☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*శ్రీమద్ భాగవతం*
*(59వ రోజు)*
*(నిన్నటి భాగం తరువాయి)*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*కొంగ, గ్రద్ద రూపాల్లో వశిష్ఠ విశ్వామిత్రుల పోరాటాన్నే కాదు, హరిశ్చంద్రుని గురించి కూడా మరింత విపులంగా తన భాగవతంలో ఇలా చిత్రించాడు వ్యాసుడు.*
*సంతానలేమితో హరిశ్చంద్రుడు బాధపడుతుంటే అతన్ని నారదుడు కలిశాడు. సంతానం కోసం వరుణ దేవుణ్ణి ప్రార్థించమని చెప్పాడు. నారదుడు చెప్పినట్టే చేశాడు హరిశ్చంద్రుడు. వరుణ దేవుణ్ణి ప్రార్థించాడు. తనకు కొడుకు పుడితే ఆ బాలుణ్ణి పశువుగా తలచి, నరమేధంతో వరుణదేవుణ్ణి అర్చిస్తానని ప్రమాణం కూడా చేశాడు. వరుణదేవుడు అనుగ్రహించాడు. కొడుకు పుట్టాడు హరిశ్చంద్రునికి. అతని పేరు రోహితుడు. కొడుకు ముద్దుముచ్చట్లు చూస్తూ వరుణదేవునికి ఇచ్చిన మాటనూ, యాగాన్నీ మరచిపోయాడు హరిశ్చంద్రుడు. వరుణుడు వచ్చి అడిగినా ఏదో సాకు చెప్పి, యాగనిర్వహణను తప్పించుకోసాగాడు. ఇంతలో తనని బలిపశువుని చేసి, తండ్రి యాగం చేయనున్నాడనే సంగతి రోహితుడికి తెలిసింది. ప్రాణభయంతో ఆ పిల్లాడు అరణ్యాల్లోకి పారిపోయాడు.*
*రోహితుని జాడ తెలియకపోవడం, హరిశ్చంద్రుడు యాగాన్ని నిర్వహించకపోవడంతో వరుణదేవునికి కోపం వచ్చింది. ‘మహోదరం’ వ్యాధితో బాధపడమని హరిశ్చంద్రుని శపించాడతను.*
*బాధపడసాగాడు హరిశ్చంద్రుడు. తన కారణంగా తండ్రి రోగగ్రస్తుడయ్యాడని తెలిసి, రోహితుడు అయోధ్యకు బయల్దేరాడు. దోవలో వృద్ధ బ్రాహ్మణుని రూపంలో అతన్ని సమీపించాడు ఇంద్రుడు. విషయం అంతా తెలుసుకుని ఇలా ఉపదేశించాడు. ఓ ఏడాదిపాటు భూపర్యటనలో భాగంగా తీర్థయాత్రలు చేస్తే మేలు జరుగుతుందన్నాడు. రోహితుడు అలాగే చేశాడు. ఏడాది పాటు సర్వ తీర్థాలూ సేవించి, అయోధ్యకు బయల్దేరాడు.*
*మళ్ళీ వృద్ధ బ్రాహ్మణుని రూపంలో ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. తెలియనట్టుగా మళ్ళీ అంతా అడిగి తెలుసుకున్నాడు. తెలుసుకుని, మళ్ళీ మరో ఏడాదిపాటు ముందు చేసినట్టుగానే భూపర్యటన చేయమన్నాడు. రెండింతలుగా మేలు జరుగుతుందన్నాడు. అలాగే చేశాడు రోహితుడు. ఇంద్రుని ఆదేశానుసారం అలా ఆరేళ్ళు దేశసంచారంలో గడిపాడు రోహితుడు.*
*ఆఖరికి ఆరవ ఏడు చివరి రోజుల్లో అజీగర్తుని కుమారుడు శునశ్శేపునితో అయోధ్యలో అడుగు పెట్టాడతను. శునశ్శేపుణ్ణి తండ్రికి సమర్పించి, అతనిని యజ్ఞపశువుని చేసి యాగాన్ని చెయ్యమన్నాడు రోహితుడు. హరిశ్చంద్రుడు అలాగే చేశాడు. వరుణుని తృప్తిపరిచాడు. మహోదరవ్యాధి నుండి బయటపడ్డాడు.*
*హరిశ్చంద్రయజ్ఞానికి బ్రహ్మాదిదేవతలు విచ్చేశారు. మునులూ, మహామునులు కూడా వేంచేశారు. హరిశ్చంద్రుని సత్యనిష్ఠను మెచ్చి, విశ్వామిత్రుడు అతనికి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించాడు. దాంతో హరిశ్చంద్రుడు బ్రహ్మజ్ఞాని అయి, రాజ్యసంపదలు త్యజించి తపోవనాలకు తరలిపోయాడు. కొన్నాళ్ళకు భౌతికదేహాన్ని వీడి, పరమపదం అందుకున్నాడు.*
*సగరుడు:~*
*హరిశ్చంద్రుని కుమారుడు రోహితునకు జంపుడు జన్మించాడు. జంపుని కుమారుడు సుదేవుడు. అతనికి విజయుడు, విజయునికి రురుకు, అతనికి వృకుడు వరుసుగా జన్మించారు.*
*వృకుని కుమారుడు బాహుకుడు. ఆ బాహుకుని కుమారుడే సగరుడు. సూర్యవంశానికి వన్నె తెచ్చిన చక్రవర్తుల్లో సగరుడు ఒకడు.*
*తన రాజ్యాన్ని హైహయులు చేజిక్కించుకున్న మరుక్షణం భార్య సమేతంగా బాహుకుడు అడవులకు తరలిపోయాడు. అక్కడే మరణించాడతను. భర్తతో పాటు భార్య సహగమనానికి సిద్ధపడింది. అయితే అప్పుడామె గర్భవతి. ఆ కారణంగా సహగమనం చేయరాదని ముని ఔర్వుడు వారించాడామెను. తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళి ఆదరించసాగాడు.*
*కడుపులో బిడ్డతో ఔర్వుని ఆశ్రమంలో తలదాచుకున్న బాహుకుని భార్యనూ, ఆమె బిడ్డనూ బతకనీయరాదనుకున్నారు ఆమె సవతులు. ఎట్టి పరిస్థితుల్లోనూ బిడ్డను కనరాదని, గరళాన్ని కలిపిన ద్రవాన్ని ఆమె చేత తాగించారు. సంగతి తెలుసుకున్న ఔర్వుడు ఆమె గర్భాన్ని కాపాడాడు. శిశువు మరణించకుండా చూశాడు.*
*ప్రసవించిందామె. కుమారుణ్ణి కన్నది. గరంతో అంటే గరళంతో జన్మించాడు కాబట్టి ఆ పిల్లాడిని ‘సగరుడు’ అన్నారు. పెరిగి పెద్దవాడయ్యాడు సగరుడు. శస్త్రాస్త్రవిద్యలన్నీ సునాయసంగా నేర్చాడు. శత్రురాజుల్ని ఓడించి, తండ్రి పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి సంపాదించాడు. చక్రవర్తిగా భూమండలాన్ని పాలించసాగాడు.ఎన్నో యజ్ఞయాగాదులు చేసి, విష్ణుమూర్తిని ఆరాధించాడు సగరుడు. అనేక అశ్వమేధాలు కూడా చేశాడు.*
*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం )*
*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి