27, అక్టోబర్ 2021, బుధవారం

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*477వ నామ మంత్రము* 27.10.2021


*ఓం త్రిలోచనాయై నమః*


మూడుకన్నులు గలిగిన శివానిగా తేజరిల్లుతున్న పరమేశ్వరి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *త్రిలోచనా* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం త్రిలోచనాయై నమః* అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తులకు ఆ పరమేశ్వరి సకలసంపదలు, విద్యావివేకములు. కీర్తిప్రతిష్టలతోబాటు అనంతమైన దైవధ్యాన నిరతిని అనుగ్రహించును.


చంద్రుడు, సూర్యుడు, అగ్ని - ఈ మూడునూ అమ్మవారి నయనములుగా భావింపబడినవి. ఒక కంట చల్లదనము, మరియొక కంట ఉష్ణము కలిసి సమశీతోష్ణమై కుడిఎడమనేత్రములయితే, మూడవనేత్రము కాలాగ్ని. శిష్టరక్షణలో దుష్టులను శిక్షించు క్రమంలో ఫాలనేత్రమై యున్నది. అంతేనా ఆ మూడు నేత్రములు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదములై వేదవాఙ్మయమును లోకమునకు ప్రసాదించుచున్నవి. అమ్మవారి మూడు నేత్రములు భూతభవిష్యద్వర్తమాన కాలములను సూచిస్తూ, ఆ తల్లి సర్వకాలములయందును తన భక్తులకు కొంగుబంగారమై ఉంటుందను భావనను కలుగజేయుచున్నవి. ఆ తల్లి మూడు నయనములు, ఒకటి సృష్టికి, ఇంకొకటి స్థితికి, మరియొకటి కల్పాంతమందు తనలో లీనమొనర్చు లయకార్యమునకు సాధనములైనవి. అమ్మవారి నేత్రములు ఆగ్రహానుగ్రహములు (దుష్టశిక్షణ, శిష్టరక్షణలకు) మాత్రమేకాదు, పంచకృత్యపరాయణత్వమును (సృష్టిస్థితిలయతిరోధాననుగ్రహములను) తెలియజేయుచున్నవి. నయనములతో ఎవ్వరైనను మాటలులేకుండా నవరసములను పండించవచ్చును అని అంటారు. అమ్మవారు అందుకు ఏమీ మినహాయింపుకాదు. లలితాసహస్ర నామస్తోత్రపారాయణ సమయంలో భక్తులు ఆ తల్లి నయనములలో నవరసములను వీక్షిస్తూ తన్మయులై ఆనందభాష్పములను అనుభవిస్తూ ఆనందిస్తూ ఉంటారు. అటువంటి తల్లికి నమస్కరించునపుడు *ఓం త్రిలోచనాయై నమః* అని యనవలెను🙏🙏🙏🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కామెంట్‌లు లేవు: