19, సెప్టెంబర్ 2021, ఆదివారం

ఓ బాటసారీ! ఇది జీవిత రహదారి!

 అయిదింటికి అలారం లేపితే నిద్ర లేచి, లేచిన తరవాత అలారాన్ని నిద్రపుచ్చాను. గత ఐదేళ్లుగా పతంజలి పేస్టునే వాడుతూ మన ఆయుర్వేదాన్ని పతనమైపోకుండా కాపాడుతూ వస్తున్నాను. 


ఇలా హాల్లోకి రాగానే మూసుకుపోతున్న కళ్లు బలవంతాన తెరుస్తూ చేతిలో పొగలు కక్కుతున్న గ్లాసుతో కట్టుకున్నావిడ ప్రత్యక్షమైంది.


అరమోడ్పు కన్నులతో అందించింది కదాని అదేదో అమృతం అనేసుకోకండి.

అరచెక్క నిమ్మకాయీ, అరచెంచా తేనే కలిపిన అరగ్లాసు వేణ్ణీళ్లు. 


నాలాంటి కొవ్వెక్కిన వాళ్లందరి ఆరోగ్యానికీ వంతెన, మన మంతెనగారిచ్చిన సలహా అది. బానే పంజేస్తున్నట్టు అనుమానంగా ఉంది. 


ఇదివరకు రేమండ్ షాపులో బెల్టు కొన్న ప్రతిసారీ దానికుండే కన్నాలు కాకుండా, దాదాపుగా ఢిల్లీ అంతదూరంలో, బా...గా చివర్న మరో నాలుగైదు కన్నాలు పొడిపించడం మాలాంటి మధ్య వయస్‘కుల’సంప్రదాయం! 


అటువంటిది ఈమధ్య ఈ వేణ్ణీళ్లవీ మొదలెట్టాక ఇటు సౌతిండియా వైపుండే కన్నాల్లోనే పట్టేస్తోంది బెల్టు. హౌ స్వీటిటీజ్?


దాంతో అదే ఊపులో, మరింత ఉత్సాహంతో మొన్నొకరోజు తనలా ఆఫీసుకెళ్లగానే బీరువాలో తీరువగా మడతెట్టి దాచిన పురాతన వస్త్ర విశేషాలన్నింటినీ బయటకి తీశాను. అవన్నీ మనం ప్రభుదేవా సైజులో ఉన్నప్పుడు కొన్న పేంట్లు. నేనిలా ప్రభు సైజులోకి మారిపోగానే ఇక చేసేదేం లేక అరుంధతిలో పశుపతిలా ఇన్నాళ్లూ బీరువాలో పడున్నాయి. మళ్ళీ ఇన్నాళ్లకి విముక్తి. 


ఒక్కొక్కటీ తీసి నయానో, భయానో ఎక్కించడం, ‘ప్చ్’ అంటూ రెండు పెదాలూ విరవడం. ఆఖరికి మళ్ళీ అన్నిట్నీ మడతెట్టేసి సమాధిలో తోసెయ్యడం! 


‘సరే, ఈ ముచ్చటెన్నాళ్లో చూద్దాంలే బొమ్మాళీ’ అనుకుంటూ చేతికందిన బట్టలేసుకుని బీరువా మూసేశాను.


ఐదున్నర! మరోసారి ఫోను మోగకముందే బయల్దేరిపోవాలి. ఇంకా తూరుపు దిక్కు ఎర్రబడకుండానే ఘుమఘుమలాడే మైసూర్ శాండల్ పరిమళాలతో బయటపడ్డాను. చీకట్లో బైటకు రాగానే ‘బై’ చెప్తూ వాకిట్లో పాల పేకెట్లు కనబడ్డాయి. 


పేపరు కుర్రాడు పేపరు విసరడానికి నీళ్లెక్కడా కనబడక పోవడంతో నిరాశచెంది, దాన్ని మతాబా గొట్టంలా చుట్ట చుట్టేసి, తలుపు గడియలో దూర్చేసి, తరతరాలుగా తనకున్న పగను తీర్చుకున్నాడు.


ఇప్పుడది చదవాలంటే ముగ్గురు కావాలి. అటొకరూ, ఇటొకరూ సాగదీసి పట్టుకుంటే మూడోవాడికి చదవడం అవుతుంది. ఖర్మరా బాబూ!


అయినా కంప్యూటర్ వైరస్ నుంచి కరోనా వైరస్ దాకా ఫేస్‌బుక్‌లోనే సమాచారం వచ్చేస్తోంటే పేపరెందుకుటా, వంటింటి గూళ్లలో అడుగున వేసుకోడానిక్కాకపోతే?


మొత్తానికి కేసులన్నీ అయిపోయి కారు దగ్గరకి వచ్చి చూసేటప్పటికి టైమ్ ఎనిమిదయింది. 


ఇప్పుడు ఎగురుకుంటూ ఇంటికెళ్లాలి, 

పాడుకుంటూ స్నానం చెయ్యాలి, 

ఊదుకుంటూ టిఫిన్ చెయ్యాలి, 

టైమైపోతోందని తలబాదుకుంటూ డ్యూటీకెళ్లాలి. 


కార్మికులకి మెషిన్లో వేలెడితే వేలు కట్టైపోతుంది. 

మాకు మాత్రం తొమ్మిదింటికల్లా మెషిన్లో వేలెట్టకపోతే వేలకువేలు కట్టైపోతుంది. 


దానినే ‘భయో’మెట్రిక్ యంత్రమందురు. అందుకని తనకి ఫోన్ చేసి చెప్పేశాను.. ఆలస్యం చెయ్యకుండా టిఫిన్ రెడీ చేసుంచమని. 


‘నీళ్లేమంటున్నాయీ ఓ వదినా! చన్నీళ్లేమంటున్నాయీ ఓ వదినా!’ అనే ఎల్లారీశ్వరి పాటొకటి పాడుతూ అరట్యాంకుడు నీళ్లు అవలీలగా స్నానమాచరించి బయటికొచ్చాను. 


‘అసలా పాటేంటి? ఎలా గుర్తుంటాయవన్నీ?’ అంది సిగ్గుపడాలని ప్రయత్నిస్తూ. 


‘రేడియోలో చిన్నప్పుడు వినేవాళ్లం. అదీ ఇదీ అనిలేదు. అన్నీ గుర్తే! కూటికుప్పల సూర్యారావుగారు చెప్పే కుక్కకాటు వైద్యం దగ్గర్నుంచి, కొమాండూరి కృష్ణమాచార్యులు గారి వయొలిన్ కచేరీ దాకా ప్రతీదీ వినేవాళ్లం. అదన్నమాట సంగతి!’ అంటూ ఆఖరి దోశ ముక్కని పూర్తిగా నమలకుండానే బయల్దేరిపోయాను.


మా హాస్పిటల్‌కి కార్లో వెళ్లాలనుకోవడం, కాశీకి కాలినడకన వెళ్లడం రెండూ ఒకటే! రెండో దాంతో పుణ్యం వస్తుందో రాదో ఆ దేవుడెరుగు గానీ మొదటిదాంతో మాత్రం కావలసినంత ఇరిటేషనొస్తుంది.


ఆ పావుకిలోమీటరు దూరం గురించి గరుడ పురాణంలో కూడా రాశాడు. ఈమధ్యే చదివాను. అయితే వైతరణిని ఏ ఇబ్బందులూ లేకుండా దాటడానికి ఏవో చిట్కాలవీ ఉన్నాయి కానీ మా హాస్పిటల్ రోడ్డు దాటడానికి ఏ సలహాలూ రాయలేదందులో.


రోడ్డు మొదలే గ్లైకోడిన్ దగ్గుమందు సీసా మూతిలా నేరోగా ఉంటుంది. అదలా ముందుకు సాగి క్యారెట్ దుంపలా మరింత సన్నగా మారిపోతుంది. చివరాఖర్న మా హాస్పిటల్ సింహద్వారం దగ్గరకొచ్చేటప్పటికి చొక్కాలకుండే కాజాలా కాస్త జాగా మిగులుతుంది.


ఈ మధ్యలో..


ఇసకతో ఒక ట్రాక్టరు, దాని వెనకాల స్కూటర్ల మీద విసుగుతో నలుగురు డాక్టర్లు...


ఎడమవైపు మసీదులో చేసే నమాజు, కుడివైపు కార్లు రిపేరు చేసే గ్యారేజు...


‘ఇచ్చట జెరాక్సూ, ప్రాణమూ తీయబడును’ అనే బోర్డున్న బొట్టుపెట్టంత షాపూ...


మేకల్ని వేలాడదీసి ఉన్న నాలుగు మటన్ కొట్లు, యువతకి పాన్‍పరాగసంపర్కాన్ని ప్రసాదించే మూడు బేవార్సు కొట్లు...


సరే... నీకున్న శక్తినంతా ధారపోసి వీటన్నిటినీ దాటి వెళ్లావే అనుకో.... అక్కడ ఇద్దరు యంగండైనమిక్ అమ్మాయిలు పళ్లైనా తోముకోకుండా పరీక్ష అట్టలతో రోడ్డు మీదే షటిలాడుకుంటూ ఉంటారు. 


ఆవారా ఈవారా ఓ ముగ్గురు నలుగురు పిల్లపిశాచాలు చొక్కాలు పైకెత్తుకుని వాళ్లమ్మ ఎప్పుడు కడుగుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారనుకోండీ! అది ట్వంటీఫర్ బై సెవెన్ కనబడే దృశ్యం!


ఇంతోటి రాజ్ భవన్ రోడ్డులోకీ మా డాట్టర్లందరూ వోక్స్ వేగన్ వెంటోలూ, హోండా సిటీలూ, డిజైర్లూ వేసుకుని ఒచ్చేత్తారు. తీరా బండి ఏనాటికీ ముందుకి కదలకపోవడంతో ఏసీ వేసుకుని ఉష్షూ అంటూ విసుక్కుంటుంటారు.


పగలంతా ఇలా పగబట్టేసే రోడ్డు రాత్రవగానే మరో రాక్షసిలా మారిపోతుంది. దారిపొడవునా ఆరుబయట మంచాలేసుకుని వెన్నెల్నీ, నక్షత్రాల్నీ ఆస్వాదించేస్తూ, మా గుండెల్లో గునపాలు దించేస్తూ ఉంటారు.


మనం కానీ రాత్రప్పుడు ఏ కారో వేసుకుని, ఆ పడుకున్నోళ్లని చూడకుండా ఈలేసుకుంటూ స్పీడుగా వచ్చామో, మనం కూడా సల్మాన్ ఖాన్‌లా జైలూ, బెయిలూ ఆటాడుకుంటూ శేషజీవితం గడపాలి.


ఇక పెళ్లి భోజనాలవీ వచ్చాయో మన పని మిఠాయి కిళ్లీయే! ఆకుల మజ్జలో వక్కలా నలిపేస్తారు. సమర్త పేరంటాలైతే మరి చెప్పక్కర్లేదు. రోజుకొకరు అవుతూనే ఉంటారు.


గణేశ నవరాత్రులకి అంత చిన్న రోడ్డులోనే ఆరుగురు గణపతుల్ని పెడతారంటే అక్కడుండే వాళ్లందరూ ఎంత సఖ్యతతో ఏడుస్తున్నారో మనకర్ధమవుతుంది. నిమజ్జనాలప్పుడైతే ఆ విగ్రహంతోపాటు మనకీ అయ్యకోనేట్లో దూకెయ్యాలనిపిస్తుంది. 


ఇన్ని అవాంతరాల్నీ దాటుకుని బయోమెట్రిక్ మెషిన్ దగ్గరెళ్లగానే అది మాతో కాసేపు దొంగా పోలీసాట ఆడుతుంది. దాన్ని కూడా బతిమాలి, లొంగదీసుకుని మన నిజాయితీని నిరూపించుకునేటప్పటికి చావుతప్పి వేలుసొట్ట పడుతుంది!


ఓ బాటసారీ! ఇది జీవిత రహదారి!


........జగదీశ్ కొచ్చెర్లకోట

కామెంట్‌లు లేవు: