భీష్మపితామహుడు, ధర్మరాజుకు మానవజాతికి ఆవశ్యకాలైన సామాన్య ధర్మాలు, వర్ణాశ్రమ ధర్మాలు, అనురాగ వైరాగ్యాలకు సంబంధించిన ప్రవృత్తి నివృత్తి ధర్మాలు, దాన ధర్మాలు, రాజ ధర్మాలు, స్త్రీ ధర్మాలు భగవంతునికి ప్రియమైన భాగవత ధర్మాలు, , చతుర్విధ పురుషార్థాలైన ధర్మార్థ కామ మోక్షాలు, నానావిధాలైన ఉపాఖ్యానాలు, ఇతిహాసాలు కొన్ని సంక్షేపంగా కొన్ని వివరంగా చెప్పాడు.
ఆ తర్వాత శ్రీ కృష్ణపరమాత్మపై దృష్టినిలిపి ఆయనను స్తుతిస్తూ భీష్ముడు ఇలా అన్నాడు.....
"త్రిజగన్మోహన నీలకాంతిఁ దను వుద్దీపింపఁ, బ్రాభాత నీ
రజబంధుప్రభమైన చేలము పయిన్ రంజిల్ల, నీలాలక
వ్రజ సంయుక్త ముఖారవింద మతిసేవ్యంబై విజృంభింప, మా
విజయుం జేరెడు వన్నెలాఁడు మది నావేశించు నెల్లప్పుడున్.
***
హయరింఖాముఖ ధూళి ధూసర పరిన్యస్తాలకోపేతమై,
రయజాతశ్రమ తోయబిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో,
జయముం బార్థున కిచ్చువేడ్క, నని నాశస్త్రాహతిం జాల నొ
చ్చియుఁ బోరించు మహానుభావు మదిలోఁ జింతింతు నశ్రాంతమున్.
***
“ముల్లోకాలకు సమ్మోహనమైన నీలవర్ణ కాంతులతో నిగనిగలాడే మనోహరమైన దేహం గలవాడు; పొద్దుపొడుపు వేళ వెలుగులు చిమ్ముతున్న బాలభానుని ప్రభలతో మెరిసిపోతున్న బంగారు వస్త్రం ధరించువాడు; నల్లని ముంగురులు కదలాడుతుండే వాడు; ముద్దులు మూటగట్టుతున్న ముఖపద్మం కలవాడు; మా అర్జునుణ్ణి విజయుణ్ణి చేస్తు చేరి ఉండే అందగాడు; అయిన శ్రీకృష్ణ భగవానుడు నా మదిలో నిరంతరం నిలిచిపోవాలి.
**
గుఱ్ఱాల కాలిగిట్టల వల్ల రేగిన ధూళితో దుమ్ముకొట్టుకుపోతున్నా; ముంగురులు చెదిరి పోతున్నా; అధికమైన రథ వేగానికి అలసట చెంది ఒళ్ళంతా చెమట్లు కారుతున్నా; ముచ్చటైన ముఖమంతా ఎఱ్ఱగా అవుతున్నా; నా శస్త్రాస్త్రాలు తగిలి ఎంత నొప్పెడుతున్నా లెక్క చెయ్యకుండా అర్జునుడికి విజయాన్ని చేకూర్చాలనే ఉత్సాహంతో అతనిని ప్రోత్సహిస్తు యుద్ధం చేయిస్తున్న మహానుభావుడు శ్రీకృష్ణపరమాత్మని నా మనస్సులో నిరంతరం ధ్యానిస్తుంటాను.
🏵️పోతన పద్యం🏵️
🏵️సత్యతత్వావిష్కరణం🏵️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి