*యోగవాసిష్ఠ రత్నాకరము*
వైరాగ్య ప్రకరణము
ఒకటవ అధ్యాయము
రాఘవ వైరాగ్య వర్ణనము
1-125
నానన్దాయ మమోద్యానం న సుఖాయ మమ స్త్రియః న హర్షాయ మమార్థాశా శామ్యామి మనసా సహ.
ఉద్యానవనములు నాకు ఆనందమును గలుగజేయుట లేదు; స్త్రీలు నాకు సుఖమును గలుగజేయుట లేదు; ధనప్రాప్తి నాకు హర్ష మొసంగుటలేదు; నేను కేవలము మనస్సహితముగ శాంతి నొందగోరుచున్నాను.
1-126
కిం మే రాజ్యేన కిం భోగైః కిమర్థేన కిమీహితైః అహంకారవశాదేతత్స ఏవ గలితో మమ.
నాకు రాజ్యముచేగాని, భోగములచేగాని, ధనముచేగాని, చేష్టలచేగాని, యేమి ప్రయోజనము? ఇవి యన్నియు అహంకారము వలన నుద్భవించినవి. ఆ అహంకారమే నశించిపోయునది.
1-127
జన్మావలివరత్రాయామింద్రియగ్రన్థయో దృఢాః
యే బద్ధాస్తద్విమోక్షార్థం యతన్తే యే త ఉత్తమాః.
జన్మ సమూహమను చర్మరజ్జువునందు ఇంద్రియములను దృఢగ్రంథులచే (గట్టి ముడులచే) జీవులు బంధింపబడియున్నారు. అందు ఎవరు ఆ గ్రంథుల నుండి విడివడుటకు యత్నించుదురో, వారే ఉత్తములు.
1-128
అద్యచేత్స్యచ్ఛయా బుద్ధ్యా మునీన్ర్ధ న చికిత్స్యతే
భూయశ్చిత్త చికిత్సాయాస్త త్కిలావసరః కుతః.
ఓ మునీంద్రా! ఈ బాల్యకాలముననే నిర్మలబుద్ధిచే చిత్తము చికిత్స గావింపబడనిచో, మరల తక్కిన (యౌవనాది) అవస్థల యందు అట్టి
చిత్తచికిత్సకు అవకాశ మెక్కడ?!
1-129
విషం విషయవైషమ్యం న విషం విషముచ్యతే జన్మాన్తరఘ్నా విషయా ఏకదేహహరం విషమ్.
విషము విషము కాదు; (దృశ్య)విషయములే విషము; ఏలయనిన, విషము ఒక దేహమునే నశింపజేయును; విషయములో అజ్ఞాన వాసనాదుల ద్వారా జన్మాంతరము లందును మృత్యువును గలుగజేయును.
1-130
తద్భవామి యథా బ్రహ్మన్ పూర్వాపరవిదాం వర వీతశోక భయాయాసో జ్ఞస్తథోపదిశాశు మే.
పూర్వాపరముల నెఱుఁగువారిలో నుత్తముడగు మహాత్మా! తత్త్వజ్ఞానమునుఁబడసి, భయశోకాయాసముల నుండి విడివడి నేను ఎట్లుండగలనో ఆ పద్ధతిని శీఘ్రముగ నుపదేశింపుడు.
*యోగవాసిష్ఠ రత్నాకరము*
వైరాగ్య ప్రకరణము
ఒకటవ అధ్యాయము
రాఘవ వైరాగ్య వర్ణనము
1-137
మోహమాతంగమృదితా కలంకకలితాంతరా
పరం ప్రసాదమాయాతి శేముషీసరసీ కథమ్.
అజ్ఞానమగు ఏనుగు వలన కెలకబడి, మురికియైన బుద్ధియను సరోవరము ఏ విధముగ అత్యంత నిర్మలత్వమును బొందగలదు?
1-138
సంసార ఏవ నివహే జనో వ్యవహరన్నపి
న బంధం కథమాప్నోతి పద్మపత్రే పయో యథా.
మనుజుడు సంసార వ్యవహారములందు బాల్గొనుచున్నను తామరాకునందలి నీటిబొట్టువలె, నిర్లిప్తుడై యుండగల్గుట కుపాయమేమి?
1-139
అత్మవత్తృణవచ్చేదం సకలం కలయన్ జనః కథముత్తమతామేతి మనోమన్మథమస్పృశన్.
ఈ సమస్త జగత్తును అంతర్దృష్టిచే ఆత్మగను, బహిర్దృష్టిచే తృణతుల్యము (తుచ్ఛము) గను గాంచుచు, మనస్సుచే కామాది వృత్తులను స్పృశించక ఇవ్విధమున మనుజుడు ఉత్తమత్వము నెట్లు పొందగలడు?
1-140
కిమిహ స్యాదుపాదేయం కిం వా హేయమథేతరత్ కథం విశ్రాంతిమాయాతు చేతశ్చపలమద్రివత్.
ఈ ప్రపంచమున గ్రహింపదగిన దెద్ది? త్యజింపదగిన దెద్ది? చంచలమగు చిత్తమును పర్వతమువలె స్థిరమొనర్చు టెట్లు?
1-141
కేన పావనమంత్రేణ దుఃసంసృతివిషూచికా
శామ్యతీయ మనాయాసమాయాసశతకారిణీ.
లెక్కలేనన్ని బాధలను గలిగించు ఈ సంసారమను విషూచివ్యాధి ఏ పవిత్రమంత్రమువలన ఉపశమింపగలదు?
1-142
ప్రోచ్చవృక్షచలత్పత్రలమ్బామ్బు లవభఙ్గురే
ఆయుషీశానశీతాంశుకలామృదుని దేహకే.
ఆయువు ఎత్తైన చెట్టుయొక్క కదలుచున్న ఆకు చివర వ్రేలాడు నీటి బొట్టువలె క్షణభంగురమై యున్నది. మఱియు వర్షాకాలపు బాలచంద్రునివలె అయ్యది దేహము దుర్లక్ష్యమై యున్నది.
*యోగవాసిష్ఠ రత్నాకరము*
వైరాగ్య ప్రకరణము
ఒకటవ అధ్యాయము
రాఘవ వైరాగ్య వర్ణనము
1-131
క్రకచాగ్రవినిష్పేషం సోఢుం శక్నోమ్యుహం మునే సంసారవ్యవహారోత్థం నాశావిషయవైశసమ్.
ఓ మూనీశ్వరా! ఱంపపు పండ్లయొక్క ఘర్షణము నైనను సహించుటకు నేను శక్తుడను, కాని సంసారవ్యవహారము వలన కలుగు ఆశావిషయముల బాధను మాత్రము సహింపజాలను.
1-132
విద్యన్త ఏవేహ న తే మహాత్మన్
దురాధయో న క్షయమాప్నువన్తి
యే సఙ్గమేనోత్తమమానసానాం
నిశాతమాంసీవ నిశాకరేణ.
మహాత్మా! చంద్రుని ప్రకాశముచే అంధకారము క్షయించునట్లు, ఈ ప్రపంచమున ఉత్తమ మానసులగు మహాత్ముల సాంగత్యముచే క్షయింపని దుష్టమానసక వ్యథ లెవ్వియును లేవు.
1-133
ఆయుర్వాయువిఘట్టితాభ్రపటలీలమ్బామ్బువద్భఙ్గురం
భోగా మేఘవితానమధ్యవిలసత్సౌదామినీచంచలాః, లోలా యౌవనలాలనాజలరయ శ్చేత్యాకలయ్య ద్రుతం
ముద్రైవాద్య దృఢార్పితా నను మయా చిత్తే చిరం శాన్తయే.
ఆయువు వాయువుచే చలింపబడిన మేఘపటలమందు వ్రేలాడు జలబిందువుల వలె క్షణభంగురమైనది; భోగములు మేఘవిస్తార మధ్యమందు ప్రకాశించు మెఱుపువలే చంచలమైనవి; యౌవనకాలమందలి చిత్తవినోదము లన్నియు జలప్రవాహమువలే అస్థిరములైనవి ఈ విషయమును నేనీ బాల్యకాలముననే శీఘ్రముగ విచారించి చిత్తమున చిరకాల శాంతిప్రాప్తి కొరకై దృఢనిశ్చయము గావించుకొంటిని.
1-134
వికల్పేభ్యో లుఠన్త్యేతాశ్చాంతఃకరణవృత్తయః
శ్వభ్రేభ్య ఇవ సారఙ్గాస్తుచ్ఛాలంబవిడంబితాః.
గోతిని కప్పియున్న పచ్చికకై పరువిడి, లేళ్ళు అందు పడునట్లు తుచ్ఛ విషయములకై పరువిడు మనోవృత్తులు దుఃఖమున కూలిపోవుచున్నవి.
1-135
అతోఽ తుచ్ఛమనాయాస మనుపాధి గత భ్రమమ్ కిం తత్థ్సితిపదం సొధో యత్ర శోకో న విద్యతే.
ఓ సాధూ! తుచ్ఛమగు (దృశ్య) విషయము కానిదియు, జనన మరణాది ఆయాసరహితమును, దేహాద్యుపాధిశూన్యమును, భ్రమవర్జితమును, శోకరహితమునగు విశ్రాంతిస్థాన మేది?
1-136
కాం దృష్టిం సముపాశ్రిత్య భవన్తో వీతకల్మషాః
మహాన్తో విచరన్తీహ జీవన్ముక్తా మహాశయాః.
మిమ్ముబోలు జీవన్ముక్త మహాశయు లెట్టి దృష్టి నవలంబించి ఈ సంసార క్షేత్రమున సంచరించుచున్నారు?!
*యోగవాసిష్ఠ రత్నాకరము*
వైరాగ్య ప్రకరణము
ఒకటవ అధ్యాయము
రాఘవ వైరాగ్య వర్ణనము
1-143
క ఉపాయో గతిః కా వా కా చిన్తా కః సమాశ్రయః కేనేయమశుభోదర్కా న భవేజ్జీవితాటవీ.
ఇట్టి స్థితియందు నాకు ఉపాయ మేమి? మార్గ మెయ్యది? దేనిని చింతించుదును? దేనిని ఆశ్రయించుదును? ఏ యుపాయముచే ఈ జీవితారణ్యము శుభప్రదము కాగలదు?
1-144
రాగద్వేష మహారోగా భోగపూగా విభూతయః
కథం జన్తుం న బాధన్తే సంసారార్ణవచారిణమ్.
సంసార సముద్రమందు చరించు మనుజుడు ఏమి యొనర్చినచో రాగద్వేషాత్మకములగు మహారోగములు, భోగసర్ప సమూహములు ఆతనిని పీడింపకుండును?
1-145
మనో మననశాలిన్యాః సత్తాయా భువనత్రయే
క్షయో యుక్తిం వినా నాస్తి బ్రూత తామలముత్తమామ్.
దృశ్యవిషయములను మననము చేయునట్టి వాసనాసహితమగు మనస్సు యొక్క నాశము ఉత్తమయుక్తి లేనిచో ముల్లోకములందును ఎన్నడును సంభవింపనేరదు. కాబట్టి ఓ మునీశ్వరా! అట్టి యుక్తిని నాకు లెస్సగ నుపదేశింపుడు.
అత్తఱి వేదవేత్తలగు శ్రీ వసిష్ఠ విశ్వామిత్ర సహిత నారదాది మహర్షులు నతశిరస్కుఁడగు శ్రీరామచంద్రుని నుద్దేశించి యిట్లు పలికిరి.
కుమారుఁడగు శ్రీరాముఁడు వైరాగ్య పరిపూర్ణములును, ఉదారములును శుభప్రదములును నగు వాక్కుల నుడివినాడు.
ఋషయ ఊవాచః
1-146
ప్రజ్ఞాదీపశిఖా యస్య రామస్యేవ హృది స్థితా ప్రజ్వలత్యసమాలోక కారిణీ స పుమాన్స్మృతః
శ్రీరామచంద్రునకువలె అసాధారణమగు పదార్థతత్త్వ ప్రకాశమును గావించునట్టి ప్రజ్ఞయను దీపశిఖ యెవని హృదయమందుండునో ఆతడే పురుషుడు.
1-147
రక్త మాంసాస్థియన్త్రాణి బహూన్యతితరాణిచ పదార్ధానభికర్షన్తి నాస్తి తేషు సచేతనః.
ప్రజ్ఞాహీనులైన జనులు రక్త మాంస, అస్థిరూప శరీరములను యంత్రములే యగుదురు. దేహమం దాత్మబుద్ధి గలవారగుటచే వారు అనేకములగు శబ్దస్పర్శాది పదార్థముల ననుభవించుటయందే జీవితమును గడుపుచున్నారు. అట్టివారు అత్మజ్ఞానార్థము పురుషార్థము నొనర్పనివా రగుటచే అచేతనులే యగుదురు.
*యోగవాసిష్ఠ రత్నాకరము*
వైరాగ్య ప్రకరణము
ఒకటవ అధ్యాయము
రాఘవ వైరాగ్య వర్ణనము
1-148
జన్మ మృత్యు జరాదుఃఖమనుయాన్తి పునః పునః విమృశన్తి న సంసారం పశవః పరిమోహితాః.
ఎవరు ఈ సంసార తత్త్వమును గూర్చి విచారింపరో, వారు అజ్ఞానముచే మోహితులును, పశువులునై యున్నారు. మఱియు నట్టివారు మరల మరల జన్మమృత్యు జరాదుఃఖములందు తగుల్కొందురు.
కామాది శత్రువులను మర్ధించునట్టి ఈ శ్రీరామచంద్రునివంటి నిర్మల అభిప్రాయము గలవాడును, పూర్వాపర విచారమందు సమర్థుడు నగు మనుజుడు ఈ ప్రపంచమున ఎచటనో ఒకచోట ఎంతయో ప్రయాసచే కానుపించును.(బహుదుర్లభుడని భావము).
1-149
అమత్తమచమత్కారఫలాః సుభగమూర్తయః
భవ్యా హి విరలా లోకే సహకారద్రుమా ఇవ.
సర్వోత్కృష్ట మాధుర్యము (ఆనందము)తో గూడిన ఆత్మ సాక్షాత్కారమను ఫలములతో గూడినవారును, సౌభాగ్యమూర్తులగు ఉత్తములు ఈ లోకమున తియ్యనిమామిడి చెట్లవలె అరుదుగా నున్నారు.
1-150
సుభగాః సులభారోహాః ఫలపల్లవశాలినః
జాయన్తే తరవో దేశే న తు చన్దనపాదపాః.
సుందరములును, ఎక్కుటకు సులభములును, ఫలపల్లవాదులచే శోభితములు నగు వృక్షములు అన్నిచోట్లను పుట్టునుగాని చందన వృక్షములు మాత్రము కాదు.
1-151
వృక్షాః ప్రతివనం సన్తి నిత్యం సఫలవల్లవాః నత్వపూర్వచమత్కారో లవఙ్గః సులభః సదా.
ఫలపల్లవాది సహితములగు వృక్షములు అన్ని వనములందును గలవు కాని అపూర్వ చమత్కారము (విశేషము)తో గూడిన లవంగ వృక్షము మాత్రము సదా అన్నిచోట్లను సులభముగా లభించదు.
1-152
యతన్తే సారసంటప్రాప్తౌ యే యశోనిధయో ధియః
ధన్యా ధురి సతాం గణ్యాస్త ఏవ పురుషోత్తమాః.
సారమగు ఆత్మవస్తువు యొక్క సంప్రాప్తికై ప్రయత్నించువారును, సదా తత్త్వచింతాపరులును,
కీర్తినిలయులునగు మనుజులే ధన్యులు, వారే సత్పురుషులలో శ్రేష్ఠులు, మఱియు నట్టివారే పురుషోత్తములు.
1-153
న రామేణ సమోఽ స్తీ హ దృష్టో లోకేషు కశ్చన
వివేకవానుదారాత్మా న భావీ చేతి నో మతిః.
శ్రీరామచంద్రునితో సమానుడగు వివేకవంతుడును, ఉదారశీలుడును, ఈ లోకమం దెవడును పూర్వము గాంచబడి యుండలేదు. ఇపుడును అట్టివాడెవడును లేడు; ముందు నుండబోడని మా యభిప్రాయము.
శ్రీవాల్మీకీచే రచింపబడిన మోక్షోపాయమగు యోగవాసిష్ఠరత్నాకరమందు వైరాగ్యప్రకరణములో రాఘవవైరాగ్యవర్ణనమను మొదటి అధ్యాయము సమాప్తము.
*వైరాగ్య ప్రకరణం సమాప్తము.*
🙏