11, జూన్ 2023, ఆదివారం

ఆంధ్ర రత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య

 ఆంధ్ర రత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి వర్ధంతి సందర్భంగా నివాళులతో


మీ కోట్ నా బూట్లను వెదకడానికి వెళ్లింది :


వేదాంతముల తోడ వెక్కిరింత తోడ -లెక్చర్లు ఇచ్చే ఆయన్ని చూస్తే ఎంతటి వాడికైనా గుండె గుబేలే ..ఆయన చాతుర్యం అటువంటిది.. పైగా ఇంగ్లాండు వెళ్ళి పెద్ద చదువులు చదివి వచ్చిన  వారాయే . సహజ కవి,  ఉన్నత మనస్కుడు కూడా .ఆయనే దుగ్గిరాల గోపాల కృష్ణయ్య -


హిందూత్వ సాధన కోసం,  హిందువుల హక్కుల కోసం పోరాడేందుకు ఒక సేవాసంస్థ, ఒక దండు ఉండాలని ఆశించిన ఆయన

రామదండు సంస్థాపన జేశారు. 


చీరాల పేరాల ఉద్యమం ద్వారా ఆంగ్లేయుల గుండెల్లో నిద్ర పోయిన తెలుగు ఘనుడు. ఆంధ్ర రత్న అని పేరుబడ్డవారు.


వారు దురదృష్టవశాత్తూ చిన్నతనములోనే మరణించారు గానీ లేకున్న అత్యున్నత స్థాయి పదవులు నిర్వహించ వలసినవారు. 


ఓసారి  రైలులో దుగ్గిరాల వారు ప్రయాణిస్తున్నారు. రాత్రి కావొచ్చింది . 


ఓ ఆంగ్లేయుడు అటూ ఇటూ తిరుగుతూ బూట్ల కిర్రు కిర్రు శబ్ధం చేస్తున్నాడు. ఎంతటికీ నిద్ర పట్టడం లేదు వీరికి. 


కాసేపటికి ఆ ఆంగ్లేయుడు నిద్ర పోయాడు. 


వెంటనే దుగ్గిరాల వారు లేచి తన బూట్లతో పెద్ద శబ్ధం చేస్తూ అటూ ఇటు నడవడం ఆరంబించారు. ఆయన గంభీర రూపం చూస్తే ఆంగ్లేయునికి భయం వేసింది .


కాసేపయ్యాక బూట్లు విప్పేసి బెర్త్ కింద పెట్టి నిద్ర పోయారు దుగ్గిరాల వారు.


అదను చూసి ఆ అంగ్లేయుడు ఆ బూట్లను ఎత్తి కింద పడేసాడు కిటికీ నుండి . 


మధ్యలో దుగ్గిరాల వారు మెలుకువ వచ్చి చూస్తే తన బెర్త్ కింద ఉన్న బూట్లు లేవు. సరేలే అని పడుకుని  ఉన్న ఆ ఆంగ్లేయుని ముఖం పరికించాడు . ఆ పని చేసింది అతడే అని తెలుసుకుని అక్కడ తగిలించి ఉన్న అతగాడి కోట్ తీసి కింద పడేసి తనపాటికి తను పుస్తకం ఏదో వ్రాసుకుంటూ కూర్చున్నారు.


కాసేపయ్యాక టికెట్ కలెక్టర్ వచ్చి అందరి టికెట్టులు అడుగుతున్నారు. ఆంగ్లేయుడు లేచి తన కోట్ కోసం చూస్తే కోటెక్కడ ఉంది. 


మీరు గానీ నా కోట్ చూసారా అని దుగ్గిరాల వారిని అడిగారు ఆ ఆంగ్లేయుడు . 


అది "ఇందాకే పోయిన నా బూట్లను  వెదకడానికి వెడుతుంటే చూసాను " అని సమాధానం ఇచ్చారు ఆంగ్లములో.


అవాక్కయిపోయిన ఆంగ్లేయుడు చేతిలో మళ్ళీ  టికెట్ కొనడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి.


మొత్తం ఆతను ఉద్యోగానికి వెళ్లవలసిన ప్రాంతపు చిరునామా అన్నీ అందులోనే ఉన్నాయిట .


వాడి మొహం లో నెత్తురు చుక్క లేక పోవడం చూసి టికెట్ కావాలా!!? , కొనమంటావా!!?? అని ఎదురడిగారట.

కామెంట్‌లు లేవు: