*రామాయణానుభవం_ 181*
సీతాదేవి కోరిక ప్రకారం సరమ రావణునిసభకు వెళ్లి అక్కడ అదృశ్యంగా ఉండి, అన్ని విషయాలను పూర్తిగా తెలిసికొని సీతాదేవి దగ్గరకు తిరిగి వచ్చింది.
రావణుని సభ నుండి తిరిగి వచ్చిన సరమను సీతాదేవి ప్రేమతో కౌగిలించుకొని అక్కడి విశేషాల గురించి అడిగింది. సరమ తన సమాధాన్ని చెప్పసాగింది.
"సీతా! రావణుని తల్లికైకసి, ఆయన వృద్ధ మంత్రి అవిద్ధుడు రావణునికి అనేక
విధాల హిత బోధ చేశారు.
ఖరదూషణాదులను వారి పదునాల్గు వేల సైన్యమును కొన్ని క్షణాలలో ఒంటరిగా సంహరించగలిగిన సర్వసమర్ధుడు రాముడు. ఇప్పుడేమో రాముడు ఒంటరివాడు. కానేకాడు. లక్ష్మణుడు లక్షలాది వానర సైన్యము రాముని కంటి కి రెప్పవలె కాపలా కాస్తుంటారు.
"నా సైన్యములో ఖరుని మించిన వారెందరో ఉన్నారు". అంటావా ? ఎందరు ఉండి ఏమి లాభము? హనుమ ఒక్కడే వచ్చి లంకానగరాన్ని అంతటిని అగ్నికి ఆహుతి చేసినప్పుడు ఎందరుండి ఏమి చేశారు?
ఈ విధంగా ఎవరెన్ని విధాల చెప్పినా లోభి ధనాన్ని వదలనట్లు పరవధూసంగమును కాంక్షించే రావణుడు నిన్ను వదలడానికి అంగీకరించలేదు.
*నోత్సాహత్యమృతో మోక్తుం యుద్ధే త్వమ్ ఇతి మైథిలీ*
*సామాత్యస్య నృశంస్య నిశ్చయో హ్యేష వర్తతే*
ప్రాణాల కంటె ఎక్కువగా కాంక్షించే నిన్ను రావణుడు చంపజాలడు. ఆయన వలన నీకు ఏ భయములేదు.
అయితే నిన్ను వశం చేసికోవాలనుకొని అప్పుడప్పుడు నిన్నుబెదిరిస్తాడు.”
ఈ మాటలను సరమ సీతాదేవికి చెప్పుతుండగానే వారికి వానర సేనల అరుపులు శంఖ, భేరుల ధ్వనులు దిక్కులు పిక్కటిల్లేలా వినిపించాయి. శ్రీరామచంద్రుడు లంకను ముట్టడించడాన్ని ప్రారంభించాడని వాళ్లకు తెలిసింది.
ఒక వైపు ఆ ధ్వనులు సీతా సరమలకు సంతోషాన్ని కలిగిస్తే మరొక వైపు రావణునికి, రాక్షసులకు పిడుగు పడ్డట్లు అయింది.
ముందుగానే తనకు ఎప్పటి వార్తలను అప్పుడు ఎందుకు తెలుపలేదని రావణుడు రాక్షసులపై మండిపడ్డాడు. ఇప్పటికైనా ముందుకొచ్చి తనకు విజయాన్ని చేకూర్చుమని ఆజ్ఞాపించాడు.
అప్పుడు రావణుని తల్లి అయిన కైకసికి పెద్ద తండ్రి అయిన మాల్యవంతుడు ఆయనతో ఈ విధం గా హితము పలకడానికి సిద్ధ పడ్డారు......
**
మాల్యవంతుడు రావణునితో చెబుతున్నాడు....
"మహారాజా ! రాజయినవాడు సామ, దాన, భేద, దండోపాయాలను గురించి చక్కగా తెలిసికోవాలి.
ఇప్పుడు రామలక్ష్మణులు సామ, భేదాలకు లొంగరు. కనుక దానదండాలను గురించి ఆలోచించాలి.
*తన్మహం రోచతే సంధిః సహ రామేన రావణా*
*యదర్థమ్ అభియుక్తాః స్మ సీతా తస్మై ప్రదీయతామ్*
ప్రస్తుతము దానము అంటే "సీతాదానము" అని అర్ధము. సీతరామునిదే కదా! ఆమెను అపహరించి తెచ్చాక ఆమెను మళ్లీ అప్పగించడము కూడ దానమేనా ? అంటే అవును అది కూడా ఒక రకమైన దానమే.
"దీయత ఇతి దానం"
"ప్రదీయతాం దాశరథాయమైధిలీ" అని సీతను రామునికి ఇవ్వుమని విభీషణాదులు తెలిపారు కదా!
సీతాదేవిని శ్రీరామునికి ఇవ్వడం ద్వారా నీకు శ్రీరామునికి సంధి కుదురుతుంది. సంధివలన స్నేహము కుదురుతుంది. స్నేహము వలన సీతాదేవిని తీసికొని శ్రీరాముడు. లక్ష్మణ, సుగ్రీవ వానరసేనా సమేతంగా తిరిగి వెళ్లి పోతాడు.
శ్రీరామునికి రాజ్యకాంక్షలేదు. ఆయన కిష్కింధానగరానికి వచ్చి వాలిని సంహరించిరాజ్యాన్ని సుగ్రీవునికి అప్పగించాడు. ఆయనకు రాజ్యకాంక్షే ఉంటే కిష్కింధను అయోధ్యా
రాజ్యంలో కలుపుకొనే వాడు కదా!
రామునికి లంకా రాజ్యకాంక్ష కూడలేదు. సీతాదేవిని ఆయనకు సమర్పిస్తే నీ రాజ్యము, నీవు క్షేమంగా ఉంటారు. "అదేమిటి? సీతాదేవిని ఇవ్వకుంటే యుద్ధము వస్తే మాత్రము నాకేమి భయమంటావా?
నిన్ను మించిన బలవంతుడు వాలి. రాముని ఒకే కోలకు నేల కూల లేదా? రాముని ఎదిరించడానికి బ్రహ్మ రుద్రేంద్రాలకు కూడ సాధ్యము కాదని హనుమ చెప్పలేదా ? ఒంటరిగా వచ్చిన హనుమను మనము ఏమి చేయగలిగాము ?
నీవు వధించబడడము దేవతలకు కావలసింది. కనుక రామలక్ష్మణులకు వానర బలమే కాదు. దేవతాబలం కూడ ఉంది.
"ధర్మము" -"అధర్మము" అని రెండు పక్షాలను బ్రహ్మకల్పించాడు. దేవతలు ధర్మాన్ని, రాక్షసులు అధర్మాన్ని అవలంభిస్తారు.
నీవు అధర్మమును వరించినా, నీ తపోబలము వలన నీ అధర్మానికే విజయము కలుగుతూ వచ్చింది.
కాని కొంతకాలానికి నీ తపో బలము క్రమంగా తగ్గిపోయి, నీ అధర్మాచరణము
నీకు వినాశాన్ని కల్గిస్తుంది.
మహర్షులందరు నీవు పెట్టు చిత్రహింసలు భరిస్తూ కూడ నీ వినాశానికై మహత్తరమైన తపస్సును తీవ్రంగా ఆచరిస్తున్నారు. వారి శాపబలము కూడ నీకు హానిని కలిగిస్తుంది. ఇప్పుడా ఋషులు ఆశ్రమంలో యజ్ఞధూమాలు దట్టంగా వ్యాపిస్తున్నాయి. అవి రాక్షసుల చితా ధూమాలుగా కనబడుతున్నాయి..
"నేను వరబలుడను" అని అహంకరిస్తున్నావేమో ? కాని రావణా నీకు ఎవ్వరి వలన చావు రాకూడదని కోరుకొన్న వారిలో నరులు, వానరులు లేరు. ఇప్పుడు నీపైకి దండెత్తి వచ్చింది. మహా వీరులైన నరవానరులే.
కనబడే శకునాలు కూడ నీకు అనుకూలంగా లేవు. మేఘాలు ఉరుముతూ లంకపై నెత్తురును కురిపిస్తున్నాయి. ఏనుగులు, గుఱ్ఱాలు నిష్కారణంగా కళ్లనీళ్ళు కారుస్తున్నాయి.
జండాలు రంగులు పోయి కూలి పోతున్నాయి. నక్కలు, గద్దలు లంకలో గుంపులు గుంపులుగా గుమిగూడి తీవ్రంగా అరుస్తున్నాయి. నీచ, పిశాచాలు రాక్షస స్త్రీల కలలో కనబడి వికృతంగా నవ్వుతున్నాయి.
రాక్షసులు తాము ఆరాధించే దేవతల కొరకు వేసిన బలులను కుక్కలు పైబడి తింటున్నాయి. ఆవులకు గాడిదలు పుట్టుతున్నాయి. ఎలుకలు, ముంగిసలు స్నేహంగా కలసి తిరుగుతున్నాయి.
పులులు, పిల్లులు, కుక్కలు, పందులు కలిసి తిరుగుతున్నాయి. మృగ పక్షులు సూర్యుని జూచి ఏడుస్తున్నాయి. ఇండ్లలో పెంచుకొంటున్న గోరింకలు వికృతంగా కూస్తున్నాయి.
ఇన్ని ఉత్పాతాలు రాక్షస వినాశాన్ని సూచిస్తున్నాయి. కనుక రావణా! యుద్ధానికి కాలుదువ్వక సీతాదేవిని రామునికి అప్పగించి సంధికి అంగీకరించు"మని మాల్యవంతుడు రావణుని ప్రభోదించాడు....
[14/10, 4:32 pm] K Sudhakar Adv Br: 🌹 *రామాయణానుభవం_ 183*
శ్రీ రామ చంద్రుడు తన సేనా నాయకులకు దిశలను నిర్దేశించి సుగ్రీవ విభీషణులను చూచి, తామందరు సువేల పర్వతాన్ని ఎక్కి రాత్రి అక్కడే ఉండాలని తెల్లవారి లంకానగరాన్ని చూడాలని చెప్పాడు.
ఆయన సుగ్రీవ విభీషణాదులతో రావణుని నీచప్రవర్తన గురించి ముచ్చటించాడు. రావణుడు పుట్టింది స్వయంగా "పులస్త్య బ్రహ్మ” వంశంలో చదువుకొన్నది వేదవేదాంగాలను. అయినా "పరదారాపహరణ"మనే ఎంత నీచానికి పాల్పడ్డాడు. ఆయన ఒక్కని మూలంగా ఆయన పరివారమంతా నాశనం అవుతున్నది.
*ఏకో హి కురుతే పాపం కాల పాశ వశం గతః*
*నీచేన ఆత్మాపచారేణ కులం తేన వినశ్యతి*
ఒక పాము నీటి మడుగులో చేరితే దాని వలన మడుగులోని చేపలు కూడా చస్తాయి కదా
*ఏకః పాపాని కురుతే ఫలం భుంక్తే మహాజనాః*
అని ఆగ్రహంతో శ్రీరాముడు సువేల పర్వతము పైకి ఎక్కాడు. ఆయన వెనువెంటనే లక్ష్మణ సుగ్రీవ, విభీషణాదులు హనుమదాది వానరులు అందరు పర్వతాన్ని ఎక్కారు. సుగ్రీవ, విభీషణ, జాంబవవాది సమేతంగా లక్ష్మణుడా రాత్రి నిద్రలేకుండా శ్రీ రాముని, వానర సైన్యాన్ని కాపాడాడు.
తెల్లవారి వారందరు శ్రీ రామ సమేతంగా లంకానగరాన్ని పరిశీలించారు. లంకానగరము వెలుపల ఉన్న పెద్ద పెద్ద తోటలను చూశారు. వాటి లోపల క్రూరమృగాలు లేవు. ఆతోటలలో తాళవృక్షాలు, మద్ది చెట్లు మొదలైన పెద్ద వృక్షాలు ఉన్నాయి. కొత్త కొత్త పూలు ఉన్నాయి. పెద్ద పెద్ద పండ్లు ఉన్నాయి.
ఆ వనము ఇంద్రుని నందన వనంతో, కుబేరుని చైత్ర రధముతో పోటీ పడుతున్నది. ఆ తోటలలో నెమిళ్ల నృత్యాలు, తుమ్మెదల ఝంకారాలు, కోకిలల "కుహూ కుహూ" నాదాలు మనస్సులకు హాయినిస్తున్నాయి.
సుగ్రీవుడు సువేల పర్వతముపై ఉన్నవారిని తప్ప మిగిలిన వారందరిని లంకలోకి పంపించాడు.వారు లంకలోకి ప్రవేశించి, తమ సింహనాదాలతో నగరాన్ని అల్లకల్లోలం చేయసాగారు. ఆ అల్లకల్లోలానికి భూమివణికింది. లంక అంతా దుమ్ముతో నిండిపోయింది. మృగాలు భయంతో కూతలు పెడుతూ పారిపోసాగాయి.
లంకానగరం కూడా పర్వత శిఖరం పైనే ఉంది. ఆ పర్వతానికి మూడు శిఖరాలు ఉన్నాయి. సువేల ,లంక , త్రికూటము...
వాటి మధ్యలో కైలాస శిఖరము వంటి అద్భుతమైన వేయి స్థంభాల భవనము ఉంది. అది రావణుని నివాస భవనము. ఎల్లప్పుడు రాక్షస వీరులచే కాపాడబడుతు ఉంటుంది.
ఆ భవనంలో అనేక ఉద్యాన వనాలు, అనేక పక్షులు, పెంపుడు జంతువులు ఉన్నాయి.
శ్రీ రాముడు అద్భుత సౌందర్యముతో అలరారే ఆ లంకా నగరాన్ని ఆశ్చర్యంతో చూస్తున్నాడు.
సువేల పర్వత శిఖరముపై వెలిగే దివిటీల కాంతి వలన అక్కడికి శ్రీ రాముడు వేలాది వానర వీరులతో ఆ శిఖరము పై ఉన్నాడని అందరికి తెలిసింది......
[14/10, 4:32 pm] K Sudhakar Adv Br: 🌹 *రామాయణానుభవం_ 182*
మాల్యవంతుని హితోపదేశము రావణుని చెవులకు ఎక్కలేదు. రాక్షసరాజు ఆగ్రహంతో మాల్యవంతుని ఈ విధంగా నిందించాడు:
*హితా బుద్ధ్యా యద్ అహితం వచః పరుషం ఉచ్యతే*
*పర పక్షం ప్రవిశ్యై ఏవ న ఏతత్ చ్ఛోత్రం గతం మమ*
“తాతా !నీవు ముసలివాడవు ఆగుట వలన నీ బుద్ధి మందగించింది. నీవు శత్రువు వలన ఏదో లాభపడి, ఆయన వైపు న్యాయవాదిగా మాట్లాడుతున్నావు.
నిజానికి రాముడు ఎందులో గొప్పవాడు? దేవ, దానవ గంధర్వాదులలో నాకు ఎదురేలేదు కదా!
రాముడు ఒక మానవుడు. తండ్రివలన దేశాన్నుండి బహిష్కరింపబడ్డవాడు. రాజ్యహీనుడు. ఇప్పుడు భార్యాహీనుడు కూడ.
ఇప్పుడు ఆశ్రయించింది కోతులను అంటే తనకంటే తక్కువ వారిని (నీచులను) ఆశ్రయించాడు. ఆయనలో ఏమి గొప్పదనాన్ని చూచి మాట్లాడుతున్నావు?
నేను రాక్షసరాజును రాజుపట్ల మాట్లాడవలసింది
ఈ విధంగానేనా?
కమలం లేని అదృష్ట దేవత అయిన లక్ష్మీదేవిలా ఉన్న సీతను రాముని భయంతో అడవి నుండి దూరం చేసి నేనెందుకు తిరిగి ఇవ్వాలి?
*ఆనీయ చ వనాత్ సీతాం పద్మ హీనామ్ ఇవ శ్రియమ్*
*కిం అర్థం ప్రతిదాస్యామి రాఘవస్య భయాద్ అహమ్*
నీవన్నట్లు రాముడు గొప్పవాడు కూడ కావచ్చు. అయితే మాత్రమేమిటి? అంతకంటే అత్యధికుడు నా ముందు వచ్చి నిలిచినా నేను తలవంచుతానా? మరొకరికి నమస్క రిస్తానా?
"ద్విధాభజ్యేయమ ప్యేవం న నమేయంతు కస్యచిత్
ఏషమే సహజోదోషః స్వభావోదురతిక్రమః"
నన్ను రెండుగా చీల్చినా నేనెవ్వరికి నమస్కరిచను. ఇది నా స్వభావము. నా స్వభావము తప్పుకూడ కావచ్చు. అయినా స్వభావము పుట్టుకతో వచ్చి కాటిదాకా వెంట ఉంటుంది. దానిని మార్చడం ఎవ్వరి తరము కాదు.
"రాముడు సముద్రముపై సేతువు కట్టలేదా?" అందువా? కాకి కూచుండగానే తాటిచెట్టుపై పండు క్రింద బడితే కాకే పండును తెంపిపడగొట్టినట్లా ? కాదు కదా కాకి కూచున్నప్పుడే పండు పడిపోవడం హఠాత్తుగా అనుకోకుండా జరిగిందే. ఏదైనా అకస్మాత్తుగా జరుగడాన్ని గూర్చే "కాకతాళీయము" అంటారు కదా!
రాముడు సముద్రముపై సేతువు నిర్మించడము కూడ కాకతాళీయమే.
అంతెందుకు? రామలక్ష్మణులు వేలాది వానర సమేతంగా లంకపైకి దండెత్తి వచ్చారు. కదా! వారందరు శవాలరాశులవుతారు. అంతేకాని ఎవ్వరు కూడ బ్రతికి తిరిగి పోజాలరు. తాతా! నీ నోటికి వచ్చింది మాట్లాడావు చాలుగాని ఇక నీవు వెళ్లవచ్చు" అని ఆజ్ఞాపించాడు. మాల్యవంతుడు రావణుని మాటలు విని మౌనంగా తిరిగి వెళ్లాడు.
*
["ఇసుకలో నుండి నూనె తీసినా తీయవచ్చు. ఎండమావులలో నీరును త్రాగినా త్రాగవచ్చు. కాని మూర్ఖుని మనస్సును మాత్రము ఎవ్వరు మార్చజాలరు కదా...!]
**
మాల్యవంతుడు వెళ్లిపోయాక, రావణుడు మంత్రులతో లంకానగర రక్షణ సన్నాహాల గురించి చర్చించాడు.
లంకానగరము యొక్క తూర్పుద్వారానికి రక్షకుడుగా ప్రహస్తుని, దక్షిణ ద్వారం దగ్గర మహోదర, మహాపార్శ్వులను, పడమట ఇంద్రజిత్తును, ఉత్తరాన శుకసారణులను పంపి అచటికి తానే స్వయంగా వస్తానని తెలిపాడు. పుర మధ్య భాగంలో విరూపాక్షుని నియమించాడు. సముద్ర భాగం నుండి లంకలోకి రావడానికి లంకలోని పశ్చిమ భాగాలే ముఖ్యం కనుక ఒక వైపు ఇంద్రజిత్తును నిలిపి, మరొక భాగంలో తానే ఉన్నాడు..
ఈ విధంగా వ్యూహరచన చేసి "ఇక లంకపై శ్రీరాముడు దాడి చేయడం అసాధ్యము" అని నిశ్చయించుకొన్నాడు.
*ఏవం విధానమ్ లంకాయాం కృత్వా రాక్షసపుంగవాః*
*కృతకృత్యమివాత్మానం మన్యతే కాలచోదితాః*
ఇక శ్రీరామ సైన్యం చూస్తే
రామ లక్ష్మణులు హనుమ సుగ్రీవ, జాంబవదంగదాదులతో కలిసి యుద్ధాన్ని గురించి ఆలోచించసాగారు.
ఎంతో కాలం నుండి “లంకలోకి చేరుకోవడమెలాగా ? అనుకొన్న మనము లంకలోకి రాగలిగాము.
ఇప్పుడు 'దీనిని జయించడమెలా?' అని ఆలోచించాలి.
ఈ లంక దేవగంధర్వ, యక్షకిన్నర, కింపురుషాదులకు ఎవ్వరికి కూడా జయించ సాధ్యము కాదు.
దీనిలోకి ఏ వైపు నుండి కూడా ప్రవేశించడానికి వీలులేదు. కనుక దీనిని ముట్టడించడం, శత్రువులను చీల్చుకొని వెళ్లడం తప్ప వేరే మార్గము లేదు” అనివారు అనుకొంటున్నారు.
అంతలో విభీషణుడు "ప్రహస్తుని తమ్ముడైన "ప్రఘసుడు", తమ్ముడి కొడుకులు 'అనలుడు' 'సంపాతి' అనే వారు నావెంట లంకను, సమస్త బంధు జనాన్ని
పరిత్యజించి వచ్చారు. వారు లంకానగరంలో సైనికుల ఏర్పాట్లను చూచి వచ్చారు. లంకలో తూర్పువైపు ప్రహస్తుడు, దక్షిణంలో మహాపార్శ్వ మహోదరులు, మధ్య భాగంలో విరూపాక్షుడు, పశ్చిమోత్తరాలలో ఇంద్రజిత్తు, రావణుడు ఉన్నారని తెలిసింది'. రావణుడు అప్పుడు తనకు ఉన్న అరవై వేల మంది సైనికులతో వెళ్లి కుబేరున్ని జయించాడు. ఇప్పుడు ఆయన సైన్యము లెక్కకు మించి ఉంది.
రామభద్రా! నీకు భయాన్ని కలిగించడానికి ఈ విషయాలు చెప్పలేదు. ఆ ఏర్పాట్లకు తగిన విధంగా నీవు నడచుకొంటావని మాత్రమే తెలుపుతున్నాను". అని ఊరుకున్నాడు.
*అత్ర మన్యుర్ న కర్తవ్యో రోషయే త్వం న భిషయే*
*సమర్థో హ్యసి వీర్యేణా సురాణామ్ అపి నిగ్రహే*
లంకానగరానికి తూర్పు వైపు ఉన్న ప్రహస్తుని నీలుడు ఎదుర్కోవాలి. దక్షిణ దిశలో మహోదర, మహా పార్వ్యులను అంగదుడు జయించాలి.
పశ్చిమము వైపు ఇంద్రజిత్తును మహాబల సంపన్నుడైన హనుమ ఢీకొనాలి. సేనా మధ్య భాగంలో సుగ్రీవ, విభీషణ, జాంబవంతులు రక్షించాలి.
ఇక యుద్ధానికంతటికి రావణుడే ప్రాణము కనుక అతనిని సంహరించడానికి ఉత్తరంలో నేను, నాతమ్మునితో సిద్ధంగా ఉంటాను.
మరొక ముఖ్య విషయము వానరులందరు వారివారి రూపాలతోనే ఉండి పోరాడాలి. ఎవ్వరు మానవ రూపాలను ధరించరాదు.ఎందుకంటే, కోతుల సైన్యంలో, ఈ కోతి ఆకారం మన మధ్య గుర్తింపుకు చిహ్నంగా ఉపయోగపడుతుంది.
*న చైవ మానుషం రూపం కార్యం హరిభిరా హవే*
*ఏషా భవతు సంజ్ఞానో యుద్ధే అస్మిన్ వానరే బలే*
మా అన్నదమ్ములతో పాటు విభీషణుడు, ఆయనతో పాటు నలుగురు సహచరులు మానవ రూపాలను ధరించి ఉంటారు.
[14/10, 4:32 pm] K Sudhakar Adv Br: 🌹 *రామాయణానుభవం_ 185*
వానర రాక్షసుల మధ్య సంకుల సమరము మొదలైంది. అంగదుడు ఇంద్రజిత్తుతో, సంపాతి ప్రజంఘునితో, జంబుమాలి హనుమంతునితో, సుగ్రీవుడు ప్రముసునితో, లక్ష్మణుడు విరూపాక్షునితో తలపడ్డారు.
యుద్ధ భూమి అంతా రక్తసిక్తమైంది.
అంగదుని వీర విహారాన్ని నిలుపడానికి ఆయనను ఇంద్రజిత్తు గదతో మోదాడు. అంగదుడు ఆగ్రహంతో ఇంద్రజిత్తు రథము పైకి ఉరికి, సారధిని, గుజ్జలను చంపాడు. అంతేకాక ఇంద్రజిత్తు చేతిలోని విల్లమ్ములను విరిచి పారవేశాడు.
జంబుమాలి ఆంజనేయునిపై శక్తిని ప్రయోగించాడు. దానిని తప్పించుకొని హనుమ జంబుమాలి రధముపైకి ఉరికి ఆయనను హతమార్చాడు.
నలుడు ప్రతపనుని రెండ్లు కండ్ల గుడ్లను పీకి వేశాడు. సుగ్రీవుడు వానర సేనపై విరుచుక పడుతున్న ప్రఘసుని సంహరించాడు.
లక్ష్మణుడు శర వర్షంతో విరూపాక్షుని రూపుమాపాడు.
సుషేణుడు విద్యున్మాలిని ఒక కొండతో కొట్టి చంపాడు. మైందద్వివిదులు వజ్ర ముష్టి, నికుంభులను తుదముట్టించారు.
ఈ విధంగా మొదటి రోజు ద్వంద్వ యుద్ధంలో రాక్షస వీరులు చనిపోయారు.
**
శ్రీరామచంద్రుడు రాక్షసులపై శరవర్షాన్ని కురిపించాడు. ఆ బాణ వర్షానికి రాక్షసులు
అనేక సంఖ్యలో హతులయ్యారు.
ఒక వైపు మొదటి రోజు యుద్ధంలో రాక్షస నాయకులు సంహరింపబడడము, మరొకవైపు శ్రీరాముని శరవర్షానికి సామాన్య రాక్షసుల మరణము ఇంద్రజిత్తును కృంగదీశాయి.
ఇంద్రజిత్తు వానరులపై విరుచుకుపడ్డాడు. కాని అంగదుడు అతని అశ్వాలను,
రథసారధిని అతిలాఘవంగా హతమార్చాడు. అంగదుని దేవగణాలు, బుషిగణాలు,
రామలక్ష్మణులు సుగ్రీవ విభీషణులు అనేక విధాలుగా ప్రశంసించారు.
ప్రత్యక్ష యుద్ధంలో తన పాచికలు పారవని గమనించిన ఇంద్రజిత్తు మాయా.. యుద్ధానికి పూనుకొని, తాను కనబడకుండా వానరులపై బాణ వర్షాన్ని కురిపించసాగాడు.
అంగదాది మహావీరులు మహా వృక్షాలను, మహాశిలలను గైకొని ఇంద్రజిత్తును ఎదిరించుటకు నిలువగా, ఆయన వారికి కనబడకుండా ఉండి పెద్ద పెద్ద అస్త్రాలను ప్రయోగించి వారిని కదలకుండా చేశాడు.
రామ లక్ష్మణులపై భయంకరమైన "నాగాస్త్రాన్ని" ప్రయోగించాడు. నాగాస్త్రాన్ని ఇంద్రజిత్తు వర ప్రసాదంగా లభించినవాడు. అందువలన అది అమోఘమైనది.
*అదృశ్యో నిశితాన్ బాణాన్ ముమోకముమోశా శనివర్చసః*
*సరామం లక్ష్మణం చైవ ఘోరైర్నాగ మయై శరైః*
రామలక్ష్మణులు కూడా ఆ నాగాస్త్రానికి కట్టుబడ్డారు. భయంకరమైన సర్పాలు రామ లక్ష్మణుల శరీరాలకు గట్టిగా చుట్టుకొన్నాయి. వారికి ఊపిరాడడం కూడా కష్టంగా ఉంది. వారి శరీరాల నుండి మేఘనాదుని బాణ వర్షానికి రక్తము ధారగా కారుతున్నది. వారిద్దరు విధిలేక భూమిపై పడిపోయారు.
ఆ అన్నదమ్ములు ఒకరినొకరు చూచి నిరాశతో మూర్ఛచెందారు. '
అప్పుడు మైందద్వివిదులు సుగ్రీవాంగద, విభీషుణులు నాగాస్త్ర బద్ధులైన రామలక్ష్మణులను చూసి విషాదాన్ని పొందారు.
*నీలా ద్వివిదా మైందాశ్చ సుషేణ కుముదాంగదాః*
*తుర్ణం హనుమతా సార్ధం అన్వశోచంత రాఘవౌ*
అయితే మేఘనాధుడు తన మాయా విద్య వలన అంగదాది మహా వానరులందరిని తన బాణ వర్షంచేత బంధించాడు.
రాక్షస వీరులు రాక్షస రాజపుత్రుని పరాక్రమానికి సంతోషించి రామలక్ష్మణులు చనిపోయారని, నిశ్చయించుకొని, ఇంద్రజిత్తుకు జయ జయ ధ్వానాలను చేశారు......
[14/10, 4:32 pm] K Sudhakar Adv Br: 🌹 *రామాయణానుభవం_ 184*
శ్రీరాముడు రావణుని వైపు చూస్తుండగానే చిటికెలో సుగ్రీవుడు మాయమయ్యాడు.
శ్రీరామునికి అయోమయం కలిగింది.
ఇంతలో సుగ్రీవ రావణ ద్వంద్వ యుద్ధము, గాయాలతో, నెత్తురు ధారలతో సుగ్రీవుడు తిరిగి రావడం జరిగి పోయాయి.
శ్రీరాముని మనస్సు "సుగ్రీవునికి ఏమవుతుందో ఏమో అనే బాధతో నిండి పోయింది."
అందువలన సుగ్రీవుడు తిరిగి రాగానే వానర వీరులందరు ఆయనను ప్రశంసిస్తే శ్రీరాముడు మాత్రము ఆయనను మందలించాడు.
"మిత్రమా! ఎంత పని జరిగింది! ఎంత పని జరిగింది! ఎంత సాహసం చేశావు?
నీవు వెళ్లేప్పుడు నాకు చెప్పి వెళ్లాలనిపించలేదా? ఒంటరిగా నీకు నీవు ఇంత సాహసం
చేయడం తగునా?
*అసమంత్య్ర మయా సార్థం తదిదం సాహసం కృతం*
*ఏవం సాహసకర్మాణి న కుర్వంతి జనేశ్వరః*
రాజు ఎప్పుడు స్వతంత్రించి సమరంలో ముందు దిగకూడదు. ఆయన పరివారాన్ని ముందు దింపి, సమయాన్ని చూచి తాను సమరంలో కాలు పెట్టాలి.
అందువలన ఒక రాజువై ఉండి నీవు ఈ విధంగా సాహసించడం మంచి పద్దతికాదు
అంతేకాదు మేమందరము ఎవ్వరి బలాన్ని చూసుకొని ఇంతదాకా వచ్చాము ? నీ బలాన్ని చూసుకొనే కదా? ఆ విధంగా అందరికి రక్షణనిచ్చే నీవే అరక్షణలో పడితే
*త్వయకించిత్ సమాపన్నే కింకార్యం సీతయా మమ?*
నీకేదైనా అయితే నేను
జీవింపజాలను. అప్పుడు సీత మాత్రము నాకెందుకు? అంతే కాదు నన్ను ఆశ్రయించిన వాడివి. నీకేదైన ప్రమాదం కలిగితే నా ఆశ్రిత రక్షా దీక్ష" ఏమయిపోతుంది? "
తనను ఆశ్రయించిన సుగ్రీవుడి కొరకు వాలిని వధించి, ఆయన రాజ్యాన్ని,
భార్యను ఆయనకు రాముడు ఇప్పించాడు.
కాని తన ఆశ్రితులు ఆపదల పాలు కానీయకుండా రక్షించవలసిన తానే సుగ్రీవునికి కలిగే ప్రమాదాన్ని కూడా చూడకుండా ఆయనను రావణుని పైకి దాడి చేయడానికి రాముడు అనుమతించాడు." అని నాగురించి ఎంత నీచంగా జనం చెప్పుకుంటారు ?
అంతే కాదు నీవు నాకు ముఖ్య మిత్రుడివి. నీతో సమానం నాకెవ్వరు కాదు. సుగ్రీవా! నీకేదైనా ప్రమాదము జరిగితే దానికి కారణమైన రావణాసురుని సపరివారంగా చంపి, విభీషణునికి నేనిచ్చిన మాట ప్రకారం లంకా పట్టాభిషేకము చేసి, అయోధ్యకు వెళ్లి భరతునినే శాశ్వతంగా పాలించుమని నిర్బంధించి, నాప్రాణాలను విడువాలనుకొన్నాను" అని రాముడు వివరించాడు.....
**
శ్రీరామ చంద్రస్వామి సువేల పర్వతము దిగి లంకను పూర్వము అనుకున్నట్లుగా ముట్టడించదలిచాడు.
*తస్మాద్ అవతరత్ శీఘ్రం పర్వత అగ్రాన్ మహా బలః*
నీలుడు తూర్పు దిక్కు, అంగదుడు దక్షిణంవైపు, హునుమంతుడు పశ్చిమం వైపు సైన్య మధ్యలో సుగ్రీవుడు ముప్పై ఆరు కోట్ల వీరులతో, ఉత్తరము (రావణుడున్న) వైపు స్వయంగా రామ లక్ష్మణులు యుద్ధ సన్నద్ధులైనిలిచారు.
ప్రతి ద్వారము ముందు కోటి వానర సైన్యాన్ని సుగ్రీవుడు నిలిపాడు. సుగ్రీవుడు మధ్యలో నుండి ఉత్తర ద్వారము దగ్గర నిలిచిన రామలక్ష్మణులను, దక్షిణ ద్వారము దగ్గర ఉన్న అంగదుని ఆదుకొనుటకు సిద్ధంగా ఉన్నాడు.
క్షణాలలో లంకా నగరం యొక్క అన్ని ద్వారాల వద్ద వానరులు నిండిపోయారు. లోపలి వారిని బయటకు రానీయకుండా బయటి వారిని లోనికి పోనీయకుండా కట్టడి చేశారు.
శ్రీ రామచంద్ర ప్రభువు రావణాసురునికి మరొక అవకాశమివ్వదలచి రాయబారాన్ని పంపాలనుకొన్నాడు.
హనుమ, సుగ్రీవుల బలాన్ని రాక్షసులు ఇది వరకే రుచి చూశారు. కనుక అంతవాడైన అంగదుని దూతగా ఈ సారి పంపాలనుకొన్నాడు.
*గత్వా సౌమ్య దశగ్రీవం బ్రూహి మద్ వచనాత్ కపే*
*లంఘయిత్వా పురీం లంకాం భయం త్యక్త్వా గత వ్యథాః*
*భ్రష్ట శ్రీకా గతా ఐశ్వర్య ముమూర్షో నష్ట చేతనః*
"అంగదా ! నీవు ఈ ప్రాకారము పైకి ఎగిరి లంకానగరంలోపల దూకు. అక్కడ రావణుడు సపరివారంగా ఉంటాడు. వాని ముందుకు వెళ్లి నిర్భయంగా నేను చెప్పిన మాటలను తెలుపు "రావణా! నీవు ఋషి కన్యలను అప్సరసలను, దేవగందర్వ కన్యలను అపహరించి, వారికి మన్నించరాని మహాపరాధం చేశావు.
నా భార్యను అపహరించి నిన్ను శిక్షించే అవకాశము నాకు ఇచ్చావు.
ఏ బలగర్వంతో సీతను అపహరించావో, ఆ బలాన్ని మగవాడివి అయితే నా ముందు చూపు. నిన్ను ఒక్కడిని సంహరించడమే కాదు, నిన్ను బలపరిచే రాక్షసులనెవ్వరిని మిగిలను. నాకంటబడితే నిన్ను భస్మము చేయకుండా వదలను.
ధర్మాత్ముడైన విభీషణుడు లంకానగరాన్ని పరిపాలించుటకు సమర్ధుడు. ఆయనకు ఇదివరకే సముద్ర తీరంలో పట్టాభిషేకం జరిపించాను. ఇక లంకా సింహాసనము ఆయనదే. అందువలన నిన్నువధించుట తప్పదు.
భయంకరమైన నా బాణాగ్నికి భస్మం కాకుండా మిగులాలంటే, సీతాదేవిని నాకు సమర్పించి, నన్ను శరణువేడు.
ఇక నీవధ తప్పదు. నీవు సపరివారంగా సంహరింపబడుతావు. కనుక నీ మరణం తరువాత నీకు తద్దినము పెట్టే వారు మిగలరు. కనుక యుద్ధానికి వచ్చే ముందే “జీవశ్రాద్ధము” పెట్టుకొనిరా.”
అంగదుడు ప్రాకారముపై నుండి రావణుని ముందు దుమికాడు. తన పేరును తెలిపి శ్రీరామచంద్రుని సందేశాన్ని ఉన్నదున్నట్లు వినిపించాడు.
తన ముందుకు ఒకరి తరువాత ఒకరు వానర వీరులు వచ్చితమ పరాక్రమాన్ని ప్రదర్శించి వెళ్లడం రావణునికి నచ్చలేదు.
అందువలన ఆయన సైనికులతో "ఈ దుష్టుణ్ని పట్టుకొండి, కొట్టండి చంపండి” అని ఆగ్రహంతో ఆజ్ఞాపించాడు.
*తతః స రోష తామ్రాక్ష శశాస సచివామ్స్తదా*
*గృహ్యతామేష దుర్మేధా వధ్యతాం ఇతి చాసకృత్*
రాక్షస వీరులు చుట్టుముట్టి అంగదుని పట్టుకున్నారు. కావాలనే వారికి అంగదుడు పట్టుబడ్డాడు. వారిని తన చేతులలో బిగించి, పామును బంధించిన గరుడుని వలె ప్రాకారము చివరి దాకా తీసుకెళ్లి క్రింద పడవేశాడు. రాక్షసరాజు కళ్లముందే ఆయన భటులు క్రిందపడి, కీళ్లు విరిగి, హతులయ్యారు.
అంతే కాదు ఆ భవన శిఖరాన్ని అంగదుడు పిండిపిండి చేశాడు. ఆశిఖరము రావణుని పాదాల ముందే ముక్కలైపడిపోయింది.
తన బలాన్ని మచ్చుకు రుచి చూపించి అంగదుడు రావణుడు చూస్తుండగానే పైకి ఎగిరి శ్రీ రాముని సన్నిధిలో వాలాడు. ఈ అంగదుని అద్భుత కార్యము రాక్షసులలో మహాభయాన్ని వానరులలో మహోత్సాహాన్ని నింపింది.
రావణుడు కోపావిష్టుడై యుద్ధానికి బయలుదేరుమని ఆజ్ఞాపించాడు. అనేక ఆయుధాలను ధరించి సైనికులు యుద్ధానికి బయలుదేరారు.....