19, సెప్టెంబర్ 2021, ఆదివారం

రెండవ జన్మ

60 సంవత్సరాలు దాతినవారికోసం మాత్రమే  

రెండవ జన్మ బ్రాహ్మణకులంలో జన్మించినవారిని ద్విజులు అని అంటారని మనకు తెలుసు.  దానికి కారణం ఉపనయనానికి ముందు ఒక జన్మ ఉపనయనం అయినతరువాత ఒక జన్మ అని భావం. కానీ ప్రస్తుత కాలమాన పరిస్థితులలో ఉపనయనం అనేది కేవలం వివాహానికి ఒక అర్హతగా మారింది.  చాలామంది వివాహముహుర్తానికి ముందు ఉపనయనం చేయటం మనం చూస్తున్నాము.  కాబట్టి ఇప్పుడు మనం వర్ణాశ్రమ ధర్మాలను పాటించటంలేదని వేరేగా చెప్పనవసరం లేదు. 

నా దృష్టిలో 60 సంవత్సరాలు దాటింతరువాత రెండవ జన్మగా పేర్కొనదలిచాను. ఎందుకంటె అప్పటివరకు ఏదో ఉద్యోగంచేసుకుంటూ ఐహిక సంబాధలతో నిత్యం సతమతం అవుతూ జీవితాన్ని గడిపి రిటైర్ అయి ప్రశాంత జీవితాన్ని గడపాలనుకోవటం కద్దు. కానీ మనం అక్కడక్కడ చూస్తున్నాము. రిటైరు అయ్యికూడా ఇంకా మరల ఇంకో ఉద్యోగమో వ్యాపారమో మొదలుపెట్టి ఇంకా ఇంకా ధనార్జన చేయాలి అని తాపత్రయ పడేవారు అనేకులు.  వారిని మనం మందలించాలిసిన పనిలేదు.  కొంతమంది నేను రిటైర్ అయ్యాను ఇకనయినా నా జన్మ సార్ధకం చేసుకునాలి అని భావించే ముముక్షువులకు నేను సాదరంగా ప్రణమిల్లి ఇది వ్రాస్తున్నాను. 

జీవితంలో కష్టసుకాలు అనుభవించటం ఇయ్యింది.  ఇకనయినా మిగిలిన జీవితకాలాన్ని జన్మ రాహిత్యానికి పాకులాడితే బాగుంటుంది. ఏమంటారు. 

అంతర్ముఖులు కావలి. 

ఇదే మంచి సమయం ఇక ఈ సమయాన్ని వృధా కాకుండా బ్రహ్మజ్ఞ్యాన్ని పొందటానికి వెచ్చించాలి. కొంతమంది నా వయసు ఏమంత లేదు కేవలం 65 లేక 68 మాత్రమే నేను ఇంకో 5 లేక 10 సంవత్సరాలకు సాధన మొదలు పెడతాను అనే వారు లేకపోలేదు. 70 దాటినా ఇంకా కేశాలకు రంగులు అడ్డుకొని ఇంకా బాలాకుమారుడిని అనుకునేవారు వున్నారు.  కొంతమంది గుడులు, గోపురాలు అని ఇంకా యాత్రలు చేస్తూ దేముడిని ఈ బాహ్యప్రపంచంలో వెతుకుతూ అదే కైవల్య ప్రాప్తి అని సంతోషపడేవారు లేకపోలేదు. 

దేముడు బయట లేడు : 

మనమందరం తెలుసుకోవలసింది దేముడు ఈ బాహ్య ప్రపంచంలో లేదు ఆ దేవదేవుడు కేవలం అంటే  కేవలం మన హృదయకుహరంలోనే వున్నారు. అంతేకాదు ఆ సత్యాన్ని తెలుసుకోవాలని ఉపనిషత్తులు గోషిస్తున్నాయి. విగ్రహారాధన, భజనలు, కీర్తనలవలన మోక్షం సిద్దించాడు. వాటివలన కేవలం అంతఃకరణ శుద్ధి ఏర్పడుతుంది.  కానీ పరమావధి అదికాదు ఆత్మజ్ఞాన సముపార్జనం మాత్రమే. దానికి నిత్యా సాధన అవసరం. 

గురువు నన్ను ఉద్ధరిస్తాడు: 

చాలామంది తనకు ఒక మంచి గురువు దొరుకుతాడని ఆయనే తనను ఉద్ధరిస్తాడని ఒక అపోహలో వున్నారు. లెండి మేల్కొనండి అది కేవలం భ్రమ మాత్రమే.  పూర్వం సత్గురువులు ఉండేవారేమో కానీ ఇప్పుడు మనం నివసిస్తున్న సమాజంలో మోక్షగాములు చాల అరుదు.  గురువులుగా చెప్పుకునేవారుకూడా పూర్తిగా ఐహికవాంఛలతో నిత్యం జీవిస్తున్నారు. వారే వారిని ఉద్దరించుకోలేకపోతే ఇక వారు మనలను ఎలా ఉద్ధరిస్తారు చెప్పండి. ఎవరికి వారే గురువులు అనుకోని శ్రీకృష్ణ భగవానుల గీతను, ఆదిశంకరుల బోధనలను (రచనలను) ఆధారంగా చేసుకొని సాధనచేయటమే  

మీ గురువు ఇక్కడే వున్నారు చుడండి 

సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం
అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం

పరమశివుని మొదలు, ఆది శంకరుల మధ్యగా, నా గురువులు వరకు ఉన్న గురు పరంపరకు వందనములు అని అని ఫై శ్లోకం చెపుతున్నది. ముందుగా ఆ దేవదేముడైన పరమశివుని మనస్సులో ప్రార్ధించి, తదుపరి గీతను బోధించి మన జీవితాలకు ఒక లక్ష్యాన్ని చూపిన శ్రీ కృష్ణ భగవానుణ్ణి స్తుతించి ఆ తరువాత మనకు ముక్తిమార్గన్నీ ప్రసాదించిన శ్రీ ఆదిశంకరుణ్ణిప్రార్ధించి మీ సాధన మొదలు పెట్టండి కాబట్టి ఇప్పుడు మీకు బౌతికంగా గురువు ఉండవచ్చు లేక లేకపోవచ్చు కానీ మనకు ఆది గురువు గారు ఆ పరమేశ్వరులే, తరువాత శ్రీ కృష్ణ భాగవానుల గీత అటుపిమ్మట శ్రీశంకరాచార్యులవారు వారు వ్రాసిన అనేక ఆధ్యాత్మిక గ్రంధాలుమనలను ముముక్షుకత్వం వైపు పయనించేలా చేస్తాయి. క్రింది క్రమంలో మన జీవితాన్ని గడిపితే మోక్షం కారతలామలకలం అవుతుంది.

వేదాన్నే అనుసరించండి,
స్వధర్మాన్ని పాటించండి
కోరికలతో కాక, ఫలితాలమీద ఆశ లేకుండా
కర్మలు చేయండి, ఆత్మజ్ఞ్యానం పొందండి
దేహమే నేను అనే బ్రాంతిని తొలగించుకోండి.
ఆదిశంకరులు మనకు చూపెట్టిన మార్గాన్ని అనుసరిస్తే మన జీవితం దన్యతనొండుతుంది. . గురువులకోసం వెంపర్లాడటం కేవలం మన అమూల్య సమయాన్ని వృధాచేసుకోవటం తప్ప వేరుకాదు. ఇప్పటి కాలంలో ఎవరో వచ్చి నిన్ను ఉద్ధరిస్తారనుకోవటం అంతశ్రేయస్కరం కాదు.  సాధకుడు ఎవరికోసం చూడడు, తన దారి తానూ చూసుకుంటాడు. మీకు మార్గదర్శనం చేయటానికి భగవానుల గీత, శంకర భగవతపాదుల అనేక వేదాంత రచనలు, అవే కాకుండా అనేక ఉపనిషత్తులు వున్నాయి. ప్రతి గ్రంధం అమూల్యమైనది. నిజానికి గీతలోని ఒక శ్లోకమే లేక శంకరాభగవతపాదుల "నిర్వాణ షట్కమో" చాలు ఒక సాధకుడు ముక్తి పొందటానికి. 

భగవంతుడు- ధనం 

ప్రస్తుత సమాజంలో మనం భగవంతుడు అనే భావనలో ఎక్కడికి వెళ్లినా అక్కడ ఏదో ఒకరూపంలో ధనసంబంధం మనకు కనపడుతుంది. గుడికి వెళితే పూజకు టికెట్, గురువుల వద్దకు( తమకు తాము సత్ గురువులని చెప్పుకునే వారి వద్దకు )  వెళితే దర్శనానికి టికెట్.  ఆ స్వాములవారు ఇంతదనం ఇస్తే పాదపూజకు అనుగ్రహిస్తారట, ఇంతదనం ఇస్తే ఆశీర్వదిస్తారట అనే మాటలు మనం తరచుగా వింటున్నాము. ప్రస్తుత కాలంలో బాబాల ప్రవ్రుత్తి ఒక వ్యాపారస్తుని ఆలోచనలకన్నా బిన్నంగా ఉందని నేను అనుకోను.  నిజానికి భగవంతునికి ధనానికి ఏమాత్రం సంబంధం లేదు.  ఎక్కడైతే ధనం అనే మాటవినపడదో అక్కడే భగవానులు  వుంటారు. అటువంటి ప్రదేశం చెప్పగలరా. స్మశానంలో ధనానికి ఏమాత్రం సంబంధం లేదు అని అనుకోని మీరు అక్కడకు వెళ్లి ధ్యానం చేయ ప్రయత్నించండి అక్కడకూడా మీకు ఏదో ఒక రూపంలో ధనాపేక్ష కనపడుతుంది. ధనం మూలం ఇదం జగత్ 

స్వా అనుభవం: 

ఒకసారి హిందూసమాజానికి చెందిన ఒక ఆధ్యాత్మిక సంస్థ ఒక సమావేశం పెడితే నేను వెళ్ళాను. అక్కడ ఇద్దరు స్వామీజీలు వచ్చారు. నేను వారికి ప్రణమిల్లి వారితో సంభాషించటం జరిగింది.  వారు సన్యసించినా కూడా  ఇంకా ఐహిక విషయాలను ప్రస్తావించటం నన్ను విస్మయపరిచింది.   కొందరు పీఠాధిపతులు రాజకీయ నాయకులకు ఆశీర్వాదాలు ఇచ్చి వారిని పరిపాలన పీఠాల మీద అధిరోహించాలని చూస్తున్నారనే వార్తలు కూడా మనం చూస్తున్నాము.  ఇవ్వన్నీ చూస్తుంటే కాషాయం కట్టుకున్నవారు ఎంతవరకు సర్వసంగపరిత్యాగులుగా వున్నారు అనే సందేహం కలుగుతుంది..  ఈ రోజుల్లో కొందరు బాబాల, స్టేగురువుల అవతారాలు యెత్తి వారికి వారే గురువులని, అవదూతలని, సాక్షాత్తు భగవంతుని స్వరూపులమని చెపుతూ అమాయకుల మూఢభక్తిని ఆధారంగా ధనార్జన చేస్తూ అనేక ఐహిక సుఖాలను అనుభవిస్తున్నారు.  కాబట్టి సాధకుడు చాలా జాగ్రత్తగా వుండాలిసిన అవసరము వున్నది.  మనం ఎవరిని విమర్శించనవసరం లేదు మన ఆధ్యాత్మిక అభ్యున్నతికి మనం పాటుపడితే చాలు. 

వంటరి పోరాటం: 

కళ్ళ ముందు రోజు మనం ఒక సత్యాన్ని చూస్తున్నాము కానీ దానిని మనం గమనించికూడా గమనించకుండా, గుర్తించకుండా ఉన్నట్లు మనలను మనం మోసం చేసుకుంటున్నామేమో అని అనుకుంటా.  ఈ ప్రపంచంలోకి రావటం వంటరిగానే అదే విధంగా నిష్క్రమించటము ఒంటరిగానే.  ఈ ప్రపంచం కేవలము కొంతకాలం మనకు ఆశ్రయాన్ని కలిపించే తాత్కాలిక విడిది.  ఆ విషయం ప్రతిక్షణం మనకు కనపడుతున్నది.  అయినా ఇక్కడ ఏదో సాధించాలని, ఏదో ఉద్దరించాలని ఇంకా సుఖాలను అనుభవించాలని, ఇంకా సంపాదించాలని, నేను, నా భార్య, నా కుటుంబం, నా ఇల్లు, నా వస్తువులు అని మన జీవితంలోని అమూల్య కాలాన్ని వృధాగా చేస్తున్నామేమో అని అనిపిస్తుంది.  ఇంకా ఇంకా ఏదోకావాలి ఏదో చేయాలి.  అని అనుకుంటాం కానీ మనకు కావలసింది కేవలం మోక్షం మాత్రమే నని దానికోసమే మనం సాధన చేయాలనీ మాత్రం అనుకోము.  ముముక్షువులారా ఇంకా ఆలస్యం చేయకండి ఇప్పుడు మోక్షమార్గం వైపు మీ గమనాన్ని ప్రారంభించండి.  తాత్కాలికం అర్ధరహితము, ఐహికము ఐన ఈ ప్రేపంచ వ్యామోహాలకు దూరంగా ఉండటానికి ప్రయతించండి. 

జీవించటం ఎలా: 


ఇంకా వుంది 




కామెంట్‌లు లేవు: