17, సెప్టెంబర్ 2021, శుక్రవారం

రాజమండ్రి లో నే

 నేను రాజమండ్రి లో నే పుట్టి రాజమండ్రి లో పుట్టిన అమ్మాయినే పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడ్డాను. యుక్త వయస్సులో అమెరికా వెళ్ళక ముందు రోజూ ఫ్రెండ్స్ తో సాయంత్రం గోదారి గట్టున ఇటుక రంగు మెట్లపై కూర్చుని మెత్తని చల్లని గాలి తో వచ్చే గోదావరి సువాసన ఆస్వాదిస్తూ అలా గోదారిని చూస్తూ బజ్జీలో సమోసాలో తింటూ సరదాగా మాట్లాడుకుంటూ వుంటే ఇక స్వర్గం ఎందుకండీ. ఇంకా కోసి నిమ్మకాయ పిండిన బజ్జీలు, సమోసాలు పిడత క్రింద పప్పు పల్లీలు ఐస్ ఫ్రూట్ లు ఒకటేమిటి అన్నీ దొరికే అదో స్వర్గం. ఇక రాజమండ్రి లో ఏ హోటల్ కి వెళ్ళినా టిఫిన్లు మహా అద్భుతం గా ఉంటాయి...... ఇక పుష్కరాల రేవు దగ్గర రెండు వంతెన ల మధ్య మెట్ల మీద అదో దృశ్యానందం. ఇక దేవాలయాలు, గౌతమి ఘాట్ గురింఛీ ఎంత చెప్పినా తక్కువే. అందుకే నేమో రాజమండ్రి లో పుట్టిన వాళ్ళు ఎక్కడికి పోయినా చివరి సమయం లో అక్కడకే వచ్చి తనువులు చాలించాలి అనుకుంటారు.. అమెరికా లో వున్నా ఏడాదికొ రెండేళ్ల కొ ఓసారి రాజమండ్రి వచ్చి ఓ పదిరోజుల పాటు ఆ స్వర్గాన్ని మేమిద్దరము ఫ్రెండ్స్ తో అనుభవించే వాళ్ళము.. తన పెద్దలు నా పెద్దలు ఒకళ్ల తర్వాత ఒకళ్ళు వెళ్ళిపోయారు ఆయనెవరో బాచీ గారు మా పెద్దవాళ్ళ కార్యక్రమాలు కంభం వారి సత్రం దగ్గర గోదారి గట్టుమీద ఎంతో అద్భుతం గా జరిపించారు ఇక రాజమండ్రి తో రుణం తీరిపోయింది.. వర్క్ బిజీ పిల్లల చదువు బిజీ ఓ 20 ఏళ్ళు గడిచిపోయాయి నేను ఈ 20 ఏళ్ళు గా రాజమండ్రి రాలేదు ఫ్రెండ్స్ తో వీడియో కాల్స్ వాట్స్అప్. 2030 వచ్చేసింది మా ఆవిడ ఆరోగ్యం పాడయ్యింది. తన ఆఖరి కొరిక తన కార్యక్రమాలు రాజమండ్రి లో జరగాలి అని. పిల్లల కి పర్మిషన్ దొరకలేదు వాళ్ళకీ పెళ్లిళ్లు అయ్యిపోయాయి అమెరికా లో సెటిల్ అయిన ఆంధ్రుల తో.. ఇక ఒంటరిగా నేను బాడీ ని రాజమండ్రి తీసుకు వచ్చాను. నా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఖననానికి ఏర్పాట్లు అన్నీ వాళ్లే చేస్తున్నారు. రుద్రభూమీకి వెళ్ళాను. పూర్వం అమ్మిరెడ్డి కైలాస భూమి అనే పేరు వుండేది అది కనపడలేదు. అంబాదాని కైలాస వాటిక అనే పేరు వుంది. పూర్వం కాటికాపరి వుండేవాడు వాడి స్థానం లో ఒక సూటు బూటూ వేసుకున్న వ్యక్తి, వాడికి ఇద్దరు అసిస్టెంట్లు, కట్టెలతో నా? ఎలక్ట్రిక్ క్రీమేషనా? కట్టెలతో అయితే 50000/- ఎలక్ట్రిక్ అయితే 25000/- అని గోడపై అతికిచ్చి వున్న క్యూ ఆర్ కోడ్ స్టీక్క్కర్ చూపించాడు. మీరు మీ చాయిస్ ఎన్నుకుని పే చేయండి మాకు మెసేజ్ వస్తుంది మేము కార్యక్రమం మొదలు పెడతాం అన్నారు. 50000 ట్రాన్సఫర్ చేశాను మరి పంతులుగారు ఏరీ పూజ చేయించడానికి అని అడిగా దానికి మరో 10000/- అదనం అన్నాడు అదీ కట్టాను. ఎవరికో కాల్ చేశాడు ఓ అరగంట తర్వాత ఒక బక్క చిక్కిన బ్రాహ్మణ ప్రాణి ఒకటి వచ్చాడు. వాడికి అంబాదానీ ఉద్యోగి ఒక 500/- నోటు ఇచ్చి పూజ చేయించాడు. ఆ కార్యక్రమం అంతా అయ్యాక కంభం సత్రం లో మిగతాది చేద్దాం అని నా ఆశ అన్నాను. అక్కడికి తీసుకు వెళ్లారు. అక్కడ కంభం సత్రం లేదు. అంబాదానీ పితృ కర్మల సత్రవ్ అని వ్రాసి వుంది. ఈ లోపల ఆవిడ వైపు బంధువులు నా వైపు బంధువులు వచ్చారు. లోపలకి వెళ్లాము వాడు మేను కార్డ్ ఇచ్చాడు టోటల్ 12 రోజులకు 20 లక్షలు కార్యక్రమం అంతా వాళ్లే చేస్తారట గోదానం భూ దానం సువర్ణ దానం వగైరా చివరికి పిండాలు కూడా వాడే ఏర్పాటు చేస్తాడట, ఇక సత్రవు లో టీ టిఫిన్ భోజనం, సప్లయ్ వాడే చేస్తాడు. పది మందికి ఎక్కువ గా జనాలు వస్తే మనిషికి రోజుకి 2000/- అదనంగా కట్టాలి అన్నాడు. తప్పెదేముంది.. బక్క చిక్కిన బ్రాహ్మలు కార్యక్రమం మొదలు పెట్టారు. వాళ్ళకి రోజుకి ఒక్కొక్కడికి 700/- అంబాదానీ కంపనీ ఇస్తుందట. ఇవి పట్టించుకునే పరిస్థితిలో నేను లేను చాలా బాధలో వున్నాను ఫ్రెండ్స్ నా తో నే వున్నారు. రెండో రోజు సాయంత్రమ్ ఓసారి అలా గౌతమి ఘాట్ కి వెళ్లొద్దాము రండి రా అన్నాను తను నేను మొదటి సారి కలిసినది ప్రేమించుకున్నది అక్కడే ఒకసారి తన జ్నాపకాలోకి వెళ్తాను అన్నాను. అందరూ సరే అన్నారు అక్కడ గౌతమి ఘాట్ అనే పేరు లేదు అంబాదానీ ఘాట్ అనే పేరు వుంది. పూర్వం చాట్ బండి, బజ్జీల బండి పల్లీల బళ్ళు చాలా వుండేవి ఇప్పుడు అవేమీ లేవు.. ఘాట్ యూజర్ చార్జ్ మనిషికి గంటకి 100/- అని వ్రాసి వుంది ఫ్రెండ్స్ నలుగురము ఓ రెండుగంటలకు మనిషికి 200 చొప్పున యూజర్ ఛార్జీలు కట్టి లోపలకి వెళ్లాము. అక్కడ లోపల తినుబండారాలు వాళ్ళే సప్లయ్ చేస్తున్నారు పాప్ కార్న్ 200/- సమోసా ప్లేట్ 100/- బజ్జీలు ప్లేట్ 100/- చాట్ ప్లేట్ 150/- అంబాదానీ ఉద్యోగులే సప్లయ్ చేస్తున్నారు. సమోసాలు తిన్నాము. గోదావరి ని చూస్తే మనసు ఉరకలు వేసి బట్టలు ఊడదీసుకుని చడ్డీ తో స్నానం చెయ్యాలి అనిపించి మెట్లు దిగి నది వైపు వెళ్తున్నా వెనక నించి నా ఫ్రెండ్స్ అరుపులు ఒరే స్నానానికి టాగ్ వేయించుకో టాగ్ లేకుండా నీళ్ళల్లోకి దిగితే 500/- ఫైన్ అన్నారు. నేను అప్పుడు అడిగాను ప్రొద్దున్న నించి చూస్తున్నాను రాజమండ్రి కి ఏమయ్యింది ఈ వ్యవహారం ఏమిటి రా ఈ టాగ్ ల గోలెంటి అని. అప్పుడు నా ఫ్రెండ్స్ గొల్లుమన్నారు. ఒరే మూర్తి రాజమండ్రి లో కొటి లింగాలు ఘాట్ నించి గౌతమి ఘాట్ వరకూ గోదారి గట్టుని మరియు శ్మశానాలని అంబాదానీ కి అమ్మేశారు రా అని . 2027 పుష్కరాలకి అంబాదానీ గాడు ఎక్కేడెక్కడ నించో పుష్కర స్నానాలకి వచ్చిన వాళ్ళ దగ్గర నించి మనిషికి ఒక స్నానానికి 100/- చొప్పున వసూలు చేశాడు. మామూలు గా అయితే ఒక స్నానానికి 50/- అది పర్వం రోజుల్లో 100/-. సరదాగా గోదారి గట్టున కూర్చుని మందేద్దాము అంటే మందు కర్చు కన్నా గోదారి గట్టు యూజర్ చార్జీలు ఎక్కువ. పూర్వం పల్లి బండోళ్ళు, సమోసాలు , చాట్ , బజ్జీల బళ్ళు వుండేవి వాళ్ళందరికీ మేము గోదారి గట్టు కొనుక్కున్నాము మీరు ఇక్కడ అమ్ముకోడానికి వీలులేదు అని గెంటేశారు పూర్వం గోదారి గట్టుని నమ్ముకుని ఎంతో మంది బ్రాహ్మలు బ్రతికేవారు, ఎంతో మంది ముష్టి వాళ్ళు ఈ గట్లమీదే పడుకునేవారు. వాళ్లందరిని గెంటేశారు. ఈ కంభం సత్రం కూడా అంబాదానీ కి అమ్మేశారు వాడి రేట్లు వాడిష్టం గో దానాలు, భూ దానాలు, సువర్ణ దానాలలో అంతా మోసమే అన్నారు. పోనీ కొవ్వూరు కానీ వాడపల్లి కానీ వెళ్ళి కార్యక్రమాలు చేస్తే ఎలా వుంటుంది అన్నాను వాళ్ళు దానికి ఆ ఘాట్లని లంబాని కి అమ్మేశారు అక్కడ రేట్లు ఇంకా ఎక్కువ అన్నారు. ఇలా అడగడం బాగుండదు మరి మధ్య తరగతి వాళ్ళు ఈ కార్యక్రమాలు ఎలా తట్టుకుంటున్నారు అని అడిగాను. ఈ గోదారి గట్టునే అమ్ముడు పోనీ కొన్ని ప్రదేశాలు వున్నాయి అక్కడ ఫెసిలిటీస్ ఏమీ వుండవు కొందరు అక్కడ చేసుకుంటున్నారు అని చెప్పారు.

ఒరే రేపు మనం చిన్నప్పుడు ఆడుకున్న దానవాయి పేట వేళదాం రా పార్క్ కి వెళ్దాం రా అన్నాను. అలాగే మర్నాడు సాయంత్రం దానవాయి పేట పార్క్ కి వెళ్లాము. పార్క్ పేరు మారిపోయింది ఉదాని పార్క్. అక్కడ కూడా యూజర్ ఛార్జీలు గంటకి తలకి 100/- లోపల కూర్చునే బెంచీ లకు ఒక్కో బెంచీ కి ఒక్కో రేటు. సరదాగా గడ్డి లో కూర్చున్నాము నా భార్య గుర్తుకు వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ పరాధ్యానం లో ఓ గడ్డి పరక ని పీకాను పార్క్ లో అలారం సిస్టమ్ గట్టిగా మోగడం మొదలు పెట్టింది. ఉదానీ గ్రూప్ ఉద్యోగులు వచ్చి గడ్డిపరక పీకినందుకు 500/- ఫైన్ వసూలు చేశారు. ఈ పార్క్ ని ఉదాని కి అమ్మేశారు రా గడ్డి పీకితే 500/- పువ్వు కొస్తే 1000/- ఫైన్. ప్రేమించుకునే వాళ్ళకి టిక్కెట్లు గంటకి జంటకి 500/- ఆ పొదలు చూడు ఆ పొదలలోనే జంటలు కూర్చుంటారు అన్నారు. రేపు ఎక్కడికి వెల్దాము రా అన్నారు. నాకెంతో ఇష్టమైన కంబాల చేరువుని చూడాలి అనిపించి కంబాల్ చెరువు గురించి ఏం వినాలో అని భయంవేసి నోర్మూసుకున్నా. నా ఫ్రెండ్స్ అందరూ నాకు మహా క్లోజ్. వాళ్ళు నా మనసులో ఉన్నది కనిపెట్టేశారు ఏరా మూర్తీ కంబాల్ చెరువు గురించే కదా ఆలోచిస్తున్నావు అది ఎవడో జఠ్మలానీ కి అమ్మేశారు. బోటింగ్ పెట్టి వాడుకూడా పిండుతున్నాడు అన్నారు. ఆ రాత్రి అంబాదానీ సత్రవులో అలా పడుకుని వున్నాను నిద్రలో ఏవేవో కలలు నా రాజమండ్రి కి ఏమయ్యింది

JSRee

కామెంట్‌లు లేవు: