మన మహర్షులు- 26
భృగు మహర్షి
🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷
భృగు మహర్షి బ్రహ్మగారి హృదయంలోంచి పుట్టాడు.
భృగువు నవ ప్రజాపతులలో ఒకడు. సప్తర్షులలో ఒకడు.
ఈయన వంశంని భృగువంశమంటారు. ఈ వంశంలో పుట్టినవాళ్ళు చ్యవన, జమదగ్ని, శుక్ర, దధీచి మొదలైనవాళ్ళు. విష్ణుమూర్తి అవతారం పరశురాముడు కూడ ఈ వంశమే.
దక్షుని కుమార్తె ఖ్యాతి భృగుమహర్షి భార్య..
దక్షుని అల్లుడు గనుక, దక్షయజ్ఞం సమయంలో భృగువుకూడా ఉన్నాడని వాయుపురాణం చెప్తోంది.
భృగుమహర్షి మరొకభార్య పులోమని ఒక రాక్షసుడు ఎత్తుకు పోవాలని ఆమె ఎక్కడ వుందని అగ్నిదేవుణ్ణి అడిగాడు. అగ్ని భృగుమహర్షి ఆశ్రమంలో వున్న ఈమే పులోమ అని చెప్పాడు.
ఆ రాక్షసుడు పులోమని ఎత్తుకుపోవడానికి ప్రయత్నించాడు..
భృగుమహర్షి అగ్ని దేవుణ్ణి ఇదంతా జరగడానికి కారణం నువ్వే కాబట్టి ఏది కనిపిస్తే దాన్ని తింటూ సర్వభక్షకుడిగా వుండమని శపించాడు.
అగ్నిదేవుడు బ్రతిమాలుకుంటే సర్వభక్షకుడివైనా అందరితో గౌరవించబడ్డావన్నాడు.
సరస్వతీ నదీ తీరంలో మహర్షులందరూ కలిసి ఒక యాగం చేస్తుండగా వాళ్ళల్లో ఒకళ్ళకి ఒక సందేహం వచ్చేసింది. త్రిమూర్తు లలో ఎవరు గొప్పవారు అని భృగు మహర్షిని తేల్చి చెప్పమన్నారు.
భృగు మహర్షి బయల్దేరి ముందు బ్రహ్మలోకం వెళ్ళాడు. బ్రహ్మ నిండు సభలో ఉన్నాడు. భృగు మహర్షి వెళ్ళి మాట్లాడకుండ నిలబడ్డాడు. భృగు మహర్షి స్తోత్రం చెయ్యలేదని బ్రహ్మగారికి కోపం వచ్చింది. అక్కడ నుంచి బయలదేరి కైలాసానికి వెళ్ళాడు భృగుడు.
శివుడు పార్వతీ సమేతంగా విశ్రాంతి తీసుకుంటూ భృగు మహర్షిని చూసి లేచి వచ్చాడు కానీ భృగు మహర్షి మాట్లాడలేదు. శివుడు కోపంతో శూలంతీశాడు. పార్వతి అడ్డుపడింది.
వైకుంఠం వెళ్ళి విష్ణుమూర్తిని కలిసాడు భృగు మహర్షి. వెంటనే విష్ణుమూర్తి లేచివచ్చి నువ్వు రావడం చూడలేదు .. నువ్వు రావడం వల్ల నేను ధన్యుణ్ణయ్యాను అన్నాడు- విష్ణుమూర్తి.
విష్ణుమూర్తిని ఆనంద భాష్పాలతో అభిషేకం చేసి మళ్ళీ ఆశ్రమానికి వచ్చి తన కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి విష్ణుమూర్తే గొప్పవాడని చెప్పాడు భృగు మహర్షి.
భృగువు, భరద్వాజ మహర్షులు సమకాలికులని మహాభారతం పేర్కొంటోంది.
భృగుమహర్షి జ్యోతిష్య శాస్త్ర పితామహుడు. ఈయన జ్యోతిష్య శాస్త్ర గ్రంథం 'భృగుసంహిత ' లో సృష్టిలోని దాదాపు అన్ని రకాల జీవుల గురించి వ్రాయబడ్డాయి. అనగా దాదాపు 50 లక్షల ప్రాణుల జాతకాలు పొందుపర్చబడ్డాయి. ఒక పరిశీలన ప్రకారం ఇప్పుడు కేవలం 01 శాతం జీవులు మాత్రమే మిగిలి ఉన్నాయని అంటున్నారు.
🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