కర దండం
గ్రామాలల్లో సాదారణ ప్రజలు ప్రతివారు వయస్సుతో నిమిత్తం లేకుండా ఎక్కడికి వెళ్లినా చేతిలో కర్ర పట్టుకొని వెళ్లేవారు. వారు ఆ కర్రను అనేకవిధాలుగా వాడేవారు. ఏమైనా విషపురుగులు అంటే పాములు తేళ్లు మొదలైనవి వారి దారిలో కనపడితే వెంటనే ఏది వెతకాల్సిన పనిలేకుండా వాటిని హతమార్చేవారు. ఇక కుక్కలు లాంటి జంతువులు వారి చేతిలోని కర్రను చూసి వారి జోలికి వచ్చేవే కావు. మీరు గమనించి ఉండొచ్చు కుక్కలు ఒంటరిగా ఒకమనిషి కనపడితే గుంపులుగా వచ్చి దాడిచేస్తాయి. ఈ విషయం మనలో కొందరికి అనుభవం కలిగి కూడా ఉండొచ్చు. ముందుగా ఒక కుక్క వచ్చి అరుస్తుంది తరువాత మిగిలిన కుక్కలు ఎక్కడినుండి వస్తాయో తెలియకుండా వచ్చి దాడి చేస్తాయి. అదే నీ చేతిలో కర్ర ఉంటే మాత్రం అవి నీ జోలికి రావటానికి వెనకాడతాయి. అథవా నిన్ను చుట్టుముట్టిన వెంటనే నీవు నీ చేతికఱ్ఱతో నిన్ను నీవు కాపాడుకోగలవు. కాబట్టి చేతిలో కర్ర ఉండటం సదా క్షేమకరం. ఇక విషయానికి వస్తే....
సాధకా! రోజు నీ వెంట ఒక గుంపుగా కుక్కలు దాడి చేస్తున్నాయి. కానీ నీకు ఆ విషయం తెలిసినా కూడా నీవు వాటిని పరిగణలోకి తీసుకోక నీవు నేను రోజు ఆ కుక్కల దాడికి బలవుతున్నావు. సాధకుడు తన సాధనను ముందుకు సాగాలంటే తప్పకుండా ఈ కుక్కలగూర్చి తెలుసుకోవటమే కాక వాటినుండి ఎట్లా రక్షణ పొందాలో తెలుసుకోవాలి. ఇప్పడికే మీకు నేను దేనినిగూర్చి చెపుతున్నానో తెలిసే ఉంటుంది అదేనండి ఆ కుక్కలు యేవో కావు అవే అరిషడ్వర్గంగా పేరుపొందిన ఆరుగురు శత్రువులు. అరిషడ్వర్గాలు అనగా ఆరు అంతర్గత శత్రువులు అని అర్థం. మన శాస్త్రాలప్రకారం మానవుడు మోక్షాన్ని సాధించేక్రమంలో తనలోని ఈ ఆరు అంతర్గత శత్రవులను జయించాలి. అవి యేమియనగా కామ, క్రోధ, లోభ, మొహ, మద, మాత్సర్యాలను అరిషడ్వర్గాలు అని అంటారు. ఈ అరిషడ్వర్గాలు అనేవి మనిషిని ఎంతటి స్థాయికైనా దిగజారుస్తాయి. ప్రతి మనిషి మనస్సును ఈ ఆరు కలిసికాని లేక ఏ ఒక్కటో లేక ఒక్కటి కంటే ఎక్కువో చేరి కలుషితం చేస్తాయి. వీటిలో ఏ ఒక్కదానికి చిక్కినా సాధకునికి సాధన అస్సలు కుదరదు. సాధారణంగా మనం ఎవరైనా ఒక ముఖ్యమైన విషయం చెబుతుంటే కొన్ని సందర్భాలలో వాటి మీద నీవు శ్రద్ధచూపవు ఎందుకురా నేను ఇంతముఖ్యమైన దానిని చెపుతుంటే ఏమి ఆలోచిస్తున్నావు అని నీ మిత్రుడు అడిగితే ఏమిలేదురా ఈవేళ నా మనసెందుకో బాగా లేదని సమాధానం ఇస్తావు. నిజానికి నీ మనస్సు బాగా లేకపోవటానికి కారణం పైన తెలిపిన ఏదో ఒక శత్రువు దాడి కానీ నీవు ఆ విషయాన్ని గమనించవు. అదే నీవు గమనిస్తే వాటిని అదుపులో పెట్టుకొనే ప్రయత్నం చేస్తావు. మన పురాణాలలో, ఇతిహాసాలలో ఈ ఆరుగురు శత్రువుల వలన ఎవరు యెట్లా నష్టపోయారో చెప్పారు. కాబట్టి సాధక మేలుకో ఈ ఆరు కుక్కలను నీ మీద దాడి చేయకుండా నిరోధించే ప్రయత్నం చేయి. అకుంఠిత దీక్షతో తపస్సు సాగిస్తున్న విశ్వామిత్ర మహర్షికి మేనక సాంగత్యంతో తపోభంగం కలిగిన విషయం మనకు విదితమే. ఇప్పుడు సాధకుల సాధనను భంగపరచటానికి దేవలోకం నుంచి మేనక దిగి రానవసరం లేదు ఏ సాధారణ స్త్రీ అయినా చాలు. ఇలా వ్రాస్తున్నందుకు ఏమి అనుకోవలదు. ఎందుకంటె మనం చేసే సాధన అంతబలహీనంగా వున్నదని నా భావన.
మరి ఈ ఆరుగురు శత్రువులను పారదోలే దండం ఎక్కడ వున్నది అది నాకు దొరుకుతుందా అని అడగవచ్చు. అది నీ దగ్గరే వున్నది కానీ నీవు దానిని ఉపయోగించటం లేదు ఏమిటి అది అంటే అది మరేమో కాదు నిత్యం దైవ చింతనం. ఎప్పుడైతే సాధకుడు దైవచింతనంలో నిమగ్నుడై ఉంటాడో వాని చెంతకు ఈ ఆరుగురు శత్రువులల్లో ఏ ఒక్కరు కూడా దాడి చేయటానికి సాహసించరు. ఎందుకంటె అన్నిరకాల శత్రువులను ఎదుర్కునే కరదండం దైవచింతన మాత్రమే ఇది సత్యం. అందుకే ప్రతి క్షణం దైవచింతన చేయాలని పెద్దలు వక్కాణిస్తున్నారు.
సాధకుడు సదా ఈశ్వర జ్యానంలో ఉంటే ఎట్టి పరిస్థితిలోను మనస్సు అరిషడ్వర్గం మీదికి పోదు. అథవా పోయిన వెంటనే తన తప్పు తాను తెలుసుకొని దైవత్వం వైపు నడుస్తుంది. కాబట్టి మిత్రమా ఎల్లప్పుడూ నీ మనస్సును ఆ దేవదేవుని మీదనే వుంచు. ఆధ్యాత్మిక ప్రగతిని సాధించు.
ఓం తత్సత్
ఓం శాంతి శాంతి శాంతిః
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి