11, జూన్ 2023, ఆదివారం

కవితా నిర్వచనము

 


ఉత్తమ కవితా  నిర్వచనము 

                                       ------------------------------------------ 


సీ: పొసఁగ   ముత్తెపు సరుల్  పోహళించినలీలఁ


                దమలోన దొరయు   శబ్దములు   గూర్చి ,


       యర్ధంబు  వాచ్య   లక్ష్య  వ్యంగ్య   భేదంబు


                        లెఱిఁగి   నిర్దోషత   నెసఁగఁ  జేసి ,


      రస భావములకు  సంగతంబుగ   వైదర్భి


    మొదలైన  రీతు  లిమ్ముగ   నమర్చి ,


   రీతుల   కుచితంబులై   తనరారెడు


                     ప్రాణంబు   లింపుగాఁ   బాదుకొల్పి ,


గీ:  యమర, నుపమాదులును,  యమకాదులు  నగు

      నట్టి   యర్ధశబ్దాలంక్రియలు    ఘటించి ,

     కవితఁ  జెప్పంగ   నేర్చు  సత్కవివరునకు 

     వాంఛితార్ధంబు   లొసఁగని   వారుఁ  గలరె ?


కళాపూర్ణోదయము -అవతారిక- పింగళి సూరన;


                ఉత్తమ  కవితా  నిర్వచనాన్ని  పింగళి సూరన  చెప్పిన  విధానం  అపూర్వం! అంతకు ముందున్న కవులెవ్వరూ  ఇంత విశదంగా  కవిత్వ తత్వాన్ని  వింగడించిన వారు లేరు. ఈవిధానం  ఆనాటి  లాక్షణిక , ఆలంకారిక ,విధానాలకు ప్రతీకగా  నున్నదని చెప్పవచ్చును. 


                            శబ్దములు , అర్ధములు ,దోష ముల ప్రయోగింపకుంట , రస ,భావముల  యోజన ,వైదర్భి మొన్నగు రీతులను ,ఉపమాది యర్ధాలంకారములను ,యమకాది శబ్దాలంకారములను ,ప్రయోగిస్తూ  కవిత్వం చెపితే  మెచ్చి  ,కవికి యీప్సతార్ధముల నెవ్వరు యీయరు? అంటాడు సూరన.


                   శబ్దాలు ముత్యాల దండలా అమర్చుకోవాలట.ముత్యాలదండ ఒకేపరిమాణంగల  ముత్యాలతో  గుచ్చుతారు. అలాగే కవిత్వంలో  ఉపయోగించేమాటలు  ఒకదానికొకటి  పొంతన కలిగి ఉండాలని కవి యభిప్రాయం.


                         అర్ధము  వాచ్య  (అభిధ )  లక్షణ  ,వ్యంజన , అనిమూడురీతులు. అభిధ-వాచ్యార్ధ బోధకం; లక్షణ - కొంచెంలోతుగా ఆలోచిస్తే తట్టేఅర్ధం. వ్యంజన- ధ్వనించే యర్ధము; ఇలాఇది మూడువిధాలు. వీటిని యెక్కడ దేనిని ప్రయోగించాలో తెలిసియుండాలి.


                       దోష ము  లున్నాయి.ఇవి ప్రయోగిస్తే  ప్రధాన రసానికి  విఘాతం కలిగిస్తాయి. కాబట్టి  నిషేధం. అయితే అవి యేవో కవి ముందుగా తెలిసికోవాలి. తరువాత వాటిని వారించాలి.


                    రసము  భావము  మొన్నగు  వానిని  పోషించటానికి   వృత్తులను  తెలిసికోవాలి.శృంగారానికి -వైదర్భి; వీరమునకు- ఆరభటి ; శాంతాదులకు - సాత్వతి; ఉపయోగిస్తారు. వీటిని పోషించేవి రీతులు వాటి స్వరూపాన్ని తెలిసికొనియుండాలి.


                     ఇక  రచనలో అలంకార  ప్రయోగంలో  వైపుణ్యం ఉండాలి.  ఉపమాది  అర్ధాలంకారములు. యమకాది శబ్దాలంకారములను  ఉచిత మైనరీతిలో  ప్రయోగిస్తూ  కావ్యం వ్రాయాలి.


                        ఇదంతా కవిత్వ రచన  కుపకరించే  సామగ్రి !


           ఇదిగో  ఇన్నితిప్పలు పడితే  కవి  కావ్యం వ్రాయగలడు. అంత ప్రతిభావంతుని  మెచ్చని దెవ్వరు?


              సూరన  వ్యంగ్యముగా  తనప్రతిభ  నంతయు నిందు  వ్యక్తమొనరించుచు  


                           కళాపూర్ణోదయ  మెంత  ప్రతిభైక  సాధ్యమో  నిరూపించెను.


              ఇదీ  సాంప్రదాయ  కవిత్వరచనలో  గల కష్టాలు సుఖాలు. విన్నారుగదూ?


                                                     స్వస్తి!🙏🙏🙏🌷🌷🌷🌷👌👌👌👌

కామెంట్‌లు లేవు: