11, జూన్ 2023, ఆదివారం

వాసిష్ఠం లో

 సాక్షాత్తూ మహావిష్ణువు అవతారమైన శ్రీరాముడు ఒక రాక్షసుడైన రావణాసురుడిని చంపడానికి భార్యావియోగం అనుభవించి దుఃఖించాల్సిన పని ఏమిటి? దీని వెనుక ఏమైనా శాపాలు కానీ, మరేదైనా కారణం కానీ ఉందా?

దీనికి సమాధానం యోగ వాసిష్ఠం లో దొరుకుతుంది.

యోగ వాసిష్ఠం లో రాముడికి కలిగిన సందేహాలకు వసిష్ఠ మహర్షి చేసే తత్వబోధ ఉంటుంది. అందులో ఆయన మానవుడిగా ఎలా అవతరించాడు, భార్యా వియోగం ఎలా కలిగింది, అందుకు కారణమైన 4 శాపాలు వున్నాయి. వాటిల్లో 3 శాపాలు భార్యా వియోగానికి కారణమైనవి. అవి

1. ఒకసారి దేవదానవ సంగ్రామంలో విష్ణుమూర్తి దేవతల పక్షాన పోరాడుతూ, రాక్షసులను తరుముతుంటే వారు భృగు మహర్షి భార్యని శరణువేడారు. ఆమె వారిని తన ఇంట్లో దాచి, శ్రీహరి ఇంట్లోకి పోవడానికి వీల్లేదని అడ్డగించింది. ఇప్పుడైతే రాక్షసులంతా ఒకేచోట దొరికారు, ఇప్పుడు వీరిని వదిలేస్తే లోకాలకు చాల ఉపద్రవం తెస్తారు, ముని పత్ని అయివుండి, ఈమె శ్రీహరికి ఎదురు తిరుగుతుంది. పైగా పాపాత్ములకి సహాయం చేస్తుంది అని శ్రీహరి ఒక్కక్షణం ఆలోచించి, పాపం వస్తే రానిమ్మని, లోకక్షేమం కోసం అడ్డువచ్చిన భృగుపత్నిని సంహరించి, ఆ తర్వాత రాక్షసులని సంహరించాడు. భృగుమహర్షికి తన భార్య చేసింది తప్పని తెలుసు. అయినా దుఃఖంతో ఒళ్ళు తెలియక "శ్రీహరి! నీకు కూడా నాలాగే భార్యా వియోగం కలుగుగాక!" అని శపించాడు.

2. బృంద అనే గోలోక కన్య శ్రీహరి పొందు కావాలని వరం కోరింది. భర్త కావాలని కోరలేదు, అది విని రాధాదేవి ఆగ్రహించి రాక్షసకన్యవి కమ్మని శపించింది. ఆ జన్మలో కూడా ఆమె పేరు బృందయే. ఆ జన్మలో ఆమె జాలంధురుడు అనే రాక్షసుడికి భార్యయై మహాపతివ్రత గా ఉండేది. జాలంధురుడు మహా దుర్మార్గుడై లోకాలను పీడిస్తూ ఉండేవాడు. కానీ బృందయొక్క పాతివ్రత్య మహిమవల్ల వాడికి చావు లేకుండా పోయింది. అందువల్ల ఆమె పాతివ్రత్యాన్ని భంగపరచవలసిన అవసరం ఏర్పడింది. పూర్వ జన్మలో ధర్మభంగకరంగా ఆమె శ్రీహరి పొందు కోరింది కనుక, ఇలాంటి విషమ పరిస్థితుల్లో, రాబోయే ప్రమాదాలు తెలిసి కూడా, శ్రీహరి జాలంధరుడి రూపం ధరించి బృందాదేవిని మోహింపచేసాడు. పాతివ్రత్య భంగం జరగగానే జాలంధురుడు యుద్ధంలో మరణించాడు. అప్పుడు విష్ణుమూర్తి చేసిన మోసాన్ని గ్రహించిన బృందాదేవి దుఃఖావేశంలో, తాను పూర్వజన్మలో చేసిన తప్పుని గుర్తించలేక, తప్పంతా శ్రీహరిదే అని భావించి, "నాకు భర్త్రువియోగం కలిగినట్లే, నీకూ భార్యావియోగం కలుగుగాక!" అని శపించింది.

3. పూర్వం పయోష్ణీ నదీ తీరాన దేవదత్తుడు అనే గృహస్తు నరసింహోపాసన చేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆయన తపస్సుకి సంతోషించి నృసింహ స్వామి మంచి ఆర్భాటంగా సాక్షాత్కరించాడు. సామాన్యంగా దేవతల సాక్షాత్కారాలు ఎవరు తపస్సు చేసారో వారికి మాత్రమే కనిపిస్తాయి. కానీ ఈ నృసింహ సాక్షాత్కారం దేవదత్తుడి భార్యకి కూడా కనిపించింది. ఆమె ఆ భయంకర ఆకారాన్ని చూసి గుండె ఆగి మరణించింది. దేవదత్తుడు సాక్షాత్కార మహానందంలో మునిగి, కొంతసేపటికి ఇహలోకంలో వచ్చాడు. వస్తూనే ఈ సాక్షాత్కారం వల్ల తన భార్య మరణించింది అని గ్రహించి దుఃఖావేశంలో పడిపోయి, వివేకం కోల్పోయి "విష్ణుదేవా! నీకు కూడా నాకుమల్లే భార్యావియోగం సంభవించుగాక!" అని శపించాడు.

ఈ 3 శాపాలు శ్రీ మహావిష్ణువికి భార్యావియోగాన్ని కలిగించేవి. ఈ ముగ్గురి మీదా ప్రేమవల్ల, వారి శాపాలని మన్నించి, మానవుడై జన్మించి 3 సార్లు భార్యావియోగాన్ని అనుభవించాడు. రావణుడు సీతాపహరణం చేసినప్పుడు ఒకసారి, తర్వాత లోకుల అపవాదు వల్ల సీత గర్భవతిగా ఉండగా రెండోసారి, మళ్ళీ యజ్ఞశాలలో కలిసాక, ఈసారి సీతాదేవి భూప్రవేశం చేయడంతో శ్రీరాముడికి మూడోసారి భార్యావియోగం. ఇలా 3 శాపాలు చెల్లినాయి.

ప్రసన్న (USA)

కామెంట్‌లు లేవు: