👆 .వి.ఆర్. ఈశ్వర్ గారి సందేశం. 👇
వామనావతారము
ఈ రోజు (17 సెప్టెంబర్ 2021) భాద్రపద బహుళ ద్వాదశి అనగా శ్రీ మహావిష్ణువు వామనావతారం లో జనించిన పర్వదినం. ఈ రోజును వామన ద్వాదశిగా, విజయ ద్వాదశిగా మరియూ శ్రవణ ద్వాదశి గా కూడా వ్యవహరిస్తారు. అయితే శ్రవణ ద్వాదశి- (శ్రవణ నక్షత్రంతో కూడిన భాద్రపద బహుళ ద్వాదశిని శ్రవణ ద్వాదశి అంటారు) "వామనజయంతి" ని భాద్రపద శుక్ల ద్వాదశినాడు జరుపుతారు !
శా. ఇంతింతై వటుఁడింతయై మరియుఁ దానింతై నభోవీధిపై
నంతై తోయద మండలాభ్రమున కల్లంతై ప్రభారాశిపై
నంతై చంద్రుని కంతయై ధ్రువుని పైనంతై మహర్వాటిపై
నంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై
పోతనగారి ఈ పద్యం ఏదో ఒక సందర్భంలో వినని వారుండరనుకుంటాను. అంచెలంచలుగా ఎదిగి ఉన్నత శిఖరాలకు చేరుకున్న వ్యక్తిని గురించి చెప్పేటప్పుడు ‘ఇంతింతై వటుడింతయై అన్నట్టు ఎదిగిపోయాడు’ అని చెప్పుకోవటం పరిపాటి. అంతగా తెలుగు ప్రజల నాలుకల మీద – కనీసం ఈ పద్యములోని మొదటి పాదము ఐనా – నిలిచిపోయింది. ఈ పద్యంలోని ప్రసన్నమైన శైలి చెప్పకనే చెబుతుంది ఇది బమ్మెర పోతనామాత్యుని పద్యమని. పోతన ఆంధ్రీకరించిన భాగవతం అష్టమ స్కంధంలో – వామనుడు త్రివిక్రముడై పెరిగిపోయే దృశ్యాన్ని అత్యంత సహజసుందరంగా వర్ణించిన పద్యం ఇది.
ఒకప్పుడు బలి అనే రాక్షస రాజు ఉండేవాడు. ఆయన ఎవరో కాదు... సాక్షాత్తు ఆ ప్రహ్లాదుని మనవడే! బలి భాగవతోత్తముడు, మంచివాడే, తన ప్రజలను కన్నబిడ్డలలా చూసుకునేవాడే. కానీ రాక్షసుడు కావడం చేత దేవతలంటే సరిపడేది కాదు. రాక్షస గురువు శుక్రాచార్యుని సహాయంతో బలి ఏకంగా ఆ స్వర్గం మీదకే దండెత్తాడు. తమను రక్షించమంటూ దేవతలంతా వెళ్లి ఆ విష్ణుమూర్తినే శరణువేడారు. అలా భాద్రపద బహుళ ద్వాదశి నాడు అదితి గర్భాన చిన్నారి విష్ణుమూర్తి జన్మించాడు వామనమూర్తి గా !
బలి చక్రవర్తి వద్ద నుంచి మూడడుగుల నేలను దానంగా పొంది, ఒక అడుగును భూమిపై మోపి, రెండో అడుగుతో బ్రహ్మాండాన్ని ఆక్రమించడం కోసం క్రిందనుంచి ఒక్కోదాన్నే దాటుకుంటూ ఎలా విజృంభించాడో, ఏ విశేషణాలూ లేకుండా, ఒక మహాద్భుత దృశ్యాన్ని కండ్ల ముందు రూపు కట్టించాడు పోతన.
ఇంతైనాడు, మరింకింతైనాడు, ఆకాశానికి అంతైనాడు, మేఘమండలానికి అల్లంతైనాడు, జ్యోతిర్మండలానికి అంతైనాడు, చంద్రుణ్ణి దాటాడు, ధ్రువుడికి ఇంకా పైకి సాగాడు, మహర్లోకం దాటినంతైనాడు, సత్యలోకంకన్నా ఉన్నతంగా ఎదిగాడు. బ్రహ్మాండమంతా నిండిపోయాడు – ఇదీ ఒక కుబ్జబాలకుడు క్రమక్రమంగా అజాండభాండాన్ని ఆక్రమించిన త్రివిక్రమ స్ఫూర్తి. క్రింద మునులూ, బలి చక్రవర్తీ, శుక్రుడూ నివ్వెరపోయి చూస్తున్నారు. క్షణం పూర్వం కండ్లముందు నిలుచున్న బ్రహ్మచారి బాలకుడు – ఒక్కసారిగా కాదు – క్రమక్రమంగా ఎదిగి భూనభోంతరాలు నిండిపోవడాన్ని ఇంతకన్నా అందంగా రూపు కట్టించడం అసాధ్యమనుకుంటాను. పద్యం పద పదానికీ విరుగుతూ, వామనుడు పదపదానికీ పెరుగుతూ పోయే క్రమతను రూపించింది. ఇంతై, అంతై, దీనికింతై, దానికింతై అంటూ ఒక గొప్ప దృశ్యానికి ప్రత్యక్ష వివరణ, ప్రత్యక్ష ప్రసారము ఏకకాలంలో చేశాడు కవి. ఈ పద్యం మనసులో పట్టించుకొని చదువుతూ ఉంటే ఒక రవినగాయిచ్ సినీమాటిక్ దృశ్యం కండ్లముందు నిలిచిపోతుంది.
వామనుడు బలి చక్రవర్తిని దాన మడిగిన తీరు చాలా విచిత్రంగా ఉంది. మూడడుగులు దాన మిమ్మని స్పష్టంగా పలుకక ‘ఒకటి రెండడుగుల మేర’ అన్నాడు. ఏమిటిది? ఒకటి, రెండు కలిపితే మూడనే అర్ధం వచ్చేటట్లు పద్యాన్ని తీర్చినాడా పోతన్న? కాదు. ఒకటి భూమి, రెండు ఆకాశం. వామనుడికి ఉన్న రెండు పాదాలు భూమిని, ఆకాశాన్ని ఆక్రమించాయి. ఇక మూడవ అడుగునకు చోటెక్కడిది? అదే బలి శిరం. తద్వారా బలికి విష్ణుసాయుజ్యం. మూడడుగుల దానమిస్తే నేను నీవాడినై నీతో ఉండి నిన్ను కాపాడుతాను అన్నాడు హరి. ఈ మూడడుగులు జీవుని సర్వస్వాలైన జాగ్రత్, స్వప్న, సుషుప్తులు అనబడే అవస్థలే. ఇవి నాది అనే భవబంధానికి కారణం. ‘తవైవ వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే’ అని భగవంతునికే సమర్పిస్తే ఆయనే ‘యోగక్షేమం వహామ్యహమ్’ అంటూ కాపాడుతాడు. ఈ అద్భుత సత్యాన్ని వ్యాసులవారు వామన ఘట్టం ద్వారా స్పష్టం చేసినాడు. ఈ నిగూఢార్థం బలికి శుక్రునకు ఇరువురకు తెలిసినప్పటికి వారివారి సంస్కారాలకు అనుగుణంగా వారు తమతమ మార్గాలు నిర్దేశించుకున్నారు.
ఇంతేకాదు. ఈ పద్యం తరువాతనే మరో పద్యం ఉంది. క్రిందినుంచి వామనుడు క్రమక్రమంగా పైకి పోయే కొద్దీ పైనున్న సూర్యబింబాన్ని ఈ పెరిగే పెద్దమనిషితో కలిపి చూపిస్తూ ఆ రవిబింబపు దశల్లోని వివిధరూపాలని వర్ణించిన పద్యం అది. ఇంతకు ముందు చూపిన దృశ్యాన్నే మరో కోణంలో చూపించడమన్నమాట. వామనుడు పెరిగేకొద్దీ సూర్యబింబం ఎలా ఉందంటే, ముందు ఒక గొడుగు లాగా అతని తలపై కనిపించి, క్రమంగా శిరోరత్నం గానూ, చెవి కమ్మగానూ, నగగానూ, బంగారు జాజుబందీ లాగానూ, కరకంకణం లాగానూ, నడుముకు కట్టిన మొలతాటి బంగారు గంట గానూ, పాదాల అందె గానూ ఆఖరుకు పాదపీఠం గానూ ఉపమించడానికి యోగ్యంగా కనిపించిందట. ఆ పద్యం కూడా చిత్తగించండి.
రవిబింబంబుపమింప బాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై
శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణ కేయూరమై
ఛవి మత్కంకణమై కటిస్థలి నుదంచద్ఘంటయై నూపుర
ప్రవరంబై పదపీఠమై వటుడుదా బ్రహ్మాండ మున్నిండుచోన్
మహానుభావుడు పోతన. కథ పాటికి కథ నడిచిపోతున్నా, భగవంతుని లీలలను వర్ణించే ఘట్టం వచ్చేసరికి పోతనను తెలియనంత తాదాత్మ్యం ఆవహిస్తుంది. ఆ తాదాత్మ్యంలో వ్రాసే పద్యాలు హృదయాలను పట్టుకునేవిగా రూపొందుతాయి. ఆ పద్యాల్లో గణాలు, యతులు, ప్రాసలు ఇవ్వన్నీ వాటి ప్రాథమ్యాన్ని కోల్పోయి, ఒక మహాభక్తుని ఆంతరంగ పారవశ్యం వాటిల్లో పొంగిపొరలుతూ వుంటుంది. భాగవతంలోని అనేక ఘట్టాలు – ప్రహ్లాద చరిత్ర, గజేంద్రమోక్షము, రుక్మిణీ కళ్యాణము, కృష్ణ లీలలు, అంబరీషోపాఖ్యానము లాంటివి – దీనికి తిరుగులేని సాక్ష్యాలు. భాగవతం లాంటి గొప్ప భక్తి పురాణం పోతన చేతిలో పడి తెలుగులోకి రావటం, తెలుగు జాతి చేసుకున్న గొప్ప అదృష్టం. దీనికి రెండోమాట లేదు.
వామనావతారం శ్రీమహావిష్ణువు యొక్క దశావతారాలలో ఐదవ అవతారం. మానవునిగా మొదటి అవతారము. ఈ వామనుడి ప్రసక్తి రుగ్వేదంలోనే ఉందని చెబుతారు.
సృష్టిలోని జీవావరణంలో జీవులు సూక్ష్మరూపం నుంచి మహా భారీకాయం వరకు వైవిధ్య భరితంగా గోచరమవుతాయి. ఈ అణుత్వం, మహారూపాలు పరస్పర విరుద్ధమైనవి. కానీ, ఆ వైవిధ్యం ఆత్మ, పరమాత్మల విషయంలో లేదని వేదోక్తి. ఆత్మ అణువు కంటే సూక్ష్మమైనది, మహత్తరమైనది. అది ఎంత సూక్ష్మమైనదో, అంత స్థూలమైనదని కఠోపనిషత్తు ప్రకటించింది. వామనావతార నేపథ్యం ఇదే!
బలి అమరావతి పై చేసిన దేవాసుర యుద్ధంలో దేవతలు విహ్వలులై బృహస్పతి వచనములు విని అమరావతి వీడి పారిపోయారు.
దేవతల దుస్థితిని చూసి, సురమాత అదితి, తన భర్తయైన కశ్యప బ్రహ్మను వేడుకుంటుంది. అంతట కశ్యపుడు అదితికి పయోభక్షణ వ్రతాన్ని ఉపదేశిస్తాడు. ఆమె ఫాల్గుణ మాసం, శుక్లపక్ష పాడ్యమి నుంచి 12 రోజులు హరిసమర్పణంగా వ్రతం చేసి భర్తను చేరగా, భగవదంశతో, 'శ్రావణ ద్వాదశి' నాడు శ్రోణ అభిజిత్ సంజ్ఞాత లగ్నంలో, రవి మధ్యాహ్నమున చరించునప్పుడు, గ్రహ తారా చంద్ర భద్ర స్థితిలో వామనుడు జన్మించాడు.
వామానావతారాన్ని పోతనామాత్యులు తన పద్య చిత్రణ ద్వారా తెలుగు ప్రజల కళ్లముందు నిలబెట్టాడు.
ఒక్కొక్క పద్యం చదువుతూ వామనావతార ఘట్టాన్ని స్మరించుకుంటే మీ కళ్లెదుటే విష్ణుమూర్తి, బలిచక్రవర్తి గర్వాన్ని అణిచిన దృశ్యం కనిపించేలా వామనావతార ఘట్టానికి
ప్రాణం పోశాడు పోతన.
పోతన పద్యాలు చదివి తరించండి.
తెలుగువాడిగా గర్వించండి.
***
వామనుడు శంఖ, చక్ర, గదా కమల కలిత, చతుర్భుజునిగా, మకరకుండల మండిత గండ భాగుడై, కపిల రంగు వస్త్రమూ, కదంబ వనమాల సమస్త అలంకారాలతో, నిఖిల జన మనోహరుడిగా, జగన్మోహనుడిగా అదితి గర్భం నుంచి అవతరించాడు.
వెంటనే,
తన దివ్యరూపాన్ని ఉపసంహరించుకొని, వటుని వలె, ఉపనయన వయస్కుండై వామన బాలకుడయ్యాడు.
వామనుడికి వడుగు చేయడం కోసం కశ్యప ప్రజాపతిని ముందుంచుకొని మునీంద్రులు తగిన సకల ఉపనయన కార్యకలాపాలు జరిపించారు.
పోతన గారి ఉపనయన వర్ణన అద్భుతం అనిర్వచనీయమయిన సంతోషం తో మన వెన్నుగగుర్బాటుచెందుతుంది 🙏
బృహస్పతి యజ్ఞోపవీతాన్ని ఇచ్చాడు . కశ్యప మహర్షి మొలత్రాడు ప్రసాదించాడు. తల్లి అదితి కౌపీనాన్ని , భూమాత నల్లజింక చర్మాన్నీ , చంద్రుడు దండాన్నీ , గగనాధిష్ట దేవత ఛత్రాన్నీ , బ్రహ్మ కమండలువునూ , సరస్వతి అక్షమాలికనూ (జపం చేసే సమయాన జప సంఖ్యను లెక్కపెట్టుకోవడానికి) , సప్తర్షులు పవిత్రాలను ( కుశలను/దర్భలు ) వామన మూర్తికి బహూకరించారు. స్వయంగా సూర్యభగవానుడే గాయత్రీ మంత్రాన్ని ఉపదేశించాడు. ఇవే కాక
బిక్షాపాత్రిక నిచ్చెను, యక్షేశుడు వామనునకు అక్షయమనుచున్ సాక్షాత్కరించి పెట్టెను, బిక్షునకు భవాని పూర్ణ బిక్ష నరేంద్రా.
కుబేరుడిచ్చిన అక్షయ పాత్రలో, స్వయంగా సాక్షాత్కరించి పూర్ణ బిక్ష పెట్టింది అన్నపూర్ణాదేవి. నిజంగా వామనుని సౌభాగ్యమే సౌభాగ్యం. ఏ బ్రహ్మ చారికైనా ఇంతకంటే కావలసిందేముంటుంది గనుక. అసలు ఉపనయనానికి బహుమతిగా ఇవ్వవలసిన వస్తువులు ఇవి మాత్రమే .
ఈ పద్యం పిదప వచ్చే పోతన పద్యాలన్నీ అద్భుతం, అజరామరం. ఉదాహరణకు
“స్వస్తి జగత్రయీ, కలరున్ దాతలు నిత్తురున్ ధనముల్, ఇంతింతై వటుడింతయై” లాంటివే కాకుండా మరింకెన్నో. పోతన భాగవతంలో వామన చరిత్ర చదివి అనందింని వారెవ్వరూ ఉండరు చదివిన వారి అదృష్టమే అదృష్టం 👏
ఆవిధముగా బలిని వామనుడు అణచివేసే రోజు కోసం దేవతలందరూ ఎదురుచూడసాగారు.
మహాబలి ఒకసారి అశ్వమేథ యాగాన్ని తలపెట్టాడని తెలిసింది. దాని రంగస్థలం నర్మదానది ఉత్తర భాగాన. అతన్ని అణగదొక్కేందుకు ఇదే సరైన అదనుగా భావించిన మన చిన్నారి బ్రాహ్మణధారియైన వామనుడు హోమ కార్యక్రమాలు పూర్తి చేసుకుని భిక్ష కోసం, యాగశాల వద్దకు చేరుకున్నాడు. అప్పటికి యాగంలో భాగంగా దానధర్మాలు సాగుతున్నాయి. అందరితో పాటుగా వామనుడు కూడా రాజు చెంతకి చేరాడు.
అతనిని చూచి జనులు గుజగుజలు పోవుచూ, గజిబిజి పడుచూ, కలకలములై ఎవరీ పొట్టి బాలుడు? శివుడా? హరియా? బ్రహ్మయా? సూర్యుడా? అగ్నియా? ఈ బ్రహ్మచారి ఎవరు? అని విస్మయం చెందారు. కొందరితో చర్చించుచూ కొందరితో జటలు చెప్పుచూ, గోష్ఠిలో పాల్గొనుచూ, తర్కించుచు, ముచ్చటలాడుచు, నవ్వుచూ అనేక విధంబుల అందరికీ అన్ని రూపులై వినోదించుచూ వామనుడు రాజును ఎట్లా సమీపించెనో వర్ణించడములో పోతన తన కల్పనల్లో శబ్ద లేదా అర్థగతమైన శిల్పాన్ని పాటించకుండా ఉండలేరు. వామనుడు బలిచక్రవర్తి దగ్గరకు ఎట్లు చేరినంటే -
వెడవెడ నడకలు నడచుచు
ఎడనెడ నడుగిడుచు నడరి యిలదిగబడగా
బుడిబుడి నుడువులు నుడువుచు
చిడిముడి తడబడగ వడుగు చేరెన్ రాజున్. రాజును సమీపించి ..
"స్వస్తి ! జాగత్త్రయీ భావన శాసన కర్తకు! హాసమాత్ర విధ్వస్త నిలింప భర్తకు, ఉదారపద వ్యవహర్తకు, మునీంద్ర స్తుత మంగళాధ్వ విధాన విహర్తకు, దానవ లోక భర్తకు స్వస్తి అని దీవించెను.
ఆ వడుగు ఆయనను అడుగుటకై వెళ్ళినట్లు చెప్పిన రెండు పద్యాలు సర్వలఘు కందాలే.
హరిహరి; సిరి యురమునఁ గల
హరి హరిహయుకొఱకు దనుజు నడుగం జనియెన్;
బరహితరత మతియుతులగు
దొరలకు నడుగుటయు నొడలి తొడవగుఁ బుడమిన్
దీనివల్ల పరులను యాచించేవాని తక్కువదనాన్ని స్ఫురింపజేసినాడు. అయితే తన దైవం పరహితానికే దాన మడుగుచున్నాడు కాన అది మంచిపనియే అని సమర్థించినాడు.
బలి అతనికి సముచితాదరమిచ్చి గౌరవించి...
వడుగా ఎవ్వరి వాడ వెవ్వడవు సంవాస స్థలం బెయ్యది
య్యెడకున్ నీవరుదెంచుటన్ సఫలమయ్యెన్ వంశమున్ జన్మమున్
కడు ధన్యాత్ముడ నైతి నీ మఖము యోగ్యం బయ్యె నా కోరికల్
కడ తేరెన్ సుహ్రుతంబులయ్యె సఖులున్ కళ్యాణ మిక్కాలమున్ !!
ఓ బ్రహ్మచారీ! నీపేరేమిటి? ఎవరి పిల్లవాడవు? నీవు నివసించే చోటేది? ఇక్కడికి నీవు రావడంవల్ల నావంశమూ నా జన్మ సఫలము అయ్యాయి. నేను చాలా పుణ్యాత్ముడను అయ్యాను. ఈ యజ్ఞం పవిత్రం అయింది. నా కోరికలు నెరవేరాయి. అగ్నులు బాగా వేల్వబడ్డాయి. ఈ సమయం చాలా శుభదాయకం అయింది. అన్నాడు బలి చక్రవర్తి.
దాన మిచ్చేటప్పుడు యాచకుని ఊరు పేరు అడుగరాదని శాస్త్రము నిర్దేశిస్తున్నది. అయితే
అడిగినవాడు పరమభాగవతుడు. వచ్చినవాడు ఆశ్చర్యం గొలుపు బ్రహ్మవటువు. అంతేకాక వెంటనే ‘నీ వరుదెంచుటన్ సఫల మయ్యెన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడ నైతి’ అనుటలో బలి ఉదాత్తత ద్యోతక మగుచున్నది. అతిథి రాకపట్ల ఆనందాన్ని సంతృప్తిని వ్యక్తం చేయాలే తప్ప ముఖం మాడ్చుకోరాదు. ఇట బలి ఉత్తమ గృహమేధియై దర్శనమిస్తున్నాడు.
ఓ బ్రాహ్మణోత్తముడా! నీకేం కావాలో కోరుకో. మేలైన వస్త్రములా, డబ్బులా, పండ్లా, అడవి సంపదలా, గోవులా, గుఱ్ఱములా, రత్నాలా, రథాలా, మంచి ఆహారాలా, కన్యలా, ఏనుగులా, బంగారమా, భవనాలా, గ్రామాలా, పొలాలా, భూభాగాలా లేకపోతే ఇవి కాకుండా ఇంకేమైనా కోరుకుంటున్నావా?” అని అడిగాడు.
****
ఒంటి వాడ నాకు నొకటి రెండడుగుల
మేర యిమ్ము సొమ్ము మేర యొల్ల
కోర్కె దీర బ్రహ్మ కూకటి ముట్టెద
దాన కుతుక సాంద్ర దానవేంద్ర !!
ఓ దానవరాజా! దానం చేయాలనే చిక్కని కుతూహలం కలవాడా, బలిచక్రవర్తీ, నేను ఒంటరివాడిని ... నాకు సొమ్ములూ భూములూ అక్కరలేదు. నొకటి రెండడుగుల అంటే మూడడుగుల నేల మాత్రము ఇమ్ము. దానితో తృప్తిపడి బ్రహ్మానందం పొందుతాను.
అర్థించేవాడికి లేక పోయినా, దాత గొప్పతనాన్ని చూసి అయినా గొప్పగా అడగాలి కదా అన్న బలి చక్రవర్తి మాటలకు వామనుడు ...
" రాజా ఒంటి వాడను నేను. నాకు ఒకటి మరియు రెండడుగుల మేర యిమ్ము" . అయినను అడుగమంటివి కనుక అడిగితిని. దాత పెంపు సొంపు తలపవలెను గదా! కావున నాకు మూడడుగుల నేలనిమ్ము, చాలు అని మాయావడుగు పలికెను.
అపుడు ఎలాంటి దానం అడగాలో వామనుడికి ఇలా చెబుతున్నాడు బలి...
"వసుధా ఖండము వేడితో గజములన్ వాంఛించితో వాజులన్
వెస నూహించితొ కోరితో యువతులన్ వీక్షించి కాంక్షించితో
పసి బాలుండవు నేరవీవడుగ నీ భాగ్యంబు లీపాటి గా
కసురేంద్రుండు పద త్రయం బడుగ నీ యల్పంబు నీ నేర్చునే ?"
“భూభాగం కోరుకోవాలి లేదా ఏనుగులు కోరుకోవాలి లేదా గుఱ్ఱాలను కోరాలి లేదా అందగత్తెలను చూసి కాంక్షపుడితే జవరాండ్రను కోరుకోవాలి; కాని చిన్నపిల్లాడివి కదా అడగటం తెలియదు; నీ సిరి / సామర్థ్యం ఇంత అల్పమైందే. కనుకే మూడడుగులు మాత్రమే అడిగావు; ఐనా ఇంతటి రాక్షస చక్రవర్తిని ఇంత అల్పం ఎలా ఇస్తాను.” అని అంటున్నాడు బలిచక్రవర్తి మూడడుగుల మేర దానం అడిగిన వామనమూర్తి తో !
గొడుగో జన్నిదమో కమండలువొ నాకున్ ముంజియో దండమో
వడుగే నెక్కడ? భూములెక్కడ ? కరుల్ వామాక్షు లశ్వంబు లె
క్కడ? నిత్యోచిత కర్మమెక్కడ ? మదాకాంక్షామితం బైన మూ
డడుగుల్ మేరయ త్రోవ కిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికిన్ !!
“అయ్యా! నేను బ్రహ్మచారిని. నాకు గొడుగు కాని, యజ్ఞోపవీతం కాని, కమండలం కాని, మొలతాడు కాని ఉపయోగిస్తాయి. అంతేకాని బ్రహ్మచారి నైన నా కెందుకు భూములు, ఏనుగులు, గుఱ్ఱాలు, స్త్రీలు. నా నిత్యకృత్యాలకి వాటితో పనిలేదు కదా. కాదని తోసేయకుండ నే కోరిన ఆ మూడు అడగుల చోటిస్తే అదే నాకు బ్రహ్మాండం..... అన్నాడు వామనమూర్తి !
ఇక్కడ యదృచ్ఛాలాభ సంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు వామనుడు. అట్లే దాతగా ప్రశస్తి గన్న బలి ‘అభ్యాగత స్వయం విష్ణుః’ అని భావించి తృప్తిగా ఎంతైనా ఇచ్చుటకు సంసిద్ధుడైనాడు.
కాని ‘ఒకటి రెండడుగుల మేర ఇమ్ము’ అన్న పొట్టి వడుగుతో దాత స్థాయిని బట్టి అడుగనక్కర లేదా?’ అనే సందేహాన్ని వ్యక్తం చేసినాడు బలి. అప్పుడు వామనవటువు ‘నీవు రాజు వనుచు నిఖిలంబు నడుగుట తగవు కాదు’ అని ‘సంతుష్టుడు ముల్లోకాలలో పూజ్యు డగు’ నని, సంతోషికి ఎప్పుడూ సుఖమే ప్రాప్తిస్తుం దని, సంతోషమే ముక్తిమార్గ మని, లభించినదానితో తృప్తిపడేవాని తేజస్సు పెరుగుతూ ఉంటుం దని, ఎవడు నిస్సంతోషుడో వాడు కోర్కెలు తీర్చుకోవటానికై మళ్ళీ మళ్ళీ జన్మ నెత్తుతూ నరకకూపంలో పడి కాంతి చెడుతా డని చెప్పినాడు. ఇది అసంతృప్తులకు కన్నులు తెరిపించే నీతి.
ఆ వామనుడిని విష్ణువుగా గుర్తించిన శుక్రుడు బలి చక్రవర్తిని వారించెను. బలి గురువుకు వినయముగా నమస్కరించి ...ఇచ్చెదనని పలికితిని. ఆడిన మాట తప్పను అన్నాడు. అప్పుడు శుక్రాచార్యుడు నీవిచ్చినచో అఖిలంబు పోవును. అంతేకాక...
"వారిజాక్షులందు వైవాహికములందు
ప్రాణ విత్త మాన భంగమందు
చకిత గోకులాగ్ర జన్మ రక్షణమందు
బొంక వచ్చు నఘము వొంద దధిప !!
బొంకవచ్చు.....తప్పు లేదు.....అనే దుర్నిర్ణయాన్ని త్రోసిరాజన్నాడు బలి చక్రవర్తి ..
కారే రాజులు రాజ్యముల్ కలుగవే, గర్వోన్నతింబొందరే వారేరీ? సిరి మూట గట్టుకొని పోవంజాలిరే? భూమిపై పేరైనంగలదే!
శిబి లాంటి దాతల పేరు ఈనాటికీ స్థిరములైనవి కదా, భార్గవా! అని పలుకుతూ తన మాటను తోసి పుచ్చిన రాజును పదభ్రష్ఠునివి గమ్మని శుక్రాచార్యుడు శపించాడు. దానికి బలి చక్రవర్తి .. చిట్టెడు విత్తి పుట్టెడు రాల్చుకొను రైతునకు వలె దాతకూడా మంచి మనస్సుతో దానం చేస్తే అది కొంచెమైనా అనంతమైన ఫలితాలను ఇస్తుందనే విశ్వాసాన్ని ప్రకటించినాడు. ‘మేరువు తలక్రిందైనను…. తప్పక ఇత్తున్’ అన్నది ఆయన తుది నిర్ణయం. దానం ఇచ్చేటప్పుడు “విప్రాయ ప్రకట వ్రతాయ। భవతే విష్ణు స్వరూపాయ।” అనటంలో పోతన భాషామర్యాద చూపినాడు. ఈ సంబోధనలన్నీ చతుర్థీ విభక్త్యంతాలు. ఒక వస్తువుపై తనకు గల హక్కును సంపూర్ణంగా వదులుకొని ఇచ్చేటప్పుడే చతుర్థి వాడాలనే సంస్కృత వ్యాకరణ సంప్రదాయం పాటించినాడు. పాత్ర నెరిగి చేసిన దానమే గుర్తింపబడుతుంది.
కమలనాభు నెరిగి, కాలంబు దేశంబు
నెరిగి, శుక్రు మాట లెరిగి, నాశ
మెరిగి, పాత్ర మనుచు నిచ్చె దానము బలి,
మహి వదాన్యు డొకడు మరియు గలడె।
అంటాడు పోతన్న. ‘తముదామె వత్తు రర్ధులు, క్రమ మెరిగిన దాత కడకు రమ్మన్నారా కమలమ్ములున్న చోటికి భ్రమరమ్ముల’ అనేది ప్రకృతినీతి. తుమ్మెద యొక్క పాదతాడనకు వెరువక, దాని నలుపునకు తనకు పులుముతున్న దని ఈసడింపక, గుండెలోతుల మాధుర్యాన్ని కొల్లగొడుతున్నా చలింపక, పద్మము తుమ్మెదను ఆహ్వానిస్తుంది. అర్హులైనవారికి అవసరమైనది అందించుటలో గల ఆనందం ఇట్లే ఉండును.
ఇక్కడ అవతలి వ్యక్తి ఎవ్వరో, ఎందుకు వచ్చాడో బలిచక్రవర్తికి తెలుసు. శ్రీహరి స్వయముగా తనకోసమే వామనుడై అవతరించాడంటే ఆ శ్రియఃపతి తనను దీవించి మోక్షమీయడానికే అన్నది తనలో రూఢి అయ్యింది. మనం అనుభవిస్తున్న సంపద అంతా మనదా? కాదు. భగవంతుడు ఇచ్చినదే. ఆయనది ఆయనకే కైంకర్యం చేయడంలో మనం నిమిత్తమాత్రులై ఉపాధిస్థానీయులై ఉండటంలో ఎంతో గొప్పతనం ఉంది. అలాకాకపోతే ఒక్కమారు మన అనుభవంలోనికి వచ్చిన దానిని వదులుకోవడానికి చాలా ఆవేదన చెందవలసివస్తుంది. అందుకై బలి త్యాగానికి పీటవేశాడు. దైవార్పణగా పరుల కిచ్చిన దానికంటే దైవమే గ్రహించిన దాని ఫలితం ఎంతో గొప్పదని పోతన్నయే క్రింది పద్యంలో పేర్కొన్నాడు.
పరమేశ్వరార్పణంబుగ
పర జనులకు భిక్ష యిడిన పరమ పదంబుం
బరగెదరట తుది సాక్షా
త్పరమేశుడు భిక్ష గొన్న ఫలమెట్టిదియో!
సకల జగత్తుకూ మూలమైన
వామన మూర్తి యాచనా హస్తం కింద,
దాతగా తన హస్తం పై న ఉండడాన్ని ఆలోచించుకుని ఉప్పొంగి పోయాడు బలి....
ఆదిన్ శ్రీసతి కొప్పు పై తనువు పై నంసోత్తరీయంబు పై
పాదాబ్జంబుల పై కపోల తటి పై పాలిండ్ల పై నూత్న మ
ర్యాదంజెందు కరంబు క్రిందగుట మీదై నా కరంబుంట మే
ల్గాదే రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే !!
ఇతడు దానం కావాలని చాచినచేయి ఎంతో గొప్పది కదా! మొదట లక్ష్మీదేవి కొప్పు ముడి మీద, శరీరం మీద, పైట చెంగు మీద, పాదపద్మాల మీద, చెక్కిళ్ళ మీద, పాలిండ్ల మీద సరికొత్త మర్యాదలు పొందే దివ్యమైన హస్తం. అంతటి చెయ్యి కిందది కావటం దాతగా నాచెయ్యి పైది కావటం ఎంత అదృష్టం! ఎంత మేలు! దీని ముందు ఈ రాజ్యం ఏ పాటిది! ఇదేమైనా శాశ్వతంగా ఉండేదా! ఈ శరీరం ఏమైనా పడిపోకుండా ఉండిపోతుందా. అనుకున్నాడు బలిచక్రవర్తి..
ఆ విధంబున బలిచక్రవర్తి హరిచరణములు కడిగి, త్రిపాద ధరిణిం దాస్యామి అనుచు నీటిధార విడిచాడు. ఆ కలశములో సూక్ష్మకీటక రూపమున చేరి శుక్రాచార్యుడు నీటిధారను ఆపబోయాడు. అప్పుడు హరి కుశాగ్రముతో కలశరంధ్రమును బొడువగా కన్ను పోగొట్టుకొని శుక్రాచార్యుడు (ఏకాక్షి) ఏక నేత్రుడయ్యెను.
పుట్టి నేర్చుకునెనో, పుట్టక నేర్చెనో.. ఈ పొట్టి వడుగునకీ చిట్టి బుద్ధులెట్లబ్బెనో, ఈతని పొట్టనిండా అన్నీ భూములే.. అని నవ్వుతూ మూడడుగుల నేలను బలి వడుగుకు దానమిచ్చెను.
అలా ధారా పరిగ్రహంబు చేసిన, వామనుడు
త్రివిక్రముడిగా విరాట్ రూపాన్ని సంతరించుకుని, ఓ పాదంతో భూమినీ, మరో పాదంతో స్వర్గాన్నీ ఆక్రమించి, మూడోపాదం బలి శిరస్సుపై ఉంచి, అతణ్ని రసాతలానికి అణగదొక్కాడు. బలి సర్వ సమర్పణా భావానికి ప్రసన్నుడైన వామనుడు సుతల లోక రాజ్యాన్ని అనుగ్రహించాడు. ఇంద్రుడికి తిరిగి స్వర్గలోకాధిపత్యాన్ని కల్పించాడు.
భాగవత సౌరభము:
‘నహి జ్ఞాన సదృశం ధనం’
(జ్ఞానానికి మించిన ధనంలేదు),
‘విద్యయా అమృతమశ్నుతే’
(విద్యవల్లనే అమృతత్వం సిద్దిస్తుంది)
అని వేదం వక్కాణిస్తుంది. ఆదైవీయ జ్ఞానాన్ని, మోక్షవిద్యను ప్రసాదించడంలో భాగవతానిదే అగ్రస్థానం. ఇందలి వామనావతార ఘట్టం వదాన్యులకు ఆదర్శమార్గాన్ని నిర్దేశిస్తూ ఉంది.
బలిచక్రవర్తి యొద్ద దాన దర్పం లేని ‘సత్యకరుణా ధర్మోల్లసన్మూర్తిమత్వం’ గోచరిస్తుంది. ‘తాను చేసిన ధర్మంబు తన్ను కాచు’ అనే ప్రబలమైన విశ్వాసం కలవాడు బలి.
దాన విషయంలో బలి, అతని గురువు శుక్రుడు, ఇరువురు రెండు భిన్న ధృవాలు. మూర్ఖుడు తన దగ్గర ఉన్నది కాస్తా ఇస్తూ పోతే దరిద్రు డవుతా నని భయపడుతాడు. సమ్యక్ దృష్టి ప్రసాదించవలసిన గురువు ఇక్కడ సంకుచిత మనస్తత్వం ప్రదర్శించినాడు. అలనాడు భక్తి విషయంలో తండ్రిని దిద్దిన తనయుడుగా ప్రహ్లాదుడు వెలిగినాడు. నేడు గురువును దిద్దే శిష్యుడుగా ప్రహ్లాదుని మనవడు బలి బలమైన పునాది పై నిలబడినాడు. ‘చిన్నిపాపని త్రోసిపుచ్చగ చిత్త మొప్పదు’ అని ‘మాట తిరుగ లేరు మానధనులు’ అని ‘రానిమ్ము కానిమ్ము పో….. తిరుగన్నేరదు నాదు జిహ్వ’ అని ఘంటాపథంగా పలికినాడు.
శుక్ర లక్షణం జారిపోవడం. అనగా స్థిరత లేనిది. కావున దానికి విలువ ఈయనక్కరలేదు.
ఒక వ్యక్తిని ఉన్నత సోపానాల చేర్చేది శాశ్వతమైన తిరుగులేని నిర్ణయమే. స్వార్ధపరులకు పనికివచ్చేది తాత్కాలిక నీతి మాత్రమే. అందుకే - బలి ఇహము వదలి పరముని సన్నిధిలో సాయుజ్యము పొందడానికి ఇదొక వరంగా భావించినాడు.
ప్రస్తుతం బలి పదునాలుగులోకాల తర్వాత సుతలంలో ఉన్నాడని, రాబోయే ఎనిమిది మన్వంతరాలలో అనగా ఇప్పటికి ఏడు మన్వంతరాలు గడచిన దృష్ట్యా ఇంకొక్క మన్వంతరానికి ఇంద్రు డవుతాడని పురాణాలు చెబుతున్నాయి. సుతలం అనగా శ్రేష్ఠస్థానం. భగవత్ప్రాప్తిని మించిన మంచిచోటు వేరే ఏముంది? బలి వదాన్యత కారణంగా విష్ణువే సుతల ద్వారపాలకుడై ఉన్నా డని పలకటం బలి యొక్క మహద్భాగ్యం.
బలి దానమీయడానికి సన్నద్ధుడైన వేళ అతనిలో అధైర్యము గాని, నిరాశ గాని లేదు. ఎందు కిస్తా నన్నానా అనే పశ్చాత్తాపం గాని, శుక్రుని మాట విని ఉంటే బాగుండేది కదా అనే ఆలోచన గానీ, భార్య నడిగి అంగీకారం తీసుకోవాలని గాని అనుకోలేదు. అంతా హరికృప అనుకున్నాడు. ఆ పరాత్పరునకు ఎవ్వరిని ఎప్పుడు ఎక్కడ ఎట్లా వాడుకోవాలో తెలుసు. అందుకు మానసిక సంసిద్థతతో మనం ఉండటమే మహనీయ మార్గం. బలిది పారలౌకిక దృష్టి. శుక్రునిది ఇహలోకదృష్టి.
బలి అనగా మాయను తెలిసికోగల ఆత్మబలం ఉన్నవాడు. అందుకే ఆయన. ఎదుట దుర్బలు డయ్యాడు శుక్రుడు. దైవీయ విషయంలో ప్రతి వ్యక్తి బలి సదృశుడు కావాలి.
ఈ ఘట్టంలో చివరగా, పదవీ గర్వం గలవానికి సంపదల మధ్య తులతూగుతున్న కారణంగా చెవులు వినబడ వని, మనస్సు కాడుపడుతుందని, దానితో ధర్మానికి దూరమౌతా డని, నేడు బలిని పదవీచ్యుతుణ్ణి చేసి, అతని సంపద నెల్లా నీ అధీనంలోనికి తెచ్చుకోవడం ద్వారా, రక్షించి మేలు చేసావు.” అని ప్రహ్లాదుడు విష్ణువుతో అంటాడు. సాధారణంగా అన్య దేవతలు భక్తుల్ని కరుణిస్తే దానికి సాక్ష్యంగా రకరకాల ఐశ్వర్యాలను ఇస్తారేమో కాని విష్ణువు దీనికి భిన్నంగా మోక్ష మిచ్చే దృష్టితో భక్తుని సర్వస్వాన్ని హరిస్తాడు.
వామనునకు పోతన్నకు భేదం లేదనిపిస్తుంది. వామనుని పాదాలు ముల్లోకాలను ఆశ్రయించినట్లే ఈ వామనచరిత్రలోని పోతన్న పద్యాలు మూలానికి మూడింత లైనాయి. వామనుని కృప ఆశ్రితులకు వినమ్రులకు ముక్తిని ప్రసాదించినట్లే. పోతన కవిత భాగవత పాఠకులకు పునర్జన్మ లేకుండా చేసింది.
వామనుని ఆవిర్భావంలో వలె మనలో జ్ఞానోదయం తొందరగా కలగాలి. వామన పాదఘాతంచే బ్రహ్మాండం చిట్లి ఆకాశగంగ చిమ్మినట్లు, అజ్ఞానావరణం బ్రద్దలై జ్ఞాన స్రోతస్సు ప్రవహించాలి. దానికి మన సంపదను కీర్తి కండూతితో గొప్పకార్యాలకు ఖర్చుపెట్టక ఉత్తమ కార్యాలకు అర్హులైన ఆశ్రితవర్గాలకు సమంగా వ్యయించాలి. యాచన అనివార్యమైతే మంచిపనులకే చేయిచాచాలి. దానం స్వీకరించవలసివస్తే అవసరాన్నిమించి తీసుకోరాదు. ప్రపంచం విశ్వాసంమీద నడుస్తున్న దృష్ట్యా దాన్ని పెంపొందించుకోవాలి. విశ్వాసం ఎట్టివాని నైనా రక్షిస్తుంది.
'వామన' జయంతి ప్రత్యేకత:
వామన జయంతి ని భాద్రపద శుక్ల ద్వాదశి నాడు జరుపుతారు. బహుశా వామనుడు శ్రవణ నక్షత్ర అభిజిత్ లగ్నమున అవతరించాడు కాబట్టి 'శ్రావణ ద్వాదశి' అని కూడా అంటారు !
బలి రాక్షసుడే కావచ్చు. కానీ ప్రజారంజక పాలకుడిగా పేరొందినవాడు, తన ప్రజలని కన్నబిడ్డల్లాగా చూసుకునేవాడు. అందుకే ఓసారి తిరిగివచ్చి తను పాలించిన ప్రాంతాన్ని చూసుకునే వరం ఈయమని వామనుడికి అడిగాడు. ఆ వరం ప్రకారమే ప్రతి ఏటా బలి పాలించినట్లుగా ప్రదేశాల్లో పేర్కొనే కేరళ ప్రజలు తన ప్రజలు సుఖసంతోషంగా ఉండటాన్ని చూసి, తృప్తిగా తిరిగి స్వర్గానికి మరలిపోతాడని అందుకు ఆయన ప్రతి సంవత్సరం .. “తిరువోణం” దినమున తమ ప్రభువు తమ వద్దకు వస్తాడని విందు భోజనం తయారు చేసి బలికి నివేదిస్తారు. కాలక్రమేణా ఆ శుభ దినమున కేరళీయులు తిరు "ఓణం" పర్వదినముగా వేడుక జరుపుకుంటున్నారు !
మూడు అడుగులతో ఈ లోకాన్ని జయించాడు కాబట్టి వామనుడికి త్రివిక్రముడు అని పేరు. ఆ త్రివిక్రముని పేరు మీద చాలా ఆలయాలు కూడా ఉన్నాయి. కంచిలో ఉన్న ‘ఉళగలంద పెరుమాళ్’ ఆలయం, ఖజరుహోలో ఉన్న ‘వామన’ ఆలయం వీటిలో ప్రముఖమైనవి. ఇవే కాకుండా ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ తదితర చోట్ల కూడా వామనుడి ఆలయాలు కనిపిస్తాయి.
మిత్రానందపురము వామన మూర్తి దేవాలయం, చెరుపు, త్రిస్సూర్, థ్రికక్కర (థ్రికక్కర ఆలయం), కొచ్చిన్ మరియూ వామన కంచిలో అద్భుతమైన వామన అవతారం గుడి ఉంది. తిరుకొయిలూర్, విల్లుపురము జిల్లా, తమిళనాడు.
బలి గమ్యం లేని శక్తికి ప్రతీక, వామనుడు లక్ష్యం ఉన్న జ్ఞానానికి సూచన. వామనుడు కోరిన మూడు అడుగులకు కూడా చాలా అర్థాలే చెబుతారు. సత్వరజోతమోగుణాలనీ, సృష్టిస్థితిలయలనీ సూచిస్తాయని అంటారు. ఇక తల మీద పాదం మోపడం అంటే అహంకారాన్ని అణచివేయడమే! వామన జయంతి సందర్భంగా ఆ విష్ణుమూర్తని కొలిచినవారు కూడా ఆ అహంకారాన్ని జయించి, ఈతి బాధల నుంచి విముక్తి పొందుతారని నమ్ముతారు !
ఓం నమో భగవతే వాసుదేవాయ
🙏
*ఎం. వి. ఆర్ . ఈశ్వర్.*