11, జూన్ 2023, ఆదివారం

గహనా కర్మణో గతిః

 గహనా కర్మణో గతిః 

కర్మ గతి తెలుసుకోవడం చాలా కష్టం.


కర్మ ముందా? జన్మ ముందా?


 కర్మని బట్టి జన్మ కాదు, కర్మని బట్టి పునర్జన్మ ఉంటుంది. కర్మ వల్ల జన్మ, జన్మ వల్ల కర్మ వస్తుంది. ఇది ఒక చక్రం. కానీ, మొదటి జన్మకి మునుపు, మనకి జన్మ లేనప్పుడు కర్మ కూడా ఉండదు కదా? అసలు మొదటి జన్మ ఏది, మనకి ఎలా వచ్చింది? అంతకుముందు మనం ఎవరం? అసలీ జన్మ చక్రంలో మనం ఎలా చిక్కుకున్నాం? వీటికి లాజికల్గా ఎవరు సమాధానం ఇవ్వలేకపోయారు. ఈ ప్రశ్నలని ఎంతమంది వేదాంతులని, మహాత్ములని, సత్పురుషులని అడిగినా కూడా ఇంతదాకా ఎవరూ సంతృప్తికరమైన జవాబు ఇవ్వలేదు. చెట్టు ముందా? విత్తు ముందా? ఎవరు చెప్పగలరు?


అమెరికాలో వివిధ మతసమ్మేళనం జరిగినప్పుడు దానికి హాజరైన *స్వామి వివేకానందుని* ఎవరో ఇదే ప్రశ్న వేస్తె దానికి ఆయన ఇచ్చిన జవాబు. "ఈ జనన మరణ చక్రంలో ఎప్పుడు చిక్కుకున్నామో, ఎందుకు చిక్కుకున్నామో, ఎలా చిక్కుకున్నామో మా హిందూ సనాతన ధర్మం చెప్పలేదు. కానీ ఈ చక్రంనుంచి ఎలా తప్పుకోవాలో మాత్రం చెప్పింది."


వేదాంతంలో ఇంకో ఉదాహరణ కూడా చెప్తారు. అసలు మనకి మొదటి జన్మ ఎలా వచ్చింది అంటే? నీ కల ఎలా ప్రారంభం అయిందో నువ్వు గుర్తించగలిగితే నీకు మొదటి జన్మ ఎలా వచ్చిందో కూడా తెలుస్తుంది అని.


సమాధానం దొరకని ప్రశ్నని పట్టుకుని వేలాడేకంటే ఈ చావుపుట్టుకలనించి తప్పుకోవడం తెలివైన పని. కృష్ణుడు కూడా అర్జునుడితో అదే చెప్తాడు. "ఈ కర్మలు, జన్మలు ఇదంతా పెద్ద సాలెగూడులాంటిది అర్జునా.. దీనిగురించి ఎంత ఆలోచించినా జవాబు కష్టం. అందుకే అవన్నీ వదిలేసి నన్ను శరణువేడు అని"


అందుకే భగవాన్ రమణమహర్షి అంటారు. భగవంతుడికి శరణాగతి చెందినవారి పూర్వ జన్మ కర్మలు వానికి అనుకూలంగానే ఉంటాయి కానీ, ప్రతికూలంగా వుండవు అని.


ఎలా ఈ కర్మ-జన్మ చక్రం నుంచి తప్పుకోవాలో భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు 18 అధ్యాయాల్లో చెప్పాడు.


చెట్టు ముందా? విత్తు ముందా? ఈ రెండిటికి ముందున్నవాడు ఒకడున్నాడు. ఆయనే పరమాత్మ. తన సంకల్పాన్ని బట్టి ఆయన చెట్టు నుంచి విత్తుని లేదా విత్తు నుంచి చెట్టుని సృష్టించగలడు.

---‐--------‐------------------‐-----------------

పై దానికి నా సమాధానము 👇


*కర్మ ముందా? జన్మ ముందా?* అంటే కర్మయే ముందు. కర్మ పుట్టిన తరువాతనే జన్మ వచ్చిందని నేను అంటాను. 


ఎలా? అంటే....


ఒకప్పుడు ఈ సృష్టికి పూర్వం భగవంతుడు/దేవుడు ఇలా అనేక పేర్లతో పిలువబడే దైవశక్తి ఉన్నది. ఒకానొక సమయంలో ఆ దైవశక్తి *నేను రెండుగా అగుగాక!* అని సంకల్పించెను. ఆ సంకల్పమాత్రమున ఏర్పడిన రెండవ భాగమే మొదటి జన్మ. ఆ సంకల్పమే కర్మ. అంతకు ముందు ఉన్న దైవశక్తి *ఆనాది*. అంటే దానికి పుట్టుక అనేది లేదు. భగవద్గీతలో కృష్ణపరమాత్మ *నేను... అనగా వాసుదేవుడనైన నేను.... భగవానుడనైన నేను.... "అనాది"* నాకు ముందు ఏదియూ లేదు. అంటాడు.ఆ అనాది ఎలా ఏర్పడినదనే దానికి ఎక్కడా సమాధానము లేదు. అని భగవానుడు చెప్పాడు భగవద్గీతలో. 


ఆతరువాత సృష్టికి మాత్రం నేను రెండుగా అగుగాక! అనే సంకల్ప క్రియయే కారణము. కనుక కర్మ ముందు. జన్మ తరువాత. 

మీ 

*~శ్రీశర్మద* 

+91 8333844664

కామెంట్‌లు లేవు: