19, సెప్టెంబర్ 2021, ఆదివారం

మనిషిలోని సప్తధాతువులు. సప్తధాతువులు.

 రాజుగారు అంటే మనిషి. 


ఆయనకు ఏడుగురు కొడుకులు అంటే మనిషిలోని సప్తధాతువులు. 


కొడుకులు వేటకు వెళ్ళడమూ అంటే మనిషి జీవితాన్ని కొనసాగించడం.


*జీవితమే ఒక వేట. వేటే ఒక జీవితం. *


రాజ కుమారులు వేటాడిన ఏడు చేపలు అంటే 


మనిషికి ఉండే అరిషడ్ వర్గాలు ( అనగా 6 )


1.కామ 2.క్రోధ 3.లోభ 4.మోహ 5.మద 6.మాత్సర్యాలు 


వీటన్నిం టిని మనిషి సాధన చేసి ఎండగట్టవచ్చు.

అంటే పూర్తిగా నియంత్రించవచ్చు.

 


అందుకే కథలో ఆరు చేపలను ఎండగట్టినట్టు చెప్పారు. 


రాజుగారి కొడుకులు ఎండబెట్టిన ఏడు చేపల్లో ఒక చేప ఎండలేదు.


ఏమిటా చేప. అది మనస్సు  


దీన్ని జయించడం చాలా కష్టం. 


ఎంత ప్రయత్నించినా అది ఎండదు. 


మనస్సు అంటే ఏమిటి❓


మనస్సు అంటే సంకల్ప వికల్పాలు 


ఒకటి తీరుతుంటే మరొకటి మొలుచుకొస్తుంది.


మొలిచే కోరికలను తీర్చుకుంటూ పోతుంటే జీవితకాలం చాలదు.


కోరికలన్నింటిని జయించేసి మోక్షానికి వెళ్ళిపోవాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడుతుంటారు.


మోక్షానికి వెళ్ళాలనుకోవడం కూడా ఒక కోరికే.


 

ఆ కోరికను ఎండగడితే తప్ప మోక్షం రాదు. 


*ఈ చేప ఎండకుండా అడ్డు తగులుతున్నది ఏది❓

గడ్డిమేటు.* 


గడ్డిమేటు అంటే ఏమిటి❓


కుప్పపోసిన అజ్ఞానం.


గడ్డిమేటులా పేరుకుపోయిన అజ్ఞానాన్ని తొలగించా లంటే ఎలా❓


మామూలు గడ్డికుప్ప అయితే గడ్డిపరకలను పట్టి లాగీ, పీకి ఒకనాటికి ఖాళీ చేయవచ్చు.


కానీ అజ్ఞానం అలాంటిది కాదు. జ్ఞానాదాయ కమైన మాటలు ఎంత చెప్పినా, ఎన్ని చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా మనం చేత్తో గడ్డిపరకలను లాగినట్టే‼️


ఆ కుప్ప తరిగేది కాదు, తగ్గేది కాదు.


 

దాన్ని ఎంత ప్రయత్నించినా తగ్గించడం కష్టం.


మరి అది పోవాలంటే ఏం చేయాలి❓


ఆవు వచ్చి మేయాలి.


ఆవు ఎక్కడి నుంచి రావాలి. అసలు ఆవు అంటే ఏమిటి❓


ఆవు అంటే జ్ఞానం.


జ్ఞానం అనే ఆవు దొడ్లో ఎగబడి మేస్తే అజ్ఞానం అనే గడ్డికుప్ప ఒకనాటికి అంతరించి పోతుంది.


లేదూ… జ్ఞానాన్ని అగ్నికణంగా మార్చి గడ్డిమేటు మీద వేస్తే కాలి బూడిదవుతుంది.


అందుకే భగవద్గీతలో మన కర్మలు, వాటి ఫలితాలు జ్ఞానాగ్నిలో దగ్ధమైపోవాలని చెబుతాడు కృష్ణుడు

(జ్ఞానాగ్నిదగ్ధకర్మాణాం) 


జ్ఞానాన్ని అగ్నిగా మలుచుకోగలిగిన వాడు సిద్ధపురుషుడు, యోగ పురుషుడు మాత్రమే. 


 ఈ గోవును ఎవ్వరు మేపాలి. 


గొల్లడాడు మేపాలి. గొల్లవాడు అంటే ఎవరు❓


సమర్ధ సద్గురువు..

జగద్గురుడు.


జ్ఞానరూపమైన భగవద్గీతను లోకానికి ప్రసాదించిన కృష్ణుడు గొల్లవాడే కదా‼️


అర్జునుడు అనే దూడను అడ్డు పెట్టుకుని వేదం అనే ఆవు పాలు పిండి జ్ఞానరూపంగా మనందరికి ధారపోశాడు. 


ఇంత గొప్పపని చేయవలసిన ఈ గొల్లవాడు ఆ పని చేయలేదు.


ఏమిరా నాయనా‼️ఆవును ఎందుకు మేపలేదు అని అడిగితే అమ్మ అన్నం పెట్టలేదు అన్నాడు. 


ఇంతకీ ఆ గొల్లవాడికి అన్నం పెట్టాల్సిన అమ్మ ఎవరు❓


అమ్మల గన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ. ఆమెనే లోకం జగన్మాత అని కీర్తిస్తుంది.


ఈ జగన్మాత అన్నం పెట్టక పోవడం వల్ల గొల్లవాడి ఆకలి తీరలేదు. 


ఓ జగన్మాతా ఈ గొల్లవాడికి ఎందుకు అన్నం పెట్టలేదమ్మా అంటే ఆవిడ పిల్లవాడు ఏడ్చాడు అంది.


ఇంతకి ఆ పిల్లవాడు ఎవరు❓ఆర్తితో దైవానుగ్రహం కోసం అలమటించేవాడు. 


ఈ పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడు❓


వాడికి చీమ కుట్టింది. ఎక్కడిది చీమా❓దానికి ఇంకోపేరే సంసారం.


సంసారం అనే చీమ కుట్టినందుకు ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు.


ఆవులను మేపడానికి వచ్చే గొల్లవాడికన్నా ఆర్తితో దైవానుగ్రహం కోసం ఏడ్చే పిల్లవాడే ముఖ్యం కనుక ఆ పిల్ల వాడినే చూసుకుంది.

మరి గొల్లవాడు అమ్మ అన్నం పెట్టక పోవడం వలన తన విధిని నిలిపి వేసాడా? లేదు. 

అమ్మ ద్వారా తన పనిలో భాగమైన శిష్ట రక్షణను చేసుకున్నాడు.


చీమకుట్టినందుకు కథలో పిల్లవాడు ఏడ్చినట్టే సంసార బాధలు, ప్రపంచ బాధలు భరించలేక మనం కూడా ఏడుస్తున్నాం,


మనల్ని ఈ బాధలే చీమలై కుడుతున్నాయి. 


చీమలు పుట్టలోనే ఉంటాయి. ఏమిటీ ఈ పుట్ట❓


మనిషికి ఉండే సంసారం ఒక పుట్ట. 


*ఈ పరమార్థాన్ని చెప్పడం కోసమే జీవితంలోకి అడుగు పెట్టే ముందే ఈ గొప్ప విషయం తెలియాలనే సదుద్దేశంతోనే మన పెద్దలు ఈ కథను ప్రతి పిల్లవాడికి నూరిపోశేవారు.*


🌱🌱🌱🧘‍♀️🧘‍♀️🧘‍♀️🌱🌱🌱

కామెంట్‌లు లేవు: