27, అక్టోబర్ 2021, బుధవారం

సంస్కృత మహాభాగవతం*

 *27.10.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - పందొమ్మిదవ అధ్యాయము*


*జ్ఞాన-భక్తి-యమనియమాది సాధనముల వర్ణనము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*19.17 (పదిహేడవ శ్లోకము)*


*శ్రుతిః ప్రత్యక్షమైతిహ్యమనుమానం చతుష్టయమ్|*


*ప్రమాణేష్వనవస్థానాద్వికల్పాత్స విరజ్యతే॥12977॥*


శృతి (వేదము) ప్రమాణము, ప్రత్యక్షప్రమాణము, ఐతిహ్యప్రమాణము (ఇతిహాసపురాణములు - మహాపురుష వచనములు), అనుమానప్రమాణము - అను నాలుగు విధముల ప్రమాణములను బట్టి దృశ్యప్రపంచము అస్థిరమనియు, పరివర్తనశీలమనియు, నశ్వరమనియు బోధపడును. కనుక వివేకవంతుడు వివిధమైన కల్పనారూప ప్రపంచమునుండి విరక్తుడగును. అట్టి జ్ఞానియొక్క దృష్టిలో పరమాత్మ తప్ప ఏ వస్తువునకు అస్తిత్వము ఉండదు.


*19.18 (పదునెనిమిదవ శ్లోకము)*


*కర్మణాం పరిణామిత్వాదావిరించాదమంగళమ్|*


*విపశ్చిన్నశ్వరం పశ్యేదదృష్టమపి దృష్టవత్॥12978॥*


'ఇహలోకభోగములు అన్నియును నశ్వరములైనట్లే, యజ్ఞాదులఫల స్వరూపములుగా లభించు స్వర్గాది బ్రహ్మలోక పర్యంతముగల సుఖములన్నియు అమంగళములు, దుఃఖదాయకములు, నశ్వరములు' అని జ్ఞాని గ్రహించవలెను.


*19.19 (పందొమ్మిదవ శ్లోకము)*


*భక్తియోగః పురైవోక్తః ప్రీయమాణాయ తేఽనఘ|*


*పునశ్చ కథయిష్యామి మద్భక్తేః కారణం పరమ్॥12979॥*


మహాత్మా! ఉద్ధవా! భక్తియోగమును  గూర్చి నీకు ఇంతకుముందే తెలిపియుంటిని. కాని దానియందు నీకు ప్రీతి ఎక్కువగా ఉండుటవలన అట్టి భక్తి ప్రాప్తించుటకు గల శ్రేష్ఠసాధనములను గూర్చి ఇంకను విపులముగ వివరించెదను. వినుము-


*19.20 (ఇరువదియవ శ్లోకము)*


*శ్రద్ధామృతకథాయాం మే శశ్వన్మదనుకీర్తనమ్|*


*పరినిష్ఠా చ పూజాయాం స్తుతిభిః స్తవనం మమ॥12980॥*


"ఉద్ధవా! నా యెడల భక్తిభావమును పొందగోరు పురుషుడు అమృతతుల్యములైన నా కథలను వినుటయందు శ్రద్ధను కలిగియుండవలెను. నిరంతరము నా నామ, రూప, గుణలీలలను కీర్తించుచుండవలయును. నా అవతారములను, కర్మలను ప్రతిపాదించు వచనములయందు ఆసక్తి కలగియుండవలెను. స్తోత్రములద్వారా నన్ను స్తుతించుచుండవలెను.


*19.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*


*ఆదరః పరిచర్యాయాం సర్వాంగైరభివందనమ్|*


*మద్భక్తపూజాభ్యధికా సర్వభూతేషు మన్మతిః॥12981॥*


భగవత్పూజా మందిరములను శుభ్రపఱచుట, ఆవాహనాది షోడశోపచారములను నెరపుట, సాష్టాంగముగా నమస్కరించుట అనుష్ఠింప వలెను. నా కంటెను ఎక్కువగా నా భక్తుని పూజింపవలెను. సకలప్రాణులలో నన్నే భావనచేయవలెను.


*19.22 (ఇరువది రెండవ శ్లోకము)*


*మదర్థేష్వంగ చేష్టా చ వచసా మద్గుణేరణమ్|*


*మయ్యర్పణం చ మనసః సర్వకామవివర్జనమ్॥12982॥*


శారీరక క్రియాకలాపములన్నింటిని నా ప్రీతికొరకై చేయవలయును. వాక్కులతో నా గుణగణములనే ప్రస్తావించుచుండవలెను. సమస్త కామములను విసర్జించి, త్రికరణశుద్ధిగా నన్నే సేవింపవలెను.


*19.23 (ఇరువది మూడవ శ్లోకము)*


*మదర్థేఽర్థపరిత్యాగో భోగస్య చ సుఖస్య చ|*


*ఇష్టం దత్తం హుతం జప్తం మదర్థం యద్వ్రతం తపః॥12983॥*


నా ప్రీతికొరకై సంపదలను వినియోగింపవలెను. సుఖసౌఖ్యములను త్యజింపవలెను. యజ్ఞములు, దానములు, హోమములు, వ్రతములు, జపతపాదులు నా ప్రీతికొరకై (భగవదర్పణముగా) ఆచరింపవలెను.


*19.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*


*ఏవం ధర్మైర్మనుష్యాణాముద్ధవాఽఽత్మనివేదినామ్|*


*మయి సంజాయతే భక్తిః కోఽన్యోఽర్థోఽస్యావశిష్యతే॥12984॥*


ఈ ధర్మములను ఆచరించుచు తమ సర్వస్వములను నాకే అర్పించువారికి నాయందు దృఢమైన భక్తి కుదురుకొనును. నాయందు పరిపూర్ణమైన భక్తినెలకొన్నవారికి కావలసినది ఇంకేమి మిగిలియుండును?


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పందొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

కామెంట్‌లు లేవు: