నారదుని పూర్వకల్పము
1-103-వ.వచనము
మహాత్మా! నేను పూర్వకల్పంబునం దొల్లిఁటి జన్మంబున వేదవాదుల యింటిదాసికిం బుట్టి, పిన్ననాఁడు వారలచేఁ బంపంబడి, యొక్క వానకాలంబునఁ జాతుర్మాస్యంబున నేకస్థల నివాసంబు సేయ నిశ్చయించు యోగిజనులకుం బరిచర్య సేయుచు.
మహా = గొప్ప; ఆత్మా = ఆత్మ కలవాడా; నేను = నేను; పూర్వ = ఇంతకు ముందటి; కల్పంబునన్ = కల్పములో; తొల్లిఁటి = పూర్వ; జన్మంబునన్ = జన్మలో; వేద = వేదము; వాదుల = చదువు వారి; ఇంటి = ఇంటిలో; దాసి = దాసి; కిన్ = కి; పుట్టి = జన్మించి; పిన్ననాఁడు = చిన్నతనమున; వారల = వారి; చేన్ = చేత; పంపంబడి = పంపబడి; ఒక్క = ఒక; వానకాలంబునన్ = వానాకాలమందు; చాతుర్మాస్యంబునన్ = చాతుర్మాస్యదీక్షలో {చాతుర్మాస్యము - యోగులు వర్షాకాలము 4 నెలలు ఒకే ప్రదేశమున ఉండు దీక్ష}; ఏక = ఒకే; స్థల = స్థలములో; నివాసంబున్ = నివాసము; సేయ = చేయుటకు; నిశ్చయించు = నిశ్చయించుకొన్న; యోగి = యోగుల; జనుల = సమూహమున; కున్ = కు; పరిచర్య = సేవ; సేయుచున్ = చేయుచు.
మహానుభావా! నేను గడచిన కల్పంలో గత జన్మలో ఒక దాసీపుత్రుణ్ణి. మా అమ్మ వేదవేత్తలైన వారి ఇంటిలో పని చేస్తూ ఉండేది. నన్ను చాతుర్మాస్యాలలో వానాకాలం నాలుగు నెలలూ ఒకే స్థానంలో నివాసం ఏర్పరచుకొనిన కొందరు యోగిజనుల సేవనిమిత్తమై వారు నియమించారు. ఆ పెద్దల ఆనతి శిరసా వహిస్తూ వారికి సేవ చేస్తూ ఉండేవాణ్ణి. ఆ మహానుభావులకు పరిచర్యలు చేసేవాణ్ణి.
1-104-క.కంద పద్యము
ఓటమితో నెల్లప్పుడుఁ
బాటవమునఁ బనులు సేసి బాలురతో నే
యాటలకుఁ బోక యొక జం
జాటంబును లేక భక్తి సలుపుదు ననఘా!
ఓటమి = భయభక్తుల; తోన్ = తో; ఎల్లప్పుడున్ = ఎప్పడూ; పాటవమునన్ = సామర్థ్యముతో; పనులు = పనులు; చేసి = చేసి; బాలుర = పిల్లల; తోన్ = తో; ఏ = ఏ; ఆటలు = ఆటలు; కున్ = కు; పోక = వెళ్ళకుండా; ఒక = ఒక; జంజాటంబును = బంధమును / తగులమును; లేక = లేకుండా; భక్తి = భక్తి; సలుపుదునన్ = చేయుచుంటిని; అనఘా = పాపములు లేనివాడా.
ఓ పుణ్యాత్ముడా! ఓర్పుతో నేర్పుతో భయభక్తులతో ప్రవర్తించేవాణ్ణి. తోటిపిల్లలతో ఆటపాటలకు పోకుండా, ఎటువంటి ఇతర సంబంధాలూ పెట్టుకోకుండా శ్రద్ధాభక్తులతో ఆ మహాత్ముల్ని కొలిచేవాణ్ణి.
1-105-క.కంద పద్యము
మంగళమనుచును వారల
యెంగిలి భక్షింతు వాన కెండకు నోడన్
ముంగల నిలుతును నియతిని
వెంగలి క్రియఁ జనుదు నురు వివేకముతోడన్.
మంగళము = శుభము; అనుచును = అంటూ; వారల = వారి; ఎంగిలి = ఎంగిలి; భక్షింతు = తినెదను; వాన = వాన; కున్ = కు; ఎండ = ఎండ; కున్ = కు; ఓడన్ = జంకను; ముంగల = ఎదుట; నిలతును = నిలిచెదను; నియతిని = నియమముతో; వెంగలి = తెలివిలేనివాని; క్రియన్ = వలె; చనుదున్ = చరించెదను; ఉరు = మిక్కిలి; వివేకము = వివేకము; తోడన్ = తో.
నే నా యోగిజనులు భుజించిన అనంతరం భిక్షాపాత్రలలో మిగిలి ఉన్న అన్నాన్ని భక్షించేవాణ్ణి: ఎండని, వానని లేకుండా వారి ముందు నిలబడి, ఎంతో జాగ్రత్తగా మారుమాటడకుండా వారి ఆజ్ఞలు పాలించేవాడిని.
1-106-వ.వచనము
ఇట్లేను వర్షాకాల శరత్కాలంబులు సేవించితి; వారును నా యందుఁ గృపసేసి రంత.
ఇట్లు = ఈవిధముగ; ఏను = నేను; వర్షాకాల = వానాకాలము; శరత్కాలంబులు = శరత్కాలములు; సేవించితిన్ = సేవించితిని; వారును = వారుకూడ; నాయందున్ = నాయందు; కృప = దయ; సేసిరి = చూపిరి; అంత = అంతట;
ఈ ప్రకారంగా వర్షాకాలం, శరత్కాలం గడచిపోయాయి. ఆ మహానుభావులకు నా మీద అనుగ్రహం కలిగింది.
1-107-శా.శార్దూల విక్రీడితము
వారల్ కృష్ణు చరిత్రముల్ చదువఁగా, వర్ణింపఁగాఁ, బాడఁగా,
నా రావంబు సుధారసప్రతిమమై యశ్రాంతమున్ వీనులం
దోరంబై పరిపూర్ణమైన, మది సంతోషించి నే నంతటం
బ్రారంభించితి విష్ణుసేవ కితరప్రారంభ దూరుండనై.
వారల్ = వారు; కృష్ణు = కృష్ణుని; చరిత్రముల్ = చరితములు; చదువఁగా = చదువుచుండగా; వర్ణింపఁగాన్ = వర్ణిస్తుండగా; పాడఁగాన్ = పాడుతుండగా; ఆ = ఆ; రావంబు = శబ్దము / రాగము; సుధా = అమృతపు; రస = రుచితో; ప్రతిమము = సాటిది; ఐ = అయి; అశ్రాంతమున్ = ఎడతెగక; వీనులన్ = చెవులలో; దోరంబు = బలిష్ఠము , అధికము; ఐ = అయి; పరిపూర్ణమైన = నిండిపోవ; మది = మనసున; సంతోషించి = సంతోషించి; నేను = నేను; అంతటన్ = అప్పుటినుండి; ప్రారంభించితిన్ = సంకల్పించితిని; విష్ణు = హరియొక్క; సేవ = భక్తి; కిన్ = కి; ఇతర = ఇతరమైన; ప్రారంభ = సంకల్పాలకి; దూరుండను = దూరమైనవానిని; ఐ = అయి.
ప్రాజ్ఞులైన ఆ బ్రహ్మజ్ఞులు శ్రీ కృష్ణుని కథలు చదువుతూ, హరి లీలలు వర్ణిస్తు హరినామ సంకీర్తనం చేస్తూ ఉండేవారు. అనుక్షణం ఆ పుణ్యాత్ముల నోటినుండి వెడలి వచ్చే ఆ పలుకులు అమృత రసప్రవాహాలై నా వీనులవిందు చేసేవి. నా హృదయం ఆనందంతో నిండిపోయేది. క్రమక్రమంగా నేను ఇతర విషయా లన్నింటికి స్వస్తి చెప్పి భగవంతుడైన హరిని ఆరాధించటం ఆరంభించాను.
1-108-వ.వచనము
ఇట్లు హరిసేవారతిం జేసి ప్రపంచాతీతుండ నై బ్రహ్మరూపకుండ నయిన నా యందు స్థూలసూక్ష్మం బయిన యీ శరీరంబు నిజ మాయాకల్పితం బని యెఱింగితి; యమ్మహాత్ము లగు యోగిజనుల మూలంబున రజస్తమోగుణ పరిహారిణి యయిన భక్తి సంభవించె; నంతఁ జాతుర్మాస్యంబు నిండిన నయ్యోగిజనులు యాత్ర సేయువార లై; రివ్విధంబున.
ఇట్లు = ఈవిధముగ; హరి = హరియొక్క; సేవా = భక్తియందలి; రతిన్ = ఆసక్తి; చేసి = వలన; ప్రపంచ = ప్రకృతికి; అతీతుండన్ = అతీతమైనవాడిని; ఐ = అయి; బ్రహ్మ = పరబ్రహ్మయొక్క; రూపకుండన్ = రూపము దాల్చినవాడను; అయిన = అయిన; నా = నా; అందున్ = అందలి; స్థూల = స్థూలమూ; సూక్ష్మంబు = సూక్ష్మమూ; అయిన = అయినట్టి; ఈ = ఈ; శరీరంబున్ = శరీరము; నిజ = తన; మాయా = మాయచే; కల్పితంబు = కల్పింపబడినది; అని = అని; ఎఱింగితిన్ = తెలిసికొన్నాను; ఆ = ఆ; మహా = గొప్ప; ఆత్ములు = ఆత్మగలవారు; అగు = అయినట్టి; యోగి = యోగుల; జనుల = సమూహము; మూలంబునన్ = వలన; రజస్ = రజోగుణము; తమోగుణ = తమోగుణముల; పరిహారిణి = పరిహరించునది; అయిన = అయినట్టి; భక్తి = భక్తి; సంభవించెన్ = కలిగినది; అంతన్ = అంతలో; చాతుర్మాస్యంబున్ = (వారి) చాతుర్మాస్య దీక్ష; నిండినన్ = పూర్తికాగా; ఆ = ఆ; యోగి = యోగుల; జనులు = సమూహము; యాత్ర = యాత్ర {యాత్ర - యోగుల నియమమును అనుసరించి ఏకస్థలమున ఉండరాదు కనుక వారు చేయు ప్రయాణములు.}; చేయువారలు = చేయువారు; ఐరి = అయినారు; ఈ = ఈ; విధంబునన్ = విధముగ;
అప్పుడు నాకు హరి సేవలో అమితమైన ఆసక్తి ఏర్పడింది. అందువల్ల నేను ప్రపంచాతీతుణ్ణి బ్రహ్మ స్వరూపుణ్ణి అయి, యట్టి నా యందు స్థూలం సూక్ష్మం అయిన ఈ శరీరం కేవలం మాయా కల్పితమని తెలుసుకున్నాను. మహానుభావులైన ఆ యోగీంద్రుల అనుగ్రహంవల్ల రజస్తమోగుణాలను రూపుమాపే అచంచల భక్తి నాకు సంప్రాప్తించింది. చాతుర్మాస్య వ్రతం అనంతరం ఆ మహాత్ములు మరొక ప్రదేశానకి వెళ్లటానికి ఉద్యుక్తులైనారు.
1-109-మ.మత్తేభ విక్రీడితము
అపచారంబులు లేక నిత్యపరిచర్యాభక్తి యుక్తుండనై
చపలత్వంబును మాని నేఁ గొలువఁగా సంప్రీతులై వారు ని
ష్కపటత్వంబున దీనవత్సలతతోఁ గారుణ్య సంయుక్తులై
యుపదేశించిరి నాకు నీశ్వరరహస్యోదారవిజ్ఞానమున్.
అపచారంబులు = తప్పులు / పొరపాట్లు; లేక = లేకుండ; నిత్య = ప్రతిదినము; పరిచర్యా = ఉపచారములు; భక్తి = భక్తి; ఉక్తుండను = కూడినవాడను; ఐ = అయి; చపలత్వంబును = చపలతను; మాని = మానివేసి; నేన్ = నేను; కొలువఁగా = ఆరాధించగా; సంప్రీతులు = సంతోషించినవారు; ఐ = అయి; వారు = వారు; నిష్కపటత్వంబునన్ = కపటత్వము లేకుండగను; దీన = దీనుల యెడ చూపెడి; వత్సలత = వాత్సల్యము; తోన్ = తో; కారుణ్య = దయ; సంయుక్తులు = తో కూడినవారు; ఐ = అయి; ఉపదేశించిరి = ఉపదేశించిరి; నాకున్ = నాకు; ఈశ్వర = హరియొక్క; రహస్య = రహస్యమైన; ఉదార = చక్కటి; విజ్ఞానమున్ = విజ్ఞానమును.
ఈ విధంగా ఎట్టి ఒడుదుడుకులూ రాకుండా, చాంచల్యం లేకుండా ముప్పూటలా భక్తితో ఆరాధించి నందుకు ఆ సాధుపుంగవులు సంప్రీతు లైనారు. ఎంతో సంతోష కారుణ్య వాత్సల్యాలతో అతిరహస్యము, అమోఘము అయిన ఈశ్వరవిజ్ఞానాన్ని ఆ మహాత్ములు నాకు ఉపదేశించారు.
1-110-వ.వచనము
ఏనును వారి యుపదేశంబున వాసుదేవుని మాయానుభావంబు దెలిసితి; నీశ్వరుని యందు సమర్పితం బయిన కర్మంబు దాపత్రయంబు మానుప నౌషధం బగు; నే ద్రవ్యంబువలన నే రోగంబు జనియించె నా ద్రవ్యం బా రోగంబు మానుప నేరదు; ద్రవ్యాంతరంబులచేత నైన చికిత్స మానుపనోపు; ఇవ్విధంబునఁ గర్మంబులు సంసార హేతుకంబు లయ్యు నీశ్వరార్పితంబు లై తాము తమ్ముఁ జెఱుపుకొన నోపి యుండు; నీశ్వరుని యందుఁ జేయంబడు కర్మంబు విజ్ఞానహేతుకం బై యీశ్వర సంతోషణంబును భక్తియోగంబునుం బుట్టించు; నీశ్వరశిక్షం జేసి కర్మంబులు సేయువారలు కృష్ణ గుణనామ వర్ణనస్మరణంబులు సేయుదురు; ప్రణవపూర్వకంబులుగా వాసుదేవ ప్రద్యుమ్నసంకర్షణానిరుద్ధ మూర్తి నామంబులు నాలుగు భక్తిం బలికి నమస్కారంబు సేసి మంత్రమూర్తియు మూర్తిశూన్యుండు నయిన యజ్ఞపురుషుం బూజించు పురుషుండు సమ్యగ్దర్శర్శనుం డగు.
ఏనును = నేనును; వారి = వారి; ఉపదేశంబునన్ = ఉపదేశమువలన; వాసుదేవుని = భగవంతుని {వాసుదేవుడు - ఆత్మలోవసించే దేవుడు}; మాయ = మాయ; అను = అనే; న్ = ను; తెలిసితిన్ = తెలిసికొంటిని; ఈశ్వరుని = భగవంతుని; అందున్ = ఎడ; సమర్పితంబు = సమర్పింపబడినది; అయిన = అయినట్టి; కర్మంబు = కర్మము; తాప = తాపములు {తాపత్రయములు - ఆధ్యాత్మికము, ఆధిభౌతికము, ఆధిదైవికము.}; త్రయంబు = మూడు; మానుపన్ = మానుపుటకు; ఔషధంబు = ఔధము / మందు; అగున్ = అగును; ఏ = ఏ; ద్రవ్యంబు = పదార్థము; వలనన్ = వలన; ఏ = ఏ; రోగంబు = రోగము; జనియించెన్ = పుట్టినదో; ఆ = ఆ; ద్రవ్యంబు = పదార్థమునకు; ఆ = ఆ; రోగంబున్ = రోగమును; మానుపన్ = మానుపుటను; నేరదు = చెయ్యలేదు; ద్రవ్య = పదార్థముకంటె; అంతరంబుల = ఇతరమైన వాటి; చేతన్ = చేత; ఐన = అయినట్టి; చికిత్స = వైద్యము; మానుపన్ = మాపునట్లు; ఓపు = చేయగలదు; ఈ = ఈ; విధంబునన్ = విధముగనే; కర్మంబులు = కర్మములు; సంసార = సంసారమునకు; హేతుకంబులు = కారణములు; అయ్యున్ = అయినప్పటికిని; ఈశ్వర = భగవంతునికి; అర్పితంబులు = సమర్పింపబడినవి; ఐ = అయి; తాము = తమను; తమ్మున్ = తమనే; చెఱుపుకొనన్ = నశింపచేసికొన; ఓపి = శక్తి కలిగి; ఉండున్ = ఉండును; ఈశ్వరుని = భగవంతుని; అందున్ = ఎడ; చేయంబడు = చేయబడు; కర్మంబు = కర్మమము; విజ్ఞాన = విజ్ఞానమునకు; హేతుకంబు = కారణము; ఐ = అయి; ఈశ్వర = భగవంతునికి; సంతోషణంబును = సంతోషమును; భక్తి = భక్తి; యోగంబునున్ = యోగమును; పుట్టించున్ = పుట్టించును; ఈశ్వర = భగవద్భక్తి వలన; శిక్షన్ = పొందిన నేర్పు; చేసి = వలన; కర్మంబులు = కర్మములు; చేయు = చేయు; వారలు = వారు; కృష్ణ = కృష్ణుని / భగవంతుని; గుణ = గుణములు; నామ = నామములను; వర్ణన = కీర్తించుటలు; స్మరణంబులు = జపించుటలు; చేయుదురు = చేయుదురు; ప్రణవ = ఓంకారము; పూర్వకంబులుగాన్ = ముందున్నట్టివిగా; వాసుదేవ = వాసుదేవ; ప్రద్యుమ్న = ప్రద్యుమ్న; సంకర్షణ = సంకర్షణ; అనిరుద్ధ = అనిరుద్ధ; మూర్తి = స్వరూపముల; నామంబులు = నామములు; నాలుగున్ = నాలుగును; భక్తిన్ = భక్తితో; పలికి = పలికి; నమస్కారంబున్ = నమస్కారము; చేసి = చేసి; మంత్ర = మంత్ర; మూర్తియు = స్వరూపుడును; మూర్తి = ఆకారము; శూన్యుండును = లేనివాడును; అయిన = అయినట్టి; యజ్ఞపురుషున్ = యజ్ఞపురుషుని; పూజించు = పూజించుచుండెడి; పురుషుండు = మానవుడు; సమ్యక్ = చక్కగా; దర్శనుండు = దర్శించినవాడు, తెలిసికొన్నవాడు; అగు = అగును.
దేవాదిదేవుడైన వాసుదేవుని మాయాప్రభావాన్ని నేను కూడా ఆ మహనీయుల మహోపదేశం వల్ల తెలుసుకున్నాను. తాపత్రయాన్ని రూపుమాపే పరమౌషధం ఈశ్వరార్పణం చేసిన కర్మమే. లోకంలో ఏ పదార్థం వల్ల రోగం ఉద్భవించిందో ఆ పదార్థం ఆ రోగాన్ని పోగొట్టలేదు. మరో పదార్థం చేత చికిత్స జరిగితేనే కాని ఆ రోగం శాంతించదు. ఈ ప్రకారంగా కర్మలు భవబంధ కారణాలే అయినప్పటికీ, ఈశ్వరార్పణం చేయటం మూలాన తమ అస్తిత్వాన్ని కోల్పోతాయి. పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి చేసే కార్యం విశిష్టమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అందువల్ల ఈశ్వరుడు సంతోషించి అచంచల భక్తిని అనుగ్రహిస్తాడు. భగవంతుని ప్రబోధం వల్ల కర్మలు కావించేవారు శ్రీ కృష్ణ గుణ నామాలను కీర్తించటంలో, సంస్మరించటంలో ఆసక్తులౌతారు. ఓంకారపూర్వకంగా వాసుదేవ, ప్రద్యుమ్న, సంకర్షణ, అనిరుద్ధ నామాలు నాలుగింటిని భక్తితో ఉచ్చరించి నమస్కరించి చిన్మయ స్వరూపుడైన యజ్ఞేశ్వరుణ్ణి ఆరాధించే మానవుడు సమ్యగ్దర్శనుడై సమదృష్టి కలవాడౌతాడు.
1-111-క.కంద పద్యము
ఏ నవ్విధమునఁ జేయఁగ
దానవకులవైరి నాకుఁ దనయందలి వి
జ్ఞానము నిచ్చెను మదను
ష్ఠానము నతఁ డెఱుఁగు నీవు సలుపుము దీనిన్.
ఏను = నేను; ఆ = ఆ; విధమునన్ = ప్రకారముగా; చేయఁగన్ = చేయగా; దానవకులవైరి = భగవంతుడు {దానవకులవిరోధి - దానవులందరికి శత్రువు, విష్ణువు}; నాకున్ = నాకు; తన = తన; అందలి = ఎడలి; విజ్ఞానమున్ = విజ్ఞానమును; ఇచ్చెను = ఇచ్చెను; మత్ = నాయొక్క; అనుష్ఠానమున్ = అనుష్ఠానమును; అతఁడు = అతడు; ఎఱుఁగు = తెలియును; నీవున్ = నీవు కూడా; సలుపుము = ఆచరింపుము; దీనిన్ = దీనిని.
నేనీ విధంగా ప్రవర్తించుటవల్ల విష్ణుభగవానుడు విశిష్టమైన ఈశ్వరజ్ఞానాన్ని నాకు అనుగ్రహించాడు. నా నడవడి ఆ శ్రీమన్నారాయణునికి తెలుసు. ఓ వ్యాసా! నీవు కూడా శ్రీహరిని సంకీర్తించు.
1-112-క.కంద పద్యము
మునికులములోన మిక్కిలి
వినుకులు గలవాఁడ వీవు విభుకీర్తులు నీ
వనుదినముఁ బొగడ వినియెడి
జనములకున్ దుఃఖమెల్ల శాంతిం బొందున్.
ముని = మునుల; కులము = వంశము; లోనన్ = లో; మిక్కిలి = ఎక్కువగ; వినుకులు = (అనేక విషయములను) వినుటలు; కలవాఁడవు = కలిగిన; వాఁడవు = వాడవు; ఈవు = నీవు; విభు = ప్రభు యొక్క / భగవంతుని; కీర్తులు = కీర్తనలు; నీవు = నీవు; అనుదినమున్ = ప్రతిదినమును; పొగడ = కీర్తించుచుండగ; వినియెడి = వినెడు; జనముల = మానవులు; కున్ = కు; దుఃఖము = దుఃఖము; ఎల్లన్ = సమస్తము; శాంతిన్ = శాంతిని; పొందున్ = పొందును.
వ్యాసా! నీవు మునులలో ఎంతో ప్రసిద్ధుడవు. వినేవారి దుఃఖాలన్నీ దూరమై వారి స్వాంతనాలకు శాంతి లభించేటట్లు, చక్కగా వాసుదేవుని కీర్తించుము.“
1-113-వ.వచనము
ఇట్లు నారదు జన్మకర్మంబులు విని క్రమ్మఱ వ్యాసుం డిట్లనియె.
ఇట్లు = ఈ విధముగ; నారదు = నారదుని; జన్మ = పూర్వజన్మ; కర్మంబులు = కర్మములు; విని = ఆలకించి; క్రమ్మఱన్ = మరల; వ్యాసుండు = వ్యాసుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
ఇలా నారదమహర్షి తన పుట్టు పూర్వోత్తరాలు వినిపించగా ఆలకించిన, వ్యాసముని నారదుణ్ణి మళ్లీ ఇలా ప్రశ్నించాడు.
1-114-మ.మత్తేభ విక్రీడితము
విను మా భిక్షులు నీకు నిట్లు కరుణన్ విజ్ఞానముం జెప్పి పో
యిన బాల్యంబున వృద్ధభావమున నీ కే రీతి సంచారముల్
సనె? నీకిప్పుడు పూర్వకల్పమతి యే జాడం బ్రదీపించెఁ? ద
త్తనువుం బాసిన చందమెట్లు? చెపుమా దాసీసుతత్వంబుతోన్.
వినుము = వినుము; ఆ = ఆ; భిక్షులు = యోగులు; నీకున్ = నీకు; ఇట్లు = ఈ విధముగ; కరుణన్ = దయతో; విజ్ఞానమున్ = విజ్ఞానమును; చెప్పి = తెలిపి; పోయిన = వెళ్ళిపోయిన; బాల్యంబున = బాల్యములో; వృద్ధ = పెద్ధవాడు / జ్ఞాని; భావమున = అయినప్పుడు; నీకు = నీకు; ఏ = ఏ; రీతి = విధమైన; సంచారముల్ = సంచరించుటలు; చనెన్ = జరిగెను; నీకు = నీకు; ఇప్పుడు = ఇప్పుడు; పూర్వ = పూర్వ; కల్ప = జన్మ; మతి = జ్ఞాపకములు; ఏ = ఏ; జాడన్ = మార్గమున; ప్రదీపించెన్ = ప్రకాశించెను; తత్ = ఆ; తనువున్ = శరీరమును; పాసిన = విడిచిన; చందము = విధము; ఎట్లు = ఏది; చెపుమా = చెప్పుము; దాసీ = దాసీ; సుతత్వంబు = పుత్రతత్వము; తోన్ = తో.
“ఆయ్యా! నీకు ఆ మహానుభావులైన సాధువులు ఎంతో దయతో ఈశ్వరజ్ఞానాన్ని ఉపదేశించి వెళ్లిపోయారు గదా. అటు పిమ్మట నీ బాల్యం ఎలా గడిచింది. పెద్దవాడ వయ్యాక ఎక్కడెక్కడ సంచరించావు. ఈ జన్మలో ఇప్పుడు నీకు పూర్వ జన్మస్మృతి ఏ విధంగా కలిగింది. దాసీవుత్రుడవైన నీవు ఏ విధంగా నీ దేహాన్ని త్యజించావు దయచేసి వివరించు.”
1-115-వ.వచనము
అని యిట్లు వ్యాసుం డడిగిన నారదుం డిట్లనియె "దాసీపుత్త్రుండ నయిన యేను భిక్షులవలన హరిజ్ఞానంబు గలిగి యున్నంత.
అని = అని; ఇట్లు = ఈ విధముగ; వ్యాసుండు = వ్యాసుడు; అడిగిన = అడిగిన; నారదుండు = నారదుడు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; దాసీ = దాసీ; పుత్త్రుండన్ = పుత్రుడను; అయిన = అయినట్టి; ఏను = నేను; భిక్షుల = భిక్షువులు; వలనన్ = వలన; హరి = హరియొక్క; జ్ఞానంబు = జ్ఞానము; కలిగి = కలిగి; ఉన్నంత = ఉండగ.
వ్యాసులవారి ప్రశ్నలకు నారదులవారు ఇలా సమాధానం చెప్పారు”ఆ విధంగా నేను ఆ సాధుపుంగవుల వల్ల ఈశ్వర పరిజ్ఞానాన్ని పొంది యున్నాను.
1-116-సీ.సీస పద్యము
మమ్ము నేలినవారి మందిరంబునఁ గల;
పనులెల్లఁ గ్రమమున భక్తిఁ జేసి
తన పరాధీనతఁ దలఁపదు; సొలసితి;
నలసితి నాఁకొంటి ననుచు వచ్చి
మాపును రేపును మా తల్లి మోహంబు;
సొంపార ముద్దాఁడు చుంచు దువ్వు
దేహంబు నివురు మోదించుఁ గౌఁగిటఁ జేర్చు;
నర్మిలి నన్నిట్టు లరసి మనుప
1-116.1-ఆ.
నేను విడిచి పోక యింట నుండితినయ్య,
మోహిఁగాక, యెఱుక మోసపోక
మాఱు చింత లేక మౌనినై యేనేండ్ల
వాఁడ నగుచుఁ గొన్ని వాసరములు.
మమ్ము = మా; ఏలినవారి = యజమానుల; మందిరంబునన్ = ఇంటిలో; కల = ఉన్న; పనులు = పనులు; ఎల్లన్ = అన్నియు; క్రమమున = పద్ధతిగ; భక్తిన్ = భక్తితో; చేసి = చేసి; తన = తన యొక్క; పరాధీనతన్ = దాస్యమును; తలఁపదు = తలుచుకొనదు; సొలసితిన్ = సోలిపోతిని; అలసితిన్ = అలసిపోతిని; ఆఁకొంటిన్ = ఆకలితో ఉంటినని; అనుచున్ = అనుకొనుచు; వచ్చి = వచ్చి; మాపును = రాత్రిని; రేపును = పగలును; మా = మాయొక్క; తల్లి = తల్లి; మోహంబు = మోహము; సొంపార = అతిశయించగా; ముద్దాఁడున్ = ముద్దాడును; చుంచు = జుట్టు; దువ్వున్ = దువ్వును; దేహంబున్ = దేహము; నివురున్ = నిమురును; మోదించున్ = తట్టును; కౌగిటన్ = కౌగిట్లో; చేర్చున్ = చేర్చుకొనును; అర్మిలిన్ = ఆపేక్షతో; నన్ = నన్ను; ఇట్టుల = ఈ విధముగ; అరసి = సాకి; మనుపన్ = పోషింపగ;
నేను = నేను; విడిచి = విడిచిపెట్టి; పోకన్ = వెళ్ళిపోక; ఇంటన్ = ఇంటిలో; ఉండితిని = ఉన్నాను; అయ్య = అయ్య; మోహిన్ = మోహి; కాక = కాకుండగ; ఎఱుకన్ = జ్ఞానముయందు; మోసపోకన్ = వంచింపబడక; మాఱు = మరొక; చింత = ఆలోచన; లేకన్ = లేకుండగ; మౌనిని = మౌనమువహించినవాడను; ఐ = అయ్యి; ఏను = ఐదు; ఏండ్లవాఁడన్ = ఐదుసంవత్సరములవాడిని; అగుచున్ = అగుచూ; కొన్ని = కొన్ని; వాసరములు = దినములు;
మా తల్లిది చాలా జాలిగుండె. ఉత్త అమాయకురాలు. తల వంచుకొని యజమానుల గృహాల్లో పనులన్నీ క్రమం తప్పకుండ చేసేది. తన దాస్యాన్ని గూర్చి కించిత్తు కూడా కించపడేది కాదు. నేనంటే ఆమెకు పంచప్రాణాలు. అయ్యో నా బిడ్డ అలసిపోయాడు. సొలసిపోయాడు, ఆకలి గొన్నాడు. అని అంటూ ప్రతిరోజూ అల్లారుముద్దుగా ఆదరించి నన్ను పెంచి పెద్దచేసింది. ఎంతో ప్రేమగా మాటిమాటికీ నా బుగ్గలు ముద్దుపెట్టుకొనేది. నా జట్టు దువ్వేది. నాఒళ్లు నిమిరేది. నన్ను ఆప్యాయంగా అక్కున చేర్చుకొనేది. ఈ విధంగా తల్లి ప్రేమతో పెరిగిన నేను ఆమెను విడిచి పోలేక ఇంట్లోనే ఉండిపోయాను. అయితే నేను సంసారవ్యామోహంలో చిక్కుబడలేదు. జ్ఞానాన్ని విడువలేదు. అయిదేళ్ళు వచ్చేదాక అలా మౌనిగ ఉన్నాను.
1-117-వ.వచనము
అంత.
అంత = అంతట.అప్పుడు.
1-118-క.కంద పద్యము
సదనము వెలువడి తెరువునఁ
జెదరక మాతల్లి రాత్రిఁ జీఁకటివేళన్
మొదవుం బిదుఁకగ నొకఫణి
పదభాగముఁ గఱచెఁ ద్రొక్కఁబడి మునినాథా!
సదనమున్ = ఇంటినుండి; వెలువడి = బయల్పడి; తెరువునన్ = దారిలో; చెదరక = బెదరక; మా = మా; తల్లి = తల్లి; రాత్రిన్ = రాత్రి; చీఁకటివేళన్ = చీకటిలో; మొదవున్ = ఆవుకు; పిదుఁకగన్ = పాలుపిండుటకు పోవుచుండగా; ఒక = ఒక; ఫణి = పాము; పదభాగమున్ = పాదమును; కఱచెన్ = కరచినది; త్రొక్కఁబడి = త్రొక్కబడి; మునినాథా = మునులలోశ్రేష్ఠుడా.
వ్యాసమహర్షీ! ఒకనాడు ఏమి జరిగిందంటే. మా అమ్మ రాత్రివేళ కటిక చీకటిలో ఆవు పాలు పిండటం కోసం ఇల్లు వదలి బయటికి వెళ్లింది. త్రోవలో ఆమె ఒకపామును త్రొక్కింది. ఆ సర్పం ఆమె పాదాన్ని కరచింది.
1-119-క.కంద పద్యము
నీలాయతభోగఫణా
వ్యాళానలవిష మహోగ్రవహ్నిజ్వాలా
మాలావినిపాతితయై
వ్రాలెన్ ననుఁ గన్నతల్లి వసుమతి మీఁదన్.
నీల = నల్లని; ఆయత = పొడవైన; భోగ = శరీరము; ఫణా = పడగలుగల; వ్యాళ = పాము; ఆనల = జఠరాగ్నిని పుట్టిన; విష = విషముయొక్క; మహా = మిక్కిలి; ఉగ్ర = భయంకరమైన; వహ్ని = అగ్ని; జ్వాలా = జ్వాలల; మాలా = మాలల వలన; వినిపాతిత = పడవేయబడినది; ఐ = అయి; వ్రాలెన్ = పడిపోయెను; ననున్ = నన్ను; కన్న = కన్నటువంటి; తల్లి = తల్లి; వసుమతి = భూమి; మీఁదన్ = మీద.
అత్యంత భయంకరమైన ఆ త్రాచుపాము కోరలలోని విషాగ్ని జ్వాలల వల్ల అమ్మ నేల మీద పడిపోయిది.
1-120-ఉ.ఉత్పలమాల
తల్లి ధరిత్రిపై నొఱగి తల్లడపాటునుఁ జెంది చిత్తముం
బల్లటిలంగఁ బ్రాణములు వాసినఁ జూచి కలంగ కేను నా
యుల్లములోన మోహరుచి నొందక సంగము వాసె మేలు రా
జిల్లె నటంచు విష్ణుపదచింత యొనర్పఁగ బుద్ధిఁ జేర్చుచున్.
తల్లి = తల్లి; ధరిత్రి = భూమి; పైన్ = మీద; ఒఱగి = పడిపోయి; తల్లడపాటునున్ = వణుకిపోవుటను; చెంది = చెంది; చిత్తమున్ = మనసు; పల్లటిలంగన్ = కలవరపడగా; ప్రాణములు = ప్రాణములను; పాసినన్ = వదలగా; చూచి = చూచియు; కలంగక = కలతపడక; ఏను = నేను; నా = నా; ఉల్లము = మనసు; లోనన్ = లోపల; మోహ = మోహపు; రుచిన్ = భావమును / లేశమును; ఒందక = పొందక; సంగము = బంధము; పాసె = తొలగినది; మేలు = మంచి; రాజిల్లెన్ = సిద్ధించెను; అట = అట; అంచున్ = అనుకొనుచు; విష్ణు = హరి; పద = పాద; చింత = భక్తి; ఒనర్పఁగన్ = చక్కచేయవలెనని; బుద్ధిన్ = బుద్ధిలో; చేర్చుచున్ = నిర్ణయించుకొనుచు.
అలా మా అమ్మ క్రిందపడి విలవిల తన్నుకొని వివశురాలై ప్రాణాలు వదిలింది. అప్పుడు నేను ఆ విషాదదృశ్యాన్ని చూసి ఏ మాత్రం కలవరపడకుండా, నాచిత్తం శోకాన్నిపొందకుండా, నిబ్బరించుకొని నిలబడ్డాను. ”మంచిది, బంధం తెగిపోయింది" అనుకొన్నాను. ఇక నాకు హరిచరణస్మరణమే అవశ్యకర్తవ్యమని నిర్ణయించుకొన్నాను.
1-121-వ.వచనము
ఉత్తరాభిముఖుండ నై యేను వెడలి జనపదంబులుఁ, బురంబులు, బట్టణంబులుఁ, గ్రామంబులుఁ, బల్లెలుఁ, మందలుఁ, గిరాత పుళిందనివాసంబులు, నుపవనంబులుఁ, జిత్రధాతు విచిత్రితంబు లయిన పర్వతంబులు, సమద కరికర విదళిత శాఖలు గల శాఖులును, నివారిత పథికజనశ్రమాతిరేకంబు లైన తటాకంబులు, బహువిధ విహంగ నినద మనోహరంబు లై వికచారవింద మధు పాన పరవశ పరిభ్రమద్భ్రమర సుందరంబు లైన సరోవరంబులు దాఁటి చనుచు; క్షుత్పిపాసాసమేతుండ నై యొక్క నదీహ్రదంబునఁ గ్రుంకులిడి శుచినై నీరుద్రావి గతశ్రముండనై.
ఉత్తర = ఉత్తదిక్కుకు; అభిముఖుండన్ = తిరిగినవాడిని; ఐ = అయి; ఏను = నేను; వెడలి = బయలుదేరి; జనపదంబులున్ = నగరములు; పురంబులున్ = పురములు; పట్టణంబులున్ = పట్టణములు; గ్రామంబులున్ = గ్రామములు; పల్లెలున్ = పల్లెటూళ్ళు; మందలున్ = మందలు (సంచార జాతుల వారి); కిరాత = కిరాతులయొక్క; పుళింద = పుళిందులయొక్క; నివాసంబులున్ = నివాసములు; ఉపవనంబులున్ = ఉద్యానవనములు; చిత్ర = చిత్రమైన; ధాతు = ఖనిజాలతో; విచిత్రితంబులు = విచిత్రములు; అయిన = అయినట్టి; పర్వతంబులు = పర్వతములు; సమద = మదమెక్కిన; కరి = ఏనుగు; కర = తొండములచే; విదళిత = విరవబడ్డ; శాఖలు = కొమ్మలు; కల = కలిగిన; శాఖులును = (కొమ్మలతోనుండేవి) చెట్లు; నివారిత = వారింపబడిన; పథికజన = బాటసారుల; శ్రమ = అలసటయొక్క; అతిరేకంబులు = విజృంభణలు / చెలరేగుటలు; ఐన = కలిగిన; తటాకంబులు = చెరువులు; బహువిధ = వివిధరకముల; విహంగ = పక్షుల; నినద = కలకలారావముతో / అరపులతో; మనోహరంబులై = మనోహరములై; వికచ = వికసించిన; అరవింద = పద్మముల; మధు = తేనె; పాన = తాగుటవలన; పరవశ = పరవశించి; పరిభ్రమత్ = తిరుగుచున్న; భ్రమర = తుమ్మెదలతో; సుందరంబులు = అందమైన; ఐన = అయినట్టి; సరోవరంబులు = సరస్సులు; దాఁటి = దాటుకొనుచు; చనుచున్ = వెళ్ళుచుండగ; క్షుత్ = ఆకలి; పిపాసా = దాహములుతో; సమేతుండను = కూడుకొన్నవాడను; ఐ = అయి; ఒక్క = ఒక; నదీ = నదియొక్క; హ్రదంబునన్ = మడుగులో; క్రుంకులిడి = స్నానముచేసి; శుచిని = శుభ్రపడినవాడను; ఐ = అయి; నీరు = నీరు; త్రావి = తాగి; గత = పోగొట్టబడిన; శ్రముండన్ = అలసటకలవాడను; ఐ = అయి.
అలా అనుకొన్న నేను ఉత్తర దిక్కుగా బయలుదేరి పల్లెలు, పట్టణాలు, నగరాలు, జనపదాలు, గ్రామాలు, పేటలు, భిల్లవాటికలు దాటుకొంటూ, ఆటవికుల నివాసాలు, పెద్ద కొమ్మల మహావృక్షాలు, బాటసారుల మార్గాయాసాన్ని పోగొట్టే తటాకాలు, నానావిధాలైన పక్షుల కలకలారావాలతో రమణీయమై, వికసించిన తామరపూలలోని మకరందాన్ని త్రాగి పరవశించి పరిభ్రమించే గండుతుమ్మెదలతో నిండిన సరస్సులు దాటుతూ ముందుకు సాగాను. అప్పుడు నాకు ఆకలి దప్పికా ఎక్కువయ్యాయి. ఒక యేటి మడుగులో శుభ్రంగా స్నానం చేసి నీరు త్రాగి నా మార్గాయాసాన్ని తగ్గించుకొన్నాను.
1-122-క.కంద పద్యము
సాలావృక కపి భల్లుక
కోలేభ లులాయ శల్య ఘూక శరభ శా
ర్దూల శశ గవయ ఖడ్గ
వ్యాళాజగరాది భయద వనమధ్యమునన్
సాలావృక = పెద్దతోడేళ్ళు; కపి = కోతులు; భల్లుక = ఎలుగుబంట్లు; కోల = అడవిపందులు; ఇభ = ఏనుగులు; లులాయ = అడవిదున్నలు; శల్య = ముళ్ళపందులు; ఘూక = గుడ్లగూబలు; శరభ = శరభమృగములు {శరభము - సింహములను తినే ఒక జాతి జంతువు}; శార్దూల = పెద్దపులులు; శశ = కుందేళ్ళు; గవయ = ఎనుబోతులు; ఖడ్గ = ఖడ్గమృగములు; వ్యాళ = పాములు; అజగర = కొండచిలువలు; ఆది = మొదలగువానితో; భయద = భయంకరమైన; వన = అడవి; మధ్యమునన్ = నడుమ.
తోడేళ్ళు, కోతులు, ఎలుగుబంట్లు, అడవివరాహాలు, ఏనుగులు, దున్నపోతులు, ఏదుపందులు, గుడ్లగూబలు, శరభమృగాలు, శార్దూలాలు, కుందేళ్లు, మనుబోతులు, ఖడ్గమృగాలు, క్రూరసర్పాలు, కొండచిలవలు నిండిన భయంకరారణ్యాల గుండా మళ్లీ ప్రయాణించాను.
1-123-వ.వచనము
దుస్తరంబులైన నీలవేణు కీచక గుల్మ లతాగహ్వరంబుల పొంత నొక్క రావిమ్రాని డగ్గఱఁ గూర్చుండి యే విన్న చందంబున నా హృదయగతుం బరమాత్మ స్వరూపు హరిం జింతించితి.
దుస్తరంబులు = దాటుటకు మిక్కిలి కష్టమైనవి; ఐన = అయినట్టి; నీల = నీలి; వేణు = వెదురు; కీచక = బొంగువెదురు; గుల్మ = పొదలు; లత = తీగలు; గహ్వరంబుల = పొదరిళ్ళ; పొంతన్ = ప్రక్కన; ఒక్క = ఒక; రావి = రావి; మ్రాని = మ్రానుకు; డగ్గఱన్ = దగ్గర; కూర్చుండి = కూర్చొని; ఏన్ = నేను; విన్న = వినిన; చందంబున = విధముగ; నా = నా; హృదయ = హృదయమున; గతున్ = ఉన్నవాడైన; పరమాత్మ = పరమాత్మయొక్క; స్వరూపు = స్వరూపముగలవాడైన; హరిన్ = హరిని; చింతించితిన్ = ధ్యానించాను.
దాట శక్యం కాని నీలితుప్పలు, వెదురు పొదరిండ్లు దగ్గరగా గల ఒక రావిచెట్టు కింద కూర్చున్నాను. నేను విన్న విధంగా నా హృదయంలో పదిలం చేసికొన్ని పరమాత్మ స్వరూపుడైన హరిని ధ్యానం చేశాను.