11, జూన్ 2023, ఆదివారం

సాదాకా మేలుకో -5 అన్నిటి యందు సమ భావము

 *సాధకా మేలుకో -5 అన్నిటి యందు సమ భావము*

  

గత కండికలో మనం సాధకుడు స్త్రీపురుష సమ భావం గురించి   తెలుసుకున్నాము. ఇప్పుడు సాధకుడు అంతకంటే ఉత్కృష్టమైన కఠినమైన సమభావన దేనిమీద ఎలా కలిగి ఉండాలో తెలుసుకుందాం. నిజానికి ఇంత కఠినంగా సాధనచేసే సాధకుడు ప్రస్తుత సమాజంలో ఉన్నారో లేరో కూడా మనం  ఊహించలేము. కానీ హిమాలయాల్లో, అరణ్యాలలో సాధనచేసే సత్పురుషులు ఇప్పటికి ఉండవచ్చు. ఆ దశకు చేరుకోవటం అంటే ఒకరకంగా మోక్ష స్థితిని చేరుకోవటంగా మనం భావించవచ్చు. 


ముందుగా సర్వ జీవులయందు సమభావం కలిగి ఉండటం.  సాధకుడు తన సాధన కొంత ముందుకు వెళ్లిన తరువాత తన  శరీరంలో,మానసిక స్థితిలో కొన్ని మార్పులు  తెలుయకుండానే వస్తాయి. ఒక యతీశ్వరుని సాధన శక్తి అతని కళ్లలోనే కనపడుతుంది.  శరీరం పూర్తిగా శుష్కించి వుండి కన్నులు తీవ్రంగా వాడిగా వుండి సామాన్యులు అతని కన్నులలోకి చూడటానికే భయపడేటట్లు ఉంటాయి. 


సాధకుడు సర్వ జీవులయందు సమభావంతో ఉండటంతో ప్రతిజీవి కూడా తన సహజ గుణాలని మరచి సాధకునికి సన్నిహితంగా  ఉంటుంది. ఒక పర్యాయం స్వామి వివేకానంద విదేశాలలో ఒక గ్రామంలో తన ఇద్దరు శిష్యులతో నడుచుకుంటూ వెళ్లుతున్నారట అప్పుడు ఒక యెద్దును సమీపంలో వున్న రైతు అదిలిస్తే అది  వేగంగా దూకుతూ  వారి వద్దకు వచ్చిందట.  ఒక శిష్యుడు దానిని చూసి పరిగెత్తి వెళ్ళాడట. స్వామి ప్రక్కన వున్నా శిష్యురాలు క్రింద  పడినాడట. కొంచం అయితే ఆ ఎద్దు పాదాలక్రింద ఆమె నలిగి పోయేది అట్టి  వివేకానంద స్వామి వేగంగా వెళ్లి ఆ ఎద్దు ముందు నిలపడినారట అంటే స్వామిని చూసిన ఆ ఎద్దు వెంటనే అక్కడే ఆగిపోయి స్వామి చెంత ప్రశాంతతతో  వున్నాడట. 


సాధకుడు చేసే సాధన వల్ల ప్రక్రృతి పూర్తిగా వసంగా ఉంటుంది. ఏ విధంగా సాధకుడు తన సాధనను వృద్ధి చేసుకొని భగవంతునికి దగ్గరగా వేళతాడో అదే విధంగా ప్రకృతి సదా సాధకుని వెన్నంటుకొని వుండి రక్షిస్తుంది. ఈ విషయం మనలో కొందరికి అనుభవమే కదా. 


ఒక గురువుగారు తన శిష్యగణంతో నాయనలారా జగమంతా బ్రహ్మ మాయం,  నేను బ్రహ్మను, నీవు బ్రహ్మవు,  కనిపించేది అంతా బ్రహ్మయే, బ్రహ్మ కానిది ఏది లేదని తెలిపారట.  పాఠం వంట పట్టిన ఒక శిష్యుడు వీధిలో వెళుతున్నాడు. మనస్సులో ఒకటే ఆలోచన గురువు గారు తెలిపిన సత్యాన్ని పరీక్షించుకోవటం ఎలా అలా అని ఆలోచిస్తూ ఉంటే అతనికి ఎదురుగా ఒక ఏనుగు కనపడింది.  వెంటనే అతని మదిలో ఒక ఆలోచన మెదిలింది.  ఇదే మంచి సమయం గురువుగారు బోధించిన విషయం నిర్ధారించుకోవటం కొరకు అని అనుకోని ఆ ఏనుగుకు ఎదురుగా వెళ్ళాడట.  అప్పుడు ఏనుగు మీద వున్న మావటి బాబు ప్రక్కకు వెళ్ళు ఏనుగు నిన్ను తొక్కుతుంది అని హెచ్చరించాడట.  కానీ అంతా బ్రహ్మ అని నమ్మే మన శిష్యుడు అతని మాటలను పెడచెవి పెట్టి ఏనుగుకు ఎదురుగా నిలబడి ఏనుగులో వున్న బ్రహ్మ తనను ఏమిచేయదు అని స్థిరంగా వున్నాడు.  కానీ ఒక్క క్షణంలో ఏనుగు తొండంతో వానిని పట్టుకొని ప్రక్కన వున్న పొదలలోకి విసిరింది. క్రింద పచ్చని చెట్లు ఉండటంతో పెద్ద దెబ్బలు తగలకుండా బతుకు జీవుడా అని పరిగెత్తి వెళ్లి గురువు గారిని చేరుకొని గురువు గారు మీరు చెప్పింది నిజం కాదు అని ఏనుగులో వున్న బ్రహ్మతో తనకు కలిగిన పరాభవాన్ని తెలియ చేసాడు.  దానికి గురువు గారు నాయనా నీవు బ్రహ్మను గురించి తెలుసుకున్నావు కానీ ఏనుగును తెలుసుకోలేదు కదా అయినా ఏనుగు మీద వున్నా బ్రహ్మ (మావటి) నిన్ను జాగ్రత్త పరిస్తే ఎందుకు వినలేదని మందలించాడట. 


ప్రతి సాధకుడు సదా జాగరూకుడై వుండి విచక్షణతో మెలగాలి. అందుకే సాధన సంపత్తితో ముందుగా మనం తెలుసుకునేది వివేకం కదా. 


విషయ వాంఛల మీద సమ భావము కలిగి ఉండటం ఇది ఇంకా కఠినమైనదిగా వేదాంతులు చెపుతారు. ఒక రాజ్యంలో రాజుగారు ఆయన సతీమణి అంటే రాణిగారు ఇద్దరు వైరాగ్యం చెంది తమ రాజ్యాన్ని వదలి వెళ్లాలని నిర్ణయించుకొని అరణ్య మార్గంలో నడుచుకుంటూ వెళుతున్నారట.  ముందుగా పతి నడుస్తుంటే అతనికి కొంచెం దూరంలో పత్ని నడుస్తూ వున్నది.  కొంత దూరం వెళ్లిన తరువాత పతిగారు నేలమీద కాలితో మట్టిని ఒక ప్రక్కకు నెట్టారట.  అది చూసి సతీమణి స్వామి మీరు ఎందుకు అక్కడ మట్టిని కాలితో తోశారు అని అడిగింది అప్పుడు ఆయన అక్కడ నేను ఒక బంగారు గొలుసును చూసాను నీవు దానిని చూసి ఎక్కడ మానసిక వికారానికి లోనవుతావు అని అలా చేశాను అని అన్నారు.  దానికి ఆ సాద్వీమణి ఇంకా మీకు మట్టికి బంగారానికి తేడా తెలుస్తున్నదా అని అన్నారట.  చూసారా ఆ మహాతల్లి వైరాగ్య చింతన.  అంతటి వైరాగ్యం కలగాలంటే మనం యెంత సాధన చేయాలో ఒక్కసారి ఆలోచించండి. 


సాధకుడు పైన పేర్కొన్నట్లు జగత్తులోని అన్నిటి మీద సమభావం కలిగి ఉంటే అప్పుడు మోక్షసాధన చేయటానికి అర్హత పొందగలడు.   


ఓం తత్సత్


ఓం శాంతి శాంతి శాంతిః


ఇట్లు భార్గవశర్మ

కామెంట్‌లు లేవు: