7, జనవరి 2023, శనివారం

పరమాచార్య

 ఆచార్య - పరమాచార్య


శతాబ్దాలుగా మన పుణ్యభూమి భారతదేశం ఎందఱో ఆచార్యులకు, సాధువులకు, సన్యాసులకు, మహాత్ములకు జన్మను ఇచ్చింది. అటువంటి వారి పాద రజస్సు చేత, లోతైన జ్ఞనము చేత, తపస్సు చేత, పాండిత్యము చేత దశాబ్దాల పాటు ఈ భారతదేశానికి దిశానిర్దేశం చేస్తున్నారు. వారందరికీ నా సాష్టాంగ ప్రణామాలు.


ఈ ప్రపంచం కాని, మన భారతదేశం కాని ఎన్నడూ చూడని గొప్ప సాధు సత్పురుషులు పూజ్య జగద్గురు శంకరాచార్య పరంపరలో వచ్చిన కంచి కామకోటి పీఠం 68వ పీఠాదిపతులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి పరమాచార్య స్వామివారు. మనకు తెలిసినంతలో 87 సంవత్సరాల పాటు పీఠాదిపతిగా ఉన్నవారు బహుశా ఎవరూ లేరు. అతి చిరు ప్రాయంలో 13 సంవత్సరాల వయస్సులో సన్యసించి జగద్గురు స్థానాన్ని అలంకరించి, 87 చాతుర్మాస్యాలను చేసి తమ నూరవ సంవత్సరంలోకి అడుగిడుతున్న వారు కూడా ఎవరూ లేరు.


దాదాపు 25 శాతబ్దాలకు పూర్వం సాక్షాత్ శంకరుడే కేరళలోని కాలడిలో శ్రీ ఆది శంకర భగవత్పాదులుగా ఈ భూమిపై వెలసి, 72 అవైదిక మతాలను ఖండించి అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిస్తాపించి, సనాతన మతమును ఉద్ధరించారని మనకు చెరిత్ర తెలుపుచున్నది. శతాబ్దాల తరువాత మరలా వైదిక మత స్థితిని, సమసిపోతున్న మానవతా విలువలను చూసి, ఆదిశంకరులే మరొక్కసారి అవతరించాలని నిర్ణయించుకున్నారు. మన పరమాచార్యుల వారి జీవితము, బోధలూ కూడా భగవాన్ ఆది శంకరులకు సమము. మన అదృష్టం ఏమిటంటే మనం జీవించిన కాలము శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి శ్రీపాదుల కాలము.


పరమాచార్యుల వారు నడిచే దైవం, జీవన్ముక్తులు, త్రికాలవేదులు. కేవలం భారతియులనే కాక, విశ్వ మానవాళిని అనుగ్రహించిన ఇరవైవ శతాబ్దపు అవతారం. విశ్వ ప్రజల బాధలను, ఆర్తిని తీర్చడానికి వచ్చిన సమతామూర్తి. వారిపై వచ్చిన గ్రంథాలు అనేకం. కానీ అవన్నీ ఎప్పటికి అసంపూర్ణములే, ఎందుకంటే ఒక శతాబ్దపు జీవితాన్ని, బోధలను వ్రాయడానికి ఆ శతాబ్దపు జీవితాలన్నీ కూడా సరిపోవు.


మా తాతముత్తాతల ఆశీస్సుల వల్ల 1954లో కలవైలో నాకు వారి ప్రథమ సందర్శనం కలిగింది. అప్పటినుండి నలభై ఏళ్లుగా ఎన్నో అనుభూతులు, అనుభవాలు, జివితపాఠాలు నాకు ప్రసాదించారు. ఈ నాలుగు దశాబ్దాల కాలంలో వేలసార్లు స్వామిదర్శనం చేసుకున్నాను. వాటిలో ఎన్నో మరపులేని మరపురాని మధురస్మృతులు.


1967లో పరమాచార్య స్వామివారు ఆంధ్రదేశంలోని ఏలూరులో చాతుర్మాస్యం చేస్తున్నారు. మేము ఒక యాభై మందిమి కలకత్తా నుండి స్వామివారికి భిక్షావందనం సమర్పించడానికి వచ్చాము. మాతో రావడం కుదరక కలకత్తాలో ఉన్న భక్తులకోసమై మహాస్వామివారి సందేశాన్ని రికార్డ్ చేసి సాయింత్రం వెళ్ళే కలకత్తా రైలుకి నాతో తీసుకుని తిసుకునివేళ్ళాలని భిక్షావందనం రోజు తెల్లవారుఝామున ఒక సేవకునితో చెప్పాను.


మద్యాహ్నం మూడున్నర ప్రాంతంలో నను శ్రీవారు రమ్మన్నారు. కాని ఐదు ముప్పావు తరువాత కాని నాకు స్వామివారి పిలుపు రాలేదు. మిగిలినవారందరినీ సాయింత్రం రైలుకు కలకత్తా వెళ్ళమని చెప్పి, నేను నా భార్య మరుసటిరోజు వెళ్దామని అక్కడే ఉండిపోయాము.

అపార కరుణాసముద్రులైన స్వామివారు మాకోర్కే మన్నించి టేప్ రికార్డర్ లో రికార్డు చేయబడిన సందేశాన్ని మాకు అనుగ్రహించారు.


కలకత్తాలో మా అందరి గురించి అడిగారు. దాదాపు 6-45 గంటలప్పుడు “కలకత్తాకి ఎప్పుడు వెళ్తున్నారు?” అని మమ్మల్ని అడిగారు. ఆరోజు 6-30 ట్రైనుకే మేము కలకత్తా వెళ్ళవలసి ఉందని, కాని ఆ ప్రయాణం కంటే మాకు స్వామివారి సందేశం చాలా ముఖ్యమని, మా ప్రయాణాన్ని మరుసటి రోజుకు వాయిదా వేసుకున్నామని వినయంతో స్వామివారికి చెప్పాను.


మహాస్వామివారు సన్నటి నవ్వుతో, “వెళ్ళు, వెళ్లి ప్రయత్నించు. బహుశా ఈరోజు రైలు ఆలస్యంగా రావచ్చు” అని అన్నారు. వెంటనే నా భార్యతో కలిసి పరుగు పరుగున స్టేషనుకు చేరుకుంటే, ఆరోజు మేము వెళ్ళవలసిన రైలు మూడు గంటలు ఆలస్యంగా నడుస్తోందని తెలిసింది. ఆ రోజు రైలు ఆలస్యంగా నడుస్తోందని ఆ జివన్ముక్తులకు తెలుసు. కాని అలా చెప్పక “వెళ్ళు, దొరకవచ్చేమో” అని అన్నారు.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


--- “కైంకర్య శిరోమణి” డా. యస్.వి. నరసింహన్


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

మాతృ భాష

 30వ దినము:

Know about a telugu word Daily.

మన మాతృ భాష పరిరక్షింపబడవలెననిన ముందు అందరకు ఆ భాష మీద అవగాహన, పదకోశము అత్యంతావశ్యకము. అందు నిమిత్తము నా వంతు కృషిలో భాగముగా ప్రజోపయోగము గల ఒక పదమునకు గల పర్యాయ పదములను అందించ సంకల్పించినాను. ఈ నా కృషికి అందరు సహకరించి తమ తమ సమూహములలో ఉంచి విశేష ప్రచారణకు తమవంతు సహాయమును అందింతురని ఆశించు చున్నాను.

30వ దినము (06-01-2023):

శంఖము: అంత:కుటిలము, అంబుజన్మము, అంబుజము, అబ్జము, కంబుకము, చిందము, జలజము, జలకరము, త్రిరేఖము, దరము, నీరజము, పాథోజము, పూతము, పినగుల్ల, బహునాదము, బూరగొమ్ము, మహానాదము, ముఖరము, వారిజము, శంబూకము, శ్వేతము, షోడశావర్తము, సంకు, పారంగము, సింధుపుష్పము, సూచికాముఖము, హరిప్రియము.

గవ్వ: కపర్దకము, చరము, చూర్ణి, వటము, శంఖనఖము, శ్వేతము, హరణము,

నూటెనిమిది సార్లు

 ఒక్కసారి కాదు నూటెనిమిది సార్లు


పరమాచార్య స్వామివారికి మెడవెనుక భాగంలో కొంచం నొప్పిగా ఉంది. స్వామికి కంటిశుక్లాల ఆపరేషన్ చేసిన డా. బద్రినాథ్ అది బహుశా స్పాండిలోసిస్ ఏమో అని అనుమానంగా ఉందని, స్వామిని పరీక్షించి చికిత్స చేయవలసిందని డా. కళ్యాణరామన్ ని కోరారు. 


ఒకరోజు మద్యాహ్నం షోలాపూర్లో ఉన్న స్వామివారి మకాంకి వచ్చారు. భోజనం అయిన పిదప వారిని స్వామివారి వద్దకు తీసుకునివెళ్ళారు. మహాస్వామి వారికి మెడనొప్పితో పాటు చాలా జ్వరంగా కూడా ఉందని చెప్పారు. వారిని పరీక్షించడానికి స్వామివారు అనుమతిచ్చారు. 


డా. కళ్యాణరామన్ మొదటగా నమస్కరించారు. ఎందుకు నమస్కరించావని స్వామివారు అడిగారు. అందుకు మహాస్వామివారితో, “నా క్లినిక్ లో ప్రతి రోగిని పరీక్షించే ముందు నా మనస్సులో మిమ్మల్ని తలచుకొని నమస్కరించి అతని వ్యాధి నయంకావాలని కోరుకునేవాణ్ణి. ఇప్పుడు నేను పరీక్షించవలసింది మిమ్మల్నే కాబట్టి ఇంకెవరికి నమస్కరించగలను నా చికిత్స సఫలం అవ్వాలని. మీకు తప్ప” అని అన్నాడు. 


స్వామివారు నవ్వి “సరే కానివ్వు” అని అన్నారు. 


పరీక్షించిన తరువాత మహాస్వామివారికి 105 డిగ్రీల జ్వరం ఉందని గ్రహించాడు. కొద్దిగా సంకోచిస్తూ స్వామివారితో, “స్వామివారికి జ్వరం చాలా ఎక్కువగా ఉంది. జ్వరం తగ్గేంతవరకు ఒకటి రెండు రోజులపాటు చన్నీటి స్నానం మానడానికి వీలవుతుందా?” అని అడిగాడు. 


”అది ఎలా కుదురుతుంది? ఇదే జ్వరంతో నిన్న రాత్రి చంద్రగ్రహణమని గ్రహణ సమయంలో స్నానం చేశాను” అని అన్నారు. 


వారి మాటలు విని కళ్యాణరామన్ ఆశ్చర్యంతో, ”ఈశ్వరా! ఎలా పరమాచార్య స్వామివారి దేహం ఇంతటి శ్రమను ఓర్చుకోగలుగుతోంది?” అని అడిగాడు.


మహాస్వామివారు అతనితో, “గ్రహణస్నానం ఎలా చేస్తారో తెలుసా?” అని అడిగారు. 


”లేదు పెరియవ”


“నీ చేతివేళ్ళతో ముక్కు మూసుకుని నదినీటిలో తల పూర్తిగా తడిసేలాగా మునగాలి”


నేను ఆశ్చర్యంతో నిలబడిపోయాను. 


తరువాత మహాస్వామివారు “ఒక్కసారి కాదు. నూటెనిమిది సార్లు” అని అన్నారు. 


ఆ మాటలు వినగానే ఒక్కసారిగా దాదాపు కుప్పకూలిపోయాను. తరువాత తేరుకుని “నేను మీకు ఏమి చికిత్స ఇవ్వగలను?”


“మీరు సాక్షాత్ శివావతారులు. 105 డిగ్రీల జ్వరంతో ఉండి కూడా 108 సార్లు తలస్నానం చేశారంటే కేవలం ఆ పరమశివుడే మీ శరీరాన్ని కాపాడుతున్నాడు. మీకు నాలాంటి అల్పుడు చేయగలిగిందేమి ఉంది? మాలాంటి వారికోసం, మిమ్మల్ని పూర్తి ఆరోగ్యంగా ఉంచమని ఆ శివుణ్ణి వేడుకోవడం తప్ప” 


--- డాక్టర్ యస్. కళ్యాణరామన్, న్యూరోసర్జన్, చెన్నై


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

భగవంతుడు ఒక్కడే

 *సుభాషితమ్*

ఏకో దేవ: సర్వభూతేషు గూఢ:

సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మా

కర్మాధ్యక్ష: సర్వభూతాధివాస:

సాక్షీ చేతా కేవలో నిర్గుణశ్చ


అన్ని ప్రాణులయందు నిగూఢంగా దాగియున్న భగవంతుడు ఒక్కడే. అతడే సర్వవ్యాపి. సమస్త ప్రాణులకు అంతరాత్మ. సమస్త కర్మలకు ఫలప్రదాత. సమస్త ప్రాణులకు అంతర్యామి. అన్నికర్మలకు సాక్షి. జ్ఞాన స్వరూపుడు. సజాతీయ విజాతీయ స్వగతభేదశూన్యుడు. అంటే అతనితో సమానమైన వాడు మరొకడు లేడు. అతని కంటే ఇతరుడు మరొకడు లేడు. అతనిలో ఎటువంటి విభాగము లేదు. అతడు గుణాతీతుడు. శుద్ధచైతన్య స్వరూపుడు.


*🙏🙏సర్వే జనాః సుఖినోభవంతు 🙏🙏*

వ్యాఘ్రేశ్వరం

 [05/01, 8:34 pm] +91 93903 43371: 🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳 పూర్వం పెద్దాపురం సంస్థానం లో ఉన్న ఈ ప్రాంతం అంతా ఒక అడవి,ఒక బ్రాహ్మణోత్తముడు మహాశివరాత్రి రోజున స్నానసంధ్యాదులు పూర్తి చేసుకుని శివపూజకు మారేడు దళాలు కోసమై అడవికి వెళ్ళాడు

ఇంతలో ఒక.పులి తరమగా పరుగెత్తి, పరుగెత్తి ఒక చెట్టు ను ఎక్కాడు.అది మారేడు చెట్టు.పులి

చెట్టు కింద ఉంది.చేసేది ఏమీ లేక ఆ బ్రాహ్మణుడు మనసు లో పరమేశ్వరుడు ని ధ్యానం చేస్తూ ఉండిపోయాడు.రాత్రి సమయం అయింది, అయినా ఆ పులి 🐯 అక్కడ నుంచి కదలలేదు.అర్ధరాత్రి లింగోద్భవ కాలం అయింది.

మనసులో పరమేశ్వరుడు ని ధ్యానం చేస్తూ ఆ బిల్వదళం చెట్టు మీద నుండి ఒక్కొక్క దళం కోస్తూ చెట్టు కింద కు వేస్తున్నాడు.తెల్లవారేసరికి ఆ పులి 🐯 మారేడు దళాలతో కప్ఫబడింది.ఆ రాశి కదలకపోవడంతో ఆ బ్రాహ్మణుడు చెట్టు దిగి జనావాసాల మద్యకు వెళ్లి జరిగిన ది చెప్పడంతో ఆ జనాలు బరిశెలతో , డప్పులు వాయిస్తూ ఆ పులి ఉన్న ప్రదేశానికి వచ్చారు.అందులో ఒకడు ధైర్యం చేసి ఆ పులి ఉన్న రాశి దగ్గర కు వచ్చి,ఆ ప్రదేశాన్ని బరిశెతో పొడవగా రాయి తగిలిన శబ్దం వచ్చింది.ఆ శబ్దం నకు తొలగించి చూడగా, శివలింగం బయట పడింది.పరమేశ్వరుడు వారిలో ఒకరిని ఆవహించి, నేను ఈ బ్రాహ్మణోత్తముడుని పరీక్షించడానికి పులి రూపంలో వచ్చాను.ఇతని మానసిక బిల్వ పూజకు సంతోషించాను.ఈ బ్రాహ్మణుడు ఇహపరసుఖములను పొంది నాలో ఐక్యం చెందుతాడు,అని పలికాడు.అదేరోజు రాత్రి పరమేశ్వరుడు పెద్దాపురం మహారాజు కలలో కనిపించి, నేను ఈ ప్రదేశంలో స్వయంభూ గా వెలిశాను, నాకు ఇక్కడ గుడి కట్టించమని ఆదేశించారు.పెద్దాపురం మహారాజు గారు, అక్కడ ఆలయాన్ని మండపప్రాకారాలను,

నిర్మించి ఆ పరమేశ్వరుడు కి ధూపదీప నైవేద్యాలు ఉత్సవాలు కు నలభై ఎకరాల సస్యశ్యామలంగా పండే భూమిని 

ఇచ్చారు.ఆ దేవుని పేరు మీదుగా ఒక అగ్రహారం ను ఏర్పాటు చేశారు.అదియే వ్యాఘ్రేశ్వరం గ్రామం.వ్యాఘ్రం లింగాక్రుతిగా మారడంతో,వ్యాఘ్రేశ్వరుడిగా ప్రసిద్ధికెక్కాడు.అక్కడ అమ్మవారు బాలాత్రిపురసుందరి ని అర్చిస్తూ,

అనేక మంది భక్తులు ఇహపరసుఖములను పొందుతున్నారు.

మంగళం మహత్ శ్రీశ్రీశ్రీ

ఈ క్షేత్రం తూర్పు గోదావరి జిల్లా,క్రొత్తపేట మండలంలోని ముక్కామల దగ్గర ఉంది.

మాతృ భాష

 29వ దినము:

Know about a telugu word Daily.

మన మాతృ భాష పరిరక్షింపబడవలెననిన ముందు అందరకు ఆ భాష మీద అవగాహన, పదకోశము అత్యంతావశ్యకము. అందు నిమిత్తము నా వంతు కృషిలో భాగముగా ప్రజోపయోగము గల ఒక పదమునకు గల పర్యాయ పదములను అందించ సంకల్పించినాను. ఈ నా కృషికి అందరు సహకరించి తమ తమ సమూహములలో ఉంచి విశేష ప్రచారణకు తమవంతు సహాయమును అందింతురని ఆశించు చున్నాను.

29వ దినము (05-01-2023):

అల: అక్కలి, అర్గళము, ఉత్కలిక, ఊర్మి, కడలు, కర, కరడు, కల్లోలము, కెరటము, ఘృణి, జలలత, తరంగము, తరగ, తళ్ళు, తెర, నీటిడొంక, భంగము, భంగి, లహరి, సుడి, వీచి. 

నురుగు: అబ్ధకఫము, ఉదధిమలము, జలహాసము, డిండీరము, సంతానిక, సముద్రకఫము, స్ధానకము. 


ఆంగ్లము: Wave