19, ఫిబ్రవరి 2021, శుక్రవారం

సాధు దర్శనం..*

 *సాధు దర్శనం..*


"అయ్యా..ఏడుగురు సాధువులు మందిరం వద్దకు వచ్చారు..వాళ్లకు తెలుగు రాదు..హిందీ లో మాట్లాడుతున్నారు..మన సిబ్బంది లో ఎవరికీ హిందీ లో మాట్లాడటం రాదు..మీరొక్కసారి వాళ్ళతో మాట్లాడి..విషయం కనుక్కుని చెపితే..మేము అందుకనుగుణంగా నడుచుకుంటాము.." అని మా సిబ్బంది నాకు ఫోన్ చేసి అడిగారు..వాళ్ళ చేతికి ఫోన్ ఇచ్చి మాట్లాడించమని చెప్పాను..వాళ్ళతో మాట్లాడిన తరువాత..ఆ సాధువులు హరిద్వార్ వద్ద ఉంటారని..వాళ్ళు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లో వుండే క్షేత్రాల ను దర్శించుకుంటూ తిరుగుతున్నారని..గొలగమూడి వెంకయ్య స్వామి మందిరానికి వెళ్ళినప్పుడు..మొగిలిచెర్ల లో కూడా ఒక అవధూత మందిరం వున్నదని విని..దర్శించుకోవడానికి వచ్చారని అర్ధమైంది..ఆ సాధువులు ఆ రాత్రికి స్వామివారి మందిరం వద్ద ఉండడానికి ఏర్పాట్లు చేయమని మా సిబ్బందికి చెప్పాను..తమ ఆహారం తామే తయారు చేసుకుంటామని కూడా వాళ్ళు చెప్పారు..


ఆరోజు రాత్రి ఎనిమిది గంటలకు స్వామివారి మందిరం వద్ద ఉన్న భక్తులు భజన చేస్తూ వున్నారు..ఏడుగురు సాధువులూ ఆ భజనను ఆసక్తిగా విన్నారు..మరి కొద్దిసేపటికి వాళ్ళు కూడా హిందీ లో భజన చేయడం ప్రారంభించారు..అందరూ స్వామివారి ముఖ మంటపం లోనే పడుకున్నారు..తెల్లవారుజామున నాలుగు గంటలకే లేచి..స్నానాదికాలు ముగించుకొని మళ్లీ మంటపం లోకి వచ్చి ధ్యానం చేసుకోసాగారు..ఆరోజు ఉదయం ఏడు గంటలకు నేను స్వామివారి మందిరం వద్దకు వెళ్ళాను..ఆ సమయానికి సాధువులందరూ స్వామివారి హారతి కళ్లకద్దుకొని..తీర్ధం తీసుకుంటూ వున్నారు..నన్ను నేను పరిచయం చేసుకొన్నాను..


"నిన్న సాయంత్రం ఐదారు గంటల వేళ మేము ఇక్కడికి వచ్చాము..మీరు మీ సిబ్బందికి చెప్పిన తరువాత..వాళ్ళు మమ్మల్ని స్వామివారి సమాధి దర్శించుకునే అవకాశం కల్పించారు..స్వామివారి సమాధి వద్దకు వెళ్ళాము..మాకు తెలీకుండానే..మా వళ్ళంతా జలదరింపులు వచ్చాయి..ఇక్కడ అఖండమైన తపో శక్తి నిక్షిప్తమై ఉన్నది..కేవలం మా అదృష్టవశాత్తూ ఇటువంటి అవధూత మందిరాన్ని దర్శించుకున్నాము..తరువాత ఇక్కడ భజన లో పాల్గొని..మేము కూడా పారవశ్యం తో భజన చేసాము..ఆ మంటపం లోనే రాత్రి పడుకున్నాము..ఇప్పుడు సమయం తక్కువగా ఉన్నందున ఈరోజు మేము వెళ్లిపోతున్నాము..కానీ అతి త్వరలోనే ఇక్కడికి వచ్చి..కనీసం పదిహేను రోజులపాటు ధ్యానం చేసుకుంటూ గడుపుతాము..మాకొఱకు ఎటువంటి ప్రత్యేక ఏర్పాట్లూ వద్దు..మా ఆహారం మేమే వండుకుంటాము.." అని చెప్పి.."మా భాష అర్ధం కాకపోయినా..మీ సిబ్బంది బాగా సహకరించారు..మా సైగలు వాళ్ళు అర్ధం చేసుకున్నారు.."అని చెప్పారు..వాళ్ళు తెచ్చుకున్న కొద్దిపాటి సామాను సర్దుకొని..తిరిగి వెళ్లేముందు..స్వామివారి సమాధిని మరొక్కసారి దర్శించుకుంటామని అడిగారు..అలాగే వెళ్ళిరండి అన్నాను..స్వామివారి సమాధి వద్దకు వెళ్లి నమస్కారం చేసుకొని ఇవతలికి వచ్చి మూకుమ్మడిగా అందరూ "జై గురుదేవ్..జై దత్తాత్రేయ.." అని పెద్ద స్వరం తో పలికి..ఒక ఐదు నిమిషాలు కళ్ళుమూసుకుని నిలబడ్డారు..ఆ తరువాత ఇవతలికి వచ్చి..దత్తపాదములు ఉన్న చిన్న మందిరం వద్దకు వెళ్లి నమస్కారం చేసుకున్నారు..ఒక్కొక్కరుగా తమ శిరస్సులను దత్తపాదములకు ఆనించి.."జై దత్తాత్రేయా.." అని పలికి ఇవతలికి వచ్చేసారు..


"ఈ స్వామివారు మమ్మల్ని అనుగ్రహిస్తే..అతి త్వరలో మళ్లీ ఇక్కడికి వస్తాము.." అని చెప్పారు..మరో గంట తరువాత సాధువులు వెళ్లిపోయారు..


స్వామివారి సమాధిని ఎందరో సాధువులు, సాధకులు, సన్యాసులు దర్శించుకుంటూ వుంటారు..ఇక్కడ స్వామివారి తపశ్శక్తి నిక్షిప్తమై ఉన్నది అని వారందరూ తరచు చెపుతూ వుంటారు..ఆ తపోమహిమ ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా అనుభవానికి వస్తుంది..అలా అనుభూతి పొందిన వారు మరలా మరలా ఈ క్షేత్రానికి వచ్చి వెళుతుంటారు..అలాటి సాధు సన్యాసుల దర్శనం కూడా స్వామివారి వలన మాబోటి వారికి లభిస్తున్నది..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: