19, సెప్టెంబర్ 2021, ఆదివారం

రెండవ జన్మ

60 సంవత్సరాలు దాతినవారికోసం మాత్రమే  

రెండవ జన్మ బ్రాహ్మణకులంలో జన్మించినవారిని ద్విజులు అని అంటారని మనకు తెలుసు.  దానికి కారణం ఉపనయనానికి ముందు ఒక జన్మ ఉపనయనం అయినతరువాత ఒక జన్మ అని భావం. కానీ ప్రస్తుత కాలమాన పరిస్థితులలో ఉపనయనం అనేది కేవలం వివాహానికి ఒక అర్హతగా మారింది.  చాలామంది వివాహముహుర్తానికి ముందు ఉపనయనం చేయటం మనం చూస్తున్నాము.  కాబట్టి ఇప్పుడు మనం వర్ణాశ్రమ ధర్మాలను పాటించటంలేదని వేరేగా చెప్పనవసరం లేదు. 

నా దృష్టిలో 60 సంవత్సరాలు దాటింతరువాత రెండవ జన్మగా పేర్కొనదలిచాను. ఎందుకంటె అప్పటివరకు ఏదో ఉద్యోగంచేసుకుంటూ ఐహిక సంబాధలతో నిత్యం సతమతం అవుతూ జీవితాన్ని గడిపి రిటైర్ అయి ప్రశాంత జీవితాన్ని గడపాలనుకోవటం కద్దు. కానీ మనం అక్కడక్కడ చూస్తున్నాము. రిటైరు అయ్యికూడా ఇంకా మరల ఇంకో ఉద్యోగమో వ్యాపారమో మొదలుపెట్టి ఇంకా ఇంకా ధనార్జన చేయాలి అని తాపత్రయ పడేవారు అనేకులు.  వారిని మనం మందలించాలిసిన పనిలేదు.  కొంతమంది నేను రిటైర్ అయ్యాను ఇకనయినా నా జన్మ సార్ధకం చేసుకునాలి అని భావించే ముముక్షువులకు నేను సాదరంగా ప్రణమిల్లి ఇది వ్రాస్తున్నాను. 

జీవితంలో కష్టసుకాలు అనుభవించటం ఇయ్యింది.  ఇకనయినా మిగిలిన జీవితకాలాన్ని జన్మ రాహిత్యానికి పాకులాడితే బాగుంటుంది. ఏమంటారు. 

అంతర్ముఖులు కావలి. 

ఇదే మంచి సమయం ఇక ఈ సమయాన్ని వృధా కాకుండా బ్రహ్మజ్ఞ్యాన్ని పొందటానికి వెచ్చించాలి. కొంతమంది నా వయసు ఏమంత లేదు కేవలం 65 లేక 68 మాత్రమే నేను ఇంకో 5 లేక 10 సంవత్సరాలకు సాధన మొదలు పెడతాను అనే వారు లేకపోలేదు. 70 దాటినా ఇంకా కేశాలకు రంగులు అడ్డుకొని ఇంకా బాలాకుమారుడిని అనుకునేవారు వున్నారు.  కొంతమంది గుడులు, గోపురాలు అని ఇంకా యాత్రలు చేస్తూ దేముడిని ఈ బాహ్యప్రపంచంలో వెతుకుతూ అదే కైవల్య ప్రాప్తి అని సంతోషపడేవారు లేకపోలేదు. 

దేముడు బయట లేడు : 

మనమందరం తెలుసుకోవలసింది దేముడు ఈ బాహ్య ప్రపంచంలో లేదు ఆ దేవదేవుడు కేవలం అంటే  కేవలం మన హృదయకుహరంలోనే వున్నారు. అంతేకాదు ఆ సత్యాన్ని తెలుసుకోవాలని ఉపనిషత్తులు గోషిస్తున్నాయి. విగ్రహారాధన, భజనలు, కీర్తనలవలన మోక్షం సిద్దించాడు. వాటివలన కేవలం అంతఃకరణ శుద్ధి ఏర్పడుతుంది.  కానీ పరమావధి అదికాదు ఆత్మజ్ఞాన సముపార్జనం మాత్రమే. దానికి నిత్యా సాధన అవసరం. 

గురువు నన్ను ఉద్ధరిస్తాడు: 

చాలామంది తనకు ఒక మంచి గురువు దొరుకుతాడని ఆయనే తనను ఉద్ధరిస్తాడని ఒక అపోహలో వున్నారు. లెండి మేల్కొనండి అది కేవలం భ్రమ మాత్రమే.  పూర్వం సత్గురువులు ఉండేవారేమో కానీ ఇప్పుడు మనం నివసిస్తున్న సమాజంలో మోక్షగాములు చాల అరుదు.  గురువులుగా చెప్పుకునేవారుకూడా పూర్తిగా ఐహికవాంఛలతో నిత్యం జీవిస్తున్నారు. వారే వారిని ఉద్దరించుకోలేకపోతే ఇక వారు మనలను ఎలా ఉద్ధరిస్తారు చెప్పండి. ఎవరికి వారే గురువులు అనుకోని శ్రీకృష్ణ భగవానుల గీతను, ఆదిశంకరుల బోధనలను (రచనలను) ఆధారంగా చేసుకొని సాధనచేయటమే  

మీ గురువు ఇక్కడే వున్నారు చుడండి 

సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం
అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం

పరమశివుని మొదలు, ఆది శంకరుల మధ్యగా, నా గురువులు వరకు ఉన్న గురు పరంపరకు వందనములు అని అని ఫై శ్లోకం చెపుతున్నది. ముందుగా ఆ దేవదేముడైన పరమశివుని మనస్సులో ప్రార్ధించి, తదుపరి గీతను బోధించి మన జీవితాలకు ఒక లక్ష్యాన్ని చూపిన శ్రీ కృష్ణ భగవానుణ్ణి స్తుతించి ఆ తరువాత మనకు ముక్తిమార్గన్నీ ప్రసాదించిన శ్రీ ఆదిశంకరుణ్ణిప్రార్ధించి మీ సాధన మొదలు పెట్టండి కాబట్టి ఇప్పుడు మీకు బౌతికంగా గురువు ఉండవచ్చు లేక లేకపోవచ్చు కానీ మనకు ఆది గురువు గారు ఆ పరమేశ్వరులే, తరువాత శ్రీ కృష్ణ భాగవానుల గీత అటుపిమ్మట శ్రీశంకరాచార్యులవారు వారు వ్రాసిన అనేక ఆధ్యాత్మిక గ్రంధాలుమనలను ముముక్షుకత్వం వైపు పయనించేలా చేస్తాయి. క్రింది క్రమంలో మన జీవితాన్ని గడిపితే మోక్షం కారతలామలకలం అవుతుంది.

వేదాన్నే అనుసరించండి,
స్వధర్మాన్ని పాటించండి
కోరికలతో కాక, ఫలితాలమీద ఆశ లేకుండా
కర్మలు చేయండి, ఆత్మజ్ఞ్యానం పొందండి
దేహమే నేను అనే బ్రాంతిని తొలగించుకోండి.
ఆదిశంకరులు మనకు చూపెట్టిన మార్గాన్ని అనుసరిస్తే మన జీవితం దన్యతనొండుతుంది. . గురువులకోసం వెంపర్లాడటం కేవలం మన అమూల్య సమయాన్ని వృధాచేసుకోవటం తప్ప వేరుకాదు. ఇప్పటి కాలంలో ఎవరో వచ్చి నిన్ను ఉద్ధరిస్తారనుకోవటం అంతశ్రేయస్కరం కాదు.  సాధకుడు ఎవరికోసం చూడడు, తన దారి తానూ చూసుకుంటాడు. మీకు మార్గదర్శనం చేయటానికి భగవానుల గీత, శంకర భగవతపాదుల అనేక వేదాంత రచనలు, అవే కాకుండా అనేక ఉపనిషత్తులు వున్నాయి. ప్రతి గ్రంధం అమూల్యమైనది. నిజానికి గీతలోని ఒక శ్లోకమే లేక శంకరాభగవతపాదుల "నిర్వాణ షట్కమో" చాలు ఒక సాధకుడు ముక్తి పొందటానికి. 

భగవంతుడు- ధనం 

ప్రస్తుత సమాజంలో మనం భగవంతుడు అనే భావనలో ఎక్కడికి వెళ్లినా అక్కడ ఏదో ఒకరూపంలో ధనసంబంధం మనకు కనపడుతుంది. గుడికి వెళితే పూజకు టికెట్, గురువుల వద్దకు( తమకు తాము సత్ గురువులని చెప్పుకునే వారి వద్దకు )  వెళితే దర్శనానికి టికెట్.  ఆ స్వాములవారు ఇంతదనం ఇస్తే పాదపూజకు అనుగ్రహిస్తారట, ఇంతదనం ఇస్తే ఆశీర్వదిస్తారట అనే మాటలు మనం తరచుగా వింటున్నాము. ప్రస్తుత కాలంలో బాబాల ప్రవ్రుత్తి ఒక వ్యాపారస్తుని ఆలోచనలకన్నా బిన్నంగా ఉందని నేను అనుకోను.  నిజానికి భగవంతునికి ధనానికి ఏమాత్రం సంబంధం లేదు.  ఎక్కడైతే ధనం అనే మాటవినపడదో అక్కడే భగవానులు  వుంటారు. అటువంటి ప్రదేశం చెప్పగలరా. స్మశానంలో ధనానికి ఏమాత్రం సంబంధం లేదు అని అనుకోని మీరు అక్కడకు వెళ్లి ధ్యానం చేయ ప్రయత్నించండి అక్కడకూడా మీకు ఏదో ఒక రూపంలో ధనాపేక్ష కనపడుతుంది. ధనం మూలం ఇదం జగత్ 

స్వా అనుభవం: 

ఒకసారి హిందూసమాజానికి చెందిన ఒక ఆధ్యాత్మిక సంస్థ ఒక సమావేశం పెడితే నేను వెళ్ళాను. అక్కడ ఇద్దరు స్వామీజీలు వచ్చారు. నేను వారికి ప్రణమిల్లి వారితో సంభాషించటం జరిగింది.  వారు సన్యసించినా కూడా  ఇంకా ఐహిక విషయాలను ప్రస్తావించటం నన్ను విస్మయపరిచింది.   కొందరు పీఠాధిపతులు రాజకీయ నాయకులకు ఆశీర్వాదాలు ఇచ్చి వారిని పరిపాలన పీఠాల మీద అధిరోహించాలని చూస్తున్నారనే వార్తలు కూడా మనం చూస్తున్నాము.  ఇవ్వన్నీ చూస్తుంటే కాషాయం కట్టుకున్నవారు ఎంతవరకు సర్వసంగపరిత్యాగులుగా వున్నారు అనే సందేహం కలుగుతుంది..  ఈ రోజుల్లో కొందరు బాబాల, స్టేగురువుల అవతారాలు యెత్తి వారికి వారే గురువులని, అవదూతలని, సాక్షాత్తు భగవంతుని స్వరూపులమని చెపుతూ అమాయకుల మూఢభక్తిని ఆధారంగా ధనార్జన చేస్తూ అనేక ఐహిక సుఖాలను అనుభవిస్తున్నారు.  కాబట్టి సాధకుడు చాలా జాగ్రత్తగా వుండాలిసిన అవసరము వున్నది.  మనం ఎవరిని విమర్శించనవసరం లేదు మన ఆధ్యాత్మిక అభ్యున్నతికి మనం పాటుపడితే చాలు. 

వంటరి పోరాటం: 

కళ్ళ ముందు రోజు మనం ఒక సత్యాన్ని చూస్తున్నాము కానీ దానిని మనం గమనించికూడా గమనించకుండా, గుర్తించకుండా ఉన్నట్లు మనలను మనం మోసం చేసుకుంటున్నామేమో అని అనుకుంటా.  ఈ ప్రపంచంలోకి రావటం వంటరిగానే అదే విధంగా నిష్క్రమించటము ఒంటరిగానే.  ఈ ప్రపంచం కేవలము కొంతకాలం మనకు ఆశ్రయాన్ని కలిపించే తాత్కాలిక విడిది.  ఆ విషయం ప్రతిక్షణం మనకు కనపడుతున్నది.  అయినా ఇక్కడ ఏదో సాధించాలని, ఏదో ఉద్దరించాలని ఇంకా సుఖాలను అనుభవించాలని, ఇంకా సంపాదించాలని, నేను, నా భార్య, నా కుటుంబం, నా ఇల్లు, నా వస్తువులు అని మన జీవితంలోని అమూల్య కాలాన్ని వృధాగా చేస్తున్నామేమో అని అనిపిస్తుంది.  ఇంకా ఇంకా ఏదోకావాలి ఏదో చేయాలి.  అని అనుకుంటాం కానీ మనకు కావలసింది కేవలం మోక్షం మాత్రమే నని దానికోసమే మనం సాధన చేయాలనీ మాత్రం అనుకోము.  ముముక్షువులారా ఇంకా ఆలస్యం చేయకండి ఇప్పుడు మోక్షమార్గం వైపు మీ గమనాన్ని ప్రారంభించండి.  తాత్కాలికం అర్ధరహితము, ఐహికము ఐన ఈ ప్రేపంచ వ్యామోహాలకు దూరంగా ఉండటానికి ప్రయతించండి. 

జీవించటం ఎలా: 


ఇంకా వుంది 




లక్ష్మీదేవి గొప్పదా? సరస్వతీ దేవి గొప్పదా?

 దొంగలు పడ్డారు !

 ౼౼౼౼౼౼౼౼౼౼౼

ఒక కవి ఇంట్లో

దొంగలు పడ్డారు!

ఆరు వారాల నగలు

మూడు లక్షల నగదు

ఐదు పుస్తకాలు పోయాయి!!


పుస్తకాలది ఏముందయ్యా...నగలు నగదు చోరీ జరిగిందని కేసు నమోదు చేసుకున్నాడు పోలీసు.


పోలీసుల దర్యాప్తు జరుగుతోంది..నెలలు గడుస్తున్నా జాడలేదు...ఇక వడిసెను సుమతీ అనుకున్నాడు కవి....


ఐదు నెలల తర్వాత ఇంటికి ఒక పార్సిల్ వచ్చింది.. అందులో నగలు నగదు భద్రంగా పంపించారెవరో...కవి గారి భార్య పిల్లలు వాటిని కళ్ళకు అద్దుకుని ఆనందించారు...


పుస్తకాలు పోతేపోయినయి.. సొమ్ము దొరికింది అంతేచాలు అన్నారు భార్యాపిల్లలు..


ఆ పుస్తకాలు నా పంచప్రాణాలు అన్నాడు కవి...

" పోద్దురు బడాయి "


" పదేళ్లు కష్టపడి ఐదు పుస్తకాలు రాశానే...అవి నా పంచప్రాణాలు... పంపించినవాడు పుస్తకాలు పంపించి...నగదు నగలు పంపించకపోయినా బాధపడక పోయేవాడిని...కష్టపడితే సొమ్ము సంపాదించగలను..మళ్ళీ ఆ పుస్తకాలు రాయలేనే...అవి సరస్వతీ దేవి అమ్మవారు "... ఎడ్వడం మొదలెట్టాడు.


" నీ పుస్తకాలు సరస్వతీదేవీ ఐతే.. నా నగలు నగదు సాక్షాత్తు లక్ష్మీదేవి.. ఆ దొంగేవడో పిచ్చోడు " ఆనంద పడింది.ఇంతలో ఆ పార్సిల్లో ఒక కవర్ కనిపించింది.దాన్ని చించి అందులోని చీటి ఆసక్తిగా చదవడం ప్రారంభించింది ఆవిడ.


కవి గారికి

నమస్కారములు...

బీరువా తాళాలు పగులగొట్టి చూశా..నగలు నగదు పక్కన పుస్తకాలు కనిపించగానే ఇవేవో ఖరీదైనవని భావించి దోచుకెళ్లా..బీరువాలో ఎందుకు దాచారు...వీటిలో నిధి రహస్యాలు ఏమైనా ఉన్నాయేమోనని ఓపిగ్గా వాటిని చదివా..నగదు నగలుకన్నా గొప్ప నిధి దొరికింది.. అది జ్ఞాన నిధి..తప్పుచేశానని తెలుసుకున్నా..

ఈ లోగా నాభార్య పాతికవేలు ఖర్చుచేసింది.. చమటోడ్చి సంపాదించి కొద్దినెలల్లో మనియార్థర్ చేస్తా..డబ్బుతో పాటు పుస్తకాలు పంపిస్తా.. ఐతే వాటి జిరాక్స్ ప్రతులు మాత్రం తీసుకుని నావద్ద ఉంచుకుంటా... వాటిని మా పిల్లలతో పాటు తోటివారితో చదివిస్తా.. ఒకవేళ పుస్తకాలు దొంగిలించకపోతే నగలు నగదు తిరిగి పంపించేవాడినికాదు.. ఇప్పుడు నా దృష్టిలో నగలు నగదు కన్నా పుస్తకాలే విలువైనవిగా కనిపిస్తున్నాయి...ఈ రోజు నుంచి దొంగతనాలు మానేస్తున్నా... పుస్తకాలు అచ్చేసుకునేందుకు తోచిన డబ్బుకూడా మీకు పంపించే ప్రయత్నం చేస్తా...

                     ఇట్లు

          దొంగతనాలు మానిన దొంగ


ఇప్పుడు కవి ముఖంలో ఆనందం..

ఆయన భార్య ముఖంలో ఆలోచనలు

లక్ష్మీదేవి గొప్పదా?

సరస్వతీ దేవి గొప్పదా?   

------------------'-------------------------------------------------   

ఎంత చక్కని కధ. రచయిత కు అభినందనలు. 

చదవగానే Forward చెయ్యాలనిపించింది.

సేకరణ

🙏🙏🙏శుభోదయం🙏🙏🙏

వామనావతారం

 వామనావతారం


అమృతోత్పాదనం అయిన తరువాత ఆ అమృతమును సేవించిన దేవతలు వార్ధక్యమును మరణమును పోగొట్టుకున్న వారై మళ్ళీ సామ్రాజ్యమును చేజిక్కించుకొని అత్యంత వైభవముతో జీవితమును గడుపుతున్నారు. ఒక గొప్ప ఆశ్చర్యకరమయిన సంఘటన జరిగింది. అమృతం త్రాగిన తరువాత ఒకవేళ అది అహంకారమునకు కారణం అయితే పరిస్థితి ఏమిటి? ఈ అనుమానములను తీర్చడానికే కాలగమనంలో ఉత్థాన పతనములు జరుగుతాయి. రాక్షసులకు నాయకత్వం వహించిన బలిచక్రవర్తి యుద్ధంలో ఓడిపోయాడు. ఓడిపోయినందుకు బెంగ పెట్టుకోలేదు. తన గురువయిన శుక్రాచార్యుల వారి వద్దకు వెళ్ళి పాదములు పట్టుకున్నాడు. ‘మహానుభావా! మాకందరికీ కూడా అమృతోత్పాదనంలో భాగం ఇచ్చారు కష్టపడ్డాము. కానీ అమృతమును సేవించలేకపోయాము. అమృతమును సేవించకపోవడం వలన ఇక మేము శాశ్వతంగా ఎప్పుడూ దేవతల కన్నా అధికులం కాకుండా ఉండిపోవలసినదేనా? అమృతం త్రాగినవారిని కూడా ఓడించగలిగిన శక్తి మాకు మీ పాదముల నుండి వస్తుందని మేము నమ్ముతున్నాము. మీరు మమ్మల్ని ఆ స్థితికి తీసుకువెళ్ళాలి. నేను పరిపూర్ణమయిన విశ్వాసంతో మీ పాదములు పట్టి ప్రార్థన చేస్తున్నాను’ అన్నాడు.

ఇపుడు గురుశక్తి గొప్పదా? అమృతము గొప్పదా? ఈ విషయం తేల్చాలి. శుక్రాచార్యులవారు బలి చక్రవర్తితో ‘ఇప్పుడు నేను నీతో ఒక యాగం చేయిస్తాను. దీనిని ‘విశ్వజిత్ యాగము’ అంటారని ఆ యాగమును బలిచక్రవర్తి చేత ప్రారంభింప జేశారు. యాగమునకు ఫలితము విష్ణువే ఇవ్వాలి. విశ్వజిత్ యాగము నడుస్తోంది. అది పరిపూర్ణం అయ్యేసరికి ఆ యాగగుండములో నుండి ఒక బంగారురథము బయటకు వచ్చింది. దానిమీద ఒక బంగారు వస్త్రము కప్పబడి ఉన్నది. సింహము గుర్తుగా గలిగిన పతాకం ఒకటి ఎగురుతున్నది. అద్వితీయమయిన అక్షయ తూణీరముల జంట వచ్చింది. ఒక గొప్ప ధనుస్సు వచ్చింది. శుక్రాచార్యుల వారి అనుమతి మేరకు బలిచక్రవర్తి వాటిని స్వీకరించాడు. బలిచక్రవర్తి తాతగారు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు. విరోచనుని కుమారుడు బలిచక్రవర్తి. ఆయన వచ్చి ఒక స్వర్ణ పుష్పమాల బలిచక్రవర్తి మెడలో వేశాడు. శుక్రాచార్యుల వారు అనుగ్రహంతో అమృతం తాగిన వాళ్ళని ఓడించడం అనేది బలిచక్రవర్తి కోరిక. విశ్వజిత్ యాగం ఫలించింది. స్వర్ణ పుష్పమాలను మెడలో వేసుకొని దివ్యరథమును ఎక్కి అమరావతి మీదకి దండయాత్రకు వెళ్ళాడు.

ఇంద్రుడు ఈవార్త తెలుసుకున్నాడు. ‘అవతలి వాడు గురువుల అనుగ్రహంతో వస్తున్నాడు. నేను యుద్ధం చేయగలనా? శుక్రాచార్యులు బలిచక్రవర్తి చేత విశ్వజిత్ యాగం చేయించాడు. ఆయన శక్తిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. తను సలహా నిమిత్తం గురువుగారి దగ్గరకు వెళ్ళాలి’ అనుకుని ఇంద్రుడు దేవతలతో కలిసి గురువు గారయిన బృహస్పతి వద్దకు వెళ్ళాడు. దేవతలను ఉద్దేశించి ఆయన అన్నారు ‘ఈవేళ బలిచక్రవర్తికి శుక్రాచార్యుల వారి అనుగ్రహం పరిపూర్ణముగా ఉన్నది. నాకు తెలిసినంత వరకు బలిచక్రవర్తిని ఓడించగలిగిన వాడు సృష్టిలో ఇద్దరే ఉన్నారు. ఒకడు శివుడు, రెండు కేశవుడు. ఇంకెవరు బలిచక్రవర్తిని ఓడించలేరు. మనం ఆయననే ప్రార్థన చేద్దాము’ అని చెప్పగా వారందరూ శ్రీమహావిష్ణువును ప్రార్థన చేశారు.

శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై ఒక చిత్రమయిన మాట చెప్పారు ‘బృహస్పతి చెప్పినది యథార్థము. ఏ గురువుల అనుగ్రహముతో ఈవేళ బలిచక్రవర్తి ఈ స్థితిని పొందాడో మళ్ళీ ఆ గురువుల అనుగ్రహానికి బలిచక్రవర్తి దూరమైన రోజున మీరు బలిచక్రవర్తిని చిటికిన వేలితో కొట్టగలరు. గురువుల అనుగ్రహం అంత స్థాయిలో ఉండగా మీరు వానిని ఏమీ చేయలేరు. యుద్ధం చేయడం అనవసరం. మీరు అమరావతిని విడిచిపెట్టి వేషములు మార్చుకుని పారిపోండి’ అని చెప్పాడు. దేవతలు తలొక దిక్కుపట్టి వెళ్ళిపోయారు. బలిచక్రవర్తి అమరావతి వచ్చి చూశాడు. ఒక్కడు కూడా లేడు. దివ్యమయిన అమరావతీ పట్టణం సునాయాసంగా తనది పోయింది. ఇంద్ర సింహాసనమును అధిరోహించి కూర్చున్నాడు. ఇకనుంచి యజ్ఞ యాగాది క్రతువులు ఏవి చేసినా హవిస్సులు తనకే ఇమ్మనమని ఆజ్ఞాపించాడు. మళ్ళీ అహంకారము ప్రారంభమవుతుంది. బలిచక్రవర్తి వైభవం కొనసాగుతోంది. ఆయన దానధర్మములకు పెట్టింది పేరు. అటువంటి బలిచక్రవర్తి రాజ్యం చేస్తున్నాడు. ముల్లోకములను పాలన చేస్తున్నాడు. ఆయన మహాభక్తుడు రావణాసురుని వంటి ఆగడములను చేసిన వాడు కాదు. ఇటువంటి సమయంలో చిత్రమయిన ఒక సంఘటన జరిగింది.

కశ్యపప్రజాపతికి ఇద్దరు భార్యలు. ఒకరు అదితి, ఒకరు దితి. ఇంద్రాదులు అదితి కుమారులు. ఇవాళ వారు అమరావతిని విడిచిపెట్టి అరణ్యములలోకి వెళ్ళిపోయారు. ఆవిడ బాధ భరించలేక ఒకనాడు తన భర్త అయిన కశ్యప ప్రజాపతికి చెప్పింది. కశ్యపప్రజాపతి గొప్ప బ్రహ్మజ్ఞాని. ఆయన ఒక నవ్వు నవ్వి ‘అదితీ! ఈ భార్యలేమిటి? కొడుకులేమిటి? రాజ్యాలేమిటి? ఈ సింహాసనములు ఏమిటి? ఈ గొడవలు ఏమిటి? ఇదంతా నాకు అయోమయంగా ఉన్నది. ఈ సంబంధములకు ఒక శాశ్వతత్వం ఉన్నదని నీవు అనుకుంటున్నావా? నేను అలా అనుకోవడం లేదు. ఉన్నదే బ్రహ్మమొక్కటే అని అనుకుంటున్నాను. నీవు విష్ణు మాయయందు పడిపోయావు. అందుకని ఇవాళ నీ బిడ్డలు, దితి బిడ్డలు అని రెండుగా కనపడుతున్నారు. ఒకరికి ఐశ్వర్యం పోయింది. ఒకరికి ఐశ్వర్యం ఉన్నదని బాధపడుతున్నావు. నేనొక మాట చెప్పనా! ఈ ప్రపంచంలో కష్టములో ఉన్నవానిని ఈశ్వరుడు ఒక్కడే రక్షించగలడు. ఆయనను అడగాలి గానీ నన్ను అడుగుతావేమిటి? నిజంగా రక్షణ పొందాలి, నీ కొడుకైన దేవేంద్రుడు దేవతలు తిరిగి ఆ సింహాసనమును పొందాలి అని నీవు అనుకున్నట్లయితే మహానుభావుడయిన ఆ జనార్దనుని పూజించు. ఆయన ప్రీతి చెందితే ఆయన చేయలేనిది ఏదీ ఉండదు. సర్వేశ్వరుడయిన నారాయణుని ప్రార్థించు’ అని చెప్పి ‘పయో భక్షణము’ అనే ఒక వ్రతమును కల్పంతో ఆమెకు ఉపదేశం చేశాడు. ఆ వ్రతం చాలా గమ్మత్తుగా ఉంటుంది. అది మనందరం చేసే వ్రతం కాదు.

ముళ్ళపంది లేదా అడవిపంది తన కోరతో పైకెత్తిన మట్టిని తీసుకొని ఒంటికి రాసుకుని స్నానం చేసి చాలా జాగ్రత్తలు తీసుకొని పన్నెండు రోజులు ఆ కల్పమును ఉపాసన చేయాలి. అలా చేయగలిగితే భగవంతుడిని సేవించగలిగితే పన్నెండు రోజులలో శ్రీమన్నారాయణుని అనుగ్రహము కలుగుతుంది. భగవంతుడయిన శ్రీమన్నారాయణుని అనుగ్రహమును కోరి నీవు ఈ వ్రతమును చేయవలసింది’ అని చెప్పాడు. ఆవిడ భర్త మాటలను నమ్మి పన్నెండు రోజులు ఈ వ్రతం చేయగా శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షం అయ్యాడు. ఆవిడ శ్రీమన్నారాయణుడు కనపడితే తన కొడుకుకి రాజ్యం ఇప్పించాలని వ్రతం చేస్తోంది. నిజంగా శ్రీమన్నారాయణుడు కనపడేసరికి అదితి ఆయన రూపమును కళ్ళతో జుర్రుకు త్రాగేసింది. గట్టిగ కంఠం రాక ఏమి మాట్లాడుతున్నదో కూడా వినపడకుండా అలా చూస్తూ ఉండిపోయింది. ఆమె చేస్తున్న ఆ స్తోత్రము అంతటా నిండి నిబిడీకృతమయిన వాడెవడున్నాడో ఆయనకే వినపడాలి.

స్వామి అదితిని ‘నీవు ఈపూజ ఎందుకు చేశావు?’ అని అడిగాడు. ఆవిడ ‘స్వామీ! నా కుమారుడయిన దేవేంద్రుడు రాజ్యభ్రష్టుడు అయ్యాడు. నా కుమారునికి రాజ్యం ఇవ్వవలసింది’ అని అడిగింది. స్వామి ‘నీ కుమారునికి రాజ్యం ఇప్పిస్తాను’ అని అనకుండా ‘అమ్మా! నీ కుమారుడు ఇంద్రుడు, కోడలు శచీదేవి బాధపడుతున్నారని అనుకుంటున్నావు కదా! వాళ్ళందరూ నీవు సంతోషించేటట్లు నేను తప్పకుండా నీవు అడిగిన పని చేస్తాను. కానీ అమ్మా, నాకు ఒక కోరిక ఉంది. ‘ఇపుడు ఈశ్వరుడు అదితిని వరం అడుగుతున్నాడు. ఎంత ఆశ్చర్యమో చూడండి! వరము అడగడానికి కూర్చున్న అదితిని నారాయణుడు వరము అడుగుతున్నాడు. ‘అమ్మా! నాకు నీ కొడుకునని అనిపించుకోవలెనని ఉన్నది. నీ గర్భవాసము చేయాలని అనిపిస్తోంది. నీ కొడుకుగా పుడతాను’ అని అడిగాడు. అలా అడిగేసరికి అదితి తెల్లబోయింది. ఆమె ‘స్వామీ! నాకు అంత భాగ్యమా! తప్పకుండా’ అన్నది. స్వామి ‘నీ భర్తను ఇదే రూపంతో ఇంతకు పూర్వం ఏ భక్తితో ఉన్నావో అలా నీ భర్తను సేవించు. నేను నీ భర్తలోకి ప్రవేశించి ఆయన తేజస్సుగా నీలోకి వస్తాను’ అన్నాడు. ఎంతో యథాపూర్వకంగా పుట్టాడు. ఆమె గర్భమునందు ప్రవేశిస్తే బ్రహ్మగారు శ్రీమన్నారాయణుని స్తోత్రం చేశారు. అదితి గర్భం గర్భాలయం అయింది.

గర్భము నిలబడినది కనుక ఆవిడ చుట్టూ ఉన్న స్త్రీలు వేడుక చేశారు. అమ్మ కడుపులో ఉండవలసిన కాలము పూర్తయిన తరువాత మంచి ముహూర్తం చూసుకొని శ్రవణ నక్షత్రము లో ద్వాదశి తిథి నాడు మిట్ట మధ్యాహ్నం వేళ అభిజిత్సంజ్ఞాతలగ్నంలో ఆయన జన్మించాడు. ఆయన పుడుతూనే ఉపనయనం చేసుకోవలసిన వయస్సు పొందిన బాలుడిగా శంఖ, చక్ర, గద, పద్మములతో శ్రీమన్నారాయణుడిగా పుట్టాడు. అదితి స్తోత్రం చేసింది. కశ్యపప్రజాపతి స్తోత్రం చేశారు. వెంటనే ఆయన తన రూపమును ఉపసంహారం చేశారు. ఉపనయనం చేసుకునే వయస్సు ఉన్న వటువుగా ఎనిమిది సంవత్సరముల పిల్లవానిగా మారిపోయాడు. వటువుకి కశ్యప ప్రజాపతి ముంజెగడ్డితో చేసిన మొలత్రాడు ఇచ్చారు. తల్లి అదితి కౌపీనం ఇచ్చింది. బ్రహ్మగారు కమండలం ఇచ్చారు. సరస్వతీ దేవి అక్షమాలను ఇచ్చింది. సూర్యభగవానుడు ఆదిత్యమండలమునుండి క్రిందికి దిగి వచ్చి గాయత్రీ మంత్రమును ఉపదేశం చేశాడు. చంద్రుడు చేతిలో పట్టుకునే మోదుగకర్రతో కూడిన దండమును ఇచ్చాడు. ఇంతమందీ ఇన్ని ఇస్తే కృష్ణాజినంతో కట్టుకునే నల్లటి జింకచర్మమును దేవతలు పట్టుకు వచ్చి ఇచ్చారు. యజ్ఞోపవీతమును పట్టుకుని దేవతల గురువైన బృహస్పతి వచ్చారు. వీళ్ళందరూ ఉపనయన మంత్రములతో పిల్లవానికి సంస్కారములన్నీ చేశారు. భిక్షాపాత్రను సాక్షాత్తు కుబేరుడు ఇచ్చాడు. భవానీమాత వచ్చి పూర్ణ భిక్ష పెట్టింది. ఇది తీసుకొని మహానుభావుడు బయలుదేరి బలిచక్రవర్తి కూర్చున్న చోటికి వెళ్ళాడు. బలిచక్రవర్తి తన భార్య వింధ్యావళితో కూర్చుని ఉన్నాడు. బలిచక్రవర్తి మహాతేజస్సుతో వస్తున్న వటువును చూశాడు. వటువు బ్రహ్మచారి కాబట్టి రాజును ఆశీర్వచనం చేయవచ్చు. వటువు ‘ఓహో! నీవేనా బలిచక్రవర్తివి. నీవేనా భూరి దానములు చేసే వాడివి. నీకు స్వస్తి స్వస్తి స్వస్తి. స్వస్తి అంటే శుభము. ఇలా బలిచక్రవర్తిని చూడగానే ఆశీర్వదించాడు.

బ్రహ్మచారి సభలోకి నడిచి వస్తున్నప్పుడు చక్రవర్తి అయినా సరే వేదిక దిగి ఆహ్వానించాలి. బలిచక్రవర్తి వెంటనే లేచి నిలబడి వింధ్యావళిని బంగారు పళ్ళెమును తీసుకురమ్మనమని చెప్పాడు. వటువును ఉచితాసనము మీద కూర్చోబెట్టి ఆ బంగారుపళ్ళెమును వటువు కాళ్ళ క్రింద పెట్టి ఆయన పాదములు కడిగి తాను తీర్థంగా తీసుకున్నాడు. వింధ్యావళికి తీర్థం ఇచ్చాడు. ఆయన పాదోదకమును శిరస్సున ప్రోక్షణ చేసుకున్నాడు.

‘నాయనా వడుగా! నీవు ఎవరి వాడివి? ఎక్కడ ఉంటావు? నీవు రావడం వలన ఇవాళ ఈ కాలము మంగళప్రదమయిపోయింది. బ్రహ్మచారీ! వడుగు చేసుకొనిన వాడవు నీవు వచ్చావు. ఇప్పటివరకు అగ్నిహోత్రం మామూలుగా వెలుగుతోంది. నీవు రాగానే అగ్నిహోత్రం మహాప్రకాశంతో పైకి లేస్తోంది. నీరాక వలన నా వంశము నా జన్మ సఫలం అయ్యాయి. ఇంతకుముందు తొంభైతొమ్మిది యాగములు చేశాను. ఇది నూరవది. నా జన్మ ధన్యమయింది’ అన్నాడు. బలిచక్రవర్తి అడిగిన ప్రశ్నలకు వామనుడు ఒక నవ్వు నవ్వి ‘ఓ చక్రవర్తీ! నేను ఒకచోట ఉంటానని చెప్పలేను అంతటా తిరుగుతుంటాను. ఒకళ్ళు చెప్పినట్లు వినడం నాకు అలవాటు లేదు. నే చెప్పినట్లే ఇంకొకరు వింటూ ఉంటారు. నాకు ఏది తోస్తే అది చేస్తాను. ఇది చదువుకున్నాను, ఇది వచ్చు అది చదువుకోలేదు, అది రాదని చెప్పడం ఎలా కుదురదు. ప్రపంచంలో ఎన్ని చదువులు ఉన్నాయని నీవు అనుకుంటున్నావో అవన్నీ నాకు వచ్చునని నీవు అనుకో! పైగా నేను ఇలాగే ప్రవర్తిస్తానని చెప్పడము కూడా కష్టమే. నేను మూడురకములుగా మాత్రము ప్రవర్తిస్తూ ఉంటాను. నాకు చుట్టమనేవాడు ప్రపంచంలో ఎవడూ లేదు. ఒకప్పుడు నాకు డబ్బు ఉండేది. బ్రహ్మచారి ఎక్కడ మంచిమాట వినబడితే అక్కడ వినాలి. అందుకని మంచి వాళ్ళ దగ్గర నా బుర్ర తిరుగుతూ ఉంటుంది. అంతేకాదు నన్ను కోరుకున్న వాళ్ళ దగ్గర నేను తిరుగుతూ ఉంటాను’ అన్నాడు. ఆ మాటలను విన్న బలిచక్రవర్తి ఈ వామనుడి బొజ్జలో ఎన్ని మాటలున్నాయో అని ఆశ్చర్యపోయాడు. పొంగిపోయి పిల్లవాడా! నిన్ను చూస్తే నాకు చాలా ఆనందముగా ఉన్నది. నీవు వటువువి నేను చక్రవర్తిని నీకు ఏదో ఒక కానుక ఇవ్వాలి. నీకు ఏమి కావాలో కోరుకో’.

వరచేలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోవులో

కరులో రత్నములో రథంబులొ విమృష్టాన్నంబులో కన్యలో

కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో

ధరణీఖండమొ కాక ఏమడిగెదో దాత్రీసురేంద్రోత్తమా!

ఈ భూమిమీద పుట్టిన అద్భుతమయిన బ్రహ్మచారీ! నీకేమి కావాలో అడుగు. ధనమా? గోవులా? కన్యలా? రథములా? బంగారమా? వజ్రములా? రాజ్యములో భాగమా? నీకు ఏమి కావాలి ? నేను ఏదయినా ఇవ్వగల సమర్థుడిని. నీకు ఏమి కావాలో అడుగు. నీకిస్తాను’ అన్నాడు. వామనుడు నవ్వి ‘నాకు ఏది కావాలంటే అది నీవు ఇస్తావా! నేను అల్పమునకు సంతోషించేవాడిని. నాకు నీవు ఇవ్వగలిగినది ఏమిటి? నేను తృప్తి పొందేవాడిని. అయినా ఏదో ఒకటి పుచ్చుకోమని నీవు అడిగావు కదా! నాకు ఒకటి రెండు అడుగుల నేల ఇవ్వు. చాలామంది దీనిని కూడేసి బలిచక్రవర్తి మూడడుగుల నేల ఇమ్మనమని అడిగాడని చెపుతారు. వామనుడు అలా అడగలేదు. నీవు నాకు ఒకటి రెండడుగుల నేలను ఇస్తే దానితో ఒక అడుగుతో ఊర్ధ్వలోకములను కొలుస్తాను. ఒక అడుగుతో అధో లోకములను కొలుస్తాను. మూడవ అడుగు పెట్టడానికి మళ్ళీ నిన్ను చోటు అడుగుతాను. నీవు కానీ ఒకటి రెండు అడుగులు నేలను ఇచ్చానని అంటే నేను బ్రహ్మానందమును పొందుతాను ఈ బ్రహ్మాండమంతా నిండిపోతాను’ అన్నాడు.

బలిచక్రవర్తి ‘నీవు పిల్లవాడివి. నీకు అడగడం కూడా చేతకాదు. నీవు మూడు అడుగుల భూమిని కొలిస్తే నీకు ఎంత వస్తుంది? నేను బ్రహ్మాండములను జయించిన వాడిని. మూడడుగుల నేలా నేను నీకు ఇవ్వడం! ఇంకేదయినా అడుగు. నీవు ఏది అడిగితే అది ఇస్తాను’ అన్నాడు.

వామనుడు ఆశ్రమ ధర్మమును పాటించాడు

గొడుగో, జన్నిదమో, కమండలువొ, నాకున్ ముంజియో, దండమో,

వడుఁ గే నెక్కడ" భూము లెక్కడ? కరుల్, వామాక్షు, లశ్వంబు లె

క్కడ? నిత్యోచిత కర్మ మెక్కడ? మదాకాంక్షామితంబైన మూఁ

డడుగుల్ మేరయు త్రోవ కిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికిన్.

‘అవన్నీ ఇస్తానంటావేమిటి? నేను బ్రహ్మచారిని. బ్రహ్మచారిని పట్టుకుని వరచేలంబులు, మాడలు, ఫలములు, వన్యంబులు, గోవులు మొదలయిన వాటిని పుచ్చుకొనమంటావేమిటి? వాటిని నేను పుచ్చుకోకూడదు. నేను గొడుగు, యజ్ఞోపవీతము, కమండలము, ముంజి, దండము మొదలయిన వాటిని మాత్రమే అడగాలి. నాకివన్నీ అక్కరలేదు. నేను జపం చేసుకోవడానికి నేను అగ్నికార్యం చేసుకోవడానికి నాకు మూడడుగుల నేల ఇస్తే చాలు’ అన్నాడు. బలిచక్రవర్తి

ఓ వటువా! ఇదిగో బంగారుపాత్ర ఇక్కడ పెట్టాను. వచ్చి నీ పాదములు ఇందులో పెట్టు. వింధ్యావళీ! బంగారుచెంబుతో నీళ్ళు పొయ్యి. ఈ పిల్లవాడి పాదములు కడిగి వానికి మూడడుగుల నేల ధారపోస్తాను. నీళ్ళు పట్టుకొని రా’ అన్నాడు. వింధ్యావళి వటువు వంక చూసి పొంగిపోతూ నీళ్ళు పట్టుకువద్దామని లోపలి వెళుతున్నది. ఈలోగా బ్రహ్మచారి బంగారుపాత్రలో పాదములు పెట్టబోతున్నాడు. అక్కడికి శుక్రాచార్యుల వారు పరుగుపరుగున వచ్చి రాజా! నీచేత విశ్వజిత్ యాగమును చేయించి ఇవాళ నీకు ఇంత వైభవమును ఇచ్చాను. వచ్చినవాడు ఎవరో తెలుసా? ఏమయినా మాట ఇచ్చావా? అని అడిగాడు. బలిచక్రవర్తి ‘ ఈ బ్రహ్మచారి మూడు అడుగుల నేల అడిగితే ఇస్తానన్నాను’ అన్నాడు. శుక్రాచార్యులు ‘రాజా! ఆ వచ్చినవాడు శ్రీమహావిష్ణువు. ఎప్పుడూ ఆయన ఎవరి దగ్గర ఏదీ పుచ్చుకోలేదు. ఇవాళ నీ దగ్గర చెయ్యి చాపి దానం పుచ్చుకుంటున్నాడు. ఎందుకో తెలుసా! ప్రహ్లాదుడికి నువ్వు మనవడివి. ఆ వంశంలో వాడిని ఆయన నిగ్రహించడు. ఒక మహాపురుషుడు వంశంలో ఉంటే ఆ క్రింద వాళ్ళకి ప్రమాదం ఉండదు. నీజోలికి రాలేడు. నీతో యుద్ధం చేయకుండా నువ్వు ఇంద్రుడి దగ్గర నుంచి పొందిన రాజ్యమును తీసుకుని ఇంద్రునకు ఇస్తాడు. మూడడుగులు పుచ్చుకుంటున్నాడు. నేను నా దివ్యదృష్టితో చూసి చెపుతున్నాను. ఆ రెండడుగులతో ఉత్తరక్షణం ఈ బ్రహ్మాండములన్నీ నిండిపోతాడు. మూడవ అడుగు ఎక్కడ పెట్టనని అడుగుతాడు. నువ్వు నీ నెత్తిమీద పెట్టించుకోవాలి. నా మాట విను. నేను నీ గురువుని కాబట్టి నీకొక గొప్ప ధర్మశాస్త్ర విషయం చెపుతున్నాను. తనకు మాలిన దానం గృహస్థు చేయనవసరం లేదు. మాటచ్చినా తప్పవచ్చు. ఇంకొక మాట కూడా చెపుతున్నాను.

వారిజాక్షులందు వైవాహికములందు, బ్రాణ విత్తమాన భంగమందు

జకిత గోకులాగ్ర జన్మరక్షణమందు, బొంకవచ్చు నఘము వొందదధిప !

శుక్రాచార్యుల వారు రాక్షసనీతి చెప్పారు. దానిని ప్రాణభయంతో ఉన్నప్పుడు రాక్షసనీతిగా ఆయన చెప్పారు. ఆయన చెప్పిన విషయం ‘ఆడవారి విషయంలో, వివాహ విషయంలో, ప్రాణం పోయేటప్పుడు, డబ్బులు పోయేటప్పుడు, మానం పోయేటప్పుడు, అబద్ధం చెప్పవచ్చు. గోవుల విషయంలో, బ్రాహ్మణులను రక్షించే విషయంలో అబద్ధం చెప్పవచ్చు దాని వలన పాపం రాదు. మూడు అడుగుల నేల ఇవ్వనని చెప్పు. ఒక్క అడుగుకూడా ఇవ్వకు ఇస్తే ప్రమాదం ఆయనను నమ్మకు’ అన్నాడు.

బలిచక్రవర్తి శుక్రాచార్యుల వంక చూసి ‘ఎంతమాట అన్నారు! లక్ష్మీనాథుడయిన వాడు వచ్చి నా దగ్గర చెయ్యి చాపాడని మీరే చెపుతున్నారు.

ఆదిన్ శ్రీసతి కొప్పుపై, దనువుపై, నంసోత్తరీయంబుపై

బాదాబ్జమ్ములపై గపోలతటిపై బాలిండ్లపై నూత్న మ

ర్యాదన్ జెందు కరంబు క్రిందగుట మీదై నా కరంబుంట మేల్

గాదే? రాజ్యము గీజ్యమున్ సతతమే? కాయంబు నాపాయమే ?

‘ఆయన చేయి లక్ష్మీఅమ్మవారి కొప్పుపై పడుతుంది. ఆవిడ శరీరమును నిమురుతుంది. ఒక్కొక్కసారి ఆవిడ పమిట పట్టుకుని ఆడుకుంటాడు. ఒక్కొక్క సారి ఆవిడ పాదములు పట్టుకుంటాడు. అమ్మవారి బుగ్గలను నిమురుతాడు. ఆ చెయ్యి లక్ష్మీదేవిని పొంగి పోయేట్లు చేయగలిగిన చెయ్యి. కొన్ని కోట్లమంది ఏ తల్లి అనుగ్రహమునకై చూస్తున్నారో అటువంటి తల్లి ఆ చెయ్యి పడితే పొంగిపోతుంది. దేవదానవులను శిక్షించిన చెయ్యి. భక్తుల కోర్కెలు తీర్చిన చెయ్యి. పాంచ జన్యమును పట్టుకునే చెయ్యి. ఏ చేయి వరదముద్ర చూపిస్తే భక్తులకు ధైర్యం కలుగుతుందో అటువంటి చెయ్యి భిక్ష కోసమని క్రింద నిలబడుతోంది. నా చేయి పైదవుతున్నది. నాకీ అదృష్టం చాలదా! మళ్ళీ పుడతానా? రాజ్యం ఉండిపోతుందా? దేహం ఉండిపోతుందా? పోతే పోనీ ఈ రాజ్యముకాదు, ఈ శరీరము కాదు నేను కాదు ఏది పోయినా పరవాలేదు’.

కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిం బొందరే?

వారేరీ సిరిమూటఁగట్టుకొని పోవం జాలిరే? భూమిపైఁ.

బేరైనం గలదే? శిబిప్రముఖులుం బ్రీతిన్ యశఃకాములై.

యీరే కోర్కులు? వారలన్ మఱచిరే యి క్కాలమున్? భార్గవా!

‘ప్రపంచంలోనికి ఎంతోమంది రాజులు వచ్చారు. వచ్చిన వారందరూ తాము భూమికి పతులమని పరిపాలించామని అన్నారు. వారేరి? నాది నాదని ఇంత సంపాదించాను అని అన్నారు. ఏ కొద్ది కూడా పట్టుకెళ్ళిన వాడు ఈ భూమిమీద లేడు. కీర్తిని ఆశించి ఆనాడు శిబి మొదలయిన మహాపురుషులు అద్భుతమయిన దానములు చేశారు. వాళ్ళు యశోశరీరులై నిలబడిపోయారు. ఇవన్నీ మూట కట్టుకుని నేను దాచుకుంటే ఈ రాజ్యం ఉండిపోతుందా! ఈ శరీరం ఉండిపోతుందా!

నాకు రాజ్యం తీసేస్తాడు, దరిద్రుడను అయిపోతానని అంటున్నావు కదా! నా స్వామి చేతికి నా రాజ్యం అంతా ఇచ్చిన వాడిని నేను అనిపించుకుని నేను భిక్షువునై తిరుగుతాను. నాకు బెంగలేదు. నాకు దరిద్రం రావచ్చు, జీవితం పోవచ్చు, నా ధనం పోవచ్చు. మాటపోయిన తరువాత ఆ మనిషి బ్రతికినా ఒకటే వెళ్ళిపోయినా ఒకటే. భూదేవి మనుషుల సంఖ్యను చూసి భయపడదు. మాట తప్పే వాళ్ళ బరువును తాను మోయలేనని ప్రార్థన చేస్తుంది. నేను ఆ జాబితాలో చేరను. నేను దానం చేస్తాను’ అన్నాడు. శుక్రాచార్యుడు ‘నేను నా తపశ్శక్తితో అమృతం త్రాగిన వాళ్ళని ఓడిపోయేటట్లు చేసాను. ఇవాళ నువ్వు గురువు మాటకాదన్నావు. ఉత్తర క్షణం నీవు రాజ్యభ్రష్టుడవు అవుతావు!’ అని శపించాడు.

వెంటనే బలిచక్రవర్తి స్వామి పాదములను బంగారుపళ్ళెంలో పెట్టమన్నాడు. వామనుడు వచ్చి పళ్ళెంలో పాదమును పెడదామని కుడిపాదము కొద్దిగా పైకి ఎత్తాడు. బలిచక్రవర్తి కింద కూర్చుని పాదము వంక చూస్తున్నాడు. ఆ పాదము క్రింద ధ్వజరేఖ, అమృతపాత్ర, నాగలి వంటి దివ్యమయిన చిహ్నములు కనపడ్డాయి. ఎర్రటి అరికాలు. పైన నల్లనిపాదము. ఏ వేదమును చదువుకుని ఆమ్నాయము చేస్తారో అటువంటి వేదము ఆయన కాలి అందెగా మారి అలంకరింపబడి ఉన్నది. బ్రహ్మచారిగా ఉన్నా నిద్రలేవగానే శ్రీమహావిష్ణువు పాదముల దగ్గర వంగి లక్ష్మీ దేవి నమస్కరించడంలో లక్ష్మీదేవి నొసటన ఉన్న కస్తూరీ తిలకం ఆయన పాదము మీద ముద్రపడి ఉన్నది. అటువంటి పాదమును దగ్గరనుంచి చూసాడు. మహా యోగులయిన వారు ఇక్కడ దర్శనం చేసి పొంగిపోయి జన్మ పరంపరల నుండి గట్టెక్కే భవసాగరమును దాటించ గలిగిన ఓడ అయిన పాదము ఏది ఉన్నదో ఆ పాదమును చూసాడు. ఇంకా బ్రాహ్మీ ముహూర్తంలోనే సప్తర్షుల చేత పూజింపబడిన తామరల చేత సుగంధమును పొందిన పాదమును చూసాడు. చూసి పొంగిపోయి బంగారు పళ్ళెము ముందుకు జరిపాడు. వామనుడు అందులో కుడికాలు వుంచి ఎడమకాలు ఎత్తి అందులో పెట్టాడు. ఆ రెండు పాదములను చూసి బలిచక్రవర్తి ‘ఆహా ఏమి నా భాగ్యము! ఈ పాదములను ఎవరు కడుగగలరు! ఈ పాదములను ముట్టుకోగలిగిన వాడెవడు? ఈ కీర్తి ఎవడూ పొందలేడు. నేను పొందుతున్నాను’ అనుకుని వింధ్యావళిని నీళ్ళు పోయమన్నాడు. పైకి చూసాడు. బలిచక్రవర్తి తాను పతనం అయిపోతానని తెలిసి దానం ఇస్తున్నాడు. శుక్రాచార్యుల వారు చూస్తున్నారు. వింధ్యావళి కమండలంలో నీళ్ళు పోస్తోంది. శుక్రాచార్యుల వారికి ఇంకా తాపత్రయం పోలేదు. సూక్ష్మ రూపంలో వెళ్ళి ఆ కమండల తొండమునకు అడ్డుపడ్డాడు. బలిచక్రవర్తి నీళ్ళు పోస్తున్నా నీరు కమండలంలోంచి పడడం లేదు. స్వామి నవ్వి చేతిలో దర్భ ఒకటి తీసి కమండలం లోకి పెట్టి ఒక్కపోటు పొడిచాడు. పొడిచేసరికి శుక్రుని కంట్లో గుచ్చుకుని ఒక కన్ను పోయి శుక్రాచార్యుల వారు బయటపడ్డారు. వెంటనే నీటి ధార పడిపోయింది బలిచక్రవర్తి కంకణములు మెరిసిపోయే వామనుని చేతిని తన రెండు చేతులతో పట్టుకుని కళ్ళకు అద్దుకుని ‘స్వామీ! ఈ చేతులు కదా లోకరక్షణ చేసే చేతులు’ అని దానం చేసాడు.


వెంటనే వామనుడు పెరిగిపోవడం మొదలు పెట్టాడు.


ఇంతింతై, వటుడింతయై, మఱియుదానింతై, నభోవీధిపై

నంతై, తోయదమండలాగ్రమున కల్లంతై, ప్రభారాశిపై

నంతై, చంద్రునికంతయై, ధ్రువునిపైనంతై, మహర్వాటిపై

నంతై, సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంతసంవర్థియై.

పొట్టివానిగా వచ్చిన వామనుడు అంతకంతకు పెరిగిపోతున్నాడు. బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా పది అంగుళములు పైకి ఎదిగిపోయాడు. లోకములన్నిటిలో పైకి కొలవడానికి విష్ణుపాదం వస్తున్నదని బ్రహ్మగారు తపస్సమాధిలోనుండి పైకి వచ్చి కమండలం పట్టుకుని ఆ పాదమును తన కమండలం లోని జలములతో కడిగి శిరస్సున ప్రోక్షణ చేసుకొని ఆచమనం చేశారు. ఆ పాదములు కడిగిన నీళ్ళు ఆకాశంలో దేవనదిగా ప్రవహించాయి. ఆ పాదం ఇంకా పెరిగి వెళ్ళిపోయింది. అలా పైకి వెళ్ళి పై లోకములనన్నిటిని కొలిచినది. కింది లోకముల నన్నిటిని ఒక పాదము కొలిచినది. ఆ విధంగా రెండు అడుగులతో వామనుడు భూమ్యాకాశములను కొలిచాడు.

రవిబింబం బుపమింపఁ బాత్ర మగు ఛత్రం బై, శిరోరత్న మై

శ్రవణాలంకృతియై గళాభరణ మై సౌవర్ణకేయూరమై

ఛవిమత్కంకణమై కటిస్థలి నుదంచ ద్ఘంటయై నూపుర

ప్రవరంబై పదపీఠమై వటుఁడు దా బ్రహ్మాండమున్ నిండుచోన్.


వామనమూర్తి ఇలా పెరగడం మొదలుపెట్టగానే ఆకాశంలోని సూర్యబింబము మొట్టమొదట ఆయన తలమీది గొడుగులా, తరువాత తలమీద పెట్టుకున్న రత్నంలా మెరిసింది. ఇంకా కొంచెం పైకి వెళ్ళినపుడు కంఠంలో పెట్టుకున్న ఆభరణం అయింది. చెవులకు పెట్టుకున్న మకర కుండలంగా ఉన్నది. స్వామి సూర్యుని దాటి ఇంకా పైకి వెళ్ళిపోయారు. సూర్య బింబము నడుముకి పెట్టుకున్న వడ్డాణమునకు చిన్న గంటలా గుండ్రంగా అయింది. ఇంకా దాటితే పాదములకు పెట్టుకున్న అందెలా అయింది. ఆ తరువాత పాదముల క్రింద వేసుకున్న గుండ్రని పీటలా అయిపోయింది. బ్రహ్మాండమంతా నిండిపోయిన వామనమూర్తికి సూర్యుడు అలా మారిపోయాడు. ఆయన లోకం అంతా అలా నిండిపోయి రెండు అడుగులతో లోకం అంతా కొలిచాడు.

ఆయన బలిచక్రవర్తితో నేను రెండడుగుల నేలను కొలుచుకున్నాను. ఇంకొక అడుగు భూమి ఏది? అని అడిగాడు. బలిచక్రవర్తి

సూనృతంబు గాని సుడియదు నా జిహ్వ, బొంకజాల; నాకు బొంకు లేదు;

నీ తృతీయ పదము నిజము నా శిరమున, నెలవు సేసి పెట్టు నిర్మలాత్మ!


నా నోరు ఎప్పుడూ అబద్ధం చెప్పదు. నేను అబద్ధం చెప్పలేదు. నీ మూడవ అడుగు నా తలమీద పెట్టు అని చెప్పి బలిచక్రవర్తి లేచాడు. వరుణుడికి అనుజ్ఞ ఇవ్వబడింది. ఆయన వరుణ పాశములతో కట్టేశారు. బలిచక్రవర్తి అలా నిలబడిపోయాడు. శ్రీమన్నారాయణుడు వటువు రూపంలో వచ్చి తమ రాజ్యమును కొల్లగొట్టాడని రాక్షసులు గ్రహించారు. నిర్జించడానికి ఆయుధములను పట్టుకు వచ్చారు. బలిచక్రవర్తి ‘వేళకాని వేళా క్రోధము తెచ్చుకోకూడదు. ఎవరు తనకు సిరిని ఇచ్చిన వాడే తిరిగి ఈ సిరిని తీసేసుకున్నాడు. మీరంతా ప్రశాంత మనస్కులై ఉండండి. ఎవ్వరూ యుద్ధం చేయకండి’ అన్నాడు. రాక్షసులంతా రసాతలమునకు పారిపోయారు. వింధ్యావళి శ్రీమన్నారాయణుని పాదముల మీద పడి స్వామీ! నా భర్తకి వచ్చిన వాడెవడో తెలుసు. రాజ్యము పోతుందని తెలిసికూడా దానం చేశాడు. ఏం పాపం చేశాడని ఇలా కట్టి నిలబెట్టావు? నాకు జవాబు చెప్పవలసింది. నీకు అనాథరక్షకుడని పేరు. నీ సన్నిధానములో నేను అనాథను కావడమా! నాకు భర్తృ భిక్ష పెట్టు’ అని ప్రార్థన చేసింది. ఆశ్చర్యకరంగా అక్కడికి బ్రహ్మగారు వచ్చి ప్రార్థన చేశారు.

పది దిక్కుల వాళ్ళు కూడా బలిని చూసి శ్రీమన్నారాయణుడు బలిచక్రవర్తికి ఇంత శిక్ష వేయడమా! అని హాహాకారములు చేశారు. బ్రహ్మగారు వచ్చి ‘ఇటువంటి భక్తుడిని నేను ఇంతకు పూర్వం చూడలేదు. దయచేసి బలిచక్రవర్తిని విడిచి పెట్టవలసినది’ అని కోరారు. బలిచక్రవర్తి తాతగారయిన ప్రహ్లాదుడు వస్తే బలిచక్రవర్తి ‘నా కాళ్ళు చేతులు వరుణ పాశములతో కట్టేశారు. అంతటి మహాపురుషుడయిన తాతగారు వస్తుంటే నా చేతులు ఉండి కూడా నేను నమస్కరించలేకపోతున్నాను’ అని ఏడుస్తూ నిలబడ్డాడు. ప్రహ్లాదుడు వామనుని వద్దకు వచ్చి ‘స్వామీ! ఇంతకూ పూర్వం ఇతనికి ఇంద్రపదవి నీ అనుగ్రహం వలననే వచ్చింది. నీవే మొదటి గురువువి. నీవే శుక్రాచార్యులలో ప్రవేశించి యాగం చేయించావు. గురువు అనుగ్రహంగా యాగభోక్తవై ఆనాడు విశ్వజిత్ యాగమును ఆదరించి బ్రహ్మాండమయిన రథమును ఇచ్చావు. దానివల్ల అమరలోకం వచ్చింది. ఇంద్రపదవి వచ్చింది. వీటినన్నిటిని నీవే ఇచ్చావు. ఈవేళ నీవే తీసేశావు. చాలా మంచిపని చేశావు. హాయిగా నీ పాదములు నమ్ముకుని నిన్ను సేవించు కోవడంలో ఉన్న ఐశ్వర్యం మరెక్కడా లేదు. స్వామీ!ఎంత వరమును ఇచ్చావు’ అన్నాడు.

శ్రీమహావిష్ణువు ‘మీరందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను బలిచక్రవర్తికి గొప్ప సన్మానమును చేశాను. అతను ఆత్మను తెచ్చి నా పాదముల దగ్గర పెట్టేశాడు. ఆత్మనివేదనం చేశాడు. సంపూర్ణ శరణాగతి చేశాడు. ఇటువంటి వాడిని నేను పాడుచేస్తానా? నేను ఉన్నాను అనడానికి నేను వీనిని రక్షించాలి. వానిని వరుణపాశములతో కట్టాను. అలా నిలబడిపోయాడే కానీ తెంచుకునేందుకు ప్రయత్నించ లేదు. సావర్ణిమనువు అయిన కాలంలో ఇతనిని నేను దేవేంద్రుని చేస్తాను. ఆ తరువాత ఎవ్వరూ రాని ప్రదేశము, ఎవ్వరూ దర్శించని ప్రదేశము కేవలము నిలబడి ప్రార్థన చేస్తే నా అశరీరవాణి వినపడుతుంది తప్ప నేనున్న మూలమయిన చోటును ఎవరు చూడరో అటువంటి చోటుకు వీనిని రప్పించుకుని నాలో కలిపేసుకుంటాను. అప్పటివరకు దేవతలు కూడా ఎక్కడ ఉండాలని కోరుకుంటారో అటువంటి సుతల లోకమునకంతటికీ ఇతనిని అధిపతి చేస్తున్నాను. సర్వకాలములయందు నా సుదర్శన చక్రము ఇతనికి అండగా వుండి రక్షిస్తుంది. పదిదిక్కులను పరిపాలించే దిక్పాలకులు ఎవరూ కూడా బలిచక్రవర్తి జోలికి వెళ్ళడానికి వీలులేదు ఇది నా శాసనం. అటువంటి వాడై సుతల లోకంలో రోగములు కాని, ఆకలి గాని, దప్పిక గాని, ఏమీ లేకుండా ఉంటాడు’ అన్నారు.

మరి బలిచక్రవర్తి యందు దోషమేమిటి? అతనికి శిక్ష ఎందుకు పడింది? బలిచక్రవర్తికి దుర్జన సాంగత్యము ఉన్నది. అతను లోపల ఎంత గొప్పవాడయినా చాలాకాలం రాక్షసులతో కలిసి తిరిగాడు. ఇవాళ సజ్జనుడై మనస్సు నిలబెట్టుకున్నాడు. భ్రుగువంశ సంజాతులయిన బ్రాహ్మణులతో కలిసి తిరగడంతో అతనికి ఇప్పుడు ఈశ్వరుడు అంటే ఏమిటో అర్థం అయింది. ఈ తిరిగిన ఫలితమునకు ఇంత గొప్ప వరమును ఇస్తున్నాను. రాక్షసులతో తిరగడం వలన మనసులో ఉండిపోయిన ‘నేను దానం ఇస్తున్నాను’ అనే చిన్న అభిజాత్యానికి వరుణపాశంతో కట్టాను. కానీ అతను చేసిన శరణాగతికి అతడిని సుతల లోకమునకు అధిపతిని చేసి సావర్ణిమనువు వేళకు ఇంద్రుడిని చేసి తదనంతరము నాలో కలుపుకుంటాను.


‘అదితి ఆరోజు కోరింది కాబట్టి ఇంద్రునికి తమ్మునిగా పుట్టాను. ఇవాళ నుండి నన్ను ఉపేంద్రుడని పిలుస్తారు’ అని అన్నారు. యథార్థమునకు ఇంద్రుడు ఆయన కాలి గోటికి చాలడు. అటువంటి వానికి తమ్ముడని పిలిపించుకుని పొంగిపోతున్నాడు. తాను సంపాదించిన రాజ్యములో భాగము అడగకుండా ఇంద్రునికి ఇచ్చేశాడు. ఇంద్రుడు రాజ్యాభిషిక్తుడై తిరిగి స్వర్గమును పొందాడు. అమ్మకి ఇచ్చిన వరమును పూర్తిచేశాడు. తను మళ్ళీ శ్రీమన్నారాయణుని పథమును చేరుకుంటూ ఒకమాట చెప్పాడు.

ఈ వామనమూర్తి కథను వింటున్నవారు ‘ఎక్కడయినా పితృ కార్యములు చేయకపోతే వామనమూర్తి కథ వింటే వారు సశాస్త్రీయంగా పితృకార్యం చేసినట్లే. ఎక్కడైనా ఉపనయనం చేస్తే ఆ ఉపనయనంలో తెలిసి కాని, తెలియక గాని, ఏమయినా దోషములు దొర్లితే ఆ దోషములు పరిహరింపబడతాయి. ఆ ఉపనయనము పరిపూర్తియై ఆ బ్రహ్మచారి గాయత్రీ మంత్రము చేసుకోవడానికి పూర్ణమయిన సిద్ధిని పొందాలంటే వటువు వామనమూర్తి కథను వినాలి. ఎవరు ఈ వామనమూర్తి కథను చదువుతున్నారో అటువంటి వారి పాపములను దహించి ఊర్ధ్వలోకములయందు నివాసము ఇస్తాను. వారికి లక్ష్మీకటాక్షము కలుగుతుంది. వాళ్లకి ఉన్న దుర్నిమిత్తములు అన్నీ పోతాయి’ అని సాక్షాత్తుగా భగవానుడే ఫలశ్రుతిని చెప్పారు.

మనిషిలోని సప్తధాతువులు. సప్తధాతువులు.

 రాజుగారు అంటే మనిషి. 


ఆయనకు ఏడుగురు కొడుకులు అంటే మనిషిలోని సప్తధాతువులు. 


కొడుకులు వేటకు వెళ్ళడమూ అంటే మనిషి జీవితాన్ని కొనసాగించడం.


*జీవితమే ఒక వేట. వేటే ఒక జీవితం. *


రాజ కుమారులు వేటాడిన ఏడు చేపలు అంటే 


మనిషికి ఉండే అరిషడ్ వర్గాలు ( అనగా 6 )


1.కామ 2.క్రోధ 3.లోభ 4.మోహ 5.మద 6.మాత్సర్యాలు 


వీటన్నిం టిని మనిషి సాధన చేసి ఎండగట్టవచ్చు.

అంటే పూర్తిగా నియంత్రించవచ్చు.

 


అందుకే కథలో ఆరు చేపలను ఎండగట్టినట్టు చెప్పారు. 


రాజుగారి కొడుకులు ఎండబెట్టిన ఏడు చేపల్లో ఒక చేప ఎండలేదు.


ఏమిటా చేప. అది మనస్సు  


దీన్ని జయించడం చాలా కష్టం. 


ఎంత ప్రయత్నించినా అది ఎండదు. 


మనస్సు అంటే ఏమిటి❓


మనస్సు అంటే సంకల్ప వికల్పాలు 


ఒకటి తీరుతుంటే మరొకటి మొలుచుకొస్తుంది.


మొలిచే కోరికలను తీర్చుకుంటూ పోతుంటే జీవితకాలం చాలదు.


కోరికలన్నింటిని జయించేసి మోక్షానికి వెళ్ళిపోవాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడుతుంటారు.


మోక్షానికి వెళ్ళాలనుకోవడం కూడా ఒక కోరికే.


 

ఆ కోరికను ఎండగడితే తప్ప మోక్షం రాదు. 


*ఈ చేప ఎండకుండా అడ్డు తగులుతున్నది ఏది❓

గడ్డిమేటు.* 


గడ్డిమేటు అంటే ఏమిటి❓


కుప్పపోసిన అజ్ఞానం.


గడ్డిమేటులా పేరుకుపోయిన అజ్ఞానాన్ని తొలగించా లంటే ఎలా❓


మామూలు గడ్డికుప్ప అయితే గడ్డిపరకలను పట్టి లాగీ, పీకి ఒకనాటికి ఖాళీ చేయవచ్చు.


కానీ అజ్ఞానం అలాంటిది కాదు. జ్ఞానాదాయ కమైన మాటలు ఎంత చెప్పినా, ఎన్ని చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా మనం చేత్తో గడ్డిపరకలను లాగినట్టే‼️


ఆ కుప్ప తరిగేది కాదు, తగ్గేది కాదు.


 

దాన్ని ఎంత ప్రయత్నించినా తగ్గించడం కష్టం.


మరి అది పోవాలంటే ఏం చేయాలి❓


ఆవు వచ్చి మేయాలి.


ఆవు ఎక్కడి నుంచి రావాలి. అసలు ఆవు అంటే ఏమిటి❓


ఆవు అంటే జ్ఞానం.


జ్ఞానం అనే ఆవు దొడ్లో ఎగబడి మేస్తే అజ్ఞానం అనే గడ్డికుప్ప ఒకనాటికి అంతరించి పోతుంది.


లేదూ… జ్ఞానాన్ని అగ్నికణంగా మార్చి గడ్డిమేటు మీద వేస్తే కాలి బూడిదవుతుంది.


అందుకే భగవద్గీతలో మన కర్మలు, వాటి ఫలితాలు జ్ఞానాగ్నిలో దగ్ధమైపోవాలని చెబుతాడు కృష్ణుడు

(జ్ఞానాగ్నిదగ్ధకర్మాణాం) 


జ్ఞానాన్ని అగ్నిగా మలుచుకోగలిగిన వాడు సిద్ధపురుషుడు, యోగ పురుషుడు మాత్రమే. 


 ఈ గోవును ఎవ్వరు మేపాలి. 


గొల్లడాడు మేపాలి. గొల్లవాడు అంటే ఎవరు❓


సమర్ధ సద్గురువు..

జగద్గురుడు.


జ్ఞానరూపమైన భగవద్గీతను లోకానికి ప్రసాదించిన కృష్ణుడు గొల్లవాడే కదా‼️


అర్జునుడు అనే దూడను అడ్డు పెట్టుకుని వేదం అనే ఆవు పాలు పిండి జ్ఞానరూపంగా మనందరికి ధారపోశాడు. 


ఇంత గొప్పపని చేయవలసిన ఈ గొల్లవాడు ఆ పని చేయలేదు.


ఏమిరా నాయనా‼️ఆవును ఎందుకు మేపలేదు అని అడిగితే అమ్మ అన్నం పెట్టలేదు అన్నాడు. 


ఇంతకీ ఆ గొల్లవాడికి అన్నం పెట్టాల్సిన అమ్మ ఎవరు❓


అమ్మల గన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ. ఆమెనే లోకం జగన్మాత అని కీర్తిస్తుంది.


ఈ జగన్మాత అన్నం పెట్టక పోవడం వల్ల గొల్లవాడి ఆకలి తీరలేదు. 


ఓ జగన్మాతా ఈ గొల్లవాడికి ఎందుకు అన్నం పెట్టలేదమ్మా అంటే ఆవిడ పిల్లవాడు ఏడ్చాడు అంది.


ఇంతకి ఆ పిల్లవాడు ఎవరు❓ఆర్తితో దైవానుగ్రహం కోసం అలమటించేవాడు. 


ఈ పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడు❓


వాడికి చీమ కుట్టింది. ఎక్కడిది చీమా❓దానికి ఇంకోపేరే సంసారం.


సంసారం అనే చీమ కుట్టినందుకు ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు.


ఆవులను మేపడానికి వచ్చే గొల్లవాడికన్నా ఆర్తితో దైవానుగ్రహం కోసం ఏడ్చే పిల్లవాడే ముఖ్యం కనుక ఆ పిల్ల వాడినే చూసుకుంది.

మరి గొల్లవాడు అమ్మ అన్నం పెట్టక పోవడం వలన తన విధిని నిలిపి వేసాడా? లేదు. 

అమ్మ ద్వారా తన పనిలో భాగమైన శిష్ట రక్షణను చేసుకున్నాడు.


చీమకుట్టినందుకు కథలో పిల్లవాడు ఏడ్చినట్టే సంసార బాధలు, ప్రపంచ బాధలు భరించలేక మనం కూడా ఏడుస్తున్నాం,


మనల్ని ఈ బాధలే చీమలై కుడుతున్నాయి. 


చీమలు పుట్టలోనే ఉంటాయి. ఏమిటీ ఈ పుట్ట❓


మనిషికి ఉండే సంసారం ఒక పుట్ట. 


*ఈ పరమార్థాన్ని చెప్పడం కోసమే జీవితంలోకి అడుగు పెట్టే ముందే ఈ గొప్ప విషయం తెలియాలనే సదుద్దేశంతోనే మన పెద్దలు ఈ కథను ప్రతి పిల్లవాడికి నూరిపోశేవారు.*


🌱🌱🌱🧘‍♀️🧘‍♀️🧘‍♀️🌱🌱🌱

ఓ బాటసారీ! ఇది జీవిత రహదారి!

 అయిదింటికి అలారం లేపితే నిద్ర లేచి, లేచిన తరవాత అలారాన్ని నిద్రపుచ్చాను. గత ఐదేళ్లుగా పతంజలి పేస్టునే వాడుతూ మన ఆయుర్వేదాన్ని పతనమైపోకుండా కాపాడుతూ వస్తున్నాను. 


ఇలా హాల్లోకి రాగానే మూసుకుపోతున్న కళ్లు బలవంతాన తెరుస్తూ చేతిలో పొగలు కక్కుతున్న గ్లాసుతో కట్టుకున్నావిడ ప్రత్యక్షమైంది.


అరమోడ్పు కన్నులతో అందించింది కదాని అదేదో అమృతం అనేసుకోకండి.

అరచెక్క నిమ్మకాయీ, అరచెంచా తేనే కలిపిన అరగ్లాసు వేణ్ణీళ్లు. 


నాలాంటి కొవ్వెక్కిన వాళ్లందరి ఆరోగ్యానికీ వంతెన, మన మంతెనగారిచ్చిన సలహా అది. బానే పంజేస్తున్నట్టు అనుమానంగా ఉంది. 


ఇదివరకు రేమండ్ షాపులో బెల్టు కొన్న ప్రతిసారీ దానికుండే కన్నాలు కాకుండా, దాదాపుగా ఢిల్లీ అంతదూరంలో, బా...గా చివర్న మరో నాలుగైదు కన్నాలు పొడిపించడం మాలాంటి మధ్య వయస్‘కుల’సంప్రదాయం! 


అటువంటిది ఈమధ్య ఈ వేణ్ణీళ్లవీ మొదలెట్టాక ఇటు సౌతిండియా వైపుండే కన్నాల్లోనే పట్టేస్తోంది బెల్టు. హౌ స్వీటిటీజ్?


దాంతో అదే ఊపులో, మరింత ఉత్సాహంతో మొన్నొకరోజు తనలా ఆఫీసుకెళ్లగానే బీరువాలో తీరువగా మడతెట్టి దాచిన పురాతన వస్త్ర విశేషాలన్నింటినీ బయటకి తీశాను. అవన్నీ మనం ప్రభుదేవా సైజులో ఉన్నప్పుడు కొన్న పేంట్లు. నేనిలా ప్రభు సైజులోకి మారిపోగానే ఇక చేసేదేం లేక అరుంధతిలో పశుపతిలా ఇన్నాళ్లూ బీరువాలో పడున్నాయి. మళ్ళీ ఇన్నాళ్లకి విముక్తి. 


ఒక్కొక్కటీ తీసి నయానో, భయానో ఎక్కించడం, ‘ప్చ్’ అంటూ రెండు పెదాలూ విరవడం. ఆఖరికి మళ్ళీ అన్నిట్నీ మడతెట్టేసి సమాధిలో తోసెయ్యడం! 


‘సరే, ఈ ముచ్చటెన్నాళ్లో చూద్దాంలే బొమ్మాళీ’ అనుకుంటూ చేతికందిన బట్టలేసుకుని బీరువా మూసేశాను.


ఐదున్నర! మరోసారి ఫోను మోగకముందే బయల్దేరిపోవాలి. ఇంకా తూరుపు దిక్కు ఎర్రబడకుండానే ఘుమఘుమలాడే మైసూర్ శాండల్ పరిమళాలతో బయటపడ్డాను. చీకట్లో బైటకు రాగానే ‘బై’ చెప్తూ వాకిట్లో పాల పేకెట్లు కనబడ్డాయి. 


పేపరు కుర్రాడు పేపరు విసరడానికి నీళ్లెక్కడా కనబడక పోవడంతో నిరాశచెంది, దాన్ని మతాబా గొట్టంలా చుట్ట చుట్టేసి, తలుపు గడియలో దూర్చేసి, తరతరాలుగా తనకున్న పగను తీర్చుకున్నాడు.


ఇప్పుడది చదవాలంటే ముగ్గురు కావాలి. అటొకరూ, ఇటొకరూ సాగదీసి పట్టుకుంటే మూడోవాడికి చదవడం అవుతుంది. ఖర్మరా బాబూ!


అయినా కంప్యూటర్ వైరస్ నుంచి కరోనా వైరస్ దాకా ఫేస్‌బుక్‌లోనే సమాచారం వచ్చేస్తోంటే పేపరెందుకుటా, వంటింటి గూళ్లలో అడుగున వేసుకోడానిక్కాకపోతే?


మొత్తానికి కేసులన్నీ అయిపోయి కారు దగ్గరకి వచ్చి చూసేటప్పటికి టైమ్ ఎనిమిదయింది. 


ఇప్పుడు ఎగురుకుంటూ ఇంటికెళ్లాలి, 

పాడుకుంటూ స్నానం చెయ్యాలి, 

ఊదుకుంటూ టిఫిన్ చెయ్యాలి, 

టైమైపోతోందని తలబాదుకుంటూ డ్యూటీకెళ్లాలి. 


కార్మికులకి మెషిన్లో వేలెడితే వేలు కట్టైపోతుంది. 

మాకు మాత్రం తొమ్మిదింటికల్లా మెషిన్లో వేలెట్టకపోతే వేలకువేలు కట్టైపోతుంది. 


దానినే ‘భయో’మెట్రిక్ యంత్రమందురు. అందుకని తనకి ఫోన్ చేసి చెప్పేశాను.. ఆలస్యం చెయ్యకుండా టిఫిన్ రెడీ చేసుంచమని. 


‘నీళ్లేమంటున్నాయీ ఓ వదినా! చన్నీళ్లేమంటున్నాయీ ఓ వదినా!’ అనే ఎల్లారీశ్వరి పాటొకటి పాడుతూ అరట్యాంకుడు నీళ్లు అవలీలగా స్నానమాచరించి బయటికొచ్చాను. 


‘అసలా పాటేంటి? ఎలా గుర్తుంటాయవన్నీ?’ అంది సిగ్గుపడాలని ప్రయత్నిస్తూ. 


‘రేడియోలో చిన్నప్పుడు వినేవాళ్లం. అదీ ఇదీ అనిలేదు. అన్నీ గుర్తే! కూటికుప్పల సూర్యారావుగారు చెప్పే కుక్కకాటు వైద్యం దగ్గర్నుంచి, కొమాండూరి కృష్ణమాచార్యులు గారి వయొలిన్ కచేరీ దాకా ప్రతీదీ వినేవాళ్లం. అదన్నమాట సంగతి!’ అంటూ ఆఖరి దోశ ముక్కని పూర్తిగా నమలకుండానే బయల్దేరిపోయాను.


మా హాస్పిటల్‌కి కార్లో వెళ్లాలనుకోవడం, కాశీకి కాలినడకన వెళ్లడం రెండూ ఒకటే! రెండో దాంతో పుణ్యం వస్తుందో రాదో ఆ దేవుడెరుగు గానీ మొదటిదాంతో మాత్రం కావలసినంత ఇరిటేషనొస్తుంది.


ఆ పావుకిలోమీటరు దూరం గురించి గరుడ పురాణంలో కూడా రాశాడు. ఈమధ్యే చదివాను. అయితే వైతరణిని ఏ ఇబ్బందులూ లేకుండా దాటడానికి ఏవో చిట్కాలవీ ఉన్నాయి కానీ మా హాస్పిటల్ రోడ్డు దాటడానికి ఏ సలహాలూ రాయలేదందులో.


రోడ్డు మొదలే గ్లైకోడిన్ దగ్గుమందు సీసా మూతిలా నేరోగా ఉంటుంది. అదలా ముందుకు సాగి క్యారెట్ దుంపలా మరింత సన్నగా మారిపోతుంది. చివరాఖర్న మా హాస్పిటల్ సింహద్వారం దగ్గరకొచ్చేటప్పటికి చొక్కాలకుండే కాజాలా కాస్త జాగా మిగులుతుంది.


ఈ మధ్యలో..


ఇసకతో ఒక ట్రాక్టరు, దాని వెనకాల స్కూటర్ల మీద విసుగుతో నలుగురు డాక్టర్లు...


ఎడమవైపు మసీదులో చేసే నమాజు, కుడివైపు కార్లు రిపేరు చేసే గ్యారేజు...


‘ఇచ్చట జెరాక్సూ, ప్రాణమూ తీయబడును’ అనే బోర్డున్న బొట్టుపెట్టంత షాపూ...


మేకల్ని వేలాడదీసి ఉన్న నాలుగు మటన్ కొట్లు, యువతకి పాన్‍పరాగసంపర్కాన్ని ప్రసాదించే మూడు బేవార్సు కొట్లు...


సరే... నీకున్న శక్తినంతా ధారపోసి వీటన్నిటినీ దాటి వెళ్లావే అనుకో.... అక్కడ ఇద్దరు యంగండైనమిక్ అమ్మాయిలు పళ్లైనా తోముకోకుండా పరీక్ష అట్టలతో రోడ్డు మీదే షటిలాడుకుంటూ ఉంటారు. 


ఆవారా ఈవారా ఓ ముగ్గురు నలుగురు పిల్లపిశాచాలు చొక్కాలు పైకెత్తుకుని వాళ్లమ్మ ఎప్పుడు కడుగుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారనుకోండీ! అది ట్వంటీఫర్ బై సెవెన్ కనబడే దృశ్యం!


ఇంతోటి రాజ్ భవన్ రోడ్డులోకీ మా డాట్టర్లందరూ వోక్స్ వేగన్ వెంటోలూ, హోండా సిటీలూ, డిజైర్లూ వేసుకుని ఒచ్చేత్తారు. తీరా బండి ఏనాటికీ ముందుకి కదలకపోవడంతో ఏసీ వేసుకుని ఉష్షూ అంటూ విసుక్కుంటుంటారు.


పగలంతా ఇలా పగబట్టేసే రోడ్డు రాత్రవగానే మరో రాక్షసిలా మారిపోతుంది. దారిపొడవునా ఆరుబయట మంచాలేసుకుని వెన్నెల్నీ, నక్షత్రాల్నీ ఆస్వాదించేస్తూ, మా గుండెల్లో గునపాలు దించేస్తూ ఉంటారు.


మనం కానీ రాత్రప్పుడు ఏ కారో వేసుకుని, ఆ పడుకున్నోళ్లని చూడకుండా ఈలేసుకుంటూ స్పీడుగా వచ్చామో, మనం కూడా సల్మాన్ ఖాన్‌లా జైలూ, బెయిలూ ఆటాడుకుంటూ శేషజీవితం గడపాలి.


ఇక పెళ్లి భోజనాలవీ వచ్చాయో మన పని మిఠాయి కిళ్లీయే! ఆకుల మజ్జలో వక్కలా నలిపేస్తారు. సమర్త పేరంటాలైతే మరి చెప్పక్కర్లేదు. రోజుకొకరు అవుతూనే ఉంటారు.


గణేశ నవరాత్రులకి అంత చిన్న రోడ్డులోనే ఆరుగురు గణపతుల్ని పెడతారంటే అక్కడుండే వాళ్లందరూ ఎంత సఖ్యతతో ఏడుస్తున్నారో మనకర్ధమవుతుంది. నిమజ్జనాలప్పుడైతే ఆ విగ్రహంతోపాటు మనకీ అయ్యకోనేట్లో దూకెయ్యాలనిపిస్తుంది. 


ఇన్ని అవాంతరాల్నీ దాటుకుని బయోమెట్రిక్ మెషిన్ దగ్గరెళ్లగానే అది మాతో కాసేపు దొంగా పోలీసాట ఆడుతుంది. దాన్ని కూడా బతిమాలి, లొంగదీసుకుని మన నిజాయితీని నిరూపించుకునేటప్పటికి చావుతప్పి వేలుసొట్ట పడుతుంది!


ఓ బాటసారీ! ఇది జీవిత రహదారి!


........జగదీశ్ కొచ్చెర్లకోట

మా దేశంలో పెళ్లిళ్లు

 ఒక భారతీయుడు, అమెరికన్ కలిశారట. భారతీయుడు మొరబెట్టుకున్నాడట. అయ్యా, మా దేశంలో పెళ్లిళ్లు మా ప్రమేయం లేకుండా పెద్దలు నిర్ణయిస్తారు. జాతకాలు, ముహూర్తాలు, మంగళ సూత్రాలు, తంతు- గొడవ. నేను చూడని, ప్రేమించని పిల్ల మెడలో తాళి కట్టమంటారు. ఎలా చచ్చేది? - అన్నాడట.


అమెరికన్ అన్నాడు. మీ పని బాగానే ఉంది బాబూ. నా సంగతి చూడు. నేను మూడేళ్లు ప్రేమించి మొగుడు పోయిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. రెండేళ్ల తర్వాత మా నాన్న నా పెళ్లాం మొదటి భర్త కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు మా నాన్న నాకు అల్లుడయ్యాడు. నేను ఆయనకి మామనయ్యాను. చట్టం ప్రకారం నా కూతురు నాకు తల్లయింది. నా పెళ్లాం నా అమ్మ మ్మ అయింది. నా కొడుకు పుట్టాక సమస్యలు మిన్ను ముట్టాయి. నా కొడుకు మా నాన్నకి తమ్ముడయ్యాడు. కనుక నాకు మేనల్లుడయ్యాడు. ఇప్పుడు మా నాన్నకి కొడుకు పుట్టాడు. నాకు తమ్ముడు కావలసిన ఆ కుర్రాడికి నేను తాతనయ్యాను. మొత్తానికి నేను నాకే తాతని, నాకే మనుమడిని అయ్యాను. మరి మా సంగతేమిటి?


భారతీయుడు స్పృహతప్పి పడిపోయాడట!


—గొల్లపూడి మారుతీరావు

నేను ఒక జీవ శాస్త్రవేత్తని

 ✍️

ఒక తల్లి 

తన నిత్యపూజ అయిన తర్వాత 

విదేశాల్లో వుండే తన కుమారునికి వీడియో చాట్ చేసి 

తన కుమారుని కి ఖాళీ గా ఉన్నాడా లేడా అని కనుక్కున్న తరువాత తన వీడియో చాట్ లో జరిగిన సంభాషణలు. 

మీ~మన కోసం.


తల్లి...

నాయనా .!

పూజా పునస్కారాలు అయినాయా?


కుమారుడు...

అమ్మా!

నేను ఒక జీవ శాస్త్రవేత్తని.

అది కూడా అమెరికాలో మానవ వికాసానికి సంబంధించి రీసెర్చ్ చేస్తున్నాను. 


మీరు డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని వినే వుంటారు.

అలాంటి నేను పూజలు అవి ఏం బాగోదు.


తల్లి మందహాసం తో..

కన్నా!

నాకు కూడా డార్విన్ గురించి కొద్దిగా తెలుసు కన్నా.

కానీ అతను కనిపెట్టినవి అన్ని మన పురాతన ధర్మంలో ఉన్నవేకదా నాన్నా.


కొడుకు వ్యంగ్యంగా..

అలాగా అమ్మ 

నాకు తెలీదే.


(అపుడు ఆ తల్లి నీకు అంత ఆసక్తిగా వుంటే చెపుతా విను అని కొంచెం మృదువుగా తన సంభాషణ కొనసాగించింది.)


నీకు దశావతరాలు అది మహా విష్ణువు యొక్క దశావతారాల గురించి తెలుసు కదా.....

కొడుకు ఆసక్తిగా అవును తెలుసు దానికి ఈ జీవ పరిణామానికి ఏమిటీ సంభంధం అని ప్రశ్నించాడు.


 అప్పుడు ఆ తల్లి...

హా సంభంధం ఉంది. 

ఇంకా నువు నీ డార్విన్ తెలుసుకోలేనిది కూడా చెపుతాను విను.

     

మొదటి అవతారం 

మత్స్య అవతారం.

అది నీటిలో ఉంటుంది.

అలాగే సృష్టి కూడా నీటిలోంచే కదా మొదలైంది.

ఇది నిజమా కాదా.


కొడుకు కొంచెం అలెర్ట్ గా వింటున్నాడు.


తర్వాత రెండవది 

కూర్మ అవతారం. అంటే.


తాబేలు.

దీనిని బట్టి సృష్టి నీటి నుండి భూమి మీదకు ప్రయాణించిన ట్టుగా గమనించాలి.

అంటే ఉభయచర జీవులు లాగా తాబేలు సముద్రం నుండి భూమికి జీవ పరిణామం జరిగింది.


మూడవది వరాహ అవతారం అంటే పంది.

ఇది అడవి జంతువు లను అంటే బుద్ధి పెరగని జీవులు అదే డైనోసార్లని గుర్తు కు తెస్తుంది.


ఇక నాలుగో అవతారం నృసింహ అవతారం.

అంటే సగం మనిషి సగం జంతువు.

దీన్ని బట్టి మనకు జీవ పరినామం అడవి జంతువు నుండి బుద్ధి వికసితమై న జీవులు ఏర్పడ్డాయి అని తెలుస్తుంది.


ఇక ఐదో అవతారం వామన.

అంటే పొట్టివాడు అయిన ఎంతో ఎత్తుకు పెరిగిన వాడు.

నీకు తెలుసుకదా .


మానవులు మొదట హోమో erectes మరియు హోమో సేపియన్స్ అని వున్నారు అని వాళ్లలో హోమో సేపియన్స్ మనుషులుగా వికాసం చెందారు.


కుమారుడు తల్లి చెప్పేది వింటూ స్తబ్దుగా ఉండి పోయాడు.


తల్లి..

_కన్నా .!!_

ఆరో అవతారం పరశురాముడు. 

ఈ పరశురాముడు గండ్రగొడ్డలిని పట్టుకు తిరిగేవాడు.


దీని వల్ల ఎం తెలుస్తుందంటే ఆదిమ మానవుడు వేటకు వాడే ఆయుధాలు తయారు చేసుకొన్నాడు.

మరియు అడవులు గుహలో నివసించే వాడు మరియు కోపిష్ఠి ఆటవిక న్యాయం కలిగినవాడు.


ఇక ఏడో అవతారం

రామావతరం.

మర్యాద పురుషోత్తముడైన రాముడు మొదటి ఆలోచన పరుడైన సామాజిక వ్యక్తి.

 

అతను సమాజానికి నీతి నియమాలు, సమస్త కుటుంబ బంధుత్వనికి అది పురుషుడు.


 ఇక ఎనిమిదవది 

కృష్ణ పరమాత్మ. 

రాజనీతిజ్ఞుడు పాలకుడు ప్రేమించే స్వభావి.

అతడు సమాజ నియమాలను ఏర్పరిచి వాటితో ఆనందాన్ని ఎలా పొందాలో తెలిపినవాడు.

 

వాటితో సమాజములో వుంటూ సుఖ~దుఃఖ, లాభ~నష్టాలు అన్ని నేర్పినవాడు.


కొడుకు ఆశ్చర్యంగా

విస్మయంతో వింటున్నాడు.

ఆ తల్లి తన జ్ఞాన గంగా ప్రవాహాన్ని కొనసాగిస్తూ


 తర్వాత తొమ్మిదో అవతారం

 బుద్ధ అవతారం.


ఆయన నృసింహ అవతారం నిండి మానవుడిగా మారిన క్రమంలో మర్చిపోయిన 

తన సాధు స్వభావాన్ని వెతుక్కొన్నాడు. 


ఇంకా అతను 

మనిషి తన జ్ఞానాన్ని వెతుక్కొంటు చేసే ఆవిష్కరణ లకు మూలం.

ఇక వచ్చేది.


కల్కిపురుషుడు.

అతను నీవు ఏ మానవునికై వేతుకోతున్నావో అతనే ఇతను. 

అతను ఇప్పటివరకు వరసత్వానిగా వచ్చిన వాటికంటే ఎంతో గొప్ప శ్రేష్ఠమైన వ్యక్తిగా వెలుగొందుతాడు.


కొడుకు తన తల్లివంక అవాక్కాయి చూస్తున్నాడు

   

అపుడా ఆ కొడుకు ఆనంద భాష్పలతో అమ్మా...

హిందు ధర్మం ఎంతో అర్థవంతమైన నిజమైన ధర్మం. అని అన్నాడు

    



ఆత్మీయులారా !!!

                 

మన వేదాలు,

గ్రంథాలు,

పురాణాలు,

ఉపనిషత్తులు,

ఇత్యాది అన్ని ఎంతో అర్థవంతమైనవి. 


కానీ మనం చూసే 

దృష్టి కోణం మారాలి.

మీరు ఎలా అనుకొంటే 

అలా వైజ్ఞనికమైనవి కావచ్చు.

లేదా ధర్మ పరమైనవి కావచ్చు.

 

శాస్ట్రీయతతో కూడిన ధర్మాన్ని నేడు మూఢచారాలు పేరిట మన సంస్కృతి ని మనమే అపహాస్యం చేసుకొంటున్నాం.


ఇకనైనా మేలుకోండి ఋషులు ఏర్పరచిన సనాతన ధర్మాన్ని పాటించుదాం.


*_మనంమారుదాం యుగంమారుతుంది._*


🙏🙏

      _సదా మీ సేవకుడు_

                        🙏🙏

ప్రశ్న పత్రం సంఖ్య: 32

  ప్రశ్న పత్రం సంఖ్య: 32 కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

రామాయణ  సంబంధిత ప్రెశ్నలు. 

 క్రింది ప్రశ్నలను   పూరించటానికి ప్రయత్నించండి.   

1) కుశద్వజుని కుమార్తె. శత్రుఘ్నుని భార్య.ఎవరు 

2)  సరమ  ఎవరి భార్య.

·3)  హనుమంతుని చేత సంహరింపబడిన రాక్షసి. ఎవరు 

4) సునయన -ఎవరి  భార్య.

 5) దశరథుని భార్య. లక్ష్మణ,శత్రుఘ్నుల తల్లి. ఎవరు 

 6) నాగమాత. హనుమంతునిచే ఓటమి పాలయ్యింది. ఎవరు 

7)  సులోచన ఎవరి భార్య

8)జనకుడు యాగం చేసి భూమిని దున్నుతుండగా నాగేటి చాలులో లభించింది ఎవరు 

9) రామాయణాన్ని రచించట్టానికి ప్రేరేపించింది ఎవరు 

10) నారద మహాముని  రత్నాకరుడికి ఉపదేశించిన మంత్రం ఏమిటి. 

11). ప్రాచేతసుడను అనేపేరు ఎవరిది 

12)రామాయణంలో అన్నదమ్ముల అన్యోన్యతకు రామలక్ష్మణులు ఉదాహరణ అయితే అన్నదమ్ముల విరోధానికి ఉదాహరణగా ఎవరిని చెప్పవచ్చు. 

13) లవ కుశలలో సీతాదేవికి జన్మించనివాడు ఎవడు 

14) కుశధ్వజుని కుమార్తె. భరతుని భార్య ఎవరు 

15). దశరథమహారాజు ఎన్ని సంవత్సరములు పరిపాలించారు. 

16) మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీః సమాః|

యత్ క్రౌంచమిథునాదేకమ్ అవధీః కామమోహితమ్||

ఈ శ్లోకానికి వున్న ప్రాముఖ్యతను తెలుపండి. 

17) రోమపాదుడు కుమార్తె ఎవ్వరు. 

18).ఋష్యశృంగుని భార్య ఎవరు. 

19.  రావణుని రెండవ భార్య. అతికాయుని తల్లి. ఎవరు 

20  విభీషణుని కుమార్తె ఎవరు 


సత్యం జ్ఞానమనంతం

 

సత్యం జ్ఞానమనంతం యద్బ్రహ్మా తద్వస్తు తస్యతత్
ఈశ్వరత్వం జీవత్వముపాధిద్వయ కల్పితం

అంటుంది వేదాంత పంచదశి. సత్యం, జ్ఞానం, అనంతం అనే లక్షణాలతో పేర్కొన్న పరబ్రహ్మం ఏది కలదో అదే వస్తువు (పరమార్థం). పరబ్రహ్మం ఈశ్వరత్వం, జీవత్వం అనే రెండు ఉపాధులు కలిగి ఉంటుంది.ప్రపంచం ఏర్పడేందుకు మూలకారణమైన ప్రకృతి త్రిగుణాత్మకమైంది. అంటే సత్వ, రజస్తమో గుణాలు కలది. జ్ఞానం, స్వచ్ఛత, శాంతి మొదలైన వృత్తులకు సత్వగుణం, కామం, క్రోధం మొదలైన వాటికి రజోగుణం, అలాగే మూఢత్వం, సోమరితనం మొదలైన వృత్తులకు తమోగుణాలు కారణాలు. శుద్ధ సత్తం అంటే రజస్తమో గుణాల కలయిక లేని నిర్మలమైన సత్వగుణమేమాయ’. మాయాశక్తి ఉపాధిగా కలవాడు ఈశ్వరుడు. ఇతడు సర్వనియామకుడు. సర్వజ్ఞుడు, శాసకుడు. మాయను ఆధీనంలో ఉంచుకొని ప్రపంచకార్యాలు నిర్వహించువాడు. మలిన సత్తం అంటే రజస్తమో గుణాల కలయిక కలిగినది. అవిద్య, అజ్ఞానం.. వీటిని ఉపాధిగా కలవాడు జీవుడు. మాయకు వశుడు. మాయలో ప్రతిబింబించిన బ్రహ్మం ఈశ్వరుడు అయితే, అవిద్యలో ప్రతిబింబించే బ్రహ్మం జీవుడు. విధంగా ఒకే పరబ్రహ్మం ఉపాధి భేదం కారణంగా ఈశ్వరునిగా, జీవునిగా ఉన్నాడు.

పంచమహా భూతాల్లోని సత్వగుణ అంశాలు జ్ఞానేంద్రియాలుగా, సత్వగుణ సమష్టి అంతఃకరణంగా రూపొందినవి. అలాగే రజోగుణ అంశాల కారణంగా కర్మేంద్రియాలు, సమష్టి రజో అంశం కారణంగా ప్రాణాలు ఏర్పడినవి. పంచీకరణమైన పంచభూతాల నుంచి స్థూల శరీరం ఏర్పడింది. ఇది నానా రూపాలతో, నానా గుణాలతో జీవులుగా మనుగడ సాగిస్తున్నది. మూడు శరీరాలతో అంటే పంచభూతాలతో ఏర్పడిన స్థూల శరీరం, జ్ఞానేంద్రియ పంచకం, కర్మేంద్రియ పంచకం, ప్రాణ పంచకం, మనస్సు, బుద్ధి అనే అంతఃకరణాలు మొత్తం 17 తత్వాలతో సూక్ష్మ శరీరం, కారణ శరీరాలలో జీవులు ప్రపంచంలో భోగాలను అనుభవిస్తున్నాయి. మూడు శరీరాలు మళ్లీ ఐదు కోశాలుగా విభజన చెందాయి. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అని పంచ కోశాలు. కోశం అనగా కత్తిని దాచు ఒర.

వివిధ అవయవాలతో బయటకు కనపడేది స్థూల శరీరం. దీనినే అన్నమయ కోశం అంటారు. ఇది అన్నం చేత పుట్టింది. దీని పోషణ అన్నంతోనే! దీని ఉనికి జాగ్రదవస్థ అంటే.. ఇంద్రియాలతో పదార్థాలను గ్రహిస్తుంది. రూపాలను, గుణాలు తెలుసుకుంటుంది. పూర్వజన్మలలో చేసిన వివిధ కర్మఫలాలను అనుభవించడానికి ఇది ఏర్పడింది.

శరీరంలో వాయురూపంలో ఇంద్రియాలను ప్రేరేపిస్తూ, దేహానికి బలాన్నిచ్చేది ప్రాణం. చేసే వృత్తులను బట్టి దీనికి పలు పేర్లు. శ్వాసరూపంలో ప్రాణం, మలమూత్ర విసర్జన కలిగించునది అపానం, జీర్ణక్రియ నిర్వహించేది సమానం, ఆహారాన్ని గ్రహించడానికి ఉపయోగపడేది ఉదానం, రక్తప్రసరణకు ఉపకరించేది వ్యానం.. ఇలా ఐదు రకాలుగా చెప్పారు. ప్రాణాలతో కూడినది కాబట్టి దీనిని ప్రాణమయ కోశం అన్నారు. ఇంద్రియ విషయాలను విచారించేది మనస్సు. ఇది మనోమయం. మనోమయ కోశం సాధనం కాగా, కర్తృత్వం చేసేది బుద్ధిమయ కోశం లేదా విజ్ఞానమయ కోశం. ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలు మూడు కలిసి సూక్ష్మ శరీరం. దీని ఉనికి స్వప్నావస్థ.

అంతర్ముఖత్వం చేత బ్రహ్మమును గ్రహించు ఒక విశేష బుద్ధి వృత్తి ఆనందమయ కోశం. ఇది ఇష్టం, సంతోషం అనే వృత్తులు కలది. దీని ఉనికి సుషుప్త అవస్థ. దీనికి కారణ శరీరం. అనుభవం చేత పంచకోశాలు అనుభవిస్తున్నదేదో అదే ఆత్మ. తనకు తానుగా ప్రకాశిస్తుంది. అన్ని అవస్థలకు సాక్షిగా ఉన్నది పరబ్రహ్మం. ఇది తురీయావస్థ. ఇలా జీవుడు పంచకోశాలతో కూడిన తన స్వ స్వరూపాన్ని మరచి సంసార చక్రంలో పరిభ్రమిస్తున్నాడు. వివేకజ్ఞానంతో తర్కిస్తూ కోశములు బ్రహ్మం కాదనీ, అశాశ్వతమని తెలుసుకొన్న జీవుడు భ్రాంతిని తొలగించుకుని బ్రహ్మమును సాక్షాత్కరించుకోగలడు.

సేకరణ