22, ఫిబ్రవరి 2025, శనివారం

అధిక ఫలాన్నిచ్చే దానం

 🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯

  *అధిక ఫలాన్నిచ్చే దానం*

🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯

*అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న’ అంటారు.* 


*‘దానం’ అంటే త్యాగం. వస్త్రదానం, విద్యాదానం, జ్ఞానదానం, సంపదల దానం... ఇలా దానం అనేక రూపాల్లో ఉంటుంది. గృహాలనూ, కుటుంబాలనూ వదిలి, ధర్మాన్ని పంచడం కోసం భిక్షువులు అహరహం శ్రమిస్తారు. సమాజానికి కావలసిన జ్ఞానాన్ని అందిస్తారు. అంతకుమించి, సమాజం నైతిక మార్గంలో నడిచేలా చూస్తారు. కాబట్టి సమాజ హితం కోసం తమ జీవితాన్ని త్యాగం చేసిన భిక్షువులను ఆదుకోవలసింది ఆ సమాజమే! అది సమాజ బాధ్యత కూడా.*


*భిక్షువులకు హంసతూలికా తల్పాలు అవసరం లేదు. విలాసవంతమైన భవనాలతో పని లేదు. బంగారు రత్నాభరణాలతో నిమిత్తం లేదు. సుష్టుగా తినేంత షడ్రసోపేతమైన భోజనం కూడా అక్కర్లేదు. అతి సాధారణ భోజనం చాలు. జీవించడానికి, కాలినడకన తిరుగుతూ ధర్మోపదేశం చేయడానికి తగినంత ఆహారం చాలు.*


*ఒకనాడు బుద్ధుడు కొలియుల రాజ్యంలోని పజ్జనికం అనే పట్టణం సమీపంలో ఉన్నాడు. ఆ పట్టణంలో ఎందరెందరో బుద్ధుణ్ణి తమ ఇళ్ళకు భిక్ష కోసం ఆహ్వానించారు. అయితే, వారిలో ఎంతో గౌరవంతో, అణకువతో అహ్వానించింది ఒక కొలియ పుత్రిక సుప్రవాస. ఆమె స్వయంగా అనేక రకాల పదార్థాలు తయారు చేసింది. భక్తిభావంతో బుద్ధునికి సమర్పించింది. వాటినుంచి తగినంత ఆహార పదార్థాల్నే తథాగతుడు స్వీకరించాడు.*


*భోజనానంతరం ధర్మోపదేశం చేశాడు. ఉపదేశం చివరిలో-*

*‘‘అమ్మా! సుప్రవాసా! ఈ రోజు నీవు అన్నాన్ని దానం చేశావు. నీవు చేసిన ఈ అన్నదానం నాలుగు రకాలుగా మేలు చేస్తుంది.*


*ఒకటి: అన్నం మనిషికి ఆయువును ఇస్తుంది. కాబట్టి అన్నదాత ‘ఆయుభాగిని’ అవుతుంది.*


*రెండు: అన్నం మనిషికి అందాన్ని ఇస్తుంది. శరీరం ఎముకల గూడు కాకుండా... వికార రూపం నుంచి కాపాడుతుంది. కాబట్టి అన్నదాత ‘వర్ణభాగిని’ అవుతుంది.*


*మూడు: అన్నం ఆకలి బాధను తీర్చి, సుఖాన్ని ఇస్తుంది. కాబట్టి అన్నదాత ‘సుఖభాగిని’ అవుతుంది.*


*నాలుగు: అన్నం నీరసం నుంచి కాపాడి... శరీరానికి బలాన్ని ఇస్తుంది. కాబట్టి  అన్నదాత ‘బలభాగిని’ అవుతుంది.*


*ఒక్క అన్నదానం చేసిన ఈరోజు నీవు నాలుగు దానాలు చేసిన ఫలాన్ని పొందావు. రుజువర్తన కలవారికి, జ్ఞానులకు ఇలాంటి దానం చేస్తే మహాఫలప్రదమనే విశ్లేషణ ఉంది’’ అన్నాడు.*


*అక్కడికి చేరి, బుద్ధుని దివ్యోపదేశం విన్నవారు. దానం వల్ల... ప్రధానంగా అన్నదానం వల్ల కలిగే మహాఫలం గురించి తెలుసుకున్నారు. తమలో ఉన్న లోభ బుద్ధిని వదులుకున్నారు. సుప్రవాసను శ్లాఘించారు.*


*అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే !*

*జ్ఞానవైరాగ్య సిద్యర్థం భిక్షాందేహి చ పార్వతి !!*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*

*ఓం నమః శివాయ!!!*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

కామెంట్‌లు లేవు: