల క్రింద ఎత్తైన అర్ధగోళంలా వున్న వారి నుదురు. రెండోది వారి కళ్లు. అవి లోతుగా మెత్తటి చీకటి నీడలు పరుస్తూ కపాలం క్రింద నుంచి గ్రుచ్చి చూస్తున్నట్లున్నాయి. వారి పెదవులు తీర్చినట్లుండి పెరిగిన గడ్డం మధ్య ఆచితూచి మాట్లాడే ప్రతి మాటకూ దృఢంగా భావబంధురంగా కదలుతున్నాయి. వారు నిద్రావస్థలో నుండో సమాధిస్థితి నుండో మెల్లగా బయటకు వస్తున్నట్లనిపించింది. వారి చూపులు ఎదుటివారి మీద నిశ్చలంగా నిలిచివున్నాయి. వారు రోజుకు ఓ మూడుగంటలకన్నా ఎక్కువసేపు నిద్రపోరని విన్నాను. తన విధులకూ, కర్మకాండకూ పోను అప్పుడప్పుడూ మిగిలిన కొద్దిపాటి వేళల్లో పల్లకీలో ఓ మూల చుట్టచుట్టుకుని పడుకుంటారు. వారు నిద్రలో వున్నారో సమాధిలో వున్నారో తరచు భక్తులే చెప్పలేరు. మెల్లగా వారు నేను భారతదేశం రావటానికున్న కారణమడిగారు.
“ఈ దేశాన్ని ప్రజల్ని ఊరికే చూచి పోదామనా లేక యిక్కడి ప్రజల నేదైనా మంచిదారిలో పెడదామనా?”
అంతకుముందు వచ్చిన పుస్తకాలమీద పత్రికలవారు చేసిన వ్యాఖ్యానాలు దృష్టిలో పెట్టుకుని స్వామివారడిగిన ప్రశ్న అది. “చూడటానికీ, తెలుసుకోవటానికి మాత్రమే వచ్చాను. మరే ఉద్దేశమూ లేదు” అన్నాను.
స్వామి : స్థిరమైన ఆసక్తికి కూడా కొంత ప్రభావం వుంటుంది. ఏమీ ప్రత్యేకంగా చెయ్యక్కర్లేదు. ఊరికే ఒక సమస్యపట్లగానీ, ఒక దేశంపట్లగానీ మన మేర్పరుచుకున్న దృక్పథానికి కూడా ఒక శక్తి, చైతన్యం వుండి తీరుతాయి.
“అలా వుండటం నాకు బాధగా వుంది. అయినా ఏ నీడా పడకుండా మనిషి కదల్లేడుకదా” అన్నాను.
అప్పుడు స్వామివారు "సత్యమైన సానుభూతి ఒక విధమైన తేజస్సును విరజిమ్ము తుంది” అంటూ చిరునవ్వు నవ్వారు. ఆ చిరునవ్వు పసిబిడ్డ చిరునవ్వు. అలాటి నను నేనెన్నడూ చూడలేదు. ఆ చిరునవ్వులో అసామాన్యమైన మనోజ్ఞత వుంది. మాధుర్యముంది. వారితో మాట్లాడి తిరిగి వస్తూ దారిలో అనుకున్నాను. పాశ్చాత్య చిత్రకారులు చిత్రించిన సాధు పురుషుల ముఖాలమీద - వారు పారవశ్యంలో వున్నప్పుడుగాని, వారికి ధన్యత సిద్ధించినప్పుడుగానీ, మతంకోసం త్యాగం చేసినప్పుడుగానీ - ఆ చిరునవ్వును, ముగ్ధమోహనమైన ఆ ఎందుకు చిత్రించలేదా అని! యోగులందరూ తమ అనుభవాలు చెప్పినట్లు బహుశా ఆ చిరునవ్వుకూడా ఉలికీ, కుంచెకూ అందలేదేమో
(సశేషం)
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి