27, అక్టోబర్ 2021, బుధవారం

సంస్కృత మహాభాగవతం*

 *27.10.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - పందొమ్మిదవ అధ్యాయము*


*జ్ఞాన-భక్తి-యమనియమాది సాధనముల వర్ణనము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*19.17 (పదిహేడవ శ్లోకము)*


*శ్రుతిః ప్రత్యక్షమైతిహ్యమనుమానం చతుష్టయమ్|*


*ప్రమాణేష్వనవస్థానాద్వికల్పాత్స విరజ్యతే॥12977॥*


శృతి (వేదము) ప్రమాణము, ప్రత్యక్షప్రమాణము, ఐతిహ్యప్రమాణము (ఇతిహాసపురాణములు - మహాపురుష వచనములు), అనుమానప్రమాణము - అను నాలుగు విధముల ప్రమాణములను బట్టి దృశ్యప్రపంచము అస్థిరమనియు, పరివర్తనశీలమనియు, నశ్వరమనియు బోధపడును. కనుక వివేకవంతుడు వివిధమైన కల్పనారూప ప్రపంచమునుండి విరక్తుడగును. అట్టి జ్ఞానియొక్క దృష్టిలో పరమాత్మ తప్ప ఏ వస్తువునకు అస్తిత్వము ఉండదు.


*19.18 (పదునెనిమిదవ శ్లోకము)*


*కర్మణాం పరిణామిత్వాదావిరించాదమంగళమ్|*


*విపశ్చిన్నశ్వరం పశ్యేదదృష్టమపి దృష్టవత్॥12978॥*


'ఇహలోకభోగములు అన్నియును నశ్వరములైనట్లే, యజ్ఞాదులఫల స్వరూపములుగా లభించు స్వర్గాది బ్రహ్మలోక పర్యంతముగల సుఖములన్నియు అమంగళములు, దుఃఖదాయకములు, నశ్వరములు' అని జ్ఞాని గ్రహించవలెను.


*19.19 (పందొమ్మిదవ శ్లోకము)*


*భక్తియోగః పురైవోక్తః ప్రీయమాణాయ తేఽనఘ|*


*పునశ్చ కథయిష్యామి మద్భక్తేః కారణం పరమ్॥12979॥*


మహాత్మా! ఉద్ధవా! భక్తియోగమును  గూర్చి నీకు ఇంతకుముందే తెలిపియుంటిని. కాని దానియందు నీకు ప్రీతి ఎక్కువగా ఉండుటవలన అట్టి భక్తి ప్రాప్తించుటకు గల శ్రేష్ఠసాధనములను గూర్చి ఇంకను విపులముగ వివరించెదను. వినుము-


*19.20 (ఇరువదియవ శ్లోకము)*


*శ్రద్ధామృతకథాయాం మే శశ్వన్మదనుకీర్తనమ్|*


*పరినిష్ఠా చ పూజాయాం స్తుతిభిః స్తవనం మమ॥12980॥*


"ఉద్ధవా! నా యెడల భక్తిభావమును పొందగోరు పురుషుడు అమృతతుల్యములైన నా కథలను వినుటయందు శ్రద్ధను కలిగియుండవలెను. నిరంతరము నా నామ, రూప, గుణలీలలను కీర్తించుచుండవలయును. నా అవతారములను, కర్మలను ప్రతిపాదించు వచనములయందు ఆసక్తి కలగియుండవలెను. స్తోత్రములద్వారా నన్ను స్తుతించుచుండవలెను.


*19.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*


*ఆదరః పరిచర్యాయాం సర్వాంగైరభివందనమ్|*


*మద్భక్తపూజాభ్యధికా సర్వభూతేషు మన్మతిః॥12981॥*


భగవత్పూజా మందిరములను శుభ్రపఱచుట, ఆవాహనాది షోడశోపచారములను నెరపుట, సాష్టాంగముగా నమస్కరించుట అనుష్ఠింప వలెను. నా కంటెను ఎక్కువగా నా భక్తుని పూజింపవలెను. సకలప్రాణులలో నన్నే భావనచేయవలెను.


*19.22 (ఇరువది రెండవ శ్లోకము)*


*మదర్థేష్వంగ చేష్టా చ వచసా మద్గుణేరణమ్|*


*మయ్యర్పణం చ మనసః సర్వకామవివర్జనమ్॥12982॥*


శారీరక క్రియాకలాపములన్నింటిని నా ప్రీతికొరకై చేయవలయును. వాక్కులతో నా గుణగణములనే ప్రస్తావించుచుండవలెను. సమస్త కామములను విసర్జించి, త్రికరణశుద్ధిగా నన్నే సేవింపవలెను.


*19.23 (ఇరువది మూడవ శ్లోకము)*


*మదర్థేఽర్థపరిత్యాగో భోగస్య చ సుఖస్య చ|*


*ఇష్టం దత్తం హుతం జప్తం మదర్థం యద్వ్రతం తపః॥12983॥*


నా ప్రీతికొరకై సంపదలను వినియోగింపవలెను. సుఖసౌఖ్యములను త్యజింపవలెను. యజ్ఞములు, దానములు, హోమములు, వ్రతములు, జపతపాదులు నా ప్రీతికొరకై (భగవదర్పణముగా) ఆచరింపవలెను.


*19.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*


*ఏవం ధర్మైర్మనుష్యాణాముద్ధవాఽఽత్మనివేదినామ్|*


*మయి సంజాయతే భక్తిః కోఽన్యోఽర్థోఽస్యావశిష్యతే॥12984॥*


ఈ ధర్మములను ఆచరించుచు తమ సర్వస్వములను నాకే అర్పించువారికి నాయందు దృఢమైన భక్తి కుదురుకొనును. నాయందు పరిపూర్ణమైన భక్తినెలకొన్నవారికి కావలసినది ఇంకేమి మిగిలియుండును?


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పందొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

సంస్కృత మహాభాగవతం*

 *27.10.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - పందొమ్మిదవ అధ్యాయము*


*జ్ఞాన-భక్తి-యమనియమాది సాధనముల వర్ణనము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*19.9 (తొమ్మిదవ శ్లోకము)*


*తాపత్రయేణాభిహతస్య ఘోరే సంతప్యమానస్య భవాధ్వనీశ|*


*పశ్యామి నాన్యచ్ఛరణం తవాంఘ్రిద్వంద్వాతపత్రాదమృతాభివర్షాత్॥12969॥*


స్వామీ! దుస్సహమైన ఈ సంసారమార్గమున సాగిపోవుచున్న మానవుని తాపత్రయములు అనుక్షణము పీడించుచుండును. అందు నిరంతరము పరితాపమునకు లోనగుచున్న పురుషునకు సర్వరక్షకమైన నీ పాదపద్మయుగళమనెడి గొడుగునీడ తప్ప శరణ్యమైనది మరియొకటి లేదు. అది అమృతమయమైన మోక్షమును ప్రసాదించును.


*19.10 (పదియవ శ్లోకము)*


*దష్టం జనం సంపతితం బిలేఽస్మిన్ కాలాహినా క్షుద్రసుఖోరుతర్షమ్|*


*సముద్ధరైనం కృపయాఽఽపవర్గ్యైవచోభియాసించ మహానుభావ॥12970॥*


మహానుభావా! దుర్భరమైన ఈ సంసారకూపమునపడి, కాలసర్పముచే కాటువేయబడుచున్నను మానవుడు క్షుద్రసుఖములపైగల తృష్ణను వీడలేక విలవిలలాడుచున్నాడు. అట్టి స్థితిలో నున్న పురుషుని మోక్షబోధకములైన నీ అమృతవచనములతో తడిపి దయతో ఉద్ధరింపుము.


*శ్రీభగవానువాచ*


*19.11 (పదకొండవ శ్లోకము)*


*ఇత్థమేతత్పురా రాజా భీష్మం ధర్మభృతాం వరమ్|*


*అజాతశత్రుః పప్రచ్ఛ సర్వేషాం నోఽనుశృణ్వతామ్॥12971॥*


*శ్రీభగవానుడు వచించెను* ఉద్ధవా! నీవు అడిగిన ఈ ప్రశ్ననే పూర్వము అజాతశత్రువైన ధర్మరాజు ధర్మాత్ములలో మేటియైన (భగవద్భక్తులలో శ్రేష్ఠుడైన) భీష్మపితామహుని మా అందరి సమక్షమున (మేము అందరము వినుచుండగా) అడిగెను.


*19.12 (పండ్రెండవ శ్లోకము)*


*నివృత్తే భారతే యుద్ధే సుహృన్నిధనవిహ్వలః|*


*శ్రుత్వా ధర్మాన్ బహూన్ పశ్చాన్మోక్షధర్మానపృచ్ఛత॥12972॥*


కురుక్షేత్రయుద్ధము ముగిసిన పిమ్మట ధర్మరాజు తనయొక్క బంధుమిత్రుల మృతికారణముగా ఎంతయు శోకవిహ్వలుడయ్యెను. అంతట అతడు భీష్మాచార్యుని నుండి పెక్కు ధర్మములను గూర్చి వినినమీదట మోక్షధర్మములను గూర్చి అభ్యర్థించెను.


*19.13 (పదమూడవ శ్లోకము)*


*తానహం తేఽభిధాస్యామి దేవవ్రతముఖాచ్ఛ్రుతాన్|*


*జ్ఞానవైరాగ్యవిజ్ఞానశ్రద్ధాభక్త్యుపబృంహితాన్॥12973॥*


అప్పుడు భీష్మపితామహుడు జ్ఞాన, విజ్ఞాన, వైరాగ్య, శ్రద్ధాభక్తిభావములతో పరిపూర్ణమైన పెక్కుమోక్షధర్మములను ధర్మరాజునకు నా సమక్షముననే తెలిపియుండెను. ఇప్పుడు నేను వాటిని నీకు వివరింతును.


*19.14 (పదునాలుగవ శ్లోకము)*


*నవైకాదశపంచత్రీన్ భావాన్ భూతేషు యేన వై|*


*ఈక్షేతాథైకమప్యేషు తజ్జ్ఞానం మమ నిశ్చితమ్॥12974॥*


ఉద్ధవా! ప్రకృతి, పురుషుడు, మహత్తత్త్వము, అహంకారము, పంచతన్మాత్రలు (శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు) అను తొమ్మిది, ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు, మనస్సు - అను పదకొండు, పంచమహా భూతములు (పృథివ్యాపస్తేజోవాయురాకాశములు), త్రిగుణములు (సత్త్వరజస్తమో గుణములు) అను ఈ ఇరువది ఎనిమిది తత్త్వములు మొదలుకొని బ్రహ్మపర్యంతముగల అన్ని కార్యములలో గోచరించును. వీటిలో కూడ పరమాత్మతత్త్వము ఒక్కటే అవగతమై యున్నట్లు దర్శించుటయే - పరోక్షజ్ఞానము అనబడును.


*19.15 (పదిహేనవ శ్లోకము)*


*ఏతదేవ హి విజ్ఞానం న తథైకేన యేన యత్|*


*స్థిత్యుత్పత్త్యప్యయాన్ పశ్యేద్భావానాం త్రిగుణాత్మనామ్॥12975॥*


ఈ ఇరువది ఎనిమిది తత్త్వములు ఉత్పత్తి, స్థితి, నాశములుగలవి. ఇవి త్రిగుణాత్మకమైన మాయయొక్క కార్యములు. ఈ భావములతో పరమాత్మ జగత్తుయొక్క సృష్టి, స్థితి, లయములను జరుపుచుండును. ఇవి ఆ స్వామియొక్క లీలలే. వీటిలో అంతర్లీనమైయున్న ఆ పరమాత్మతత్త్వమే శాశ్వతము. ఆ తత్త్వము అనుభవైకవేద్యము. అదే విజ్ఞానము.


*19.16 (పదహారవ శ్లోకము)*


*ఆదావంతే చ మధ్యే చ సృజ్యాత్సృజ్యం యదన్వియాత్|*


*పునస్తత్ప్రతిసంక్రామే యచ్ఛిష్యేత తదేవ సత్॥12976॥*


ఈ విధముగా పరమాత్మయే జగత్తుయొక్క ఆది మధ్యాంతములలో ఉండును. ఆ ప్రభువు ఈ విశ్వమును సృష్టించి, అందులో తానే అంతర్యామియై విలసిల్లుచుండును. ప్రళయకాలమున దానిని మరల తనలో లీనమొనర్చుకొను చుండును. అటుపిమ్మట ప్రళయానంతరము గూడ నిత్యసత్యమైన ఆ పరమాత్మతత్త్వమే మిగిలియుండును.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పందొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*477వ నామ మంత్రము* 27.10.2021


*ఓం త్రిలోచనాయై నమః*


మూడుకన్నులు గలిగిన శివానిగా తేజరిల్లుతున్న పరమేశ్వరి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *త్రిలోచనా* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం త్రిలోచనాయై నమః* అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తులకు ఆ పరమేశ్వరి సకలసంపదలు, విద్యావివేకములు. కీర్తిప్రతిష్టలతోబాటు అనంతమైన దైవధ్యాన నిరతిని అనుగ్రహించును.


చంద్రుడు, సూర్యుడు, అగ్ని - ఈ మూడునూ అమ్మవారి నయనములుగా భావింపబడినవి. ఒక కంట చల్లదనము, మరియొక కంట ఉష్ణము కలిసి సమశీతోష్ణమై కుడిఎడమనేత్రములయితే, మూడవనేత్రము కాలాగ్ని. శిష్టరక్షణలో దుష్టులను శిక్షించు క్రమంలో ఫాలనేత్రమై యున్నది. అంతేనా ఆ మూడు నేత్రములు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదములై వేదవాఙ్మయమును లోకమునకు ప్రసాదించుచున్నవి. అమ్మవారి మూడు నేత్రములు భూతభవిష్యద్వర్తమాన కాలములను సూచిస్తూ, ఆ తల్లి సర్వకాలములయందును తన భక్తులకు కొంగుబంగారమై ఉంటుందను భావనను కలుగజేయుచున్నవి. ఆ తల్లి మూడు నయనములు, ఒకటి సృష్టికి, ఇంకొకటి స్థితికి, మరియొకటి కల్పాంతమందు తనలో లీనమొనర్చు లయకార్యమునకు సాధనములైనవి. అమ్మవారి నేత్రములు ఆగ్రహానుగ్రహములు (దుష్టశిక్షణ, శిష్టరక్షణలకు) మాత్రమేకాదు, పంచకృత్యపరాయణత్వమును (సృష్టిస్థితిలయతిరోధాననుగ్రహములను) తెలియజేయుచున్నవి. నయనములతో ఎవ్వరైనను మాటలులేకుండా నవరసములను పండించవచ్చును అని అంటారు. అమ్మవారు అందుకు ఏమీ మినహాయింపుకాదు. లలితాసహస్ర నామస్తోత్రపారాయణ సమయంలో భక్తులు ఆ తల్లి నయనములలో నవరసములను వీక్షిస్తూ తన్మయులై ఆనందభాష్పములను అనుభవిస్తూ ఆనందిస్తూ ఉంటారు. అటువంటి తల్లికి నమస్కరించునపుడు *ఓం త్రిలోచనాయై నమః* అని యనవలెను🙏🙏🙏🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*476వ నామ మంత్రము* 27.10.2021


*ఓం ఆరక్తవర్ణాయై నమః*


పాటలపుష్ప (రక్త) వర్ణముతో శోభిల్లు జగన్మాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *ఆరక్తవర్ణా* యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును *ఓం ఆరక్తవర్ణాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిప్రపత్తులతో ధ్యానించు భక్తులకు ఆ కరుణామయి ఇహపరదాయకమైన శాంతిసౌఖ్యములు, శుభకరములు అనుగ్రహించును.


రక్తవర్ణము అంటే ఎర్రని ఎరుపురంగు గలిగిన వర్ణము అని భావము. కాని ఇక్కడ *ఆ* అను అక్షరము చేరుటచే *ఆ* అనునది ఒకశబ్దముగా తీసుకుంటే ఆ శబ్దమునకు *కొంచము* అని అర్థము. *ఆరక్తవర్ణా* అనగా కొంచము రక్తవర్ణము అనగా పాటల వర్ణము (ఎఱుపు,తెలుపుల మిశ్రిత వర్ణము)తో అమ్మవారు శోభిల్లు చున్నదని అర్థము. జగన్మాతను *సర్వారుణా* *(సర్వారుణాఽనవద్యాంగీ)* యని లలితా సహస్ర నామావళి యందు నలుబది తొమ్మిది, ఏబది నామాలలో స్తుతించాము. ఆ తల్లి శరీరము అరుణవర్ణము, వస్త్రములు అరుణవర్ణము, ఆభరణములు అరుణవర్ణము, తలలో ధరించిన పుష్పములు ( *కదంబమంజరీక్లుప్త కర్ణపూరమనోహరా* - 21వ నామ మంత్రము) అరుణవర్ణము. ఆ తల్లి సర్వారుణయై, దోషరహితమైన అవయవసంపదతో ఒక సౌందర్యరాశిగా శోభిల్లుచున్నదని స్తుతింపబడినది. కాని ఇక్కడ ఆ అరుణవర్ణము రక్తవర్ణము కాదు. ఆరక్తవర్ణము అనగా కొంచము ఎఱుపు అనగా పాటలవర్ణ (ఎఱుపు, తెలుపుల మిశ్రిత వర్ణ) శోభితయై భాసిల్లుచున్నది పరమేశ్వరి. ఎఱుపు తెలుపుల మిశ్రితవర్ణమైన పాటలవర్ణ శరీరకాంతితో భాసిల్లుట స్త్రీలకు సౌందర్యాతిశయమునకు భావన. అంతేకాదు కాలి, చేతివ్రేళ్ళు అత్యంత కోమలంగా, జాలువారు జలధారలుబోలిన శిరోజములు, మందస్మితము, అరమోడ్పుకన్నులు ఇవి అన్నియును సౌందర్య వర్ణనకు సాధనములే. ఈ విధంగా లలితా సహస్ర ధ్యాన శ్లోకం *సిందూరారుణ విగ్రహాం* అని ప్రారంభం నుండి, *అరుణాకరుణాతరంగితాక్షీం* అను ధ్యానశ్లోకంతోను, లలితా సహస్ర నామావళి యంతయూ అమ్మవారిని *ఆరక్తవర్ణ* శోభితమైన సౌందర్యరాశిగా స్తుతించడం జరిగింది. ఇది కేవలం సౌందర్యోపాసనాయుతమైన వర్ణనకాదు. ఆ తల్లిని ఒక అమ్మగా, ఆ అమ్మ అలా ఉన్నదని భావనతో అత్యంత ఉత్కృష్టమైన భక్తిభావనాయుత వర్ణన మాత్రమే. ఇలాంటి వర్ణన కాళిదాసు వంటి మహాకవికూడా 


*చతుర్భుజే చంద్రకళావతంసే.. కుచోన్నతే కుంకుమరాగశోణే.. పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే... జగదేకమాతః ... జగదేకమాతః* అని తన్మయంగా మాతృభావంతో వర్ణించడం జరిగింది.


అటువంటి పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం ఆరక్తవర్ణాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

విద్యతో వినయం వృద్ధి చెందాలి

 *విద్యతో వినయం వృద్ధి చెందాలి, అహంకారం కాదు..!!!*


🔸🔸🔸🔸🔹🔹🔹🔸🔸🔸


*మహాకవి కాళిదాసు* ఒకనాడు మండు వేసవిలో మిట్ట మధ్యాహ్నం ఒక కుగ్రామానికి చేరుకున్నాడు. దాహం వేయడంతో కాళిదాసు ఓ గుడిసె దగ్గరకు వెళ్ళి *"దాహంగా ఉంది, నీళ్లు ఇవ్వండి"* అని అడుగుతాడు....


గుడిస లోపల నుండి ఓ ముసలావిడ బయటకు వచ్చి *‘మీరెవరు?ఎక్కడనుండి వస్తున్నారు?'* అంటుంది....


కాళిదాసు "నేను ఎవరో తెలియకపోవడం ఏంటి? నేను ఓ పెద్ద పండితుడను. ఎవరిని అడిగినా చెబుతారు" అని అంటాడు....


ఆ మాటలు విన్న ముసలావిడ నవ్వి.. 'మీరు అసత్యమాడుతున్నారు. మీరంత గొప్పవారైతే *ప్రపంచంలో ఇద్దరు బలవంతులెవరో చెప్పండి’* అని అంటుంది....


కాళిదాసు కాసేపు ఆలోచించి"నాకు తెలియదు. గొంతు ఎండి పోతుంది, ముందు నీళ్లు ఇవ్వండి" అని బతిమాలుకుంటాడు...


" *ఆ ఇద్దరు బలవంతులు ఆకలి, దాహం.* ఇప్పుడు చెప్పండి మీరు ఎవరు?" అని మళ్ళీ అడుగుతుంది ముసలావిడ....


ఈసారి ‘ *నేను బాటసారి’* ని అంటాడు కాళిదాసు....


అయితే ఈ లోకంలో అలసిపోకుండా సంచరించే ఇద్దరు బాటసారులు ఎవరూ అంటూ ప్రశ్నిస్తుంది ముసలావిడ....


తెల్ల ముఖం పెట్టి మాతా! "నీళ్ళు ఇవ్వండి. లేకుంటే దాహంతో చనిపోయేలా ఉన్నాను" అంటూ ప్రాదేయపడతాడు కాళిదాసు....


*వాళ్ళు సూర్యచంద్రులు* ’ అని తెలిపి" మరి మీరెవరో సెలవివ్వండి. నీళ్లిస్తాను" అంటుంది ముసలావిడ....


కాళిదాసు దీనంగా" నేను అతిథిని"అని బదులిస్తాడు....


"మీరు మళ్ళీ అసత్యం చెబుతున్నారు. ఈ సృష్టిలో అతిథులు ఇద్దరే. *ఒకటి ధనం, రెండోది యవ్వనం* . అవి ఎప్పుడు వస్తాయో పోతాయో ఎవరికీ తెలియదు"అంటుంది ముసలావిడ....


కాళిదాసు "నా సహన పరీక్ష తరువాత చేద్దురు. ముందు నీళ్లు ఇవ్వండి"అని వేడుకుంటాడు....


*"ఈ ప్రపంచంలో ఇద్దరే సహనశీలురు. వారెవరో శెలవివ్వ గలరా"* అంటూ... బిక్కమొహం వేసిన కాళీదాసుతో *"ఒకటి భూమి, రెండోది వృక్షం"* అని భోద పరచి"ఇప్పుడు నిజం చెప్పండి మీరెవరు?" అని మళ్ళీ అడుగుతుంది ముసలావిడ....


ఓపిక నశించిన కాళిదాసు" నేను మూర్ఖుడను. ఈ మూర్ఖుడికి ఇప్పుడైనా నీళ్లివ్వండి" అని సాగిల పడతాడు....


ఆ అవ్వ నవ్వుతూ *"ఇదీ అసత్యమే.* ఈ రాజ్యంలో ఇద్దరే మూర్ఖులున్నారు. ఒకరు ఈ రాజ్యాన్ని పాలించే రాజు. అర్హత లేకున్నా ప్రజలపై పెత్తనం చెలాయిస్తున్నాడు. రెండోవాడు ఆ రాజు మెప్పు కోసం అసత్య వాక్యాలు చెప్పే పండితుడు" అని అంటుంది....


ఆ జవాబుతో కాళిదాసుకు కనువిప్పు కలుగుతుంది. ఆ అవ్వ కాళ్ల మీద పడి క్షమాపణలు కోరుతాడు....


ఆ అవ్వ సరస్వతీదేవిగా సాక్షాత్కరించింది. *‘నాయనా! విద్యతో వినయం వృద్ధి చెందాలి, అహంకారం కాదు.కీర్తి, ప్రతిష్ఠల మాయలో పడిపోయిన నీ బుద్ధిని సరి చేయటానికే ఈ పరీక్ష’* అని మంచినీరు అందించి దాహం తీరుస్తుంది.


*విద్య, అధికారం, ధన బలము తో మనిషికి అహంకారం పెరగకుండా చూసుకోవాలి*.

గెలవాల్సింది పచ్చని పొలాల్లో.

 దేశం గెలవాల్సింది స్టేడియాల్లో కాదు 

పచ్చని పొలాల్లో...


🌱🍅🌰🍠🥔🌶🌽🍆


వికెట్ పడిపోతేనే దేశం ఓడిపోతుందేమోనని భయపడే 

దేశ భక్తులారా.... 

ఈవిషయాలపై ఎప్పుడైనా దృష్టి పెట్టారా.... 

ఒక్కసారి ఆలోచించండి...


 దేశానికి అన్నం పెట్టే దేహాలెన్నో పడిపోతున్నాయ్ 

పట్టించుకుంటున్నావా.......

🍅🍅🍅

ఇష్టమయిన క్రికేటరెవరో 

వంద పరుగులు చెయ్యాలని దేవుణ్ణి మొక్కుకున్నట్లు 

నీకు తెలిసిన రైతు ఎవరైనా 

వంద బస్తాలు పండించాలని 

ఎప్పుడైనా మనసారా కోరుకున్నావా.....

🍏🍏🍏

రెండు గంటలు బ్యాటు పట్టుకోని ఆడినతను గాడ్ అయితే 

నీకు జీవితాంతం బువ్వ పెట్టే రైతన్న కే పేరు పెడుతావ్ ?....

🌽🌽🌽

దేశాన్ని గెలిపించడానికి 

కొన్ని బంతులే ఉన్నాయని తెలిస్తేనే ,

టెన్షన్ పడి గొంతు తడుపుకుంటావ్.

దేశాన్ని బతికించే 

నదులు చెరువులు కొన్ని మాత్రమే నీళ్ళతో ఉన్నాయ్ 

అనే ఆందోళన నీకుందా ?...

🌶🌶🌶

నీకు సంతోషం ఇచ్చే ఆటగాళ్ళను 

నీకు ఇష్టమయిన రీతిలో ఎంకరేజ్ చేస్తుంటావ్

నిన్ను బతికించే రైతులకెవరూ 

ఎంకరేజ్ చెయ్యడం లేదని తెలుసా....

🥕🥕🥕

నీకు ఏ స్టేడియం లో పిచ్ ఎలా ఉంటదో తెలుసు కానీ

నీ ఊరిలో మార్కెట్టు యార్డు అసలెక్కడుందో 

ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలుసా......

🍆🍆🍆

అన్నం తింటూ కూడా ..

పాకిస్తానీ టీం ని దేశం లో రానియ్యాల వద్దా అని 

నీకు తెలిసిన గొప్పలు ప్రదర్శిస్తావ్ .

అసలు నీ చేతిలో ఉన్నది స్వదేశి బియ్యమో 

విదేశి దిగుమతి బియ్యమో తెలుసా.....

🍋🍋🍋

ఇండియన్ క్రికేట్ బోర్డో , క్రికేట్ టీమో 

చేసే తప్పోప్పులన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటావ్

వ్యవసాయానికి పెట్టింది పేరయినా దేశం లో 

ప్రభుత్వాలు చేసే తప్పోప్పుల్ని

అసలెప్పుడయినా పట్టించుకున్నావా.....

🍠🍠🍠

ఎవరు ఎప్పుడు ఎంత స్కోర్ చేసారో తెలిసిన 

నీకు 

రోజెక్కడెక్కడ ఎంతమంది రైతులు చస్తున్నారొ తెలుసా ....

🥒🥒🥒


🍍🍍🍍

ఎప్పుడయినా ,

గిట్టు బాటు ధరలకోసమో ,విద్యుత్తుకోసమో పోరాటం చేస్తూ

లాఠీ దెబ్బలు తింటూ పరిగెత్తే రైతన్నలను బాధలను చూసావా.....

🍇🍇🍇

ఏ దేశం బౌలరు ఎలా బాల్ వేస్తాడో తెలిసిన నీకు 

రాజ్యం , దళారీలు ఎలా రైతులను మోసం చేస్తున్నారో ఏనాడైనా ఆలోచించావా.

🍈🍈🍈

కామెంట్రీలు వింటూ టీవి లకు అతుక్కు పోయినట్లు 

రైతుల గురించి చర్చా కార్యక్రమాలు ఏనాడైనాచూసావా... ?

🥜🥜

🍊🍊🍊

పది మంది ఆడే ఆటకోసం లక్షల మంది ఒక్కటౌతున్నాం 

కోట్లమంది ఆకలి తీర్చే రైతుల కోసం ఏం చేస్తున్నాం....

🌿🌿

🐓🐓🐓

ఇండియా గెలవాల్సింది స్టేడియాల్లో కాదు 

పచ్చని పోలాల్లో ....

అందుకు 

రైతులు నాటౌట్ గా నిలవాలి

మంచి లీడర్స్ ను ఎన్ను కోవాలి ..✍️🌾🌴🌺🌹

ఉచ్ఛిష్టం* ( ఎంగిలి )

 *ఉచ్ఛిష్టం* ( ఎంగిలి )

 ఇంత గొప్ప వ్యాసాన్ని ప్రచురించిన ఋషిపీఠం వారికి నమో నమః🙏

బొట్టు జారిపోతోంది...
'కట్టు' మారిపోతోంది!
కూరుచున్న కొమ్మలను 
కూలదోయుచున్న దెవరు? 
మూలం తెలియక మాయల 
జాలంలో పడినవారు.... 
మారీచుని భూతం కని 
మదనుడన్న వారెవరు? 
ఎంగిలి చదువుల ముంగిట 
చతికిల పడి ఉన్న వారు! 


గలగలా కబుర్లు చెప్పుకుంటూ వారు నలుగురూ బస్ స్టాప్ వద్దకు నడచి వచ్చారు. బహుశా ఆ నలుగురూ ఒక జట్టు కావచ్చు! పసితనం ఇంకా తొలగని మిసిమితనం వారి వదనారవిందాలలో ప్రస్ఫుటిస్తోంది. సందేహం లేదు, వారంతా ఇంటర్మీడియట్ విద్యార్ధినులే. కళాశాలల నుంచి ఇళ్లకు బయలుదేరిన వారంతా అక్కడ చేరిపోయారు. 


ఆ నలుగురూ ఒక 'శీతల పానీయశాల' వద్దకు వచ్చి నిలబడినారు. కొట్టువాడు రెండు పెద్ద గ్లాసులు నిండా 'పెప్సీ' పానీయం పోశాడు. ఇద్దరు అమ్మాయిలకు అందించాడు. ఇద్దరు బాలికలే కొన్నారు. మిగిలిన ఇద్దరి వద్ద పైసలు లేవేమో? .. 'పెప్సీ' గ్లాసులు అందుకున్న అమ్మాయిలిద్దరూ నిలబడినారు. అందుకోని పిల్లలు ఇద్దరూ బెంచిమీద కూచున్నారు. ఒక అమ్మాయి గ్లాసులోని పానీయం కొంచెం తాగింది. ఆ తరువాత చాలా జాగ్రత్తగా ఆ గ్లాసును కూర్చున్న బాలికకు అందించింది. ఆమె కూడ కొంచెం తాగి, పక్కనున్న నాలుగవ అమ్మాయికి అందించింది. ఆ నాలుగవ బాలిక కూడ తాగి మళ్లీ మొదటి అమ్మాయికి ఇచ్చింది. వారు తాగిన దాన్ని మళ్లీ తాను తాగుతోంది.... 


ఇలా ఒకరి ఎంగిలి మరొకరు తాగడం, తినడం ఇప్పుడు భలే ఫ్యాషనైపోయింది. ఇలా చేయడం "ఆత్మీయత"కు చిహ్నంగా, స్నేహానికి పరాకాష్ఠగా ప్రచారం జరిగిపోతోంది. "అయినా! ఎంగిలి ఏమిటి?? ఎక్కడుంది?? " అని ఎదురు ప్రశ్నలు కూడ దూసుకొని వస్తున్నాయి. 

"రెండు గ్లాసుల పానీయాన్ని నాలుగింటిలో పంచుకొని తాగవచ్చు కదా?" అని అడిగి చూడండి "అదంతా పూర్వ కాలం నాటి మూఢాచారం. ఇది కంప్యూటర్ యుగం..." అన్న సమాధానం కూడ వచ్చేస్తుంది! 

 ఘరానా హోటళ్ళలో 'సాంబారు'ను 'సీజనింగ్' చేసే 'కిచెన్ మాస్టర్' (వంటవాడు అనడం అవమానకరం) గరిటెలో పులుసును తీసుకొని చేతిలో పోసుకొని నాకుతాడు. చెయ్యి కడగడు. ఒక్కొక్కసారి, మిగిలిన ఎంగిలి సాంబారును 'స్టైల్' గా పొయ్యిమీద ఉన్న పులుసు గిన్నెలోకి విదిలించి పారేస్తాడు! 

"వేలుపులటె నాకంటెను
వేలుపు మరి ఎవ్వడంచు వికవిక నగి, మా 
వేలుపుల గోడపై ఓ 
హేలావతి! నీతనూజు డెంగిలిపూసెన్!" 

అంటూ ఆనాడు, ద్వాపర యుగంలో గోపకాంతలు యశోదమ్మ దగ్గర వాపోయారు. చిన్ని కృష్ణుని 'ఆగడాల' లో ఇలా 'ఎంగిలి పూయడం' ఒకటి. "పసిపిల్ల వాడు కదా. ఎంగిలి పూస్తే పూశాడులే!" అని గోపెమ్మలు ఎందుకు ఊరుకోలేదు? ఎందుకంటే, 'ఎంగిలి' ని 'మంగళం'గా స్వీకరించడం భారతీయతకు వ్యతిరేకం కాబట్టి! తండ్రీ కొడుకులు, తల్లీ కూతుళ్లు సైతం ఒకరి 'ఎంగిలి' మరొకరు తినడం, తాగడం భారతదేశంలో అనాదిగా నిషిద్ధం! 

ఒక పల్లె నుండి కొంత మంది జానపదులు ఒక పట్టణానికి వెళ్లారు. మధ్యాహ్నమైంది. ఆ గ్రామీణులు భోజనం చేయడానికై ఒక 'హోటల్' కు వెళ్లారు. ఒక 'టేబిల్' చుట్టూ కూచున్నారు. భోజనం చేయడం ఆరంభించారు. కానీ పక్కన ఉన్న మరో బల్ల వద్ద కనిపించిన దృశ్యం చూసి వాళ్ళకు డోకు వచ్చిందట. వాంతి అవుతుందేమోనని భయపడినారు. వారంతా అర్ధాంతరంగా లేచివచ్చేశారట - బిల్లు చెల్లించి! 

పక్క టేబిల్ వద్ద వారికి కన్పించిన దృశ్యం ఏమిటి? నలుగురు వ్యక్తులు ఆ టేబిల్ వద్ద కూర్చున్నారు. వారంతా విదేశీయ మతం స్వీకరించిన వారు. ఆ విధర్మీయులు నలుగురూ తమ కంచంలోనుండి తింటున్నారు. ఒకరు, మిగిలిన ముగ్గురి కంచాలలోని పదార్థాలను సైతం తింటున్నారు. ఒకరి ఎంగిలి కంచంలో నుండి మరొకరు మెక్కుతున్నారు. బల్లమీదంతా ఈ 'సామూహిక ఉచ్ఛిష్ట భక్షణ అవశేషాలు' నిండిపోయాయట. అది వారి మతం, వారి పద్ధతి. ఈ విదేశీయ మ్లేచ్ఛ ఆచారం ఆ జానపదులకు నచ్చలేదు. అసహ్యం వేసింది. ఎందుకంటే, ఆ గ్రామీణులంతా హిందువులు. 

ఆ జానపదులలోని ఒక వృద్ధుడు ఇంకా ఇలా వివరించాడు ".....మనం ఒకరి ఎంగిలి మరొకరు తినము. అంతేకాదు ఒకరి ఎంగిలిని మరొకరు తింటూ ఉంటే చూడలేం కూడ! బిచ్చగాడికి సైతం మనం ఎంగిలి అన్నం పెట్టం, కుక్కకు కూడా ఎంగిలి కూడు వెయ్యం...." ఇలా 'ఎంగిలి'ని నిరసించిన వారు వేద పండితులు కాదు, విదేశీయమైన 'ఎంగిలి' చదువులు వంట బట్టని సామాన్య గ్రామీణులు, సాదా సీదా హిందువులు!

దేవుడికి నైవేద్యం పెట్టిన తరువాత భూత యజ్ఞం చేయడం కూడ హిందూ జీవన పద్ధతి. సనాతన ధర్మం నిర్దేశిస్తున్న పంచయజ్ఞాలలో భూతయజ్ఞం ఒకటి. ఇది నిత్యవిధి. 'బలిహరణం' పెట్టడం కూడ భూతయజ్ఞమే. ఈ 'బలిహరణం' కుక్కకు, అవుకు, జలచరాలకు, పక్షులకు వేయవచ్చు. ఇప్పుడు ఇలా భూతతృప్తి చేసిన తరువాతనే మనం భోజనం చేయాలన్న సనాతన ఆచారాన్ని నగరాలలోని అత్యధిక హిందువులు మరచిపోయారు. కొంతమంది కేవలం పండుగలప్పుడు మాత్రం 'బలిహరణం' పెడుతున్నారు. బూట్లు కట్టుకొని టేబుల్ ముందు కూచోని నడుము వంగకుండా చెంచాలతో ఆరగించే నవ నాగరికులు మనవన్నీ మరచిపోతున్నారు.

విదేశీయమైన ఎంగిలి సంప్రదాయాలను 'కల్చర్' అనుకొని మురిసి పోతున్నారు. అలా 'బలిహరణం' వేయడం మనంణ తినక పూర్వం జరిగే నిత్యవిధి. ఈ 'బలిహరణ' ఓదనం 'ఎంగిలి ముద్ద' కాదు, కారాదు. అన్నం పెట్టలేక పోతే గోధుమలను బియ్యపు గింజలను సైతం ఒక గుప్పెడు పక్షులకు బలిహరణం పెట్టవచ్చు. పొలాలలో బువ్వతినే రైతన్నలు, గ్రామీణులు మాత్రం నిత్యం భూతయజ్ఞం చేస్తున్నారు. చూసివస్తే తెలుస్తుంది. మొదటి ముద్దను తుంచి (ఎంగిలి కాకపూర్వం) ఎదురుగా ఉండే కుక్క ముందుకు విసురుతారు. లేదా దూరంగా పక్షులకు విసిరివేస్తున్నారు. మరోసారి కుక్కకు పెట్టాలనుకుంటే 'బుట్ట' లోని 'ఎంగిలికాని' ముద్దలను పెడతారు కానీ, తాము తింటున్న 'తట్ట'లోని ఎంగిలి ముద్దలు వేయరు. ఇలా 'ఉచ్ఛిష్ట భోజన' నిషేధం అక్షరాలురాని జానపదులలో సైతం అనాదిగా అభివ్యాప్తమై ఉంది. కానీ అక్షరాలు నేర్చిన వారు ఈ సనాతన పద్ధతులకు దూరమైపోతున్నారు. ఇదంతా చెబితే చాలా మందికి బ్రహ్మాండమైన కోపం కూడ వచ్చేస్తుంది. 

మంగళకర భావాలను పరస్పరం పంచుకోవడం, మంచి సంస్కారాలను సమష్టిగా ఆచరించడం సనాతన ధార్మిక జీవన రీతి. కాని ఎంగిలి తినడం కాదు! ఒక వ్యక్తి తన ఎంగిలి అన్నాన్ని సైతం మరోసారి తినరాదని వేద శాస్త్ర పురాణాలు చెబుతున్నాయి. 

 ప్రతీ ఉదయం చేసే సంధ్యావందనం లో ...
"యదుచ్ఛిష్టం, అభోజ్యం యద్వాదుశ్చరితం మమ సర్వం పునంతు మాం ఆపః...." అని నీరు జల్లుకుంటాం. 
అర్థం: "ఎంగిలి తిన్నందువల్ల, తినకూడనిది తిన్నందువల్ల, తెలియక చేసిన ఇతర చెడ్డ పనుల వల్ల వచ్చిన పాపం నుంచి ఈ ఉదకం నన్ను విముక్తిణ్ని చేయుగాక...." 

బాలుడికి ఉపనయనం చేసేటప్పుడు నందిమోహం లో తల్లి, కుమారుడు ఒకే పళ్లెంలో భుజిస్తారు. పిల్లవాడు తల్లి ఎంగిలి తినడం అదే చివరి సారి. రజస్వల అయిన బాలికలు, పెళ్లయిన బాలికలు తల్లి ఎంగిలిని సైతం తినరు. పది పదిహేనులోపు వయసున్న బడిపిల్లలు సైతం ఒకరి ఎంగిలి మరొకరు తినరు. నిన్న మొన్నటి వరకు సజీవంగా ఉండిన ఈ సనాతన తత్వం నేడు పాశ్చాత్య నాగరికతా గ్రస్తమైపోతోంది. 'పదార్థ మోహం'తో బాల్య చాపల్యంతో పిల్లలు 'కాకెంగిలి' తినేవారు. ఒక మిఠాయిని కాని, తిను బండారాన్ని కాని పిల్లలు చేతితో తుంచలేనప్పుడు ఆ పదార్ధం చుట్టూ గుడ్డ చుట్టి కొరకడం, ముక్కలు చేయడం "కాకి ఎంగిలి". అది చిన్న పిల్లలు మాత్రమే ఈ పని చేసేవారు. ప్రస్తుతం కాకిని తోలేసి పెద్దలంతా 'ఎంగిలి'ని తినేస్తున్నారు. వారిని చూసి పిల్లలు కూడ నేర్చుకుంటున్నారు. మళ్లీ ఎప్పుడో.... "ఎంగిలి తినడం, తాగడం ప్రమాదకరం, రోగాలు వ్యాపిస్తాయి సుమా!" అంటూ పాశ్చాత్య దేశాలలో శాస్త్రీయ ప్రచారం మొదలైపోతుంది. అప్పుడు కానీ మన విద్యావంతులు ఎంగిలి తినడం మానరేమో! మన ఉత్కృష్ట సంస్కృతిని ఉచ్ఛిష్ట నాగరికత మింగివేస్తోంది! 

రైల్లో బస్సుల్లో ఆసీనులైన వారు 'ఉర్లగడ్డ ఉప్పేరి' (పొటాటో చిప్స్) ప్లాస్టిక్ పాకెట్లను నోటితో కొరికి చింపుతున్నారు. తరువాత ఆ ఎంగిలిని అందరికీ పంచుతున్నారు.          

"అక్టోబర్ 2007 ఋషిపీఠం మాస పత్రికలో 'హెబ్బార్ నాగేశ్వరరావు' గారు రచించిన ప్రత్యేక రచన".

మరచిపోతూ ఉంటాను"

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

.

" ఏమిటోనోయ్!  అస్తమానూ   పెన్ను  ఎక్కడ  పెట్టానో  మరచిపోతూ  ఉంటాను" 

.

"  ఎందుకు  అలా ? " 

.

"  ఏమిటో  మరి  ఈ  మతి   మరుపు !  అందుకే   నేను  ఎప్పుడోఖరీదైన  పెన్నులు వాడడం  మానేశాను .  చీప్  పెన్ను  మాత్రమె  వాడుతున్నాను .  అది  మరిచిపోయి  పారేసినా  బాధ  అనిపించదులే !  అయితే  నా  బాధ  ఈ  మతిమరుపు  గురించే ! " 

.

.

.

" నేను  ఒక  సలహా   ఇవ్వనా ? "  

.

"  మతిమరుపు  పోతుందా ?"  

.

"  చెప్పలేను !  నీ  మీద  ఆధారపడి  ఉంటుంది !" 

.

ఏమిటది ? 

.

.

"  నువ్వు  కొనగలిగినంత  అత్యంత  ఖరీదు  అయిన  పెన్ను  కొని  వాడుతూ  ఉండు  .  అప్పుడు  కూడా   నువ్వు మరిచిపోతావా?   ,  నీ  మరుపు  పోతుందా ?   చూద్దాము " 

.

..

"  తప్పకుండా   చేస్తాను " 

.

.


.

.

ఆర్నెల్ల  తర్వాత   స్నేహితుడు ఫోన్  చేసి  పెన్ను  మరిచిపోతున్నావా ?   అని  అడిగాడు .

.

.

.

 

.

" అబ్బే ! నువ్వు  చెప్పాక 22 కేరట్ల బంగారం పెన్ను   కొన్నాను . దాని  విషయం  లో  చాలా  జాగ్రత్తగా  ఉంటున్నాను .  ఈ ఆరునెలల్లో  ఒక్క  రోజు  కూడా   నేను  దానిని  ఎక్కడా  మర్చిపోలేదు " 

.

.

.

"  నువ్వు  పెన్ను  మర్చిపోకపోడానికి  కారణం నువ్వు  దానికి  ఇచ్చిన  విలువ ." 

.

.

.

 మనం  దేనికి  విలువ  ఇస్తామో  దానిపట్ల  మనం   జాగ్రత్తగా  ఉంటాము .

.

 

వస్తువుకు  విలువ  ఇస్తే  దాన్ని  కోల్పోము 

.


ఆరోగ్యానికి  విలువ  ఇస్తే  ఏమి  తినాలో  ,  ఏమి  తినకూదదో , ఎంత  తినాలో  ,  ఎప్పుడు  తినాలో  అన్నీ  జాగ్రత్తగా  ఉంటాము 

.


స్నేహానికి  విలువ  ఇస్తే స్నేహితుడిని  గౌరవిస్తాము 

.


డబ్బుకు  విలువ  ఇస్తే  ఆచి  తూచి   ఖర్చు  పెడతాము 

.


కాలానికి  విలువ  ఇస్తే  టైం  వేస్ట్  చెయ్యము 

.


బంధాలకు  విలువ  ఇస్తే  వాటిని  తెంచుకోము

.

 

దేనికి  ఎంత  విలువ  ఇవ్వాలో  తెలుసుకుని   వ్యవహరించడం  మనం  నేర్చుకోవలసినది ..

              🌷🌷🌷

🌹ఈ  సలహా  ఇచ్చిన  వారు జెఆర్ డి టాటా🌹  🙏🙏

శ్రీమద్వాల్మీకి రామాయణం

 


ॐ శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం 

 

( ప్రభుత్వ డిగ్రీ కళాశాల భద్రాచలం - 2007లో "రామాయణం"పై నిర్వహించిన సదస్సులో సమర్పించిన, 

   "శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం" 

    అనే పత్రంలోని ఒక అంశం)

                ----------------------- 


          6. గణితం - సంఖ్యాశాస్త్రం 


      మానవజీవితంలో గణన అనేది అతి ముఖ్యమైనది. గణితం అనేది ఒక శాస్త్రంగా అందఱికీ తెలిసిన విషయమే కదా! 

      ద్రవ్యరాశి, పొడుగు, కాలాలకి సంబంధించి వివిధ మానాలని మనం ఉపయోగిస్తూ ఉంటాం. వీటన్నిటికీ మౌలికంగా అంకెలు ప్రధానమైనవి.

      ఏవి గణించాలన్నా అవుసరమయ్యేవి సున్న నుంచి తొమ్మిది వరకు గల అంకెలు. 

      ఆ సంఖ్యలకి సంబంధించి 

 - లక్షలు - కోట్లు అని ఒక విధంగా లెక్కపెడితే,

 - మిలియన్లు - బిలియన్లు - ట్రిలియన్లు అనే మరొక పద్ధతిలో మరొక విధంగా లెక్కపెడతాము. 


      శ్రీమద్వాల్మీకి రామాయణంలో వివిధ దేశాలలో వివిధ సంఖ్యామానాలు, దీనికి దాదాపు భంగం కలుగకుండా కనిపిస్తాయి. 


సుగ్రీవుడు చెప్పిన లెక్కింపు 


      సుగ్రీవుడు తన వద్దకు చేరుకునే వానరుల సంఖ్య శ్రీరామునికి వివరించాడు. 

      దానిలో 

   - వందమంది 

   - లక్ష 

   - కోటి 

   - అయుతము 

   - శంకువు 

   - అర్బుదము 

   - నూరు అర్బుదములు 

   - మధ్య 

   - అంతము అనే సంఖ్యలతో లెక్కపెట్టేంతమంది వానరులు నాయకులతో దారిలో వస్తున్నారని తెలిపాడు. 

      సముద్ర 

    - పరార్థ సంఖ్యలలోఉన్న వానరులు తనవద్దకు చేరుకుంటున్నారని చెప్పాడు. 


లంకలో 


      రావణుని గూఢచారులైన శుకసారణులు, ఇదే వానర సైన్యాన్ని చూసి, రావణునికి వివరించారు. 

      లక్ష కోట్లు ఒక శంఖము అనీ, 

      లక్ష శంఖములు ఒక మహా శంఖమనీ, 

      లక్ష మహా శంఖములు ఒక బృందమనీ, 

      లక్ష బృందముల ఒక మహా బృందమనీ, 

      లక్ష మహా బృందములు ఒక పద్మమనీ, 

      లక్ష పద్మములు ఒక మహా పద్మమనీ, 

      లక్ష మహా పద్మములు ఒక ఖర్వమనీ, 

      లక్ష ఖర్వములు ఒక మహా ఖర్వమనీ, 

      లక్ష మహా ఖర్వములు ఒక సముద్రమనీ, 

      లక్ష సముద్రములు ఒక ఓఘమనీ, 

      లక్ష ఓఘములు ఒక మహౌఘమనీ వివరిస్తూ లెక్క చెప్పారు.  

      ఈ విధంగా సుగ్రీవ సైన్యాన్ని వారి మానంలోకి మార్చి రావణునికి తెలిపారు. 


      జ్యోతిష్య శాస్త్రంలో ఏకం దశ శతంత్వస్మాత్ సహస్రమ్ .... అని తెలిపిన విధంగా ఒకటి నుంచి పరార్థము అనేవి సంఖ్యలుగా ఒకదానికన్న దాని తరువాతది పదిరెట్లు ఉండే విధంగా పేర్లు చెప్పబడ్డాయి. 


      వివిధ దేశాలలో వివిధ సంఖ్యామానాలు మౌలికంగా ఉండి, పరివర్తనకి వీలైనవిగా ఉండడం ఆదర్శం కదా! 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

              భద్రాచలం