11, జూన్ 2023, ఆదివారం

దిలీపుడు

 *రఘు వంశం ...*


                 *దిలీపుడు!*

                 ➖➖➖✍️


*శ్రీరాముని తండ్రి దశరధుడు! మరి దశరధుని తండ్రి అజుడు!అయితే అజుని తండ్రి రఘు మహారాజు!*

*సరే, రఘు మహారాజు తండ్రి దిలీపుడు!*

*అంటే దిలీపుని మునిమనవడే శ్రీరాముడు!*

*సూర్య వంశానికే వెలుగు తెచ్చిన వాడు దిలీపుడు. ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకున్నా కడుపున పుట్టిన వారు లేరు. దానికీ కారణం ఉంది. ఇంద్రలోకం వెళ్ళి దేవేంద్రుణ్ని దర్శించి వస్తున్నాడు దిలీపుడు. ధర్మ సంరక్షణ కోసం భార్య సుదక్షిణాదేవి దగ్గరకు వెళ్ళే తొందరలో కానవచ్చిన కామధేనువును పూజించడం మరిచిపోయాడు. అవమానంగా భావించిన కామధేనువు శపించింది. సంతానం లేకుండా అయిపొమ్మని. ఐరావత ఘీంకారం వల్ల ఆ మాట దిలీపునికి వినిపించలేదు.* 


*ఇవేవీ తెలియక పిల్లలు లేరని దుఃఖంతో రాణీ సమేతుడై వశిష్ఠుని ఆశ్రయించాడు.*


*వసిష్ఠుడు దివ్య దృష్టితో శాపమూలం తెలుసుకున్నాడు. కాని కామధేనువు పాతాళ లోకంలో ఉండడంతో – తన ఆశ్రమంలో ఉన్న “నందినీ ధేనువు”ని సేవించమన్నాడు. అలా సేవిస్తే సంతానం కలుగుతుందనన్నాడు.*


*దిలీపుడు సర్వ సుఖాలూ వదిలి గోవుల కాపరి అయ్యాడు. నందినీ సేవకుడయ్యాడు. సతీసమేతంగా ఆ గోవుని కన్న బిడ్డకన్నా ఎక్కువ మమకారంతో చూసుకున్నారు.* 


*అలా ఇరవై రోజులు గడిచాయి. నందిని కూడా రాజ దంపతులను గమనిస్తూనే ఉంది.*


*ఒకరోజు నందిని కావాలని దారి తప్పింది. మేస్తూ మేస్తూ హిమవత్పర్వతమున్న ప్రాంతం చేరింది. ఒక గుహలోకి దూరింది. వెన్నంటే ఉన్న దిలీపుడు పరిసరాల ప్రకృతి అందాలకు మైమరచి పోయాడు. సింహపు గాండ్రింపు విని ఉలిక్కి పడ్డాడు. గృహలోకి చొరబడ్డాడు. అప్పటికే నందిని మీదకి సింహం ఉరికింది.*


* దిలీపుడు క్షణాల్లో బాణాన్ని అందుకోబోయి అలాగే నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. ఎందుకంటే సింహం మనిషిలా మాట్లాడడం మొదలు పెట్టింది.*


*ఆ పరిసర ప్రాంతాల రక్షకుడిగా శివకింకరుడిగా చెప్పుకుంది. అక్కడకు వచ్చిన జంతువులను చంపితినే అధికారం తనకుంది అంది. శివుని ఆజ్ఞగా చెప్పుకుంది సింహం. ఆవు ఆహారమై పోనుందని చెప్పి దిలీపుణ్ని వెళ్ళిపోమంది.*


*దిలీపుడు చేతులు జోడించి సింహరాజుని వేడుకున్నాడు. తనని ఆహారంగా స్వీకరించమన్నాడు. నందినీ గోవుని విడిచి పెట్టమన్నాడు. గురువు గారి ప్రాణంగా చెప్పాడు. తన ప్రాణం తీసుకోమన్నాడు. అపకీర్తిని అంట గట్టొద్దన్నాడు. ఈ శరీరం ఎప్పుడైనా నశించేదే అన్నాడు. తనకు తానే ఓ మాంసపు ముద్దలా ముడుచుకుపోయి సింహం నోటి ముందు నిలబడ్డాడు.*


*మూసినకళ్ళు తెరిచేసరికి సింహం మాయమయ్యింది. నందిని నవ్వింది. అంతా తను పెట్టిన పరీక్షంది. పరీక్షలో గెలిచావంది. సంతానం కలుగుతుంది అంది. అందుకు తన పాలను స్వీకరించమంది.*


*దిలీపుడు ఎంతో సంతోషపడినా పాలను స్వీకరించలేనన్నాడు. నీ పాలు గురువుగారి యాగ కార్యాలకు వినియోగించాక, నీ బిడ్డలకు ఇచ్చాక మిగిలితే… అందుకు గురు దేవులు వసిష్టమహర్షి అనుమతిస్తే… అన్నాడు.* 


*అతని ధర్మ నిరతికి వసిష్ఠుడు మెచ్చుకుని అనుమతినీ ఆశీర్వాదాన్నీ అందించాడు.*


*ఆ దంపతులు పాలను సేవించారు. ఆ తర్వాత పండంటి బిడ్డను కన్నారు. అతడే రఘు మహారాజు!*


*దిలీపుడు తిరుగులేని మహారాజుగా తొంభై తొమ్మిది అశ్వమేధయాగాలు చేసి, నూరో యాగం తలపెట్టేసరికి ఇంద్రుడు భయపడ్డాడు. అశ్వాన్ని మాయం చేసాడు.*


*అది తెలిసి కొడుకు రఘుని పంపుతాడు. నందిని తోడు వెళుతుంది. ఇంద్రుడు యుద్ధంలో వజ్రాయుధాన్ని విసురుతాడు. అది ఏ ప్రభావమూ చూపలేకపోతుంది.*


*అప్పుడు ఇంద్రుడు అశ్వమేధ యాగానికి అడ్డుచెప్పడు. అశ్వాన్నీ ఇవ్వడు. రఘు తిరిగి రాజ్యానికి వస్తాడు. రాజ్యం అప్పగించి అడవులకు వెళ్ళిపోయాడు!*

✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀

కామెంట్‌లు లేవు: