16, అక్టోబర్ 2022, ఆదివారం

 [14/10, 4:30 pm] K Sudhakar Adv Br: Srimadhandhra m -- 21 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu

పరీక్షిత్తు – కలి – ధర్మదేవత

పరీక్షన్మహారాజు సార్వభౌముడు అయ్యాడు. దేశాన్నంతటినీ కూడా ఎంతో సుభిక్షముగా పరిపాలిస్తున్నాడు. ధర్మరాజు పరిపాలించినప్పుడు దేశం ఎంత శోభతో, కళ్యాణ ప్రదముగా ఉన్నదో అంత ఆనందముగా ఉన్నది. ఎక్కడ చూసినా మూడు పువ్వులు ఆరుకాయలు. నెలకి మూడు వానలు! ఎక్కడా ధర్మమునకు లోపమన్నది లేదు. ఎన్నో దిగ్విజయ యాత్రలు చేసాడు. తన మేనమామగారయిన ఉత్తరుని కుమార్తె అయిన ఇరావతిని వివాహం చేసుకున్నాడు. నలుగురు కుమారులు జన్మించారు. వారిలోని వాడే సర్పయాగం చేసిన జనమేజయుడు. కురు, పాంచాల, కోసల, కాశి, మల్ల, అంగ, మగధ, మత్స్య, చేది, అవంతి, గాంధార, కాంభోజ, సౌరాష్ట్ర మొదలయిన రాష్ట్రములు అన్నిటిని జయించాడు. ఏకచ్ఛత్రాధిపత్యంగా విశాలమయిన సామ్రాజ్యమును తన పతాకఛాయలలో అత్యంత సంతోషంగా పరిపాలన చేస్తున్నాడు.

పరీక్షిత్తు యాగం చేసినప్పుడు దేవతలను పిలుస్తుంటే దేవతలు వచ్చి ఎదురుగుండా కూర్చునేవారట! యాగం చెయ్యని వాళ్ళుకూడా ఆ యాగశాలలోకి వచ్చి కూర్చుని, దేవతలు అందరూ వచ్చి కూర్చుని హవిస్సు పుచ్చుకుని వెళ్ళడము చూసేవారు. అంత నిష్ఠాగరిష్ఠుడై యాగములు చేసాడు. ఆయన దిగ్విజయయాత్రకు వెళ్ళి శిబిరము వేసుకుని ఉండగా, ఆయా ఊళ్ళల్లో ఉన్న జానపదులు వచ్చి 'మహానుభావా ! మీ పెదతాతగారయిన ధర్మరాజుగారు ఇలాగే దిగ్విజయ యాత్రకు వచ్చి శిబిరము వేసుకుని ఉంటే, మహానుభావుడు కృష్ణ పరమాత్మ, శిబిరములో పాండవులందరూ నిద్రపోతుంటే తానొక్కడే కత్తి పైకి తీసి పాండవులకు ఆపద వస్తుందేమోనని నిద్రపోతున్న పాండవులకు తెలియకుండా కత్తి పట్టుకుని శిబిరం చుట్టూ తిరుగుతూ ఉండేవాడు. కృష్ణుడు మీ తాతలని అంతలా రక్షించాడు. అదే కృష్ణుడు సారథ్యం చేస్తుంటే పాండవ మధ్యముడయిన అర్జునుడు ఒక్కొక్కసారి పిలవడం కోసమని తన పాదముతో కృష్ణుడిని డొక్కలో చిన్నగా తన్నితే కృష్ణుడు వెనక్కి తిరిగి చూసి 'ఫల్గుణా! రథం ఎటు తిప్పాలి’ అని అడిగేవాడు. అర్జునుని పిలిచి బావా! అని హాస్యం ఆడేవాడు. ‘శ్రీకృష్ణుడు నిజంగా పాండవులను ఎంతో ఆదరించాడు. మహాశివరాత్రి నాడు అర్జునుడు పాలచెంబు పట్టుకుని గబగబా పరుగెడుతుంటే చూసి కృష్ణుడు 'బావా ! ఎక్కడికి పరుగెడుతున్నావు?’ అని అడిగాడు. అర్జునుడు ‘శివాలయానికి వెడుతున్నాను. ఈవేళ శివరాత్రి అభిషేకము చెయ్యాలి’ అన్నాడు. కృష్ణుడు శివాలయములోనే ఉన్నాడని అనుకుంటున్నావా? ఇదిగో ఇక్కడ లేడా’ అని పంచెను పైకి తీశాడు. శ్రీకృష్ణుని మోచిప్పలో శివలింగం కనపడింది. శివకేశవ అభేదం! కృష్ణ భగవానుడి మోచిప్పను చూసి అర్జునుడు అభిషేకము చేసాడు.

కృష్ణుడు పాండవులను కంటికి రెప్పలా కాపాడాడు. పరీక్షిత్తు కృష్ణకథలు విని, తన తాతలు కృష్ణుడితో గడిపిన మర్యాదా పురస్కృతమైన విశేషములను విని, కన్నుల నీరు కారిపోయి పొంగిపోతూ పట్టుబట్టలు, చీని చీనాంబరములు తెప్పించి పాండవులతో కృష్ణుడు గడిపిన రోజులు గురించి చెప్పిన వాళ్ళందరికీ బహుమానములను ఇచ్చేవాడు. కృష్ణుని పాదములయందు నిరంతరము రమించి పోతూ ఉండేవాడు. మహాత్ముడయిన పరీక్షిత్తు పరిపాలిస్తూ ఉండగా లోకమంతా ప్రశాంతముగా ఆనందముతో ఉన్నది.

పరీక్షిన్మహారాజు దిగ్విజయ యాత్ర చేస్తున్న సందర్భంలో ఒక ఆశ్చర్యకరమయిన సంఘటన చూశాడు. దీనిని కొంచెం జాగ్రత్తగా గమనించాలి. దీనిని కేవలము ఒక పురాణ కథగా చదివితే దానివలన ఎంత ప్రయోజనము వస్తుంది అంటే చెప్పలేము. ఈ ఘట్టమును చాలా సునిశితముగా పరిశీలించాలి. భాగవతము భాగవతముగా అర్థం కావాలి అంటే ఇది చాలా కీలకమయిన ఘట్టం. ఒక మహాపురుష ప్రవేశం జరిగేముందు దాని వెనక ఒక కీలకమయిన సందర్భం ఉంటుంది. శుకుడు వచ్చి కూర్చోవలసిన సందర్భం వస్తున్నది. అలా రావడానికి దాని వెనక ఏదో మహత్తరమయిన సంఘటన జరుగుతున్నది. ఆ కోణములో పరిశీలన చేయకపోతే భాగవతమును వ్యాసుడు ప్రారంభం చేసిన రహస్యం అందదు. భాగవతమును విన్నంత మాత్రం చేత జీవితం మారిపోతుంది.

పరీక్షిన్మహారాజు దిగ్విజయ యాత్రలో తిరుగుతూ తిరుగుతూ ఒక ప్రదేశమునకు వచ్చాడు. ఒక ఆవు, ఎద్దు నిలబడి వున్నాయి. ఈ ఆవు పిల్లల పక్కన లేక పిల్లలు కనపడక, పిల్లల క్షేమవార్త తెలియక ఏడుస్తున్న తల్లి ఎలా ఉంటుందో అలా ఉన్నది. ఇటువంటి ఉపమానమును తండ్రికి వెయ్యరు. తల్లికి మాత్రమే వేస్తారు. అమ్మ అనే మాట చాలా గొప్పది. మాతృత్వంలో ఉన్న ప్రేమ అంతటినీ తీసుకువచ్చి ఒక ముద్దగా పెడితే ఆ ముద్దను చూడాలి అనుకుంటే ఆ ముద్దయే భూమి అమ్మ. ఇందుకే భూమి గురించి ఎక్కడయినా చెప్పవలసి వస్తే ఋషులు పొంగిపోతారు. వాల్మీకి మహర్షి అయితే ‘క్షితి క్షమా పుష్కర సన్నిభాక్షీ’ అంటారు. అమ్మకి ఉండే గొప్ప లక్షణము ఓర్పు. అమ్మకి ఓర్చగలిగిన గుణం ఉంటుంది. కలియుగ ప్రారంభములో ఇవాళ భూమి దానిని కోల్పోయింది. బిడ్డ కనపడని ఆవు ఏడ్చినట్లు ఆవిడ ఏడుస్తోంది. ఇది కలియుగానికి ప్రారంభం. అమ్మ ఏడుపుతో కలియుగం ప్రారంభమయింది. దీనిని గుర్తుపట్టాలి. ఆవు అలా ఏడుస్తుంటే పక్కన ఒక ఎద్దు వచ్చి నిలబడి ఉన్నది. ఆ ఎద్దు ఒక కాలితోనే ఉన్నది. ఎద్దుకు మూడు కాళ్ళు లేవు. ఒక కాలిమీద ఎద్దు నిలబడగలదా? ఒక కాలితో ఉన్న ఎద్దు భూమిమీద డేకుతూ ఉంటుంది. నిలబడినట్లు కనపడుతుంది అంతే. అలా నిలబడినట్లుగా ఉన్న ఎద్దు తన మూడుకాళ్ళు పోయాయని ఏడవడము లేదు – ఆవు ఏడవడము చూసి ఆశ్చర్యపోయింది. ఇదీ గుర్తుపట్టవలసిన రహస్యం. ఆవు ఎందుకు ఏడుస్తోందని గోమాత వంక తిరిగి – ‘నీవు ఎందుకు ఏడుస్తున్నావు మంగళప్రదురాలా’ అని అడిగింది. ‘మంగళప్రదురాలా’ అంటే ‘శుభం ఇవ్వడం మాత్రమే తెలిసున్నదానా’ అని అర్థం.

ఒక ఇల్లు కట్టుకోవాలంటే భూమిని గునపంతో ఆవిడ గుండెల మీద కన్నం పెడతారు. శంకుస్థాపన చేస్తే ఆవిడ ఇల్లు కట్టుకోమంటుంది. అన్నం తినడానికి నాగలిపట్టి అమ్మ గుండెలమీద గాట్లు పెడితే అమ్మ పంటలు పండించి కడుపు నిండేటట్లుగా అన్నం పెడుతోంది. ఎంత బాధ పెట్టినా కన్నులవెంట నీరు పెట్టుకోవడము ఆమెకు తెలియదు. బ్రతకడానికి ఇవ్వడం తెలుసు. గోవు ఏడుస్తుంటే ఎద్దు అడిగింది. ‘నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నీకేమి బాధ కలిగింది? నువ్వు చాలా సంతోషముగా ఉండేదానివి కదా!’ అడిగితే భూమి ‘నేను నాకు ఏదో బాధ కలిగిందని ఏడవడం లేదు. కృత యుగమయినా, మరొకటి అయినా నా బాధ ఎప్పుడూ అలానే ఉంటుంది. గోవు బాధ పడుతోంది. కలియుగ ప్రారంభంలో ఎందుకు గోవు అలా ఏడుస్తున్నదో చెప్తున్నారు. ఆవు ఎద్దుతో చెప్తోంది ‘కలి ప్రవేశించాడు – నేను ఏడుస్తున్నా నంటావేమిటి? నీకు మూడు కాళ్ళు లేని తనమును చూసి నేను ఏడుస్తున్నాను’ అన్నది. ఆయనకు మూడుకాళ్ళు లేకపోతే ఈవిడ ఏడవడం ఎందుకు? ఆవిడ –

కలి బలవంతంగా రాలేదు. ఈశ్వరుడు అనుగ్రహించాడు. కలియుగం రావడానికి కాలము దారిని ఇచ్చింది కాలము ఈశ్వరరూపం. ఆ కలి లోపలి అడుగు పెట్టి పాదములు ఇంకా పూన్చుకోలేదు – పరిస్థితి మారిపోయింది. పూర్వము నీకు నాలుగు పాదములు ఉండేవి. నీకు ఒక పాదమే ఉన్నది. మూడు పాదములు లేవు. కలిపురుషుడు రావడము వలన నీకు మూడు పాదములు పోయాయి’ అన్నది.

అది మామూలు ఎద్దు కాదు. ఆ ఎద్దు ధర్మము. ధర్మమునకు, భూమికి ఎంతో దగ్గర సంబంధము. ధర్మమునకు సత్యము, శౌచము, తపస్సు, దయ అనే నాలుగు పాదములు ఉండేవి. ఈ నాలుగు పాదములతో ధర్మం నడుస్తుంది. ఇలా నడిచే నాలుగు పాదములు కలిగిన ధర్మమనబడే వృషభమును శంకరుడు ఎక్కుతాడని అంటారు. ఆయన ధర్మమును అధిరోహించి నడుస్తారని భావము. ఆవు చెపుతున్న మాటలను చాలా జాగ్రత్తగా గుర్తుపట్టాలి. ‘నేను దేవతల గురించి ఏడుస్తున్నాను. హవిస్సులు పొందని దేవతలు తయారవుతారు’ అన్నది. రాబోయే కాలములో యజ్ఞయాగాదులను విమర్శించే వాళ్ళు ఎక్కువయిపోతారు. యజ్ఞయాగాది క్రతువులు ఒక్క మన సనాతన ధర్మములో మాత్రమే ఉంటాయి. ఇంకెక్కడా లేవు. యజ్ఞం చేయడం, అగ్నిహోత్రంలో హవిస్సు వెయ్యడం మున్నగు కార్యక్రమములు జరగవు. మరల సంపదను పొందడానికి అగ్నిహోతము ద్వారా దేవతలకు హవిస్సులు ఇస్తే, ప్రీతిచెందిన దేవతలు మరల వర్షమును కురిపించి మనకు సంపదలను ఇస్తారు. తిరిగి వారిపట్ల కృతజ్ఞతను ప్రకటించనప్పుడు దేవతల ఆగ్రహమునకు గురి అవుతారు. కలియుగంలో దేవతలకు హవిస్సులు ఇవ్వబడవు. ‘హవిస్సులు ఇవ్వని మనుష్యులకు శుభమును మేము చేయము’ అని దేవతలు శుభములను చేయరు.

https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage

instagram.com/pravachana_chakravarthy

[14/10, 4:30 pm] K Sudhakar Adv Br: Srimadhandhra Bhagavatham -- 22 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu


ఏది సనాతన ధర్మమో, ఏ సనాతన ధర్మము ఈ గడ్డ మీద నిలబడిందో ఆ సనాతన ధర్మము ఈ గడ్డమీద విమర్శకు గురి అవుతున్నది. యజ్ఞ యాగాది క్రతువులు నశించిపోవడం ప్రారంభమవుతుంది. ఎవరు వేదమును కష్టపడి చదువుకుని, చాలా కష్టపడి ఆ స్వరంతో వేదం చెపుతారో అటువంటి వారికి ఆదరణ తగ్గిపోతుంది. లోకంలో అసలు ఆ వేదమును ఆదరించాలనే బుద్ధి నశించిపోతుంది. ఎవరు తపస్సుతో ఉన్నాడో, ఎవరు లోకంలో ఈ విషయ సుఖములు అక్కర్లేదని జడలు కట్టి భగవంతుని యందు ఉన్నాడో వానిని లోకులు రాళ్ళుపెట్టి కొట్టే రోజు వస్తుంది. అలాంటి వానిని చూసి నిష్కారణంగా విమర్శ చేసే రోజులు బయలుదేరతాయి. పితృదేవతలకు తద్దినములు పెట్టేవాళ్ళు కరువైపోతారు.


ధర్మం పోతుంది. ఆవులు అవమానింపబడతాయి. ఆవుల్ని కొడతారు, అమ్ముతారు, తోళ్ళు తీసేస్తారు. ఆవుమాంసం తింటారు. ఈ మాటలను కలియుగ ప్రారంభంలోనే చెప్పేసింది. ‘వీళ్ళందరూ బాధలకు గురి అవడం ప్రారంభం అవుతున్నది. అందుకు ఏడుస్తున్నానని ఒకమాట చెప్పింది. ‘నీకు సత్యము, శౌచము, తపస్సు, దయ అనే నాలుగు పాదములు ఉండేవి. ఇందులో మూడు పాదములు పోయాయి’ అన్నది.


ఎద్దును ధర్మ స్వరూపంగానూ, ఆవును భూస్వరూపముగానూ తలంచాలి. ధర్మ స్వరూపమునకు మూడు పాదములు పోయాయి అంటే ఏమిటి? ధర్మమన్నా ఆచరించాలి లేదా అధర్మమన్నా ఆచరించాలి. ధర్మంగా ఉండాలి. అలా ఉండకపోతే అధర్మం చేసినట్లు. అధర్మమయినవి మూడు తిరగకూడనివి తిరుగుతున్నాయి. అవి తిరగబట్టి ధర్మమునకు ఉండే ఈ మూడు పాదములు తెగిపోయాయి. సత్యమనే పాదము మాత్రము ఎన్నటికీ తెగదు. దీనిని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇన్ని అధర్మములు చేసినా, దేవుడి గురించి తిట్టేవాడికి కూడా లోపల దేవుడు ఉన్నాడు. లోపల ఆయన ఉండి ఊపిరిని వాక్కుగా మారిస్తే వాడు కృతఘ్నుడై తిట్టగలుగుతున్నాడు.


