22, ఫిబ్రవరి 2025, శనివారం

Panchaag


 

అధిక ఫలాన్నిచ్చే దానం

 🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯

  *అధిక ఫలాన్నిచ్చే దానం*

🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯

*అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న’ అంటారు.* 


*‘దానం’ అంటే త్యాగం. వస్త్రదానం, విద్యాదానం, జ్ఞానదానం, సంపదల దానం... ఇలా దానం అనేక రూపాల్లో ఉంటుంది. గృహాలనూ, కుటుంబాలనూ వదిలి, ధర్మాన్ని పంచడం కోసం భిక్షువులు అహరహం శ్రమిస్తారు. సమాజానికి కావలసిన జ్ఞానాన్ని అందిస్తారు. అంతకుమించి, సమాజం నైతిక మార్గంలో నడిచేలా చూస్తారు. కాబట్టి సమాజ హితం కోసం తమ జీవితాన్ని త్యాగం చేసిన భిక్షువులను ఆదుకోవలసింది ఆ సమాజమే! అది సమాజ బాధ్యత కూడా.*


*భిక్షువులకు హంసతూలికా తల్పాలు అవసరం లేదు. విలాసవంతమైన భవనాలతో పని లేదు. బంగారు రత్నాభరణాలతో నిమిత్తం లేదు. సుష్టుగా తినేంత షడ్రసోపేతమైన భోజనం కూడా అక్కర్లేదు. అతి సాధారణ భోజనం చాలు. జీవించడానికి, కాలినడకన తిరుగుతూ ధర్మోపదేశం చేయడానికి తగినంత ఆహారం చాలు.*


*ఒకనాడు బుద్ధుడు కొలియుల రాజ్యంలోని పజ్జనికం అనే పట్టణం సమీపంలో ఉన్నాడు. ఆ పట్టణంలో ఎందరెందరో బుద్ధుణ్ణి తమ ఇళ్ళకు భిక్ష కోసం ఆహ్వానించారు. అయితే, వారిలో ఎంతో గౌరవంతో, అణకువతో అహ్వానించింది ఒక కొలియ పుత్రిక సుప్రవాస. ఆమె స్వయంగా అనేక రకాల పదార్థాలు తయారు చేసింది. భక్తిభావంతో బుద్ధునికి సమర్పించింది. వాటినుంచి తగినంత ఆహార పదార్థాల్నే తథాగతుడు స్వీకరించాడు.*


*భోజనానంతరం ధర్మోపదేశం చేశాడు. ఉపదేశం చివరిలో-*

*‘‘అమ్మా! సుప్రవాసా! ఈ రోజు నీవు అన్నాన్ని దానం చేశావు. నీవు చేసిన ఈ అన్నదానం నాలుగు రకాలుగా మేలు చేస్తుంది.*


*ఒకటి: అన్నం మనిషికి ఆయువును ఇస్తుంది. కాబట్టి అన్నదాత ‘ఆయుభాగిని’ అవుతుంది.*


*రెండు: అన్నం మనిషికి అందాన్ని ఇస్తుంది. శరీరం ఎముకల గూడు కాకుండా... వికార రూపం నుంచి కాపాడుతుంది. కాబట్టి అన్నదాత ‘వర్ణభాగిని’ అవుతుంది.*


*మూడు: అన్నం ఆకలి బాధను తీర్చి, సుఖాన్ని ఇస్తుంది. కాబట్టి అన్నదాత ‘సుఖభాగిని’ అవుతుంది.*


*నాలుగు: అన్నం నీరసం నుంచి కాపాడి... శరీరానికి బలాన్ని ఇస్తుంది. కాబట్టి  అన్నదాత ‘బలభాగిని’ అవుతుంది.*


*ఒక్క అన్నదానం చేసిన ఈరోజు నీవు నాలుగు దానాలు చేసిన ఫలాన్ని పొందావు. రుజువర్తన కలవారికి, జ్ఞానులకు ఇలాంటి దానం చేస్తే మహాఫలప్రదమనే విశ్లేషణ ఉంది’’ అన్నాడు.*


*అక్కడికి చేరి, బుద్ధుని దివ్యోపదేశం విన్నవారు. దానం వల్ల... ప్రధానంగా అన్నదానం వల్ల కలిగే మహాఫలం గురించి తెలుసుకున్నారు. తమలో ఉన్న లోభ బుద్ధిని వదులుకున్నారు. సుప్రవాసను శ్లాఘించారు.*


*అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే !*

*జ్ఞానవైరాగ్య సిద్యర్థం భిక్షాందేహి చ పార్వతి !!*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*

*ఓం నమః శివాయ!!!*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

శ్రీమద్ భాగవతం

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

              *(59వ రోజు)*

 *(నిన్నటి భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*కొంగ, గ్రద్ద రూపాల్లో వశిష్ఠ విశ్వామిత్రుల పోరాటాన్నే కాదు, హరిశ్చంద్రుని గురించి కూడా మరింత విపులంగా తన భాగవతంలో ఇలా చిత్రించాడు వ్యాసుడు.*


*సంతానలేమితో హరిశ్చంద్రుడు బాధపడుతుంటే అతన్ని నారదుడు కలిశాడు. సంతానం కోసం వరుణ దేవుణ్ణి ప్రార్థించమని చెప్పాడు. నారదుడు చెప్పినట్టే చేశాడు హరిశ్చంద్రుడు. వరుణ దేవుణ్ణి ప్రార్థించాడు. తనకు కొడుకు పుడితే ఆ బాలుణ్ణి పశువుగా తలచి, నరమేధంతో వరుణదేవుణ్ణి అర్చిస్తానని ప్రమాణం కూడా చేశాడు. వరుణదేవుడు అనుగ్రహించాడు. కొడుకు పుట్టాడు హరిశ్చంద్రునికి. అతని పేరు రోహితుడు. కొడుకు ముద్దుముచ్చట్లు చూస్తూ వరుణదేవునికి ఇచ్చిన మాటనూ, యాగాన్నీ మరచిపోయాడు హరిశ్చంద్రుడు. వరుణుడు వచ్చి అడిగినా ఏదో సాకు చెప్పి, యాగనిర్వహణను తప్పించుకోసాగాడు. ఇంతలో తనని బలిపశువుని చేసి, తండ్రి యాగం చేయనున్నాడనే సంగతి రోహితుడికి తెలిసింది. ప్రాణభయంతో ఆ పిల్లాడు అరణ్యాల్లోకి పారిపోయాడు.*


*రోహితుని జాడ తెలియకపోవడం, హరిశ్చంద్రుడు యాగాన్ని నిర్వహించకపోవడంతో వరుణదేవునికి కోపం వచ్చింది. ‘మహోదరం’ వ్యాధితో బాధపడమని హరిశ్చంద్రుని శపించాడతను.*


*బాధపడసాగాడు హరిశ్చంద్రుడు. తన కారణంగా తండ్రి రోగగ్రస్తుడయ్యాడని తెలిసి, రోహితుడు అయోధ్యకు బయల్దేరాడు. దోవలో వృద్ధ బ్రాహ్మణుని రూపంలో అతన్ని సమీపించాడు ఇంద్రుడు. విషయం అంతా తెలుసుకుని ఇలా ఉపదేశించాడు. ఓ ఏడాదిపాటు భూపర్యటనలో భాగంగా తీర్థయాత్రలు చేస్తే మేలు జరుగుతుందన్నాడు. రోహితుడు అలాగే చేశాడు. ఏడాది పాటు సర్వ తీర్థాలూ సేవించి, అయోధ్యకు బయల్దేరాడు.*


*మళ్ళీ వృద్ధ బ్రాహ్మణుని రూపంలో ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. తెలియనట్టుగా మళ్ళీ అంతా అడిగి తెలుసుకున్నాడు. తెలుసుకుని, మళ్ళీ మరో ఏడాదిపాటు ముందు చేసినట్టుగానే భూపర్యటన చేయమన్నాడు. రెండింతలుగా మేలు జరుగుతుందన్నాడు. అలాగే చేశాడు రోహితుడు. ఇంద్రుని ఆదేశానుసారం అలా ఆరేళ్ళు దేశసంచారంలో గడిపాడు రోహితుడు.*


*ఆఖరికి ఆరవ ఏడు చివరి రోజుల్లో అజీగర్తుని కుమారుడు శునశ్శేపునితో అయోధ్యలో అడుగు పెట్టాడతను. శునశ్శేపుణ్ణి తండ్రికి సమర్పించి, అతనిని యజ్ఞపశువుని చేసి యాగాన్ని చెయ్యమన్నాడు రోహితుడు. హరిశ్చంద్రుడు అలాగే చేశాడు. వరుణుని తృప్తిపరిచాడు. మహోదరవ్యాధి నుండి బయటపడ్డాడు.*


*హరిశ్చంద్రయజ్ఞానికి బ్రహ్మాదిదేవతలు విచ్చేశారు. మునులూ, మహామునులు కూడా వేంచేశారు. హరిశ్చంద్రుని సత్యనిష్ఠను మెచ్చి, విశ్వామిత్రుడు అతనికి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించాడు. దాంతో హరిశ్చంద్రుడు బ్రహ్మజ్ఞాని అయి, రాజ్యసంపదలు త్యజించి తపోవనాలకు తరలిపోయాడు. కొన్నాళ్ళకు భౌతికదేహాన్ని వీడి, పరమపదం అందుకున్నాడు.*


*సగరుడు:~*


*హరిశ్చంద్రుని కుమారుడు రోహితునకు జంపుడు జన్మించాడు. జంపుని కుమారుడు సుదేవుడు. అతనికి విజయుడు, విజయునికి రురుకు, అతనికి వృకుడు వరుసుగా జన్మించారు.*


*వృకుని కుమారుడు బాహుకుడు. ఆ బాహుకుని కుమారుడే సగరుడు. సూర్యవంశానికి వన్నె తెచ్చిన చక్రవర్తుల్లో సగరుడు ఒకడు.*


*తన రాజ్యాన్ని హైహయులు చేజిక్కించుకున్న మరుక్షణం భార్య సమేతంగా బాహుకుడు అడవులకు తరలిపోయాడు. అక్కడే మరణించాడతను. భర్తతో పాటు భార్య సహగమనానికి సిద్ధపడింది. అయితే అప్పుడామె గర్భవతి. ఆ కారణంగా సహగమనం చేయరాదని ముని ఔర్వుడు వారించాడామెను. తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళి ఆదరించసాగాడు.*


*కడుపులో బిడ్డతో ఔర్వుని ఆశ్రమంలో తలదాచుకున్న బాహుకుని భార్యనూ, ఆమె బిడ్డనూ బతకనీయరాదనుకున్నారు ఆమె సవతులు. ఎట్టి పరిస్థితుల్లోనూ బిడ్డను కనరాదని, గరళాన్ని కలిపిన ద్రవాన్ని ఆమె చేత తాగించారు. సంగతి తెలుసుకున్న ఔర్వుడు ఆమె గర్భాన్ని కాపాడాడు. శిశువు మరణించకుండా చూశాడు.*


*ప్రసవించిందామె. కుమారుణ్ణి కన్నది. గరంతో అంటే గరళంతో జన్మించాడు కాబట్టి ఆ పిల్లాడిని ‘సగరుడు’ అన్నారు. పెరిగి పెద్దవాడయ్యాడు సగరుడు. శస్త్రాస్త్రవిద్యలన్నీ సునాయసంగా నేర్చాడు. శత్రురాజుల్ని ఓడించి, తండ్రి పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి సంపాదించాడు. చక్రవర్తిగా భూమండలాన్ని పాలించసాగాడు.ఎన్నో యజ్ఞయాగాదులు చేసి, విష్ణుమూర్తిని ఆరాధించాడు సగరుడు. అనేక అశ్వమేధాలు కూడా చేశాడు.*


*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం )*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

ఆచరించ వలసిన విధులు*

 🌹🌷🪷🪔🛕🪔🪷🌷🌹

*భక్త జనులందరు తెలుసుకొని* 

*ఆచరించ వలసిన విధులు*


*సనాతన హిందూ సాంప్రదాయాలు ఆచరిద్దాం పాటిద్దాం.*

మంచి విషయాన్ని పది మందికి పంచుదాం. 

*మన సంస్కృతీ సాంప్రదాయాలను మన పిల్లలకు, భావితరాల వారికి చేరవేద్దాం.*

 

             *ఆలయాల్లో*

               *తీర్థం* 🤔

       *ఎలా తీసుకోవాలి..?* 

                 

*ఆలయంలో తీర్థం ఎలా తీసుకోవాలి. తీర్థం తీసుకున్నాక తలపై చేతితో ఎందుకు రాయొద్దు..?*


తీర్థం యొక్క విశిష్టత ఏమిటి అనేది మనం తప్పక తెలుసుకోవాలి!


గుడి అంటే వెంటనే మనకు గుర్తుకు వచ్చేది తీర్థ ప్రసాదాలు. తీర్థం అంటే ప్రధానం, దేవుడి అభిషేక ద్రవ్యం, దానికి కొన్ని ఇతర పదార్థాలను జతచేసి భక్తులకు ఇస్తారు.


*శివుడికి, లేదా శ్రీ మహావిష్ణువుని సాలగ్రామ శిలలకు... రుద్ర నమక చమకాలతో, పురుష సూక్తం, పంచసూక్తం మొదలైన మంత్రములతో స్నానం చేయించిన జలమును అర్ఘ్యపాద్య ఆచమనములు భగవానునకు పూజచేయు వేళ సమర్పించి తరువాత ఆ జలమును పవిత్ర గ్రహపాత్ర యందువుంచి, స్నానము చేసిన జలము కుడా కలిపి (తులసీదళ సహితమై, పవిత్రమునూ, పాపహరమునూ అగునీరము, తీర్థము అనబడును)ఇస్తారు.*


శివాలయంలో అయితే అభిషేకం చేసిన నీటిని లేదా పంచామృతాన్ని ఇస్తారు.


ఈ తీర్థమును అర్చన పూర్తి అయిన వెంటనే ముందుగా అర్చక స్వామి తీసుకుని తర్వాత తన్మయులైన వారికి, సన్యసించిన వారికినీ, అధ్యాపకులకూ యజమానులైన ధర్మకర్తలకునూ ఆ తర్వాత భక్తులకు వరుసగా ఇవ్వడం జరుగుతుంది.


తీర్థమును ఎలా తీసుకోవాలి 

అనే ప్రశ్నకు సమాధానం, మగవారు తన భుజంపై ఉన్న ఉత్తరీయం లేదా కండువాను, ఆడవారు తమ చీర లేదా చున్ని, పైట కొంగును ఎడమ చేతిలో నాలుగు మడతలు వచ్చే విధంగా వేసుకోవాలి. ఎడమ చేతిలో ఉన్న గుడ్డ మడతలో కుడి చేతిని ఎడమ చేతిలో వేసి చూపుడువేలు ఏ మాత్రం తగలకుండా బ్రొటన వేలును నడిమి వ్రేలి క్రింద కణుపునకు పెట్టి గట్టిగా నొక్కి పట్టి *తీర్థం క్రింద పడనీయకుండా నోటి శబ్దం రాకుండా ఓం అచ్యుత, అనంతా, గోవిందా అనే నామాలను స్మరిస్తూ భక్తిశ్రద్ధలతో వినమ్ర పూర్వకంగా త్రాగాలి.*```


తీర్థం త్రాగిన తర్వాత కుడి చేతిని తలపై రాసుకోవద్దు


తలపైన బ్రహ్మదేవుడు ఉంటాడు. మన ఎంగిలిని బ్రహ్మకు అర్పణం చేసిన వారమవుతాం.


తీర్ధం త్రాగునప్పుడు జుర్రుమని శబ్దం రానీయకుండా తాగాలి.


తీర్థాన్ని మూడుసార్లు తీసుకోవాలి‌.


అలా మూడు సార్లు ఎందుకు తీసుకోవాలనే విషయం చాలామందికి తెలియదు.


1).మొదటిసారి తీర్థం 

   శారీరక, మానసిక                         

   శుద్థి జరుగుతుంది.


2).రెండోసారి తీర్థం 

   న్యాయ ధర్మ ప్రవర్తనలు 

   చక్కదిద్దుకుంటాయి.


3).మూడోది పవిత్రమైన 

   పరమేశ్వరుని పరమ 

   పదం అనుకుంటూ 

   తీసుకోవాలి.

    

    **తీర్థాల రకాలు:-*


1). జలతీర్ధం

2). కషాయ తీర్ధం

3). పంచామృత తీర్ధం

4). పానకా తీర్ధం```


*1. జల తీర్ధం:-*``` 

ఈ తీర్ధం సేవించడం ద్వారా అకాల మరణం, సర్వ రోగాలు నివారించ బడుతాయి. అన్నికష్టాలు తొలగి ఉపశమనాన్ని ఇస్తాయి. బుద్ధి అధర్మం వైపు పయనించకుండా అడ్డుపడుతుంది.```


*2). కషాయ తీర్ధం:-*```

ఈ తీర్ధం కొల్హాపురంలోని 

శ్రీ మహాలక్ష్మి దేవాలయం, కొల్లూరు  ముకాంబిక దేవాలయం, హిమాచలప్రదేశ్ లోని జ్వాలా మాలిని దేవాలయం, అస్సాంలోని శ్రీకామాఖ్య దేవాలయములో ఇస్తారు.

రాత్రి పూజ తరువాత తీర్థమును కషాయం రూపంలో పంచుతారు. వీటిని సేవించటం ద్వారా కనికనిపించని రోగాలు త్వరలో నయం అవుతాయి.```


*3).    *పంచామృత* 

         *అభిషేక తీర్థం:* 


పంచామృత సేవనం ద్వారా...                    చేపట్టిన అన్ని పనులు దిగ్విజయంగా పూర్తి కావటం మరియు బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది.```


*4) *పానకా తీర్ధం*


శ్రీ మంగళగిరి నరసింహస్వామి దేవునికి, అహోబిలం నరసింహ దేవునికి పానకం నైవేద్యంగా పెట్టడంతో పానకాల స్వామి పానకాల నరసింహస్వామి దేవునిగా ఖ్యాతినార్జించారు. కారణం స్వామికి పానకాన్ని నైవేధ్యంగా పెట్టి వచ్చే భక్తులకు పానకాన్ని తీర్ధంగా పంచుతారు.


పానకా తీర్ధాన్నిసేవిస్తే దేహంలో ఉత్సాహం ఎక్కువ అవుతుంది, కొత్త చైతన్యం వస్తుంది. దేహంలో వుండే వేడి సమస్థితికి వచ్చే విధంగా చేస్తుంది. రక్తపోటు ఉన్నవారికి తల తిరగడం, నోరు ఎండిపోయినట్లు ఉండడం జరగదు. ఎముకలకు సంబందించిన వ్యాధులు నయం అవుతాయి. నీరసం దరిచేరదు. ఆకలి బాగా వేస్తుంది. దేవుని తీర్ధమైన పానకం సేవించటం ద్వారా మధుమేహ వ్యాధి అదుపులో ఉంటుంది. జీవితంలో శత్రువుల పీడ తగ్గుతుంది. బుద్ధి చురుకుగా పని చేస్తుంది, జ్ఞాపకశక్తి పెరుగుతుంది.```


     *ఇతరమైన రకాలు:-* 


ఇవేకాకుండా తులసీ తీర్థం, పచ్చకర్పూర తీర్థం, బిల్వతీర్థం, ఇలా రకరకాల తీర్థాలను కూడా ఆయా ప్రాంతాలలో ఇస్తుంటారు.


వీటిని సేవించడం వల్ల ఆరోగ్యం లభిస్తుంది. మనసు ప్రశాంతత ఏర్పడుతుంది.


             *శఠగోపం*

                    

గుడిలో తలమీద - ‘శఠగోపం’ ఎందుకు - పెడతారో తెలుసా?


శఠగోపం గుడిలోని దేవుడు లేదా దేవత విగ్రహానికి ప్రతీక అంటారు పండితులు.


గుడికి వెళ్లిన ప్రతి భక్తునికి ఆలయంలో ఉండే దేవతా విగ్రహాలను తాకే వీలుండదు.


అందుకే ఆలయ పూజారి భక్తులకు తీర్థప్రసాదాలిచ్చిన తర్వాత శఠారిని తీసుకొచ్చి భక్తుల తలపై పెట్టి ఆశీర్వచనం ఇస్తాడు...


ఆలయ పూజారి శఠారిని తీసుకు వచ్చి భక్తుల తలపై పెట్టడం వలన వారిలో ఉండే చెడు ఆలోచనలు, ద్రోహబుద్ధులు నశిస్తాయని చెబుతారు.


అంతే కాదు శఠగోపం అత్యంత గోప్యమైనది కనుక అది పెట్టే పూజారికి కూడా విన్పించనంతగా కోరికను తలుచుకోవాలంటారు పండితులు.

 

శఠగోపాన్ని కొన్ని ప్రాంతాల వారు శఠగోపం, శడగోప్యం అని అంటారు.


శఠగోపం అంటే అత్యంత గోప్యమైనది అని అర్థం.


భక్తులు దేవాలయంలో దర్శనం అయ్యాక ప్రదక్షిణలు చేసి, తీర్థం, శఠగోపనం తీసుకుంటారు.```



    *శఠగోపం విశేషాలు:*```


శఠగోపాన్ని పంచలోహాలైన వెండి, రాగి, కంచు మొదలైన వాటితో తయారు చేస్తారు... 


శఠగోపం వలయాకారంలో ఉంటుంది, వాటిపై భగవంతుని పాదాల గుర్తులు ఉంటాయి, శఠగోపం తలపై పెట్టినప్పుడు పాదాలు మన తలను తాకుతాయి.  అలాకాక నేరుగా పాదాలనే తలపై ఉంచితే అవి మొత్తం తలని తాకడానికి అనుకూలంగా ఉండదు కాబట్టి శఠగోపాన్ని వలయాకారంలో తయారుచేసి పైన పాదుకలు ఉంచుతారు.


అంటే మనము మన కోరికలను….       శఠగోపం పెట్టినప్పుడు తలుచుకుంటే భగవంతుడి పాదాల వద్ద చెప్పుకున్నట్లే.


శఠత్వం అంటే మూర్ఖత్వం అని, గోపం అంటే దాచిపెట్టడం అని కూడా ఉంది.


భగవంతుడు మనిషిలో గోప్యంగా ఉన్న మూర్ఖత్వాన్ని, అహంకారాన్ని తొలగించి జ్ఞానిగా చేస్తాడనేది ఆధ్యాత్మికుల భావన.


నేను, నాది అనే భ్రమను తొలగించడానికి శఠగోపం పెడతారు.```



*శఠగోపం వలన కలిగే ఫలితం:*```


శఠగోపం తలమీద పెట్టించుకోవడం వలన ఆధ్యాత్మికంగా మాత్రమే కాక సైన్స్ పరంగా కూడా ఎన్నో ఫలితాలు కలుగుతాయి.


శఠగోప్యమును తలమీద ఉంచినప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్‌, దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినపుడు విద్యుదావేశం జరిగి, మనలోని అధిక విద్యుత్‌ బైటికెళుతుంది.


తద్వారా శరీరంలో ఆందోళనా, ఆవేశమూ తగ్గుతాయి.


శఠగోప్యమును శఠగోపం శటారి అని కూడా అంటారు.

         


  *సాష్టాంగ నమస్కారం*               


*🙏సాష్టాంగ నమస్కారం యొక్క విశిష్టత🙏*

```

అష్టాంగ నమస్కారమునే సాష్టాంగ నమస్కారము అని అంటారు.


సాష్టాంగ నమస్కారము అంటే మానవునికి వున్న ఎనిమిది అంగాలతో నమస్కారము చేయుట అని అర్ధము.```


సాష్టాంగ నమస్కారం చేసేటపుడు చదివే శ్లోకం:


*ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాబ్యామ్ ప్రణామోష్టాంగ ఈరితః౹౹*


అష్టాంగాలు అంటే...```


"ఉరసా" అంటే తొడలు,

"శిరసా" అంటే తల,

"దృష్ట్యా" అనగా కళ్ళు,

"మనసా" అనగా  

 హృదయం,

"వచసా" అనగా నోరు,

"పద్భ్యాం" అనగా 

 పాదములు,

"కరాభ్యాం" అనగా 

 చేతులు,

"కర్ణాభ్యాం" అంటే చెవులు.


ఇలా ‘8’ అంగములతో కూడిన నమస్కారం" చేయాలి.



మానవుడు సహజంగా ఈ 8 అంగాలతో తప్పులు చేస్తుంటాడు. 


అందుకే దేవాలయంలో బోర్లా పడుకుని పై శ్లోకం చదువుకుంటూ దేవునికి నమస్కరించి ఆయా అంగములు నేలకు తగిలించాలి.


ముఖ్యంగా దేవాలయంలో సాష్టాంగ నమస్కారం దేవునికి, ధ్వజ స్తంభానికి మధ్యలో కాకుండా ధ్వజ స్తంభం వెనుక వుండి చేయాలి.


1). ఉరస్సుతో నమస్కారం అనగా నమస్కారము చేసేటపుడు ఛాతి నేలకు తగలాలి.


2). శిరస్సుతో నమస్కారం అనగా నమస్కారం చేసేటపుడు నుదురు నేలకు తాకాలి.


3). దృష్టితో నమస్కారం చేసేటపుడు కనులు రెండు మూసుకుని మనం ఏ దేవునకు నమస్కారం చేస్తున్నామో ఆ మూర్తిని చూడగలగాలి.


4). మనస్సుతో నమస్కారం అనగా ఏదో మొక్కుబడికి నమస్కారం చేయడం కాకుండా మనఃస్పూర్తిగా చేయాలి.


5). వచసా నమస్కారం అంటే వాక్కుతో నమస్కారం. అంటే నమస్కారం చేసేటపుడు ప్రణవ సహితంగా ఇష్ట దైవాన్ని మాటతో స్మరించాలి.

అంటే "ఓం నమో నారాయణాయ" అని అంటూ నమస్కారం చేయాలి.


6). పద్భ్యాం నమస్కారం అంటే నమస్కార ప్రక్రియలో రెండు పాదములు కూడా నేలకు తగులుతూ ఉండాలి.


7) కరాభ్యాం నమస్కారం అంటే నమస్కారం చేసేటపుడు రెండు చేతులు కూడా నేలకు తగులుతూ ఉండాలి.


8) కర్ణాభ్యాం నమస్కారం అంటే నమస్కారం చేసేటపుడు రెండు చెవులు కూడా నేలకు తగులుతూ

(అటూఇటూతిప్పి) ఉండాలి.```


*స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదు!* 


*ఆడవాళ్లు పంచాంగ నమస్కారం మాత్రమే చేయాలి.*


అంటే కాళ్లు, చేతులు, నుదురు, మాత్రమే నేలకు తాకేలా స్త్రీలు నమస్కారం చెయ్యాలని (కళ్ళు, మనసుతో ఐదు)శాస్త్రం చెబుతుంది.


సాష్టాంగ ప్రణామము చేయటానికి ఎనిమిది అంశాలు అవసరమౌతాయి. అవి ఛాతి (రొమ్ము),నుదురు, శబ్దం,మనస్సు,కాస్త ఎడంగా పెట్టి నమస్కార రూపంలో ఉంచిన చేతులు, కళ్ళు,మోకాళ్ళు మరియు పాదాలు. 


సాష్టాంగ నమస్కారం చేయునప్పుడు రెండు పాదాల ముందుభాగం మోకాళ్ళు, ఛాతి మరియు నుదురు మాత్రమే నేలకు ఆనించి ఉంచాలి. అలా సాష్టాంగ పడ్డప్పుడు చేతులను తలభాగం పైకి ఎత్తి నమస్కరిస్తూ దేవతను ప్రార్థించాలి. 

అలా ప్రార్థిస్తున్నప్పుడు దేవుడి మంత్రాలను లేక శ్లోకాలను ఉచ్చరిస్తూ, దేవుడి విగ్రహంపై దృష్టిని ఉంచి మనస్సులో దేవుడిని ధ్యానించాలి.


ఈ పద్దతిలో నమస్కారం అనేది స్త్రీల శరీర నిర్మాణానికి తగినట్లు ఉండదు... స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేసేటపుడు, ఉదరం, పాలిండ్లు, కటి ప్రదేశం నేలకు తగిలే అవకాశం ఉంది. అందువలన గర్భస్థ మహిళలకు, పిల్లలకు పాలిచ్చే మహిళలకు చాలా కష్టంగా ఉండి ప్రమాదం సంభవించవచ్చు.ఆధునిక శాస్త్రం సైతం స్త్రీలు ఇలాటి ప్రణామాలు చేయడం ద్వారా వారి గర్భాశయం స్థాన భ్రంశం అయ్యే అవకాశం ఉందని తెలియజేయడం జరగింది. 

అందుకని మన పెద్దలు ‘స్త్రీలు మోకాళ్ళపై ఉండి నమస్కరించడమో, ధ్యానించడమో లేక మోకాళ్ళపై ఉండి మోకరిల్లడమో(పంచాంగ నమస్కారం) చేస్తే చాలు అని చెప్పారు. అందుకే మరొక ప్రాణికి జన్మనిచ్చి చైతన్య వంతులను చేయగలిగిన అమ్మలకు ఇందులో వెసులు బాటు కలిగించారు.


పూజ పూర్తయిన తరువాత మంత్ర పుష్పాన్ని   భగవానుడికి   భక్తితో సమర్పించుకునే  సందర్బంలో సాష్టాంగ నమస్కారం లేదా పంచాంగ నమస్కారం చెయ్యాలి. 


దైవానికి, గురువులకు, యతులకు వారు ఎదురుపడిన వెంటనే సాష్టాంగ నమస్కారం చేయాలి.


నూరు యజ్ఞాలు చేయడం వల్ల కూడా పొందలేని ఉత్తమ గతులను సాష్టాంగ నమస్కారం చేసేవాళ్లు పొందుతారని శాస్త్రవచనం.

.          

*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.*


*🛕ఆధ్యాత్మిక బృందం నుండి* *ఒక మిత్రుడు పంపిన విషయాలు* *భాగస్వామ్యం  చేయడమైనది* 


                      *మీ*  

*🙏న్యాయపతి నరసింహారావు🙏*

మాఘ పురాణం - 24

 🕉️🌹🌷🪔🛕🪔🌷🌹🕉️


*🌷శనివారం 22 ఫిబ్రవరి 2025🌷*

_*మాఘ పురాణం - 24 వ*_

       _*అధ్యాయము*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*శ్రీమన్నారాయణుని అనుగ్రహము - తులసీ మహాత్త్యము*


☘☘☘☘☘☘☘☘☘


గృత్నృమదమహాముని జహ్ను మునితో నిట్లనెను. సత్యజిత్తు యేకాదశియందు భార్యతో బాటు ఉపవాసముండెను. కేశవుని గంధపుష్పాదులతో నర్చించెను. దేవతల హితమును కోరి శ్రీమన్నారాయణుని నిరంతరముగ జపించుచు జాగరణ చేసెను. ఏకాదశినాటి రాత్రి మొదటి జామునందే శ్రీహరి సత్యజిత్తునకు ప్రత్యక్షమయ్యెను.


నీలమేఘమువలె నల్లనిచాయతో, నల్లని ముంగురులతో పద్మనేత్రములతో ప్రకాశించు తిలకముతో, విచిత్రకుండలములతో చెక్కిళ్లు ప్రకాశించుతుండగా , సూర్యకాంతినిమించు కిరీటముతో , హారకేయూరాది విభూషణములతో , పచ్చని పట్టు బట్టను కట్టి మనోహరమైన రూపముతో గరుత్మంతునిపైనెక్కివచ్చెను. మునిగణములు శ్రీమన్నారాయణుని స్తుతించి భార్యతోబాటు శ్రీమన్నరాయణుని పాదములపైబడి నమస్కరించెను. శ్రీమన్నారాయణమూర్తి 'నాయనా ! కోరిన వరము నిచ్చెదను అడుగూ అనెను.


అప్పుడు సత్యజిత్తు 'స్వామి ! యింద్రాదులకు పూర్వమువలెనే సంచరించు శక్తి నిమ్ము వారిపై దయనుంచుము. తరువాత నాకును , నాభార్యకును నీ సాన్నిద్యము ననుగ్రహింపుము అని కోరెను. శ్రీహరి దయతో వాని కోరిక నంగీకరించెను ఇట్లనెను. ఓయీ ! యీ ఏకాదశితిథి సమస్త పుణ్యముల నిచ్చును. నేనీ తిథియందే నీకు ప్రసన్నుడనైతిని , కావున యీ తిథి నాకు సంతోషమును కలిగించు తిథి. నీవు నీ భార్య యీ పారిజాత వృక్షమును పెకిలించి యింద్రునకిండు. పవిత్రము, వనవాసి, నాకిష్టము అయిన యీ తులసిని నాకిమ్ము. నీకు శుభము కలుగును, మరియొక ఆలోచన వలదు అని పలికెను. సత్యజిత్తును అట్లేయని అంగీకరించెను. మరునాటి ఉదయమున భార్యతో కలిసి పారిజాత వృక్షమును పెకిలించి యింద్రాదుల కిచ్చెను. తులసిని లక్ష్మీపతియగు శ్రీహరికిచ్చెను. శ్రీహరియనుగ్రహము వలన ఇంద్రాదులందరును శక్తిమంతులై శ్రీమన్నారాయణునకు నమస్కరించి నిలిచిరి.


శ్రీహరి, యింద్రాదులు వినుచుండగా సత్యజిత్తును వాని భార్యను జూచి యిట్లనెను. ఈ యేకాదశితిథి నాడు నీవు భక్తితో నీ విధముగ నన్ను పూజించి నా అనుగ్రహము నుండుట వలన మిక్కిలి ఉత్తమమైనది. నాకు మిక్కిలి ఇష్టమైనది. ఈ యేకాదశీతిథి సర్వజీవుల పాపములన్నిటిని పోగొట్టి అనంత పుణ్యమునిచ్చును. మందమతులైన మానవులీవిషయమును గమనింపలేరు. పాడ్యమి నుండి పది దినములును యధా ప్రకారము భుజించి యేకాదశి నాడు ఉపవాసమును , జాగరణము చేసి నన్ను స్మరించు వారు నా సాన్నిధ్యమును చేరుదురు. ఇహలోకమున సర్వసుఖములను, సర్వశుభములను పొందుదురు. నాకు సంతోషము నిచ్చిన యీ తిథి ఉత్తమ సంభావన నిచ్చి వేలకొలది అశ్వమేధములు చేసినవచ్చు పుణ్యము నిచ్చును. ధర్మవేత్తలగు మునులును యీ తిథి మిక్కిలి పుణ్యప్రదమని యందురు. పన్నెండవ రోజున దేవతలకు మరల శక్తి, పుష్టికలుగుటచే ద్వాదశి తిథిని ప్రాణదాయిని విష్ణుప్రియయని అందురు. అజ్ఞానముచే ఏకాదశి భుజించువారు మహాపాపముల నందుదురు. దశమినాటి రాత్రి భోజనమును మాని , ఏకాదశినాడు రెండు పూటల భోజనమును మాని , ద్వాదశి నాటి మధ్యాహ్నమున నొకమారు భుజించి నాటి రాత్రి భుజింపకయుండిన చాతుర్భుక్తావర్జితమైన ఏకాదశి ఉపవాసమని యందురు. ఈ ప్రకారము చేసిన ఉపవాసము సంపూర్ణ పుణ్యఫలమునిచ్చును. పుణ్యప్రదమగు హరివాసరమున ఉపవాసము జాగరణము చేసి నన్ను యధా శాత్స్రముగ పూజించినవాడు నాకిష్టుడు. నా లోకమును చేరును. ఇట్టి యేకాదశి ఉపవాసము చేసినవానినే గాక వాని కులము వారినందరిని రక్షించి అనేక యజ్ఞములు చేసిన వచ్చు పుణ్యము నిచ్చును. నాలుగు వర్ణములవారు , సన్యాసి , వానప్రస్తుడు , స్త్రీబాలవృద్ధులు అందరును ఏకాదశినాడు భుజింపరాదు , ఏకాదశినాడు స్త్రీ సుఖము , నిద్ర , అన్నము వీనిని విడిచి నన్ను పూజించవలెను. నా పాదోదకమును సేవింపవలెను. అన్ని మాసములయందును, శుక్ల కృష్ణపక్షములు రెండిటను వచ్చు యేకాదశులన్నియు నిట్లే ఉపవాసముండవలెను. చాంద్రాయణాది వ్రతముల నాచరించుట వలన వచ్చెడి పుణ్యము యేకాదశీ ఉపవాస వ్రతము వలన వచ్చును. కావున మానవులారా , మునులారా , నా భక్తులారా మీరెవ్వరును యీ యేకాదశినాడు అన్ని మాసములయందును. రెండు పక్షములయందును తినరాదు. ఇది సత్యము ఇట్లు ఉపవాసము చేసినవాడు నా లోకమును చేరి నన్ను పొందును. ఇది తధ్యము అని బిగ్గరగా పలికెను. అని గృత్నృమహాముని జహ్నుమునికి వివరించెను.


గృత్నృమహాముని జహ్నుమునితో నిట్లనెను. శ్రీమన్నారాయణుడు యేకాదశి వ్రతవిధానమును మహత్త్యమును వివరించి యింద్రాదులతో నిట్లనెను. మీరీ పారిజాత దివ్యవృక్షమును తీసికొని మీ నివాసమైన స్వర్గమునకు వెళ్ళుడని చెప్పెను. ఇంద్రాదులు శ్రీహరి చెప్పినట్లు పారిజాతవృక్షమును తీసికొని స్వర్గమునకు పోయిరి. వారందరును వెళ్లిన తరువాత తులసి శ్రీమన్నారాయణునితో నిట్లనెను. స్వామీ ! నీ పాద పద్మముల యందాసక్తి గల నన్ను దయ చూడుము. నాకు నీవు తప్ప మరియొక్క గతిలేదు. నేను నీ పాద సాన్నిధ్యమునే కోరుకొందును అని పలికిన తులసి మాటలను విని శ్రీహరి భూమియందు అమృతము వలన పుట్టిన తులసీ ! నీవు నాకిటురాలవు. నా వద్దకు రమ్ము నిన్ను నేను హృదయమున ధరింతును. సందేహము వలదు. నీవు పవిత్రురాలవు పవిత్రతను కలిగించుదానవు పాపనాశిని తులసీ దళములతో కలిగి యున్న నిన్ను చూచినవారు గంగా స్నానము చేసిన వారువలె పవిత్రులగుదురు. నీ దళములతో నన్ను పూజించినవారు పునర్జన్మ నుండదు. అమృతము నుండి పుట్టిన తులసి నీ దళములను మాలగా చేసి నా కంఠమున సమర్పించినవారు అంతులేనంత అనంతకాలము నా లోకమున నుండి నాలోనైక్యమగుదురు. నిన్ను తమ యిండ్లయందు గాని తోటలయందు గాని పెంచువారికి యే పాపములును అంటవు. ప్రాతఃకాలమున నిద్రలేవగనే నిన్ను చూచి నమస్కరించినవాడు ఆ దినమున సర్వ సుఖముల నందును.


*యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః*

*యదగ్రే సర్వవేదాశ్చ తులసి త్వాం నమామ్యహం ||*


అను శ్లోకమును చదివి నీకు నమస్కరింపవలెను. తులసి ! నీ దళములతో నీటిని తన శరీరముపై జల్లుకొనువాడు అపవిత్రుడైనను పవిత్రుడగును. నీ కుదురు మొదలులోనున్న మట్టిని తిలకముగ నుదుటిపై ధరించినవాడు. సర్వసుఖములను పొందును. యక్షరాక్షస పిశాచాదుల వలన వానికి యే బాధయు నుండదు. అమృత సంభవా తులసీ త్రైలోక్యపావనీ నేను నిన్ను లక్ష్మీదేవిని సమానముగా భావింతును అని శ్రీహరి తులసికి వరములిచ్చెను. తులసి దళములను కాండములను శాఖలను అన్నిటిని శుభప్రదములైన మృదువైన తన చేతులతో తాకెను. చక్రధారి స్పర్శవలన తులసి మరింత కాంతిని పవిత్రతనుపొందెను. అప్పుడా తులసి మనోహరమైన పవిత్రమైన స్త్రీరూపమునంది శ్రీహరి అంశను పొందెను. మాయావి జగదీశ్వరుడు అయిన శ్రీహరి లోకరక్షణార్థమై తులసిని నియమించెను. శ్రీహరి యెడమ చేతితో తాకబడిన భాగము కృష్ణవర్ణమై కృష్ణతులసి యను పేరు పొందెను. ఆ వైపున ఉన్న ఇతర వృక్షములను తులసీ సాన్నిధ్యముచే పవిత్రములయ్యెను. తులసి యున్న ప్రదేశము పాపములను పోగొట్టును.


అప్పుడు శ్రీహరి సత్యజిత్తును చూచి 'నీవు నాకు పూజను చేసి బ్రాహ్మణ సమారాధనము చేసి నీవు నీ భార్యయు భుజింపుడు ' అని పలికెను. సత్యజిత్తు కూడ శ్రీహరిని పూజించి , బ్రాహ్మణులకు భోజనమును పెట్టి తన భార్యతో కలసి భుజించెను. ఇట్లు ఆ వ్రతము పూర్తి అయిన తరువాత శ్రీహరి అందరును చూచుచుండ సత్యజిత్తు దంపతులతోను తులసితోను కలసి గరుత్మంతుని పైనెక్కి తనలోకమునకు పోయెను. నాయనా జహ్నుముని ! యిది ఏకాదశీ వృత్తాంతము. ఏకాదశి తిథి అశ్వమేధ సహస్ర ఫలము నిచ్చునని స్పష్టమైనది కదా. అన్నియేకాదశులలోను మాఘమాసమునందలి యేకాదశి మరింత శుభప్రదము. ఆనాడు ఉపవాసముండి శ్రీహరిని పూజించి జాగరణ మంత్రానుష్ఠానము స్మరణము చేసినవారు శ్రీహరికి ప్రీతిపాత్రులై సాలోక్యమును సాయుజ్యమును పొందుదురు. ఏకాదశినాడు ఉపవాసము ద్వాదశినాడు పారణ ముఖ్యము. ఆనాడు బ్రాహ్మణులకు భోజనము పెట్టి యధాశక్తిగ గోదానము , భూదానము , వస్త్రదానము , సువర్ణదానము , సాలగ్రామ శిలాదానము మున్నగువానిని ఉత్తముడైన బ్రాహ్మణునకు , బ్రాహ్మణులకు యీయవలెను. అట్టివారు యిహలోకమున చక్రవర్తియై తుదకు శ్రీహరి సాయుజ్యమునందును. ఇట్టి పవిత్రమైన కథను వినువాడును శ్రీహరి కరుణా కటాక్షమునంది విష్ణువును చేరుదురు. నిస్సందేహముగా చెప్పుచున్నాను అని గృత్నృమదమహర్షి జహ్నుమునికి వివరించెను.


*మాఘపురాణం ఇరవైనాల్గవ*  

 *అధ్యాయము సంపూర్ణము*


         *🌷సేకరణ🌷*

*న్యాయపతి నరసింహారావు*

https://youtu.be/jTyLO6ed1ck?si=Gvwc0w16bI-yiKwW

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - శిశిర ఋతువు - మాఘ మాసం - కృష్ణ పక్షం  - నవమి - జేష్ఠ -‌‌  స్థిర వాసరే* (22.02.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.




.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*