27, అక్టోబర్ 2021, బుధవారం

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*476వ నామ మంత్రము* 27.10.2021


*ఓం ఆరక్తవర్ణాయై నమః*


పాటలపుష్ప (రక్త) వర్ణముతో శోభిల్లు జగన్మాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *ఆరక్తవర్ణా* యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును *ఓం ఆరక్తవర్ణాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిప్రపత్తులతో ధ్యానించు భక్తులకు ఆ కరుణామయి ఇహపరదాయకమైన శాంతిసౌఖ్యములు, శుభకరములు అనుగ్రహించును.


రక్తవర్ణము అంటే ఎర్రని ఎరుపురంగు గలిగిన వర్ణము అని భావము. కాని ఇక్కడ *ఆ* అను అక్షరము చేరుటచే *ఆ* అనునది ఒకశబ్దముగా తీసుకుంటే ఆ శబ్దమునకు *కొంచము* అని అర్థము. *ఆరక్తవర్ణా* అనగా కొంచము రక్తవర్ణము అనగా పాటల వర్ణము (ఎఱుపు,తెలుపుల మిశ్రిత వర్ణము)తో అమ్మవారు శోభిల్లు చున్నదని అర్థము. జగన్మాతను *సర్వారుణా* *(సర్వారుణాఽనవద్యాంగీ)* యని లలితా సహస్ర నామావళి యందు నలుబది తొమ్మిది, ఏబది నామాలలో స్తుతించాము. ఆ తల్లి శరీరము అరుణవర్ణము, వస్త్రములు అరుణవర్ణము, ఆభరణములు అరుణవర్ణము, తలలో ధరించిన పుష్పములు ( *కదంబమంజరీక్లుప్త కర్ణపూరమనోహరా* - 21వ నామ మంత్రము) అరుణవర్ణము. ఆ తల్లి సర్వారుణయై, దోషరహితమైన అవయవసంపదతో ఒక సౌందర్యరాశిగా శోభిల్లుచున్నదని స్తుతింపబడినది. కాని ఇక్కడ ఆ అరుణవర్ణము రక్తవర్ణము కాదు. ఆరక్తవర్ణము అనగా కొంచము ఎఱుపు అనగా పాటలవర్ణ (ఎఱుపు, తెలుపుల మిశ్రిత వర్ణ) శోభితయై భాసిల్లుచున్నది పరమేశ్వరి. ఎఱుపు తెలుపుల మిశ్రితవర్ణమైన పాటలవర్ణ శరీరకాంతితో భాసిల్లుట స్త్రీలకు సౌందర్యాతిశయమునకు భావన. అంతేకాదు కాలి, చేతివ్రేళ్ళు అత్యంత కోమలంగా, జాలువారు జలధారలుబోలిన శిరోజములు, మందస్మితము, అరమోడ్పుకన్నులు ఇవి అన్నియును సౌందర్య వర్ణనకు సాధనములే. ఈ విధంగా లలితా సహస్ర ధ్యాన శ్లోకం *సిందూరారుణ విగ్రహాం* అని ప్రారంభం నుండి, *అరుణాకరుణాతరంగితాక్షీం* అను ధ్యానశ్లోకంతోను, లలితా సహస్ర నామావళి యంతయూ అమ్మవారిని *ఆరక్తవర్ణ* శోభితమైన సౌందర్యరాశిగా స్తుతించడం జరిగింది. ఇది కేవలం సౌందర్యోపాసనాయుతమైన వర్ణనకాదు. ఆ తల్లిని ఒక అమ్మగా, ఆ అమ్మ అలా ఉన్నదని భావనతో అత్యంత ఉత్కృష్టమైన భక్తిభావనాయుత వర్ణన మాత్రమే. ఇలాంటి వర్ణన కాళిదాసు వంటి మహాకవికూడా 


*చతుర్భుజే చంద్రకళావతంసే.. కుచోన్నతే కుంకుమరాగశోణే.. పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే... జగదేకమాతః ... జగదేకమాతః* అని తన్మయంగా మాతృభావంతో వర్ణించడం జరిగింది.


అటువంటి పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం ఆరక్తవర్ణాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కామెంట్‌లు లేవు: