*👆కొచ్చెర్లకోట జగదీశ్ గారి కథనం*
‘ఎప్పుడూ అక్కడేనా? ఒక్కసారి ఈ షాపుకెళ్లిచూడు నాన్నా! నీ గెటప్పే మారిపోతుంది. మొన్నటిదాకా జితేంద్రలా క్లీన్ షేవ్ చేసేసేవాడివి, ఇప్పుడెంచక్కా అజిత్ లా గెడ్డం కూడా పెంచుతున్నావు కదా? నిన్ననే మా నిహాల్ గాడు చేయించుకొచ్చాడు, చాలా స్టైలిష్ లుక్కొచ్చింది!’
మా రెండోవాడు అరగంటనుంచి బ్రతిమాలుతోంటే అతి బలవంతం మీద ఒప్పేసుకున్నాను. వీడు సినిమాలవీ బాగా క్షుణ్ణంగా చూస్తాడు. అందులో సంపత్‌రాజ్, జయప్రకాష్... ఇలా మిడిలేజ్డ్ ఫాదర్ వేషాలేసేవాళ్ల మేకప్పులవీ నామీద ప్రయోగిద్దామని తహతహలాడుతుంటాడు.
వాడి పోరు పడలేక ఎప్పుడూ చేసే ‘రవణ’కి మనసులోనే సారీ చెప్పేసి కొత్త సెలూన్లో అడుగెట్టాను.
రిసెప్షన్లో అమ్మాయి లిప్‌స్టిక్ పోతుందేమో అన్నట్టు నవ్వకుండా రెండు లిప్స్‌నీ స్టిక్ చేసేసుకుని ఇబ్బంది పడుతోంది. చాలా ఎక్కువగా వున్న లైట్ల కాంతిలో కింద ఫ్లోరింగంతా నున్నటి గుండులా మెరుస్తోంది.
సోఫాలో అరడజను మంది గెడ్డాలు పీక్కుంటూ, ఒకరితో ఒకరు మాటాడుకోకుండా మొబైళ్లు చూసుకుంటున్నారు. ఎదురుగా ఇంకొక సోఫాలో ఇద్దరు మధ్యవయసు మహిళలు కూడా ‘నా నెంబరెప్పుడొస్తుందీ?’ అని ఎదురు చూస్తున్నారు.
మొత్తానికి మన టర్నొచ్చింది. నన్ను ఒకతను కత్తెర చూపిస్తూ రమ్మని పిలిచాడు. కూర్చున్న మరుక్షణం ‘ఏజెంట్ గోపీ’ సినిమాలో దొంగల బాస్ కుర్చీ తిప్పినట్టు రెండు రౌండ్లు గిర్రున తిప్పి తనకెదురుగా తెచ్చుకున్నాడు. అతనే కాదు, అక్కడున్న అందరూ ఎర్రకాలరున్న నల్లచొక్కాలు తొడుక్కున్నారు.
నేను ఎందుకైనా మంచిదని ఎలా చెయ్యాలో, ఎంత కటింగ్ చెయ్యాలో చెబుదామని అతన్ని పలకరించాను.
‘మరీ ఎక్కువ కట్ చేసెయ్యద్దు. మీడియం. పాపిడి తెలీకపోతే అడగండి. నే తీసి చూపిస్తా. ఏదో ఉజ్జాయింపుగా తీసి కట్ చేసేశారో... అన్నీ లేచి నిలబడిపోతాయి!’ అని తుఫాను హెచ్చరికల్లా జారీ చేసిపడేశాను.
అతనేమీ మాటాడలేదు. ఓర్నీ, ఎంత గీర! అందుకే ఇలాంటి పెద్ద షాపులకి రావాలంటే చిరాకు నాకు. అదే మా రవణయితే ఈపాటికి రాత్రి వాడికొచ్చిన కల నుంచి ఎన్నికల దాకా అన్ని విషయాలూ చెప్పేసుండేవాడు.
వీళ్లు ఈ షాప్ ఓపెనింగ్ చేసేముందు పేపర్లట్టుకుని మా అపార్ట్‌మెంట్లో అందరిళ్లకీ వచ్చారు... తప్పకుండా రమ్మనమని! అంతేలే, అందితే జుట్టు, అందకముందు కాళ్లూ!
ఇంతలో అతను కొంత జుట్టు గుప్పిళ్లతో పట్టుకుని అద్దంలోకి చూపించి ‘ఇత్నా కమ్ కర్దూ?’ అన్నాడు.
ఒకసారిలాగే, అనకాపల్లి లక్ష్మీ టాకీసులో ‘కంచుకాగడా’ సినిమాకి వెళ్లాం. చైనా ఫైటర్స్ కుంగ్‌ఫూ చేస్తూ శత్రువుల బారినుంచి మహరాజుని రక్షించడానికి తాపత్రయ పడుతున్నారు. అది చాలా పెద్ద ఫైట్. ఎంతసేపటికీ కృష్ణ రాడు.
‘ఇప్పుడు దిగుతాడు చూడు, అందర్నీ చితగ్గొట్టేస్తాడు! నీకు ఈలెయ్యడం వచ్చా? నాకు రాదు. మా అన్నయ్య బా వేస్తాడు!’ అంటూ మా సతీష్ గాడితో హుషారుగా చెబుతున్నాను. ఫైటంతా అయిపోయింది.
అయినా కృష్ణ రాలా!
నాకెందుకో అనుమానమొచ్చి నా పక్కనతన్ని అడిగాను.... ‘అరగంటయిపోయింది, కృష్ణ కనబడ్డేంట’ని..
అతను నావైపు రెండు క్షణాల పాటు చూసి ‘షావొలిన్ టెంపుల్లో కృష్ణెందుకుంటాడు?’ అన్నాడు.
కంచుకాగడా ముందురోజే తీసేశాట్ట! మనకా విషయం తెలీక లోపల దూరిపోయాం.
ఇప్పుడు నా పరిస్థితి అచ్చం అలానే వుంది. నేనంతసేపు చెప్పినా అసలేం మాటాడకపోతే గీరనుకున్నాను. అతను హిందీవాడు!
గ్రహాంతరవాసులకి మనిష్టం వచ్చినట్టు సిగ్నల్స్ పంపించేసి రిప్లై కోసం ఎదురుచూస్తే ఎలా?
‘ఓ, ఆప్ హిందీనా? కహా సే ఆయా?’ అన్నాను... కానీ మనసులో అనుమానం పీకుతోంది.
‘ఆయా’ అనొచ్చా? హిందీలో కూడా ఆయా అంటే మంత్రసానేనా ఏవిఁటి కొంపదీసి??
కాదా?
కానీ అతనికి నా బాధ అర్ధమైంది. పైగా అతను ఆ చెవినించి ఈ చెవిదాకా నవ్వుతూ ‘మై లక్నావ్ సే! వహా సే ట్రాన్స్‌ఫర్ కర్ దియా యహా సాప్ ఖోల్నేకే బాద్!’ అన్నాడు నా మెడని నలభయ్యైదు డిగ్రీలు వెనక్కి వంచుకుని.
అతను ఇందాకట్నుంచి ఏదేదో మాటాడేస్తూ నా తలకాయని అజంతా హొటల్లో ఇడ్లీపప్పు రుబ్బే పైడిరాజు పొత్రాన్ని తిప్పినట్టు చాలా రౌండ్లు తిప్పాడు. దాంతో వారం క్రితం ఆ ఎడంవైపు మెలికడిన మెడనరం కాస్తా సెట్టైపోయింది. ఇంటికెళ్లగానే న్యూరాలజిస్టుకి ఫోన్ చేసి చెప్పాలి తగ్గిపోయిందని! 😝
సరే, ఆ లక్నోవాలా చెప్పిందంతా విన్నాక నాకర్ధమైంది ఇది:
భార్యాపిల్లల్ని లక్నోలో వదిలేసి ఇంతదూరం వచ్చి పని చెయ్యడం అతనికిష్టం లేదు. అంత ఇష్టంలేకపోతే ఉద్యోగం మానెయ్యమన్నార్ట. పాపం, బాధనిపించింది. రెండు నెలలకోసారి లక్నో వెళ్తున్నానని చెప్పాడు. షాపులో కటింగులు తక్కువైతే శాలరీ కటింగులు ఎక్కువవుతాయిట! అదో విషాదం!
ఓనర్ వైపు కోపంగా చూస్తూ గుసగుసగా నా చెవిలో కత్తెర సౌండుతో కలిపి చెప్పేశాడు ఈ విషయాలన్నీ. నా గొంతు గద్గదమైంది కానీ దాన్ని హిందీలో ఎలా వ్యక్తపరచాలో తెలీక నోరుమూసుక్కూచున్నాను.
కటింగవ్వగానే నన్ను కిందకి దింపి రెక్కపుచ్చుకుని నడిపిస్తూ లోపలికి తీసుకెళ్తున్నాడు.
‘ఎక్కడికీ?’ అన్నాను భయంగా!
మంగళ స్నానాలకిట!
‘హెడ్‌బాత్ చెయ్యరా? చిన్నపిల్లాడిలా పేచీ పెడితే ఎలా? మాటాడకండా అలా పడుకోండి!’ అంటూ ఒక సన్నటి బెడ్ మీద పడుకోబెట్టాడు. తలని మాత్రం అదేదో వధ్యశిలలా వున్న దాంట్లో పెట్టాడు.
‘కొంపదీసి వీళ్లు నన్నెవరికీ బలిచ్చెయ్యరు కదా? వచ్చేనెల రెండు పెళ్లిళ్లకి కూడా వెళ్లాలి? ఇంతలో ఇలా?’ అనుకుంటూ కళ్లు తెరిచి చూశాను. పైన కుళాయొకటి కనబడింది. ఓహో, అదా విషయం, ఇప్పుడు నాకిక్కడ తలంటుతారన్నమాట!
అతగాడు అరచేతిలో అంత ‘లోరియల్’ షాంపూ తీసుకుని ఎంతో మృదువుగా, లలితంగా రాస్తూ పావుగంటపాటు రుద్దాడు. వేణ్ణీళ్లతో కడిగేసి, డ్రైచేసేసి మళ్లీ రెక్కపుచ్చుకుని నడిపించి, తీసుకెళ్లి కుర్చీలో కుదేశాడు.
అసలలా రెక్కెందుకు పట్టుకుంటున్నాడో నాకర్ధం కాలేదు. తీరా చుట్టూచూస్తే అక్కడందర్నీ అలాగే పెడరెక్కలు విరిచికట్టే నడిపించి తీసుకెళ్తున్నారు. ఇతనింకా నయం. అది వాళ్ల మర్యాదన్నమాట!
కూర్చున్న పిమ్మట క్యాటలాగ్ ఒకటి నాముందు పడేశాడు. ‘ఇందులో మీకేం కావాలో మీరే ఎంపిక చేసుకోండం’టూ! అవన్నీ రకరకాల హెయిర్ డైలు. నానారకాల కంపెనీలవి.
బ్లాక్, బ్రౌన్, పింక్, బ్లూ... ఇలా ఇంద్రధనుస్సులో వున్నన్ని రంగులూ వున్నాయి పైపెచ్చు.
ఆ రంగురంగుల జుత్తులవీ ఊహించుకోగానే అపాచె ఇండియన్, రెమో ఫెర్నాండెజ్... వీళ్లంతా గుర్తొచ్చారొక్కసారిగా!
నేనేదన్నా బలహీన క్షణంలో ఏ పింకో, గ్రీనో చూపించి కమిటైపోతే నా గతేంకాను?
అసలే మా వీధి మొదట్లో ఆ మిథునం డిపార్ట్‌మెంటల్ స్టోర్ దగ్గర మచ్చల కుక్క నన్నెప్పుడు కరుద్దామా అని చాలాకాలంగా ఎదురుచూస్తోంది. పాపం, ఒకప్పుడు బాగా బతికిన కుక్కల కుటుంబమేనుట. ఈమధ్యే అది పిచ్చిగా అరుస్తోందని దాని ఓనరు రోడ్డుమీద వదిలిపెట్టేశాట్ట. నేనేమో దానికి దొరక్కుండా ఎప్పుడు చూసినా కార్లోనే తిరుగుతానాయె!
ఇప్పుడు గనక దాని ముందునించి గోధుంరంగు జుత్తేసుకుని, పిక్కల పైదాకా చుక్కల నిక్కరేసుకుని నడిచానంటే... నాసామిరంగా, నాచేత దిక్కులు ‘పిక్క’టిల్లించేస్తుంది.
ఇక ఇంటికెళ్లిన తరవాత మా ఆవిడెలాగూ గుర్తుపట్టదు.
‘వినాయకచవితి చందాలకి వేళాపాళా లేదా? ఆయన్లేరు. వచ్చేయేడు రండి!’ అని అన్నా అనేస్తుంది.
ఇవన్నీ కళ్లముందు రంగురంగుల్లో కనబడుతోంటే ఒక్క ఉదుట్న ఆ రంగుల చార్టు మూసేసి ‘గార్నియర్ బ్లాకేస్కో!’ అన్నాను. అతను అంతటితో సంతృప్తి చెందక మళ్లీ అందులో ఏవో నెంబర్లడిగాడు. నోటికొచ్చిన నెంబరేదో చెప్పేశాను. మొత్తానికి శాంతించాడతను. ఇలా ఒకపక్క బ్రష్ తో నా తలమీద రాశాడోలేదో...
అప్పుడు జరిగిందది... నేనేదయితే జరగకూడదని కోరుకుంటూ ముందుగా ఇంటిదగ్గర బయల్దేరే ముందు దేవుడికి దణ్ణం పెట్టుకుని బయల్దేరానో అదే జరిగింది.
‘రెండు ఎమర్జెన్సీ సీజర్లున్నాయి. నించున్న ఫళాన వచ్చెయ్యండం’టూ నా అభిమాన నర్సింగ్‌హోం నుంచి ఫోన్!
అతనితో చెప్పి, అనుమతి తీసుకుని బయల్దేరదామని అనుకుంటూ ఇలా తిరిగానో లేదో.. అక్కడ ఇంకొక కుర్రాడు కనబడ్డాడు.
ఇతనూ హిందీనే! మెళ్లో నిగనిగ మెరిసే నల్లటి ఏప్రానేసుకుని రంగుని చాకచక్యంగా కలుపుతూ ఏదో పెద్ద సైంటిస్టులా వున్నాడు. వీళ్లిలా మారిపోతూ వుంటారన్నమాట..... పెళ్లి వంటల్లో పప్పొండేవాడొకడూ, అప్పడాలు వేయించేవాడొకడూ అన్నట్టు!
నాకు నోటమాట రాలా! అయినా ధైర్యం కొనితెచ్చుకుని ‘హమే జానా హై, ఎమార్జెన్సీ!’ అన్నాను. ఎమా...తరవాత కావాలనే సాగదీశాను హిందీవాళ్లకి అలా అంటేనే అర్ధమవుతుందని.
అతను కుదరదన్నాడు.
ఈ రంగంతా బూడిదలో పోసిన పన్నీరవుతుందన్నాడు.
మా ఓనర్ సంగతి మీకు తెలీదన్నాడు.
‘ఒకసారి టేబులెక్కాక ఆపరేషన్ పూర్తవ్వకుండా మధ్యలో దిగి వెళిపోతానంటే మీరూరుకుంటారా?’ అనే లాజిక్ తో లాగిపెట్టి నన్ను బలవంతంగా కూర్చోబెట్టేశాడు.
నేను సర్జనమ్మకి ఫోన్ చేసి ‘ఒక గంటలో రావచ్చా పోనీ?’ అన్నాను.
అస్సలు కుదరదంది.
‘ఈలోగా బేబీలకేమన్నా అయితే నేనే మొహం పెట్టుకు కనబడాలి వాళ్లకి?’ అంది.
ఇప్పుడు ‘ఏ మొహం పెట్టుకుని కేసులకెళ్లాలా’ అని నేనాలోచిస్తున్నాను.
సరే, ఏదయితే అదయ్యిందని ‘నేను రాలేను, వేరే ఎవర్నైనా పిలిచి చేసెయ్య’మని చెప్పేసి మనసులో ఏడ్చుకుంటూ కూర్చున్నాను.
అతను రెట్టింపు ఉత్సాహంతో పని పూర్తిచేసి, మళ్లీ నా రెక్కపట్టి కిందకి దింపి, వధ్యశిల దగ్గరకి పదమన్నాడు.
ముచ్చటగా మరొక్కసారి తలబొబ్బ పోచేచుకుంటే, జుత్తంతా మెత్తగా పన్నితో దువ్వేచి, బంగారుకొందలా చేచేచి పంపించేత్తాట్ట!
నాకిక తిక్కరేగింది. ‘ఏవిఁటర్రా సాయంత్రం పూటా ఈ తలస్నానాలూ.. అశుభం కూడానూ! ఆపండ్రా మీ మొహాలీడ్చా!’ అని మనసులోనే మనసారా తిట్టేసుకుని, వెళ్లి పడుకుని, లోరియల్ షాంపూతో మళ్లీ తలంటించుకుని బయటపడ్డాను.
కౌంటర్ దగ్గరకి రాగానే ఈసారి ఆ లిప్‌స్టిక్ పిల్ల ఓ నవ్వు నవ్వింది. నా గుండెల్లో వీణ మ్రోగింది. కానీ అది రుద్రవీణ!
ఆ పక్కనే ఉన్న ప్రింటర్ మూడు నిమిషాలపాటు కిర్ కిర్ కిర్...కిర్ కిర్ కిర్ కిరా కిర్...అంటూ చేస్తున్న చప్పుడు విని నా మనసు కీడుని శంకించింది.
‘వీళ్లు నా పుట్టుజుత్తుల దగ్గర్నుంచి ఇప్పటివరకూ అయిందానికంటే ఎక్కువ డబ్బే కట్టించే ప్రయత్నంలో ఉన్నట్టున్నారు. చచ్చినా కట్టకూడదు.’ అనుకుంటూండగా కౌంటర్లో పిల్ల ద్రౌపది చీరంత పొడవున్న బిల్లొకటి చేతిలో పెట్టింది.
పదిహేనొందల యాభై! అందులో వాళ్లు చేసిన ప్రతీ చప్పుళ్లకి, కడుగుళ్లకి, కరెంటు మోటర్లకి, జుత్తుని తడిచేసిందానికి, మళ్లీ ‘పొడి’చేసిందానికి, రంగులకి, హంగులకి, నా బలుపుకి, చేసినవాడి అలుపుకి, వాళ్లు నన్ను పిలిచిన ప్రేమ పిలుపుకి... మొత్తం వివరంగా రాశారు.
ఇది టిప్ ఆఫ్ ఐస్‌బర్గ్. అసలైంది ఇందాకటి రెండు ఎమర్జెన్సీ కేసులు. అవొక నాలుగువేలు.
వెరసి నాకైన ‘క్షవరం’ అయిదువేల అయిదొందల యాభై రూపాయలు!
ఆ ఫ్రస్ట్రేషన్లో నేనే వెళ్లి ఆ కుక్కనెక్కడ కరిచేస్తానో అని భయమేసి, ఆరోడ్డున కాకుండా వెనక రోడ్డమ్మట ఇల్లు చేరాను.
......జగదీశ్ కొచ్చెర్లకోట