3, జులై 2022, ఆదివారం

పొడుపు పద్యము

 తే.గీ.పడతి నాలుగు వర్ణముల్ పదములోన

కలికి మొదటి వర్ణము బోవ ఘస్రమగును

అతివ తుదిమూడు నుతొలగ హస్తమగును

తెలిసి యున్నచో చెప్పుము తెలుగు లేమ

పి.మోహన్ రెడ్డి.



. ... జాతీయ తెలుగు సాహితీ పీఠము …

  తేనియల్ చిందు నా భాష తెలుగుభాష

        డా. నలవోలు నరసింహా రెడ్డి


          …… పొడుపు పద్యము …...

ఆ. అబ్ధి కొఱకు మాట అక్కరాల్ నాలుగు 

 ఒండు, రెండు నాల్గు గొప్పు ''నీరు" 

మూడు, రెండు, నాల్గు చూడ నయ్యది ''రంగు"   

పదము తెలుప వలయు పసిడి బాల..! 84

శివానుగ్రహం

 శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు!' అనటంలోని ఆంతర్యం- చీమనుంచి బ్రహ్మవరకు సర్వం శివాజ్ఞకు లోబడి ఉంటుందనే.    సమస్త విశ్వమూ, సృష్టిలోని అణువణువూ శివమయమే. శివం కానిది 'శవ'మంటారు జ్ఞానులు. అంటే మృతపదార్థమని అర్థం.


*శివమే సత్యం, శివమే సుందరం, శివమే నిత్యం. శివమే అనంతం. శివమే జ్ఞానం. శివమే చైతన్యం. శివమే సర్వజగత్తులకు మూలాధారం.*


*అనేక లక్షల జన్మల అనంతరం లభించే మానవజన్మ, ముక్తి సోపానానికి ముందుమెట్టు లాంటిది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలంటే శివభక్తిని వదలకూడదు.*


*శివానందలహరిలో ఒక శ్లోకముంది. సారాంశం ఏమిటంటే…*

*శివుని పేరు పలికే నాలుకే నాలుక, శివుని దర్శించే కన్నులే కన్నులు,                      శివుని పూజించే చేతులే చేతులు.            శివుని సదా స్మరించేవాడే ధన్యుడు..* 


*పరిపూర్ణ జ్ఞానస్థితికి చేరుకున్న ఆదిశంకరులను 'నీవెవరు?' అని అడిగినప్పుడు- 'చిదానంద రూపం శివోహం శివోహం'- నేను చిదానంద స్వరూపుడనైన శివుణ్ని. మిగతా మరేమీ కాను అని ఆత్మస్థితిలో చెప్పగలిగారు.*


*అదే 'శివసిద్ధి'.*


*అంటే, సాధకుడు అనేక జన్మలనుంచి అనుభవిస్తున్న అజ్ఞానపు పొరల్ని ఒక్కొక్కటిగా చీల్చుకుంటూ బయటికి వచ్చి, తనను తాను చూసుకున్నప్పుడు, తాను ఆత్మననీ, అనగా సాక్షాత్తు శివస్వరూపమని గ్రహిస్తాడు.*


*పూజలు, అర్చనలు, ప్రార్థనలు, ఉపవాసాలు, తపస్సులు, గురుశుశ్రూషలు- ఇవన్నీ ఈ అత్యున్నత స్థితిని అందుకోవటానికే.*


*శివానుగ్రహం అత్యంత సులభతరం. అందరికీ అందుబాటులో ఉంచటానికే- బిల్వార్చన, రుద్రాక్షధారణం, విభూతి లేపనం, అభిషేకంవంటి అతి సామాన్య విధానాలను పరమశివుడు భక్తుల కోసం ఏర్పరచాడంటారు.*


*జీవితకాలంలో మన ప్రతి చర్యనూ శివారాధన భావనతో ఆచరించడానికి మనసును అనుక్షణం హెచ్చరిస్తూ, అప్రమత్తంగా ఉంచుతుండాలి. అప్పుడు మనం సదా శివ సాన్నిధ్యంలో ఉన్నట్లే. క్రమంగా అదే మన ఆత్మకు శివసిద్ధిని కలిగిస్తుంది. అదే పరమపదం.

.

సీనియర్ సిటిజన్లకు చాలా ముఖ్యం.

 *నోక్టూరియా*


 నోక్టురియా అంటే రాత్రిపూట మూత్ర విసర్జన చేయడం గుండె వైఫల్యం యొక్క లక్షణం, మూత్రాశయం కాదు.

 శివపురిలోని ప్రముఖ వైద్యుడు డాక్టర్ బన్సాల్, నోక్టురియా నిజానికి గుండె మరియు మెదడుకు రక్త ప్రసరణలో అడ్డుపడే లక్షణం అని వివరిస్తున్నారు.  పెద్దలు, వృద్ధులు ఎక్కువగా రాత్రిపూట నిద్రలేచి మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది.  నిద్రకు భంగం వాటిల్లుతుందనే భయంతో పెద్దలు రాత్రి పడుకునే ముందు నీళ్లు తాగడానికి దూరంగా ఉంటారు.  నీళ్లు తాగితే మూత్ర విసర్జనకు మళ్లీ మళ్లీ లేవాల్సి వస్తుందని అనుకుంటారు.  పెద్దలు మరియు వృద్ధులలో తరచుగా తెల్లవారుజామున గుండెపోటు లేదా పక్షవాతం రావడానికి పడుకునే ముందు లేదా రాత్రి మూత్ర విసర్జన తర్వాత నీరు త్రాగకపోవడం ఒక ముఖ్యమైన కారణం అని వారికి తెలియదు.  నిజానికి, నోక్టురియా అంటే తరచుగా మూత్రవిసర్జన చేయడం అనేది మూత్రాశయం పనిచేయకపోవడం వల్ల వచ్చే సమస్య కాదు.  వయస్సుతో పాటు వృద్ధులలో గుండె పనితీరు తగ్గిపోవడమే దీనికి కారణం, ఎందుకంటే గుండె శరీరం యొక్క దిగువ భాగం నుండి రక్తాన్ని పీల్చుకోలేకపోతుంది.

 అటువంటి పరిస్థితిలో, పగటిపూట మనం నిలబడి ఉన్న స్థితిలో, రక్త ప్రవాహం మరింత క్రిందికి ఉంటుంది.  గుండె బలహీనంగా ఉంటే, గుండెలో రక్తం తగినంతగా ఉండదు మరియు శరీరం యొక్క దిగువ భాగంలో ఒత్తిడి పెరుగుతుంది.  అందుకే పెద్దలు మరియు వృద్ధులు పగటిపూట శరీరం యొక్క దిగువ భాగంలో వాపు పొందుతారు.  వారు రాత్రిపూట పడుకున్నప్పుడు, శరీరం యొక్క దిగువ భాగం ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతుంది మరియు తద్వారా కణజాలాలలో చాలా నీరు నిల్వ చేయబడుతుంది.  ఈ నీరు తిరిగి రక్తంలోకి వస్తుంది.  ఎక్కువ నీరు ఉంటే, నీటిని వేరు చేయడానికి మరియు మూత్రాశయం నుండి బయటకు నెట్టడానికి మూత్రపిండాలు చాలా కష్టపడాలి.  నోక్టురియా యొక్క ప్రధాన కారణాలలో ఇది ఒకటి.

 కాబట్టి మీరు పడుకున్నప్పుడు మరియు మీరు మొదటిసారి టాయిలెట్‌కి వెళ్లడానికి సాధారణంగా మూడు లేదా నాలుగు గంటలు పడుతుంది.  ఆ తర్వాత, రక్తంలో నీటి పరిమాణం మళ్లీ పెరగడం ప్రారంభించినప్పుడు, మూడు గంటల తర్వాత మళ్లీ టాయిలెట్కు వెళ్లాలి.

 మెదడు స్ట్రోక్ లేదా గుండెపోటుకు ఇది ఎందుకు ముఖ్యమైన కారణం అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుంది?

 రెండు మూడు సార్లు మూత్ర విసర్జన చేసిన తర్వాత రక్తంలో నీరు చాలా తక్కువగా ఉంటుందని సమాధానం.  శ్వాస తీసుకోవడం వల్ల శరీరంలోని నీరు కూడా తగ్గిపోతుంది.  దీనివల్ల రక్తం మందంగా మరియు జిగటగా మారుతుంది మరియు నిద్రలో హృదయ స్పందన మందగిస్తుంది.  మందపాటి రక్తం మరియు నెమ్మదిగా రక్త ప్రసరణ కారణంగా, ఇరుకైన రక్తనాళాలు సులభంగా నిరోధించబడతాయి...

 పెద్దలు మరియు వృద్ధులు ఎల్లప్పుడూ ఉదయం 5-6 గంటల సమయంలో గుండెపోటు లేదా పక్షవాతంతో బాధపడుతున్నారని గుర్తించడానికి ఇదే కారణం.  ఈ స్థితిలో నిద్రలోనే చనిపోతారు.

 నోక్టురియా అనేది మూత్రాశయం పనిచేయకపోవడం కాదు, వృద్ధాప్య సమస్య అని అందరికీ చెప్పాల్సిన మొదటి విషయం.

 అందరికీ చెప్పాల్సిన మరో విషయం ఏమిటంటే, పడుకునే ముందు గోరువెచ్చని నీరు తాగాలి, రాత్రి మూత్ర విసర్జనకు లేచిన తర్వాత మళ్లీ తాగాలి.

 నోక్టురియాకు భయపడవద్దు.  పుష్కలంగా నీరు త్రాగండి, ఎందుకంటే నీరు త్రాగకపోవడం మిమ్మల్ని చంపుతుంది.

 మూడవ విషయం ఏమిటంటే, గుండె యొక్క సామర్థ్యాన్ని పెంచడానికి, మీరు సాధారణ సమయంలో ఎక్కువ వ్యాయామం చేయాలి.  మానవ శరీరం అతిగా వాడితే పాడైపోయే యంత్రం కాదు, దానికి విరుద్ధంగా, ఎంత ఎక్కువ వాడితే అంత బలంగా ఉంటుంది.  అనారోగ్యకరమైన ఆహారాన్ని, ముఖ్యంగా అధిక పిండి పదార్ధాలు మరియు వేయించిన ఆహారాన్ని తినవద్దు.

 ఈ కథనాన్ని మీ పెద్దలు మరియు వృద్ధ స్నేహితులతో పంచుకోవాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను.

 సీనియర్ సిటిజన్లకు చాలా ముఖ్యం.

 ఆరోగ్య సమస్య గురించిన డా.బన్సల్ యొక్క ఆసక్తికరమైన మరియు సమాచార కథనం ఇక్కడ ఉంది.. *నోక్టూరియా*.

గాయత్రీమంత్ర స్వరాక్షర మహిమ

 *గాయత్రీమంత్ర స్వరాక్షర మహిమ వర్ణన*

*(శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం నుంచి యథాతథంగా)*


ఆనందశర్మ యిట్లు వివరించెను. "గాయత్రీ శక్తి విశ్వవ్యాప్తశక్తి. ఆశక్తితో సంబంధము స్థాపించు కొనినయెడల సూక్ష్మ ప్రకృతి స్వాధీనమగును. దానివలన భౌతికము, మానసికము, ఆత్మకు సంబంధించిన క్షేత్రములలోని అన్ని సంపత్తులను పొంద వీలుకలుగును. శరీరమునందలి విభిన్న అంగముల నుండి నాడులు శరీరమందంతటను వ్యాపించియుండును. కొన్నినాడులు కలిసినయెడల గ్రంథియని పిలువబడును. మానవ శరీరమునందలి వివిధ గ్రంథులయందు వివిధ శక్తులు నిబిడీకృతమై యుండును. జపయోగమునందు నిష్టులయినవారు ఆయా మంత్రములను ఉచ్ఛరించుటవలన ఆయా గ్రంథులయందు నిబిడీకృతమైన శక్తులు వ్యక్తీకరించబడుచుండును.


*ఓం* 

అనుదానిని ఉచ్చరించినపుడు శిరస్సుపైన ఆరు అంగుళముల ప్రాంతమునందును,


*భూః* 

అనుదానిని ఉచ్చరించినపుడు కుడికన్నునకు పైన నాలుగు అంగుళముల ప్రాంతమునందును


*భువ* 

అనుదానిని ఉచ్చరించినపుడు మానవుని త్రినేత్రము పైన మూడు అంగుళముల ప్రాంతమునందును


*స్వ* 

అనుదానిని ఉచ్చరించినపుడు ఎడమకన్నునకు పైన నాలుగు అంగుళముల ప్రాంతమునందును శక్తి జాగృతమగును.


ఆజ్ఞాచక్రము ప్రాంతమనందున్న *తాపిని* అను గ్రంథియందు నిబిడీకృతమైయున్న *సాఫల్య* శక్తిని జాగృతము చేయటకు

*తత్*


ఎడమకన్ను యందున్న సఫలత అను గ్రంథియందు నిబిడీకృతమైయున్న

'పరాక్రమము' అను శక్తిని జాగృతము చేయుటకు

*స*


కుడికన్ను యందున్న 'విశ్వ' అను గ్రంథియందు నిబిడీకృతమైయున్న

'పాలన' అను శక్తిని జాగృతము చేయుటకు

*వి*


ఎడముచెవి యందున్న 'తుష్టి' అను గ్రంథియందు నిబిడీకృతమైయున్న 'మంగళకరము' అను శక్తిని జాగృతము చేయుటకు

*తుః*


కుడిచెవి యందున్న 'వరద' అను గ్రంథియందు నిబిడీకృతమైయున్న

'యోగము' అను శక్తియొక్క సిద్ధికొరకు

*వ*


నాసికామూలము నందున్న 'రేవతి' అను గ్రంథియందు నిబిడీకృతమైయున్న 'ప్రేమ' అను శక్తియొక్క సిద్దికొరకు

*రే*


పైపెదవి యందున్న 'సూక్ష్మ' అను గ్రంథియందు నిబిడీకృతమైయున్న 'ఘున' అను సంజ్ఞ గల శక్తిని జాగృతము చేయుటకు

*ణి*


క్రిందిపెదవి యందున్న 'జ్ఞాన' అను గ్రంథి యందు నిబిడీకృతమైయున్న  

'తేజము' అను శక్తిని జాగృతము చేయుటకు

*యం*


కంఠము నందున్న 'భర్గ' అను గ్రంథియందు నిబిడీకృతమైయున్న 'రక్షణ' అను శక్తిని జాగృతము చేయుటకు

*భర్*


కంఠకూపము నందున్న 'గోమతి' అను గ్రంథియందు నిబిడీకృతమైయున్న 'బుద్ధి' అను శక్తియుక్క సిద్ధికొరకు

*గో*


ఎడమవైపు ఛాతీయొక్క అగ్రభాగమునందున్న 'దేవిక' అను గ్రంథియందు నిబిడీకృతమైయున్న

దమనము అను శక్తిని జాగృతము చేయుటకు

*దే*


కుడివైపు ఛాతీయొక్క అగ్రభాగమునందున్న వారాహి అను గ్రంధియందు నిబిడీకృతమై యున్న


నిష్ఠ అను శక్తియొక్క సిద్దికొరకు

*వ*


ఉదరమునకు పైభాగమున చివరి ప్రక్కటెముకలు కలియుస్థానమందున్న సింహిని అను గ్రంథియందు నిబిడీకృతమైయున్న

'ధారణా' అను శక్తిని జాగృతము చేయుటకు

*స్య*


కాలేయము నందున్న 'ధ్యాన' అను గ్రంథియందు నిబిడీకృతమైయున్న

'ప్రాణ' అను శక్తిని జాగృతము చేయుటకు

*ధీ*


ప్లీహము నందున్న మర్యాద అను గ్రంథియందు నిబిడీకృతమైయున్న

'సంయమ' అను శక్తిని జాగృతము చేయుటకు

*మ*


నాభి యందున్న 'స్ఫుట' అను గ్రంథియందు నిబిడీకృతమైయున్న

'తపో' అను శక్తిని జాగృతము చేయుటకు

*హి*


వెనుబాము చివరిభాగము నందున్న 'మేధా' అను గ్రంథియందు నిబిడీకృతమైయున్న 'దూరదర్శితా' అను శక్తిని జాగృతము చేయుటకు

*ధి*


ఎడమభుజము నందున్న 'యోగమాయా' అను గ్రంథియందు నిబిడీకృతమైయున్న 'అంతర్నిహితము' అను శక్తిని జాగృతము చేయుటకు

*యో*


కుడిభుజము నందున్న 'యోగిని' అను గ్రంథియందు నిబిడీకృతమైయున్న

'ఉత్పాదన' అను శక్తిని జాగృతము చేయుటకు

*యో*


కుడిమోచేయి యందున్న 'ధారిణి' అను గ్రంథియందు నిబిడీకృతమైయున్న

'సరసతా' అను శక్తిని జాగృతము చేయుటకు

*నః*


ఎడమమోచేయి యందున్న 'ప్రభవ' అను గ్రంథియందు నిబిడీకృతమైయున్న

'ఆదర్శ' అను శక్తిని జాగృతము చేయటకు

*ప్ర*


కుడిమణికట్టునందున్న 'ఊష్మా' అను గ్రంథియందు నిబిడీకృతమైయున్న

'సాహసము' అను శక్తిని జాగృతము చేయుటకు

*చో*


కుడిఅరచేతి యందున్న 'దృశ్య' అను గ్రంథియందు నిబిడీకృతమైయున్న

'వివేకము' అను శక్తిని జాగృతము చేయుటకు

*ద*


ఎడమ అరచేతి యందున్న 'నిరంజన' అను గ్రంథియందు నిబిడీకృతమైయున్న

'సేవ' అను శక్తిని జాగృతము చేయుటకు

*యాత్*


అను వానిని ఉచ్చరింపవలెను


ఈ విధముగా గాయత్రీమంత్రమునందలి 24 అక్షరములకునూ, మన శరీరమునందు వివిధ ప్రాంతములందు గల 24 గ్రంథులకునూ, ఆ గ్రంధులందు నిబిడీకృతమైన 24 రకములయిన శక్తులకును సన్నిహిత సంబంధము కలదు.

కర దండం

 కర దండం 


గ్రామాలల్లో సాదారణ ప్రజలు ప్రతివారు వయస్సుతో నిమిత్తం లేకుండా ఎక్కడికి వెళ్లినా చేతిలో కర్ర పట్టుకొని వెళ్లేవారు. వారు ఆ కర్రను అనేకవిధాలుగా వాడేవారు. ఏమైనా విషపురుగులు అంటే పాములు తేళ్లు మొదలైనవి వారి దారిలో కనపడితే వెంటనే ఏది వెతకాల్సిన పనిలేకుండా వాటిని  హతమార్చేవారు. ఇక కుక్కలు లాంటి జంతువులు వారి చేతిలోని కర్రను చూసి వారి జోలికి వచ్చేవే కావు.  మీరు గమనించి ఉండొచ్చు కుక్కలు ఒంటరిగా ఒకమనిషి కనపడితే గుంపులుగా వచ్చి దాడిచేస్తాయి.  ఈ విషయం మనలో కొందరికి అనుభవం కలిగి కూడా ఉండొచ్చు. ముందుగా ఒక కుక్క వచ్చి అరుస్తుంది తరువాత మిగిలిన కుక్కలు ఎక్కడినుండి వస్తాయో తెలియకుండా వచ్చి దాడి చేస్తాయి.  అదే నీ చేతిలో కర్ర ఉంటే మాత్రం అవి నీ జోలికి రావటానికి  వెనకాడతాయి. అథవా నిన్ను చుట్టుముట్టిన వెంటనే నీవు నీ చేతికఱ్ఱతో నిన్ను నీవు కాపాడుకోగలవు. కాబట్టి చేతిలో కర్ర ఉండటం సదా క్షేమకరం. ఇక విషయానికి వస్తే....


సాధకా! రోజు  నీ వెంట ఒక గుంపుగా కుక్కలు దాడి చేస్తున్నాయి. కానీ నీకు ఆ విషయం తెలిసినా కూడా నీవు వాటిని పరిగణలోకి తీసుకోక నీవు నేను రోజు ఆ కుక్కల దాడికి  బలవుతున్నావు. సాధకుడు తన సాధనను ముందుకు సాగాలంటే తప్పకుండా ఈ కుక్కలగూర్చి తెలుసుకోవటమే కాక వాటినుండి ఎట్లా రక్షణ పొందాలో తెలుసుకోవాలి. ఇప్పడికే మీకు నేను దేనినిగూర్చి చెపుతున్నానో తెలిసే ఉంటుంది అదేనండి ఆ కుక్కలు యేవో కావు అవే అరిషడ్వర్గంగా పేరుపొందిన ఆరుగురు శత్రువులు. అరిషడ్వర్గాలు అనగా ఆరు అంతర్గత శత్రువులు అని అర్థం. మన శాస్త్రాలప్రకారం మానవుడు మోక్షాన్ని సాధించేక్రమంలో తనలోని ఈ ఆరు అంతర్గత శత్రవులను జయించాలి. అవి యేమియనగా కామ, క్రోధ, లోభ, మొహ, మద, మాత్సర్యాలను అరిషడ్వర్గాలు అని అంటారు. ఈ అరిషడ్వర్గాలు అనేవి మనిషిని ఎంతటి స్థాయికైనా దిగజారుస్తాయి. ప్రతి మనిషి మనస్సును ఈ ఆరు కలిసికాని లేక ఏ ఒక్కటో లేక ఒక్కటి కంటే ఎక్కువో చేరి కలుషితం చేస్తాయి.  వీటిలో ఏ ఒక్కదానికి చిక్కినా సాధకునికి సాధన అస్సలు కుదరదు.  సాధారణంగా మనం ఎవరైనా ఒక ముఖ్యమైన విషయం చెబుతుంటే కొన్ని సందర్భాలలో వాటి మీద నీవు శ్రద్ధచూపవు ఎందుకురా నేను ఇంతముఖ్యమైన దానిని చెపుతుంటే ఏమి ఆలోచిస్తున్నావు అని నీ మిత్రుడు అడిగితే ఏమిలేదురా ఈవేళ నా మనసెందుకో బాగా లేదని సమాధానం ఇస్తావు.  నిజానికి నీ మనస్సు బాగా లేకపోవటానికి కారణం పైన తెలిపిన ఏదో ఒక శత్రువు దాడి కానీ నీవు ఆ విషయాన్ని గమనించవు.  అదే నీవు గమనిస్తే వాటిని అదుపులో పెట్టుకొనే ప్రయత్నం చేస్తావు. మన పురాణాలలో, ఇతిహాసాలలో ఈ ఆరుగురు శత్రువుల వలన ఎవరు యెట్లా నష్టపోయారో చెప్పారు. కాబట్టి సాధక మేలుకో ఈ ఆరు కుక్కలను నీ మీద దాడి చేయకుండా నిరోధించే ప్రయత్నం చేయి.  అకుంఠిత దీక్షతో తపస్సు సాగిస్తున్న విశ్వామిత్ర మహర్షికి మేనక సాంగత్యంతో తపోభంగం కలిగిన విషయం మనకు విదితమే.  ఇప్పుడు సాధకుల సాధనను భంగపరచటానికి దేవలోకం నుంచి మేనక దిగి రానవసరం లేదు ఏ సాధారణ స్త్రీ అయినా చాలు.  ఇలా వ్రాస్తున్నందుకు ఏమి అనుకోవలదు.  ఎందుకంటె మనం చేసే సాధన అంతబలహీనంగా వున్నదని నా భావన. 


మరి ఈ ఆరుగురు శత్రువులను పారదోలే దండం ఎక్కడ వున్నది అది నాకు దొరుకుతుందా అని అడగవచ్చు.  అది నీ దగ్గరే వున్నది కానీ నీవు దానిని ఉపయోగించటం లేదు ఏమిటి అది అంటే అది మరేమో కాదు నిత్యం దైవ చింతనం.  ఎప్పుడైతే సాధకుడు దైవచింతనంలో నిమగ్నుడై ఉంటాడో వాని చెంతకు ఈ ఆరుగురు శత్రువులల్లో ఏ ఒక్కరు కూడా దాడి చేయటానికి సాహసించరు.  ఎందుకంటె అన్నిరకాల శత్రువులను ఎదుర్కునే కరదండం దైవచింతన మాత్రమే ఇది సత్యం.  అందుకే ప్రతి క్షణం దైవచింతన చేయాలని  పెద్దలు వక్కాణిస్తున్నారు. 


సాధకుడు సదా ఈశ్వర జ్యానంలో ఉంటే ఎట్టి పరిస్థితిలోను మనస్సు అరిషడ్వర్గం మీదికి పోదు.  అథవా పోయిన వెంటనే తన తప్పు తాను తెలుసుకొని దైవత్వం వైపు నడుస్తుంది.  కాబట్టి మిత్రమా ఎల్లప్పుడూ నీ మనస్సును ఆ దేవదేవుని మీదనే వుంచు.  ఆధ్యాత్మిక ప్రగతిని సాధించు. 


ఓం తత్సత్ 


ఓం శాంతి శాంతి శాంతిః