ఈశ్వరుడు ఇంకా ఉన్నాడు కాబట్టి ఈలోకం ఉన్నది. మారని పదార్థము ఇంకా కాపాడుతున్నది. నాలుగు పాదములలో సత్యమనే పాదము ఒక్కటే నిలబడింది. శౌచము – దుష్టజనులతో కూడిన సంగమము వలన పోయింది. జీవితములో అన్నిటికన్నా స్నేహం విషయములో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంటికి తమంత తాముగా యాభైమంది వచ్చి వారంతా మాట్లాడవచ్చు. ఎప్పుడూ మీరు మీ స్థితి నుండి జారిపోకూడదు. ఒకనాడు దుష్టుడయిన వాడు ప్రమేయం లేకుండా తారసపడతాడు. వాని మాటలను ఒక తామరాకు మీద నీటిబొట్టు పట్టినట్లు ఆ మాటలు వెంటనే జారిపోవాలి. వాని మాటలను ఒక చిరునవ్వుతో విని వదిలిపెట్టాలి తప్ప వాటికి మనసులో స్థానం ఇవ్వకూడదు. అలా స్థానం ఇస్తే శౌచము పోతుంది. శౌచము అంటే ఆచారము, నడవడి, వ్యవహారము. ఇవన్నీ నశించిపోతాయి.

మూడవ పాదము దయ. దయ దేనివలన పోయింది? దయ పోవడానికి ప్రధాన కారణము అహంకారము. అహంకారము వలన దయ నశించి పోతుంది. తనలో ఫాల్స్ ఈగో ఒకటి వృద్ధి చేసుకుంటాడు. ఎప్పుడూ నిన్ను పొగిడేవాడిని ఎక్కువగా నీ దరికి చేర్చకు’ అని చెపుతారు. నీకు తెలియకుండా నీవు నిర్మించుకున్న నీ శీలము అహంకారము వలన నశించిపోతుంది. మీ పక్కన కూర్చున్న వాడు నిరంతరం పొగడడం మొదలు పెడితే – ‘నా అంతటి వాడిని నేను’ అన్న అహంకారము వచ్చి ఈ అహంకారము ప్రబలిపోవడం వలన భూతదయ నశించిపోతుంది. అహంకారము కారణమయింది. దయ స్థానంలో, కలిపురుషుడు ఉన్నచోట అహంకారము కనపడుతూ ఉంటుంది. ధర్మము స్థానంలో అధర్మము ప్రవేశిస్తోంది.


మూడవది తపస్సు, తపస్సు సమ్మోహము వలన పోయింది. సమ్మోహము అనేది ఒక విచిత్రమయిన లక్షణము. కాబట్టి ఇప్పుడు ఈ మూడూ పోయాయి. ధర్మము మూడు పాదములు పోయి అధర్మము పాదములు వచ్చాయి. అధర్మము పాదములు ధర్మమునకు అంటుకుని ఉండవు. అది ధర్మ స్వరూపమయిన వృషభము. అది కలియుగంలో మూడు పాదములు లేకుండా కనపడుతోంది. ఈ మూడు పాదములు ఇంకొక చోట ఉన్నాయి. ‘ఆ మూడు పాదములే ఇప్పుడు తిరుగుతున్నాయి. కాబట్టే ఇప్పుడు నేను ఏడుస్తున్నాను. నేను ఏడవడానికి కారణం నీమూడు పాదములు లేకపోవడము’ అన్నది.


అక్కడ ఆవు, ఎద్దు అలా ఏడుస్తుంటే ఒక విచిత్రమయిన సంఘటన జరిగింది. ఒక వ్యక్తి ఆ ఆవు, ఎద్దు దగ్గరికి వచ్చాడు. ఆ వచ్చిన వాడు మిక్కిలి క్రోధంతో ఉన్నాడు. వాని క్రోధం సామాన్యమయిన క్రోధం కాదు. అపారమయిన కోపం ఉన్నవాడు. పైగా చేతిలో కత్తి, కర్ర పట్టుకున్నాడు. చూడడానికి రాజుగారిలా ఉన్నాడు. రాజు ఎటువంటి ఆభరణములు పెట్టుకుంటాడో, ఎటువంటి కిరీటము పెట్టుకుంటాడో అటువంటివి పెట్టుకుని పరిపాలకుని వలె ఉన్నాడు. కానీ వాడు ఎప్పటికీ పరిపాలకుడు కాలేడు. వానిలోపల పరిపాలనాంశ లేదు. పరిపాలించడానికి తగిన సంస్కార బలం లేదు. కానీ పరిపాలకుడు అయ్యాడు. ఇది కలియుగ లక్షణం. నృపాకారంలో వచ్చినవాడు బిడ్డ కనపడక ఏడుస్తున్న తల్లిలా శుష్కించి పోయివున్న, ఏమీ చేయకుండా అలా నిలబడిపోయి వున్న ఈ ఆవుని, అపారమయిన కోపంతో తన కాలు ఎట్టి ఒక్కతన్ను తన్నాడు. ఆ ఆవు నేలమీదికి తిరగబడి పోయింది. అక్కడే ఉన్న ఒక కాలుమీద నిలబడిన ఎద్దును మరో తన్ను తన్నాడు. ఎద్దు కూడా క్రింద పడిపోయింది. అలా పడిపోతే వాడు ఊరుకోలేదు. తన చేతిలో ఉన్న దండముతో ఆ రెండింటినీ కొట్టడం ప్రారంభించాడు. వాడు భూదేవిని కొడుతున్నాడు. భూమి వలన తాను బ్రతుకుతున్నాడన్న విషయమును మరిచిపోయి ప్రవర్తిస్తున్నాడు. ధర్మమును దెబ్బతీస్తున్నాడు. అదేపనిగా కొడుతున్నాడు. అవి ఏడుస్తూ, కన్నులవెంట నీరు కారుస్తూ కిందపడి లేచి కుంటుతూ ఉన్నాయి. అతను కొడుతున్న ఆవు కైలాస పర్వతం ఎలా ఉంటుందో అంత తెల్లనయిన ఆవు. కైలాసము ఈశ్వరుని ఆవాసము. ఈశ్వరుడు పైకి అపవిత్రముగా, అమంగళముగా ఉన్నట్లు కనపడతాడు. పుర్రెలమాల వేసుకున్నట్లు, శ్మశానములో ఉన్నట్లు, శవవిభూతి రాసుకున్నట్లు ఉంటాడు. ఆయనంత మంగళప్రదుడు వేరొకడు లేదు. ఆయనకు ‘శివ’ అని పేరు. పైకి అమంగళంగా కనపడతాడు. రెండు పరస్పర విరుద్ధమయిన విషయములు ఒకరియందు ఏకకాలమునందు ఉన్నాయి. ఆయన ఎప్పుడూ మంగళమునే చేస్తాడు. శివుడు ఎప్పుడూ అమంగళమును చెయ్యడు. ఆవుకూడా ఎప్పుడూ అమంగళమును చెయ్యదు.

నిరంతరము ఉపకారము తప్ప వేరొకటి తెలియని ఆ ఆవుని చూసి పరీక్షిత్తు – ‘నిన్ను ఇలా కొట్టిన వారు ఎవరు? నీవు చేసిన ద్రోహం ఏమిటి? నువ్వు పాలను ఇస్తావు. నీపేడ ఉపయోగపడుతుంది. నీ మూత్రము ఉపయోగ పడుతుంది. ఎవ్వరికీ పనికిరాని గడ్డిని ఎద్దు తింటోంది. ఎక్కడో జనం వెళ్ళి నీరు తెచ్చుకోని చోట మూతి పెట్టి నీరు త్రాగింది. ఇందులో ఒక రహస్యం ఉంది. ఎద్దును పాము ఎక్కడ కరిచినా చచ్చిపోదు అంటారు. కానీ మూతిమీద కరిస్తే మాత్రం చచ్చిపోతుంది. ఆవుకి ఆహారం పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టాలి. పుట్టలమీద గడ్డి చాలా బాగా పెరుగుతుంది. అలా పుట్టల మీద పెరిగిన గడ్డిని తినడం ఆవుకి, ఎద్దుకి చాలా ప్రమాదకరం. ఆవు కాని, ఎద్దు కాని పుట్టలమీద గడ్డి తిని గబుక్కున ఎందులోకయినా జారితే గభాలున పైకి రాలేవు.


ఎద్దును చూసి, ‘వీధిలో గడ్డితిని ఏట్లో నీరు త్రాగి కాలం గడుపుకొనే నీ మూడు కాళ్ళను తెగగొట్టిన వాడెవడు? నువ్వు అపరాధం చేశావని ఎలా నమ్మాడు? వాడు భూమిలో దాగున్నా, ఆకాశమునకు ఎగిరిపోయినా, వాడు మణులు పెట్టుకున్న భూషణములతో కూడిన వాని భుజములను నా కత్తితో నరికేస్తాను. ఇది నా ప్రతిజ్ఞ. ఏ చేతితో నీ పాదములు నరికాడో ఆ చేతిని, వాని పాదములను నరికేస్తాను’ అన్నాడు. ఇంకా ధర్మ సంస్థాపన కోసము పరీక్షిత్తు వరకు పూనిక ఉన్న రాజు భూమి మీద ఉన్నాడు.

ఈ మాటలు అన్న తరువాత పరీక్షిత్తు వాటి స్వరూపమును చూసి అక్కడున్న వృషభము, గోవుల అసలు రూపములను గుర్తుపట్టి – ‘అమ్మా, నువ్వు ధరణీదేవివి. ఆయన ధర్మము. మీ ఇద్దరు ఇలా అయినందుకు నేను శోకిస్తున్నాను. ఎవరు ఇలా మీ పాదములు తెగగొట్టాడు?’ అని అడిగాడు.


వృషభము – ‘కొందరు కాలము అన్నారు. కొందరు కర్మ అన్నాడు. ఇది యుగసంధి అన్నారు. ఇది యుగలక్షణం అన్నారు. ‘ఏవేవో కారణములు చెప్పారు. నా కాళ్ళు మాత్రం తెగిపోయాయి’ అని చెప్పింది.

ఆయన అటూ ఇటూ చూస్తున్నాడు. ఇప్పటివరకు నృపాకారముతో ఉన్నవాడు వెళ్ళి పరీక్షిత్తు పాదముల మీద పడిపోయి ‘నన్ను రక్షించండి. తప్పయిపోయింది. ఆ మూడు పాదములు నేనే నరికేశాను’ అన్నాడు. ధర్మము మూడు పాదములు కలి వలన పోయాయి. అనగా కలి తెంచలేదు. కలి మీలోకి వస్తే మీచేత ధర్మమును తెంపించి వేస్తాడు. ఇపుడు కలి ప్రవేశం జరిగింది.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

[14/10, 4:30 pm] K Sudhakar Adv Br: Srimadhandhra Bhagavatham -- 23 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu


కలి 'నేను ఇంకా స్థిరముగా ఊన్చుకోలేక పోతున్నాను. ఇది నా తప్పు కాదు. యుగం వచ్చేసింది నేను రావాలి. అందుకే ఈశ్వరుడు వెళ్ళిపోయాడు. నేను వచ్చాను. నేను గట్టిగా ఊన్చుకొని నిలబడదామనుకుంటే నేను ఎక్కడికి వెడితే అక్కడ నీవు ధనుర్బాణములు పట్టుకుని కనపడుతున్నావు. ఇలా అయితే నేను ఉండడం కష్టం కదా! కలియుగంలో నేను ప్రవేశించాలి కదా! నువ్వు నాకొక అవకాశం ఇవ్వు. నన్ను ఫలానాచోట ఉండమని చెప్పు. నేను అక్కడ ఉంటాను ఇక ఇబ్బంది ఉండదు. అలాకాక నేను ఎక్కడికి వెడితే నీవు అక్కడ కనిపించినట్లయితే నీకూ, నాకూ సంఘర్షణ వస్తుంది. నువ్వు నన్ను చంపుతానని అంటావు. నేను ఎక్కడ ఉండాలో నువ్వే చెప్పు' అన్నాడు.

పరీక్షిత్తు 'నీకు నాలుగు స్థానములు ఇస్తాను. నువ్వు అక్కడే ఉండు' అన్నాడు. పరీక్షిత్తు చెప్పిన మొట్టమొదటి స్థానం జూదశాల. “జూదశాల యందు నీవు ఉండవచ్చు” అన్నాడు. రెండవది పానశాల. ‘ఎక్కడెక్కడ మత్తు పదార్థములను త్రాగుతారో అక్కడ నీవు ఉండవచ్చు’ . మూడవది ‘స్వేచ్ఛా విహరిణులై, ధర్మమునకు కట్టుబడని ఆచార భ్రష్టులయిన స్త్రీలవద్ద నీవు ఉండవచ్చు.’ నాల్గవది జీవహింస జరిగే ప్రదేశము. ‘జీవహింస జరిగే ప్రదేశముల యందు నీవు ఉండవచ్చు. ఈ నాలుగు ప్రదేశములను నీకు ఇచ్చాను’ అన్నాడు.

ఇలా కలికి ఈ నాలుగు స్థానములను ఇచ్చుట ద్వారా పరీక్షిత్తుకు కలిసి వచ్చినది ఏమిటి? అసలు కలిని రావద్దు అని చెప్పాలి కాని, అలా నాలుగు స్థానములు కలికి ఇవ్వడం ద్వారా కలి వెళ్ళి జూదశాలలో పేకముక్కలు ఇస్తాడా, లేకపోతే మత్తు పదార్థములను అమ్మేచోటికి వెళ్ళి దుకాణం పెట్టుకుంటాడా, లేకపోతే జీవహింస తాను చేస్తాడా – కలి ఎలా పాడుచేస్తాడు? ఇది విశ్లేషణ చేయాలి.

జూదశాలయందు ఏమి జరుగుతుంది? అక్కడ అసత్యము ప్రబలుతుంది. లోకమునందు పోకడ గమనించే ఉంటారు. గుడికి వెళ్ళేవాడు ‘ఏమండీ- నేను ఒక్కసారి శివాలయమునకు వెళ్ళి ప్రదక్షిణ చేసి వచ్చేస్తానండి అంటాడు. సినిమాకి వెళ్ళేవాడు నేను సినిమాకి వెడుతున్నాను అని చెప్తాడు. కానీ తాను పేకాడుకోవడానికి వెడుతున్నానని ఎవరు చెప్పరు. మర్యాద పోతుందని తెలుసు. అబద్ధం చెప్తారు. అలా చెప్పుకుందుకు సిగ్గుపడరు. వీరందరూ లోపల కూర్చుని పేక ఆడుకుంటూ ఉంటారు. అక్కడ చాలా నిశ్శబ్దముగా ఐశ్వర్యం వెళ్ళిపోతుంది. అక్కడ కలిస్థానం అసత్యం ప్రారంభమవుతుంది.

సత్యమును ఆశ్రయించి లక్ష్మి ఉంటుంది. అసత్యం పలకగానే లక్ష్మి వెళ్ళిపోవడము మొదలవుతుంది. జూదశాలలో అసత్యమే చెప్పాలి. తీరా వెళ్ళిన తర్వాత మూడుగంటలు కూర్చుని ఇంటికి వస్తే పాపం భార్య ‘ఏమండీ ఇంతసేపు ఎక్కడికి వెళ్లారండీ’ అంటే ఆయన ‘స్వామీజీ ఉపన్యాసమునకు వెళ్లాను. నేను వెళ్ళకపోతే ఆయన చెప్పలేనని అంటున్నాడు. ’ అంటాడు. అక్కడొక అసత్యం. క్రమంగా విషయం తెలుస్తుంది. భార్య ఇంట్లో ఏడుస్తూ ఉంటుంది. ‘మీరు పేకాటలో డబ్బు పోగొట్టుకుంటున్నారు’ అంటుంది. ‘ఏమీ కాదు డబ్బు మా నాన్న గారికి పంపించాను’ అని దబాయిస్తాడు. జూదశాల నుంచి కలి అసత్యరూపంలో వస్తున్నాడు. కాబట్టి భ్రష్టత్వం వచ్చేసింది.

రెండవది పానశాల. తాగగానే యుక్తాయుక్త విచక్షణ పోతుంది. మదము ప్రవేశిస్తుంది. అతివాగుడు మొదలవుతుంది. తాగగానే శుకపిక బకరవములు ప్రారంభమయిపోతాయి. ఒక వెర్రివాగుడు మొదలుపెడతాడు. సేవించకూడనిది సేవించడం వల్ల నీ అంత రాక్షసుడయిపోతున్నాడు. ఈశ్వరుడు ఇచ్చిన దైవత్వమును నాశనం అయిపోతుంది. ఈశ్వరుని దయ ప్రసరించదు. ఈశ్వరుని ఆగ్రహం ప్రకటితమౌతుంది. మదోన్మత్తుడవు అయితే ఆ మదము భ్రష్టుడిని చేసేస్తుంది. కలి మదరూపంలో వస్తాడు. పానశాలయందు ఉండడానికి పరీక్షిత్తు కలికి అవకాశం ఇచ్చాడు. మూడవది స్వేచ్ఛా విహారిణి అయిన స్త్రీ. ఆమె వలన సమాజం భ్రష్టు పడుతోంది. మనిషి విషయ సంగలోలుడు అయిపోతున్నాడు.

నాల్గవది హింస. నిష్కారణముగా ఒక ప్రాణి బాధపడితే తాను సంతోషించుటను హింస అంటారు. ప్రాణిహింస అంటే కేవలం ప్రాణులను చంపివేయడమని కాదు. కొంతమంది చీమలు వెడుతుంటే వాటిని తొక్కేస్తారు. కొంతమంది నిష్కారణంగా చెట్ల ఆకులను తుంచుతారు. ఆకులను సృష్టించలేదు. ఆ ఆకులను తుంచివేసే హక్కు లేదు. అది నిష్కారణ హింస. అన్నిటికంటే భయంకరమయిన హింస నోటిమాట. ఒక మనిషిని పడుకోబెట్టి మత్తుమందు ఇవ్వకుండా రంపము పట్టుకువచ్చి అటు ఒకరు, ఇటు ఒకరు నిలబడి దూలమును కోసినట్లు కోస్తుంటే, ఆ కడుపు కోయబడుతున్న వాడు ఎంత బాధపడతాడో, అవతలవారు తాను అంటున్న మాటలకు అంత బాధపడుతున్నాడన్న ఇంగితజ్ఞానం ఉండదు. ఈశ్వరుడు నోరు ఇచ్చాడు వాక్కునందు అదుపు ఉండాలన్న జ్ఞానం ఉండదు. అవతలివారు బాధపడకుండా మధురమధురంగా మాట్లాడడం నేర్చుకోవాలి మనిషి. ప్రయత్నపూర్వకంగా అభ్యసించకపోతే మాటయందు కాఠిన్యము అలవాటయిపోతుంది. అవతలివారి యందు నిష్కారణమయిన కోపం పెరిగిపోతుంది. అవతలివాడు బాధపడుతుంటే వీడు సంతోషపడతాడు. అవతలివాడి బాధ వీడి సంతోషమునకు హేతువయిన నాడు అది కలిపురుషుని ప్రవేశమును సూచిస్తుంది.

ఈ నాలుగు స్థానములు కలికి ఇచ్చాడు. తాను పరిపాలనలో ఉండగా ఈ నాలుగు స్థానములకు తన ప్రజలు ఎవ్వరూ వెళ్ళరని పరీక్షిత్తు నమ్మకం. ఈ నాలుగుచోట్లకు బాగా వెళ్ళాలని కోరుకుంటే ఆయన పరీక్షిత్తు కాదు. కలి ప్రతినిధి.

ఈ నాలుగింటిలో ఒకదానికి పట్టుకున్నా మిగిలిన మూడింటివైపు ఎలా లాగివేయాలో కలికి తెలుసు. భాగవతమును వినడం వలన జీవితం ఎక్కడ పాడయిపోతున్నదో తెలుసుకోగలుగుతారు.

కలిపురుషుడు చాలా తెలివితేటలుగా ప్రజలను మభ్యపెట్టగలడు. కలి పరీక్షిత్తుతో 'మీరు నాకు నాలుగు స్థానములు ఇచ్చారు. వీటిలో నేను ఊన్చుకోవడానికి తగిన స్థానం లేదు. కనుక ఇంకొక్క స్థానమును ఇప్పించండి’ అన్నాడు. అపుడు గభాలున పరీక్షిత్తు ‘నేను నీకు బంగారమునందు స్థానం ఇచ్చాను’ అన్నాడు. ‘చాలు మహాప్రభూ!’ అని కలి వెళ్ళిపోయాడు.

ఆ రోజుల్లో బహుశ ఒక లక్షణం ఉండేది. నిస్సంగులయిన వారికి ఆత్మజ్ఞాన ప్రబోధము చేసేవారికి బంగారమునందు లోభము ఉండదు. వారు బంగారమును కోరరు. వారికి దానిమీద పెద్ద ఆసక్తి ఉండదు. అందుకని కలికి అక్కడ ఇచ్చినా ప్రమాదమేమీ ఉండదని పరీక్షిత్తు భావించి ఉండవచ్చు. పరీక్షిత్తు మాట తప్పనితనమే ఆయనకు ప్రతిబంధకము అయిపోయింది.

పరీక్షిత్తు ఒంటినిండా బంగారమే. అది చాలు కలికి పరీక్షిత్తులో ప్రవేశించి అతనిని నాశనం చేయడానికి. ఇంటికి వెళ్ళిన పరీక్షిత్తుకి వేటకి వెళ్ళాలనే కోరిక కలిగింది. వేటకోసమని బయలుదేరాడు. అనేక మృగములను వేటాడాడు. కలి అంశలలో బంగారమునుండి తానిచ్చిన వేరొక స్థానములోనికి పరీక్షిత్తు వచ్చేశాడు. ఎలా? ఒకదానిద్వారా కలి ప్రవేశిస్తే చాలు, మిగిలిన అవలక్షణములన్నీ వచ్చేసి ఆ వ్యక్తి చివరకు నాశనం అయిపోతారు. పరీక్షిత్తు ఒంటిమీద బంగారం ఉన్నది. కలి పరీక్షిత్తులోనికి ప్రవేశింపగలిగాడు. పరీక్షిత్తుకు జీవహింస చేయాలన్న కోరిక పుట్టింది. సాధారణముగా వేటకి ప్రభువు ఎప్పుడు వెడతాడంటే – జానపదులు వచ్చి, క్రూర మృగముల సంఖ్య పెరిగి పోయింద' ని వేడుకుంటే, ఆ క్రూర మృగములు ఊరిమీదకి రావడానికి భయపడే రీతిలో రాజు పెద్ద పరివారముతో దండుగా వెళ్ళి కొన్ని క్రూర మృగములను వేటాడతాడు. అలా వెళ్ళాలి. జంతువులను సరదాగా చంపడానికి వేటకు వెళ్ళకూడదు. పరీక్షిత్తుకు జంతువులను చంపుదామనే ఆలోచన పుట్టి వేటకు వెళ్ళాడు. తద్వారా ఇంకొక స్థానంలోకి వెళ్ళాడు. అతనిలో నిష్కారణ క్రౌర్యం ప్రవేశించింది.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

[14/10, 4:30 pm] K Sudhakar Adv Br: Srimadhandhra Bhagavatham -- 24 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu


పరీక్షిత్తు వేటకి వెళ్ళి వేటాడాడు. దప్పిక, ఆకలి కలిగింది. ఆకలి దప్పిక కలిగినప్పుడు అవి పోగొట్టుకునేందుకు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి. పరీక్షిత్తుకి బుద్ధి భ్రంశము అవుతున్నది. అతడు దగ్గరలో ఉన్న మహర్షి ఆశ్రమమునకు వెళ్ళాడు. దాహార్తి తీర్చమని అక్కడ ఆశ్రమములో సంచరిస్తున్న స్త్రీ పురుషులనెవరినయినా అడగాలి. కానీ పరీక్షిత్తు వారినెవరినీ అడగలేదు. అతనిలో అహంకారము ప్రవేశించింది. నేరుగా తపోదీక్షలో ఉన్న శమీకమహర్షి దగ్గరకు వెళ్ళాడు. ఆయన

స్థాణువయి ధ్యానమునందు తపస్సునందు చాలా మగ్నుడయి బ్రహ్మమునందు రమిస్తు

ఏమాత్రం కదలిక లేకుండా ఉన్నాడు. ప్రాణాయామము చేత ప్రాణమును నియంత్రించి కుంభకము చేత వాయువును పూరించి ఆపుచేసాడు. మనస్సు ఊపిరిమీద ఆధారపడుతుంది. మనస్సు ఇప్పుడు కదలడం లేదు. మనస్సు కదలకపోవడం వల్ల బుద్ధి కదలడం లేదు. బుద్ధి కదలకపోవడం వల్ల ఇంద్రియములు కదలడం లేదు. బయట విషయమును కన్ను చూడదు, చెవులు వినబడవు. స్పర్శేంద్రియములు బాహ్యజ్ఞానము తెలియదు. జాగ్రదాది మూడు అవస్థలను దాటిపోయి చివరకు తురీయమనే స్థాయికి చేరిపోయి, తాను సాక్షాత్తు ఆత్మగా సాక్షీభూతుడై శరీరమును చూస్తూ బ్రహ్మముగా నిలబడిపోయి ఉన్నాడు. అలా కూర్చుని బ్రహ్మముతో రమించి ఉండిపోతే ఆయన వెంట్రుకలు, గోళ్ళు, పెరిగిపోతున్నాయి. అవి జటలు కట్టేసి కేశ సంస్కారము లేక వ్రేలాడుతున్నాయి. ఒక కృష్ణజింక చర్మమును కట్టుకుని అలా కూర్చుని ఉండిపోయాడు. వస్త్రం కూడా లేదు.

శమీకమహర్షి దగ్గరకు దాహంకోసం ఆర్తిపొందిన పరీక్షిత్తు వెళ్ళాడు. ఆయన నీటికోసం వెళ్ళడం ప్రధానాంశం. పరీక్షిత్తు లోపల ఒక మౌనభాష బయలుదేరింది. ఇప్పుడు పరీక్షిత్తు తానెవరో మరిచిపోయాడు. అతని బుద్ధి భ్రంశమయి బ్రహ్మమునందు రమిస్తున్న తాపసిని చూసి నిశ్శబ్దముగా తాను వెళ్ళిపోవాలి. కానీ తాను అలా వెళ్ళక మహారాజునయిన నేను వస్తే లేచి నిలబడలేదని, నమస్కరించలేదని, ఆసనం చూపించలేదని ఆ తపస్వి మిక్కిలి అహంకారుడని భావించాడు.

ఇప్పుడేమయింది? అంత గొప్ప పరీక్షిత్తు, తెల్లవారిలేస్తే బ్రాహ్మణులకు నమస్కారం చేసేవాడు అన్నీ తెలిసినవాడు అన్నిటినీ మరచిపోయాడు. కలి ప్రవేశము వలన అన్నీ భ్రంశమయి అతనిలో ఆగ్రహం పుట్టి యుక్తాయుక్త విచక్షణను కోల్పోయాడు. ఒక స్థానంలోంచి మరొక స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు.

ఆ మహర్షిని ఎలా అవమానించాలా! అని తలంచాడు. సమీపములో చచ్చిపోయి పడివున్న పాము ఒకటి కనిపించింది. చచ్చిపోయిన పాము అయినా మెడలో వేసేసరికి చల్లగా తగిలి మహర్షికి తెలివి వస్తుంది. ఆయనను గేలిచేయవచ్చు అనుకున్నాడు. పరీక్షిత్తు లోపల వికృతాతివికృతమయిన ఆలోచనలు పెరిగిపోయి తన ధనుస్సు చివరి భాగంతో మృతసర్పమును పైకి ఎత్తాడు. ఒక ప్రభువు, ధర్మరాజు మనుమడు, అభిమన్యుడి కుమారుడయిన పరీక్షిత్తు ఒక చెయ్యరాని పనిని చేసాడు. ప్రపంచంలో పరమ భయంకరమయిన సన్నివేశము జరుగుతున్నది. ఆ మృత సర్పమును పైకి ఎత్తి శమీక మహర్షి మెడలో వేశాడు.

ఆయనకు స్పర్శ తెలియలేదు. తపస్వియై ఉన్న వానిలోనికి కలి వెళ్ళలేకపోయాడు. ఎందుచేతనంటే మహర్షి ఇంద్రియములు, మనస్సు ఈశ్వరుని పట్టి వున్నాయి. ఒక్క స్థానమునకు ఆశ్రయం ఇచ్చిన పరీక్షిత్తులోనికి కలి ప్రవేశించి మొత్తం నాశనం చేయగలిగాడు.

బాగుపడాలంటే శమీకమహర్షి పట్టుకున్న భగవంతుని పాదములు పట్టుకోవాలని భాగవతం చెపుతున్నది. శమీకుడు పట్టుకున్న ఈశ్వరుని పాదములు పట్టుకుంటే ఆ స్పర్శ ఉన్నంతకాలం కలి సమీపమునకు రాలేడు. ఇది భాగవతము చెప్తున్న తీర్పు. పరీక్షిత్తు తాను చేసిన పనికి సంతోషపడి వెనక్కి వెళ్ళిపోయి, అంతఃపురంలోకి వెళ్ళి కిరీటం తీసి ప్రక్కనపెట్టాడు. బంగారుకిరీటం ప్రక్కన పెట్టగానే అందులోంచి కలి బయటకు వెళ్ళిపోయాడు.

కిరీటం ప్రక్కన పెట్టగానే ఆయనకు అనుమానం వచ్చింది. ‘దాహం వేయడం ఏమిటి? – నేను ఆయన ఆశ్రమమునకు వెళ్ళడం ఏమిటి? – వెళ్ళిన వాడిని ఊరుకోకుండా చనిపోయిన పామును ఆయన మెడలో వేయడం ఏమిటి? – అయిపోయింది – నా రాజ్యం అయిపోయింది. నా ధనం అయిపోయింది – నా భోగం అయిపోయింది – నా పరిపాలన అయిపోయింది – నేను చెయ్యరాని దుష్కృతమును చేసాను – దీనికంతటికీ కారణం కలిపురుష ప్రవేశము – ఎంత తప్పు చేశానో' అని పశ్చాత్తాప పడ్డాడు. పరీక్షిత్తు సహజస్థితి అదికాదు. కలి పురుషుడి వలన అలా భ్రష్టుడయి పోయాడు.

పరీక్షిత్తు మహర్షి మెడలో చచ్చిపోయిన పామును వేయడం, సమీపములో ఉన్న మునికుమారులు చూశారు. వాళ్ళు పరుగెత్తుకుంటూ అక్కడికి సమీపములో కౌశికీనది ఒడ్డున ఆడుకుంటున్న శమీక మహర్షి కుమారుడయిన శృంగి వద్దకు వెళ్ళారు. ఆ పిల్లవాడు మహా తపస్వి. ఆ పిల్లలు ‘మీనాన్నగారు తపస్సు చేసుకుంటూ సమాధిలో ఉండగా ఒక రాజు వచ్చి ఏదో మాట్లాడాడు. మీ తండ్రి పలకలేదు. అపుడు ఆ రాజుకి కోపం వచ్చి చచ్చిపోయిన పామును ధనుస్సుతో ఎత్తి మీ నాన్నగారి మెడలోవేసి వెళ్ళిపోయాడు అని చెప్పారు.

ఈ మాటలు విన్న వెంటనే శృంగి ‘నాతండ్రి వంటి తపస్వి ఇక్కడ ఉండడం వలన రాజు క్షేమంగా రాజ్యమును పరిపాలించగలిగాడని వెంటనే శాపం ఇవ్వడానికి కౌశికీ నదీ జలములను చేతిలోకి తీసుకుని చేతిలో ధనుస్సు ఉన్నది కదా అని ఆ రాజు చెయ్యకూడని పనిని చేశాడు. అటువంటి రాజు ఎవరయినా ఉండవచ్చు గాక! ఈశ్వరుడు, శ్రీమహావిష్ణువు అడ్డుకున్నా వానిని నేటినుండి ఏడవనాటికి తక్షకుడనే మహాసర్పము కాటు వలన రాజు మరణించుగాక!’ అని శపించి నీళ్ళు విడిచిపెట్టి, తిరిగి ఆశ్రమమునకు వచ్చి, తండ్రి ముందు ఏడవడము ప్రారంభించాడు.

తండ్రికి బాహ్యస్మృతి వచ్చింది. ‘ఎందుకు ఏడుస్తున్నావని కుమారుని అడిగాడు. తండ్రీ! మీ కంఠమునందు మృత సర్పము ఉన్నది అన్నాడు. దానిని తీసి క్రింద పడవేశాడు శమీకుడు. ఎవరు వేశారని కుమారుని ప్రశ్నించాడు. నాకు తెలియదు. ఎవరో రాజు వేశాడట. నేటికి ఏడవనాటికి ఆ రాజు చచ్చిపోవాలని నేను ఆ రాజును శపించానని శృంగి జవాబిచ్చాడు. వెంటనే మహర్షి – నాయనా! ఎంతపని చేశావు? నీవు చేసిన దుష్కర్మ వలన మనకి పాపం సంప్రాప్తిస్తుంది. నీవు రాజు మరణించాలని కోరుకున్నావు’. కలిపురుషుడు ప్రవేశించిన మనస్సులు అలా ఉంటాయి. అపకారియందు కూడా ఔదార్యంతో ధర్మం మాట్లాడతాడు. అటువంటి పరిపాలకుడు ఎక్కడ వస్తాడు మనకు! సమాజము భ్రష్టు పట్టిపోతుంది. పరీక్షిత్తును కొట్టి సమాజమునందు ఇన్ని ప్రమాదములు తేవడానికే కలి ఇలా నీచేత శాపం ఇప్పించాడు. నీవు క్రోధమునకు వశుడవయిపోయావు. ఎంత పొరపాటు చేశావు!’ అన్నాడు.

ఈవార్త పరీక్షిత్తుకు తెలిసి ఇంకా నాటికి ఏడవరోజున శరీరం విడిచిపెట్టేస్తానని ప్రాయోపవేశం చేస్తానని గంగ ఒడ్డుకు వెళ్ళి, తూర్పుదిక్కుకు కొసలు ఉండేలా దర్భలు పరుచుకుని ప్రాయోపవేశం చేసి, ఈశ్వరుని యందు మనస్సును నిలబెట్టాడు. గంగ ఒడ్డుకు ఎందుకు వెళ్ళాడు అంటే ఎవరయినా గంగ దగ్గరకు వచ్చి ‘అమ్మా, గంగమ్మా’ అని పిలిస్తే గంగమ్మ పొంగిపోయి ఆ పిలిచిన వానిని ఎంతగానో అనుగ్రహిస్తుంది. గంగలో స్నానం చేయడం ద్వారా అతడు చేసిన తప్పులన్నిటినీ తీసివేసి మోక్షమును ప్రసాదించి పంపించివేస్తుంది. గంగ ఒడ్డున ప్రాయోపవేశం చేశాడు. ఎవరు యాగం చేస్తే దేవతలు అందరూ వచ్చి కూర్చున్నారో అటువంటి మహా పురుషుడు శాపగ్రస్తుడై ప్రాయోపవేశం చేశాడు. ఈ సన్నివేశమును చూడడానికి గౌతముడు, అగస్త్యుడు, విశ్వామిత్రుడు, వసిష్ఠుడు మొదలయిన ఋషులందరూ వచ్చారు. ఈ ఏడురోజులలో తాను ఏమిచేస్తే మోక్షం పొందుతాడో చెప్పవలసినదని పరీక్షిత్తు అందరినీ అడుగుతున్నాడు. ఇంత ధర్మము ఉన్నవాడు ఇంత అధర్మమయిన పని చేయడమా! కలికి కొద్ది అవకాశం ఇస్తే అంత ప్రమాదమును తెచ్చాడు. కాలమును అతిక్రమించడం ఎవరి తరం కాదు. ఇంతటి స్థితిలోకూడా ఈశ్వర పాదములు పట్టుకున్న వాడు మాత్రం చెక్కు చెదరడము లేదు. ఆ సమయములో అక్కడికి పదహారు సంవత్సరముల వయస్సు కల ఒకాయన వచ్చాడు. ఆయన మంచి యౌవనములో ఉన్నాడు. నల్లటి జుట్టు ముఖం మీద చిందరవందరగా పడిపోయి ఉంది. ఒక కౌపీనము పెట్టుకుని ఉన్నాడు. చుట్టూ చిన్నపిల్లలు అందరూ చేరారు. సూర్యుడు ఈ భూమండలం మీద నడుస్తున్నాడా అన్నట్లుగా ఒకరు పిలవకపోయినా ఆవుపాలు పితికే సమయం కంటే ఎక్కువసేపు ఒకచోట నిలబడని శుకుడు తనంత తాను నడిచి వచ్చి అక్కడ నిలబడ్డాడు. ఆయన తేజస్సు చూసి పొంగిపోయిన పరీక్షిత్తు ‘కృష్ణభగవానుని మా వంశము అంతా అర్చించినందుకు నేను వెళ్ళిపోతున్న సమయములో నాకు మార్గం చూపించడానికి గురువును పంపాడు కృష్ణ పరమాత్మ’ అని పొంగిపోయి అర్ఘ్యపాద్యములను ఇచ్చి శుకుడి కాళ్ళమీద పడితే, కదిలి వెళ్ళిపోవడం అలవాటున్న శుకుడు కూర్చున్నాడు.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

[14/10, 4:30 pm] K Sudhakar Adv Br: Srimadhandhra Bhagavatham -- 25 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu


శుకబ్రహ్మ రావడములో ఒక గొప్పతనం ఉన్నది. ఒక సమస్య ఏర్పడడం గొప్పతనం కాదు. కలియుగ ప్రవేశము జరిగితే దానివల్ల ప్రభావితుడయినవాడు పరీక్షిన్మహారాజు గారు ఒక్కడే కాదు – కలియుగంలో ఉన్న అందరూ కలిచేత బాధింపబడుతున్న వాళ్ళే . ఇప్పుడు కలి బాధనుండి తప్పుకోవడానికి మార్గం ఏదయినా ఉంటుందా? – ఇది చెప్పేవాడు ఎవరయినా ఉండాలి. కలి బాధలను పడుతున్న మనమీద కలి ప్రభావం ప్రసరించకుండా ఉండడము కోసమని మనం చేయవలసిన ప్రయత్నమునయినా చెప్పగలిగిన సమర్థుడు రావాలి. అటువంటి సమర్థుడయిన శుకుడు వచ్చాడు.

ఇక్కడ ఒక విషయమును పరిశీలించాలి. ఎవరికయినా మృత్యువు ఆసన్నమయిపోయిందని రెండు మూడు రోజులలో వెళ్ళిపోతారు’ అని చెపితే – ఆ చనిపోబోయే ఆయన దగ్గరకు ఎవరయినా వెళ్ళి ‘మీకు కొన్ని మంచి విషయములు చెపుదామని – మీకు భాగవతము చెపుదామని వచ్చామ’ ని అంటే – ఆ మంచి విషయమును వినడానికి అంగీకరించక ఇప్పుడు ఎందుకు అంటాడు. ఆ ఉన్న రెండురోజులు భార్యాబిడ్డలను చూసుకోవాలని అనిపిస్తుంది. ఇక్కడ పరీక్షిన్మహారాజు గారు ఒక గొప్ప విషయం చేశాడు. శుకమహర్షి వస్తే ఈయనను ఎవ్వరూ వేయని ప్రశ్న ఒకటి వేశాడు. పరీక్షిన్మహారాజు – ‘ఏడు రోజులలో నాకు మరణము ఖాయమన్న విషయము తెలిసిపోయింది. నేను పాముచేత కరవబడతానని శృంగి శపించాడు. శృంగి శపించాడని నేను ఖేదపడడము లేదు. నేను పరమధార్మికులయిన పాండవుల వంశములో జన్మించిన వాడినయి, తపస్సు చేసుకుంటున్న ఒక మహర్షి మెడలో మృతసర్పమును వేసి చేయరాని పని చేసానని బాధపడుతున్నాను. శృంగి నన్ను ఎలా శపించాడో అలాగే ఈ శరీరమును తీసుకువెళ్ళి ఆ పాముకి అప్పచెపుతాను. నేను నా మరణమును అంగీకరిస్తున్నాను. నాకు భవిష్యత్తులో మళ్ళీ జన్మ వచ్చినప్పుడు నా మనస్సు ఎల్లవేళలా శ్రీమహావిష్ణువునే స్మరిస్తూ ఉండాలి. ఎక్కడ స్వామివారి ఉత్సవమూర్తి కనపడినా, స్వామి దేవాలయం కనపడినా గభాలున శిరస్సువంచి నమస్కరించగలిగిన సంస్కారబలం నాకు కావాలి. ఆ స్వామి గురించి నాలుగు మాటలు చెప్పేవాడు దొరికితే చాలు పరుగెత్తుకుంటూ వెళ్ళి వాని మాటలు వినే జిజ్ఞాస నాకు కలుగు గాక ! నిరంతరము ఈశ్వరుని పాదసేవనము చేయగలిగిన కర్మేంద్రియములు నాకు కావాలి. నేను దానిని అర్థిస్తున్నాను. ఇది కలిగేటట్లుగా మీరందరు నన్ను అనుగ్రహించి ఆశీర్వచనం చేయవలసింద’ ని ప్రార్థించాడు.

పరీక్షిత్తు ఉత్తరజన్మ ఉత్కృష్టమయినది కావాలని ఆయన అడగలేదు. ఆయన – ఏ జన్మలో ఉన్నా, ఏ శరీరములో ఉన్నా కావలసినవి ఏమిటో వాటిని అడిగాడు. ‘హరిచింతారతియున్’ ‘హరి ప్రణుతి’ ‘భాషాకర్ణనాసక్తియున్’ ‘హరిపాదాంబుజసేవయుం’ ఈ నాలుగు నాకు కావాలని అడిగాడు. శుకబ్రహ్మ వచ్చి కూర్చుని ఉంటే శుకబ్రహ్మకు పాదప్రక్షాళనం చేసి ఆచమనీయము ఇచ్చి సాష్టాంగ నమస్కారం చేసి ఒకమాట చెప్పాడు. ‘నాకు ఒక్క కోరిక ఉన్నది. నేను మళ్ళా పుట్టవలసిన అవసరం లేని మోక్షమును పొందడానికి కల్పవృక్షములా మీరు వచ్చారు. మీరు ఒకచోట ఉండేవారు కాదు. అటువంటిది మీరు అనుకోకుండా వచ్చి నన్ను అనుగ్రహించారు. నాకు అటువంటి విషయము ఏది ఉన్నదో దానిని నాకు తెలియజేయవలసినది’ అని ప్రార్థించాడు.

భాగవతం - ద్వితీయస్కంధము

భాగవతములో శుకుడు రావడమే ఒక పవిత్ర ఘట్టం. శుకబ్రహ్మ వచ్చి పరీక్షిత్తు చెప్పిన మాటలను విన్నాడు. తనగురించి తాను ఏమీ చెప్పుకోలేదు. శుకుడు ఒక్కమాట చెప్పాడు. ‘పరీక్షిన్మహారాజా! నేనొక విషయం చెపుతాను జాగ్రత్తగా విను. పూర్వం ఖట్వాంగుడు అనే ఒకరాజు ఉండేవాడు. అతడు దేవతలకు యుద్ధములో సాయము చెయ్యాలని భూమిని విడిచిపెట్టి రథమును ఎక్కి స్వర్గలోకమునకు వెళ్ళి రాక్షసులతో యుద్ధం చేశాడు. చాలా దీర్ఘకాలము పోరు సాగింది. రాక్షసులు ఓడిపోయారు. దేవతలు అందరూ ఖట్వాంగుడిని అభినందించారు. ‘నీవు మాకోసమని పైలోకమునకు వచ్చి యుద్ధం చేశావు. నీకేమి వరం కావాలో కోరుకో’ అన్నారు. ఆయన ‘నాకేమీ వరం అక్కర్లేదు. నా ఆయుర్దాయం ఎంత మిగిలిందో చెప్పమని అడిగాడు. దేవతలు వాని ఆయుర్దాయం లెక్కచూసి ఇంకొక ఘడియ మాత్రమే ఉన్నదని చెప్పారు. తాను తరించిపోవడానికి ఆ ఒక్క ఘడియ ఆయుర్దాయం చాలునని ఖట్వాంగుడు భావించి వెంటనే తన రథం ఎక్కి గబగబా భూమండలమునకు వచ్చి అంతఃపురంలోకి వెళ్ళి ఈమాట చెప్పేసి, ధ్యానమగ్నుడై ఈశ్వరుడిని ధ్యానం చేస్తూ కూర్చుని శరీరమును విడిచి పెట్టేసి మోక్షమును పొందాడు. ఒక్క ఘడియ కాలం మాత్రమే ఆయుర్దాయం కలిగిన ఖట్వాంగుడే మోక్షమును పొందగలిగాడు. నీకు ఇంకా ఏడురోజుల సమయము ఉన్నది. నీకు తప్పక మోక్షం లభిస్తుంది’ అని చెప్పాడు.

ఇంత గొప్పగా ఇలా మాట్లాడిన వాడు గురువు. మరణించే వారందరికీ పరీక్షిత్తు ప్రతినిధి. నేను నేననుకున్నఈ శరీరమే కట్టెదుట అగ్నిహోత్రములో కాలి దోసెడు బూడిద అయిపోతుంది. ఈ అహంకారమును గుర్తించని కారణము చేత మరల హీనోపాధిలోకి వెళ్ళిపోవడము జరుగుతున్నది. ఈశ్వరుడి పాదములను పట్టుకో. అవి మాత్రమే నిన్ను రక్షిస్తాయి. వివేకము తెలుసుకొమ్మని చెప్పాడు. ఇక్కడ శుకుడు విరాడ్రూప వర్ణనమునంతా చేసి హరిలేని పదార్థము లేదు. ఋషులు, సముద్రములు, భూమి, పంచమహాభూతములు ఇవన్నీ కూడా ఈశ్వరుని అంగాంగములై ఉన్నాయి. ఎక్కడ చూసినా ఉన్నది ఈశ్వరుడు ఒక్కడే. ఈశ్వరుడు ఎందుకు కనపడడము లేదు? అదే మాయ. అది నామ రూపములయందు కలిగిన తాదాత్మ్యం తదధిష్టానమయిన బ్రహ్మమునందు కలుగదు. అలా కలగాలంటే మాయ తొలగిపోవాలి. ప్రపంచంలో ఉన్నది మాయ ఆ మాయని గురుముఖంగా తెలియగానే మాయ తొలగిపోతుంది అప్పటివరకు తొలగదు. దానికి ఈశ్వర కృప తోడయితే తొలగుతుంది. మాయ తొలగినపుడు లోపల వున్న ఆత్మ భాసిస్తుంది. మాయ తొలగడం అనేది అంత తేలికయిన విషయం కాదు.

ఈశ్వరుని కోసం నీవు ఎక్కడా తిరగనక్కరలేదు. విశ్వము హరి. హరి విశ్వము. అజ్ఞానము చేత లోకములో ఈశ్వరుడు, లోకము ఇంకా ఇంకా అలా కనపడుతున్నాయి. కానీ జ్ఞాననేత్రము చేత చూస్తే ఉన్నది ఒక్కటే. నీవు కానీ సక్రమముగా వినదలుచుకుంటే హరిమయము కాని పదార్థము ఈ ప్రపంచమునందు లేదు. ఇది తెలుసుకొని సమస్తము ఈశ్వరమయం జగత్ అని అంగీకరించి, అంతటా బ్రహ్మమును చూసి ఉన్నది బ్రహ్మమే అని నీవు అంగీకరించగలిగితే నీకు ఉత్తరక్షణమే మోక్షము’ అని బోధచేసి భక్తి నిలబడడానికి శుకుడు ఒక మాట చెప్పాడు. ‘నేను భక్తిగా ఉంటాను అంటే కుదరదు. ఈశ్వరునియందు పూనిక కలగాలి. ఇంట్లో కూర్చుని భగవంతుని మీద భక్తి రావాలని అనుకుంటే రాదు. ఈశ్వరునికి ముందు నమస్కారం చేయడం మొదలుపెడితే ఆయన నీకొక దారి చూపిస్తాడు. భగవంతుని కథలు వినడమనే స్థితికి నిన్ను తీసుకువెడతాడు. మనిషి కొన్ని కోట్ల కోట్ల జన్మల వరకు అసలు భాగవత కథవైపు వెళ్ళడు. వెళ్ళాడంటే అతని జీవితములో గొప్ప మార్పు ప్రారంభమయిందన్న మాట. భగవంతుని కథలను వినడము నీవు ప్రారంభిస్తే భక్తి కలుగుతుంది. ఆ భక్తితో అంతటా నిండియుండి చూస్తున్న వాడు, చేయిస్తున్న వాడు సర్వేశ్వరుడనే భావన నీకు కలిగిన నాడు, నీకు తెలియకుండా భక్తిలో ఒక విచిత్రం ఏర్పడుతుంది.

భాగవతం మనస్సుకు ఆలంబనం ఇస్తుంది. మనస్సును మారుస్తుంది. ఈశ్వరుని వైపు తిప్పుతుంది. దీనిని అందరూ పొందలేరు. ఈ అదృష్టం పొందాలి అంటే ఈశ్వరానుగ్రహం కూడా ఉండాలి. ఎవరిని ఈశ్వరుడు అనుగ్రహిస్తాడో వారు మాత్రమే భాగవతమును వినగలరు తప్ప అందరూ భాగవతమును వినలేరు. ‘నీవు భగవత్కథా శ్రవణముతో ప్రారంభము చెయ్యి. ఈ సమస్త జగత్తును సృష్టించిన వాడు ఆయనే’ అని చెప్పాడు.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

కామెంట్‌లు లేవు: