16, అక్టోబర్ 2022, ఆదివారం

ధర్మాకృతి : మహాస్వామి - మహర్షి - 4

 ధర్మాకృతి : మహాస్వామి - మహర్షి - 4


నియమాలు పాలింపజేయడానికి ఏర్పడ్డ పీఠాలు ఒక్కొక్కరి విషయంలో ఒక నియమం పాటిస్తే, అట్టి స్థితిలేని కొందరు ఇది సాకుగా చూపి నియమభంగం చేస్తారు కదా! అయినా శ్రీవారు పూజ కట్టులోకి ప్రవేశించే బ్రాహ్మణుల విషయంలో ఈ నిర్ణయం చేశారు గానీ మిగతా మఠభక్తులకేమీ చెప్పలేదు. కల్లూరివారు, ఇలా అనేకులు అక్కడినుంచి ఇక్కడకు తిరుగుతూనే ఉన్నారు కదా! వారిని వెళ్ళవద్దని శ్రీవారు నిషేధించలేదు. సరి! బ్రాహ్మణులు పోయి రమణులతో ఫిర్యాదు చేసారు. రమణులు సరి! అని నిర్లిప్తంగా ఊరుకున్నారు.


తగిన సమాధానం ఇవ్వాలని పట్టుబట్టారు బ్రాహ్మణులు. "కంచి స్వామి వారు అల చెప్పవచ్చునా?" అని ప్రశ్నించారు. "వారు వీరు ఎందుకయ్యా? అక్కడ ఇక్కడ అనేదే సరి అయిన మాట. అలా చూస్తే అంతా సరిగానే తోస్తుంది. వాద ప్రతివాదాలెందుకయ్యా? ఆ పీఠనియమాలు వారు అనుసరించి చూపాలి కనుక వారు అలా సూచించారు. నిశబ్ధంగా మన పని మనం చూసుకుందాం. ఇష్టమైన వాళ్ళు రావొచ్చు. లేకుంటే మానవచ్చు. పండితులవైపు తిరిగి దీనిపై ఎవరు సమస్యలు సృష్టించవద్దు" అని చెప్పారు. తరువాత 1949లో కుంభాభిషేకం జరిగినప్పుడు తగిన శాంతి కర్మలు జరిగాయని శ్రీ రా. గణపతితో శ్రీవారన్నారట - బహుశ: కుంభాభిషేకం ప్రయోగం లోనే ఈ శాంతి కర్మలుంటాఏమో! లేక అక్కడ ప్రత్యేకంగా చేశారో!.


కనకమ్మ గారు పరంపరాగతంగా కంచి పీఠాధిపతులకు శిష్యవర్గమైన కుటుంబంలో జన్మించారు. పరమ విరాగి అయిన ఆమె రమణుల సన్నిధిలో శరణాగతి పొందారు. కుటుంబ సభ్యులు దానిని వ్యతిరేకించారు. వారి మామ్మగారు ఆమెను కంచిస్వామి వద్దకు తీసుకొని వచ్చి ఫిర్యాదుచేసి స్వామివారి శరణాగతిలోనికి తీసుకోమని ప్రార్ధించారు. శ్రీవారు సరిగ్గా రమణులు చెప్పినట్టే వారు వీరు అనే పదాలు కాకుండా "అక్కడైతే నేమి, ఇక్కడైతే నేమి" అని సమాధానం చెప్పారు.


1947 లో కంచి పెద్దలు ఆర్కాటు జిల్లలో తిరువణ్ణామలై సమీపంలో పర్యటిస్తున్నప్పుడు ఎవరో రమణుల నడిగారట "రమణులు కంచిస్వామి వారు ఎప్పుడైనా కలుసుకున్నారా?" అని. దానికి రమణులు "మేమెప్పుడు విడిగా ఉన్నాము? ఇప్పుడు కలవడానికి" అని బదులు ఇచ్చారట. మహార్ములిరువురూ నిజమైన అద్వైతానుభవులు.

అద్వైతం - రెండు లేవు. రమణులు కంచిస్వామి వారు అని ఇద్దరు లేరు. ఉన్నది ఒక్కటే పరబ్రహ్మ స్వరూపం.


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: