16, జనవరి 2022, ఆదివారం

కనుమలు అయిదు

 ❤️ *కనుమలు అయిదు*


💕 *కనుమ పండుగ నాడు ప్రయాణాలు నిషిద్ధం...అంటుంది శాస్త్రం.. !!*

💕 *కనుమ నాడు కాకి కూడా ప్రయాణం చెయ్యదు...*


🌺 *మనకు ఉన్నవి ఐదు కనుమలు*


🌺 *సంప్రదాయంగా ఐదు కనుమల్లో ప్రయాణం చేయరాదని చెబుతారు.*


❤️ *"శవదాహే గ్రామదాహే సపిండీకరణే తథా*

*శక్య్తుత్పవే చ సంక్రాంతౌ నగంతవ్యం పరేహని"*


❤️ *శవదహనం జరిగిన మరుసటి రోజు*

❤️ *గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగిన మరుసటి రోజు*

❤️ *సపిండీకరణమైన మరుసటి రోజు*

❤️ *గర్భస్రావం జరిగిన మరుసటి రోజు*

❤️ *సంక్రాంతి మరుసటి రోజు*

🌺 *వీటిని కనుమలు అంటారు.*


💕 *ఈ రోజుల్లో ప్రయాణించకూడదు*

సొంతింటి కల

 🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹

   కోట జగదీశ్ గారి "సొంతింటి కల" కథనం.

                🌷🌷🌷

‘అక్కడేదో కనిపిస్తోంది. అదొక్కటీ చూసేసి ఇంటికెళిపోదాం!’ అంది సావిత్రి. అప్పటికే చాలాసేపట్నుంచీ ఊరంతా తిరుగుతున్నారు. ఎలాగైనా నెలాఖరుకల్లా ఏదో ఒక అపార్ట్‌మెంట్ బుక్ చేసెయ్యాలని నిర్ణయించుకున్నారు. 


‘ఇది డెడ్ ఎండ్‌లా ఉంది. దీని తరవాత ఇంకలేవు. పేరు కూడా ఎన్‌క్లేవ్ అనే పెట్టాడందుకే!’ చిరాకుని చిగురాకంత చిరునవ్వుతో దాచాలని ప్రయత్నిస్తున్నాడు ప్రసాద్.


బిల్డింగైతే చూడటానికి ఏదో బానే వుందనిపిస్తోంది. కింద మేనేజర్ని అడిగితే మూడో అంతస్తులో ఖాళీ ఉన్నాయని చెప్పాడు. లిఫ్టదీ ఇంకా తయారవలేదు. మెట్లెక్కి పైకి వెళ్లారు. ఇల్లంతా కలియజూసేసి కిచెన్ వైపు వచ్చారు. దక్షిణం వైపు బాల్కనీలోకి వచ్చి గోడవతల దృశ్యం చూసి ఒక్కసారిగా కొయ్యబారిపోయారు.


అప్పుడే ఫ్రెష్‌గా శవాన్ని కాలుస్తున్నారక్కడ. పక్కనే, గోడనానుకునే స్మశానం. 


‘ఇదేందివయా ఇదీ? బెడ్‌రూమ్ కిటికీలోంచి చూస్తే డైరెక్టుగా కనబడేలా ఉంది? సీ వ్యూ, లేక్ వ్యూ పేర్లు పెడతారు చూడూ, దీనికి ‘గ్రేవ్ వ్యూ’ అపార్ట్‌మెంట్స్ అని పెట్టండి పేరు. సరిపోతుంది. పద సావిత్రీ!’


‘సర్, అదేంలేద్సార్! మనకసలు ఎటువంటి డిష్టబెన్సూ ఉండదు. ఇన్నిరోజుల్నించీ కడతన్నామా, ఇప్పటివరకూ ఒక్క బాడీని కూడా కాల్చలేద్సార్! బాడ్‌లక్ మీరొచ్చినపుడే రావాలా? అయినా మన కాంపౌండ్ వాల్ చాలా హైటొస్తాద్సార్! కిటికీలకి టింటెడ్ గ్లాసేసుకుంటే కనబడే అవకాశం కూడా ఉండదు!’ 


ఎలాగోలా ఒప్పించేద్దామని చూస్తున్నాడు.


‘వద్దులే తమ్ముడూ! మాకు సెంటిమెంట్లవీ ఎక్కువ. ఇలా స్మశానాలవీ ఆక్రమించేసి రియల్ ఎస్టేట్‌ కాస్తా బరియల్ ఎస్టేట్‌లా మార్చేస్తున్నారు!’


చూసింది చాల్లే అనుకుని కిందకొచ్చి బండెక్కేశారు. ఎండ తీవ్రంగా ఉంది. ఇక ఆపేసి ఇంటికెళిపోదామని నిర్ణయించుకున్నారు దంపతులిద్దరూ.


మెయిన్‌రోడ్డు మీదకు రాగానే వెంకట్రెడ్డి కనబడ్డాడు. 


‘నమస్తే ప్రసాద్‌గారూ! ఇళ్ల వేటా? ఇంకా కొనలేదేటి?’ అన్నాడు పెద్దగొంతేసుకుని.


‘ఏవీ నప్పట్లేదు వెంకట్రెడ్డీ! మీ బావమరిదేదో కడుతున్నాడని చెప్పావు, పూర్తైందా?’


‘అయిపోవచ్చింది ప్రసాద్‌జీ! కానీ కాస్త తక్కువ రేంజ్. మీకు నచ్చుద్దోలేదో?’


‘ఒకసారి చూసేస్తే పోలా? పద వెళ్దాం!’


అక్కణ్ణుంచి మూడువీధులవతల కాస్త గోప్యంగా కట్టాడు బిల్డింగ్. చుట్టూ బోల్డన్ని చెట్లు, పొదలమధ్య దాక్కున్నట్టుంది బిల్డింగ్.


రెడ్డి చెప్పినట్టు కాస్త మీడియం రేంజే! గదులవీ బావున్నాయి కానీ బాల్కనీలు మాత్రం చిన్నవి. బెడ్‌రూమ్ కిటికీని బాగా దగ్గరగా ఆనుకుని పక్కనే మరొక అపార్ట్‌మెంట్ వాళ్ల బాల్కనీ ఉంది. ఏ పచ్చిమిరపకాయలో అయిపోతే అక్కణ్ణుంచి విసిరితే ఇటొచ్చి పడేంత దగ్గర. 


కిటికీగనక తీస్తే ఆయింట్లో ఉండేవాళ్ల డ్రాయర్లు, లంగాల కలర్సన్నీ మనకి కంఠతా వచ్చేస్తాయి. అన్నీ సెవెంటీ ఎంఎం స్క్రీన్ మీద చూస్తున్నట్టుగా ఆరేశారు. చెరుకుపల్లి టవర్స్ కాదు. ఇరుకుపల్లి టవర్సని పెట్టాల్సింది పేరు. నవ్వుకుని బయటికొచ్చాడు ప్రసాద్.


బాత్రూములోకి వెళ్లి చూశాడు. ప్లంబర్ కుర్రాడెవరో బాగా అప్రెంటిస్ అనుకుంటా! ఫ్లష్ ట్యాంకుకీ, కమోడ్‌కీ కనీసం తొంభై డిగ్రీలైనా ఉండాలికదా? పాపం, ఎనభై డిగ్రీలే పెట్టిచచ్చాడు. దాంతో బాత్‌రూముకి వెళ్లిన ప్రతిసారీ ఆ లిడ్‌ని పైకెత్తితే, అదొచ్చి సరిగ్గా ‘అక్కడే’ పడి కొట్టుకుంటుంది. రోజూ ఆ హింస భరించడం ఎంతకష్టం? పైగా పైకి చెప్పుకోవడానికి కూడా వీల్లేని కష్టమది!


అయినా అతను మాత్రం ఏంజేస్తాడు, బాత్రూములు అంత చిన్నవిగా ఉంటే? 


మళ్ళీ నవ్వొచ్చింది ప్రసాద్‌కి. ఇవన్నీ వెంకట్రెడ్డితో మాటాడ్డానికి మొహమాటపడి థాంక్స్ చెప్పేసి బయల్దేరాడు. పాపం, ముందునుంచీ అంటూనేవున్నాడుగా మీకు నప్పదని!


భోజనం కానిచ్చి మళ్ళీ సాయంత్రం బయల్దేరి మరో పాష్ ఏరియాలో అడుగుపెట్టారిద్దరూ. ఒకటేదో ‘ఫ్లాట్స్ ఫర్ సేల్’ అని బోర్డు చూసి వెళ్లారు. సెల్లార్‌లో వైటండ్ వైట్ వేసుకుని ఏవో రాసుకుంటున్న ఒకతన్ని పేరూ, ఉద్యోగ వివరాలు చెప్పి పలకరించారు ఇద్దరూ. 


‘ముందు పైకెళ్లి చూసొచ్చి అప్పుడు రేటదీ మాటాడదాం!’ అంది సావిత్రి. సరేనన్నాడు సత్యవంతుడు. ఇద్దరికీ ఆ అపార్ట్‌మెంట్ చాలా నచ్చేసింది. పైగా దేనికదే సెపరేటుగా విశాలంగా కూడా ఉన్నాయి. 


కిందకొచ్చి ఆఫీసు రూములో కూర్చున్న తరవాత అడిగాడు ప్రసాద్


‘ఉన్నాయాండీ? లేక అయిపోయాయా?’


‘చెప్పండ్సార్! మీకే ఫ్లోర్లో కావాలి?’


‘ఫస్టయితే దోమలెక్కువగా వుంటాయిట. థర్డ్, ఫోర్త్ కరెంటు లేకపోతే ఎక్కడం కష్టం. అంచేత సెకండే బెటరనిపిస్తోంది!’ 


ఇది అనేకానేక చర్చల తరవాత దంపతులిద్దరూ తీసుకున్న నిర్ణయం. 


‘సెకండా? ఉండండి చూస్తాను. మూర్తీ, ఆ డైరీ పట్రా ఓసారి!’ అంటూ ఎల్ఐసీ వాళ్ల డైరీ ఒకటి తెరిచి అన్నీ పరికించి బుర్ర అడ్డంగా ఊపాడు.


‘ఏంటి? లేవా?’ అన్నాడు నిస్పృహతో!


‘అసలెప్పుడో అయిపోయాయి సార్! మీరు చాలా లేటుగా వచ్చారు. మేవిఁక్కడ అపార్ట్‌మెంట్ కట్టాలని మనసులో అనుకున్నప్పుడే సగం ఫ్లాట్స్ బుక్కైపోయాయి. అలాంటిది మీరింత ఆలస్యంగా వచ్చి అడిగితే ఎలా?’ అంటూ మందలించాడు. 


ఎంసెట్‌కి ఆలస్యంగా వచ్చినా క్షమిస్తారేమోగాని ఇతనసలు క్షమించేలా లేడు.


కాసేపు నిశ్శబ్దం. ప్రసాద్ మొహంలో కొంతైనా పశ్చాత్తాపం కనబడుతుందేమో, ఇంకొంచెం బెట్టు చేద్దామనుకున్నాడు. 


కానీ వాళ్లిద్దరూ ‘ఆఁ! ఇది కాకపోతే వందున్నాయి. లోకం గొడ్డుపోయిందా?’ అన్నట్టు నిలబడ్డారు.


అప్పుడు అతనిలో చలనం వచ్చింది. 


‘పోనీ ఓపని చేద్దాం ప్రసాద్‌గారూ! మా బావమరిది అడిగాడని సెకండ్లో ఒకటుంచాను. అతనికి నేనేదో చెప్పుకుంటాన్లెండి. మీరు మా శ్యాంబాబుకి కావలసినవాళ్లు కాబట్టి అది మీకిచ్చేస్తాను. కాకపోతే ఎస్సెఫ్టీకి మరో యాభై ఎక్కువవుతుంది!’


ఇట్టాంటి స్ట్రాటజీలు చాలా విన్నాడు ప్రసాద్. అయినాసరే, ఆ ప్రాంతంలో ఉండాలన్న బలమైన కోరికతో ఒప్పేసుకున్నాడు. 


అది మొదలు సావిత్రికి రోజూ అందమైన కలలు రావడం మొదలయ్యాయి. ఆ విశాలమైన రోడ్లమీద చుట్టూ తురాయి చెట్ల నీడలో బొచ్చుకుక్కనొకదాన్ని తీసుకుని వాకింగులవీ చేస్తున్నట్టు, వర్షం పడుతోందని ఏ చెట్టునీడనో ఆగితే ఒక్కసారిగా గాలేసి ఆ చెట్టుపూలన్నీ తనమీద పూలవాన కురిసినట్టూ... 


‘పాలూ...!’ అని అరిస్తే అప్పుడు మెలకువొచ్చేది. 


పూలవాన నుంచి బయటపడి పాలక్యాన్ పట్టుకుని తలుపు తీసేది.


ప్రసాదుకి ఇటువంటి కలలవీ అలవాటులేదు. అతను చాలా మెటీరియలిస్టిక్. ఇల్లంటే ఇటుకలూ సిమ్మెంటనే అతని దృష్టి. అంచేత అతనెప్పుడూ ఇంటిచుట్టూ లాన్ల గురించి కాకుండా ఇంటికి కట్టాల్సిన లోన్ల గురించే ఆలోచించేవాడు.


పని చురుగ్గా సాగుతోంది. సావిత్రి ఎప్పటికప్పుడు వెళ్లి తనకెలా కావాలో మార్పులవీ చెబుతూ చేయించుకుంటోంది. పనివాళ్ళు చాలా చురుకైనవాళ్లు. చెప్పింది చెప్పినట్టు భలే మార్చేసేవారు. 


ఒకరోజు ప్రసాద్, సావిత్రి కలిసి వెళ్లారు. కింద సెల్లార్‌లో బిల్డర్ లేడు. పనివాళ్లని అడిగితే హరిద్వార్ వెళ్లాడని చెప్పారు. అతగాడి మేనమామగారు కూర్చున్నారు ఆఫీసులో. చూడ్డానికి వయసైపోయిన అరవింద్‌స్వామిలా ఉన్నాడాయన. అద్భుతమైన వర్ఛస్సు. నమస్కారాలు తెలిపి పైకి వెళ్లారు.


అక్కడ దృశ్యం చూసి మరోసారి కొయ్యబారిపోయారు.


కిచెన్‌నుంచి బయటికి వెళ్లే దారిలో పెద్ద ఫ్లోర్ విండో ఒకటి కనబడుతోంది. అది వీళ్లు చెప్పనేలేదసలు. ఒక్కసారిగా కంగారైపోయారు. బయటికొచ్చి అది సెకండ్ ఫ్లోరా కాదా అని రూఢీ చేసుకున్నారు. మళ్లీ లోపలికొచ్చి మేస్త్రీనడిగితే అతను మళ్ళీ కొయ్యబారిపోయే మాటొకటి అన్నాడు.


‘ఆచారిగారు ఆల్మోస్ట్ రోజూ వస్తన్నార్సార్! ఆయనే పెట్డమన్నారిది. మీకు చెప్పలేదా?’


‘ఆచారిగారెవరు?’ ఇద్దరూ ఒకేసారి అన్నారు. వాళ్లకి కొంకణ్ సినిమా సబ్‌టైటిల్స్ లేకుండా చూస్తున్నట్టుంది.


అప్పుడు మేస్త్రీ కొయ్యబారిపోయాడు. మేనేజర్ని పిలిచాడు. అతను టెర్రస్ మీద వరసగా ఆరేడు సిగరెట్లు కాల్చి ఎనిమిదోది అంటించబోతోంటే కుర్రాడొచ్చి కేకేశాడు.


చిరాగ్గా కిందకొచ్చి మేస్త్రీ మీద కోప్పడ్డాడు.


‘ఇప్పుడేకదా పైకెళ్లాను? ఇంతలో ఏమైంది?’ అన్నాడు అక్కడే సిగరెట్ బయటికి తీసి. సావిత్రికి సిగరెట్ వాసన పడదని అతణ్ణి వారించాడు ప్రసాద్.


‘ఈ సార్ ఏంటడుగుతున్నారో ఆలకించండొకసారి!’ అన్నాడు మేస్త్రీ.


‘ఏంట్సార్?’ అంటూ రాష్‌గా అడిగాడు.


‘ఆచారిగారెవరు?’ అన్నాడు ప్రసాద్.


‘ఆయన షిప్‌యార్డ్‌లో పనిచేస్తారు. ఆయన్దేగా ఈ ఫ్లాటు?’ 


‘ఏం తమాషాగా ఉందా? మేస్త్రీగారూ, మేం మొదట్నుంచీ ఎన్నిసార్లు మార్పులవీ చెప్పాం? గుర్తులేదూ?’


‘అదే ఆశ్చర్యంగా ఉంద్సార్ నాక్కూడా! మీరు వెంటిలేటర్లవీ తీసీమని చెప్పారని అన్నీ మూసీసాం. ఆచారిగారొచ్చి దెబ్బలాడి మళ్లీ అన్నీ తెరిపించారు. నాకదే బోదపళ్లేదు!’ అంటూ తాపీ పడేసి తాపీగా కింద కూర్చుండిపోయాడు.


అప్పుడు మేనేజర్‌కి కంగారొచ్చింది. నాతో రండంటూ ఆఫీసురూముకి తీసుకెళ్లాడు. రాత్రింబవళ్ళు కుక్కచాకిరీ చేసి సంపాయించిన డబ్బంతా వీళ్ల మొహాన పోశాం. ఇప్పుడేమంటాడో? అన్న కంగారు ఇద్దరి మనసులోనూ.


ఆ పెద్దాయన డైరీ ఒకటి తీసి అందులో చూపుడువేలుతో సూచిస్తూ వివరాలన్నీ మూడునాలుగు సార్లు చూశాడు. అతనికి చెమటలు పట్టేశాయి.


ఆ ఫ్లాట్ ప్రసాద్ పేరునా, ఆచారి పేరునా కూడా రిజిస్ట్రేషన్ అయివున్నట్టుగా ఉందందులో! వేరే వేరే పేజీల్లో రాసుకున్నాడు బిల్డర్.


ఇక ఏడుపు మొదలెట్టింది సావిత్రి. ఆయనతో వాదనకి దిగారు. ఆయనేమో కంగారుపడొద్దని, మేనల్లుడు రాగానే సత్వరన్యాయం చేస్తామని హామీ ఇచ్చి పంపేశాడు.


ఆ బిల్డర్ చాలారోజులవరకూ రాలేదు. ఏ గంగలోనో దూకేశాడేమో అనుకున్నాడు ప్రసాద్. ఆఖరికి ఒకరోజు సిరిపురం జంక్షన్‌లో కరాచీవాలాలో ఏదో కొంటూ కనబడ్డాడు. అప్పుడు పరుగుపరుగున వెళ్లి వాణ్ణి నిలదీశాడు.


‘ఏదో పొరపాటు జరిగింది. ఆ ఆచారిగారు ఊరుకోవట్లేదు. కోర్టుకి వెళతానంటున్నాడు. మీరే ఏదో ఒక సొల్యూషన్ చెప్పండి!’ అని తిరిగి ప్రసాదునే సలహా అడిగాడు.


ఉద్యోగం చేసుకుంటూ ఏరాత్రికో ఇల్లుచేరే ప్రసాదుకి కోర్టుకి తిరిగే ఓపికా తీరికా లేవు. అంచేత ఇచ్చిన డబ్బంతా తిరిగిచ్చేస్తే చాలంటూ వేడుకున్నాడు.


తనదగ్గర అంత సొమ్ము ఎప్పుడూ ఉండదుట. అందువల్ల దఫదఫాలుగా ఇస్తానని చెప్పాడు.


ఆ తరవాత అతని వెనకాల తిరిగితిరిగి జీవితంలో అతిముఖ్యమైన ఆనందాలన్నిటినీ కోల్పోయారు ప్రసాద్ దంపతులు. లాండ్ లైన్ ఫోన్ ఎత్తడు. మొబైల్‌కి చేస్తే కట్ చేస్తాడు. బిల్డింగ్ దగ్గరకెడితే ఎప్పుడూ మేస్త్రీయే కనబడతాడు.


దాదాపు రెండేళ్లపాటు బాగా ఏడిపించి అప్పుడు మూడోవంతు సొమ్ము వాళ్లమొహాన పడేశాడు. అదే చాలనుకుని ఆరోజు స్వీట్స్ తెచ్చుకు తిన్నారు ప్రసాదు, సావిత్రి.


‘ఇక ఈ అపార్ట్‌మెంట్‌ల విషయంలో మనం ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో మంచి అనుభవం వచ్చేసింది. ఇకనైనా జాగ్రత్తగా ఉందాం!’ అనుకుని ఒట్టేసుకున్నారు ఇద్దరూ!


యదార్ధగాథే! మాదే! పేర్లూ, ఉద్యోగసద్యోగాలూ మార్చానంతే!


......... *కొచ్చెర్లకోట జగదీశ్*

ఇల్లు కొనేవారు జాగ్రత్తలు తీసుకోవడానికి పనికి వస్తుంది.

*కనుమ పండగ

 🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹

*కనుమ పండగ “పశువుల పండుగ”*

 

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


కనుమను పశువుల పండుగగా వ్యవహరిస్తారు. పంటలు చేతికి అందడంలో తమకు సహాయపడిన పశుపక్షాదులను పూజిస్తారు. సంవత్సరంలో మిగిలిన రోజులన్నీ తమతో పాటు కష్టపడి పని చేసిన ఆవులను, ఎద్దులను పూజించి ప్రేమగా చూసుకునే రోజు ఇదే. పక్షులు కూడా రైతన్ననేస్తాలే. అందుకే వాటి కోసమే అన్నట్టు ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులు వ్రేలాడ దీస్తారు.


     *🌷పశువుల పండుగ🌷*


ముఖ్యంగా చిత్తూరుజిల్లా, అందులో పాకాల మండలంలోని వల్లివేడు గ్రామ పరిసర అన్ని పల్లెల్లో ఈ పండగ జరుపుకోవటంలో ఒక ప్రత్యేకత వున్నది. ఆ ప్రత్యేకత ఏమిటంటే? ఆ రోజు ఇంటికి ఒకరు చొప్పున తెల్లవారక ముందే ఒక కత్తి, ఒక సంచి తీసుకొని సమీపంలో ఉన్న అడవికి బయలు దేరుతారు. అక్కడ దొరికే నానా రకాల వన మూలికలు, ఔషధ మొక్కలు సేకరిస్తారు. కొన్ని చెట్లఆకులు, కొన్ని చెట్ల బెరుడులు, కొన్ని చెట్ల పూలు, వేర్లు, కాండాలు, గడ్డలు, ఇలా చాల సేకరిస్తారు. కొన్ని నిర్దిష్టమైన చెట్ల భాగాలను మాత్రమే సెకరించాలి. అంటే, మద్ది మాను, నేరేడు మానుచెక్క, మోదుగ పూలు, నల్లేరు, మారేడు కాయ ఇలా అనేక మూలికలను సేకరించి ఇంటికి తీసుకొచ్చి వాటిని కత్తితో చిన్న ముక్కలుగా చేసి, ఆ తర్వాత దానికి పెద్ద మొత్తంలో ఉప్పు చేర్చి రోట్లో వేసి బాగా దంచుతారు. అదంతా మెత్తటి పొడిలాగ అవుతుంది. దీన్ని *"ఉప్పు చెక్క''* అంటారు. ఇది అత్యంత ఘాటైన మధురమైన వాసనతో వుంటుంది. దీన్ని పశువులకు తిని పించాలి. ఇదొక పెద్ద ప్రహసనం. అవి దీన్ని తినవు. అంచేత ఒక్కొక్క దాన్ని పట్టుకొని దాని నోరు తెరిచి అందులో ఈ ఉప్పు చెక్కను చారెడు పోసి దాని నోరు మూస్తారు. అప్పుడు ఆ పశువు దాన్ని మీంగుతుంది.. ఇలా ఒక్కదానికి సుమారు రెండు మూడు దోసిళ్ళ ఉప్పు చెక్కను తినిపిస్తారు. గొర్రెలు మేకలు ఐతే కొన్ని వాటంతట అవే తింటాయి. లేకుంటే వాటిక్కూడ తినిపిస్తారు. ఏడాదికి ఒకసారి ఈ ఉప్పుచెక్కను తినిపిస్తే అది పశువులకు సర్వరోగ నివారణి అని వీరి నమ్మకం. ఎందుకంటే అందులో వున్నవన్నీ ఔషధాలు, వన మూలికలే గదా.


ఆ తర్వాత పశువులన్నింటిని పొలాల్లోని బావుల వద్దకు గాని, చెరువుల వద్దకు గాని తోలుకెళ్ళి స్నానం చేయించి, లేదా ఈత కొట్టించి, ఇంటికి తోలుకొస్తారు. ఆ తర్వాత వాటి కొమ్ములను, పదునయిన కత్తితో బాగా చెలిగి వాటికి రంగులు పూస్తారు. మంచి కోడెలున్న వారు వాటి కొమ్ములకు ఇత్తడి కుప్పెలు తొడిగి, మెడలో మువ్వల పట్టీలు, మూతికి మూజంబరాలు అలంకరిస్తారు. అన్నింటికీ కొత్త పగ్గాలు వేస్తారు. ఈ సమయంలో చేలన్నీ పరిగిలి పోయి వున్నందున పశువులన్నింటిని వదిలేస్తారు. సాయంకాలం ఊరు ముందున్న కాటమరాజును పునఃప్రతిష్టించి ఊరిలో ప్రతి ఇంటి నుండి ఆడవారు కాటమరాజు ముందు పొంగలి పెడ్తారు. పొంగలి అంటే కొత్త కుండలో, కొత్త బియ్యం, కొత్త బెల్లం వేసి అన్నం వండడం. ఒక నెల ముందు నుండే కాటమరాజు ముందు ఆ దారిన వచ్చిపోయే ఊరివారు రోజుకొక కంపో, కర్రో తెచ్చి అక్కడ కుప్పగా వేస్తారు. కనుమ రోజుకు అది ఒకపెద్ద కుప్పగా తయారయ ఉంటుంది. దాన్ని *"చిట్లా కుప్ప"* అంటారు. చీకటి పడే సమయానికి పొంగళ్లు తయారయి ఉంటాయి. ఊరి చాకలి కాటమరాజు పూజ కార్యక్రమం ప్రారంబించి దేవుని ముందు పెద్ద తళిగ వేస్తారు. అంటే ప్రతి పొంగలి నుండి కొంత తీసి అక్కడ ఆకులో కుప్పగా పెడతారు. పూజానంతరం మొక్కున్న వారు, చాకిలి చేత కోళ్ళను కోయించు కుంటారు. అప్పటికి బాగా చీకటి పడి వుంటుంది. అప్పటికి పశుకాపరులు అందరూ ఊరి పశువులన్నింటిని అక్కడికి తోలుకొని వస్తారు. పూజారి అయిన చాకలి తళిగలోని పొంగలిని తీసి ఒక పెద్దముద్దగా చేసి అందులో సగం పోలిగాని కిచ్చి (పశువుల కాపరి) తినమని చెప్పి, తర్వాత అక్కడున్న చిట్లాకుప్పకు నిప్పు పెడతారు. పెద్ద మంట పైకి లేవగా పోలిగాడు పశువులన్నింటిని బెదరగొట్టి , చెదరకొడతాడు. అవి బెదిరి పొలాల వెంబడి పరుగులు తీస్తాయి. ఆ సమయంలో పశువులను బెదర గొడుతున్న పోలిగాని వీపున చాకలి తనచేతిలో వున్న మిగిలిన సగం పొంగలి ముద్దను అతని వీపు మీద కొడతాడు. దానిని పిడుగు ముద్ద అంటారు. వాడు పరిగెడుతాడు. ఆ తర్వాత అందరూ అక్కడ మిగిలిన తళిగలోని ప్రసాదాన్ని తిని మొక్కులు తీర్చుకొని చిట్లకుప్ప మంట వెలుగులో తమ కోళ్ళను కోసుకొని పొంగళ్లను తీసుకొని తాపీగా ఇళ్ళకి వెళతారు. ఈ సందర్భంగా పెద్ద మొక్కున్న వారు పొటేళ్ళను కూడ బలి ఇస్తారు. దాని రక్తాన్ని ఆన్నంలో కలిపి ఒక కుప్ప పెడతారు. దాన్ని *''పొలి''* అంటారు. ఆ *"పొలి"* ని తోటకాపరి గాని, నీరు కట్టేవాడు గాని తీసుకొని వెళ్ళి అందరి పొలాల్లో, చెరువుల్లో, బావుల్లో *"పొలో.... పొలి"* అని అరుస్తూ చల్లుతాడు. అప్పడే కొత్త మొక్కులు కూడ మొక్కు కుంటారు. అంటే, తమ పశుమందలు అభివృద్ది చెందితే రాబోయే పండక్కి పొట్టేలును, కోడిని ఇస్తామని కాటమ రాజుకు మొక్కు కుంటారు. అప్పటికప్పుడే ఒక పొటేలుపిల్లను ఎంపిక చేస్తారు. ఆ విధంగా పశువుల పండగ పరిసమాప్తి అవుతుంది.

ఈ నెలరోజులు వాకిట్లో అందమైన ముగ్గులతో అలంకరిస్తాము. కానీ ఈ కనుమ రోజున మాత్రం రధం ముగ్గువేసి ఆ రథాన్ని వీధిచివర వరకూ లాగినట్టుగా ముగ్గువేస్తారు. దీని అర్థం సూర్యుడు తన దిశను మార్చుకున్న మొదటిరోజు అని తెలుస్తుంది.

                  🌷🌷🌷

అయిదు కథలు*_

 _*నేడు సంక్రాంతి , సంక్రాంతి వెనుక ఎవరికీ తెలియని అయిదు కథలు*_


🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️


సంక్రాంతి అనగానే సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే రోజు అని చాలామందికి తెలుసు. కానీ ఈ పండుగలో అంతకుమించిన ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. అవేంటో మీరే చూడండి.


1. పూర్వం సగరుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకు అరవైవేల మంది కొడుకులు. వీళ్లంతా ఓసారి కపిలముని ఆశ్రమంలోకి ప్రవేశించి , ఆయన తపస్సుని భంగం చేశారు. దాంతో కపిలముని వాళ్లందరినీ బూడిదగామార్చేశాడు. ఆ బూడిద కుప్పల మీద గంగ ప్రవహిస్తే కానీ , వారి ఆత్మశాంతించదని తెలుస్తుంది. ఆకాశంలో ఉండే గంగని ఎవరూ నేల మీదకి తేలేకపోయారు. సగరుడి వంశంలో పుట్టిన భగీరధుడు ఈ పని చేయగలిగాడు. ఆయన తపస్సుకి మెచ్చి సంక్రాంతి రోజునే గంగమ్మ నేల మీద అవతరించిందట ! 


2. సంక్రాంతి గంగిరెద్దుల వెనుక కూడా ఓ కథ ఉంది. పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. శివుడు తన కడుపులో ఉండేలా ఆ గజాసురుడు వరాన్ని కోరుకున్నాడు.

శివుని బయటకు రప్పించేందుకు విష్ణుమూర్తి ఓ ఉపాయం ఆలోచించాడు. దేవతలంతా తలా ఓ వాయిద్యాన్నీ పట్టుకుని , నందితో కలిసి గజాసురుడి దగ్గరకు బయల్దేరారు. వీళ్ల ప్రదర్శనకు మెచ్చుకున్న గజాసురుడు ఏదన్నా వరాన్ని కోరుకొమ్మని అడిగాడు. ఇంకేముంది ! తన పొట్టలో ఉన్న శివుడిని బయటకు పంపమని వరాన్ని అడిగేశారు. అలా ఆనాడు శివుని పొందేందుకు చేసిన హడావుడే , ఇప్పటి గంగిరెద్దుల సంప్రదాయానికి నాంది అని చెబుతారు.


3. కనుమ రోజు పశువులని పూజించడం వెనుక కూడా ఓ కథ వినిపిస్తుంది. ఒకసారి శివుడు నందిని పిలిచి *‘భూలోకంలో అందరూ రోజూ ఒంటికి నూనె పట్టించి స్నానం చేయాలి , నెలకి ఓసారే ఆహారం తీసుకోవాలి’* అని చెప్పి రమ్మన్నాడు. కానీ నంది అయోమయంలో *‘రోజూ ఆహారం తీసుకోవాలి , నెలకి ఓసారి నూనె పట్టించి స్నానం చేయాలి’* అని చెప్పిందట. దాంతో కోపం వచ్చిన శివుడు. *‘ప్రజలు రోజూ తినాలంటే చాలా ఆహారం కావాలి. ఆ ఆహారాన్ని పండించేందుకు నువ్వే సాయపడాలి’* అని శపించాడు.

అప్పటి నుంచి ఎద్దులు , వ్వవసాయంలో సాయపడుతున్నాయట. కనుమ రోజు పశువులని సాక్షాత్తు నందీశ్వరులుగా భావించి పూజిస్తుంటారు.


4. సంక్రాంతికి గాలిపటాలు ఎగరేస్తాం కదా ! దీనికి కూడా ఓ కథ చెబుతారు. సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుందట. ఇది దేవతలకు పగలు అని నమ్మకం. దేవతలంతా ఈ కాలంలో ఆకాశంలో విహరిస్తారట. దేవతలకి స్వాగతం పలికేందుకు , వారి దృష్టిని ఆకర్షించేందుకు గాలిపటాలు ఎగరేయాలని చెబుతారు.


5. సంక్రాంతితో పాటు ఇంటింటా అడుగుపెట్టే హరిదాసుకి కూడా ఓ ప్రత్యేకత ఉంది. సంక్రాంతికి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే , హరిదాసు రూపంలో మన ఇంటికి వస్తాడట. ఆయన తల మీద ఉండే పాత్ర , ఈ భూమికి చిహ్నమని చెబుతారు. అందుకే ఆ పాత్రని హరిదాసులు నేల మీద పెట్టరు. భిక్ష పూర్తయ్యి ఇంటికి చేరుకున్నాకే దాన్ని కిందకి దించుతారు. ఇవండీ సంక్రాంతి గురించి ఓ అయిదు కథలు. ఇంకా గొబ్బెమ్మలు దగ్గర నుంచి భోగిపళ్ల వరకు... సంక్రాంతిలో కనిపించే ప్రతి ఆచారానికీ ఓ కథ ఉంది.

మూడు రకాల పాపాలు

మూడు రకాల పాపాలు 

మనం సామాన్య దృష్టితో పుణ్యం, పాపం అని పేర్కొంటాం.  పాపం చేస్తే పాప ఫలం పుణ్యం చేస్తే పుణ్యఫలం లభిస్తుందని మనం భవిస్తూవుంటాం. పాప పుణ్య విభజన మనం సామాజికంగా ప్రతివారు ధర్మపరులు కావాలని ఏర్పాటు చేసినట్లు కనపడుతుంది.  ప్రతివారు ఉత్తమమైనది మాత్రమే కోరుకుంటారు కాబట్టి పుణ్యకార్యాలు చేస్తే పుణ్యఫలంగా స్వర్గ ప్రాప్తి కలుగుతుందనే ఉద్దేశంతో పుణ్యాకార్యాలు చేస్తారు.  దీనివల్ల సమాజంలో అందరు సుఖ సంతోషాలతో ఉండగలరు. హిందూధర్మంలో ఏది చెప్పినా అది సమాజ శ్రేయస్సుని దృష్టిలో ఉంచుకొనే ఉంటుంది. మన ఋషులు చాలా దూరం అలోచించి మనకు చక్కటి సాంప్రదాయాలను ఏర్పాటు చేసారు. 

ప్రతివారు తాము సద్గతులను పొందాలని పుణ్యకార్యాలను చేయటానికి పూనుకొంటారు.  వారు మరణానంతరం స్వర్గలోక నివాసం చేస్తారని మనకు శాస్త్ర ప్రమాణం. 

కానీ ముముక్షువులు మూడు రకాల పాపాలనుండి విముక్తుడు కావలి అప్పుడే మోక్షప్రాప్తి కలగదని మనకు ఉపనిషతులు తెలియచేస్తున్నాయి. 

మూడు రకాల పాపలు ఏవి. 

గృహస్థ జీవనానికి ఆధ్యాత్మిక జీవనానికి చాలా తేడా ఉంటుంది.  గృహస్తు  ఆచార సాంప్రదాయాలకు అనుగుణంగా తన జీవనానిని కొనసాగించాల్సి ఉంటుంది.  అదే ఆధ్యాత్మిక జీవనంలో సాధకుడు సదా ఆ పరబ్రహ్మ్ తత్త్వం వైపే పయనిస్తారు. నిత్యం, అనుక్షణం బ్రహ్మత్వంలోనే జీవిస్తాడు.  ఒకరకంగా చెప్పాలంటే సాధకుడు ఈ ప్రకృతితో సంబంధాన్ని సన్నగించుకొని దైవత్వం వైపు సంబంధాన్ని బలపరచుకుంటాడు.  కానీ విచిత్రం ఏమిటంటే ప్రక్రుతి యోగిని సదా వెన్నంటి ఉండి యోగికి అన్నివిధాల అనుకూలంగా మారుతుంది.  యోగి అతి చల్లని జలంతో కూడా స్నానం చేయగలడు, మండే మంటలమీద తన శరీరాన్ని ఉంచిన శరీరం కాలదు. అటువంటి అనేక అతీంద్రియ శక్తులు యోగికి కారతలామలకలం అవుతాయి.  యోగి వస్త్రధారణ చేయాల్సిన పనిలేదు రమణ మహార్షిలాంటి మహానుభావులు ఈ సమాజం కోసం కౌపీనం ధరిస్తారు కానీ నిజానికి అదికూడా వారికి అవసరం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే యోగికి మన సమాజపు నియమాలు బందించవు కేవలం సదా వారి ద్రుష్టి పరబ్రహ్మ మీదనే ఉంటుంది. 

ఇక్కడ చెప్పే మూడురకాల పాపలు సమాజ జీవనము చేస్తున్న గృహస్తులకు కాదు కేవలం సంపూర్ణ సాధన చేస్తున్న యోగులకు మాత్రమే అందుకే నేను పైన అంతవివరణ ఇచ్చాను. 

ఇప్పుడు పూర్తిగా ఆధ్యాత్మిక జీవనం చేసే యోగులైన సాధకులకు మాత్రం ఉన్నటువంటి మూడు రకాల పాపలు ఏమిటో చూద్దాం. 

1) పాప పాపం: సాధారణంగా మనం పాపం అనుకునే పాపం దీనిని పాప పాపం అంటారు.  గృహస్తులు కానీ అలాగే సాధకులు కానీ పాప కర్మలు అంటే నిషిద్ధ కర్మలు చేయకూడదు. 

2) పుణ్య పాపం: ఇది వినటానికి కొంత విచిత్రంగా కనిపిస్తుంది ఎందుకంటె పుణ్యం పాపం కాదు కాదా మరి పుణ్య పాపం ఏమిటి అని మనం అనుకుంటాము. నిజానికి సాధకుడు పుణ్య కార్యాలు కూడా చేయకూడదు అంటే పుణ్యం కూడా మూటకట్టుకోకూడదు. ఎందుకంటె ఎప్పుడైతే సాధకుడు పుణ్య కార్యాలు చేసి పుణ్య ఫలాన్ని పొందుతాడో అప్పుడు ఆ పుణ్య ఫలం అనుభవించటానికి మరలా జన్మ ఎత్తవలసి వస్తుంది.  కాక పుణ్య ఫలం చాలా ఎక్కువగా ఉంటే దానిని అనుభవించటానికి పుణ్యలోకాలకు (స్వర్గం) వెళ్ళవలసి ఉంటుంది.  ఆ ఫలం పరిసమాప్తం కాగానే మళ్ళి మానవ జన్మ ఎత్తి మరల ఈ జరామృత్యు వలయంలో చిక్కుకోవలసి ఉంటుంది.  కాబట్టి సాధకుడు పుణ్యం కోసం ఏ కర్మను చేయకూడదు. 

3) అజ్ఞాన పాపం:  ఇది మనకు సాధారణ జీవన విధానంలో ఎక్కడ వినపడదు.  ఆధ్యాత్మిక జగత్తులో సంపూర్ణ జ్ఞానం పొందిన వారు అంటే బ్రహ్మ జ్ఞానం పొందిన వారు మాత్రమే మోక్షార్హులు ఎందుకంటె మోక్షం సిద్ద వస్తువు సాద్య వస్తువు కాదు.  జిజ్ఞాసి బ్రహ్మ జ్ఞ్యానాన్ని పొందితే అప్పుడు ఈ అజ్ఞాన పాపం నుండి ముక్తుడు అవుతాడు. 

కర్మలు చేయకుండా ఉండటం యెట్లా: 

ఫై మూడు చదివిన తరువాత ప్రతి వారికి ఒక సందేహం కలుగుతుంది అదేమిటంటే మనిషి చేసే కర్మలు రెండు రకాలు ఒకటి పాప కర్మ రెండు పుణ్య కర్మ కాబట్టి చేసే ప్రతి పని (కర్మ) ఏదో ఒక విభాగంలోకి వస్తుంది కాబట్టి విధిగా తానూ చేసే కర్మలు రెంటిలో ఏదో ఒక ఫలాన్నిఇస్తాయి కదా మరి అటువంటప్పుడు పలితం లేకుండా కర్మలు చేయటం ఎట్లా. దీనికి సమాధానం సాధకుడు చేసే ప్రతి కర్మని ఈశ్వరార్పణగా చేయాలి అప్పుడు తానూ చేసే కర్మల ఫలాపేక్ష ఉండదు.  అది కేవలం ఈశ్వరునికే అర్పించబడుతుంది. ఇది బాగావుంది అయితే పాపాలు చేసి ఈశ్వరార్పణం అంటే అన్ని పాపాలు తొలగిపోతాయా అని అడగవచ్చు.  ఎట్టిపరిస్థితిలో ఆ పాప ఫలం పరమేశ్వరునికి చెందదు. ఎందుకంటె నీవు చేసే ప్రతి పాపము నీ మనస్సు, బుద్ది మిళితంగా చేస్తావు అంటే ఉద్దేశ్యపూర్వకంగా చేస్తావు ఎప్పుడైతే నీ మనస్సు నీవు చేసే కర్మ మీద లగ్నం అయ్యిందో దీని ఫలితం పూర్తిగా నీ కాతా లోనే చేరుతుంది. 

మహాపురుషులు తాము ఉద్దేశ్యపూర్వకంగా ఏ పనులు చేయరు.  కేవలం మనస్సుని పెట్టకుండా మాత్రమే కర్మలు చేస్తారు అందుకే వారు ఈ ప్రపంచంలో వున్నా కూడా లేనట్లే ఎందుకంటె వారు సదా తామరాకుమీద నీటి బిందువుగా వారి జీవితాన్ని గడుపుతారు.  నాది అని వారు ఏది అనుకోరు, రాగద్వేషాలకు బానిసలు కారు నిర్లిప్తగా జీవనాన్ని గడుపుతారు. 

ఓం శాంతి శాంతి శాంతిః 

తత్వమసి 

గమనిక: విజ్ఞులైన పాఠకులారా తెలుగు టైపు చేయటంలో కొన్ని తప్పులు సహజంగా దొర్లవచ్చు దయచేసి తప్పులను ఎత్తకుండా కేవలం భావాన్ని మాత్రమే తీసుకోగలరు. అమృత తుల్యమైన పానకాన్ని గ్రోలెరప్పుడు కొన్ని పుడకలు  రావటం సహజమే కదా.